6, డిసెంబర్ 2024, శుక్రవారం

వైస్ చాన్సలర్ గా ఘంటా చక్రపాణి

 

చక్రపాణి గారితో పరిచయం తెలంగాణా ఉద్యమ కాలంలో. అదీ టీవీ చర్చల్లో. తెలంగాణా వాదాన్ని ఆయన ఘంటా పదంగా వినిపించేవారు. నాది  మధ్యేమార్గం. అది మా స్నేహానికి ఏనాడు అడ్డురాలేదు. ఆయన వాదమే నిలబడింది. నెగ్గింది.  ఉద్యమం విజయం సాధించి తెలంగాణా కల సాకారమైంది. తదనంతర కాలంలో ఆయన కృషికి గుర్తింపుగా కేసీఆర్ ప్రభుత్వం చక్రపాణి గారిని రాజ్యాంగబద్ధమైన పదవిలో, పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ గా నియమించింది. తనకు అప్పగించిన బాధ్యతలను ఆయన సక్రమంగా నిర్వర్తించారు.

మళ్ళీ ఇప్పుడు తెలంగాణా రాష్ట్రాన్ని  పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆయన సమర్థతను గుర్తించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఘంటా చక్రపాణి గారిని బాబా సాహెబ్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ గా నియమిస్తూ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఈ పదవిలో మూడేళ్లు కొనసాగుతారు. రెండు విభిన్న పార్టీలకు చెందిన ప్రభుత్వాలు, చక్రపాణి గారి చిత్తశుద్ధిని గుర్తించి తగిన పదవులతో సత్కరించడం ఒక విశేషం అయితే, తాను పనిచేస్తున్న విశ్వ విద్యాలయానికే అధిపతి కావడం మరో విశేషం.

ఘంటా చక్రపాణి గారికి అభినందనలు.

కింది ఫోటో:



ఎడమనుంచి కుడికి: నేను, ఘంటా చక్రపాణి, జ్వాలా నరసింహారావు, అల్లం నారాయణ 



 

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (29) - భండారు శ్రీనివాసరావు

 

ఇంటి నిండుగా పిల్లలు వుంటే సందడే సందడి. ఆటలే, ఆటలు. అదే ఆడపిల్లలు వుంటే ఆ తరహా వేరు. వారి ఆటలు వేరు. వారికోసం చేసే వేడుకలు వేరు. అయితే మగపిల్లలు వయసులో చిన్నవారయితే, అన్ని రకాల వేడుకల్లో కూడా వాళ్లకి ఎంట్రీ పాసు వుండేది. ఆ చేసే వేడుకలు ఎందుకు చేస్తున్నారో తెలియకపోయినా వాటిని చూసే అవకాశం మాకుండేది. మంచి నీళ్ళ పంపు దగ్గర పేచీలు పెట్టుకుని కీచులాడుకునే ఆవనంలోని ఆడవాళ్ళందరూ ఈ వేడుకల్లో మాత్రం పడుగూ పేకా మాదిరిగా కలిసిపోయేవారు. ఒకరికొకరు చేదోడువాదోడుగా వుండేవాళ్ళు.

శ్రావణ మాసం వచ్చిందంటే ఆడవాళ్ళ సంగతేమో కానీ పిల్లలకు ఆ నెల మొత్తం  పెద్ద పండగ. శ్రావణ గౌరీ పూజలు, పునస్కారాలు మా అక్కయ్య నిష్టగా చేసేది. శుక్రవారంనాడు మంగళగౌరీ వ్రతం కోసం తెల్లవారుఝామునే లేచి స్నానం చేసి, మడి బట్టలు కట్టుకుని,  ఒంటి చేత్తో నవకాయ పిండి వంటలు సిద్ధం చేసి పూజకు కూర్చునేది. పూజ చేసుకుని ఇంట్లో భోజనాలు పూర్తయ్యాయో లేదో, మళ్ళీ చీరె మార్చుకుని శుక్రవారం పేరంటాలకు సిద్ధం అయ్యేది. అలాగే తాను పిలిచిన ముత్తయిదువులు ఇంటికి వస్తే వాయనాలు ఇవ్వడానికి అన్నీ సిద్ధంగా పెట్టుకునేది. పేరంటాల విషయంలో ఆడవాళ్ళ టైం మేనేజిమెంట్ అపూర్వం, అనితరసాధ్యం.  

 

సందర్భాన్ని బట్టి, మా అక్కయ్య మంగళ హారతులతో పాటు వేరే వేరే పాటలు కూడా పాడుతుండేది.  అర్ధం కాకపోయినా వింటుండేవాళ్ళం.

మా అక్కయ్యకు బహుశా ఎనభై ఏళ్లప్పుడు కాబోలు వాళ్ళ అమ్మాయి దగ్గరికి హైదరాబాదు వచ్చింది. చుట్టూ చేరిన నలుగురు  బలవంత పెడితే ఒక పాట పాడింది. ఆడపిల్లలు పెద్దమనుషులు అయినప్పుడు పాడే సవర్త పాట. అమ్మాయిలు  ఉన్న ప్రతి ఇంట్లో ఎప్పుడో ఒకసారి పాడుకోవాల్సిన పాట. అంత పెద్ద వయస్సులో గుర్తుపెట్టుకుని ఆమె పాడిన ఈ పాటలో ఏదయినా పొరబాట్లు కనిపిస్తే/వినిపిస్తే, దాని వింటూ తిరిగిరాసుకోవడంలో జరిగిన  ఆ తప్పు అక్షరాలా నాదే కాని ఆమెది కాదు, నేను ఏకసంత (గంట) గ్రాహిని. విన్నది ఓ గంట లోపల కాగితం మీద పెట్టక పొతే, విన్నది మొత్తం బల్క్ ఎరేజ్ అయిపోతుంది.       

ఆరోజు సరసక్కయ్య పాడిన సవర్త పాట :

సువ్వియనుచు పాడరమ్మా

సుందరాంగిని చూడరమ్మా

నవ్వే మాట కాదె కొమ్మా

నాతి సవర్తలాడెనమ్మా

బువ్వదినుట నేరదమ్మా

పూబోణి ఎరుగదమ్మా

తల్లి చూచి చెప్పగానే

తలనువంచి నవ్వేనమ్మా

 విప్రవరుల పిలవరమ్మా

విప్పి పంచాంగం చూడగానే

యుక్తమైన నక్షత్రమమ్మా

సువ్వియనుచు పాడరమ్మా

సుందరాంగిని చూడరమ్మా

 

2013 లో  కొద్ది రోజుల తేడాతో  ఇద్దరు అక్కయ్యలు కన్ను మూయడం మొత్తం మా కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. హైదరాబాదులో ఆరో అక్కయ్య ప్రేమక్కయ్య (74)  చనిపోయిన  వార్త తెలియగానే  మా మూడో అక్కయ్య సరస్వతి హుటాహుటిన కారులో తన వయస్సును కూడా (84) లెక్కపెట్టకుండా  ఆమెను చూడడానికి బెజవాడ నుంచి హైదరాబాదు వచ్చింది.  తన కళ్ళముందే చిన్నవాళ్ళు దాటిపోతున్నారని గొల్లుమంది.
 ఏమయిందో యేమో మూడో  రోజున ఆయాసంగా వుందంటే ఆస్పత్రిలో చేర్పించారు. అటునుంచి అటే ఐ.సీ.యూ, తరువాత వెంటిలేటర్. మర్నాడు ఉదయం కల్లా అంతా అయిపోయింది. ప్రేమక్కయ్య పన్నెండో రోజుకు వచ్చిన బంధుగణం అంతా సరసక్కయ్య అంతిమ ఘడియలను చూడాల్సివచ్చింది. ఎవరితో చేయించుకోకుండా పెద్ద ప్రాణం దాటిపోయింది. పెనిమిటి తుర్లపాటి హనుమంతరావు గారు చనిపోయిన నాటి నుంచి  రెండేళ్లుగా ఆమె ప్రాణం ఆయన కోసమే కొట్టుకుంది. ఆ రెండేళ్లు  ఆయన మాట తప్పిస్తే, ఆయన జ్ఞాపకాలు తప్పిస్తే  మరో ముచ్చట ఆమె నోటినుంచి వినలేదు.  దాదాపు డెబ్బయ్  ఏళ్ళ  దాంపత్య అనుబంధం. అందుకే ఆయనలేని లోకంలో ఎక్కువ కాలం మనలేకపోయింది. రోగం రొష్టు అంటూ పిల్లల్ని బాద పెట్టకుండా, తాను బాధ పడకుండా మా బావగారిని వెతుక్కుంటూ పైలోకాలకు వెళ్ళి పోయింది. ధన్యజీవి.

 

కింది ఫోటో:

మా మూడో అక్కయ్య తుర్లపాటి సరస్వతి




 

(ఇంకావుంది)

5, డిసెంబర్ 2024, గురువారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (28) - భండారు శ్రీనివాసరావు

 

వెనిస్ నగరం లాంటిది బెజవాడ. ఊరు మధ్యగా మూడు కాలువలు ప్రవహిస్తూ వుంటాయి. బందరు కాలువ, రైస్ కాలువ, ఏలూరు కాలువ. ఈ మూడు కాలువలకు ఆది పురుషుడు సర్ ఆర్థర్ కాటన్. కృష్ణా బరాజ్ కు ముందు వందేళ్ళ చరిత్ర కలిగిన ఆనకట్టను నిర్మించింది ఈయనే. ఆ కాలంలో భయంకరమైన కరవు కాటకాలతో కృష్ణా ప్రాంతం కకావికలమైంది. ఆకలితో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ పరిస్థితులను గమనించిన కాటన్ దొర కృష్ణా ఆనకట్టకు రూపకల్పన చేశారు.  వందేళ్ళకు పైగా పంట పొలాలకు నీరందించని ఆ ఆనకట్టకు ఆకస్మికంగా వచ్చిన  పెను వరద కారణంగా గండి పడింది. తాత్కాలికంగా గండి పూడ్చినప్పటికీ తదనంతరం ఆనకట్ట స్థానంలో కృష్ణా బరాజ్ ను నిర్మించారు. ఈ బరాజ్ నుంచే ఈ మూడు కాలువలకు నీరు వదులుతారు.  

మరో అతి పెద్ద కాలువ బకింగ్ హాం కాలువ. ఇది బెజవాడ నుంచి మద్రాసు వరకు వుండేదని చెప్పేవారు. ఆ కాలువలో పడవల మీద ప్రయాణాలు చేసేవారు. సరకుల రవాణా  జరిగేది. ప్రస్తుతం అది చాలా చోట్ల పూడికలతో పనికి రాకుండా వుందని వింటున్నాము. ఇది కాక మరో మూడు కాలువలు కృష్ణా బ్యారేజ్ నుంచి సేద్యపు నీటిని కృష్ణా జిల్లాతో పాటు, పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల్లోని అనేక పంట పొలాలకు అందిస్తున్నాయి. గోదావరి డెల్టా పాడి పంటలతో తులతూగడానికి కాటన్ దొరవారి అమృత హస్తం వుందని ఆ ప్రాంతం వారు ఇప్పటికీ ఆయన్ని దేవుడిలా కొలుస్తుంటారు. మరి కృష్ణా జిల్లా వాసులు ఆయన్ని స్మరిస్తున్నట్టు కనబడదు.

