20, మార్చి 2023, సోమవారం

విషాద సందర్భంలో అపూర్వ కలయిక – భండారు శ్రీనివాసరావు

 IAS, IPS మాదిరిగానే IIS (Indian Information Service) కూడా ఒక ఆలిండియా సర్వీసు. ఈ సర్వీసు వాళ్ళు మొత్తం దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి వుంటుంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఫీల్డ్ పబ్లిసిటీ, ఆలిండియా రేడియో, దూరదర్సన్, ఫిలిమ్స్ డివిజన్, యోజన సాంగ్ అండ్ డ్రామా మొదలైన అనేక విభాగాల్లో ఈ సర్వీసు అధికారులు పనిచేస్తుంటారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వుంటాయి.

కింది చిత్రంలో కనిపించేవారు అందరూ సీనియర్ అధికారులుగా దశాబ్దాల తరబడి పనిచేసి ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్నారు. ఇందులో నేను కూడా వున్నాను. వయసులో తప్ప మిగిలిన వాళ్ళు అందరూ నాకంటే అన్నింటా మిన్న. వీరిలో చాలామందితో కలిసి పనిచేసే అవకాశం నాకు దక్కింది.

ఇటీవల మాబృందంలో ఇద్దరు, ఆర్.ఆర్.రావు గారు, అబిద్ సిద్దికి గారు ఆకస్మికంగా మరణించారు. వారి సంస్మరణ సభ బన్సీలాల్ పేట లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం లోని పి.ఐ.బి. కాన్ఫరెన్స్ హాలులో ఈరోజు సోమవారం సాయంత్రం జరిగింది.

కింది ఫోటోలో: ఆర్వీవీ కృష్ణా రావు, నేను, సి.జి.కె మూర్తి, ఎం.వి.ఎస్.ఎస్. మూర్తి, ఖాన్ షకీల్, సురేంద్రబాబు, వేదగిరి విజయ కుమార్, వెంకటప్పయ్య, బాఖర్ మీర్జా 



(20-03-2023)       

రంగమార్తాండ – భండారు శ్రీనివాసరావు

 ఎప్పుడో యాభయ్  ఏళ్ళకు పూర్వం బెజవాడ ఆంధ్రజ్యోతిలో పనిచేసేటప్పుడు సినిమా ప్రీ వ్యూ (PREVIEW) లకు వెళ్ళే వాడిని. జ్యోతి వార పత్రిక ఎడిటర్ పురాణం సుబ్రమణ్య శర్మగారు వీటిని ఫ్రీ వ్యూ (FREE VIEW) లు అని చమత్కరించేవారు.

మొన్న ఫేస్ బుక్ మితృలు, రచయిత, చిత్రకారులు అయిన లక్ష్మీ భూపాల్ గారు రంగ మార్తాండ ప్రీ వ్యూ కి ఆహ్వానించారు. సినిమాలు చూసే అలవాటు చిన్నప్పుడు అందరిలాగే నాకూ వుండేది. క్రమంగా ఉద్యోగం, సాయంకాలక్షేపాలతో సమయం కుదించుకు పోయి, సినిమాలు చూడడం తగ్గిపోయింది. అయినా మిత్రులను కలవడానికి మంచి అవకాశం అని వెళ్లాను. వెళ్లక పొతే ఒక మంచి సినిమా చూసే అవకాశం తప్పిపోయేది కూడా.

ప్రసాద్  ప్రీవ్యూ ధియేటర్ కి వెళ్ళిన తర్వాత తెలిసింది,  సినిమా రంగ మార్తాండ,  దర్శకుడు కృష్ణ వంశీ అని. కృష్ణ వంశీ గారి కొన్ని చిత్రాలు గతంలో నేను థియేటర్లలో చూశాను. చందమామ సినిమా చూసిన తర్వాత అమ్మయ్య వీరి పేరు కనబడితే ఇక ఆ సినిమా నిశ్చింతగా చూడవచ్చు అనే భరోసా కలిగింది. రంగ మార్తాండ సినిమాలో చాలా నచ్చిన అంశాలు, కొద్దిగా కొన్ని నచ్చని సీన్లు వున్నాయి. (ప్రకాష్ రాజ్ ని ఉద్దేశించి  బ్రహ్మానందం తరచుగా అనే మాటలు లాంటివి).   కళ్ళనీళ్ళు ఆపుకోలేరు అని ఈ సినిమా నాకంటే ముందు చూసిన వాళ్ళు కొందరు రాసేసారు. దాంతో కృష్ణ వంశీ గారి ట్రేడ్ మార్క్ అయిన సునిశిత హాస్యం కనిపించదేమో అని సందేహం కలిగింది.

బ్రహ్మానందం వున్నారు కదా పర్వాలేదు అని సర్ది చెప్పుకున్నాను. కానీ కృష్ణ వంశీ గారు ఆయన్ని, ఆహార్యంతో సహా  పూర్తిగా  విభిన్నంగా చూపారు. ఆయన ఏడుస్తూ జనాలను ఏడిపిస్తూ నవ్వించిన తీరు అమోఘం. రంగ మార్తాండ రాఘవరావుగా ప్రకాష్ రాజ్  తన డైలాగులతో దున్నేసారు. వాటికి యువ ప్రేక్షకులు కనెక్ట్ అయితే మాత్రం, ఈ సినిమాకు పట్టపగ్గాలు వుండవు. నాటకాలు అంటే ఏమిటి అనే యువత జీవిస్తున్న ప్రస్తుత సమాజంలో నాటకాలని ప్రధాన వస్తువుగా తీసుకుని ధైర్యంగా  తీసిన సినిమా ఇది. వెంటనే శంకరాభరణం గుర్తుకు వచ్చింది. ఆనాటి యువతీ యువకులు అప్పుడే రిలీజ్ అయిన ఆకలి రాజ్యం సినిమాని మించి, సంగీత ప్రధానంగా వచ్చిన శంకరాభరణం సినిమాని నెత్తిన పెట్టుకున్నారు. రంగమార్తాండ కూడా అదే కోవలోకి చేరుతుందని సినిమా చూసిన తర్వాత అనిపించింది. సినిమాలో మరికొన్ని పాత్రల్లో నటించిన నటీనటులు వాళ్ళ కోసమే ఆ  పాత్రలు సృష్టించారా అన్నట్టు వాటిల్లో సహజంగా ఒదిగి పోయారు. వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు. ముఖ్య తారాగణంతో పాటు వారూ ప్రశంసలకు అర్హులే. ఇక రమ్యకృష్ణ గారు.

తొంభయ్యవ దశకంలో నేను  మాస్కోలో రేడియో మాస్కోలో పనిచేసిన అయిదేళ్లు ఒక పాటని తప్పకుండా వేసేవాడిని. విశ్వనాధ్ గారి సూత్రధారులు సినిమాలో జోలా జేజోలా అని రమ్య కృష్ణ పాత్రధారి చేత పాడించిన పాట అది.

