9, జూన్ 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (179) – భండారు శ్రీనివాసరావు

 

కలల లోకంలో కాసేపు
“పాడు ఉద్యోగం ఎన్నాళ్ళు చేస్తాం” అని ఈసురోమనే వాళ్ళు కూడా పదవీ విరమణ ఘడియ దగ్గర పడేటప్పుడు, ‘సర్వీసు పొడిగింపు’ కోసం నానా తంటాలు పడడం కద్దు. ఏడుపదుల వయస్సు వచ్చేవరకూ, ‘ఏమి జీవితమూ దుర్భరమూ ‘ అని తత్వాలు పాడుకున్నవాళ్ళు, తరవాత్తరవాత, తత్వం మార్చుకుని, “కొద్దిగా మనుషుల్ని ఆనవాలు పట్టే చూపు దేవుడు ఇస్తే బాగుండు” అనుకుంటూ బతుకు మీద మళ్ళీ తీపి పెంచుకునేవాళ్ళు సయితం కనబడుతుంటారు.
సియాటిల్ లోని బెల్ వ్యూ లో మా మనుమరాళ్ళు చదువుకున్న ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల చూసిన తరవాత నాకూ అలాటి అభిలాషే ఒకటి కలిగింది.
‘మరుసటి జన్మలో ఇలాంటి స్కూల్లో చదువుకుంటే యెంత బాగుంటుందో కదా!’ అన్నదే ఆ కోరిక. అలాటి స్కూల్లో చదువుకున్న మా మనుమరాళ్ళని చూసి కాస్తంత అసూయ పడ్డానేమో అని కూడా అనుమానం.
మన దేశంలో కూడా ఈ మాదిరి స్కూళ్ళు లేకపోలేదు. కానీ అవి పెట్టి పుట్టిన వాళ్ళకే పరిమితం. కూలీ నాలీ చేసుకుంటూ కలో గంజో తాగి పిల్లలను మంచి స్కూళ్ళల్లో చదివించే పేదలు కూడా మన దగ్గరవున్నారు. కానీ, ఇంగ్లీష్ మీడియం కాన్వెంటు స్కూళ్ళ పేరుతొ’ పల్లెటూళ్ళల్లో సయితం కాలు పెడుతున్న అలాటి స్కూళ్ళన్నీ డబ్బు చేసుకునేందుకు, డబ్బు దోచుకునేందుకు తప్ప అసలు సిసలు చదువుకు పనికొచ్చేవి కావు.
అమెరికాలో విద్యాలయాల్లో చదువుకన్నా వ్యక్తిత్వవికాసానికి (personality Development) ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు అనిపించింది. గట్టిగా చదివించి, ట్యూషన్లు పెట్టించి, “ఎమ్సెట్” ఒక్కటీ గట్టెక్కితే చాలనుకునే ధోరణి అక్కడి పేరెంట్లలో కానరాదు. ఆ అవసరం కూడా వారికి లేదనుకోండి. మరో విశేషం ఏమిటంటే సర్కారు బళ్ళల్లో (ఇక్కడ పబ్లిక్ స్కూళ్ళు అంటారు.ఇవి పూర్తిగా ప్రభుత్వ ఆజమాయిషీలో నడుస్తాయి) హైస్కూలు స్థాయి వరకూ సెంట్ ఖర్చులేకుండా చదువుకునే వీలుంది. ఆ తర్వాత నుంచి కాలేజి, యూనివర్సిటీ చదువులు, ఫీజులు రెండూ ఆకాశంలోనే వుంటాయి, అది వేరే సంగతి.
సమాజంలో ఉన్నత స్తాయి వర్గాలవాళ్ళు కూడా తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్ళలో కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేర్పించడానికి ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే, వసతుల విషయంలో, నిపుణత కలిగిన అధ్యాపకుల విషయంలో కొండొకచో సర్కారు బడులే ప్రైవేటు స్కూళ్ళను తలదన్నేలా వుంటాయి.