వాడుకలో రైస్ కాలువ అని పిలుస్తారు, కానీ అసలు పేరు రైవిస్ కాలువ.  బ్రిటిష్ వారి హయాములో సర్ ఆర్థర్ కాటన్ ఆధ్వర్యంలో నిర్మించిన కృష్ణా ఆనకట్ట నిర్మాణ సమయంలో పనిచేసిన బ్రిటిష్ ఇంజినీర్ కెప్టెన్ జోసెఫ్ గోరె రైవిస్ (Captain Joseph Gore Ryves) పేరు ఈ కాలువకు పెట్టారు. నగరం మధ్యనుండి పోయే ఈ కాలువపై అనేక చోట్ల వంతెనలు నిర్మించారు. గవర్నర్ పేటను గాంధీనగర్ ను విడదీసే రైవిస్ కాలువపై ఒక వంతెన వుంది. దానిపై  నుంచి చూస్తే, కృష్ణనీరు, వేగంగా సుళ్ళు తిరుగుతూ కళ్ళు తిరిగేలా జలజలా ప్రవహిస్తూ వుంటుంది. మా ఈడుకంటే చిన్న పిల్లలు కొందరు అమాంతం ఆ వంతెన మీద నుంచి కిందికి  దూకి,  మళ్ళీ ఈదుకుంటూ బయటకు వచ్చి మళ్ళీ మళ్ళీ కాలువలోకి దూకుతూ ఈతలు కొడుతూ వుండేవారు.  ఈ దృశ్యాలు మాకు భయంగాను, వింతగాను అనిపించేవి. కానీ వాళ్లకు అదో ఆట. బ్రిటిష్ వారి హయాములో నిర్మించిన ఈ కాలువలు కాలక్రమంలో నిర్లక్ష్యానికి గురై దుర్గంధ కాసారాలుగా తయారయ్యాయి. మా చిన్నతనంలోనే ఈ కాలువ వడ్లను బహిరంగ బహిర్భూములుగా ఉపయోగించేవారు. ఆ వంతెనల మీదుగా నడిచి వెళ్ళే వాళ్ళు, ముక్కులు, కళ్ళు మూసుకోవాల్సి వచ్చేది. అప్పటికి ఇళ్ళల్లో మరుగు దొడ్ల సంస్కృతి అలవడలేదు.  కొందరి ఇళ్ళల్లో వున్నా కూడా వాటిని మనుషులే శుభ్రం చేయాల్సిన దుస్థితి. బతుకు బండి లాగడం కోసం కొందరు అలాంటి పనులు చేయాల్సి రావడం నిజంగా దురదృష్టకరమైన పరిస్థితి. వరాహాలు విచ్చలవిడిగా వీధుల్లో సంచరించేవి. బెజవాడ పందులకు ప్రసిద్ధి అని చెప్పుకునే వాళ్ళు.       

రైస్ కాలవ వంతెనకు దగ్గరలో అన్నదాన సమాజం అనే ఒక స్వచ్ఛంద  సంస్థ వుండేది. ఈ సమాజానికి సంబంధించిన కార్యకర్తలు కొందరు, రోజూ  భుజాన ఒక జోలిలాంటిది తగిలించుకుని ఇంటింటికీ తిరిగేవారు. అప్పుడు చిన్నపిల్లలుగా వున్న మేము, వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురుచూసేవాళ్ళం. రాగానే మా చిన్ని చిన్ని గుప్పిళ్ళతో బియ్యం తీసుకువెళ్ళి వాళ్ళ జోలెలో వేసేవాళ్ళం. 'గుప్పెడు బియ్యం వెయ్యండి. ఆకలితో వున్నవాళ్ళకు పట్టెడు అన్నం పెట్టండి' అనేది అన్నదాన సమాజం వారి నినాదం. అలా సేకరించిన బియ్యంతో అనాధ పిల్లలకు, నా అన్నవాళ్లు లేని వృద్ధులకు అన్నం వొండిపెట్టేవారు. ఆ అన్నం తిన్న వాళ్ళు తప్ప, అన్నదాన సమాజం వారిని తలచుకునే ఇతరులు ఉంటారంటే నమ్మడం కష్టమే. ఎందుకంటే చేసే పని మంచిదన్న ఒక్క ధ్యాస తప్ప,, చేసే పనికి ప్రచారం చేసుకోవాలన్న యావ లేనివాళ్ళు కదా ఆ సమాజం వాళ్ళు.

ఇప్పుడది లేదని చెప్పడానికి అక్కడికి వెళ్లి చూడనక్కరలేదు. ప్రభుత్వాల దయాధర్మం వల్ల ఎదిగే సంస్థలు అయితే నాలుగు కాలాలు వర్దిల్లేవి,  , ఏ మంచి పనీ చేయకుండా, ఏదో చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటూ.
కానీ అన్నదాన సమాజం ఆ బాపతు కాదు కదా!