అందరూ తమ నటనతో చెరిగిపారేస్తే, రమ్యకృష్ణ నటించకుండా చిత్రాన్ని పై మెట్టులో నిలబెట్టారు. పాత్రలో జీవించారు అనే ప్రశంస కూడా చిన్నదే అవుతుంది. అసలు డైలాగులే తక్కువ. అవన్నీ ప్రకాష్ రాజ్ కోటాలోకి వెళ్లిపోయాయి. ఒక తల్లిగా అవధులు దాటని పాత్ర పోషిస్తూ, ఉన్నట్టుండి భార్య పాత్రలో ఒక సందర్భంలో ఆమె ప్రదర్శించిన  హావభావాలను చూసిన తర్వాత ఆమెకు ఏ అవార్డు ఇచ్చినా తక్కువే అనిపించింది. భర్తను కూతురే దొంగ అన్నప్పుడు నాన్నను దొంగ అంటావా అంటూ రౌద్రంగా చూసిన చూపుకు ఆ కూతురు పాత్రధారి మాడి మసై పోతుందేమో అన్న భావన కలిగింది. ఏదో పల్లెటూరులో రచ్చ బండ మీద చెట్టు నీడలో కళ్ళు మూసుకుని కన్ను మూసిన తీరు క్లియో పాట్రాని గుర్తు చేసింది. నుదుట కుంకుమ మెరుస్తూ వుంటే తల కింద చేయి పెట్టుకుని ఓ అందాల దేవత ప్రశాంతంగా  నిద్రిస్తున్నదా అనిపించింది.

రంగమార్తాండ చిత్రానికి పూర్తి మార్కులు వేయాల్సి వస్తే, కృష్ణ వంశీ తర్వాత ఆ అర్హత వున్నది  రమ్యకృష్ణకే.

ఈ చిత్రాన్ని టిక్కెట్టు కొనుక్కుని థియేటర్ లో చూడాలి అనుకుంటే మాత్రం ఆమె అద్భుతమైన నటన కోసమే చూడాలి.

ఈ సినిమా చూడడానికి దోహద పడ్డవారు ఎంతోమంది

వున్నా ముందు థాంక్స్ చెప్పుకోవాల్సింది. లక్ష్మీ భూపాల గారికి.



(పై ఫోటోలో ఎడమనుంచి కుడికి: లక్ష్మి భూపాల, నేను, కృష్ణ వంశీ, శివ రాచర్ల)



(19-03-2023)

                 

19, మార్చి 2023, ఆదివారం

శ్రమజీవికి ఎంత కష్టం! ఎంత కష్టం!! – భండారు శ్రీనివాసరావు

 

