26, ఫిబ్రవరి 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (96) – భండారు శ్రీనివాసరావు

 

ఢిల్లీలో ఏడిద గోపాలరావు గారని వుంటారు, ఆయన్ని కలవండి”

ఇప్పటి పరిస్తితులు వేరు కానీ డెబ్బయ్యవ దశకంలో ఎవరైనా పనిపడి ఢిల్లీ వెళ్ళాల్సివస్తే ముందు వినవచ్చే ఉచిత సలహా ఇది.

ఆ మాట విన్నవాడి పంట పండినట్టే. ఒక్కసారి ఆయన్ని కలిస్తే చాలు మళ్ళీ ఢిల్లీ వదిలి వెళ్ళే వరకు వాళ్ళ బాధ్యతను, అవసరాలను  ఆయన స్వచ్చందంగా, ఆనందంగా భుజానికి ఎత్తుకుంటాడు అని, ఢిల్లీ లో చాలా కాలం వున్న ప్రముఖ జర్నలిస్టు ఆదిరాజు వెంకటేశ్వరరావు గారు చెబుతుండేవారు. ఆయన మాట అక్షరాలా నిజం.

ఒక్కమాటలో చెప్పాలంటే ఆ రోజుల్లో ఢిల్లీలో తెలుగువాడి కేరాఫ్ అడ్రస్ ఏడిద గోపాలరావు అంటే అతిశయోక్తి కాదు.

ఆయన పనిచేసేది ఆల్ ఇండియా రేడియో తెలుగు వార్తావిభాగంలో. ఉద్యోగం తెలుగు న్యూస్ రీడర్. ముప్పూటలా వార్తలు అనువదించె/ చదివే డ్యూటీ వుంటుంది. మరి ఈ ప్రజాసేవకు టైం ఎలా సర్దుబాటు చేసుకునే వారో ఆ దేవుడికే తెలియాలి.

1975 లో నేను రేడియోలో చేరిన చాలా కాలం తర్వాత ఆయన్ని కలుసుకునే అవకాశం చిక్కింది. ఒక రోజు నేను సచివాలయం బీట్ పూర్తిచేసుకుని రేడియో స్టేషన్ కు వచ్చేసరికి న్యూస్ రూములో ఎవరో సూటూ బూటుతో ఒక కొత్తమనిషి కనిపించారు.

వెంకట్రామయ్య గారు ఆయన్ని నాకు పరిచయం చేశారు.  ఆయనే ఏడిద గోపాలరావుని అప్పుడు తెలిసింది.  వార్తల్లో పేరు వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు. సూటు, టై మినహాయిస్తే (ఢిల్లీలో ఈ ఆహార్యం తప్పనిసరి అని తర్వాత తెలిసింది) చాలా సింపుల్ గా కానవచ్చారు. ఆప్యాయంగా పలకరించారు. ఢిల్లీ వస్తే కలవమని తన విజిటింగ్ కార్డు ఇచ్చారు. కాసేపు వుండి ఢిల్లీ కబుర్లు చెప్పి వెళ్ళిపోయారు.

ముందే చెప్పినట్టు గోపాలరావు అనే వ్యక్తి రేడియో వార్తలు చదివేవాడిగా ఎంతటి పేరు సంపాదించుకున్నాడో అంతకంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు రంగస్థల నటుడిగా మూటగట్టుకున్నారు. దానికి తోడు దేశ రాజధానిలోని వివిధ తెలుగు సాంస్కృతిక సంఘాలు, సంస్థలకు నడుమ ఒక వారధిగా పనిచేశారు.
శంకరాభరణం వంటి అత్యద్భుత చిత్రాలను రూపొందించిన ఏడిద నాగేశ్వరరావు, గోపాలరావుకు స్వయానా సోదరుడు. సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాల పట్ల ఆయనలో అభిరుచి పెంపొందడానికి బహుశా ఈ కుటుంబ నేపధ్యం కూడా దోహదపడి వుంటుంది.

నాకంటే ముందు మాస్కోలో, రేడియో మాస్కోలో చాలా కాలం పనిచేశారు. మాస్కోలో కూడా ఆయన వదిలివెళ్ళిన ముద్ర సామాన్యమైనది కాదు. సాంస్కృతిక పరమైన గోష్టులకు, సమావేశాలకు ఆయన నివాసం ఒక కేంద్రంగా వుండేదని చెప్పుకునేవారు. ముందే చెప్పినట్టు  ఏడిద గోపాల రావు గారు తన పరిధిని కేవలం ఉద్యోగానికి పరిమితం చేసుకోలేదు. ఆ పరిధిని దాటి కార్యకలాపాలను విస్తరించుకోవడం ఆయన నైజం. 'సరస నవరస' అనే నాటక, సాంస్కృతిక సంస్థను స్థాపించి రెండు దశాబ్దాలు పోషించారు. వందకు పైగా నాటకాలు ఆ సంస్థ ద్వారా ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ నాటక అకాడమీ గౌరవ సభ్యులుగా కొంతకాలం పనిచేశారు. 'ధియేటర్ ఆర్ట్స్‌'లో డిప్లొమా పొందారు.


రేడియో ఉద్యోగ పర్వం పూర్తి అయిన పిదప గోపాల రావు ఢిల్లీ జీవితానికి స్వస్తి పలికి హైదరాబాదు వచ్చి స్థిరపడ్డారు. పదవీ విరమణ అనంతరం పెద్ద వయసులో కూడా ఆయన తన సాంస్కృతిక కార్యక్రమాలను కొనసాగించారు. రంగస్థలంపై మహాత్మా గాంధీ వేషం కట్టి రంగస్థల గాంధీగా పేరు తెచ్చుకున్నారు. రవీంద్ర భారతిలో  పన్నెండు గంటల పాటు నిర్విరామంగా వార్తలు చదివి లిమ్కా బుక్ రికార్డులకెక్కారు.

రేడియో వార్తలు చదవడంలో తనదైన ముద్ర వేసిన శ్రీ గోపాలరావు 83 వ ఏట హైదరాబాద్ లో 2020 లో  కన్నుమూశారు.

కింది ఫోటో

ఏడిద గోపాల రావు



(ఇంకా వుంది)

25, ఫిబ్రవరి 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (95) – భండారు శ్రీనివాసరావు

 

రేడియో సంగతులు రాస్తున్నారు మరి విజయవాడ రేడియో సంగతి ఏమిటి అని అడిగారు రేడియో అభిమాని కప్పగంతు శివరామ ప్రసాద్  గారు. మూడు దశాబ్దాల ఉద్యోగ పర్వంలో నేనెప్పుడు విజయవాడ ఆకాశవాణిలో పనిచేయలేదు. అక్కడి కళాకారులతో వ్యక్తిగత పరిచయాలు తక్కువ. ఏమైనా రాసినా, వారినీ వీరినీ అడిగి రాయాల్సిందే.

అలా అని నాకు విజయవాడ రేడియో ప్రాంగణంతో అసలు పరిచయం లేదని కాదు. అక్కడ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్ గా పనిచేసిన సుబ్రహ్మణ్యం గారు నాకు మంచి స్నేహితులు. ఎప్పుడైనా ఆయన సెలవుపై వెళ్ళినప్పుడు నేను హైదరాబాదు నుంచి వెళ్లి తాత్కాలికంగా ఉదయపు ప్రాంతీయ వార్తల ఎడిటింగ్ బాధ్యతలు చూస్తుండేవాడిని. వారం అనుకుని వెళ్ళిన వాడిని ఒక్కోసారి వారాల తరబడి అక్కడే వుండిపోయే వాడిని. ఢిల్లీ వంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు తప్పిస్తే రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా  టియ్యే డియ్యేలు క్లెయిం చేసే అలవాటు నాకు లేదు. ఆ అవసరం పడేది కాదు.  ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ప్రభుత్వ వాహనాలే. తీసుకువెళ్ళిన బ్యాంకుల వాళ్ళో, లేక ప్రభుత్వ సంస్థల వాళ్ళో బస, భోజనం ఏర్పాట్లు చూసేవాళ్ళు. అలాగే,  డ్యూటీ మీద హైదరాబాద్ నుంచి బెజవాడ వెళ్ళినప్పుడుగాంధీ నగరంలోని  మా ఏడో అక్కయ్య భారతి ఇంట్లోనే వారాల తరబడి నా ఆల్ మకాం.

పొద్దున్నే రేడియో స్టేషన్ కారు వచ్చేది. నేను తలుపులు తీసుకుని బాత్ రూమ్ కి వెడుతుంటే బయట బండెడు అంట్ల గిన్నెలుఎంగిలి కంచాలు. అంటే అంతమంది జనం ఆ రాత్రి ఆ ఇంట్లో భోజనాలు చేశారన్న మాట.

పక్కనే మా బావగారి పూజ గది. అప్పటికే ఆమె లేచి స్నానం చేసి, ఆ గది శుభ్రం చేసి పూజకు కావాల్సిన సంభారాలన్నీ సిద్ధం చేసిపెట్టి ,నాకు కాఫీ కలిపి ఇచ్చేది. ఇంత పనీ తాను ఒంటి చేత్తో సంభాలించేది.

 బక్కపలచటి ఈ మనిషిలో అంతటి శక్తి ఎక్కడిది ? ఈ ప్రశ్నకి నాకు తెలిసి ఒకటే జవాబు.

కుటుంబం పట్ల ఆమెకున్న కమిట్ మెంట్. ఈ పదానికి ఆమెకు అర్ధం తెలుసని నేను అనుకోను.

ఇక బెజవాడ రేడియో గురించి కన్నవి, విన్నవితోపాటు  సేకరించిన విశేషాలు కొన్ని.