ఆ స్పూర్తితోనే మేము చాలా చిన్నతనంలోనే బాపు బాల సమాజం నడిపాం. ఆ పేరు మా పెద్దన్నయ్య పెట్టాడు. బెజవాడలో చెప్పుకోదగ్గ పనులేవీ చేయలేదు. నిజానికి ఆ వయసులో ఏం చెయ్యాలో కూడా తెలియదు. ఒకసారి ఒక చిన్న పిచ్చుక ఎగరలేక ఇంటి వరండాలో పడి వుండడం చూసి, జాలిపడి దాన్ని తీసుకుని వచ్చి మా బావగారి ప్లీడరు పుస్తకాల మధ్యలో ఉంచాము, అక్కడైతే భద్రంగా ఉంటుందని. అది తినడం కోసం కొన్ని బియ్యపు గింజలు దాని ముందు ఉంచాము. మరునాడు చూస్తే బియ్యపు గింజలు అలాగే వున్నాయి. పిచ్చుకపై చీమలు పాకుతున్నాయి. గుమస్తా శ్రీరాములు గారు చెప్పేవరకు అది చనిపోయిందని తెలియదు.  అసలు చావంటే ఏమిటో తెలియని  మాకు, ఆయన గారు విడమరచి చెప్పిన దాకా మాకూ విషయం అర్ధం కాలేదు. అయ్యో దాన్ని అనవసరంగా ఇంట్లోకి తెచ్చి దాని ప్రాణాలు తీశామే అని చాలా రోజులు బాధ పడ్డాము.

బావగారి ఇంటికి దగ్గరలో దివ్యజ్ఞాన సమాజం వుండేది. బాపూ బాల సమాజ్ లాగా అదో సమాజం అనుకున్నాము. కానీ ఒకసారి   సమాజానికి గవర్నర్ శ్రీ నగేష్ వచ్చారు. ఒక అంబాసిడర్ కారు, వెంట ఇద్దరు పోలీసులు. అంతే! పరివారం. కాకపొతే దివ్యజ్ఞాన సమాజం వారు,  స్థానిక  పెద్దలు ఆయన పట్ల ప్రదర్శించిన గౌరవ మర్యాదలు చూసి గవర్నర్ అంటే చాలా పెద్ద అధికారి  అయివుండాలని అనిపించింది. అప్పటివరకు మా స్కూలు హెడ్ మాస్టారుగారే మా దృష్టిలో పెద్దఅధికారి. ఆయన వస్తే క్లాసు క్లాసంతా లేచి నిలుచుండేది.

కింది ఫోటో: (గూగుల్ సౌజన్యం)

దుర్గంధ కాసారం రైస్ కాలువ, దానిపై వంతెన. 








(ఇంకా వుంది)

    

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (27) - భండారు శ్రీనివాసరావు

 

 

విజయవాడలో నా జీవితం మూడు రకాలుగా సాగింది. మరీ చిన్నతనంలో కొన్నేళ్ళు, ఒక వయసు వచ్చాక కొన్నాళ్ళు, ఉద్యోగపర్వంలో మరి కొన్నేళ్ళు ఇలా అన్నమాట. మధ్యలో కొంత విరామాలు. నాకెందుకో చిన్నతనం నాటి బెజవాడ మీదనే మక్కువ ఎక్కువ. అంతకు ముందు నేను చూడని, చూస్తాను అని అనుకోని బస్తీ జీవితాన్ని అది ప్రసాదించింది. రెండో దశలో అదో పట్టణం. అంతే! మూడో దశనాటికి పూర్తిగా మారిపోలేదు కానీ, ఊరు చాలా మారిపోయింది. ఇక ఇప్పుడా, నేను చూసిన, తచ్చాడిన, తిరిగిన, పెరిగిన ప్రదేశాలను నేనే గుర్తుపట్టలేను. ఒక నగరం రూపు సంతరించుకుంది.  నాటి కళాకాంతిలో కాంతి మిగిలింది. కళ కనుమరుగు అయింది.

బెజవాడలో రాజగోపాలచారి వీధిలో, మరీ  బావగారి ఇంటి ఎదురుగా కాదు కానీ ఐ మూలగా రోడ్డు (అప్పటికి రోడ్డు లేదు, అంచేత వీధి అందాము) దాని అవతల కామేశ్వర్ అండ్ కో అని స్టేషనరీ షాపు వుండేది. కిందా మీదా వారిదే కాని, మొదటి అంతస్తులో దుకాణం. అదొక దుకాణంలా వుండేది కాదు, బ్యాంకు కౌంటర్ మాదిరిగా వుండేది. ఆ కౌంటర్ కు రెండు వైపులా రెండు సింహపు బొమ్మలు.  పలకా బలపం పెన్సిల్, రబ్బర్, నోట్ బుక్ ఏది కావాలన్నా మెట్లెక్కి అక్కడికే పోయేవాళ్ళం. యజమాని కామేశ్వర శాస్త్రి గారి కొడుకు శివ (చిన్నా) మాకు స్నేహితుడు. పెద్దవాళ్లకు తెలియకుండా వెళ్లి సెకండ్ షో సినిమాలు చూసేంతగా వుండేది మా స్నేహం. వాళ్ళ మేడకు పక్కన మిత్రా ఏజెన్సీ షో రూమ్, దానికి పక్కనే లాయర్ చక్రవర్తి గారి కారు షెడ్డు, దానికి ఆనుకునే చక్రవర్తి గారి నివాసం వైట్ హౌస్, ఆ పక్కన చమ్రియా ఫిలిం డిస్త్రిబ్యూటర్స్ ఆఫీసు ఇలా వరుసగా ఉండేవి. వీటన్నిటిలోనే కాదు, బెజవాడ మొత్తంలో అందమైన మేడ చక్రవర్తి గారిది. నిజంగా శ్వేత సౌధం.  దానికి ఎదురు వీధిలో పదడుగులు వేస్తె, ఎడమపక్కన ఏదో కోఆపరేటివ్ బ్యాంక్ (లక్ష్మి విలాస్ బ్యాంక్ అనుకుంటా) మరో నాలుగడుగులు వేస్తె, బీసెంట్ రోడ్డు. ఒక మూలలో దుర్గా కేప్ (ఇక్కడ ఇడ్లీలు , కొబ్బరి చట్నీ ఫేమస్, ఆ మాటకు వస్తే విజయవాడలో ప్రతి హోటల్లో టిఫిన్ బాగుండేది.  బీసెంటు రోడ్డులో నాడార్స్ కాఫీ పౌడర్ దుకాణం. చుట్టూ పచారీ సామాన్లు వున్న పెద్దపెద్ద స్టీలు డబ్బాల మధ్య ఒక లావు పాటి మనిషి కూర్చుని, కస్టమర్లు అడిగిన సరుకులు  కాటాలో తూకం వేసి పాత పేపర్లలో చుట్టి ఇస్తుండే వాడు. మరో లావు పాటి మనిషి వెనుక గల్లాపెట్టె ముందు చిన్న స్టూలు మీద కూర్చుని డబ్బులు తీసుకుంటూవుండేవాడు. ఇద్దరూ షాపు యజమానులే. లావుపాటి శరీరాలు, వొంటి ఛాయను బట్టి చూస్తే అన్నదమ్ములు అనిపిస్తుంది.   మరో పక్క పెద్ద పెద్ద గాజు సీసాల్లో రకరకాల న్యూట్రిన్ కంపెనీ  చాకొలెట్లు, తగరం రేపర్ చుట్టిన కొబ్బరి లౌజు వంటి చాకొలెట్లు వుండేవి. ఇక నాడార్స్ కాఫీ పౌడర్ ఘుమఘుమలు బయటకే ముక్కుపుటాలను తాకేవి. ఆ రోజుల్లో చాలా ప్రసిద్ధి. కాఫీ పొడుం, పంచదార పౌన్ల లెక్కన అమ్మేవాళ్లు. అప్పటికి కిలోల లెక్క రాలేదు. బెల్లం  వీసెల లెక్కన,, నూనెలు అవీ శేర్ల లెక్కన కొలిచేవాళ్ళు.