(Published in Andhra Prabha today, 19-03-2023, SUNDAY)
ఈ కధనానికి ఓ నేపధ్యం వుంది. తర్వాత చెబుతాను.
కొన్నేళ్ళ క్రితం మేము అద్దెకు వుంటున్న మా అపార్ట్ మెంటుకు ఐమూలగా ఓ ఖాళీ స్థలం వుండేది. కొద్ది రోజుల్లోనే అక్కడ ఇంటి నిర్మాణం మొదలు పెట్టారు. హైదరాబాదులాంటి నగరంలో ఇది కొత్త విషయం ఏమీ కాదు. కానీ కొత్తగా ప్రస్తావించుకోవడానికి కొత్త నేపధ్యం ఒకటి కలిసి వచ్చింది. కరెంటు లేకపోవడం వల్ల ఎండగాలో వడగాలో ఏదో ఓ గాలి వస్తే చాలనుకుని పడక గది కిటికీ తెరిచాను. ఆర్నెల్ల కిందట ఆకారం కూడా లేని ఆ నిర్మాణం చిత్రంగా రెండంతస్తులు లేచింది. మూడోదానిమీద పిల్లర్లు వేస్తున్నారు. ఓ యాభయ్ అరవై మంది కూలీలు ఆడా మగా సుశిక్షితులయిన సైనికుల మాదిరిగా నిర్విరామంగా ఆ ఎర్రటి ఎండలో పనిచేస్తున్నారు. కొందరు కంకర ఎత్తి పోస్తుంటే మరికొందరు ఇసుక, సిమెంటు కొలిచి గుండ్రంగా తిరుగుతున్న ఓ మిక్సింగ్ యంత్రంలో పోస్తున్నారు. అలా తయారయిన కాంక్రీటును ఓ చిన్న లిఫ్ట్ లాంటి యంత్రం మూడో అంతస్తుకు చేరుస్తోంది. అక్కడ దాన్ని దించుకున్న కూలీలు బొచ్చెల్లో తీసుకు వెళ్ళి పిల్లర్లను నింపుతున్న కూలీలకు అందిస్తున్నారు. అంతా ఒక క్రమపధ్ధతి ప్రకారం జరిగిపోతోంది. బోలెడు కష్టపడిపోతున్న ఫీలింగు కూడా వారిలో వున్నట్టు దూరం నుంచి గమనిస్తున్న నా దృష్టికి ఆనలేదు. సరిగ్గా వొంటిగంట కాగానే గంట కొట్టినట్టు పనులు ఆగిపోయాయి. ఎవరికి వారు అక్కడ డ్రమ్ముల్లో వున్న నీళ్ళతో మొహం కాళ్ళూ చేతులూ కడుక్కుని, ఇళ్లనుంచి క్యారేజీల్లో తెచ్చుకున్న భోజనాలు చేశారు.
ఈ లోగా మా ఇంట్లో కరెంటు వచ్చింది. ప్యాను తిరిగింది. వొళ్ళు చల్లబడింది. కానీ ఎర్రటి ఎండలో కూలీల చుట్టూ తిరిగొచ్చిన మనసు మాత్రం ఇంకా వేడిగానే వుంది. ఆవిర్లు కక్కుతూనే వుంది.
అసలు విషయం ఇప్పుడు విప్పుతాను. మొదట్లో నేపధ్యం ఒకటుంది అని చెప్పాను గుర్తుంది కదా! అదే ఇది.
నగర విస్తరణలు అభివృద్ధిలో భాగం. రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు అభివృద్ధి సూచికల్లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. తక్కువ వ్యవధిలో ఎక్కువ సంపాదనకు అవకాశం ఉన్న వ్యాపారరంగం కావడంతో అవినీతిలో అభివృద్ధి కూడా దినదినాభివృద్ధి చెందుతోంది. ఎన్ని నియమాలు, కఠినతర నిబంధనలు, చిత్తశుద్ధి కలిగిన అధికార యంత్రాంగం ఉన్నప్పటికీ, అనుమతుల మంజూరీలో డబ్బులు చేతులు మారక తప్పని పరిస్థితే వుంది. రాత్రికి రాత్రే కోట్లకు పడగలు ఎత్తగల అవకాశాలు పుష్కలంగా ఉన్న రంగం కనుక రియల్టర్లు కొల్లలుగా పుట్టుకు వచ్చారు. అత్యధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించే రంగం కావడం, పెట్టుబడికి మించి ఇబ్బడి ముబ్బడి లాభాల పంట పండించే వీలుసాళ్ళు అపారంగా వుండడం వంటి కారణాలతో రియల్ ఎస్టేట్ రంగం మూడు పువ్వులు, ఆరుకాయలుగా విలసిల్లుతున్న మాట కూడా నిజం. పెద్ద మొత్తాల్లో ఆర్జనకు అవకాశాలు వుంటాయి కనుక ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా అదే స్థాయిలో వుండడం సహజం. పైగా రాజకీయుల వత్తాసు కారణంగా అక్రమ నిర్మాణాలు ఏ నగరంలో చూసినా పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్నాయి. ఇవన్నీ చక్కటి నగర శోభను మటుమాయం చేస్తున్నాయి. విదేశాల్లో స్థిరపడిన ప్రవాసులు స్వస్థలాలకు తిరిగి రావడానికి ఇచ్చగించకపోవడానికి గల కారణాల్లో ఇదొకటి. కాబట్టి అక్రమ భవన నిర్మాణాలకు అడ్డుకట్ట వేసే ఎలాంటి ప్రయత్నాన్ని అయినా సామాన్య ప్రజలు హర్షిస్తారు, స్వాగతిస్తారు. సందేహం లేదు.
ఈ సమస్య ఏ ఒక్క హైదరాబాదుకు లేక ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు మాత్రమే పరిమితం కాదు. పల్లెలు పట్టణాలుగా, పట్టణాలు నగరాలుగా, నగరాలు విశ్వ నగరాలుగా మార్పు చెందడం అనేది పరిణామ క్రమంలో భాగం. అయితే ఇదంతా ఒక పద్దతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం జరిగినప్పుడే అది సరైన అభివృద్ధి అవుతుంది. ఇందుకోసమే ప్రతి పట్టణంలో ప్లానింగ్ విభాగాలు ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం భవన నిర్మాణాలు జరిగేలా కనిపెట్టి చూడడం ఈ విభాగాల విధి. అయితే నిర్మాణాలు పూర్తయిన తర్వాత వాటికి ఏదో ఒక పేరుతొ నిర్మాణ అనుమతులు పొందడం సాధ్యం అయ్యే పరిస్థితులను అలాంటి రియల్టర్లు చక్కగా ఉపయోగించుకోవడంతో వీటికి అడ్డూ అదుపూ లేకుండా పోతున్న మాట కూడా వాస్తవం.
మరో పక్క, అక్రమ నిర్మాణాల పేరుతొ పెద్ద పెద్ద భవనాలను కూల్చివేస్తున్న వార్తలు తరచుగా వింటుంటాము. నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి నిర్మాణాలను అనుమతించకూడదని నమ్మే వారిలో నేనూ వున్నాను. అక్రమ కట్టడాలను తొలగిస్తున్న ఫోటోలను పత్రికల్లో చూసినప్పుడు, ఇదిగో ఇప్పుడు చెప్పానే, మా ఇంటి దగ్గర నిర్మాణంలో వున్న ఇంటికంటే అవి చాలా పెద్దవిగా అనిపిస్తుంటాయి. ఆరునెలల నుంచి కడుతున్నా ఇది ఇంకా పూర్తి కాలేదు. అలాటిది ఆ కూల్చేసిన ఇళ్ళను కట్టడానికి కనీసం ఏడాది, రెండేళ్లు అయినా పట్టి వుంటుంది. అన్నాళ్ళు అధికారులు, అనుమతులు లేకుండా జరుగుతున్న ఆ నిర్మాణాలను గమనించలేదా! లేదా కళ్ళుండి కూడా నేను గమనించనట్టు వాళ్ళూ చూడలేదా! ఒక్క ఇల్లు కట్టడానికే ఇంతమంది ఇంతటి ఎండాకాలంలో తమ రక్త మాంసాలను ఫణంగా పెట్టి ఎంతో శ్రమ పడుతున్నారు. ఇసుక సిమెంట్ కంకరతో పాటు వారి స్వేదం కూడా ఆ నిర్మాణం అణువణువులో వుంది. ఎంతో కష్టపడి కట్టిన ఇళ్లను ఏమాత్రం కష్టపడకుండా యంత్రాల సాయంతో కూల్చివేయడం ఏం న్యాయం? ఎలాటి న్యాయం అనిపించుకుంటుంది. అంత డబ్బుకు, అది ఎవరిదయినా కావచ్చు పూర్తిగా నీళ్లు వొదులుకున్నట్టే కదా! ఇన్నాళ్ళు అనుమతి లేని నిర్మాణాలను కాసులకు కక్కుర్తిపడి అనుమతిస్తూ వచ్చిన అధికారులను, సిబ్బందిని వారు ఎవరయినా సరే, వారి వెనుక ఎవరు వున్నా సరే, కనీసం ఓ యాభయ్ మందిని నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాలనుంచి ఉన్నపెట్టున శాశ్వతంగా తొలగిస్తే మళ్ళీ ఇలాటి నిర్మాణాలు జరుగుతాయా! ఆ మాత్రం భయం వారిలో కలిగించడం సర్కారు తలచుకుంటే సాధ్యం కాదా!
కొన్నేళ్ళ క్రితం, మీడియాలో స్క్రోలింగులు చకచకా పరుగులు తీసాయి.
హైదరాబాదు పొలిమేరల్లో మల్లంపేట చెరువులో అక్రమనిర్మాణాలు. ఏకంగా 260 ఖరీదైన విల్లాలు. రాత్రికి రాత్రే సాధ్యం అయ్యే నిర్మాణ వ్యవహారం కాదు. విషయం బయటకి పొక్కడంతో వాటిల్లో 120 విల్లాలను అధికారులు సీజ్ చేశారు. మీడియా ఈ విషయాన్ని ఎత్తి చూపింది. వాటిని ఏం చేస్తారు. కూల్చేస్తారా! ఏం చేశారన్నవిషయంలో తర్వాత మీడియా కూడా పట్టించుకున్నట్టు లేదు. అందుకు సంబంధించిన ఎలాంటి వార్తా లేదు. స్వాధీనం చేసుకున్నారు సరే! వాటిని ఏం చేశారు? కూల్చివేతే తుది పరిష్కారమా! వాటిని కట్టడానికి అయిన వ్యయం, వాటిని నిర్మించడానికి వేలాదిమంది కార్మికులు అహోరాత్రులు పడిన శ్రమ బూడిద పాలేనా! ఇలాంటి సంఘటనలు దేశ వ్యాప్తంగా లెక్క వేస్తే ఆ నష్టాన్ని అంకెల్లో లెక్కపెట్టడం కుదిరే పనేనా! కట్టడానికి ముందే కట్టకుండా చర్యలు తీసుకునే విధానం వుంటే అసలు నిర్మాణాలను కూల్చే అవసరమే రాదు కదా!
ఆ స్థాయిలో భారీ నిర్మాణాలు పూర్తయ్యేవరకు అంతకాలం కళ్ళు మూసుకున్న వారిపై చర్యలు ఉండవా!
ఉంటాయో ఉండవో తెలియదు కానీ ఈ ప్రశ్నలకు జవాబులు వుండవు.
అయితే, సిబ్బంది కొరత అనే సమాధానం మాత్రం సిద్ధంగా వుంటుంది.











(19-03-2023, SUNDAY)

16, మార్చి 2023, గురువారం

60-77-78

 ‘శ్రీనివాసరావు గారు. కాలేజీలో కానీ స్కూల్లో కానీ నాటకాలు వేసిన అనుభవం ఉందా”

సత్యం వేమూరి గారు హఠాత్తుగా ఈ ప్రశ్న వేయడంతో ఏం చెప్పాలో ఓ క్షణం అర్ధం కాలేదు.

ఆయనే అన్నారు, నా అవస్థ చూసి.

‘లోగడ అనుభవం వున్నా లేకపోయినా, ఈరోజు కొంచెం మీ నటన మాకు చూపాలి. ఏం లేదు, మీ ముందు పెట్టిన టిఫిన్ లాంటి తినుబండారాలను తింటున్నట్టు నటిస్తే చాలు

అప్పుడు కానీ విషయం బోధపడలేదు.

ఆయనలోని స్పాంటేనియస్ హ్యూమర్ కి ఇది ఒక మచ్చు తునక.

ఈ రోజు ఉదయం ఫోన్ చేశారు.

‘అమెరికా నుంచి మన ఫేస్ బుక్ మితృలు  శ్రీనివాస్ సత్తిరాజు ఫోన్ చేసి మా ఇంటికి వస్తామన్నారు. మీ ఫోన్ నెంబరు తెలియక మీకు చెప్పమని కూడా నాతొ చెప్పారు. మా ఇంటికి దగ్గరే కనుక మీకు ఏ టైం ఫ్రీ నో చెబితే వచ్చి కలుస్తామని అన్నారు సత్యం గారు.

శ్రీనివాస్ ఫేస్ బుక్ లో చాలా ఆక్టివ్ గా వుంటారు. పోస్టుల ద్వారా బాగా తెలిసిన మనిషి.

‘మళ్ళీ విడిగా ఎందుకు. మీకు అభ్యంతరం లేకపోతె నేనే మీ ఇంటికి వస్తాను. మా ఇంటి నుంచి కూత వేటు దూరమే కదా!’

అన్నట్టుగానే వారి ఇంటికి వెళ్లాను. కూత వేటు అంటే మెట్రో రైలు స్టేషన్ వారి ఇంటి పక్కనే వుంటుంది. రైలు కూతవేటు దూరం అన్నమాట.

వెళ్ళే సరికి సత్యం గారు, వారి శ్రీమతి, అమెరికా నుంచి వచ్చిన బాబీ అంటే శ్రీనివాస్ సత్తిరాజు గారు, సత్యం గారి  కుమారుడు బాబీ (ఆయన కూడా ఈ మధ్యనే అమెరకా నుంచి వచ్చారు) గ్రీన్ టీ, తినుబండారాలు సిద్ధం.

సరే! శ్రీనివాస్ గారు కబుర్ల పుట్ట. సత్యం గారు ఒక మాటతో ఆ పుట్ట తవ్వారు. ఇక కబుర్లే కబుర్లు.

చాలా సేపు కూర్చుని, కొంతసేపు తిన్నట్టు నటించి, టీ విషయంలో నటన తగ్గించి, ఆస్వాదిస్తూ గ్రీన్ టీ సేవించి ..

సత్తిరాజు శ్రీనివాస్ వాళ్ళ అక్కయ్య వాళ్ళ ఇంటికీ, నేను మా ఇంటికి.

వెళ్ళేటప్పుడు ఒంటరిగా, వచ్చేటప్పుడు చిరు చినుకులు నాకు తోడు.

కింది ఫోటో: (ఎడమ నుంచి కుడికి)

 భండారు శ్రీనివాసరావు అను నేను ( 77), శ్రీనివాస్ సత్తిరాజు ( 60 ), సత్యం వేమూరి గారు (78)

(బ్రాకెట్లలో వయసులుఅన్నమాట)   



16-03-2023  

12, మార్చి 2023, ఆదివారం

జారుడు మెట్లు – భండారు శ్రీనివాసరావు

(Published in Andhra Prabha on 12-03-2023, SUNDAY today)


ఏదైనా ప్రధాన పార్టీకి చెందిన ఒక పెద్ద నాయకుడు మరో పార్టీలోకి జారిపోతే ఆ సందర్భాన్ని, 'పార్టీ మార్పిళ్ళకు పరాకాష్ట’  అని గిట్టని పార్టీల వాళ్లు వ్యాఖ్యానిస్తుంటారు. ఇదేదో కొత్త విషయం అయితే ఆశ్చర్య పడాలి. ఈ చేరికలకు, చీలికలకు ఇది మొదలూ కాదు, చివరా కాదు. అందుకే విమర్శించేవారు మరో సందర్భంలో సమర్ధించడానికి సిద్ధంగా ఉండడానికి సిద్ధపడి వుండాలి. సమర్ధించేవారు ఇంకో సందర్భంలో విమర్శించడానికి సంసిద్ధంగా వుండడం కూడా అంతే  అవసరం.  ఎందుకంటే ఈ పార్టీ మార్పిళ్ళు అనేవి అన్ని పార్టీలకి తప్పనిసరి అవసరం కాబట్టి.  ఎవరూ దీనికి అతీతులు కాదు కాబట్టి. మరో 'మార్పిడి' జరిగేవరకు పాత దానిపై దుమారం సాగిపోతుంది, ఆ  తరువాత అది పాత పడిపోతుంది. కొత్తది తెర మీదికి వస్తుంది. చర్చ మళ్ళీ మొదలవుతుంది. లేదా బయటకు వెళ్ళిన వాళ్ళే ఇదో విష చక్ర భ్రమణం.       

'నిలకడగా  నిల్వవున్న నీరు నాచు పట్టి నీచు వాసన వేస్తుంది. పారే నీరు పారదర్శకంగా స్వచ్చంగా కనబడుతుంది'   

పార్టీ మార్పిడులను సమర్ధిస్తూ ఓ రాజకీయ నేత చేసిన వ్యాఖ్య ఇది. మరి సమర్ధనకు ఈ వ్యాఖ్యను పరాకాష్టగా తీసుకోవాలేమో.  

పార్టీలు ఏర్పడినప్పుడే మార్పిళ్ళ సంస్కృతికి కూడా బీజాలు పడ్డాయంటారు. పార్టీలు వుంటేనే కదా మార్పిళ్ళు జరిగేది. అందుకే రాజకీయుల అవసరాలకు తగ్గట్టు పార్టీలు కూడా పుట్టుకొస్తుంటాయి.

