3, జూన్ 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (175) – భండారు శ్రీనివాసరావు

 2024 లో నేను అమెరికా వెళ్ళినప్పుడు అధ్యక్ష ఎన్నికల సమయం. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.

నవంబర్ లో జరిగే ప్రెసిడెంట్ ఎన్నికల హోరు క్రమంగా ఊపందుకుంటోంది.
ఆగస్టు ఇరవైన చికాగోలో డెమొక్రాటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్ మొదలయింది.
ప్రెసిడెంట్ పదవికి ఆ పార్టీ తరఫున పోటీ పడుతున్న కమ్లా హారిస్ (ప్రసంగించిన వక్తలలో చాలా మంది ఆమె పేరుని ఇలాగే ఉచ్చరించారు) తో పాటు, గత నాలుగేళ్లుగా అమెరికాను పాలిస్తూ వచ్చిన ప్రెసిడెంట్ జో బైడెన్ కూడా హాజరై ప్రసంగించారు.
ఒకరకంగా ఇది ఆయనకు వీడ్కోలు కార్యక్రమం అనిపించింది. ఆయన మైకు పట్టుకోగానే హాలులోని వేలాది మంది వుయ్ లవ్ బైడెన్ అనే ప్లకార్డులు పట్టుకుని లేచి నిలబడి హర్షధ్వానాలు చేశారు.
అప్పటి వైస్ ప్రెసిడెంటు కమ్లా హారిస్ కూడా హాజరయ్యారు.
రెండు ప్రధాన పార్టీలు ఇలాగే సభలు సమావేశాలు నిర్వహిస్తాయి కానీ బహిరంగంగా కాదు. ఏదో ఒక నగరంలో, అదీ ఒక సమావేశ మందిరంలో.
అమెరికా ప్రెసిడెంటు పాల్గొంటున్న సభను టీవీలో వీక్షిస్తున్న నా కంటికి ఎక్కడా సెక్యూరిటీ సిబ్బంది కనపడలేదు. సీక్రెట్ సర్వీసు వాళ్ళు వుంటే వుండవచ్చు. కానీ ఆ వ్యవహారం అంతా సీక్రెట్.
ఇలాంటి పద్ధతులు మన దేశంలో కూడా రావాలని ఆశించడం అత్యాశ కాదు కదా!
నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరపున అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నామినేషన్ ను చికాగోలో నాలుగు రోజులుగా జరుగుతున్న ఆ పార్టీ జాతీయ సదస్సులో చివరి రోజున ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. కాకతాళీయం కావచ్చు, యాదృచ్చికం కావచ్చు ఆ రోజు కమలా హారిస్ పెళ్ళి రోజు కూడా. పార్టీ ఆమెకు ఇచ్చిన పెళ్ళి కానుక.
సరే! ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే ఈ దేశంలో కూడా ఎన్నికల ప్రసంగాలు కొంచెం డిగ్రీ తేడా కానీ మన దేశంలో మాదిరిగానే సాగాయి.
అమెరికా మాజీ ప్రెసిడెంట్లు ఇద్దరు ఒబామా, బిల్ క్లింటన్ లు భార్యలతో సహా హాజరై కమలా హారిస్ కు మద్దతు పలికారు. ఆమె పేరు కమ్లానా, కమలానా అనే శంక తీరుస్తూ CNN channel ఆమె పేరును KAMALA HARRIS అని స్క్రోలింగులో రాసింది.
మన దగ్గర IAS, IPS అధికారులు, అధికార పార్టీలకు పరోక్షంగా మద్దతు ఇస్తుంటారు. ఇక్కడ ఏకంగా తమ యూనిఫారాల్లోనే వచ్చి కొందరు పోలీసు అధికారులు బహిరంగంగానే డెమొక్రాటిక్ పార్టీకి మద్దతు తెలుపుతూ వేదికపై ప్రసంగాలు చేసారు. ఇది ఇక్కడ ఆక్షేపణీయం కాదంటున్నారు.
ముసుగు మనుషుల కంటే ఇదే బెటరేమో!
