28, మే 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (169) – భండారు శ్రీనివాసరావు

 కన్నంతలో విన్నంతలో అమెరికా

2003 వరకు సింగపూర్, మలేసియా, సోవియట్ యూనియన్ వంటి దేశాలకు వెళ్ళిన అనుభవం వుంది కానీ అమెరికా వెళ్ళడం మాత్రం ఆ ఏడాదే జరిగింది. ఒకానొక కాలంలో విదేశాలకు వెళ్ళడం అనేది వెళ్ళిన వారికీ, వారు అలా వెళ్ళడం వారి చుట్టపక్కాలకూ ఎంతో గొప్పగా అనిపించేది కానీ ఇపుడలా కాదు. అందరికీ అమెరికా వంటి దేశాలకు వెళ్ళే అవకాశాలు లభిస్తున్నాయి. దిగువ, మధ్య తరగతి తలితండ్రులకు మాత్రం వాళ్ళ పిల్లల వల్లనే. వెళ్ళిన ప్రతివారికీ మొదటిసారి అనుభవాలు కొత్తగా, గమ్మత్తుగా అనిపిస్తాయి. ఒకసారి వెళ్ళివచ్చిన వారికి ఇందులో ఏముంది అనిపించవచ్చు. కానీ ప్రప్రధమంగా వెళ్లేవారికి కొంత ఉపయోగపడవచ్చు అనే ఉద్దేశ్యమే అమెరికా అనుభవాలు కాగితం మీద పెట్టడానికి కారణం.

నేను హైస్కూల్ లో చదువుకునే రోజుల్లో ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వర రావు గారు అమెరికా సందర్శించి, ‘నేను చూసిన అమెరికా’ అని ఒక పుస్తకం రాశారు. అది చదివి ఆ పుస్తకానికి అలా ఎందుకు పేరు పెట్టారా అని అనుకునేవాడిని. మొదటిసారి వెళ్ళివచ్చిన తర్వాత అర్ధమయింది. అదొక సువిశాల దేశం. టూరిస్ట్ గా వచ్చిన వాళ్ళే కాదు, ఎన్నో ఏళ్లుగా అక్కడ వుంటూ వచ్చిన వాళ్ళు కూడా అమెరికాని పూర్తిగా చూడడం కుదరని పని. అందుకే చూసిన మేరకే అవగాహన చేసుకుని అక్షరబద్ధం చేసేందుకే ఈ ప్రయత్నం.

విన్నంతలో... కన్నంతలో... అని పేరు పెట్టడానికి ఇదే కారణం.

అమెరికా వెళ్లడం అన్నది మన దేశంలో చాలా మందికి తీరని కల. ఎందుకంటే వీసా నిబంధనలు అంత కఠినతరం. డబ్బున్నవాళ్ళు కూడా మరో మరో విదేశానికి వెళ్లి వచ్చినంత సులభంగా అమెరికా వెళ్ళలేరు. అలాగే ఆనాటి సోవియట్ యూనియన్ కూడా.

అయితే, ఓ పాతికేళ్ళ క్రితం ఆకాశవాణి పుణ్యమా అని మాస్కోవెళ్లి దాదాపు అయిదేళ్లు రేడియో మాస్కోలో పనిచేసివచ్చాను. ఆ రోజుల్లో ప్రపంచ దేశాల్లో అమెరికాకు పోటీగా నిలబడిన మరో ఏకైక అధికార ధ్రువం సోవియట్ యూనియన్. అనేక దశాబ్దాల తరబడి అప్రతిహతంగా సాగిన మొట్టమొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం అంతిమ ఘడియలు చూడగలిగే అరుదయిన అవకాశం లభించిన నేను ‘మార్పు చూసిన కళ్ళు’ అనే పేరుతొ ఆనాటి అనుభవాలను గ్రంధస్తం చేయడం జరిగింది.