1947లో దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత 1952లో తొలిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అప్పుడు దేశంలో అందరి నోళ్ళలో నానుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తుల పుణ్యమా అని అనేక పార్టీలు పుట్టుకొచ్చాయి. కొన్ని కాలపరీక్షకు తట్టుకున్నాయి. కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. మరికొన్ని ఎంతో కొంత ఓట్ల శాతాన్ని దక్కించుకుంటూ తమ ఉనికిని కాపాడుకుంటున్నాయి.

2014 జూన్  రెండో తేదీన తెలంగాణా రాష్ట్రం ఆవిర్భావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  విడిపోయింది. విడిపోవడానికి కొద్దికాలం  ముందు నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో అటు ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, ఇటు తెలంగాణాలో టీ.ఆర్.ఎస్. పార్టీ అధికారంలోకి వచ్చాయి. రాష్ట్రాల చీలిక దరిమిలా తొలినాళ్లలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో కొట్టవచ్చినట్టుగా కనిపించిన మార్పు ఒక్కటే ఒక్కటి,  పార్టీ మార్పిళ్ళు. రెండు రాష్ట్రాలమధ్య సహజంగా పరిష్కారం కావాల్సిన అనేక సమస్యలు అలాగే వుండిపోతే, కొత్తగా తెరమీదకు వచ్చిన ఈ పార్టీ మార్పిళ్ళ వ్యవహారం అన్ని సమస్యలను కారుమబ్బులా కమ్మేసి, అనేక అనైతిక, అవాంఛనీయ, అప్రజాస్వామిక పరిణామాలకు దారి తీయడమే కాకుండా వివాదాలు ముదిరి పాకానపడి చివరికి కేసులు, కోర్టుల వరకు వెళ్ళింది. దీనికి ముగింపు ఎప్పుడన్నది కాలమే చెప్పాలి.

పోతే, ఇన్ని సమస్యలకు మూలకారణంగా పేర్కొంటున్న పార్టీ మార్పిళ్ళు ముందే చెప్పినట్టు పార్టీలు పుట్టినప్పుడే పురుడు పోసుకున్నాయి. అసలు కొత్త పార్టీలు పుట్టుకు రావడానికి ప్రధాన కారణం పార్టీల్లో పుట్టుకొచ్చే  రాజకీయ అసంతృప్తులే అనే వాదం వుంది.     

సాధారణంగా  ప్రతిపక్షంలో వున్నవాళ్ళు, పాలకపక్షం వైపు చూడడం సహజం. కానీ,పాలక పక్షం నుంచి ప్రతిపక్షం వైపు దూకే సాంప్రదాయానికి ఎప్పుడో రామాయణ కాలంలోనే విభీషణుడు విత్తు నాటాడు. తటస్థులను తమవైపు తిప్పుకోవడం మహాభారతంలో కానవస్తుంది.      

స్వతంత్రం వచ్చిన కొత్తల్లో వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీది ఏకపక్షంగా సాగిన వ్యవహారం ఏమీ కాదు. స్వతంత్రం తెచ్చిన ఖ్యాతి, తొలి ఎన్నికల్లో అ పార్టీకి బాగా ఉపయోగపడిన మాట వాస్తవమే అయినప్పటికీ, ఇప్పటితో పోలిస్తే అప్పుడున్న పార్టీల సంఖ్య  కూడా తక్కువేమీ కాదు. జనత పార్టీ, స్వతంత్ర పార్టీ, జనసంఘం పేర్లు  ఈనాడు కొందరికి తెలిసి  వుండవచ్చునేమో కాని, 1952 లో జరిగిన ఎన్నికల్లో సోషలిష్టు పార్టీ, ప్రజా సోషలిష్టు పార్టీ,  నేషనలిష్టు డెమొక్రాటిక్ పార్టీ, కృషికార్ లోక్ పార్టీ, కే.ఎల్.పీ, ఎన్.సీ.ఎఫ్,  జస్టిస్ పార్టీ,  ప్రజాపార్టీ, కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ, పీపుల్స్ డెమొక్రాటిక్ ఫ్రంట్ ఇలా అనేక పార్టీలు వుండేవి. కమ్యూనిస్ట్ పార్టీ (అప్పటికి ఒక్కటే) సరేసరి. 

కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీల్లో కొన్ని పార్టీల పేర్లు చూడగానే, 'తల్లి పార్టీ ఏమిటి? అందునుంచి  వేరుపడి ఏర్పడ్డ కొత్త పార్టీ ఏమిటి?' అన్న విషయం సులభంగానే బోధపడుతుంది.  (ఉదాహరణకు కాంగ్రెస్,తృణమూల్ కాంగ్రెస్, జనతా, జనతా దళ్ వగైరా)

విచిత్రం ఏమిటంటే పార్టీ మార్పిళ్ళకు కూడా ముహూర్త బలం వుండాలి అనే వాదన ఒకటి వుంది.      

గోడ దూకితే గారెల గంపలో పడొచ్చు లేదా ముళ్ళకంపపై పడొచ్చు. ఏదైనా జరగొచ్చు. 

పార్టీ మార్పిడి కూడా లాటరీ వంటిదే. కొందరికి లాభం. కొందరికి ఖేదం, అని ఈ రకం వాదితులు చెబుతుంటారు.

పార్టీ మారిన వెంటనే చేరిన పార్టీలో తారాజువ్వలా పైకి దూసుకు పోయిన సందర్భాలు వున్నాయి. పార్టీ మారి పుష్కరాలు గడిచినా వేసిన గొంగడి చందంగా చతికిలపడి పోయిన ఉదాహరణలు వున్నాయి. పేర్లు చెప్పుకుంటూ పొతే జాబితా కొండవీటి చేంతాడు అంత అవుతుంది.

పార్టీ మార్పిళ్లలో అర్ధం కానిది ఒకటే.   

రాజకీయుల్లో ఎవరిని కదిలించినా గెలుపు తధ్యం అంటారు. ప్రజలు తమకు పట్టం కట్టడానికే మనసా, వాచా, కర్మణా సిద్ధమైపోయారని చెబుతారు. ఇంతాచేసి, తమమీద తమకే నమ్మకం లేనట్టు చొక్కాలు మార్చినట్టు  పార్టీలు మారుతుంటారు.

వాళ్ళ వేగం, ఉరవడి  చూస్తుంటే, ఏవిటో అంతా వరదలో కొట్టుకుపోతున్నట్టుగా అయోమయంగా  వుంటుంది. నిలబడి ఆలోచించే తీరిక వోపిక ఎవరికీ వున్నట్టు లేవు.

అన్నమైతే ఏమిరా! సున్నమైతే ఏమిరా!

అయినా ఈ పాడు పొట్టకు అన్నమే వేద్దామురా!  అని ఏదో పాత సినిమాలో ఓ గీతం వుంది. 