ఫెడరల్ గవర్నమెంట్ (కేంద్ర ప్రభుత్వం), స్తానిక (రాష్ట్ర) ప్రభుత్వాలు, విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యత కారణంగానే ఈ అసాధ్యం సుసాధ్యం అయిందని అనుకోవచ్చు. ప్రతి స్టేట్ లోను విద్యారంగం నిర్వహణ కోసం ‘స్కూలు డిస్ట్రిక్టుల’ను ఏర్పాటు చేసారు. తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను ఈ వ్యవస్థ పర్యవేక్షిస్తుంది. విద్యాప్రమాణాలను బట్టి ఆయా స్కూళ్లకు ఫెడరల్ గవర్నమెంట్ ప్రత్యేక నిధులను ‘ఇన్నోవేషన్ ఫండ్’ నుంచి గ్రాంట్ రూపంలో ఇస్తుంది. ఇలాటి పోటీల వల్ల సర్కారు బడుల్లో నాణ్యతా ప్రమాణాలు నానాటికీ పెరిగిపోతూ వస్తున్నాయి. న్యూస్ వీక్ పత్రిక ఒక ఏడాది విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం, అమెరికాలోని వంద ఉత్తమ పాఠశాలల్లో అయిదు హైస్కూళ్ళు బెల్ వ్యూ స్కూలు డిస్ట్రిక్టు లోనే వున్నాయి.
ప్రైవేటు స్కూళ్ళలో మాదిరి గానే వసతులు, చక్కటి భవనాలు, క్రీడా మైదానాలు కలిగివుండడం వల్ల ప్రభుత్వ స్కూళ్లను చిన్న చూపు చూసే పద్దతి ఇక్కడ కానరావడం లేదు. బెల్ వ్యూ లోని వుడ్ రిడ్జ్ గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూలు ఇందుకు ఉదాహరణ.
సహజకాంతి వుండేలా తీర్చిదిద్దిన స్కూలు భవనం, వాల్ టు వాల్ కార్పెట్లు, పొందికయిన తరగతి గదులు, లైబ్రరీ, లంచ్ రూము, ఇండోర్ జిమ్, క్రీడా మైదానం, కారు పార్కింగ్ ఏది చూసినా అద్భుతం అనే మాదిరిగా వున్నాయి. టాయిలెట్లు (రెస్ట్ రూములు) అయిదు నక్షత్రాల హోటళ్ళకు దీటుగా వున్నాయి.
బ్లాకు బోర్డులు, చాక్ పీసులకు బదులు ‘టచ్ స్క్రీన్ కంప్యూటర్లతో‘ పాఠాలు బోధించే విధానం ప్రాధమిక తరగతి నుంచే ప్రారంభం కావడం మరో విశేషం. పనిచేసే టీచర్లకు కూడా జీతభత్యాలు దండిగా వుండడం వల్ల ‘బతకలేక బడి పంతులు’ అనే నానుడుకి దూరంగా వుంటూ, తమ విద్యార్ధులతో ప్రేమపూర్వకంగా మసలుకుంటూ ‘గురు సాక్షాత్ పరబ్రహ్మ’ అనిపించుకుంటున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్ధులకు స్కూలులోనే ప్రత్యేక క్లాసులు తీసుకుంటారు. ముఖ్యంగా ఈ స్కూలులో పిల్లలకు నడవడిక నేర్పే పద్ధతులు దగ్గరనుంచి గమనించిన తరవాత వారి అదృష్టాన్ని గురించి మరో సారి అసూయపడాల్సి వచ్చింది. తోటి విద్యార్ధులతో మాట్లాడడం నుంచి సభ్య సమాజంలో మెలగడం వరకు, చిన్ననాటి నుంచే ఇస్తున్న తర్పీదు చూడముచ్చటగా వుంది. తమకున్న పరిమితుల్లోనే సమాజానికి ఎలా సేవ చేయవచ్చన్నది ఆచరణలో బోధిస్తారు. భూకంపాలు వంటివి సంభవించినప్పుడు ఎలా మెలగాలో అనేది మాక్ డ్రిల్స్ ద్వారా నేర్పిస్తారు.