పోతే, మాస్కో నుంచి తిరిగివచ్చిన ఇరవై రెండేళ్ల తర్వాత 2003లో సియాటిల్ లో వుంటున్న మా పెద్దకుమారుడు సందీప్, అమెరికా చూసే అవకాశాన్ని కల్పించి, సోవియట్ యూనియన్, అమెరికాలు రెండింటినీ చూడగలిగిన కొద్దిమంది హైదరాబాద్ జర్నలిష్టులలో నన్ను కూడా చేర్చాడు. నాకు తెలిసి ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ ఐ వెంకటరావు, , ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సెక్రెటరీ జనరల్ కె. శ్రీనివాసరెడ్డి, (ప్రస్తుతం తెలంగాణా మీడియా అకాడమి చైర్మన్) ఈ రెండు దేశాలను చూసినవారిలో వున్నారు. ఈ అవకాశం ఇక ఎవరికీ దొరికే వీలు కూడా లేదు. ఎందుకంటే అంత పెద్ద కమ్యూనిస్ట్ దేశం , కాలక్రమంలో అంగ వంగ కళింగ దేశాల మాదిరిగా విచ్చిన్నమై చరిత్ర పుటల్లో మిగిలిపోయింది.

కాగా, చెన్నై అమెరికన్ కాన్సులేట్ లో పత్రికా వ్యవహారాలు చూసే ఉద్యోగి, నా మిత్రుడు మాగంటి కోటీశ్వర రావుగారి పూనికతో ఎలాటి టెన్షన్ పడకుండా లభించిన పది సంవత్సరాల వీసాలతో నేనూ మా ఆవిడ నిర్మల, హైదరాబాదులో 2003 సెప్టెంబర్ ఆరో తేదీ శనివారం మలేసియన్ ఎయిర్ లైన్స్ లో బయలుదేరి కౌలాలంపూర్ మీదుగా సుమారు ముప్పయి గంటలు ప్రయాణం చేసి తిరిగి అదే రోజు, అంటే శనివారం నాడే అమెరికా లోని అతి పెద్ద విమానాశ్రయాల్లో ఒకటయిన లాస్ ఏంజెల్స్ చేరుకున్నాము. భూమండలానికి ఆవలవైపు వున్న దేశానికి చేరడంవల్ల కాలగమనంలో వచ్చిన మార్పు ఇది.

ఇప్పటిలా హైదరాబాదు నుంచి సియాటిల్ కు నేరుగా విమాన సౌకర్యం లేదు. లాస్ ఏంజెల్స్ నుంచి సియాటిల్ వెళ్ళడానికి మరో విమానం ఎక్కాలి. దానికి రెండు గంటలకు పైగా వ్యవధి వుంది.

లాస్ ఏంజెల్స్ చేరగానే ఆ విషయం సియాటిల్ వున్న తనకు తెలియచేయడానికి వీలుగా సందీప్ ముందుగానే ఒక ఫోన్ నంబర్ ఇచ్చాడు. డబ్బులతో అవసరం లేని నంబర్ అది. దాని ద్వారా కబురు అందించడానికి నేను చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నా పాట్లు గమనించిన ఒక అమెరికన మహిళ, తానే చొరవ తీసుకుని తన సెల్ ఫోన్ ద్వారా సియాటిల్ లోని సందీప్ కి మేము క్షేమంగా చేరిన సమాచారాన్ని చేరవేసింది. అమెరికన్లతో నా తొలి పరిచయం ఇలా సుహృద్భావంగా జరగడం చాలా సంతోషం అనిపించింది.

సియాటిల్ విమానం ఎక్కేముందు కూడా మా బాగేజీని క్షుణ్ణంగా పరీక్షించారు. ఊరగాయ పచ్చళ్ళను గురించి ఒకటికి రెండుసార్లు ప్రశ్నించారు. ఒక పెద్ద సూటుకేసులో పాకెట్లు చూసి వారికి అనుమానం కలిగినట్టుంది. అవన్నీ నేను తాగే సిగరెట్ల పాకెట్లు. ఆ బ్రాండు అమెరికాలో దొరుకుతుందో లేదో అని ముందు జాగ్రత్తగా ఎర్రమంజిల్ రెడ్ రోజ్ రెస్టారెంట్ దగ్గర పాన్ షాపులో ఆ సిగరెట్లు కొన్నాను. ఒక్కసారే అన్ని డజన్ల సిగరెట్ల పాకెట్లు టోకున కొంటుంటే ఆ షాపు వాడికి నేను కూడా ఓ షాపు తెరవబోతున్నానేమో అనే సంశయం కలిగివుంటుంది.

