20, జులై 2023, గురువారం
అన్ని రోడ్లు అటువైపే - భండారు శ్రీనివాసరావు
19, జులై 2023, బుధవారం
మౌనమే నీభాష – భండారు శ్రీనివాసరావు
మొన్న జ్వాలా ఫోన్ చేశాడు.
‘
ఎప్పుడూ మేము చేయడమేనా! నువ్వు ఫోన్ చేయవా?’
నిజమే!
కాల్ లిస్టు తీసి చూస్తే అవుట్ గోయింగ్ ఒకటి రెండు కూడా లేవు. అన్నీ ఇన్ కమింగే.
సాయంత్రం
అన్నయ్య కుమార్తె వేణి ఖమ్మం నుంచి ఫోన్ చేసింది.
ఏమిటి
విశేషం అన్నాను మామూలుగా.
అదే
బాబాయ్ నేను చెబుదామని అనుకున్నది. విశేషం ఉంటేనే ఫోన్ చేయాలా! మామూలుగా ఫోన్ చేసి క్షేమ సమాచారాలు కనుక్కుంటే చాలా
బాగుంటుంది అన్నది. అంతే కాదు చిన్నతనం నాటి ఒక వృత్తాంతం చెప్పింది. అన్నయ్య ఉద్యోగ రీత్యా వైజాగ్ లో
వున్నప్పుడు పోస్టాఫీసు నుంచి ఓ డజన్ కార్డులు కొనుక్కు వచ్చి వేణి చేతికి ఇచ్చి
చెప్పాడుట. ‘అడ్రసు కూడా రాసి పెట్టాను. నువ్వు చేయాల్సింది అల్లా వారానికి ఒక
కార్డు కంభంపాడులో ఉన్న బామ్మకు పోస్టు చేయి. పెద్ద విశేషాలు రాయక్కరలేదు. మేము
క్షేమం, మీరు కులాసాగా
వున్నారని భావిస్తాను అని రాయి చాలు. పల్లెటూళ్ళో ఉంటున్న ఆమెకు ఈ సమాచారం ఎంతో
ఊరట ఇస్తుంది. మనమంతా తనకు మానసికంగా దగ్గరగా వున్నామనే భావన పెద్దవాళ్లకు చాలా
సంతోషం కలిగిస్తుంది. ఈ వయసులో వారికి కావాల్సింది ఇంతకంటే ఏమీ వుండదు అని.
‘నాన్న
చెప్పింది నా మనసులో ముద్ర పడింది. అందుకే మీ వంటివారికి తరచుగా ఫోన్ చేసి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను’
మంచి నిర్ణయం వేణీ అన్నాను.
జ్వాలా
చెప్పింది, వేణి
చెప్పింది ఒకటే.
నిజానికి
ఇలాంటి మాటలు అన్నీ నేనే ఒకప్పుడు ఫేస్ బుక్ లో పోస్టు చేస్తూ వచ్చాను.
‘మధ్య
మధ్య కలుస్తూ వుంటేనే కుటుంబ బంధాలు, మధ్య మధ్య మాట్లాడుకుంటూ వుంటేనే
స్నేహ సంబంధాలు’ అంటూ గొప్పగా నీతులు చెప్పాను. కానీ నేను చేస్తున్నది ఏమిటి?
పక్కవారికి
చెప్పేటందుకే నీతులు వున్నాయి అనుకోవాలా!
చేతిలో
ఫోన్ అస్తమానం వుంటుంది. వెనుకటి మాదిరిగా గుండె గుభిల్లుమనే చార్జీల బాధ లేదు.
మరి ఎందుకీ నిర్లిప్తత.
నాకూ
చిన్నతనం గుర్తుకు వచ్చింది. సొంతంగా ఇంట్లో ఫోన్ లేకపోయినా మిత్రులతో, చుట్టాలతో మాట్లాడాలని తాపత్రయ
పడేవాళ్ళం. పుట్టిన రోజు సందర్భాల్లో ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలుపుకునే వాళ్ళం.
ఇప్పుడూ చెబుతున్నాం. ఫేస్ బుక్ లోనూ, వాట్సప్ లోనూ మొక్కుబడిగా షరా
మామూలు గ్రీటింగ్ పెట్టి ఊరుకుంటున్నాం. అదీ ఫేస్ బుక్ వాడు గుర్తు చేస్తేనే సుమా.
వాళ్ళు చూస్తారో తెలియదు. ఒక పని అయిపొయింది అనుకుంటాం. అలా కాకుండా ఆ ఒక్కరోజు
ఫోన్ చేసి శుభకామనలు తెలియచేస్తే ఎంత బాగుంటుంది.
అంత
తీరికలేని పనులు ఏమీ లేవు కదా!
కానీ
ఇంత చిన్న చిన్న పనులు ఎందుకు చేస్తాం!
Courtesy Cartoonist
శ్రీ రమణ ఇక లేరు
1975 లో ఆంధ్ర జ్యోతి నుంచి నా నిష్క్రమణ అనంతరం ఎడిటర్ నండూరి రామమోహనరావు గారి కోరికపై శ్రీ రమణ గారు జ్యోతిలో చేరారు. తర్వాత కాలంలో శ్రీ రమణ గారు హైదరాబాద్ వచ్చారు. వారిని ఐ. వెంకట్రావు గారు నాకు మహా టీవీలో పరిచయం చేశారు. రాతల్లో వుండే శ్లేష, వ్యంగం ఆయన మాటల్లో కూడా తొంగి చూసేది. నేనంటే ఇష్టపడేవారు. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం. నిజానికి ఆయన మాట్లాడేవారు నేను వింటూవుండేవాడిని. అలా వినడం నాకు ఇష్టం. ఇక మిధునం విడుదల అయినప్పుడు హైదరాబాద్ లో వున్న పది కుటుంబాల వాళ్ళం కట్టకట్టుకుని ఫస్ట్ డే ఫస్ట్ షో కి వెళ్ళాం. బహుశా శంకరా భరణం తర్వాత అలా ఇంటిల్లపాది కలిసి చూసిన చిత్రం మిథునం మాత్రమే. ఆ సినిమాకు నేను ఫేస్ బుక్ లో రాసిన రివ్యూ చదివి శ్రీ రమణ గారు నాకు ఫోన్ చేసి అభినందించడం గర్వంగా ఫీలవుతాను. బాపు గారి చూసి రాతతో పబ్లిష్ చేసిన మిథునం పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు.
17, జులై 2023, సోమవారం
తట్టిలేపే జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు
మధ్య తరగతి వాళ్ళు అందరూ ఎప్పుడో ఒకప్పుడు ఒక పగటి కల కంటూ వుంటారు. ఏదో ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని.(చిన్నిల్లు, పెద్దిల్లు అనే పాడు అపార్థాలు చేసుకోవద్దు ప్లీజ్)
అలా నేనూ మా ఆవిడా విడివిడిగా, కలివిడిగా కలలు కనే రోజుల్లో కలలో మేము కట్టుకోబోయే ఆ కొత్త ఇంటికి పూజ గది విడిగా వుండాలని కోరుకునేది తాను. అద్దె ఇళ్ళు మారుస్తూ హైదరాబాదును ఏళ్ళ తరబడి చుట్టబెడుతున్న తరుణంలో పూజ గది వుండే అద్దె ఇల్లు దొరకడం అసాధ్యం. అంచేత చిక్కడపల్లి దాకా వెళ్లి ఇదిగో ఈ కింద ఫోటోలోని పూజ అల్మరా ఒకటి కొనుక్కొచ్చుకుంది. అందులో దేవుళ్ల విగ్రహాలు, ఫోటోల సంచితాన్ని భద్రపరచుకుంది. నేనెప్పుడూ లెక్కపెట్టలేదు కాని ముక్కోటి దేవతలు అందులో కొలువు తీరారు అనిపించేది.
