14, మార్చి 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (114) – భండారు శ్రీనివాసరావు

 అదిగో నవలోకం


మన దేశంలో ఎంత మారు మూల పల్లెటూరికి వెళ్ళినా హోటల్ అన్న పదం విననివాడు, తెలియనివాడు వుండడు. కానీ ప్రపంచంలోని రెండు అగ్రరాజ్యాలలో ఒకటయిన సోవియట్ యూనియన్ రాజధాని మాస్కోలో, ఆ రోజుల్లో 'హోటల్' అంటే తెలియని వాళ్ళు కోకొల్లలు. అంటే మాస్కోలో హోటల్స్ లేవని కాదు. హోటల్ అనే ఇంగ్లీష్ పదం కూడా వారికి తెలియదన్న మాట.   అదేమిటో గాని రష్యన్ తప్ప మరొక భాష వారికి అర్ధం అయ్యేది కాదు. ఒకసారి రాయపాటి సాంబశివరావు గారు వచ్చి మాస్కోలోని ఇంటర్నేషనల్ హోటల్ లో బస చేశారు.



 
అక్కడికి వెళ్లాలని ఎంతో మంది  టాక్సీ డ్రైవర్ లను అడిగి చూసినా ప్రయోజనం లేకపోయింది. ఇంటర్నేషనల్ హోటల్ అంటే ఎవరికీ అర్ధం కాలేదు. రష్యన్లో హోటల్ ని గస్తనీచ్చ అంటారు. మేజ్దురోద్నయా గస్తనీచ్చ (ఇంటర్ నేషనల్ హోటల్) అని నాలుకను మూడు మడతలు చుట్టి అడిగితే  కాని అర్ధం కాని పరిస్తితి. మిల్క్(పాలు), బటర్ మిల్క్ (మజ్జిగ) స్కూలు, రోడ్డు, స్ట్రీటు (వీధి), వంటి ఇంగ్లీష్ పదాలు సయితం వారికి తెలియవు. ఒక్క మెట్రో తప్ప.


మెట్రో ప్రసక్తి లేకుండా మాస్కో గురించి చెప్పడం అంటే రాముడు లేని రామాయణాన్ని పారాయణ చేయడమే.
మాస్కో వీదుల్లో సంచరిస్తున్నప్పుడు,
రోడ్లపై ట్రాముల్లో, సిటీ బస్సుల్లో, ట్రాలీ బస్సుల్లో (కరెంటుతో నడిచే బస్సులు) తిరుగుతున్నప్పుడు,
ఎత్తయిన ఆకాశ హర్మ్యాలవైపు మెడలు రిక్కించి చూస్తున్నప్పుడు,
మన కాళ్ళ కింద, భూమి అడుగున, వందల సంఖ్యలో మెట్రో రైళ్ళు సొరంగ మార్గాల ద్వారా అతివేగంగా ప్రయాణిస్తూ ఉంటాయని చెబితే,
మాస్కో మెట్రో గురించి తెలియని వాళ్ళు ఒక పట్టాన నమ్మడం కష్టం.

  అద్భుతమయిన ఇంజినీరింగ్ కౌశల్యాన్ని,  అధునాతన  సాంకేతిక పరిజ్ఞానం అంతగా అందుబాటులో లేని రోజుల్లోనే రష్యన్ ఇంజినీర్లు  ప్రదర్శించిన తీరు అమోఘం. మాస్కో మెట్రోలో మరో వెసులుబాటు ఏమిటంటే , ఒక రైలు వెనుకనే మరో రైలు వెంట వెంటనే వస్తుంటుంది కాబట్టి తొక్కిసలాటలకు, తోపులాటలకు ఆస్కారం తక్కువ. రైలు వచ్చి ప్లాటుఫారంపై ఆగగానే తలుపులు తెరుచుకోవడం,  దిగేవాళ్ళు ఒక పక్క నుంచి దిగుతుండగానే మరో పక్కనుంచి ఎక్కేవాళ్ళు ఎక్కడం,  తలుపులు మూసుకోవడం,  రైలు కదిలిపోవడం అంతా క్షణాలలో నిశ్శబ్దంగా జరిగిపోతూ వుంటుంది. రైలు ఒక స్టేషన్ దాటగానే వచ్చేది పలానా స్టేషన్   అని ముందుగానే  పబ్లిక్ అడ్రసు సిష్టం ద్వారా అనౌన్స్ చేస్తుంటారు. అలాగే డోర్లు తెరుచుకుంటున్నాయి, డోర్లు మూసుకుంటున్నాయని కూడా   ప్రయాణీకులను  హెచ్చరిస్తూ  వుంటారు. సరే ఇప్పుడు ఇవన్నీ హైదరాబాదు వాసులకు కూడా అందుబాటులోకి వచ్చాయి అనుకోండి. కానీ నలభయ్ ఏళ్ళ క్రితం వెళ్ళిన మాకు విడ్డూరంగానే వుండేది.

 అన్ని లక్షలమంది ప్రయాణాలు చేస్తున్నా,  ప్లాటుఫారాలన్నీ కడిగిన అద్దంలా మెరిసిపోతూవుంటాయి. ఒక స్టేషనుకు మరో స్టేషనుకు పోలిక లేకుండా,  రష్యాలోని వివిధ జాతుల సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఒక్కొక్క మెట్రో స్టేషనును ఒక్కో మ్యూజియంగా తీర్చిదిద్దారు.


సోవియట్ యూనియన్ ఏర్పడడానికి పూర్వమే, జార్ చక్రవర్తుల కాలంలోనే, మెట్రో నిర్మాణం గురించి ప్రతిపాదనలు సిద్దంచేశారని చెబుతారు. అయితే ఈ లోగానే, కామ్రేడ్ లెనిన్ నాయకత్వంలో మొట్టమొదటి సోవియట్ వ్యవస్థ  నిర్మాణం జరిగిన తరవాత,  ఆనాటి ప్రాదాన్యతలనుబట్టి, మెట్రో నిర్మాణ ప్రతిపాదనలు కొంత వెనుకపడ్డాయి. 1935  లో తొలి మెట్రో రైలు మాస్కో భూగర్భంలో పరుగులు తీసింది. 13  కిలోమీటర్లతో మొదలయిన మెట్రో క్రమంగా విస్తరించి ౩౦౦ కిలోమీటర్ల   పరిధిలో 180  స్టేషన్లకు పెరిగింది. పనిదినాలలో, సగటున రోజూ 70  లక్షలమంది మెట్రో రైళ్ళలో ప్రయాణిస్తుంటారు. రద్దీ టైములో 90  సెకన్ల కొకటి చొప్పున మెట్రో రైలు ప్రయాణీకులకు అందుబాటులో వుంటుంది. 1935  లో 50  కోపెక్కులతో మొదలయిన  మెట్రో టిక్కెట్టు ధరను 1961  లో అయిదు కోపెక్కులకు తగ్గించారు. అంటే ఐదు పైసల (కోపెక్కుల) నాణెం,  మెట్రో స్టేషన్ ప్రవేశ ద్వారం దగ్గరవున్న స్లాటులో వేసి లోనికి ప్రవేశిస్తే చాలు,  ఎటునుంచి ఎటువైపయినా, ఎన్నిసార్లయినా సరే, స్టేషన్లతో నిమిత్తం లేకుండా ఎంతదూరం అయినా ఎంత   ప్రయాణం చేయవచ్చు. మళ్ళీ తర్వాత ముప్పయ్ ఏళ్ళవరకు మాస్కో మెట్రో టికెట్ ధరను ఒక్క పైసా కూడా పెంచలేదు.

నగరం నలువైపులకు వెళ్ళే రైలు మార్గాలను కలుపుతూ వృత్తాకారంలో మరో మార్గాన్ని నిర్మించారు. అందువల్ల,  అనేక వైపులకు ప్రయాణాలు చేసేవారు కూడా భూగర్భంలో ఒక స్టేషన్ నుంచి మరో స్టేషనుకు ఎస్కలేటర్ల ద్వారా వెళ్లి,  రైళ్ళు మారుతూ తమ గమ్యాలను చేరుకోవచ్చు. అంటేభూగర్భంలోనే రైల్వే జంక్షన్లు నిర్మించారన్న మాట. ఒక సొరంగ మార్గంలో రైలు వెడుతుంటే, దానికి కిందా పైనా వున్న మార్గాలలో మరికొన్ని రైళ్ళు  తిరుగుతూవుంటాయి.

మాస్కోని సందర్శించే విదేశీ అధినాయకులు, అతిధులు సయితం, తమకు సమకూర్చిన అతి పెద్ద చైకా కార్లను పక్కన పెట్టేసి, మెట్రో ప్రయాణం పట్ల ఆసక్తి చూపుతారంటే మాస్కో మెట్రో ప్రశస్తి అర్ధం చేసుకోవచ్చు.

కింది ఫోటోలు:

భూగర్భంలో నిర్మించిన కొన్ని మెట్రో స్టేషన్ల ప్లాట్ ఫారాల వైభవం










(ఇంకా వుంది)

13, మార్చి 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (113) – భండారు శ్రీనివాసరావు

 

టైముకు ఆఫీసుకు రావాలా! టైముకు పని జరగాలా!

నాకు రెండోదే కరక్టు అనిపిస్తుంది. మాస్కో రేడియో వాళ్ళు కూడా నా పద్దతికే అలవాటు పడ్డారు. ఎంత లేటుగా వచ్చినా, అంత త్వరగా అనువాదం పూర్తి చేసి కరక్టు సమయానికి వార్తల ప్రసారం జరిగేలా చూస్తాడు అనే నమ్మకం నా మీద కుదరడానికి వాళ్లకి ఎక్కువ కాలం పట్టలేదు. డెబ్బయ్యవ దశకంలో బెజవాడ ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్ గా చేసిన అనువాదాల అనుభవం, హైదరాబాదు ఆకాశవాణిలో వార్తాపఠనం, వార్తావాహిని, జీవన స్రవంతి కార్యక్రమాల నిర్వహణానుభవం  మాస్కోలో అక్కరకు వచ్చింది.  అంచేత నా రాకపోకల సమయాలను  గురించి వాళ్లకు మొదట్లో వున్న భయసందేహాలు తొలగిపోయాయి.

వార్తల సమయానికి గంట ముందు వెళ్ళడం, గంటలో అనువాదం పూర్తి చేసి అరగంటలో వార్తలు చదివేయడం, మళ్ళీ భోజనం సమయానికి ఇంటికి చేరడం ఇదీ నా దినచర్య.

క్రమంగా అందరితో కలిసి వెళ్ళడం తగ్గించి ఒంటరిగా వెళ్ళడం అలవాటు చేసుకున్నాను. దీనికి కారణం నా భోజనపు అలవాట్లు. ఆఫీసు కేంటీన్ చాలా చౌక అని ఒకసారి మళయాళం  న్యూస్ రీడర్ దాసన్ తీసుకువెళ్లాడు. వంద మందికి పైగా ఒకేసారి కూర్చుని భోజనాలు చేసే ఏర్పాట్లు వున్నాయి. దాదాపు పాతిక రకాల పదార్ధాలు. దానికి తగ్గట్టుగా పెద్ద పెద్ద పళ్ళాలు. చికెన్, మటన్, బీఫ్  ఇలా అనేక రకాల మాంసాహార వంటకాలు. వెజిటేరియన్లకు పలురకాల  బ్రెడ్స్, పండ్లు. ఐస్ క్రీములు, టీలు. (సమావర్ అని పెద్ద సైజు నీళ్ళ బాయిలర్ల వంటివి. వాటిల్లో తేయాకు వేసిన నీళ్ళు ఎప్పుడూ కాగుతుంటాయి. ఇవి కేంటీన్ల లోనే కాదు, ప్రతి అంతస్తులో వుంటాయి. టీ తాగాలని అనుకున్న వాళ్ళు వెళ్లి తాగవచ్చు. పైగా వీటిని అనేక రకాల సైజుల్లో, అనేక రకాల లోహాలతో, పింగాణీతో తయారుచేసి సూవెనీర్లుగా అమ్ముతారు. రష్యన్ సంస్కృతిలో ఈ సమావర్లు ఒక భాగం)  ఈ కేంటీన్ లో  ఎన్నితిన్నా,  ఎన్నిసార్లు తిన్నా యాభయ్ కోపెక్కులు కంటే ఎక్కువ ఖర్చు కాదు. చాలామంది ఇళ్ళల్లో వంటకు బద్దకించేవారు ఇళ్లకు పట్టుకుపోయేవారు. అక్కడ ఎన్నివున్నా నేను తినగలిగినది నాకు ఒక్కటీ కనిపించలేదు. యాపిల్ పళ్ళు వంటివి కనిపించినా తినాలని అనిపించేది కాదు.  దాంతో అక్కడికి వెళ్ళడం మానుకున్నాను.

కొన్నాళ్ళు మెట్రో.  కొన్నాళ్ళు ట్రాము. మెట్రో అయితే సరిగ్గా పద్నాలుగు నిమిషాలు అంటే పద్నాలుగు నిమిషాలు. ఒక నిమిషం ఎక్కువాకాడు, ఒక నిమిషం తక్కువాకాదు. నేనున్న అయిదేళ్లు ఇదే వరస. అంత ఖచ్చితంగా నడిచేవి మెట్రో రైళ్లు.  పొతే, ట్రాములో  ప్రయాణం దాదాపు నలభయ్ నిమిషాలు పట్టేది. ఎందుకంటే, అది కరెంటుతో నడిచినా రోడ్డు మీద ప్రయాణం. ట్రాఫిక్ సిగ్నల్స్ దాటుకుంటూ వెళ్ళాలి. పైగా అదే రోడ్డు మీద మిగిలిన వాహనాలు కూడా వెడుతుంటాయి.  మెట్రో భూగర్భం మార్గం కనుక మధ్యలో స్టేషన్లు మినహా ఏదీ కనపడదు. అదే ట్రాము అయితే ఎంచక్కా ఊరు చూసుకుంటూ వెళ్ళవచ్చు. ఇంటికి కాస్త దగ్గర్లో ట్రాము ఎక్కితే అది నేరుగా మాస్కో రేడియో స్టేషన్ దగ్గర దింపేది. అదీ కాక ఇండియన్ ఎంబసీ నుంచి వార్తా పత్రికలు తెచ్చుకోవడానికి, మధ్యలో చదువుకోవడానికి ట్రాము ప్రయాణం అనుకూలం. పైగా రెంటికీ పాసు ఒక్కటే.

అన్ని రోజులు ఒకలాగా వుండవు కదా! ఒకరోజు ట్రాము ఎక్కి  దర్జాగా కూర్చున్నాను, కోటు బొత్తాములు  సదురుకుంటూ. ఒక గంట ప్రయాణం తర్వాత ఆగింది. ఎప్పుడూ లేనిది ఇదేమిటి ఇంత ఆలస్యం అనుకుంటూ దిగాను. చూస్తే ఎక్కడ ఎక్కానో అక్కడే వున్నాను. ఇదేమిట్రా బాబూ అనుకుంటూ మరో ట్రాము ఎక్కాను. మళ్ళీ గుండ్రంగా తిరిగి ఎక్కిన చోటుకే వచ్చి ఆగింది. ఆ రోజు కారణం తెలియదు కానీ అది బయలుదేరిన చోటు నుంచి కొంత దూరం పోయి మళ్ళీ బయలుదేరిన చోటుకే వస్తున్నాయి. ఈ సంగతి నాకు తెలియదు. అడగడానికి నాకు, చెప్పడానికి ఎవరికీ భాష తెలియదు.  ఇక ఇది పని కాదనుకుని పబ్లిక్ ఫోను నుంచి ఒక రెండు పైసల (కోపెక్కుల ) నాణెం  వేసి మా ఆవిడకు విషయం చెప్పాను. ‘మీరున్న చోటుకు దగ్గర్లో శ్రీధర్ కుమార్ (ఇండియన్  ఎంబసీలో పనిచేసే తెలుగు ఉద్యోగి) ఇల్లు వుంది, ముందు అక్కడికి వెళ్ళండి’ అని  సలహా ఇచ్చింది. టెలిఫోన్ బూత్ లోకి వెళ్ళే ముందు నెంబరు  డయల్ చేయడానికి చేతికి ఉన్న ఉన్ని గ్లౌసులు తీసి వేసుకోవడం  మరిచి పోయినట్టు వున్నాను, బయటకి రాగానే  క్షణాల్లో వేళ్ళు కొంకర్లు పోయాయి. రాతి వేళ్ళలా మారిపోయిన చేతులకు  మళ్ళీ గ్లౌస్ వేసుకోవడం కుదరలేదు. క్రమంగా చలి,  గడ్డ కట్టిన చేతుల నుంచి వెన్నెముకకు పాకుతున్న ఫీలింగు. ఎంతో ఆందోళనతో ఒక్క పెట్టున వురుక్కుంటూ వెళ్లి శ్రీధర్ కుమార్ ఇంటి తలుపు తట్టాను. అప్పటికే మా ఆవిడ ఫోను చేసి చెప్పినట్టు వుంది, శ్రీధర్ కుమార్ భార్య శ్రీమతి విశాల గారు రెడీగా తయారుచేసి ఉంచిన వేడి వేడి కాఫీ తాగిన తర్వాత కానీ కుదుట పడలేకపోయాను. కాసేపు అక్కడే కూర్చుని తేరుకున్న తర్వాత,  వాళ్ళింటికి  దగ్గరలో వున్న మెట్రో స్టేషన్ నుంచి ఆఫీసుకు వెళ్లాను. వెళ్లి నా రష్యన్ సహచర ఉద్యోగి గీర్మన్ తో పడ్డ  కష్టాలు చెప్పుకుంటే (అతడికి కొద్ది మాత్రం తెలుగు తెలుసు) ‘అయ్యో! ఎందుకు అంత ఇబ్బంది పడి వచ్చారు, ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోకపోయారా’ అన్నాడు. మరి ఆఫీసు పని, రేడియో వార్తలు వాటి సంగతేమిటని అడిగితే గీర్మన్ ఇచ్చిన సమాధానం నన్ను  మాస్కో చలికన్నా మరింత నిశ్చేష్టుడిని చేసింది.

‘భలే వాళ్ళే! నిన్నటి వార్తలు రికార్డు చేశాము కదా! వాటినే రిప్లే చేసేవాళ్ళం’.  

ఇక రెండో సంఘటన ఏకంగా మా  ఇంట్లోనే జరిగింది.

ముందు గొయ్యి వెనుక నుయ్యి అనే సామెత ఒక రోజు మాకు అనుభవంలోకి వచ్చింది. ఆ రాత్రి మేము భోజనం చేసి టీవీలో మహాభారతం కేసెట్ వేసుకుని చూస్తుంటే,  పై అంతస్తులో వున్న జస్వంత్ సింగు గారి భార్య ఫోను చేసి ఓ కబురు చెవిలో వేసింది. వినగానే ఎగిరి గంతు వేయాల్సిన విషయం కాదు కానీ నిజంగానే  ఇంటినుంచి గంతు వేయాల్సి వచ్చింది. ఇంతకీ  ఆవిడ అందించిన సమాచారం ఏమిటంటే,  రేడియో మాస్కో భవనం అంటే మేముంటున్న అపార్ట్ మెంటులో అగ్నిప్రమాదం జరిగిందట. మంటలను ఆర్పేందుకు సిబ్బంది వచ్చారట. పైకి నిచ్చెనల మీదుగా వచ్చి కిటికీ తలుపు మీద కొట్టినప్పుడు వాటిని తీస్తే,  మమ్మల్నిజాగ్రత్తగా  కిందకు దింపుతారట. ఇదెక్కడి గోలరా అనుకుంటూ ఆదరాబాదరాగా పిల్లల్ని లేపుతుంటే మళ్ళీ ఫోను. ‘కంగారులో వున్నపలాన  కిందికి  దిగేయకండి. బయట గడ్డకట్టే చలి. వీధిలోకి పోయేటప్పుడు యెలా వెడతామో ఆ మాదిరిగా  అన్ని ఉన్ని దుస్తులు   వేసుకునికోట్లూ టోపీలు ధరించి   సిద్ధంగా వుండండని’  మరో హెచ్చరిక.
ఒకవైపు నిప్పంటుకున్నదని భయపడాలా! లేక పెళ్ళికి వెడుతున్నట్టు తయారు కావాలా!

ఏదయితేనేం భయపడ్దంత ఏమీ జరగలేదు. ఆ భవనంలో ఎక్కడో ఏదో చిన్నపాటి అగ్గి రాజుకుని పొగ రావడందాన్ని పసికట్టిన అలారం దగ్గర్లో వున్న  ఫైర్ స్టేషన్లో మోగడంవాళ్లు హడావిడిగా  రావడం జరిగింది. బహుశా అప్పుడప్పుడలా వూహించని  దుర్ఘటనలు సంభవిస్తే, యెలా సంసిద్ధంగా వుండాలో పౌరులకు నేర్పే ప్రక్రియలో భాగంగా అలా చేసారో ఏమిటో తెలియదు.
ఆ రోజు ఏమీ జరక్కపోయినా మాస్కో జీవితంలో మరో కోణం మాకు దృగ్గోచరమయింది. పౌరుల ప్రాణాల పట్ల తీసుకుంటున్న శ్రద్ధ ఈ సంఘటన రూపంలో మరోమారు ఆవిష్కృతమైంది. ఆవిష్కృతమయింది.

 


రెండు జ్ఞాపికలు 
రష్యన్  పింగాణీ సమావర్ 
వెనుక మా ఆవిడ ఫోటో  






(ఇంకావుంది)

అయాం ఎ బిగ్ జీరో (112) – భండారు శ్రీనివాసరావు

 గోర్భచేవ్ నుంచి ఫోన్

ఒకరోజు రేడియో స్టేషన్ కు వెళ్ళడానికి తయారవుతున్నాను. ఇంతలో గోర్భచేవ్ నుంచి ఫోన్.

దీనికి ముందు హైదరాబాదులో ఒక జర్నలిష్ట్  మితృడి గురించి చెప్పాలి. జర్నలిష్ట్ అంటే అతడేదో పత్రికల్లో పనిచేసే జర్నలిస్ట్ కాదు. ఒక తరం జర్నలిష్టులందరికి అతడు మంచి స్నేహితుడు. ఒక ప్రసిద్ధ సంస్థలో పౌరసంబంధాల అధికారిగా  పనిచేస్తున్నాడు. మృదుస్వభావి. అందరితో మంచిగా వుండడం ఎలాగో అతడిని నుంచి తెలుసుకోవాలి.  పేరు మురారి. ఎందుకో ఏమిటో తెలియదు కానీ,  నేను అతడిని సరదాగా గోర్భచేవ్ అని పిలిచేవాడిని. మా ఇంటిల్లిపాదికి తెలిసిన వ్యక్తి.