ఇన్ని సిగరెట్ ప్యాకెట్లు, అవీ ఒక సూటుకేసు నిండా వుండడం చూసి ఆ అమెరికన్ కస్టమ్స్ అధికారి కనుబొమ్మలు ఎగరేశాడు ఏవిటివన్నీ అనే అర్ధం వచ్చేట్టు. నా బాధ నేను చెప్పుకున్నాను. అతడూ ధూమపాన ప్రియుడేమో తెలవదు, మా సామానునంతా మా కళ్ళ ముందే సూట్ కేసుల్లో జాగ్రత్తగా సర్ది మాకప్పగించారు.

ఎట్టకేలకు సియాటిల్ వెళ్ళే విమానం ఎక్కాము. సుమారు రెండుగంటల ప్రయాణం.

సియాటిల్ గురించి నాకు తెలిసింది తక్కువ. మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయం సియాటిల్ లో వుందని తెలుసు. ఆంద్ర జ్యోతిలో లోగడ పనిచేసిన నా మిత్రుడు రామానాయుడు ఆ పత్రిక తరపున ఓసారి సియాటిల్ వెళ్లి వచ్చాడు. ఎప్పుడూ వానలు పడుతుంటాయి అని చెప్పాడు. మేము సియాటిల్ వెళ్లేసరికి వాతావరణం బాగానే వుంది. సందీప్ తన స్నేహితుడు అనూప్ తో కలసి రెండు కార్లు తీసుకుని ఎయిర్ పోర్ట్ కి వచ్చాడు. మేము వెళ్ళింది ఉగ్రవాదుల చేతుల్లో తొలిసారి అమెరికా షాక్ తిన్న తరువాత. భద్రతా ఏర్పాట్లు యెంత పటిష్టంగా వున్నా విజిటర్లని లగేజి కలెక్ట్ చేసుకునే ప్రదేశం వరకు అనుమతిస్తూనే వున్నారు. మా మనుమరాలు సఖి కూడా వెంట వచ్చింది. అందరం కలసి కారు పార్కింగ్ కు వెళ్ళాం. అదో పలు అంతస్తుల భవనం. ఒక్కో అంతస్తులో అనేక డజన్ల కార్లు పార్క్ చేసుకునే వీలుంది. మేము లిఫ్ట్ లో ఏడో అంతస్తుకు వెళ్లి కార్లలో లగేజి వేసుకుని గంట ప్రయాణం తరవాత బెల్ వ్యూ లోని సందీప్ అపార్ట్ మెంట్ కి చేరాము.

ఇంటికి చేరిన తరవాత, సూట్ కేసులు తెరిచి చూసుకుంటే, సామానులపైన, ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ ఎడ్మినిస్ట్రేషన్ వారి నోటీసు కనిపించింది.

అందులో ఇలా వుంది.

బ్యాగేజీ తనిఖీ నోటీసు:

మీకూ, మీ తోటి ప్రయాణీకులకూ భద్రత కల్పించే చర్యలలో భాగంగా మీ బ్యాగేజీని మేము క్షుణ్ణంగా తనిఖీ చేసాము. ఇందుకోసం ఎంపిక చేసిన బ్యాగేజీల్లో మీది కూడా వుంది.