ఈరోజు జులై 17. అంచేతే కాబోలు ఓ జ్ఞాపకం మనసుని తట్టి లేపింది.
నాలుగేళ్ల క్రితం అంటే 17-07-2019 నాడు పొద్దున్నే ఏదో ఛానల్ డిబేట్ కి వెళ్లి ఇంటికి తిరిగొచ్చేసరికి మా ఆవిడ పూజ అల్మరాలో దేవుళ్ళు అందరూ కట్టగట్టుకుని మాయం అయిపోయారు. ఏమిటీ విష్ణు మాయ అనుకుని ఆశ్చర్య పోతూ ఉండగానే శుభ్రంగా తోమిన దేవుడి విగ్రహాలను మరింత మెరిసేలా తుడుస్తూ మా ఆవిడ ప్రత్యక్షం అయింది.
“ అమ్మయ్య! దేవుళ్ళు అందరూ తలంట్లు పోసుకుని గూటికి చేరుతున్నారు “ అని ఓ జోకు జోకాను.
ఈ జోకు మా ఆవిడ విన్నదో లేదో కాని ఆమె చేతిలో ఉన్న దేవుళ్ళు విన్నారు, విని కోపగించుకున్నారు అన్న సంగతి నెల తర్వాత తెలిసి వచ్చింది.
సరిగ్గా నెలలోపే ఆగస్టు 18న, ఇంట్లో దేవుళ్ళు అందరూ అలాగే వున్నారు. వాళ్లకు నిత్య పూజలు చేసే దేవతే లేకుండా వెళ్లి పోయింది.
దేవుళ్లా! మజాకా!
17-07-2023
13, జూన్ 2023, మంగళవారం
సన్ ఆర్ సన్ ఇన్ లా పాలసి – భండారు శ్రీనివాసరావు
25, మే 2023, గురువారం
ఎం.వి.ఎస్. ప్రసాద్ (ఐ.ఏ.ఎస్.) ఇక లేరు
గత మార్చి పదకొండో తేదీన ఎం.వి.ఎస్. ప్రసాద్ గారు ఫేస్ బుక్ లో ఈ కింది కవిత రాశారు. అది చదివిన మావంటివాళ్ళం నివ్వెరపోయాము. ఏమిటి సార్ ఇలా రాసారు అని అడిగాము కూడా. కానీ ఆయన గారి దగ్గరనుంచి సమాధానం లేదు. అది ఇలా సాగింది.
“అలసిపోయాను ధైర్యం పూర్తిగా మరుగునపడింది
అధఃపాతాళంకి దిగజారిన ఆలోచనా స్రవంతి
జీవితంలో బుస్సుమని పొంగి పొర్లిన ధారాపాతం
నేలపాలయి బురద బురద చేసి కకావికలైంది
బురదపాలైన కాళ్ళు కడుగుదామంటే నీరింకిపాయే
ఎన్నాళ్లీ ఇష్టంలేని ప్రయాణం ఇక ఆగిపోతే బాగుండు”
చివరి వాక్యం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఏమిటి ఈ నిర్వేదం అనిపించింది.
ఆయన రాసుకున్నట్టే ఆయనకు ఇష్టం లేని ప్రయాణం ఈరోజు అంటే మే 25 మధ్యాన్నం నిజంగానే ఆగిపోయింది.