అదే రోడ్డులో ఒక పక్క మోడరన్ కేప్ వుండేది. అందులో బల్లలు, కుర్చీలు మరెక్కడా కనపడేవి కావు. అంత నాజూకుగా అదో రకం కలపతో  చేసిన కుర్చీలు. బహుశా మద్రాసో, బెంగుళూరో ప్రభావం అనుకుంటా. శుచీశుభ్రత గురించి చెప్పాలి అంటే  ఆ హోటల్ తర్వాతే. సర్వర్లు కూడా చెమటలు కక్కకుండా మంచి యూనిఫారాలతో వుండేవాళ్ళు. సాంబారు బక్కెట్లతో తెచ్చి సర్వ్ చేసేవాళ్ళు, అదీ విసుక్కోకుండా. భోజనాలకు నెలసరి టిక్కెట్లు అమ్మేవాళ్లు. రెండు పూటలకు కలిపి ముప్పయి రూపాయలు. మా బావగారు కొన్ని టిక్కెట్ల పుస్తకాలు కొని, బీద విద్యార్ద్జులకు ఇచ్చేవాళ్ళు. ఇది కాక  మరికొందరికి ఇంట్లోనే వారాలు. వారంలో ప్రతిరోజూ ఒక్కరికి ఒక  వారం. అంటే ఆ రోజు  భోజనం చేస్తే మళ్ళీ వారం రోజుల తర్వాత అదే రోజున  భోజనానికి వచ్చేవాళ్ళు. మిగిలిన రోజులు మరికొందరు వదాన్యుల సాయంతో వారాలు చేసుకుంటూ చదువుకునేవారు. వీళ్ళని వారాలబ్బాయి అనేవాళ్ళు. ఈ పేరుతొ ఒక సినిమా కూడా వచ్చింది. హైదరాబాదులో నా ఉద్యోగ విరమణ తర్వాత నేనూ వారాలు చేసుకునే వాడిని.  ప్రతిరోజూ ఒక టీవీ చర్చకు వెళ్ళేవాడిని. సోమవారం ఒక టీవీకి వెడితే, మళ్ళీ సోమవారమే అక్కడికి వెళ్ళేది. వాళ్లకు కూడా ఇది నచ్చినట్టు వుంది. ప్రతిరోజూ ఈరోజు వస్తారా, వీలవుతుందా   అని అడిగే పని లేకుండా, నెల మొత్తం నా షెడ్యూలు ముందే ఖరారు చేసుకునే వెసులుబాటు లభించింది. నా తరహా గమనించిన ఒక టీవీ అమ్మడు నాకు వారాలబ్బాయి అని పేరు పెట్టింది కూడా.

ఇలా ఏ టు జెడ్ టీవీల్లో వారాలు చేసుకుంటున్న బంగారు కాలంలో, స్వర్ణయుగం అని ఎందుకు అంటున్నానంటే, ఆ రోజుల్లో టీవీ చర్చలు, వాటిల్లో  పాల్గొనే విశ్లేషకులకు సంబంధించి ఆహ్లాదకరంగా జరిగేవి. రాజకీయ పార్టీల ప్రతినిధులు పొట్టు పొట్టయినా మా జోలికి వచ్చేవాళ్ళు కాదు. అలాంటి కాలం మళ్ళీ వస్తుందని నేను అనుకోను. ఎందుకంటే విశ్లేషకుల రూపంలో కొందరు, ఆయా పార్టీల అధికార ప్రతినిధులను మించి మాట్లాడుతున్నారు. నేను సరైన సమయంలోనే కాడి కింద పారేశాను అనుకుంటున్నాను. సరే అలాంటి కాలంలో, ఒక టీవీ చర్చల విరామ సమయంలో టీడీపీ ప్రతినిధి (ఇప్పుడు బీజేపీ అధికార ప్రతినిధి, ఏపీ లో ఇరవై సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్) లంక దినకర్ గారు మోడరన్ కేప్ గురించిన ఓ ముచ్చట చెప్పారు.

మోడరన్ కేఫ్ కంటే ముందు అక్కడ నేతాజీ హోటల్ ఉండేదని, దాన్ని తమ తాతగారు లంక వెంకటేశ్వర రావు స్థాపించారని చెప్పారు. దినకర్ తెలిపిన వివరాల ప్రకారం వెంకటేశ్వరరావు గారు వీరవల్లి గ్రామంలో బడి పంతులుగా పనిచేసారు. తర్వాత బెజవాడ వచ్చి నేతాజీ హోటల్ పెట్టారు. బెజవాడలో అప్పటివరకు ట్యూబ్ లైట్లు లేవు. మొదటి ట్యూబు లైట్ ఆ హోటల్లోనే వెలిగిందని, అలాగే హోటల్లో రేడియో సెట్టు పెట్టి కార్యక్రమాలు వినిపించడం కూడా నేతాజీ హోటల్ తోనే మొదలయిందట. నేతాజీ హోటల్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండవని భావించిన వెంకటేశ్వరరావు గారు, చౌక ధరలకు కాఫీ టిఫిన్లు అందించే ఉద్దేశ్యంతో ఏలూరు రోడ్డులో జనతా హోటల్ పేరుతొ మరో హోటల్ కూడా నడిపారట. నిజంగా ఇవి నాకు తెలియని విషయాలే.  

మోడరన్ కేప్ హోటల్లోనే ఒక ఏసీ రూమ్. దాని తలుపు ఎంత మందంగా వుండేది అంటే ఒక పట్టాన తెరుచుకునేది కాదు. లోపలకు వెళ్ళగానే చక్కటి సువాసనతో కూడిన చల్లటి  గాలి ఒంటిని చుట్టుముట్టేది. ఒక్క క్షణం స్వర్గంలో వున్నట్టు అనిపించేది. ఒక్క క్షణమే. మా వాళ్ళు ఎవరో అక్కడ వున్నట్టు వెళ్లి, మళ్ళీ  మరుక్షణం బయటకు వచ్చేవాళ్ళం. ఎందుకంటే అక్కడ పదార్ధాలు ఖరీదు. ఆ రోజుల్లో బెజవాడ మొత్తంలో  ఏసీ రూమ్ వున్న హోటళ్ళు రెండే. మరోటి గాంధీ నగర్లో వెల్కం హోటల్ కు అనుబంధంగా ఉన్న ఎస్కిమో. తరువాత ఎప్పుడో, మమతా, మనోరమా,   నటరాజ్ హోటళ్ళు వచ్చాయి.  

ఇక లాయర్ చక్రవర్తి గారి నివాసం వైట్ హౌస్ విషయానికి వస్తే, అదొక అద్భుతమైన కట్టడం. దసరా రోజుల్లో చక్రవర్తి గారి భార్య, ఇంట్లో  బొమ్మల కొలువు పెట్టి పేరంటానికి మా అక్కయ్యను పిలిచేవారు. పిల్లల కోడిలా మిమ్మల్ని వెంటబెట్టుకుని వెళ్ళేది. ఆ విధంగా ఆ ఇంటి వైభోగం కళ్ళారా చూసే అవకాశం మాకు దొరికేది.   ఇంటి ముందు లాన్. రెండు తెల్లటి పప్పీలు (కుక్క పిల్లలు, అచ్చం బొమ్మల్లాగే వుండేవి. కుక్కల్లో అలాంటివి వుంటాయని, అంత అందమైన కుక్కలు ఉంటాయని  పల్లెటూరు నుంచి వచ్చిన నాకు మొదటిసారి తెలిసింది) పెద్ద మేడ. కిందా పైనా అనేక గదులు. ఒక పెద్ద హాలు. గోడలు, ఇంటి పైకప్పు తెల్లటి తెలుపు.

హాలు మధ్యలో సోఫాల నడుమ  మధ్యలో బొమ్మల కొలువు. సినిమా సెట్టింగులా వుండేది. దేవుళ్ల బొమ్మలు సరే. ఇవికాక కృష్ణా బ్యారేజి, కిందికి నీళ్ళు పారే ఏర్పాటు. అన్నన్ని బొమ్మలు మిగిలిన రోజుల్లో ఏమి చేసుకుంటారో. తలా ఒకటి ఇస్తే పోలా అనిపించేది.

ఇప్పుడా అందమైన భవంతి వున్నట్టు లేదు రాజగోపాలాచారి వీధిలో ఒకప్పుడు మొత్తం పట్టణానికి తలమానికంగా వున్న చక్రవర్తి గారి వైట్ హౌస్ స్థానంలో ఇప్పుడు ఏదో మాల్ వచ్చిందని వింటున్నాను.

జంధ్యాల శంకర్ గారు విజయవాడ మేయర్ గా వున్నప్పుడు ఒక ఆలోచన చేశారు. బెజవాడ అంటే ఇదీ అని, భావి తరాలకు గుర్తు చేసే కట్టడాలు, భవనాలు, నిర్మాణాల ఫోటోలు తీసి భద్రపరచాలని. ఆ దిశగా ఆయన కృషి చేశారు కూడా. అవి కంప్యూటర్ రోజులు కావు కదా శాశ్వతంగా పదిలపరచడానికి. ఆ ఫోటోల పరిస్థితి ఏమిటన్నది  ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు.    