ప్రధాన ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అప్పటికే డొనాల్డ్ ట్రంప్ ను తమ ప్రెసిడెంటు అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ ఇద్దరి భవిష్యత్తు రెండు నెలల్లో తేలుతుంది. 2025 జనవరిలో కొత్త అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరిస్తారు.
సదస్సులో ప్రసంగాలను బట్టి నాకు అర్థం అయింది ఏమిటంటే free and fair elections పట్ల రాజకీయ పార్టీలకి ఏదో సందేహం వున్నట్టు వుంది. పైగా ఇది అప్పటికి అధికారంలో వున్న పార్టీ నిర్వహిస్తున్న సదస్సు కావడం, ఆ పార్టీకి చెందిన వాళ్ళే ఇటువంటి సందేహాలు వ్యక్తం చేయడం కొంచెం వింతగా అనిపించింది.
బిగ్ డిబేట్
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరుగుతున్న టీవీ డిబేట్ ని ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది తిలకిస్తున్నారని అంచనా.
ప్రపంచాన్ని శాసిస్తున్న దేశంగా, పెద్దన్న తరహాలో ఆధిపత్య భావాలు కలిగివుండే అమెరికా అధ్యక్షుడి ఎన్నిక వచ్చే నవంబరులో జరగనున్న నేపథ్యంలో ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్ పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొనడం అతి సహజం.
అమెరికన్లు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఆ ఘడియ రానే వచ్చింది. ముందు ప్రకటించిన సమయం ప్రకారం, డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి Ms. కమలా హారిస్ (59) రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (78) వేదిక పైకి వచ్చి చెరో వైపు నిలబడ్డారు. రాగానే, కమలా హారిస్ మందహాసం చేసుకుంటూ, ట్రంప్ నిలబడిన వైపు చకచకా నడుచుకుంటూ వెళ్ళి కరచాలనం కోసం చేయి చాపి, (అయామ్) కమలా హారిస్ అంటూ తనని తాను పరిచయం చేసుకున్నారు. ఒకప్పుడు ఆమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన ట్రంప్, ప్రస్తుత వైస్ ప్రెసిడెంటు కమలా హారిస్ ఇలా ఎదురు పడిన సందర్భం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది.
ప్రజాభిప్రాయాన్ని మలుపు తిప్పడంలో ఈ డిబేట్ అత్యంత క్రియాశీలకం అని అంటారు. అభ్యర్థులు మాట్లాడుతున్న తీరు, వారి హావ భావాలు, తమ విధానాలను వివరించే విధానం కూడా కీలకం అంటారు.
రెండు గంటలకు పైగా సాగే ఈ కార్యక్రమంలో చర్చ ప్రశాంతంగానే సాగింది. వివాదాస్పద వ్యాఖ్యలకు ట్రంప్ కేంద్ర బిందువు అనే పేరు వుంది కనుక వీక్షకులకి ఈ డిబేట్ పట్ల ప్రత్యేక ఆసక్తి.
ట్రంప్ మాట్లాడుతున్నప్పడు కమలా హారిస్ ఆయననే చూస్తూ వుండడం, ట్రంప్ మాత్రం ఆవిడ వైపు చూడకుండా తనదైన ధోరణిలో మాట్లాడడం నేను గమనించిన విశేషం.
జయ జయ జయ భారత జనయిత్రీ
నేను సియాటిల్ లో వున్నప్పుడే ఆగస్టు పదిహేను భారత స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ఆ కోలాహలం చూస్తే, విదేశీ గడ్డపై వున్నానా, లేక భారత దేశంలోనే వున్నానా అనే సందేహం కలిగింది.
మా వాడు, కోడలు ఆఫీసుల నుండి వచ్చి అందరం కలిసి బయలుదేరి వెళ్ళేసరికి, బెల్ వ్యూ సిటీ హాల్ పార్కింగ్ లాట్ వందలాది కార్లతో నిండిపోయి వుంది.
దాంతో పక్క వీధిలో వున్న పెయిడ్ పార్కింగ్ లో కారు పెట్టి తిరిగి వస్తుంటే, పేవ్ మెంట్ మీద గుంపులు గుంపులుగా రకరకాల భారతీయ వస్త్రధారణతో ఆడామగా అందరూ ఉత్సాహంగా నడుస్తూ కనిపించారు. త్రివర్ణ పతాకాలతో సిటీ హాల్ ప్రాంగణం నిండి పోయింది. భారత జాతీయ జెండా కట్టుకుని వెడుతున్న ఒక సిటీ బస్సు కనిపించింది.
వచ్చిన జనం మూడు నాలుగు వేల మంది వుండవచ్చు. ప్రధాన రహదారిలో ప్రదర్శన. ఆ రోడ్డును కొన్ని గంటల పాటు మూసివేశారు. చాలా మంది సాయుధులు అయిన పోలీసులు వున్నారు కానీ వాహనాలు, పాదచారుల రాకపోకల క్రమబద్ధీకరణకు మాత్రమే పరిమితం అయ్యారు. ఫైర్ సర్వీసు వారు తమ భారీ వాహనాలతో సిద్ధం అయ్యారు. వ్యక్తిగత తనిఖీలు లేవు. అమెరికాలో ప్రవేశించే ముందే ఏ తనిఖీ అయినా. ఒక్కసారి ఆ దేశంలో ప్రవేశించిన తర్వాత మాల్స్, సినిమా హాల్స్ ఎక్కడా ఏవిధమైన చెకింగులు ఉండకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.
రోడ్డు దాటేటప్పుడు జాన్ సన్ అనే పోలీసు అధికారి నా చేయి పట్టుకుని దాటించాడు. ఇండియా అంటే సౌతా అని అడిగి, ఓహ్ స్పైసీ అంటూ నవ్వాడు.
మా అబ్బాయి బోయింగ్ లో పనిచేసేటప్పుడు సహోద్యోగి ఇప్పుడు డిప్యూటీ మేయర్. అంత హడావిడిలో కూడా సందీప్ తో తీరిగ్గా మాట్లాడారు. నన్ను పరిచయం చేస్తే భారతీయ పద్ధతిలో చేతులు జోడించి నమస్కారం చేసారు.
రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన వేదికపై ఇండియన్ కాన్సులేట్ ఉన్నతాధికారులు ఆసీనులు అయ్యారు. వేదికపై ఒక పక్కగా కూర్చుని రెండు గంటలు ఆసక్తిగా ప్రదర్శన తిలకించిన వారిలో ఒకరిని మాత్రం నేను గుర్తు పట్ట గలిగాను. ఆయన ఎవరో కాదు, ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్.
తరువాత వివిధ భారతీయ రాష్ట్రాల వారు తమ సంస్కృతిని ప్రతిబింబించే వాహనాల ప్రదర్శన జరిగింది. వీటిల్లో తెలంగాణా, ఆంధ్రాలకు చెందినవి కూడా వుండడం సంతోషం కలిగించింది. ప్రదర్శన ముగిసిన తర్వాత వారితో ఫోటోలు దిగాము.
వచ్చిన వారందరికీ స్టార్ బక్స్ వారు తీయటి పానీయాలు అందించారు.
ఇంటికి వెళ్ళే ముందు దగ్గర్లోని ఓ అమెరికన్ రెస్టారెంట్లో భోజనం చేసాము. ఆగష్టు 15 ఇండియన్ రెస్టారెంట్ లకు సెలవు.
మెన్యు కార్డులో కుడి వైపు చూడవద్దు, ఎడమవైపు వున్న వాటిలో మీకు ఇష్టమైనవి ఆర్థర్ చేయండి అనేది మొదటి రోజే మా అబ్బాయి చేసిన సూచన. ఎంత ఖరీదు అనేది పట్టించుకోవద్దు అనేది దాని టీకా తాత్పర్యము.
కింది ఫోటోలు:
సియాటిల్ లో భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలు. వేదికపై మూడు రంగుల కండువాతో బిల్ గేట్స్, రోడ్డు దాటించిన పోలీసుతో నేను. డిప్యూటీ మేయరుతో మా పెద్దవాడు సందీప్. తెలుగువారి బృందంతో నేను, త్రివర్ణ పతాకంతో వెడుతున్న ట్రక్కు.