ఆకాశవాణి, విజయవాడ కేంద్రం’
ఒకానొక కాలంలో ప్రాభాత వేళలో ఈ పదాలే  జనపదాలకు మేలుకొలుపు పిలుపులు.
అలాంటి విజయవాడ రేడియోకి ఇప్పుడు డెబ్బయ్ ఏడేళ్లు. అంటే నాకంటే వయసులో రెండేళ్లు చిన్నదే.
బందరు రోడ్డు, పున్నమ్మతోటలో ఉన్న విజయవాడ రేడియో కేంద్రం గురించి తెలియనివాళ్ళు, వినని వాళ్ళు ఆంధ్రప్రాంతంలో ఉండరంటే అతిశయోక్తి కాదు. సంగీత సాహిత్యాలలో ఘనాపాటీలు, దిగ్గనాధీరులైన అనేకమంది  ప్రముఖులు ఈ కేంద్రం ద్వారా తమ ప్రతిభావ్యుత్పత్తులను ప్రదర్శించిన వాళ్ళే.
ఈ కేంద్రం పుట్టుపూర్వోత్తరాలు గురించి ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ గుర్తు చేసుకుంటూ ఇలా చెప్పారు. 
“1936లో అప్పటి ఆంగ్లేయ ప్రభుత్వం, భారత దేశంలో రేడియో వ్యాప్తిని గురించి పరిశీలించడానికి నిపుణులను నియమించింది. అప్పుడు మద్రాసు రాజధానిలో తమిళ జిల్లాలతో పాటు కొన్ని తెలుగు, కన్నడ, మళయాళ జిల్లాలు కూడా కలిసి వుండేవి. మద్రాసునుంచి నాలుగు భాషల్లో ప్రసారాలు చేయాలనీ, విజయవాడ నుంచి కానీ, రాజమండ్రి నుంచి కానీ తెలుగు ప్రసారాలు చేయాలని మొదట్లో అనుకున్నారు. కానీ చివరకు తెలుగు కార్యక్రమాలను కూడా మద్రాసు నుంచే ప్రసారం చేయాలని నిర్ణయించారు.
“1947లో దేశం స్వాతంత్రం సాధించేనాటికి, ఆలిండియా రేడియో వ్యవస్థలో ఢిల్లీ, కలకత్తా (కోల్ కతా), బొంబాయి(ముంబై), మద్రాసు(చెన్నై), లక్నో, తిరుచిరాప్పళ్లి (తిరుచి, ట్రిచి) రేడియో కేంద్రాలు మాత్రమే వుండేవి. మద్రాసు నుంచే కాక హైదరాబాదులో డెక్కన్ రేడియో నుంచి, మైసూరు నుంచి(చాలా అరుదుగా) తెలుగు ప్రసారాలు జరిగేవి. స్వాతంత్రం వచ్చిన తరువాత సర్దార్ వల్లభాయ్ పటేల్ సమాచార, ప్రసార శాఖల మంత్రి అయ్యారు. ఆయన పర్యవేక్షణలో దేశంలో రేడియో వ్యాప్తికి కృషి మొదలయింది. 1956 నుంచి ఆలిండియా రేడియో సంస్థను ‘ఆకాశవాణి’గా పేర్కొంటున్నారు.
“1948 అక్టోబర్ 12 నాడు విజయవాడలో రేడియో కేంద్రం మొదలయింది. దీనితో మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమయ్యే తెలుగు కార్యక్రమాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి.
డెక్కన్ రేడియో (హైదరాబాదు, ఔరంగాబాదు) రేడియో కేంద్రాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. 1950 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి  హైదరాబాదు రేడియో కేంద్రం ‘ఆలిండియా రేడియో’ వ్యవస్థలో భాగంగా పనిచేయడం ప్రారంభించింది.
“1955 నవంబర్ రెండో తేదీన మొదలయిన బెంగలూరు రేడియో కేంద్రం, 1963 జూన్ లో మొదలయిన పోర్ట్ బ్లేయర్ కేంద్రం కూడా తెలుగులో ప్రసారాలు చేస్తున్నాయి. 1957 అక్టోబర్ మూడో తేదీన మొదలయిన ‘వివిధ భారతి’ ప్రసారాలలో తెలుగు పాటలు రోజూ అరగంట సేపు వేసేవారు. 1969 సెప్టెంబర్ లో ఢిల్లీ, పాట్నా, రాంచీ, సిమ్లా రేడియో కేంద్రాల నుంచి తెలుగు నేర్పే పాఠాలు ప్రారంభించారు. 1991 మార్చి రెండో తేదీన హైదరాబాదు, విజయవాడలలో వాణిజ్య ప్రసారాలు మొదలుపెట్టారు.
శ్రీ సుధాకర్ మొదునూడికి ( sudhakar modunudi) విజయవాడ ఆకాశవాణితో  బాల్యం నుంచి అనుబంధం. పన్నెండేళ్ల వయసులో 'బొమ్మరిల్లు' లో 'బాలల సంగీతసభ' లో పదిహేను రూపాయల కాంట్రాక్టుకు పాడిన రోజునుండి  ఒక సంగీత ప్రయోక్తగా అదే కేంద్రంలో పనిచేసేవరకు బెజవాడ రేడియోలో ఆయన ప్రస్థానం సాగింది. ఆ అనుబంధం ఏమిటో ఆయన మాటల్లోనే.
నాచిన్నతనంలోని పాత రేడియో స్టేషను జ్ఞాపకాలు ఎన్నటికీ మరపున పడవు. ఆ ప్రాంగణాన్ని (ప్రస్తుతం అక్కడ దూరదర్శన్ కేంద్రం వుంది) సమీపించగానే ఏదో లోకంలోకి అడుగిడినట్లు ఉండేది. పెద్ద పెద్ద చెట్లమధ్య, పైకి పెంకుటిల్లులా కనిపించేది. ఇరువైపులా దారిపొడుగునా ద్వారం వరకూ పూలకుండీలు వరుసగా పేర్చి ఉండేవి. వాటిలోని బంతిపూలు పరిమళాలు వెదజల్లేవి. నిలయ కళాకారులందరూ తెల్లటి జుబ్బా, పంచెకట్టి, ఒకరితో మరొకరు చతురోక్తులాడుకుంటూ దర్శనమిచ్చేవారు. నాటకాల రిహార్సల్సూ, దేశభక్తి గీతాల సాధనలూ, ఇవన్నీ విశాలమైన ప్రాంగణంలోని చెట్లక్రిందేగుంపులు గుంపులుగా కూర్చొని కొనసాగించేవారు. మేడపైకి చెక్కమెట్లు. పైన ఆఫీసు గదులు.
ఇక లోపలికి అడుగిడగానే పెద్దహాలు, మధ్యలో అద్దాల పెట్టెలో కొత్తగా కట్టబోతున్న (ప్రస్తుత) రేడియో స్టేషన్ భవంతి నమూనా, దానిపై అందంగా అమర్చిన పూల గుత్తుల పింగాణీ జాడీ, ఎదురుగా మూడు స్టూడియోలు, ఒకటి సంగీతానికి, రెండవది నాటకాలకు, మూడవది ప్రసంగాలకు.