స్కూలు మొదలయ్యేటప్పుడు, తిరిగి వొదిలేటప్పుడు టీచర్లు, కొందరు ఎంపిక చేసిన విద్యార్ధులు స్కూలు ప్రవేశ ద్వారం దగ్గర నిలబడి రోడ్డుపై వాహనాల రాకపోకలను క్రమబద్ధం చేస్తారు. అలాగే పేరెంట్స్ తోడు లేకుండా స్కూలు బస్సుల్లో ఒంటరిగా వచ్చే పిల్లలను జాగ్రత్తగా దింపుకుని, వారి వారి తరగతి గదులకు చేరుస్తారు. బస్సునుంచి దిగుతున్నప్పుడే పిల్లల పేర్లను రిజిస్టర్ లో రాసుకుంటారు. ఈ బస్సులకూ, మధ్యాహ్న భోజనానికీ ఎలాటి చార్జీ వుండదు.
విద్యా సంవత్సరం ముగిసి విద్యార్ధులు పై తరగతికి మారుతున్నప్పుడు పాత సహాధ్యాయుల ఫోటోలు, వారి వివరాలతో కూడిన ఒక చిన్న ఆల్బం ఇస్తారు. వారిలో కొందరు సొంత కారణాలపై వేరే స్కూలుకు మారినప్పటికీ, వారి జ్ఞాపకాలు భద్రంగా వుంచుకునేందుకు ఈ ఆల్బంలు పనికివస్తాయి. తరగతి గదిలో ఏటిపొడుగునా విద్యార్ధులు సృజనాత్మకతను రంగరించి చేసిన పనులను, అంటే గీసిన బొమ్మలు, వేసిన చిత్రాలు, తీసిన ఫోటోలు, రాసిన కధలు, వ్యాసాలు అన్నింటినీ జాగ్రత్తగా భద్రపరచి ఒక చక్కని ఫోల్డర్ రూపంలో ఏడాది చివరిలో అప్పగిస్తారు. తలిదండ్రులతో తరచుగా సమావేశాలు జరిపి వారి పిల్లల పురోగతిని గురించి వివరిస్తారు.
హైదరాబాదులో వేలకొద్దీ ఫీజుల రూపంలో దండుకునే అనేక విద్యా సంస్తలు కొన్నింటిలో ఇదేమాదిరి విధానాలు, వసతులు వుండవచ్చు. కానీ ఇంతవరకు ముచ్చటించుకున్నది ఏదో కార్పొరేటు స్కూలు గురించి కాదు. అమెరికాలో ఒక సర్కారు బడిని గురించి మాత్రమే. ఈ వాస్తవం గమనంలో వుంచుకుంటే, ఈ స్కూలుని చూసి ఎందుకు ముక్కున వేలేసుకోవాల్సి వచ్చిందో అర్ధం అవుతుంది.
కలాం గారు కోరుకున్నట్టు, మనందరం ఒక కల కనాలి. కనడమే కాదు దాన్ని నిజం చేసుకోవాలి.
ఇలాటి స్కూళ్ళు గ్రామగ్రామానికీ రావాలన్నదే ఆ కల. పైసా ఖర్చు లేకుండా, పేదా గొప్పా తారతమ్యం లేకుండా, పిల్లలందరికీ ‘ఇలాటి చిన్నతనం’ వారి సొంతం కావాలి.
భావి భారతం ‘భద్రభారతం’ కావాలంటే, భావి తరం ‘మేధావి భారతం’ కావాలంటే, చదువు నేర్చుకోవడం అన్న ఒక్క ‘హక్కు’ ఇచ్చి వూరుకుంటే సరిపోదు, ఇంత ఆనందంగా, హాయిగా, ఆడుతూ, పాడుతూ చదువుకోగల ‘సర్కారు స్కూళ్ళు’, చదువుకుందామనుకునే ప్రతి ఒక్కరికీ హక్కు భుక్తం కావాలి.
అయితే-
వీటన్నిటినీ ఆచరణలోకి తీసుకురావాలంటే కొన్నింటికి తప్పనిసరిగా డబ్బు కావాలి. అది ఎప్పుడూ కొరతే. మరికొన్నింటికి కేవలం చిత్త శుద్ధి వుంటే చాలు. కానీ, ఇప్పుడు బాగా కొరతగా వున్నది దీనికే. టీవీ చర్చల్లో తప్ప ఎక్కడా వినబడని ఈ "చిత్తశుద్ధి" అంత తేలిగ్గా దొరుకుతుందా?
ఇదంతా చదివి మన దేశాన్ని కించపరుస్తున్నట్టు అనుకోవద్దు. స్వాతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడిచిన తర్వాత కూడా మంచి చదువులు చదువుకునే అవకాశాలను మన చిన్నారులకు ఎందుకు ఇవ్వలేకపోతున్నామనే బాధ తప్ప మరోటి కాదు.
తోకటపా:
ఇది జరిగి కొన్నేళ్ళు అవుతోంది.
మేము సియాటిల్ లో వున్నప్పుడు జరిగింది. అక్కడ కూడా టీవీ ఛానళ్ళ హడావిడి ఎక్కువే. ఒకరోజు పర్యటనపై ఆ నగరానికి వచ్చి వెడుతున్న అమెరికా ప్రెసిడెంట్ ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానానికి అధికారులు క్లియరెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఆయన ఎయిర్ పోర్ట్ లోనే కొద్దిసేపు వుండిపోవాల్సివచ్చిందని స్క్రోలింగులు పరుగులు పెట్టాయి. అయితే అసలు విషయం మరునాడు పేపరు చూస్తే తెలిసింది. ఒక రోగిని తీసుకువస్తున్న హెలికాప్టర్ దిగడానికి వీలుగా అధ్యక్షుడి విమానాన్ని కొద్దిసేపు ఆపేశారని ఒక వార్త సారాంశం. అంతేకాదు, ఆ విరామ సమయంలో అధ్యక్షుల వారు ఏం చేశారో తెలుసా? డౌన్ టౌన్ లో వున్న ఓ చిన్న రెస్టారెంటుకి వెళ్లి కాఫీ తాగి వచ్చారట.
కింది ఫోటోలు:
మా మనుమరాళ్లు చదివిన బెల్ వ్యూ వుడ్ రిడ్జ్ ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల, ఆటల మైదానం, ఇండోర్ స్టేడియం, తరగతి గది

(ఇంకావుంది)

All reacti
2

Comment
Share

7, జూన్ 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (178 ) – భండారు శ్రీనివాసరావు

 

"అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ప్రవేశించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అయినా గట్టిగా ప్రయత్నించి అనుమతి సంపాదించాను. ప్రెసిడెంట్ వెకేషన్ లో వున్నారు. అందువల్ల, శ్వేత సౌధంలో మీడియా వ్యవహారాలు చూసే ఒక ఉద్యోగిని మాటల్లో పెట్టి ‘ఓవల్ ఆఫీసు’ (వైట్ హౌస్ లో ప్రెసిడెంట్ కార్యాలయం) ను కూడా చూసాను.
ఆయన కుర్చీ పక్కన రెండు బటన్లు కనిపించాయి. వొకటి నొక్కితే మూడో ప్రపంచ యుద్ధానికి తెరతీయడానికి, రెండోది నొక్కితే అణు యుద్ధం ప్రారంభించడానికి అధ్యక్షుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు వీలుగా వాటిని అమర్చారని నాలో నేనే ఏదో వూహించుకుని ఆ విషయమే నా వెంట వచ్చిన ఆ తెల్ల పిల్లతో అన్నాను. పెద్దగా వయస్సులేని ఆ అమ్మడు ఓ చిరునవ్వు నవ్వి ఇలా అంది. “ మీ ఊహల్నిఅలా అంతంత దూరం పోనివ్వకండి. ఆ ఎర్ర బటన్ నొక్కితే ప్రెసిడెంట్ కి కాఫీ కావాలని అర్ధం. పచ్చ బటన్ నొక్కితే బర్గర్ కూడా తీసుకు రావాలని సంకేతం.”