చికాగోలో డెమోక్రాటిక్ పార్టీ జాతీయ సదస్సు దృశ్యాలు
బిగ్ డిబేట్
(ఇంకావుంది)
All reactions:
4
Like
Comment
Share
Facebook
Facebook
Facebook
Facebook
Facebook

2, జూన్ 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (174) – భండారు శ్రీనివాసరావు

ట ట టా ట ట టా ట ట టా
ఆఫ్రికా ఒక చీకటి ఖండం. అక్కడ ఈగలు కుడితే మనుషులు చచ్చిపోతారట.
సరిగా తెలియని విషయానికి చివర్లో ‘ట’ తగిలిస్తే అది నిజం అనిపిస్తుందని చిన్నతనంలో అలా చెప్పుకునేవారు. అలాగే వెనక మేము మాస్కో వెళ్లినప్పుడు, స్కూల్లో మా వాడిని వాళ్ల క్లాస్ మేట్ అడిగాడట, ‘మీ ఇంట్లో ఎన్ని ఏనుగులున్నాయ’ని. ఇండియాలో పులులు వీధుల్లో తిరుగుతుంటాయని, ఏనుగుల్ని ఇళ్ళల్లో పెంచుకుంటారనీ, పిల్లలు పాములతో ఆడుకుంటారనీ, ఇవీ ఆ దేశంలో మన దేశం పట్ల వున్న అభిప్రాయాలు.
అమెరికన్ ఆతిధ్యం
కొన్నేళ్ళ క్రితం అమెరికాలో ఉంటున్న మా మనుమరాళ్ళ క్లాసు టీచరు మిసెస్ సూజన్ విల్సన్, ఆమె కుటుంబం హాలీడే కోసం ఇండియా వచ్చారు.
‘పనిలోపనిగా హైదరాబాదు కూడా చూసిరండి’ అని మా వాళ్ళు మా అడ్రసు ఇవ్వడంతో మా ఇంటికి వచ్చారు. చిన్న ఇంట్లో వుండడం వాళ్లకి వసతిగా వుండదేమో అన్న సందేహంతో మేము వారికోసం రెండు హోటల్ గదులు బుక్ చేసాము. అయినా వాళ్ళు మాతో పాటు మా ఇంట్లోనే మూడు రోజులు వున్నారు. పిజ్జాలు అవీ ఆర్డరు చేసినా వాళ్ళు వేలేసి ముట్టుకోలేదు. కూరలు, పచ్చళ్ళతో మా ఆవిడ పెట్టిన భోజనమే తిన్నారు. నేలమీదనే చాపలు పరచుకుని పడుకున్నారు. వున్న రెండు బాత్ రూముల్లోనే సర్దుకున్నారు. ఆటోలలో ఊరంతా తిరిగారు. అమెరికాలో తమ స్నేహితులకి కానుకలుగా ఇవ్వడానికి చార్మినార్ దగ్గర గాజులు కొనుక్కుని వెళ్ళారు. టాంక్ బండ్ బుద్ధ విగ్రహాన్ని చూసి ముచ్చట పడ్డారు. గోల్కొండ కోటలో కలియతిరిగారు. లైట్ అండ్ సౌండ్ షో చూశారు. వున్న మూడు రోజులు మాతో కలిసే వున్నారు కానీ, కలిసి ఉంటూ విడిగా ఉండడానికి ప్రయత్నించలేదు. అసౌకర్యంగా వున్నట్టు ఎక్కడా కనిపించకుండా హాయిగా మాతోనే వుండి, మన భోజనాలే చేస్తూ ఇంట్లో మనుషుల మాదిరిగా గడిపి వెళ్ళారు.
అదే మేము అమెరికా వెళ్లినప్పుడు ఇడ్లీ, దోసె దొరికే హోటళ్ళ మీద పడ్డామే కానీ, ఆ దేశపు ఆహార విహారాల ముచ్చటే పట్టించుకోలేదు. ఇతరులతో కలసిపోయే తత్వం, అంతటి విశాల హృదయం మాలో లేదని అనిపిస్తుంది.