లోపల కార్యక్రమం ప్రసారమౌతున్నదని హెచ్చరిస్తూ తలుపులకు పైన వెలిగే ఎర్రలైట్లు. చేతిలో కాగితాలు పట్టుకుని, హడావుడిగా అటూ ఇటూ నడిచే అనౌన్సర్లు.  ఒకమూల స్పీకరునుండి మంద్ర గంభీరంగా వినిపించే ప్రత్యక్ష ప్రసారం.  పై కప్పున చిన్న శబ్దంతో అలుపెరుగక తిరిగే పంకాలు. తెల్లటి గోడలకు శబ్ద నియంత్రణ రంధ్రాలు. గది గోడలకానుకొని రెండువైపులా సోఫాలు. వాటిలో కాలుమీద కాలేసుకొని దర్శనమిచ్చే లబ్ధప్రతిష్టులు.
ఆనాడు నేననుకునేవాణ్ని,  ఏనాటికైనా ఉద్యోగమంటూ చేస్తే ఇక్కడే చేయాలి'.అని. దేవుడు ఆనాడే 'తథాస్తు' అంటూ దీవించాడేమో.  దశాబ్దాలుగా అక్కడే  పనిచేస్తూ ఎన్నో కార్యక్రమాలను రూపొందించే భాగ్యం నాకు కలిగింది.”


ప్రముఖ వైణికుడు శ్రీ అయ్యగారి శ్యామసుందర్ విజయవాడ రేడియోను తన మాతృసంస్థగా భావించి గౌరవిస్తానని ఆ కేంద్రంతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వీరు ఎస్సారార్ కాలేజీలో నా సహాధ్యాయి.  శ్యామసుందర్ నాన్నగారు శ్రీ అయ్యగారి సోమేశ్వర రావు మొదట మద్రాసు రేడియో కేంద్రంలోనూ, తరువాత విజయవాడ కేంద్ర ఆవిర్భావం నుంచి 1973  వరకు వీణా వాద్యం వాయించేవారు. తరువాత రేడియోలో పనిచేసే అదృష్టం తనను కూడా వరించిందని, విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుండి 1965లో మొదలు పెట్టి 2005 దాకా వాయిస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుండి టాప్ గ్రేడ్ విద్వాన్ గా వీణా వాద్యం వినిపిస్తున్నానని శ్యామసుందర్  చెప్పారు. రేడియోతో ఈ కుటుంబం సంబంధం అక్కడితో ఆగలేదు. ఆయన చెల్లెలు పరిటి  రాజేశ్వరి సైతం రేడియోలో ఏ గ్రేడ్ వైణికురాలు. ప్రస్తుతం అమెరికాలోని చికాగోలో స్థిరపడి అక్కడ కూడా సంగీత కచ్చేరీలు చేస్తున్నారు. శ్యామసుందర్  భార్య శ్రీమతి జయలక్ష్మి, ఆయన సోదరుడు సత్యప్రసాద్ కూడా రేడియో సంగీత కళాకారులే. పొతే, వారి బావమరది శ్రీ పప్పు చంద్ర శేఖర్ కూడా విజయవాడ రేడియో నుంచే తన సంగీత ప్రస్థానం ప్రారంభించారు. వారి మామగారు శ్రీ పప్పు సోమేశ్వర రావు కూడా 1948 నుండి విజయవాడ కేంద్రంలో వైణిక విద్వాంసుడిగా సేవలు అందించారు. అంటే, తమలోని సంగీత పాటవాన్ని ప్రదర్శించడానికి ఒక కుటుంబం యావన్మందికీ,  విజయవాడ రేడియో కేంద్రం  ఆశ్రయం కల్పించిందన్న మాట.