పార్టీ మారే వారిది కూడా ఇదే బాణీ.

ఆ పార్టీ అయితేనేం ఈ పార్టీ అయితేనేం

పనులు జరిగే అధికార పార్టీయే మేలు కదా! అనేది వాళ్ళ థియరీ.

మరి చేరిన పార్టీ రానున్న ఎన్నికల్లో ఓడిపోతే ఎలా! అన్న సందేహానికి వారి వద్ద ప్రశ్న రూపంలోనే  సమాధానం సిద్ధంగా వుంటుంది.

“తలుపు తీసుకుని  బయటకు వెళ్ళిన వాళ్లకు, లోపలకు వచ్చే దారి తెలియదని ఎలా అనుకుంటున్నారు?”    


షిర్డీ పుణ్య క్షేత్రానికి దగ్గరలో,  శని సింగాపూర్ లోని శనీశ్వర ఆలయం గురించి ఒక వింత విషయం ప్రచారంలో వుంది. ఆ ఆలయానికి కిలో మీటరు పరిధిలో దుకాణాలకు, ఇళ్లకు తలుపులు వుండవని, తాళాలు వేయరని ఆ క్షేత్ర పురాణం చెబుతుంది. పోలిక సమంజసం అనిపించక పోవచ్చు కానీ, రాజకీయ పార్టీల కార్యాలయాలకు కూడా తలుపులు, ద్వారబంధాలు వున్నట్టు లేవు. చేరదలచిన వాళ్ళు స్వేచ్ఛగా చేరవచ్చు. వదిలి పెట్టాలి అనుకున్నవాళ్ళు అలాగే బయటకు వెళ్లిపోవచ్చు. చేరడాలు, వదలడాలు రెంటినీ ఒక్క ట్వీట్ తో జనాలకు తెలియచేయవచ్చు. 

మనదేశానికి స్వతంత్రం రాగానే మనం స్వచ్చందంగా ఎంచుకున్న  ప్రజాతంత్ర స్పూర్తికి ఈ పోకడలు విఘాతం కలిగిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపధ్యంలో పరిశీలిస్తే, రాజ్యాంగపరంగా ఈ రుగ్మతకు సరైన చికిత్స చేయకుండా మనం నిర్మించుకుంటున్న  ప్రజాస్వామ్య సౌధం ఎలాంటి ప్రకంపనలకు తట్టుకోలేని బలహీన కట్టడం మాత్రమే  అవుతుంది. 

 

ముక్తాయింపు : 

ఎన్నికలకు  ముందు ప్రధాన రాజకీయ పార్టీల కార్యాలయాల్లో తరచుగా వినబడే మాట:

"ఈరోజు ప్లస్సెంత ? (చేరినవారెందరు) మైనస్ యెంత? (జారినవారెందరు)"




(12-03-2023)

7, మార్చి 2023, మంగళవారం

చదువరి జర్నలిస్టు రాజేశ్వరరావు గారిక లేరు

 పెద్ద మేజా బల్ల మీద పేర్చిన పుస్తకాలు, జాతీయ, ప్రాంతీయ దినపత్రికలు, ఆంగ్ల మాస పత్రికలు వాటి నడుమ దీక్షగా ఏదో పుస్తకమో, పత్రికో చదువుతున్న మనిషి కనబడితే ఆయన ఖచ్చితంగా  సి.హెచ్. రాజేశ్వరరావు గారే! సందేహం లేదు.

చదవక జర్నలిస్టు చెడిపోతాడని అనేవారు. నాకు తెలిసి అమితంగా పత్రికలు, పుస్తకాలు చెదివే అతి కొద్దిమంది పాత్రికేయుల్లో రాజేశ్వరరావు గారు ఒకరు. ఊరికే తిరగేయడం కాకుండా వాటిలోని సారాన్ని ఒడిసిపట్టే ప్రతిభాశీలి కనుకనే అంత గొప్ప జర్నలిస్టు కాగలిగారు. ఆంధ్ర పత్రిక, డెక్కన్ క్రానికల్, ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలకు హైదరాబాదు, ఢిల్లీల్లో సుదీర్ఘ కాలం పనిచేశారు. నేదురుమల్లి జనార్ధన రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే ఢిల్లీలో ఉంటున్న రాజేశ్వర రావు గారిని ఏరికోరి తనకు సమాచార సలహాదారుగా నియమించుకున్నారు. హెచ్ ఎం టీవీ కి అంబుడ్స్ మన్ గా పనిచేశారు.

జర్నలిస్టులకు పెద్ద దిక్కుగా వుండే రాజేశ్వరరావు గారు 83వ ఏట రాత్రి హైదరాబాదులో మరణించారు.

వారికి సద్గతులు కలగాలని  కోరుకుంటూ

భండారు శ్రీనివాసరావు



(07-03-2023)

 

5, మార్చి 2023, ఆదివారం

పొలిటికల్ టూరిజం – భండారు శ్రీనివాసరావు

(Published in Andhra Prabha daily today, 05-03-23, SUNDAY)