తెలియని విషయాలను గురించి మామూలుగా మామూలు మనుషులు వూహించుకునే తీరుతెన్నులపై, ఓ నలభై ఏళ్ళక్రితం చదివిన ఈ జోక్, సియాటిల్ లోని ‘లేక్ వాషింగ్టన్’ (సరస్సు) లో ఓ ఆదివారం నాడు, ఆర్గోసి అనే ఒక పెద్ద మరబోటులో విహరిస్తున్నప్పుడు గుర్తుకు వచ్చింది. విశాలమయిన ఈ మంచినీటి సరస్సు కొన్ని మైళ్ల దూరం విస్తరించి వుంది.
నౌకావిహారంలో భాగంగా ఒక లేడీ గైడ్, చుట్టుపక్కల విశేషాలను మా అందరికీ ఎంతో ఆసక్తి కరంగా వివరిస్తూ, “అదిగో ఆ వొడ్డుపై చెట్ల గుంపు వెనక కనిపిస్తున్న సౌధాన్ని చూడండి. యావత్ ప్రపంచంలో అత్యంత సంపన్నుడయిన వ్యక్తి అక్కడ నివసిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ భవనం అది” అని చెబుతూ అందులోని విశేషాలను వర్ణించడం మొదలు పెట్టింది.
బిల్ గేట్స్ నెలసరి ఆదాయం, సరిగ్గా చెప్పాలంటే చేసే వ్యాపారంలో అన్ని ఖర్చులు పోను మిగిలే నికర లాభం అన్నమాట, కొన్ని వందల కోట్లు వుంటుందని అంచనా. ఇంత డబ్బుగల ఆసామీ ఇల్లు ఎంత గొప్పగా వుంటుందో అని వూహించుకోవడం సహజమే మరి. ఆ లేడీ గైడ్ చేయి చాపి చూపినవైపు చూపు సారించి చూస్తే, దూరంగా తీరం, ఎత్తయిన వొడ్డు, దానిపై వత్తుగా మరింత ఎత్తయిన వృక్షాలు, వాటి కొమ్మల మధ్య లీలగా కానవచ్చే ఓ భవనం, ఓస్ ఇంతేనా అనిపించింది.
బిల్ గేట్స్ నివాసం వున్న ప్రాంతం సియాటిల్ లో అతి ఖరీదయిన క్లయిడ్ హిల్ ఏరియా . అంత సంపన్నుడి ఇరుగూ పొరుగూ ఎవరో తెలుసుకోవాలనే ఉత్సుకత వుండడం సహజం. అతగాడెవరో కాదు, ఒక సాధారణ పిజియో తెరపిస్ట్ అంటే నమ్మగలరా! గేట్స్ నివాసం పక్కనే ఇల్లు కొనుక్కోవడం అతగాడికి ఎలా సాధ్యమయిందంటే, బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ సంస్త స్థాపించిన కొత్తల్లో, అందులో కొన్ని షేర్లు కొన్నాడు. కాలక్రమేణా ఆ షేర్లు ఇంతింతై, వటుడింతై అన్నట్టుగా పెరిగిపోయాయి. దానితో ఆ మామూలు డాక్టర్ కాస్తా, కోరిన కోరికలు తీర్చుకోగల పెద్ద ఆసామీ అయిపోయాడు. యెంతో డబ్బు గుమ్మరించి బిల్ గేట్స్ పొరుగునే ఇల్లు కొనుక్కుని కాలర్ ఎగరేసుకుని కాపురం ఉంటున్నాడు.
ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కాము
అమెరికా అధ్యక్షుడి విమానం ఎయిర్ ఫోర్స్ వన్. ఆ విమానం ఎక్కి కలయతిరిగే ఓ అపూర్వ అవకాశం లభించింది. అదీ పదిహేనేళ్ల కిందట.
ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలయిన మైక్రోసాఫ్ట్ , అమెజాన్, బోయింగ్ ప్రధాన కార్యాలయాలు సియాటిల్ లోనే వున్నాయి.