కింది ఫోటోలు:


బీసెంటు రోడ్డులో మోడరన్ కేప్


నాడార్స్ కాఫీ అండ్ జనరల్ స్టోర్స్
 (గూగుల్ సౌజన్యం)






(ఇంకా వుంది)

4, డిసెంబర్ 2024, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (26) - భండారు శ్రీనివాసరావు

 

 

‘నీకు బాగా డబ్బులు వుంటే ఏం చేస్తావ్ అని అడిగితే, ‘పుల్ల ఐస్ క్రీం బండి కొనుక్కుంటా అని అమాయకంగా జవాబు ఇచ్చే చిన్నతనపు రోజులు. సీవీఆర్ స్కూలుకు ఎదురుగా ఉండేవాడు ఈ బండి వాడు గంటలు కొట్టుకుంటూ. వాడు, వాడి పిల్లలు ఎంత అదృష్టవంతులో అనిపించేది. దాని వైపే చూస్తూ, కొనడానికి డబ్బులు వుండేవి కాదు కాబట్టి, రోడ్డు దాటి సిటీ సివిల్ కోర్టు కేంటీన్ వైపు వెళ్ళేవాళ్ళం నేను, శాయిబాబు, భయం భయంగా. మా లక్కు బాగుంటే బావగారి కంట పడకుండా, కోర్టు గుమాస్తా గారి కంట్లో పడే వాళ్ళం. మిమ్మల్ని చూడగానే ఆయన రండి రండి అంటూ, మా ప్లీదరుగారి పిల్లలు అని క్లయింట్లకు పరిచయం చేసి వారి డబ్బులతోనే మాకు టిఫిన్లు పెట్టిన్చేవాళ్ళు. వేడి వేడి మైసూరు బజ్జీలు, మరోసారి కొబ్బరి చట్నీ వేయించుకుని లొట్టలు వేసుకుంటూ తిని నెమ్మదిగా జారుకుండేవాళ్ళం.

కోర్టు గుమాస్తా గారి పేరు శ్రీరాములు. వయసులో మా బావగారి కంటే పెద్ద వయసులో. ఆయనే అప్పుడప్పుడు మా ఇద్దర్నీ వెంటబెట్టుకుని బీసెంటు రోడ్డులోని దుర్గా కాఫీ హౌస్ కి తీసుకువెళ్ళేవాడు. బయట అందరూ తినేచోట కాకుండా, లోపల ఒక గదిలో పీటలు వేసి, సిల్వర్ ప్లేటు మీద విస్తరి ఆకు వేసి టిఫిన్లు పెట్టేవాళ్ళు. వేడివేడి ఇడ్లీలు, అడిగినంత కొబ్బరి చట్నీ, సాంబారు, కారప్పొడి, అల్లం చట్నీ చాలా రుచిగా చేసేవాళ్ళు. గుమాస్తా గారు మాత్రం కాఫీ మాత్రం తాగేవారు. అలా దాదాపు పదేళ్లు పనిచేసిన శ్రీరాములు గారు వయసు మేడ పడి సెలవు పుచ్చుకున్న తర్వాత మరో కొత్త గుమాస్తా చేరారు. అయితే అప్పటికి నా చదువు ఖమ్మానికి మారింది.

ఇంట్లో ట్యూషన్ చెప్పడానికి వెంకటేశ్వర్లు గారనే మాస్టారు సాయంత్రం వేళ వచ్చేవారు. ఆయన కోపిష్టి కాదు కానీ చాలా స్ట్రిక్ట్. ఎక్కాలు చెప్పేటప్పుడు మా చూపుడు వేలు గోరు మీద తన గోరు పెట్టి, తప్పు చెప్పినప్పుడల్లా గట్టిగా నొక్కేవారు. ప్రాణం పోతుంది అన్న నొప్పి వేసేది. ఆ బాధలో మళ్ళీ తప్పు చెప్పేవాళ్ళం. ఆయన మళ్ళీ నొక్కేవాడు. ఈ తతంగం అక్కడ ఉన్నవారికి కూడా కనపడదు. మేము ఎందుకు ఏడుస్తున్నామో ఎవరికీ తెలియదు. ఎక్కాలు సరిగా చెప్పడం లేదని అనుకునేవాళ్లు. అసలు ఈ ఎక్కాలు ఎందుకు? రెండు రెండు నాలుగు సరే, పదమూడు పదమూళ్ళు ఎంతయితే ఎందుకు? కూడు పెడతాయా, గుడ్డపెడతాయా అనే విధంగా సాగేవి నా ఆలోచనలు.

చిన్నప్పుడు నాకు తగని దైవ భక్తి. మా బావగారి ఇంట్లో పెరగడం ఒక కారణం అయితే, దేవుడికి పూజలు చేస్తే కోరిన కూరికలు తీరుస్తాడు అనే నమ్మకం ప్రబలడం. దేవుడా దేవుడా నీకు దండం పెడతాను, మేష్టారు కొట్టకుండా నాకు చదువు వచ్చేట్టు చూడు అనేది నా నిత్య  ప్రార్థన. చదువు రాకపోతే పీడాపాయే, ఆయన కొట్టకుండా చూడు అనేది నా అనుబంధ ఆకాంక్ష. ఆ దేవుడు ఇవేవీ పట్టించుకున్నట్టు లేదు.

అయినా పొద్దున్నే లేచి స్నానం చేసి, విభూతి పట్టెడలు  నుదుటి మీడా, భుజాల మీదా రాసుకుని చొక్కా లేకుండా, చెట్ల బజారులు అరండల్ సత్రానికి ఎదురుగా వున్న శివాలయానికి వెళ్లి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి, నంది విగ్రహం కొమ్ముల మధ్య నుంచి శివ లింగాన్ని ఓ మారు చూసి శివుడి ఎదురుగా నిలబడి, వినాయక చవితి పూజలో బట్టీ పట్టిన రెండు మూడు పద్యాలు పాడి, దణ్ణం పెట్టుకుని, కాసేపు అక్కడే బాసింపట్లు వేసుకుని కూర్చుని, గుడి ఆవరణలో వున్న శివలింగం పూల చెట్టు రాల్చిన కొన్ని పూలు (ఈ పూలకు ఏదో పేరుంది, శివ నాగమల్లి అని గుర్తు. చిన్న లింగంపై పాము పడగ  మాదిరిగా వుంటుంది)  ఏరుకుని ఇంటికి వచ్చేవాడిని. నా భక్తికి ఇంత ఘనమైన చరిత్ర వుంది.