నిషేధిత సామాగ్రి ఏమయినా వుందేమో తెలుసుకోవడం కోసం మీ బ్యాగేజీని మీ అనుమతి లేకుండానే తెరిచి చూసాము. తాళాలు వేసివున్నందువల్ల, గత్యంతరం లేని పరిస్థితిలో, వాటిని పగలగొట్టవలసి వచ్చింది. క్షంతవ్యులం. అయితే నిబంధనల మేరకే ఈ పని చేసాము. అందువల్ల, ఈ ప్రక్రియలో మీ బ్యాగేజీకి ఏమయినా నష్టం జరిగినా, దానికి మా పూచీ లేదు.

మీరు మరోసారి విమాన ప్రయాణం చేసినప్పుడు ఇలాటి అనుభవం పునరావృతం కాకుండా వుండాలంటే, బ్యాగేజీని ఎలా ప్యాక్ చేసుకోవాలో మీకు ముందే తెలిసివుంటే మంచిది.

www.tsa.gov వెబ్ సైట్ లో ఈ వివరాలు లభిస్తాయి. 866 289 9673 టోల్ ఫ్రీ నంబర్ కు కూడా ఫోన్ చేసి కానీ లేదా TSA -contact center@dhs.gov ఈమెయిల్ చేసి కానీ తెలుసుకోవచ్చు.”

అమెరికన్ కష్టమ్స్ అధికారులు ఆ యూనిఫారాల్లో చూడడానికి భీకరంగా కనిపిస్తారు కానీ, చాలా మర్యాదస్తులు అనిపించింది అది చదవగానే.

కింది ఫోటో:

సియాటిల్ ఎయిర్పోర్ట్ లో



(ఇంకా వుంది)

26, మే 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (168) – భండారు శ్రీనివాసరావు

 భూమంటే చేదా !