మిసెస్ సూజన్ విల్సన్ భర్త మిస్టర్ గోర్డన్, రెడ్మండ్ టౌన్ సెంటర్ లోని కార్యాలయంలో పనిచేస్తారు. వారికి అయిదుగురు పిల్లలు. ముగ్గురు ఆడపిల్లలు. ఇద్దరికి పెళ్ళిళ్లయిపోయాయి. మిగిలిన ముగ్గురి చదువులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. హాస్టళ్ళలో వుంటున్నారు.
ప్రస్తుతానికి భార్యాభర్తా ఇద్దరే బెల్ వ్యూ లోని సొంత ఇంట్లో వుంటున్నారు. మేము సియాటిల్ వెళ్ళినప్పుడు ఒక రాత్రి మమ్మల్ని భోజనానికి ఆహ్వానించారు. ఇల్లు పొందికగావుంది. ముందూ వెనుకా విశాలమయిన ఖాళీ జాగా. ఇంట్లోకి అడుగు పెట్టగానే నల్లటి రంగులో తళ తళ మెరిసిపోతూ పియానో దర్శనమిచ్చింది. దాని పక్కనే ‘మరింబా’ అనే మరో సంగీత వాయిద్యం.
శంకరాభరణం శంకర శాస్త్రి గారి ఇల్లులా ఆ ఇంట్లో అంతా సంగీత వాతావరణం. సాధారణంగా అమెరికన్లు బయటవారిని ఎవరినీ భోజనాలకు ఇళ్లకు పిలవరు, అంతగా పిలవాల్సి వస్తే హోటల్లో డిన్నర్ ఇస్తారని చెప్పుకునేవాళ్ళు.
అందుకే మేము వాళ్లు పిలిచినప్పుడు కొంత సందేహిస్తూనే వెళ్ళాము. కానీ వారి ఆదరణలో భేషజం ఏమీ కనిపించలేదు. పైగా ఆ సాయంత్రం మొత్తం మాతోనే గడపడానికి సిద్దమయినట్టు కనిపించారు. అందరం భోజనాల బల్ల దగ్గర కలిసి కూర్చుని భోజనం చేసాము. భోజనానికి ముందు మిస్టర్ గోర్డన్, మిసెస్ విల్సన్ ప్రార్ధన చేసారు.
“ ఓ! లార్డ్! ఇండియానుంచి వచ్చిన అతిధులు పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. మా పిల్లలు నిరుడు హైదరాబాదు వెళ్ళినప్పుడు వీరు వారిని చక్కగా చూసుకున్నారు. వారికి ఇలా భోజనం పెట్టగలిగే అవకాశం కల్పించిన నీకు కృతజ్ఞతలు.”
మా బామ్మ గారు జ్ఞాపకం వచ్చారు. భోజనానికి ముందు ఆవిడ తప్పకుండా దేవుడి ప్రార్ధన చేసేవారు.
“అహం వైశ్వానరో భూత్వా ప్రాణీనాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం”
తాత్పర్యం: నేను వైశ్వానరుడు అను పేరు గల జఠరాగ్నినై, సకల ప్రాణుల శరీరములయందు ప్రవేశించి, జఠరాగ్నిని ప్రజ్వలింప చేసే ప్రాణాపానములనే వాయువులతో కలిసి, భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోష్యములనే నాలుగు విధములైన ఆహారమును పచనము చేయుచున్నాను.
నా చిన్నతనంలో మా బామ్మ రుక్మిణమ్మ గారు ప్రతిరోజూ అపరాహ్ణసమయంలో భోజనానికి కూర్చున్నప్పుడు, మొదటి ముద్ద చేతిలో పెట్టుకుని ఈ గీతా వాక్యాన్ని చదివేది. అప్పుడు అర్ధం అయ్యేది కాదు.
పూర్వాచారాలు పాటించే బ్రాహ్మణ కుటుంబాల్లో వైశ్వదేవం అని చేస్తారు. భోజనం చేసే ముందు చేసే బలిహరణం అన్నమాట. దాన్ని ఆంతర్యం చాలా గొప్పది. మనం వుంటున్న ఈ భూమండలానికి పైనా కిందా అనేక లోకాలు వున్నాయి. వాటిల్లోని ఎన్నో కోట్ల జీవరాశులకు తృప్తి కలిగించడం దీని ఉద్దేశ్యం. ఈ విధమైన భూత తృప్తి భోజనానికి ముందూ తరువాత చేయడం విధాయకం. ఉత్తరాపోసన పట్టేటప్పుడు ‘ఇతర ప్రాణులను ఉద్దేశించి ఇది చేయడం జరుగుతోంది’ అని చెబుతారు.
బ్రాహ్మణులే కాదు ఇలా ఎవరయినా చేయవచ్చు. సమస్త భూతరాశి తృప్తి కోసం ప్రార్ధించవచ్చు.
ఇలా భోజనాత్పూర్వం సకల జనుల తృప్తి కోసం ప్రార్ధన చేయడం అనే ఆచారం ఇంకా అనేక దేశాల్లో, అనేక మతాల్లో వుంది.
అమెరికన్లు అనగానే విందుకు ముందు మందు అనే దురభిప్రాయం తొలగిపోయేలా మా భోజనం పూర్తయింది. తరవాత మిసెస్ విల్సన్ చక్కటి పాటలు పాడారు. మిస్టర్ గోర్డన్ పియానోతో సహకారం అందించారు. డిజర్ట్ సర్వ్ చేసేటప్పుడు వారి ఫ్యామిలీ ఫోటోలు చూపించారు. పిల్లల చిన్నతనపు ముచ్చట్లు నెమరు వేసుకున్నారు. భాష అర్ధం చేసుకోవడంలో కొంత ఇబ్బంది ఎదురయినా వారి ఆప్యాయతను, ఆత్మీయతను మాత్రం పూర్తిగా ఆస్వాదించగలిగాము.
అక్కడ గడిపిన కొద్ది గంటల సమయంలో ఒక విషయం గమనించాము. ఎక్కడా ఏ గదిలో టీవీ కనిపించలేదు. అడగడం బాగుండదని ఆ విషయం గురించి ప్రస్తావించలేదు. కానీ, నేను రేడియోలో పనిచేశానని తెలుసుకున్నప్పుడు, మాటల సందర్భంలో చెప్పినట్టుగా తమ ఇంట్లో టీవీ వుండదని చెప్పారు. ‘టీవీ అనేది వినోదాత్మకంగా వుండాలి. వార్తల జోలికి పోకూడదు’ అని అభిప్రాయపడ్డారు. వార్తలకోసం తాము పబ్లిక్ బ్రాడ్ కాస్ట్ రేడియో వింటామనీ, సంగీతంతోనే పొద్దుపుచ్చుతామనీ చెప్పారు. “మీడియా అంతా ఇప్పుడు ముక్కచెక్కలయింది. వాళ్లు సమాచారం ఇవ్వడం లేదు. వాళ్ల సొంత అభిప్రాయాలు చెబుతున్నారు” అన్నారాయన. రెండు కార్లు వున్నప్పటికీ, రోజూ ఆఫీసుకు ఏడున్నర మైళ్ళు సైకిల్ పైనే వెడతానని మిస్టర్ గోర్డన్ చెప్పినప్పుడు ఆశ్చర్యం వేసింది.
చీటికీ మాటికీ చీకాకులు పడుతూ, పండంటి కాపురాలను పాడుచేసుకుంటారని, పెళ్ళిళ్ళు పెటాకులు చేసుకోవడంలో అమెరికన్లు సిద్ధ హస్తులనీ, మన వైపు జనసామాన్యంలో వున్న అభిప్రాయంలో అంత వాస్తవం లేదని గోర్డన్ కుటుంబాన్ని చూసిన తరవాత అనిపించింది.
కింది ఫోటోలు:
హైదరాబాదులో మిసెస్ సూజన్ కుటుంబం
సియాటిల్ లో సూజన్ దంపతుల ఆతిధ్యం
(ఇంకావుంది)

Like
Comment
Share
Facebook