అందువల్ల మురారి నుంచి ఫోన్ రాగానే నేను సంతోషపడ్డాను. తన పెద్ద బాసు బీవీ రావు (బండ వాసుదేవరావు) గారు వ్యాపారపు పనుల మీద మాస్కో వస్తున్నారని, అంచేత కష్టం అనుకోకుండా ఎయిర్ పోర్టుకి వెళ్లి రిసీవ్ చేసుకోమని మురారి కోరాడు. కాస్త కనిపెట్టుకుని చూడమని ఆర్డర్ లాంటి విన్నపం జోడించాడు. వెంటనే గీర్మన్ కు ఫోన్ చేసి ఇవ్వాళ ఆఫీసుకు రావడం లేదని చెప్పేసి, టాక్సీలో నేరుగా షెర్మేతోవా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు వెళ్లాను.

బీవీ రావు గారంటే ఆషామాషీ కాదు. రాష్ట్రంలో కోళ్ళ పెంపకాన్ని ఓ పరిశ్రమగా తీర్చిదిద్ది, కోడిగుడ్డుకు జాతీయ ఖ్యాతి, అంతర్జాతీయ ప్రాచుర్యం కల్పించిన  వెంకటేశ్వరా హేచరీస్ అధినేత. కష్టపడి జీవితంలో పైకి వచ్చినవారు. సామాన్యుడిగా జన్మించి మాన్యుడిగా ఎదిగిన వ్యక్తి. పద్మశ్రీ అవార్డు గ్రహీత.  హైదరాబాదులో రేడియో విలేకరిగా నాకూ ఆయనతో పరిచయం వుంది.   

విమానం అనుకున్న టైముకే వచ్చింది. రావుగారు త్వరగానే బయటకు వచ్చారు. తెలిసిన మనిషే కనుక నేను తేలిగ్గానే గుర్తుపట్టాను. సూటు, బూటు,  లాంగ్ కోటులో  వచ్చిన నన్ను ఆయన గుర్తుపట్టే అవకాశం లేదు కాబట్టి నేనే దగ్గరికి వెళ్లి పలానా అని పరిచయం చేసుకున్నాను.  మురారి ఫోను చేసి చెప్పాడు కనుక వచ్చానని తెలుగులో చెప్పాను. దేశం కాని దేశంలో తెలిసిన మనిషి కనిపించి తెలుగులో పలకరిస్తే  పులకరించిపోవడం సహజం. కానీ ఆయన  ప్రవర్తన ఎందుకో ఏమిటో పూర్తిగా విరుద్ధంగా వున్నట్టు అనిపించింది. ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి సోవియట్ ఉన్నతాధికారులు వచ్చినట్టు అక్కడి వాతావరణం చూడగానే అర్ధం అయింది. బహుశా సోవియట్ ప్రభుత్వ అతిధిగా వచ్చి వుంటారు. అందుకే బయట చైకా కారు (యద్దనపూడి సులోచనారాణి నవలల్లో ప్రస్తావించే ఆరడుగుల పొడవైన కారులా చాలా పెద్దగా వుంటుంది) ఆయన కోసం  ఎదురు చూస్తోందన్నమాట. సోవియట్ అధికారుల నడుమ చకచకా నడుచుకుంటూ వెడుతున్న ఆయన్ని సమీపించి, నా విజిటింగ్ కార్డు చేతిలో పెట్టి, ఏదైనా అవసరం వుంటే ఫోన్ చెయ్యండి అని చెప్పేసి అంతే వేగంగా వెనుతిరిగి మళ్ళీ టాక్సీలో సరాసరి ఆఫీసుకు వెళ్ళిపోయాను. రానని చెప్పినవాడిని ఎందుకు వచ్చానో అర్ధం కాక గీర్మన్ ఆశ్చర్యపోయాడు. కానీ నేను మాత్రం మనసులో కుతకుతలాడిపోతున్నాను. పనిమానుకుని, వేళకాని వేళలో యాభయ్ కిలోమీటర్లు టాక్సీలో పడి చచ్చీచెడీ పనికట్టుకుని ఎయిర్ పోర్టుకు వెడితే, పట్టుమని పది నిమిషాలు కూడా పట్టించుకోకుండా పొడిపొడిగా మాట్లాడి వెళ్ళిన ఆ పెద్ద మనిషి వ్యవహారం నాకు సుతరామూ కొరుకుడు పడలేదు. కాసేపటికి నాకు నేనే కుదుటపడ్డాను. ఎంతయినా రావుగారు ప్రభుత్వ అతిధి. అతి పెద్ద హోటల్లో బస ఏర్పాటు చేస్తారు. అతి పెద్ద కారులో తిప్పుతారు. అన్నపానీయాలతో సహా సమస్త అవసరాలను రష్యన్ అధికారులే దగ్గరుండి కనుక్కుంటారు. అలాంటి పెద్ద మనిషికి నేను చేసే సాయం ఏముంటుంది కనుక. తమ చైర్మన్ కనుక మర్యాదకు మురారి ఫోన్ చేసి ఉంటాడు. ఇలా అనుకుని సమాధానపడ్డ తరవాత మనసు కుదుట పడింది.

రెండు రోజులు గడిచాయి. ఓ సాయంత్రం ఇంట్లో ఫోను మోగింది. అవతల రావుగారు. స్వరం చాలా మృదువుగా, చాలా పెద్దరికంగా వుంది.

‘ఈరోజు మీ ఇంటికి వద్దామనుకుంటున్నాను. మీకు వీలుంటుందా, వుంటే చెప్పండి. నా దగ్గర వాహనం వుంది. ఎక్కువసేపు గడిపే అవకాశం ఉండకపోవచ్చు. లైట్ గా భోంచేసి వెళ్ళిపోతాను. ప్రత్యేక ఏర్పాట్లు వద్దు. అన్నం, పెరుగు వుంటే చాలు’ అన్నారాయన చాలా మర్యాదగా. కానీ నాకింకా కోపం పచ్చిగానే వుంది. మనసులో ఏదో మూల అసహనం. అంత పనికట్టుకుని ఎయిర్ పోర్ట్ కి వెడితే నన్ను ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిన మనిషి. ఆయనతో మర్యాద ఏమిటి?

‘హోటల్ అడ్రసు చెప్పండి, మా అబ్బాయిని పంపిస్తాను’ అన్నాను ముక్తసరిగా. మావాడు హోటల్ కు వెళ్లి, పెద్ద చైకా కారులో రావుగారిని ఇంటికి తీసుకువచ్చాడు. ప్రభుత్వ అతిధి కాబట్టి వెంట సెక్యూరిటి వుంది.

మాస్కోలో ఉన్న తెలుగు కుటుంబాలలో ఓ పద్దతి పెట్టుకుని పాటిస్తూ వస్తున్నాము. మన వైపు నుంచి ఎవరు ఎవరింటికి వచ్చినా తెలుగు కుటుంబాలను అన్నింటినీ భోజనాలకు పిలుస్తాము. అలాగే మా పిలుపు అందుకుని  అందరూ వచ్చారు.

మా ఇంట్లో సందడి చూసి రావుగారు ముందు ఖంగు తిన్నారు. అంత హడావిడి ఆయనకు నచ్చినట్టు లేదు. ఇదంతా ఇక్కడ మామూలు అన్న సంగతి నేనూ ఆయనకు ముందు చెప్పలేదు. ఒక రకంగా నాదే పొరబాటు.

అందరి పరిచయాలు అయిన తర్వాత అతిధి మర్యాదలు మాస్కో పద్దతుల ప్రకారం మొదలయ్యాయి.  మగవాళ్ళ చేతుల్లో గ్లాసులు, ఆడవాళ్ళు వాళ్ళ మాటల్లో ఉండగానే రావు గారు వంట గది వైపు వెళ్ళారు. మరునాడు మా ఆవిడ చెబితే తెలిసింది. సరాసరి వంటింట్లో ఉన్న మా ఆవిడ వద్దకు వెళ్లి, ‘అమ్మా! ఇక్కడ చూస్తుంటే బాగా ఆలస్యం అయ్యేట్టు వుంది. నాకు పెందలకడే భోజనం చేయడం అలవాటు. చెబుదామంటే మీ ఆయనకు ముక్కు మీద కోపం. అంచేత నువ్వు ఏమీ అనుకోకుండా ఈ లోపల నాకింత పెరుగన్నం ప్లేటులో పెట్టిస్తే ఇక్కడే తినేసి వెళ్లి వాళ్ళతో కూర్చుంటాను’ అన్నారట. అన్నట్టే, అక్కడే నిలబడి గోంగూర, ఆవకాయ పచ్చళ్ళు వేసుకుని పెరుగన్నంతో తృప్తిగా తిని, ‘అన్నదాతా! సుఖీభవ’ అని ఆశీర్వదించారట.

రావుగారు వెడుతూ వెడుతూ మా పిల్లలతో చెప్పి వెళ్ళారు, పూణేలో తమకు పెద్ద ఫాం హౌస్, స్టడ్ ఫాం (మేలు జాతి గుర్రాలను పెంచే ప్రదేశం) వున్నాయనీ, ఇండియా వచ్చినప్పుడు నాలుగు రోజులు అక్కడ వుండి వెళ్లాలనీ.

వెళ్ళామా లేదా అనేది కాదు, అంత పెద్ద మనిషి పెద్దమనసుతో చెప్పడమే గొప్ప అని మేమనుకున్నాము.

మేము హైదరాబాదు తిరిగివచ్చిన తరువాత కొన్నేళ్ళకు బీవీ రావు గారు చనిపోయిన విషయం మురారి ఫోన్ చేసి చెప్పాడు. మెహిదీపట్నం పోయే దోవలో  బంజారా హిల్స్ లో ఒక ఫంక్షన్ హాలులో జరిగిన సంస్మరణ సమావేశానికి వెళ్లాను. చాలామంది ప్రముఖులు హాజరయ్యారు.

రావు గారు పుణే నగరానికి అరవై కిలోమీటర్ల దూరంలో బాలాజీ దేవాలయం ఇరవై ఏడు కోట్ల రూపాయలతో నిర్మించారు. మా రెండో వాడు సంతోష్ పుణే లో ఉద్యోగం చేస్తున్నప్పుడు నన్నూ, మా ఆవిడను ఆ దేవాలయానికి తీసుకువెళ్లాడు. అచ్చుగుద్దినట్టు తిరుమల దేవాలయం మాదిరిగానే వుంది. వెంకటేశ్వర ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించారు. ఆలయ ప్రాకారం,  గర్భగుడి, మూల విరాట్ అచ్చం తిరుపతి గుడిని తలపించేవిగా వున్నాయి. 

కింది ఫోటోలు:


మాస్కోలో ఇంటి నుంచి ఫోన్ మాట్లాడుతూ నేను


వెంకటేశ్వర హేచరీస్ చైర్మన్ శ్రీ బీవీ రావు




 

(ఇంకా వుంది)                                          

12, మార్చి 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (111) – భండారు శ్రీనివాసరావు

 పిలవకుండానే పలికే డాక్టర్లు.


ఉదయం పది గంటలు దాటుతోంది. పిల్లలు స్కూలుకు వెళ్ళారు. మా ఆవిడతో కలసి హిందీ రామాయణం కొత్త ఎపిసోడు కాసెట్ చూస్తున్నాము. ఇంతలో డోర్ బెల్ మోగింది. తలుపు తెరిచి చూస్తే నలుగురయిదుగురు రష్యన్లు. 'దోం  సెం దేసిత్  జేవిచ్ పజాలుస్తా' అందులో ఒకతను అంటున్నాడు. పజాలుస్తా (ఇంగ్లీష్ లో ప్లీజ్ ) అన్న పదం తప్ప ఏమీ అర్ధం కాలేదు. తొంగి చూస్తే వారి వెనుక ఒక చక్రాల కుర్చీ కనిపించింది. ఒక్క క్షణం కేజీబీ వాళ్ళేమోనన్న అనుమానం మనసులో మెదిలింది. వాళ్ళను లోపలకు రమ్మని సైగ చేసాను. కూర్చోమన్న నా అభ్యర్ధనను పట్టించుకోకుండా ఇంట్లో ఇంకా ఎవరయినా వున్నారా అన్నట్టుగా కలయచూస్తున్నారు. సమయానికి పిల్లలు కూడా లేకపోవడంతో,  మా ఆవిడ పై అంతస్తులో వుండే జస్వంత్ సింగ్ భార్యను పిలుచుకుని వచ్చింది. ఆ కుటుంబం చాలా ఏళ్ళుగా మాస్కోలో వుంటున్నారు కాబట్టి రష్యన్ బాగా వచ్చు. ఆవిడ వాళ్ళతో మాట్లాడి హిందీలో మళ్ళీ మాకు చెప్పినదాన్నిబట్టి అర్ధం అయింది ఏమిటంటే, ఆ వచ్చిన వాళ్ళు డాక్టర్లు. మా ఇంట్లో ఎవరికో బాగా లేదని వారికి సమాచారం అందిందట. అంతే! రయ్యిమని వచ్చేసారు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటూ ఉండగానే కొంత ఆలస్యంగానే అయినా బుర్రలో లైటు వెలిగింది. అంతకు కొద్ది సేపటిక్రితం రేడియోకు ఫోన్ చేసి గీర్మన్ తో మాట్లాడిన సంగతి గుర్తుకు వచ్చింది. ఆఫీసుకు పోవడానికి బద్ధకం వేసి 'జలుబుగా వుంది, ఈ రోజు రాలేనని' చెప్పాను. బహుశా అతను ఈ విషయం సంబంధిత అధికారులకు చేరవేసివుంటాడని జస్వంత్ సింగ్ గారి భార్య మాకు టీకా తాత్పర్యం చెప్పింది.


మాస్కోలో అంబులెన్సులు రాత్రింబగళ్ళు తిరుగుతూనే వుంటాయి. ఏ ఇంటి నుంచి సమాచారం అందిందో, ఆ ఇంటికి దగ్గరలో తిరుగాడుతున్న అంబులెన్సుకు వైర్ లెస్ లో వివరాలు తెలియచేస్తారు. నిమిషాల వ్యవధిలో వారు అక్కడికి చేరుకొని వైద్య సహాయం అందిస్తారు. మొత్తానికి ఉత్తుత్తి జలుబు పుణ్యమా అని మాస్కో జీవితంలోని మరో మంచి కోణం తెలుసుకోగలిగాము. వచ్చిన డాక్టర్ల బృందానికి ఏ భాషలో క్షమాపణలు చెప్పామో గుర్తులేదు కానీ ఆఫీసుకు డుమ్మా కొట్టడానికి మేము ఎన్నుకున్న ఎత్తుగడను అర్ధం చేసుకుని నవ్వుకుంటూ వాళ్ళు  వెళ్ళిపోవడం మాత్రం ఇంకా కళ్లల్లో మెదులుతున్నట్టేవుంది.


పోతేపనిలో పనిగా జస్వంత్ సింగ్ గారి భార్య అంబులెన్సు సర్వీసు గురించి మరి కొన్ని సంగతులు మా చెవిన వేసి వెళ్ళింది. మైనస్ ముప్పయి, నలభయి డిగ్రీలవరకు ఉష్ణోగ్రతలు పడిపోయే ఆ నగరంలో వోడ్కా అనేది అక్కడి జనాలకు ఒక నిత్యావసర వస్తువులాంటిది. వొళ్ళు వెచ్చగా ఉంచుకోవడానికి వోడ్కా పుచ్చుకునే వారు కోకొల్లలు. ఈ విషయంలో కూడా అక్కడ మహిళలదే పైచేయి.

తాగి తాగి ఆ తాగిన మత్తులో మంచులో తూలి పడిపోయి ఇంటికి చేరలేని దేవదాసులు, దేవదాసినులను అంబులెన్సు బృందాలు  వెతికి పట్టుకుని ఆసుపత్రులకు చేరవేస్తుంటాయట. వారివద్దవుండే ప్రోపుస్కా (ఫోటో గుర్తింపు కార్డు) ఆధారంగా వారి ఇళ్ళకూ, ఆఫీసులకూ సమాచారాన్ని అందిస్తాయిట.  అంతే కాదు , ఆసుపత్రుల్లో అలా చేరిన వారు పూర్తిగా కోలుకునే వరకూ వాళ్లకు జీతంతో కూడిన సెలవు ఇవ్వడమనేది కొసమెరుపు.


పిలిపెంకో ఓసారి పట్టుపట్టి మమ్మల్ని లెనిన్ గ్రాడ్ రైల్లో తీసుకువెళ్ళాడు.

ఈ ఫిలిపెంకో ఎవరో ఇంతకు  ముందు చెప్పాను అనుకుంటా.

అప్పటికి మాకు పెళ్ళయి ఇరవై ఏళ్ళు. అయినా నా భార్య నాతోనే కాపురం చేస్తూ వుండడం అనేది వాళ్ళకో వింత. పదహారేళ్ళకే పెళ్ళాడి, ఇరవై ఏళ్ళు వచ్చేసరికి  ముగ్గురు మొగుళ్ళకు విడాకులు ఇచ్చి నాలుగో పెళ్ళికి సిద్ధంగా వున్న రేడియో మాస్కోలో నా సహచర ఉద్యోగిని  నటాషాకు మా ఆవిడ్ని చూస్తే ఓ అబ్బురం. అలాంటి విడాకుల దేశంలో పెళ్ళయి పాతికేళ్ళయినా ఫిలిపెంకో దంపతులు విడాకుల గొడవలేకుండా కాపురం చేసుకోవడం మాకో విడ్డూరం.

అయిదేళ్ళ తర్వాత, మేము హైదరాబాదుకు  ఆల్  మకాం మార్చిన తరువాత కూడా మా రెండు కుటుంబాల నడుమ స్నేహం కొనసాగింది. ఆ దంపతులు మమ్మల్ని చూడడానికి హైదరాబాదు  వచ్చారు. ఇంట్లో సౌకర్యంగా వుండదని హోటల్లో బస ఏర్పాటు చేయాలనే మా ప్రయత్నాన్ని వాళ్ళు తోసిరాజన్నారు. ఇంత  దూరం వచ్చింది కలిసి వుండడానికి కానీ హోటల్లో గడపడానికి కాదు పొమ్మన్నారు. వినడానికి చిత్రంగా  తోచవచ్చు కానీ, ఇక్కడ ఓ మాట చెప్పుకోవాలి. వారికి తెలుగూ, ఇంగ్లీష్ రెండూ రావు. మాకు రష్యన్ ఒక ముక్క కూడా అర్ధం అయిచావదు. మా పిల్లలు ఇంట్లో ఉన్నంత సేపూ వాళ్ళే దుబాసీలు. స్కూలుకు వెళ్ళిన తరువాత మా సంభాషణ అంతా సైగలతోనే.

హైదరాబాదులో ఒకరోజు భోజనాలు అయిన తరువాత మా ఆవిడ అరటి పండు ఒలిచి నాకు అందించడం పిలిపెంకో కంటపడింది. వెంటనే వంటింట్లోకి వెళ్లి , అప్పడాల కర్ర పట్టుకొచ్చాడు. ‘అరటి పండు  కాదు దీంతో మీ ఆయన నెత్తి మీద మొత్తు’  అంటూ సైగలతోనే మా ఆవిడతో  చెప్పాడు. భార్య మొగుడికి అలా  అరటిపండు  ఒలిచి మరీ అందివ్వడం ఆయనగారికి నచ్చినట్టులేదు. ‘బాగా గారాబం చేస్తున్నావు మీ ఆయన్ని. ఏం చేతులు లేవా, ఒలుచుకు తినలేడా’ అంటూ ఆ సైగలతోనే మందలించాడు.

ఇక ఇంట్లో నవ్వులే నవ్వులు. వాటికి భాషతో అవసరం లేదు కదా!

అలాంటి ఫిలిపెంకోతో కలిసి రైల్లో లెనిన్ గ్రాడ్ ప్రయాణం ఆహ్లాదకరంగా వుంటుందని మేమూ  బయలుదేరాము.

 దోవపొడుగునా అటూ ఇటూ మంచు మైదానాలపై అక్కడక్కడా కార్చిచ్చులో తగలబడిన అడవిలో మాదిరిగా నల్లగా మాడిపోయిన చెట్లు. చలికాలంలో ఒక్క మాస్కోనే కాదు, రష్యా మొత్తం బ్లాక్ అండ్ వైట్ ఫోటో మాదిరిగా వుంటుంది.  చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు అని చిన్నప్పుడు చదువుకున్నట్టు, ఇలా నల్లగా మాడిపోయి కనిపించే చెట్లు, తరుణం వచ్చినప్పుడు  అవన్నీ మళ్ళీ పచ్చగా ఆకులు రెమ్మలు, కొమ్మలతో కనుల పండువగా కనిపించడం ప్రకృతిలోని వైచిత్రి.

రైలు ప్రయాణం బాగానే వుంది. ఒక  బోగీని  డైనింగ్ హాలు మాదిరిగా తయారు చేశారు. అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ, ఓడ్కా సేవిస్తూ,  పెద్ద పెద్ద కిటికీ అద్దాల నుంచి చక్కటి పరిసరాలను వీక్షిస్తూ కాలక్షేపం చేయవచ్చు. పిలిపెంకోకి మద్యం అంటే పడదు. ఆయన భార్య కూడా అంతే.

లెనిన్ గ్రాడ్ అందమైన నగరం. కాలువలు, వంతెనలు, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మ్యూజియంలు, ముఖ్యంగా హెర్మిటేజ్ మ్యూజియం. ఆ ఒక్కటి పూర్తిగా చూడాలంటే ఒక్క రోజులో అయ్యేపని కాదు. అంత పెద్దది. అన్నింటికీ మించి శ్వేత రాత్రులు.

అర్ధరాత్రి సూర్యుడిని చూడాలి అంటే అక్కడికే వెళ్ళాలి.  

కమ్యూనిష్టుల ఏలుబడిలో లెనిన్ గ్రాడ్ గా పేరు మార్చుకున్న ఆ రష్యన్ నగరం మళ్ళీ తొంభయ్యవ దశకం మొదట్లో సెంట్ పీటర్స్ బర్గ్ గా తన పూర్వ నామాన్ని ధరించింది.

మార్చి మొదటి వారం నుంచి జులై చివరి వరకు దాదాపు ఎనభయి రోజులు అనుకుంటాను ఆ నగరంలో ‘శ్వేత రాత్రులు’ పేరిట ఉత్సవాలు జరుగుతాయి. ప్రపంచం నలుమూలల  నుంచి పర్యాటకులు అక్కడికి చేరుకుంటారు. ఆ విశేషం ఏమిటంటే అన్ని రోజులూ అక్కడ పగలూ, రాత్రీ ఇరవై నాలుగు గంటలు పట్టపగలే. చీకటి పడదు. అర్ధరాత్రి కూడా నడిబజార్లో నిలుచుని పుస్తకాలు చదువుకోవచ్చు. అందుకే వీటిని వాళ్ళు ‘శ్వేత రాత్రులు’ అని ముద్దుగా పిలుచుకుంటారు.

వైట్ నైట్స్ చూడడానికి వచ్చే పర్యాటకులతో ఇప్పుడా నగరం మూడు బార్లు, ఆరు హోటళ్ళ చందంగా వెలిగిపోతోంది(ట)  

లెనిన్ గ్రాడ్  వెళ్ళామనే కానీ  అక్కడ పట్టుమని రెండు రాత్రులు కూడా గడపలేదు. ఎప్పుడు వెళ్లి ఇంట్లో పడదామా, మా ఆవిడ వండి పెట్టే వేడివేడి అన్నం ఆవురావురుమని తిందామా అన్న ఆరాటంతోనే సరిపోయింది. ఆ నగరంలో చూడాల్సినవి ఎన్నోవున్నాయి.  కానీ తినకుండా తిరగడం అన్నదే నాకు పెద్ద  సమస్యగా మారింది. పూజలు, పునస్కారాలు, ఉపోషాలు అలవాటయిన మా ఆవిడకి తిండి ఒక సమస్య కాదు. పాలు తాగి సరిపుచ్చుకోగలదు. నాకు అలా కాదు, కారాలు, పచ్చళ్ళు పెరుగన్నం కావాలి.  అంచేత  నాలుగయిదు రోజులు వుందామని వెళ్లి మూడో రోజునే మాస్కోకి తిరిగివచ్చాం.


 
శాకాహారులకు హోటళ్ళలో తినడానికి ఏమీ దొరకదు. ముతక బియ్యంతో పొడిపొడిగా వండిన అన్నంపై ఉప్పూ, మిరియప్పొడి చల్లుకు తినాలి. పెరుగు కాదు కానీ పెరుగులాంటిది 'కిఫీర్'   దొరుకుతుంది. దానితో సరిపెట్టుకుని భోజనం అయిందనుకోవాలి. అలాగని మాంసాహారులకు రుచికరంగా అన్నీ దొరుకుతాయని అనుకోనక్కరలేదు. ఉడికించిన కోడిగుడ్లు మినహా మిగిలినవేవీ మనవైపు నుంచి వెళ్ళిన వాళ్లకు అంతగా రుచిస్తాయనుకోవడానికి లేదు. మాంసాన్ని ఉప్పునీళ్ళల్లో ఉడికించి అదేమాదిరిగా సర్వ్ చేసేవారు. ఉప్పుకారాలు దట్టించి, నూనెల్లో వేయించి వేయిన్నొక్క రకాలుగా వంటలు వండుకుని తినే అలవాటు వున్న వాళ్లకు, ఆ తిండి సయించడం కష్టమే. అందుకే అక్కడికి వ్యాపారపు పనులమీదనో లేక ఇండో సోవియట్ సాంస్కృతిక సంఘం ఆహ్వానం మేరకో వచ్చినవాళ్ళు భోజనానికి కటకట పడుతుంటారు. అలా వచ్చినవాళ్ళు మొదటి రోజు అక్కడి హోటళ్లు, బస ఏర్పాట్లు చూసి పరవాలేదనుకుంటారు. విందుల్లో మందు తప్ప ఇష్టపడి తినదగిన భోజనం కనబడక పోవడంతో,  ఆకలి ఎరుగని దేశంలో వాళ్లకు ఆకలి కష్టాలు మొదలవుతాయి.

 

కింది ఫోటోలు:

ఇంటికి వచ్చిన రష్యన్ డాక్టర్లతో  పిచ్చాపాటీ

ఒకనాటి లెనిన్ గ్రాడ్ లో ముసలి గుర్రం మీద ఓ వయసు కుర్రోడు. అంటే నేనే. నలభయ్ ఏళ్ళ క్రితం నేను పడుచువాడినే కదా! నాలాగే ఆకలితో కృశించిన గుర్రం దొరకడం కాకతాళీయం.






(ఇంకావుంది)

11, మార్చి 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (110) – భండారు శ్రీనివాసరావు

 మంచు కాలం 

మాస్కోలో మేము అడుగుపెట్టింది ఎముకలు కొరికే చలి కాలంలో.
ఇండియా నుంచి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వెళ్ళిన మాకు ఆ వాతావరణం ఓ పట్టాన కొరుకుడు పడలేదు. కొన్నాళ్ళు వానలుకొన్నాళ్ళు చలి గాలులుమరికొన్నాళ్ళు మండే ఎండలు,  ఇలాంటి వాతావరణం తెలుసు. కానీ మాస్కోలో పూర్తిగా వేరు.  అక్కడి వాతావరణం గురించిన ఒక జోక్ ఇలా ప్రచారంలో వుంది. 'మాస్కోలో మొదటి నాలుగు నెలలు చలికాలం,  తరువాత మరో నాలుగు నెలలు చలికాలం. పోతేమిగిలిన నాలుగు నెలలు చలికాలమే'

ఏప్రిల్మే నెలల నడుమ ఓ పదిహేనుయిరవయి రోజులు వేసవి కాలం పలకరిస్తుంది. అప్పుడు కూడా డిల్లీలో చలికాలం మాదిరిగా ఎండ కాస్తుంది. దానికే మాస్కో వాసులు తెగ సంబరపడిపోతారు. ఆ సంబరంలో వాళ్లకు వొంటిమీద బట్టనిలవదు. ఏటిపొడుగునా ధరించే ఎలుగుబంటి దుస్తుల్ని వొదిలిపెట్టి,  ఆడవాళ్ళు స్కర్టుల్లోకిమగవాళ్ళు నిక్కరు, టీ షర్టుల్లోకి మారిపోతారు. నిజానికిరష్యన్ల మేని ఛాయ తెల్లని తెలుపు. కానీ ఉన్ని దుస్తుల్లో వారి అందం కాస్తా మరుగున పడిపోతుంది. ఫర్ కోట్లుఫర్ టోపీలు ధరించిన తరవాత ఎవరు ఆడో  ఎవరు మగో గుర్తు పట్టడం కష్టం మరి. 

హిమనగరం


ఇక మాస్కో గురించి చెప్పుకోవాలంటే అక్కడ కురిసే మంచు గురించి ముందు ముచ్చటించుకోవాలి. తెల్లటి మంచు పూలరేకుల మాదిరిగా నిరంతరం నింగినుంచి 'దేవతలు పుష్పవృష్టి'  కురిపిస్తున్నట్టు జాలువారుతూనే వుంటుంది. ఆ మంచు వర్షంలో దుస్తులన్నీ 'మంచుకొట్టుకు పోతాయికానీ  ‘తడిసి ముద్దయి'  పోవు. ఎందుకంటే అక్కడి 'మైనస్టెంపరేచర్లలో మంచు కరిగి నీరుగా మారే అవకాశమే లేదు. తెల్లవార్లూ ఎడతరిపి లేకుండా కురిసే మంచులో ఇళ్ళ ముందు పార్కు చేసిన కార్లు నిలువెత్తు మంచులో కూరుకుపోతాయి. ఆ మంచుని తొలగించి కార్లను మళ్ళీ రోడ్డు ఎక్కించడం వాటి యజమానులకు రోజూ ఒక సమస్యే. అందుకే చాలామంది కార్లను 'మంచు సమాధుల'లోనే వుంచేసిమెట్రో రైళ్ళ పైనే రాకపోకలు సాగిస్తుంటారు. 