ఇక నెలకో రెండు నెలలకూ ఓ మారు మా అక్కయ్య రిక్షాలో మమ్మల్ని  దుర్గ గుడికి తీసుకు వెళ్ళేది. వన్ టౌన్ లో ఉన్న దుర్గగుడి మెట్ల దగ్గర రిక్షా ఆగగానే నేను ముందంటే, నేను ముందంటూ పిల్లలం మెట్ల మీద పరుగులు పెట్టేవాళ్ళం. మెట్ల మీద కూర్చుని అడుక్కుంటున్నవారికి ఐదో పదో పైసలు వేస్తూ మా అక్కయ్య నెమ్మదిగా వచ్చేది.

దుర్గామాత రాక్షస సంహారం తరువాత కొన్నాళ్ళు ఇంద్రకీలాద్రిపై విశ్రాంతి తీసుకుంటుంది.  విజయం లభించిన ప్రదేశం (వాడ) కావడంవల్ల,  ఆ పట్టణానికి విజయవాడ అనే నామం వచ్చిందని స్థల పురాణం. అలాగే,  మహాభారతంలో శివునికీ, అర్జునికీ నడుమ ఇంద్రకీలాద్రి కొండపైనే సంగ్రామం జరిగిందని ఐతిహ్యం. అర్జునుడి శక్తికి మెచ్చి శంకరుడు అతడికి పాశుపతాస్త్రం ప్రసాదిస్తాడు. అర్జునుడి నామాలలో ఒకటయిన విజయుడి పేరు మీద విజయవాడగా ప్రసిద్ధి పొందిందని కొందరి నమ్మకం.

దుర్గ గుడిలో వున్న కాసేపు కళ్ళు మూసుకుని భక్తితోనే వుండేవాళ్ళం. ఒకటికి రెండుసార్లు సాష్టాంగనమస్కారాలు చేసేవాళ్ళం. గర్భగుడి ద్వారంపై రాసివున్న, ‘మాణిక్య వీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరాణి అనే శ్లోకానికి అర్ధం తెలియక పోయినా పెద్దగా చదివేవాళ్ళం. మా దృష్టి ప్రధానంగా అమ్మవారి ముక్కు పుడకపై వుండేది. దానికి కారణం,  ఏదో ఒకనాడు పక్కన పారే కృష్ణమ్మ పొంగి అమ్మవారి ముక్కు పుడకను తాకి, దాన్ని తీసుకుని వెళ్ళిపోతుందని, అది జరిగిన నాడు ఈ కలి యుగం అంతం అవుతుందనీ అంతకు ముందు విని వుండడమే. ఇవన్నీ ఎందుకు రాస్తున్నాను అంటే ఆ రోజుల్లో దుర్గగుడి దర్శనాలు ఎంత సులభంగా జరిగేవి అనే విషయమం ఈ తరం వారికి తెలియచెప్పడం కోసం.  దర్సనం కాగానే శఠారి, అమ్మవారి కుంకుమ తీసుకుని మల్లేశ్వర స్వామి దేవాలయం వైపు పరుగులు తీసేవాళ్ళం, పెద్దవాళ్లు వచ్చేలోగా మధ్య దారిలో ఉన్న గోపికా కృష్ణుల విగ్రహాల వద్ద కాసేపు ఆగి, కృష్ణుడి చుట్టు వున్న గోపికలు తమ చేతుల్లోని పిచికారీలతో నీళ్ళు చల్లుతున్న దృశ్యాలను కళ్ళారా చూడడానికి. రంగురంగుల దీపాలతో చాలా మనోహరంగా వుండేది. మల్లేశ్వర దేవాలయం దుర్గగుడి కంటే పెద్దే అయినా అక్కడ పెద్దగా జనం వుండేవారు కాదు. తీరిగ్గా  ప్రదక్షిణలు చేసి మరింత తీరుబడిగా దర్శనం చేసుకుని, అక్కడ వున్న నిలువెత్తు విభూతి గుండ నుంచి విభూతి తీసుకుని మొహాలకు రాసుకుండేవాళ్ళం.  గుడి ఆవరణలో అద్దాల మేడ చూడడం మాకు ఇష్టం. దానికి టిక్కెట్టు వుంది. లోపల ఎటు చూసినా నిలువెత్తు అద్దాలే. పక్కనా, పైనా అద్దాలే. బ్రూస్ ళీ సినిమాలో మాదిరిగా ఎటు చూసినా మాకు మేమే కనబడేవాళ్ళం. మా చిన్నతనంలో ఇలాంటివే మాకు విభ్రమ కలిగించే వింతలు.

అటునుంచి అటే కిందికి  మెట్లు వున్నాయి. దిగి రిక్షా ఎక్కేటప్పుడు అనిపించేది పక్కనే రోడ్డు దాటి కృష్ణా బ్యారేజ్ చూసివస్తే ఎలా వుంటుంది అని. అయితే ఆ మాట పైకి అనే ధైర్యం ఎవరికీ వుండేది కాదు.  

కింది ఫోటో: శివనాగమల్లి పుష్పం (గూగుల్ సౌజన్యం)




  (ఇంకా వుంది)