1975 లో నేను ఆలిండియా రేడియోలో చేరినప్పుడు నాకు తారసపడిన మొదటి ప్రభుత్వ అధికారి ఏమ్వీఎస్ గారు. అప్పుడు ఆయన SFDA (Small Farmers Development Agency) కి ఆయన అధికారి. ఎమర్జెన్సీ లో కావాల్సినవి డెవలప్ మెంట్ వార్తలే కాబట్టి ఆయన్ని కలిసాను. అలా అప్పుడు ఏర్పడ్డ పరిచయం ఇప్పటిదాకా కొనసాగింది. ఆయన ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ చాలా కీలకమైన పదవులు నిర్వహించారు. టీటీడీ ఈవో, దేవాదాయ శాఖ కమిషనర్, జీఏడి సెక్రెటరి ఇలా ఎన్నో. కానీ ఎక్కడా తన మంచి పేరు చెడగొట్టుకోలేదు. రిటైర్ అయిన తర్వాత తన ఇంటి పేరుతొ మేళ్లచెరువు ఫౌందేసన్ స్థాపించి అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఆయన స్వగ్రామం కూడా మేళ్లచెరువు (ప్రకాశం జిల్లా). కనిపినప్పుడు లేదా ఫోన్ చేసినప్పుడు మా దేవాలయం ఒకసారి వచ్చి చూడండి అనేవారు. ఇక అలాంటి ఆహ్వానం ఆయన నుంచి రాదు.
Madhavi Kolli కొల్లి మాధవి గారు కొంతసేపటి క్రితం ఫేస్ బుక్ లో ఈ సమాచారం ఇచ్చినప్పుడు నా సమాధానం UNBELIEVABLE. గబాగబా అన్ని ఛానల్స్ తిప్పాను. ఎక్కడా ఈ వార్త జాడలేదు.
చాలా వార్తలు తర్వాత నిజం కాదని తేలిపోతాయి. కానీ ఇది అలా కాదే!
బహుశా ఎల్లుండి అంత్యక్రియలు జరగొచ్చని ఏమ్వీఎస్ గారి అబ్బాయి ద్వారా తెలిసిందని ఇప్పుడే పాత్రికేయ మిత్రుడు చిర్రావూరి కృష్ణా రావు మెసేజ్ పెట్టాడు.
(25-05-2023)
20, మే 2023, శనివారం
ఒకటోసారి..రెండోస్సారి.. మ్మూడోస్సారి... భండారు శ్రీనివాసరావు
(Published in ANDHRAPRABHA today, 20-05-2023, Saturday)
1978 వ
సంవత్సరం. జనవరి నెల. 14 వ తేదీ ఉదయం.
ముంబై (అప్పుడు బొంబాయి) లో వున్న రిజర్వ్ బ్యాంకు
చీఫ్ అక్కౌంట్స్ కార్యాలయంలో సీనియర్ అధికారి ఆర్. జానకి రామన్ ఇంట్లో ఫోను
మోగింది. వెంటనే ఢిల్లీ రావలసిందని ఒక ప్రభుత్వ అధికారి ఆదేశం.
జానకి రామన్ బొంబాయి నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్ళీ
వెళ్ళగానే అక్కడి ఉన్నతాధికారులు ఒక ఆర్డినెన్స్ ముసాయిదాను ఒకే ఒక్క రోజులో తయారు చేయాలని ఆయన్ని
కోరారు. పెద్ద విలువకలిగిన కరెన్సీ నోట్లని చెలామణి నుంచి తప్పించాలని
ప్రభుత్వం సంకల్పించిందని, అందుకు తగిన ఆర్డినెన్స్ సిద్ధం చేయాలని, ఇదంతా
చాలా గోప్యంగా జరగాలని రామన్ ను ఆదేశించారు.
ఇప్పట్లా ఆరోజుల్లో సెల్ ఫోన్ వంటి కమ్యూనికేషన్
సదుపాయాలు లేవు. అయినా ఆర్బీఐ కేంద్ర కార్యాలయం నుంచి ఎటువంటి సమాచారం బయటకి
పొక్కకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
అనుకున్న పద్దతిలోనే ఆర్డినెన్స్ ముసాయిదా తయారయింది. జనవరి 16 తెల్లవారుఝాముకల్లా రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి
సంతకం కోసం పంపారు. అదే రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఆకాశవాణి ద్వారా పెద్ద కరెన్సీ
నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ ప్రజలకు తెలిసిపోయింది. ముందు
జాగ్రత్తగా జనవరి పదిహేడునాడు దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకులు, ప్రభుత్వ
ట్రెజరీలు మూసివేశారు.
అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఐ.జీ. పటేల్ కు ఈ పెద్ద నోట్ల
రద్దు వ్యవహారం నచ్చలేదు. సంకీర్ణ జనతా ప్రభుత్వంలోని కొందరు నాయకులు పెద్ద నోట్ల
రద్దుకు పట్టుబట్టడం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందన్నది ఆయన
అభిప్రాయం. అంతకు పూర్వం దేశాన్ని పాలించిన నాయకుల అవినీతి పనులను లక్ష్యంగా
పెట్టుకుని ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుందని పటేల్ చెప్పారు.
భారతీయ ఆర్ధిక విధానాలు అనే అంశంపై పటేల్ రాసిన
పుస్తకంలో ఇంకా ఇలా పేర్కొన్నారు.
“పెద్ద
విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేయాలనే నిర్ణయం గురించి ఆర్ధిక మంత్రి
హెచ్.ఎం.పటేల్ నాతొ ప్రస్తావించారు. అటువంటి సంచలన నిర్ణయాలతో అద్భుత ఫలితాలు
రాబట్టడం చాలా అరుదుగా జరుగుతుందని నేను మంత్రితో స్పష్టంగా చెప్పాను.
“సాధారణంగా
అవినీతి, అక్రమ పద్ధతుల్లో భారీఎత్తున డబ్బు పోగేసుకునేవాళ్ళలో అత్యధికులు ఆ సంపదను
కరెన్సీ రూపంలో ఎక్కువ కాలం దాచిపెట్టుకోరు” అన్నది
నాటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పటేల్ అభిప్రాయం. పిచ్చి పిచ్చిగా డబ్బు
పోగేసుకున్న ఖామందులవాళ్ళు నల్ల డబ్బు దాచుకునే మార్గాలు వేరే ఉంటాయని ఆయన
మనోగతం కావచ్చు.
“నల్ల
డబ్బును సూట్ కేసుల్లో, దిండ్లకవర్లలో కుక్కి దాస్తారని అనుకోవడం అజ్ఞానమే
అవుతుంది” అని కూడా పటేల్ మహాశయులు అభిప్రాయపడ్డారు.
ఇది జరిగి 45 ఏళ్ళు అవుతోంది.
2016, నవంబరు,8, న్యూ ఢిల్లీ
ఆ సాయంత్రం ఢిల్లీలో కేంద్ర మంత్రిమండలి సమావేశం
జరిగింది. అంతకు ముందు ప్రధాని త్రివిధ సైనిక దళాల అధిపతులతో సమావేశం అయ్యారు.
సరిహద్దుల్లో ఇప్పటికే యుద్ధ వాతావరణం ఏర్పడి వుండడం చేత ప్రధాని అనుకు సంబంధించి
ఏదో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. క్యాబినెట్
ఎజెండాలో ఈ నిర్ణయానికి సంబంధించి కానీ, సరిహద్దులలో తీవ్రత గురించిన అంశం
కానీ ఏదీ లేదు. సమావేశం ముగిసే సమయంలో ప్రధానమంత్రి మోడీ పెద్ద నోట్ల చెలామణి
రద్దు నిర్ణయాన్ని క్లుప్తంగా తెలియచేసి మంత్రులనందరినీ సమావేశ మందిరంలోనే
కూర్చోబెట్టి ప్రభుత్వ సంకల్పాన్ని రాష్ట్రపతికి తెలియచేడానికి వెళ్ళారు. ఆ తరువాత
నేరుగా దేశ ప్రజల నుద్దేశించి రేడియో, దూరదర్సన్ లలో ప్రసంగించారు. ఆ
సంస్థల అధికారులకి కూడా ముందస్తు సమాచారం ఇవ్వలేదు. మంత్రులు సయితం సమావేశ మందిరం
నుంచే ప్రధాని ప్రసంగం విన్నారు. ఆ తరువాతనే వారు బయటకు వెళ్ళారు.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని మోడీ ఆరుమాసాల క్రితమే
తీసుకున్నారని, అప్పటినుంచి దాన్ని అమలు చేయడానికి దశలవారీ ప్రణాళిక
రూపొందించుకున్నారని భోగట్టా. ఈ విషయంలో గోప్యత చాలా కీలకం అని భావించిన నరేంద్ర
మోడీ, చాలా కాలంనుంచే మంత్రివర్గ సమావేశాలకు మంత్రులు ఎవరూ
తమవెంట సెల్ ఫోన్లు తెచ్చుకోకుండా కట్టడి చేసారు.