కన్నుకొట్టని కరెంటు దీపాలు

ఒక నగరం నగరాన్ని ఆ మాటకు వస్తే, ఒక దేశం దేశాన్నీ అందులోనూ నీళ్ళు గడ్డకట్టే వాతావరణం కలిగిన దేశాన్ని పొత్తిళ్ళలో పాపాయి మాదిరిగా వెచ్చగా వుంచడం అక్కడే చూసాను. ఏడాదిలో దాదాపు పదినెలలు మంచు దుప్పటి కప్పుకుండే మాస్కోలో,  దుప్పటి అవసరం లేకుండా నిద్ర పోవడం అక్కడే సాధ్యం. అదీ పైసా (కోపెక్) ఖర్చు లేకుండా. ఇళ్లూ వాకిళ్ళూ , ఆఫీసులుబస్సులుట్రాములుమెట్రో రైళ్ళుసినిమా హాళ్ళుహోటళ్లుస్కూళ్ళు కాలేజీలుప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రష్యన్ సర్కస్ డేరాలు,  చివరాఖరుకు స్విమ్మింగ్ పూల్స్ అన్నీ ఎయిర్ కండిషన్ అంటే నమ్మశక్యమా చెప్పండి. ఇంటి బయట ఎముకలు కొరికే చలి పులి పంజా విసురుతున్నా, ఇంట్లో మాత్రం లుంగీ పైజమాలతో మసలగలిగేంత వెచ్చగా వుండేది. ఆ వెచ్చదనం కూడా ఏటిపోడుగునా ఏమాత్రం హెచ్చుతగ్గులు లేకుండా ఒకేమాదిరిగా వుండడం వల్ల ఆ అయిదేళ్ళలో ఒకసారి కూడా తుమ్మాల్సిన అగత్యం రాలేదు.

ఎయిర్ కండిషన్ వ్యవస్తకు  మరమ్మతులు చేయడానికి మాత్రం వేసవిలో ఓ పదిహేను రోజులు ఈ సదుపాయాన్ని నిలుపు చేస్తారు. అసలు ఈ వ్యవస్థ పనిచేసే విధానమే మాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇళ్లు ఆఫీసులు అన్నిటిలో వేడినీరు ప్రవహించే ఇనుప గొట్టాలు వుంటాయి. ఆ గొట్టాలనుంచి సదా వెలువడే వేడినీటితో ఇల్లంతా వెచ్చగా వుంటుంది. బయట ఉష్ణోగ్రతల్లో ఏర్పడే హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఈ గొట్టాలలో ప్రవహించే నీటి వేడిని పెంచడమో తగ్గించడమో చేస్తుంటారు.

అలాగే, రాత్రల్లా కురిసిన మంచుతో కప్పుకుపోయిన రహదారులను తెల్లవారేసరికల్లా వాహనాల రాకపోకలకు అనుగుణంగా ఒక దారికి తీసుకురావడం , అందుకు పడుతున్న శ్రమాపెడుతున్న ఖర్చూ చూసేవాళ్ళకు కళ్ళు తిరగక మానవు. ప్రతిరోజూ అర్ధరాత్రి దాటిన  తరవాత అంటే సుమారు రెండుగంటలనుంచి ఓ రెండు మూడు గంటలపాటు రహదారులపై బస్సులుట్రాములు మొదలయిన వాహనాలతో పాటు మెట్రో రైళ్ళ రాకపోకలను కూడా నిలిపివేస్తారు. అక్కడినుంచి మొదలవుతుంది  యుద్ధ ప్రాతిపదికన రోడ్లపై మంచు తొలగించే కార్యక్రమం. వార్ ఫుటింగ్ అన్న పదానికి సరయిన అర్ధం తెలుసుకోవాలంటే దీన్ని  ఒకసారి పరిశీలించాలి. మొత్తం మూడు రకాల వాహనాలను ఇందులో వాడతారు. ముందు ఒక వాహనం ఉప్పు కలిపిన ఇసుకను రోడ్లపై చల్లుకుంటూ వెడుతుంది. దానితో గట్టిగా పేరుకుపోయిన మంచు నీళ్లగా కరుగుతుంది. రెండో వాహనం కింద అమర్చిన చీపురు యంత్రాలు ఆ ఇసకనునీటిని చిమ్మివేస్తాయి. మూడో వాహనం నీటితో రోడ్లను శుభ్రంగా అద్దంలా కడిగేస్తుంది. ఇది ఏదో బాగా వర్షం పడినప్పుడు హడావిడి చేసి చేతులు దులుపుకోవడం లాంటిది కాదు. ఇది ఏటి పొడుగునా జరిగే కార్యక్రమం. పైగా నిత్య కృత్యం.

పోతే, మాస్కో విషయాలు ముచ్చటించుకునేటప్పుడు మరచిపోకుండా చెప్పుకోవాల్సింది అక్కడి కరెంటు గురించి. మేము అక్కడ వున్న అయిదేళ్ళూ కరెంటు దీపాలు కన్ను కొట్టిన పాపాన పోలేదు. వోల్టేజి సమస్య అంటే అక్కడివారికి తెలియదు. స్టార్ హోటల్స్ వుండే పాతిక ముప్పయి బల్బులు కలిగిన పెద్ద పెద్ద  షాండిలియర్లు వుండేవి. ఎప్పుడు బల్బులు మార్చాల్సిన అవసరం రాలేదు.

వంటింట్లో వాడే గ్యాస్ కూడా పైపుల్లో సరఫరా అయ్యేది. సిలిండర్ అయిపోతే ఎట్లారా అన్న బెంగ లేదు. పైగా కరెంటు, నీళ్ళు, గ్యాస్, ఫోన్ అన్నీ ఉచితం. ఇంటి సంగతి సరేసరి. అంత పెద్ద అపార్ట్ మెంటుకు చెల్లించాల్సిన నెల కిరాయి పది రూబుళ్ళు దాటదు.   జీతం మాత్రం అటూ ఇటూగా వెయ్యి రూబుళ్ళు.

 

తోకటపా:

ఒకసారి మా మేనల్లుడితో ఫోన్ లో మాట్లాడుతుంటే అడిగాడు, మంచుదేశం అంటున్నావు కదా! ఆ చల్లదనానికి మనుషులు తెల్లబడతారు అంటారు. వెళ్లి రెండేళ్లు అయింది, ఏమన్నా రంగు చేసావా అని. (నా ఒంటి ఛాయ గురించి వేసిన జోకన్నమాట. ఎందుకంటే మా ఇంట్లో అందరిలో చామనఛాయ మనిషిని నేనే!)

దానికి నా జవాబు:

“ మాస్కో వచ్చినప్పటి నుంచి మా ఇంటి దగ్గర చెట్టుపై ఒక కాకిని చూస్తున్నాను. ఇంత కాలం అయినా అది రంగు మారినట్టు నాకు కనబడలేదు”

కింది ఫోటోలు:

ఓ వేసవి సాయంత్రం మాస్కో లోని ఆర్బాత్  వీధిలో షికారు చేస్తూ మా కుటుంబం

బయట గడ్డగట్టే మైనస్ పాతిక డిగ్రీల టెంపరేచర్ వున్నా కూడా, ఇంట్లో హాయిగా తెలుగువార పత్రిక తిరగేస్తూ మా ఆవిడ నిర్మల






(ఇంకా వుంది)