ఒక తెలుగు రాష్ట్రంలో కనుచూపు మేరలో ఎన్నికలు లేవు. మరో తెలుగు రాష్ట్రంలో ఈ ఏడాది చివరి వరకు ఎన్నికల కోయిల కూయదు. తొందరపడి కూస్తుందేమో అనే సందేహం కాబోలు, అన్ని పార్టీలకి చెందిన అనేకమంది నాయకులు ఏదో ఒక పేరు పెట్టుకుని జనం మధ్యనే గడపాలని అనుకుంటున్నారు. గడుపుతున్నారు కూడా. ‘సమాజమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అన్నారు కీర్తిశేషులు, టీడీపీ సంస్థాపకుడు ఎన్టీఆర్. అంచేత ఓటరు దేవుళ్ల ఆశీస్సుల కోసం నాయకులు వారి చుట్టూ ప్రదక్షిణలు చేయడంలో తప్పేముంది. మెడికల్ టూరిజం, రెలిజియస్ టూరిజం మాదిరిగా పొలిటికల్ టూరిజం అనుకోవాలి.
ఈ మార్పుకు కారణం ఒక్కటే, వెనుకటికీ ఇప్పటికీ రాజకీయ వ్యూహాల్లో వచ్చిన తేడానే!
కొన్ని దశాబ్దాల క్రితం విద్యార్ధులు పరీక్షల తరుణంలోనే పుస్తకాలు చేతపట్టి రాత్రీ పగలూ అనకుండా నైట్ అవుట్ చేస్తూ కష్టపడి చదివి గట్టెక్కాలని ప్రయత్నం చేసేవారు. మిగిలిన రోజుల్లో ఆటాపాటలతో కాలక్షేపం చేసేవారు. విద్యారంగంలో కార్పొరేట్ సంస్కృతి ప్రబలిన తరువాత విద్యార్ధులకు అనునిత్యం పరీక్షలే. ప్రతిక్షణం పరీక్షాకాలమే.
ఇప్పుడీ సంస్కృతి రాజకీయ రంగంలో కూడా ప్రవేశించినట్టు వుంది. పూర్వం ఎన్నికల సమయంలో మాత్రమే కానవచ్చే హడావిడి ఇప్పుడు ఏడాది పొడుగునా కళ్ళకు కడుతోంది. నిత్యం జనాలతో అనుబంధం పెంచుకుంటూ ఆత్మ స్తుతి, పరనిందలతో పొద్దుపుచ్చుతున్నారు. ఎన్నికల ఘడియ దగ్గరలో లేకపోయినా నాయకులు కాళ్ళకు బలపాలు కట్టుకుని జనాలమధ్యనే తిరుగుతున్నారు.
అరవయ్యో దశకంలో ఒక రాజకీయ నాయకుడు సుదీర్ఘ కాలం లోకసభ సభ్యుడిగా పనిచేశారు. ఎన్నికలప్పుడు జనాలకు చూపించిన తన మొహాన్ని మళ్ళీ ఎన్నికల నగారా మోగేవరకు వరకు చూపించేవారు కాదు. అయినా వరసగా అయిదు సార్లు ప్రజలు ఆయన్ని తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారు. గెలిచిన తరువాత ఢిల్లీలోనో, హైదరాబాదులోనో హాయిగా కాలక్షేపం చేసేవారు కాని నియోజకవర్గం వైపు తొంగి చూసేవారు కాదు. అయినా ఆ రోజుల్లో అలా నడిచిపోయింది.
ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి కొంత మారింది. జనాల్లో తిరగకుండా జనాలమీద పెత్తనం చేయడం కష్టం అన్న ఎరుక రాజకీయ నాయకుల్లో మొదలయింది. అయితే ఎన్టీఆర్ తరహా కూడా అదో మాదిరి. ఎన్నికలు దగ్గర పడ్డప్పుడు, కనీసం ఏసీ సౌకర్యం కూడా లేని చైతన్య రధం మీద బయలుదేరి, ఎండావానల్ని లెక్కచేయకుండా, ఆకలిదప్పులు పట్టించుకోకుండా రాష్ట్రాన్ని చుట్టబెడుతూ, రాత్రింబగళ్ళు ప్రజల మధ్యనే తిరిగేవారు. ఆ ఎండలకు అంతటి అందగాడి మొహం కూడా నల్లకప్పు వేసిపోయేది. ఒక్కసారి విజయం సాధించి, అధికార పీఠం ఎక్కడం తరువాయి, అంతే! ఎంతో ముఖ్యమైన రాచకార్యం వుంటే తప్ప రాజధానిని ఒదిలిపెట్టి అడుగు బయట పెట్టేవారు కాదు. జిల్లాల పర్యటనలు ఎక్కువగా పెట్టుకునేవారు కాదు. చంద్రబాబునాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తరువాత పరిస్తితి పూర్తిగా మారిపోయింది. రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన గురించిన కబురు చెవిలో పడడం ఆలస్యం, కాళ్ళకు రెక్కలు కట్టుకుని గాల్లో ఎగురుకుంటూ అక్కడికి వెళ్ళేవారు. కొన్ని సందర్బాలలో స్థానిక అధికారుల కంటే ముందే అక్కడ వాలిపోవడం, లేదా ముఖ్యమంత్రి హైదరాబాదు నుంచి ఆ విషయం గురించి వారిని వాకబు చేయడం ఇలాటివన్నీ ఆ రోజుల్లో తమాషాగా చెప్పుకునేవారు. కొండొకచో సంచలనాత్మకంగా, కొండొకచో విమర్శనాత్మకంగా ఉండేవి అవి.
దరిమిలా ముఖ్యమంత్రి అయిన రాజశేఖర రెడ్డిది కూడా ఓ రకంగా ఇదే తరహా. పర్యటనల్లో వున్నా, రాజధానిలో వున్నా జనం మధ్య గడపడానికే ఆసక్తి చూపేవారు. ప్రతిపక్షం నుంచి అధికారపక్షంలోకి మారడానికి ఆయన చాలా కాలం పాటు చేసిన నిరీక్షణ ఫలించడానికి కారణం ఆయన చేసిన సుదీర్ఘ పాదయాత్రే అనడంలో సందేహం లేదు. తదాదిగా అధికారం చేజిక్కించుకోవాలంటే పాదయాత్రలు చక్కని రాజమార్గం అన్న నమ్మకం రాజకీయ నాయకుల్లో కుదిరిపోయింది. చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర అనంతరమే తొమ్మిదేళ్ళ పైచిలుకు సాగిన ప్రతిపక్ష అజ్ఞాత వాసం నుంచి బయట పడి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగలిగారు.
ఇక సొంత పార్టీ పెట్టుకున్న జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా జనం మీదనే ఆధారపడ్డారు. జనం అండ ఉంటుందనే నమ్మకంతో రాజకీయ ఎత్తుగడల్లో చూపించాల్సిన పట్టు విడుపుల్ని ప్రదర్శించకుండా ఓ మేరకు నష్టపోయారని కూడా ఆయన్ని గురించి చెప్పుకుంటారు. ప్రతిపక్ష నాయకుడిగా వున్నప్పుడు, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కూడా ఆయనది అదే తీరు. తన సొంత పార్టీ నాయకులతో కంటే జనాల మధ్యనే ఎక్కువ సమయం గడుపుతారనే పేరు ఆయన ఖాతాలో వుంది కూడా.