కింది ఫోటో చాలా అపూర్వమైనది.
విజయవాడ రేడియో కేంద్రంలో పనిచేసిన మహామహులందరు ఇందులో కానవస్తారు. ఆకాశ‌వాణిలో దిగ్దంతులైన క‌ళాకారులు వీరు. ఆకాశవాణి కళాకారులు శ్రీ కందుకూరి రామభద్రరావు,, శ్రీ ప్రయాగ నరసింహ శాస్త్రి గార్ల పదవీ విరమణను పురస్కరించుకుని జరిగిన వీడ్కోలు సభ సందర్భంగా తీసిన ఫోటో ఇది. అంద‌రివీ కాక‌పోయినా 99 శాతం మంది పేర్లు లభించాయి.  (Photo Courtesy : Senior Journalist: Shri KVS Subramanyam)

ఫోటోలోని మహనీయుల వివ‌రాలు:
ముందు వరుసలో కూచున్న మహిళా కళాకారిణులు (ఎడమ నుంచి కుడికి) శ్రీమతులు ఎ. కమల కుమారి, వి. బి.కనక దుర్గ, శ్రీరంగం గోపాలరత్నం, ఎం. నాగరత్నమ్మ, వింజమూరి లక్ష్మి మరియు బి.టి.పద్మిని
కూచున్నవారు: శ్రీయుతులు అన్నవరపు రామస్వామి, ఆయన పక్కన ఎల్లా సోమన్న, వారిపక్కన ఓలేటి వెంకటేశ్వర్లు , కందుకూరి రామభద్రరావు, ప్రయాగ నరసింహశాస్త్రి, జి వి కృష్ణారావు, రాచకొండ నృసింహ మూర్తి, ఎన్.సిహెచ్. కృష్ణమాచార్యులు.
కూర్చున్నవారి వెనుక నుంచున్నవారు : శ్రీయుతులు రామవరపు సుబ్బారావు,అన్నవరపు గోపాలం, ఎ.కుటుంబయ్య, దండమూడి రామమోహనరావు, బలిజేపల్లి రామకృష్ణశాస్త్రి, ఉషశ్రీ, ఎం.వాసుదేవమూర్తి, సి.రామమోహన రావు,జి.ఎం.రాధాకృష్ణ, సితార్ కనకారావు, చల్లపల్లి కృష్ణమూర్తి, చార్లెస్, సీతారాం
పూర్తిగా పైన నుంచున్నవారు : శ్రీయుతులు అల్లం కోటేశ్వర రావు, నండూరి సుబ్బారావు , దత్తాడ పాండురంగరాజు, సుందరంపల్లి సూర్యనారాయణ మూర్తి, ఎన్.సి వి. జగన్నాధాచార్యులు, ఎ.లింగరాజు శర్మ; ఎ.బి.ఆనంద్, మహమద్ ఖాసిం, ఆ తరువాతి వారు ఫ్లూట్ వై.సుబ్రహ్మణ్యం,.చివరివారు వై.సత్యనారాయణ


 






ఇంకా వుంది)