అప్పుడు ఇన్ఫోసిస్ తరపున బోయింగ్ విమానాల తయారీ కర్మాగారంలో పనిచేస్తున్న మా అబ్బాయి సందీప్ ఏర్పాటుచేసిన ప్రత్యేక అనుమతి పత్రాలతో ఒక రోజు బోయింగ్ కర్మాగారానికి వెళ్ళాము. అనేక వందల ఎకరాల విస్తీర్ణంలో వున్న ఈ ఫ్యాక్టరీని ప్రవేశ రుసుముతో సందర్శించే వీలుకల్పించారు. ఎంతో భద్రత అవసరమయిన ఈ కర్మాగారాన్ని సందర్శించేందుకు ఉత్సాహపడే పర్యాటకులను ప్రవేశ రుసుముతో అనుమతించడం ద్వారా టూరిజంను వారు ఎలా ప్రోత్సహిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.
అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు ఎవరైనా సిఫారసు చేస్తే అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ని కూడా ఇదేవిధంగా సందర్శించే వీలువుందని విన్నాను.
మిగిలిన సందర్శకులతో కలిపి మమ్మల్ని కూడా ప్రత్యేక బస్సుల్లో బోయింగ్ కర్మాగారం లోపలకు తీసుకు వెళ్లారు. అన్నీ చూపించి విషయాలను విశదపరిచేందుకు వెంట గైడ్లు కూడా వున్నారు.
అసలు బోయింగ్ విమానమే ఎంతో పెద్దగా వుంటుంది. అలాటిది వాటిని తయారు చేసే ఫాక్టరీ యెంత పెద్దగా వుంటుందో ఊహించుకోవచ్చు. విడి భాగాలను తయారు చేసి వాటినన్నిటినీ ఒకచోట చేర్చి విమానాన్ని నిర్మించే వివిధ దశలను మేము కళ్ళారా చూసాము. అంతేకాకుండా బోయింగ్ విమాన నిర్మాణం ఎలా జరుగుతుందో కళ్ళకు కట్టినట్టు చూపే డాక్యుమెంటరీని కూడా ప్రదర్శించారు. ఈ కర్మాగారం ఆవరణలోనే పెద్ద పెద్ద రన్ వే లతో కూడిన విమానాశ్రయాన్ని కూడా నిర్మించారు.
రైట్ సోదరులు కనుక్కున్న తొలి విమానం నుంచి ఇంతవరకు తయారయిన అధునాతన యుద్ధ విమానాలు, ప్రయాణీకుల విమానాలు, సరకుల రవాణా విమానాలు, హెలికాప్టర్లు వుంచిన ఒక ప్రదర్శనశాల కూడా వుంది. అమెరికా అధ్యక్షుడి అధికారిక విమానం ‘ఎయిర్ ఫోర్స్ వన్’ పాత మోడల్ కూడా అక్కడ వుంది. సందర్శకులు అందులోకి ఎక్కి కాక్ పిట్ తొ సహా ప్రెసిడెంట్ కోసం విమానంలో ఏర్పాటు చేసిన పడక గది, సమావేశ మందిరం, పత్రికా విలేఖరులతో మాట్లాడే హాలు అన్నీ చూడవచ్చు. టెలిఫోన్, టెలెక్స్, కంప్యూటర్, ఇంటర్నెట్, టీవీ మొదలయిన అత్యాధునిక సమాచార పరికరాలన్నీ అందులో వున్నాయి.
అమెరికా ప్రెసిడెంట్ విమానంలోకి ఎక్కి అన్నీ చూడడం అన్నది నిజంగా ఒక మరపురాని అనుభూతి. ఇవన్నీ ఎందుకు ప్రస్తావిస్తూ వున్నానంటే, ఈ దేశంలో పర్యాటక రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను తెలియచెప్పడానికే. నిజానికి బోయింగ్ విమానాల కర్మాగారం రక్షణ అవసరాల దృష్ట్యా నిషేధిత ప్రదేశమయినా టికెట్లు పెట్టి మరీ ప్రజలకు చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఏటా ఎన్నో వేలమంది దీన్ని సందర్శిస్తూ వుంటారు.
కింది ఫోటోలు:
పదిహేనేళ్ల కిందట వాషింగ్టన్ లేక్ లో విహారాలు:
బోయింగ్ ఎయిర్ ఫోర్స్ విమానం పక్కన ఫోటో
(ఇంకావుంది)

All reactions:

Like
Comment
Share
Facebook