పొతే, రాజకీయ నాయకుల పాదయాత్రలు, రిలే పాదయాత్రలు, కిసాన్ యాత్రలు, రైతు భరోసా యాత్రలు, బస్సు యాత్రలు ఇంకా ఇలాటి అనేకానేక యాత్రలు, పర్యటనలు, ప్రదర్శనలు, ర్యాలీలు ప్రజలకు చేసే మేలు ఏమిటోకాని ఆయా పార్టీలకు మాత్రం పెద్ద మేళ్ళే చేస్తున్నాయని వాటి గత అనుభవాలు చెబుతున్నాయి. అందుకే ఎన్ని ఇబ్బందులు వున్నా, కష్టాలు వున్నా, బాగా డబ్బు ఖర్చుతో కూడిన వ్యవహారం అయినా నాయకులు వెనుకడుగు వేయకుండా పాదయాత్రలతో ముందడుగు వేస్తున్నారు.
సరే! 'యాత్రాఫల సిద్ధిరస్తు' అని జనం వారిని ఆశీర్వదిస్తారో లేదో తెలియడానికి ఇంకా చాలా వ్యవధానం వుంది.
'ప్రజలు గమనిస్తున్నారు సుమా!' అని ఎదుటివారికి హెచ్చరికలు చేసే నాయకులు, తమను కూడా అవే జనాలు గమనిస్తున్నారని మరచిపోవడం రాజకీయ నాయకుల ఉమ్మడి లక్షణం. సామాన్య రైతుల కడగండ్లు తీర్చడం ఒక్కటే తమ ప్రధమ ప్రాధాన్యత అని జబ్బలు చరుచుకుంటూ, అసలా కష్టాలకన్నింటికీ ఆవలి పక్షం వారే కారణం అంటూ ఆరోపిస్తూ, అధికారంలో వున్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తూ, అధికారం చేజారగానే అంతవరకూ ప్రతిపక్షాలు ఆలపిస్తూ వచ్చిన పాత పల్లవినే ఎత్తుకుంటూ పరస్పరం దుమ్మెత్తి పోసుకునేందుకు ఇలాటి యాత్రా వేదికలు ఉపయోగపడడం నిజంగా దారుణం అనిపిస్తుంది.
సమాజంలో వివిధ వర్గాల వారికి ఎన్నెన్ని సమస్యలు ఉన్నప్పటికీ, రైతు సమస్యలు మాత్రం ఒకే రకంగా వుంటాయి.
వారి వారి స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు ఎన్ని ఉన్నప్పటికీ, ఈనాడు ప్రతి రాజకీయ పార్టీ రైతుల గురించే మాట్లాడుతోంది. వాళ్ళు విడిగా అయినా కలివిడిగా అయినా ఆలోచించుకోవాల్సింది ఒక్కటే. ఇంతవరకు ఏం చేసాము, ఏం చేయలేదు అన్నది కాదు ప్రశ్న. ఎవరి హయాములో ఎందరు ఆత్మహత్యలు చేసుకున్నారు అన్నది కాదు సమస్య. వందలు, వేలూ కాదు ఇకనుంచి ఒక్కరంటే ఒక్క రైతు కూడా వ్యవసాయంలో నష్టాలు వచ్చి ప్రాణాలు తీసుకోకుండా ఏం చెయ్యాలి అన్నదే ప్రధానం అన్న ధోరణిలో ఆలోచించాలి. విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇవేవీ జనాలకు అన్నం పెట్టే రైతుకు కూడు పెట్టవు.
ఒకటి మాత్రం నిర్వివాదాంశం. ఇన్నాళ్ళ అనుభవం తెలియచెప్పేది ఒక్కటే. ఏ పార్టీ అయిన అధికారంలోకి వచ్చేంతవరకు రైతు జపం చేస్తాయి. ఒక్కసారి గద్దె ఎక్కగానే, దుష్యంతుడికి శకుంతల మరపున పడ్డట్టు రైతులనే వాళ్ళు వారికి చివరి ప్రాధాన్యతగా మిగులుతారు. అప్పటివరకు రైతులు, రుణాలు, గిట్టుబాటు ధరలంటూ మాట్లాడిన వాళ్ళు, అవే నాలుకలతో కార్పొరేట్లు, ఉద్యోగాలు, భూసేకరణలు, భూ పందారాలు, మిషన్లు, గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లు, దావోస్ విజిట్లు, గ్రోత్ కారిడార్లు అంటూ సామాన్యులకు అర్ధం కాని పద ప్రయోగాలు చేస్తుంటారు. ఏం సాధించారు అంటే లెక్కకు కొన్ని లెక్కలు చెబుతుంటారు. కానీ పెట్టిన ఖర్చుకు వచ్చిన ఫలితాలకు పొంతన వుండదు. ఈ విషయంలో ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు. అధికారంలో వుండడం, అధికారంలో లేకపోవడం అన్న రెండు విషయాలే ఈ రెండు నాలుకల ధోరణికి కారణం. దీన్ని అర్ధం చేసుకోవడానికి చరిత్రలోని కొన్ని తాజా పుటలు తిరగేస్తే చాలు.
ఆరుగాలం కష్టపడే రైతుకు, జనాలకు మొదటి ముద్ద పెట్టి, తాను చివరి ముద్ద తినే రైతుకు కావాల్సినవి ప్రభుత్వాలు సకాలంలో ఇస్తే, అంతకు రెట్టింపు ప్రతిఫలం రైతు ఈ సమాజానికి అందిస్తాడు. అతడికి అవసరమైంది తాను దున్నేమన్నుకు, పదును చెడకముందే అదునులో దున్ని పైరు వేసుకోవడానికి వీలుగా సకాలంలో మంచి విత్తనాలు, ఎరువులు. సేద్యపు నీరు, పంట చేతికి వచ్చిన తరువాత కాసింత గిట్టుబాటు ధర. ఇంతకు మించి ఏ రైతూ ఆశించడు. రైతు పండించిన ధాన్యంలో ఆఖరి గింజ అతడి చేతిలోంచి మార్కెట్ లోకి వెళ్ళే వరకు స్తబ్దుగా, మన్ను తిన్న పాములా పెరగకుండా వుండిపోయే ధాన్యం ధరలు, ఆ తర్వాత ఒక్క మారుగా చుక్కల్ని తాకడం అనేది రైతులు ఎదుర్కునే సమస్యల్లో అతి ప్రధానమైనది. ప్రభుత్వాలు ఈ ఒక్క సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొన కలిగితే, ధర్మో రక్షిత రక్షితః అన్నట్టు ఆ రైతే దేశానికి బాసటగా నిలబడతాడు. సకాలంలో ఇటువంటి సాయం అందితే ఏ రైతూ ఆత్మహత్య ఆలోచన చేయడు. నిస్సహాయ పరిస్తితిలోనే రైతులు నిండు ప్రాణాలు నిలువునా తీసుకుంటున్నారు. అలాటి కుటుంబాలను ఓదార్చడం, ఆదుకోవడం తప్పుకాదు. కానీ అసలు రైతులు ఈ స్థితిలోకి జారిపోకుండా ప్రభుత్వాలు, ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయన్నదే సమాధానం లేని ప్రశ్న.
సరే! ఇక యాత్రల విషయానికి వస్తే.
ఏదైనా పుణ్యక్షేత్రానికి యాత్రకి వెళ్ళినప్పుడో, లేదా ఏదైనా పర్యాటక ప్రదేశానికి యాత్రకు వెళ్ళినప్పుడో ఏం చేస్తాం. ఉన్న వ్యవధిలో అక్కడి విశేషాలు పరిశీలిస్తాం. యాత్రలో ఎదురయ్యే ఇబ్బందులు, అనుకూలతలు గమనిస్తాం. అలాగే రాజకీయ యాత్రలు చేసేవాళ్ళు కూడా తాము తిరిగిన ప్రదేశాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళు ఎదుర్కుంటున్న దినవారీ సమస్యలు తమ కంటితో గమనించి వాటికి పరిష్కార మార్గాలు ఆలోచించగలిగితే అంతకు మించిన మంచి మేనిఫెస్టో వారికి మరెక్కడా దొరకదు. యాత్రా ఫలం సిద్ధించడం అంటే ఇదే!



(05-02-2023, SUNDAY)