అమెరికా అనేది అవకాశాల దేశమే కాదు, వింతలు, విశేషాల దేశం కూడా.
నేను అమెరికా రావడం ఇది ఐదో సారి. మా మూడో అన్నయ్య కుమారుడు సత్య సాయి ఉంటున్న ఉడ్ స్టాక్ పట్టణంలో వాళ్ళ ఇంటికి దగ్గరలోనే హోవార్డ్ కౌంటీ కన్సర్వెన్సీ కొన్ని వందల ఎకరాల్లో విస్తరించి వుంది.
పచ్చదనం పరచుకున్న కొండలు, గుట్టలతో నిండి వుండి, తాటి ప్రమాణంలో గుబురుగా పెరిగిన చెట్ల మాటున చిన్న చిన్న కాలిబాటలు, సెలయేళ్ళు, క్రమంగా మాయమవుతున్న జాబితాలో చేరుతున్న జంతుజాలం, పాత కాలపు వ్యవసాయపు పనిముట్లు, పరికరాలు ఇవన్నీ చూస్తుంటే, పెద్దనామాత్యులు రచించిన మనుచరిత్రలోని,
‘అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్’ అనే పద్యం గుర్తుకు రాకమానదు.
ఎప్పటినుంచో నూట అరవై అయిదు సంవత్సరాలుగా ఒక కుటుంబం హక్కుభుక్తంలో వుంటూ, సామ్యుయేల్ బ్రౌన్ అనే పెద్దమనిషికి ఈ అపారమైన విలువగలిగిన ఆస్తి, తండ్రి తాతల నుంచి వంశపారంపర్యంగా లభించింది. బ్రౌన్ మహాశయుల మరణానంతరం ఆయన కుమారుడికి అది దఖలు కాగా, ఆయన చనిపోతూ మూడోవంతు భూమిని తన ఇద్దరు చెల్లెళ్లకు రాసిపోయాడు. వృత్తి రీత్యా ఉపాధ్యాయులైన రూత్ బ్రౌన్, ఫ్రాన్సెస్ బ్రౌన్ లు, వన్య, జంతు సంపదతో కూడిన, మౌంట్ ప్లెజెంట్ గా ప్రసిద్ధి చెందిన తమ సువిశాల భూసంపదను సమాజం బాగుకోసం త్యాగం చేశారు. పిల్లలకు చిన్నతనం నుంచే వన్య, జంతు ప్రాణి సంరక్షణ విషయంలో అవగాహన, ఆసక్తితోపాటు ప్రకృతి సంరక్షణ పట్ల భవిష్యత్ తరాలకు తెలియచెప్పే కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ యావత్ ఆస్తిని ఒక ట్రస్టుకు ఒప్పచెప్పారు. వందల ఎకరాల భూమిని ప్రకృతి సంరక్షణ కోసం అతి సులభంగా త్యాగం చేయడం నిజంగా గొప్ప విషయమే.
పెంపుడు పిల్లులకు, కుక్కలకు కోట్లాది డాలర్ల సంపదను వీలునామా రాసే సంపన్నుల దేశం కనుక, ఇక్కడ ఇదొక వింత కాకపోవచ్చు.
మొక్కలు, జంతువులు, పక్షులు గురించి చిన్నతనం నుంచి బోధించే ప్రత్యేక తరగతులను ఆ ట్రస్టు నిర్వహిస్తోంది. ప్రకృతి ప్రేమికులకు ప్రోత్సాహం కలిగించే అనేక కార్యక్రమాలు అక్కడ జరుగుతుంటాయి. హోవార్డ్ కౌంటీ కన్సర్వెన్సీ వేదికగా వివాహాలు చేసుకోవడానికి ప్రకృతి ఆరాధకులు ఆరాటపడుతుంటారు. అక్కడ ప్రవేశం ఉచితం. ఎవరైనా సరే పౌరులు కూరగాయలు సొంతంగా పండించుకోవాలి అనుకుంటే అందుకు కావాల్సిన భూమిని ఉచితంగా ఇస్తారు.
ఇక్కడ పాఠాలు చెప్పేవాళ్ళు, ఇతర వ్యవహారాలు చూసేవాళ్ళు అంతా జీత భత్యాలు లేకుండా వాలంటీర్లుగా పనిచేస్తున్నట్టు అనిపించింది. తిరిగి వచ్చేటప్పుడు కారు పార్కింగ్ దగ్గర ఒక వృద్ధ మహిళతో మాట్లాడాము. మిసెస్ ఆద్రే అనే ఆవిడ వయస్సు 81 సంవత్సరాలు. 2007 లో రిటైర్ అయ్యారు. భర్త చనిపోయాడు. ప్రవృత్తి రీత్యా ప్రకృతి ప్రేమికురాలు అయిన ఆవిడ తన ముదిమి వయసులో కాలక్షేపం కోసం కాకుండా, స్వచ్చందంగా సిద్ధపడి ఇక్కడ పనిచేస్తున్నారు. మేము ఇండియా నుంచి వచ్చాము అని చెబితే చాలా సంతోష పడ్డారు. చెట్లను, జంతువులను, పక్షులను భగవత్ స్వరూపాలుగా భావించే భారతీయ సంస్కృతి అంటే తనకు చాలా గౌరవమని అన్నారు. ఆవిడ అలా అంటూ వుంటే నేను సిగ్గుతో ముడుచుకు పోయాను. కారణం మీకూ తెలుసు.
హైదరాబాదు జూబిలీ హిల్స్, బంజారా హిల్స్ వంటి ప్రాంతాలలో కొన్ని వందల గజాల జాగాలో సువిశాలమైన భవంతులు నిర్మించుకున్న సంపన్న ఆసాములు, రోడ్ల వెడల్పు వంటి ప్రజోపయోగ కార్యక్రమాలకు హీనపక్షం కొద్ది అడుగుల భూమిని వదులుకోవడానికి ఇష్టంలేక, కోర్టులను ఆశ్రయించిన ఉదంతాలు తెలిసిన దేశం నుంచి వచ్చాను కనుక, ఈ సోదరీమణుల వదాన్యం వింతల్లో వింతగానే నాకు అనిపించింది.
అమెరికాలో కలిసిన మంతెన సత్యనారాయణరాజు గారు
వీరు ప్రకృతి వైద్యం రాజు గారు కాదు. అదే ఇంటిపేరు, అదే పేరు కలిగిన మరో కుర్ర రాజుగారు.
ఫ్లోరిడా స్టేట్ ఓర్లాండ్ లో గత పదిహేడు సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్న ఐ టీ నిపుణులు. మరో బాదరాయణ సంబంధం నాకు ఫేస్ బుక్ లో ఫాలోయర్. నేను అమెరికా వచ్చిన సంగతి ఈ మాధ్యమం ద్వారానే తెలుసుకుని రెండు గంటలు కారులో ప్రయాణం చేసి వచ్చి, 2024 ఆగస్టు మూడో తేదీ, శనివారం ఉదయం నన్ను కలిశారు.
తన పేరు మంతెన సత్యనారాయణ రాజు అని పరిచయం చేసుకున్నారు.
ఫేస్ బుక్ లో పేరు Satya Mantena.
సహృదయులు.
managudi.org అనే బ్లాగ్ నడుపుతున్నారు. తెలుగునాట వున్న అన్ని చిన్నా పెద్ద దేవాలయాలు, వాటి ఆస్తిపాస్తులు మొదలయిన సమస్త వివరాలను కష్టపడి సేకరించి ఒకే చోట పదిలపరుస్తున్నారు
వారి కృషి అభినందనీయం.
లికింగ్ ఆఫ్ వర్రీ
నాకు ఇంగ్లీష్ గొప్పగా రాదు అని తెలుసు కానీ, అమెరికాలో నా మేనల్లుడు రామచంద్రం కుమారుడు కాశ్యప్ కలిసి చెప్పేవరకు, నా ఇంగ్లీష్ నాలెడ్జ్ ఇంత గొప్పగా వుంది అని నాకు తెలవదు.
' మామయ్యా! (నిజానికి తాత వరస, ఏదో మర్యాద కోసం మామయ్య అంటుంటారు) నేను నీ ఫేస్ బుక్ ఫాలోవర్ ను '
నేను గర్వంగా తల ఎగరేసే లోగా వాక్యం పూర్తి చేశాడు ఇలా.
' నువ్వు రాసిన Licking of worry పోస్టు చదివాను '
పైకి లేస్తున్న నా తల నేలకు వాలిపోయింది, నేను ఇంత దరిద్రపు అర్థం పర్థం లేని ఇంగ్లీష్ ఎలా రాయగలిగాను అనే ఆలోచనతో తల బద్దలు కొట్టుకున్నాక అసలు విషయం బోధపడి నవ్వుకున్నాము.
నేను ఆ పోస్టుకు పెట్టిన శీర్షిక 'నాకేల చింత? '
గూగులమ్మ ఎంచక్కా ''నాకేల” అనే పదాన్ని 'నాకడం' అనే కోణంలో అర్థం చేసుకుని, 'Licking of Worry ' అనే సరి కొత్త అనువాదాన్ని పరిచయం చేసింది.
మాయా బజార్ సినిమాలో పింగళి గారి డైలాగ్ గుర్తుకు వచ్చింది.
కొత్త పదాలు, కొత్త భాషలు ఇలాగే పుడతాయి కాబోలు.
అంచేత మీలో ఎవ్వరికైనా నా పోస్టులు ఇలా ఇంగ్లీషులో కనబడితే, అంతటి ఆంగ్ల భాషా ప్రావీణ్యం నాకు లేదని అర్థం చేసుకోమని నా మనవి. అలాగే, See Original ద్వారా తెలుగులో నేను రాసిన అసలు పోస్టు చదువుకోవచ్చని ఒక మిత్రుని ద్వారా కలిగిన అవగాహనను మీతో పంచుకుంటున్నాను.
కింది ఫోటోలు:
ఉడ్ స్టాక్ నగరంలో హోవార్డ్ కౌంటీ కన్సర్వెన్సీ
మంతెన సత్యనారాయణ రాజు గారు, నేను,
(ఇంకావుంది)
All reactions:
2
Like
Comment
Share
Facebook