నోట్ల రద్దు నిర్ణయం గురించి మొత్తం దేశంలో తెలిసిన
వాళ్ళు పది మంది మాత్రమే అని, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పదవి నుంచి తప్పుకున్న
రఘురాం రాజన్ అందులో ఒకరని తెలుసుకుని ఆశ్చర్యపోవడం మీడియా వంతయింది. మొత్తం
వ్యవహారాన్ని అత్యంత రహస్యంగా ఉంచినా ఇలాంటిది ఏదో జరగబోతోందన్న సంకేతాలు మాత్రం
గత కొద్ది కాలంగా వెలువడుతూనే వున్నాయి. కొత్త రెండువేల రూపాయల నోటు నమూనా
తయారుచేయడం, ఆమోదించడం, ఆ నోట్లను పెద్ద మొత్తంలో
ముద్రించడం జరిగిపోయాయి. అయితే ఆ విషయం తెలిసిన వాళ్ళు ఇది షరా మామూలుగా జరిగే
నోట్ల ముద్రణగా భావించారు కానీ దీని వెనుక ఇంత భారీ నిర్ణయం వుందని అంచనా
వేయలేకపోయారు.
ప్రధాని ప్రసంగం ముగించిన వెంటనే, దాన్ని విన్న ఆసేతుహిమాచలం ప్రజలందరికీ, దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న
నల్ల ధనం పిశాచి భరతం పట్టడానికి మోడీ ఎంతో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్న ఒకే
అభిప్రాయం కలిగింది. మొనగాడంటే మోడీ అనే రీతిలో సాంఘిక మాధ్యమాల్లో మోడీని
ప్రశంసలతో ముంచెత్తారు. “కొద్ది రోజులు కటకటపడితే పడదాము, కష్టాలు శాశ్వతంగా తీరిపోతున్నప్పుడు తాత్కాలిక ఇబ్బందులను
పట్టించుకోవద్దు” అనే భావన సర్వత్రా కనబడింది.
గతంలో నాటి జనత ప్రభుత్వానికి నేతృత్వం వహించింది
గుజరాత్ కు చెందిన మొరార్జీ దేశాయ్. మళ్ళీ చాలా ఏళ్ళ తరువాత పెద్ద
నోట్లని రద్దు చేయాలని నిర్ణయించింది కూడా అదే రాష్ట్రానికి చెందిన నేటి
ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఇది కాకతాళీయం కావచ్చు. అలాగే ఈ రెండు నిర్ణయాలు,
కాంగ్రెసేతర ప్రభుత్వాలు కేంద్రంలో కొలువు తీరి వున్నప్పుడు తీసుకోవడం
కొట్టవచ్చినట్టు కానవచ్చే మరో పోలిక.
ఇప్పుడు, అంటే తాజాగా కొద్ది సేపటి క్రితమే మ్మూడో స్సారి.
రెండువేల రూపాయల నోట్లకు మంగళం!
కాకపొతే ప్రకటన బాధ్యత ఈసారి రిజర్వ్ బ్యాంక్ కు
అప్పగించారు.
NOTE: Courtesy Image Owner)
19-05-2023
