19, జులై 2023, బుధవారం

మౌనమే నీభాష – భండారు శ్రీనివాసరావు

 మొన్న జ్వాలా ఫోన్ చేశాడు.

‘ ఎప్పుడూ మేము చేయడమేనా! నువ్వు ఫోన్ చేయవా?

నిజమే! కాల్ లిస్టు తీసి చూస్తే అవుట్ గోయింగ్ ఒకటి రెండు కూడా లేవు. అన్నీ ఇన్ కమింగే.

సాయంత్రం అన్నయ్య కుమార్తె వేణి ఖమ్మం నుంచి ఫోన్ చేసింది.

ఏమిటి విశేషం అన్నాను మామూలుగా.

అదే బాబాయ్ నేను చెబుదామని అనుకున్నది. విశేషం ఉంటేనే ఫోన్ చేయాలా! మామూలుగా  ఫోన్ చేసి క్షేమ సమాచారాలు కనుక్కుంటే చాలా బాగుంటుంది అన్నది. అంతే కాదు చిన్నతనం నాటి ఒక వృత్తాంతం  చెప్పింది. అన్నయ్య ఉద్యోగ రీత్యా వైజాగ్ లో వున్నప్పుడు పోస్టాఫీసు నుంచి ఓ డజన్ కార్డులు కొనుక్కు వచ్చి వేణి చేతికి ఇచ్చి చెప్పాడుట. ‘అడ్రసు కూడా రాసి పెట్టాను. నువ్వు చేయాల్సింది అల్లా వారానికి ఒక కార్డు కంభంపాడులో ఉన్న బామ్మకు పోస్టు చేయి. పెద్ద విశేషాలు రాయక్కరలేదు. మేము క్షేమం, మీరు కులాసాగా వున్నారని భావిస్తాను అని రాయి చాలు. పల్లెటూళ్ళో ఉంటున్న ఆమెకు ఈ సమాచారం ఎంతో ఊరట ఇస్తుంది. మనమంతా తనకు మానసికంగా దగ్గరగా వున్నామనే భావన పెద్దవాళ్లకు చాలా సంతోషం కలిగిస్తుంది. ఈ వయసులో వారికి కావాల్సింది ఇంతకంటే ఏమీ వుండదు అని.

‘నాన్న చెప్పింది నా మనసులో ముద్ర పడింది. అందుకే మీ వంటివారికి తరచుగా ఫోన్  చేసి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను’

 మంచి నిర్ణయం వేణీ అన్నాను.

జ్వాలా చెప్పింది, వేణి చెప్పింది ఒకటే.

నిజానికి ఇలాంటి మాటలు అన్నీ నేనే ఒకప్పుడు ఫేస్ బుక్ లో పోస్టు చేస్తూ వచ్చాను.

‘మధ్య మధ్య కలుస్తూ వుంటేనే కుటుంబ బంధాలు, మధ్య మధ్య  మాట్లాడుకుంటూ వుంటేనే స్నేహ సంబంధాలు’ అంటూ గొప్పగా నీతులు చెప్పాను. కానీ నేను చేస్తున్నది ఏమిటి?

పక్కవారికి చెప్పేటందుకే నీతులు వున్నాయి  అనుకోవాలా!

చేతిలో ఫోన్ అస్తమానం వుంటుంది. వెనుకటి మాదిరిగా గుండె గుభిల్లుమనే చార్జీల బాధ లేదు. మరి ఎందుకీ నిర్లిప్తత.

నాకూ చిన్నతనం గుర్తుకు వచ్చింది. సొంతంగా ఇంట్లో ఫోన్ లేకపోయినా మిత్రులతో, చుట్టాలతో మాట్లాడాలని తాపత్రయ పడేవాళ్ళం.  పుట్టిన రోజు సందర్భాల్లో  ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలుపుకునే వాళ్ళం. ఇప్పుడూ చెబుతున్నాం. ఫేస్ బుక్ లోనూ, వాట్సప్ లోనూ  మొక్కుబడిగా షరా మామూలు గ్రీటింగ్ పెట్టి ఊరుకుంటున్నాం. అదీ ఫేస్ బుక్ వాడు గుర్తు చేస్తేనే సుమా. వాళ్ళు చూస్తారో తెలియదు. ఒక పని అయిపొయింది అనుకుంటాం. అలా కాకుండా ఆ ఒక్కరోజు ఫోన్ చేసి శుభకామనలు తెలియచేస్తే ఎంత బాగుంటుంది.

అంత తీరికలేని పనులు ఏమీ లేవు కదా!

కానీ ఇంత చిన్న చిన్న పనులు ఎందుకు చేస్తాం!    



Courtesy Cartoonist

 

కామెంట్‌లు లేవు: