21, జులై 2022, గురువారం
మీడియాకు మరో పనేమీ లేదా!
కూర్చుని చదవాల్సిన పుస్తకం జీవన గానం – భండారు శ్రీనివాసరావు
ఈ పుస్తకం ఇంటికి చేరి అనేక రోజులు గడిచిపోయాయి. అయినా పూర్తి చేయడం ఒక పట్టాన కుదరలేదంటే దీనికి ప్రధాన కారణం నా సహజ బద్ధకం. దానికో కారణం వుంది. అదే ద్వితీయ ప్రధాన కారణం. ఇది కూర్చుని చదవాల్సిన పుస్తకం. అంటే ఇది చదవాలి అంటే వ్యాసపీఠం కావాలి. అంత పెద్ద పుస్తకం అన్నమాట.
పడుకునో, జారగిలబడో చదువుకోవాలి అనిపిస్తే కుదరదు. అంచేత ఈ కసరత్తు చేయడానికి కొంత వ్యవధానం పట్టింది.
ఈలోపల మరో ఇబ్బంది వచ్చి పడింది. ఈ పుస్తకం నా వద్ద వుందని తెలియగానే మా చుట్టపక్కాలు చాలామంది ఫోన్లు చేసి, ఒకసారి చదివి ఇస్తాం ఇస్తారా అని అడగడం మొదలు పెట్టారు. అల్లా బయటకు పొతే ఇక చదవడం అనేది అసాధ్యం అనిపించి వ్యాసపీఠం లేకుండానే చదవడం మొదలు పెట్టాను. మొదలు పెట్టిన తర్వాత ఆ పుస్తకమే నన్ను చివరికంటా చదివించింది.
రచయిత గోపాలకృష్ణ గారు నాకు రేడియోలో సహోద్యోగి. అంతకు మించి మితృలు.
ఈయన ఎస్పీ గారి జీవిత చరిత్ర రాసారా లేక బాల సుబ్రహ్మణ్యం గారే స్వయంగా తన జీవిత కధాగానం చేసారా అనిపించేలా కధనం సాగింది. పీ ఎస్. గోపాల కృష్ణ కలం బలం నాకు తెలిసిన విషయమే అయినా, ఆయనకు పరకాయ ప్రవేశ విద్య తెలుసు అన్న విషయం ఈ పుస్తకం చదివిన తర్వాత తెలిసింది. అంతగా బాలు గారితో మమేకం అయి, బాలు గారి జీవిత విశేషాలను, సంఘటనలను హృద్యంగా, రమ్యంగా, నిజాయితీగా చాలా గొప్పగా అక్షరబద్ధం చేశారు. తనకు ఒప్పచేప్పిన బాధ్యతకు నూటికి నూటొక్క పాళ్ళు న్యాయం చేశారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా జరిగిన ఈ పుస్తక ఆవిష్కరణ సభలో వదాన్యులు వరప్రసాదరెడ్డి గారు చెప్పినట్టు, ఒక్క గోపాల కృష్ణ గారే ఈ రచన చేయగలరు. చేసి చూపించారు కూడా.
బంగారు పిచిక సినిమా రిలీజ్ సమయంలో బాపూ రమణలు పత్రికలకు ఇచ్చిన చిన్నపాటి ప్రకటనల్లో ఇలా పేర్కొనేవారు.
‘ఇందులో కళ్ళు మిరుమిట్లు కొలిపే సెట్టింగులు లేవు. భారీ తారాగణం లేదు’
అలాగే ఈ నాలుగువందల యాభయ్ పైచిలుకు పేజీల పుస్తకంలో ఉత్ప్రేక్షలు లేవు, రంగులద్దిన కల్పనలు లేవు, నిజాలు దాచడం లేదు, నిజాల పేరుతొ సంచలనాలు లేవు.
అలా హాయిగా, తీయగా బాలుగారి పాటలా సాగిపోతుంది రచన.
అంచేతనే, బాలుగారి ఈ జీవన గానాన్ని గోపాల కృష్ణ గారిచే రాయించారు కాబోలు.
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం జీవన గానం, రచన: డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ, ప్రచురణకర్త: డాక్టర్ కె.ఈ. వరప్రసాదరెడ్డి, హాసం ప్రచురణలు, ధర: Rs. 500/-, For copies: Navodaya Book House, Kachiguda, Hyderabad – 500049, PHONE: 040- 23047638
20, జులై 2022, బుధవారం
రాజకీయాల్లో ఏదో వుంది? - భండారు శ్రీనివాసరావు
ఈ కింది సంభాషణలు చిత్తగించండి:
ఇంటర్వ్యూ బోర్డ్ సభ్యుడు:
“ఐ.ఐ.టి. టాపర్ మీరు. ఐ.ఏ.ఎస్. కావాలని ఎందుకు అనుకుంటున్నారు?”
“ఐ.ఏ.ఎస్. అధికారిగా ప్రజలకు ఎక్కువ సేవ చేయడానికి వీలుంటుందని భావించాను”
విలేకరి:
“మీరు ఒక ఐ.ఏ.ఎస్. అధికారి అయివుండి ఎందుకు రాజీనామా చేసి రాజకీయాల్లో
చేరదామని అనుకుంటున్నారు?”
“రాజకీయాల్లో వుంటే మరింత ఎక్కువగా ప్రజాసేవ చేయడానికి అవకాశం ఉంటుందనే
నమ్మకంతో రాజీనామా చేసి రాజకీయాల్లో
చేరుతున్నాను”
విలేకరి:
“రాజకీయాల్లోకి వచ్చారు సరే! కొత్తగా ఒక పార్టీ పెట్టాలనే ఆలోచన ఎందుకు
వచ్చింది?”
“అలా అయితేనే మనం అనుకున్న విధంగా ప్రజాసేవ చేయవచ్చని నాకు గట్టిగా
అనిపించింది”
విలేకరి:
“దేశంలోనే కాదు ప్రపంచంలోనే మీరు పెద్ద
పారిశ్రామికవేత్త. అనేక స్వచ్చందసంస్థలకూ కోట్ల రూపాయలు భూరి విరాళాలు ఇస్తుంటారు. మరి రాజకీయ ప్రవేశం చేయాల్సిన అవసరం ఏమివచ్చింది”
“మనం కోరుకున్న విధంగా ప్రజాసేవ
చేయాలంటే రాజకీయాలను మించిన మార్గం లేదు కనుక”
విలేకరి:
“సినిమా రంగంలో మిమ్మల్ని కొట్టేవాళ్ళు
లేరు. ఒక్కసారి మిమ్మల్ని తాకితే చాలు, జన్మ ధాన్యం అనుకునే అభిమానులు మీకు
లక్షల్లో వున్నారు. ఏ సినిమా వేసినా కాసుల వర్షం కురుస్తుంది. ఈ వయసులో ఎండ అనకా,
వాన అనకా ప్రజాసేవ కోసం అంటూ ఈ తిరుగుళ్ళు ఏమిటి?”
“ఎంత సంపాదించినా,
ఎంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నా సమాజానికి తిరిగి ఎంతోకొంత ఇవ్వాలని ఈ మార్గం
ఎంచుకున్నా. నా దృష్టిలో ప్రజాసేవ చేయాలంటే ఇదొక్కటే మార్గం”
విలేకరి:
“మీ నాన్నగారు రాజకీయ రంగంలో పేరెన్నిక
కన్నవారు. మీరేమో విదేశాల్లో ఉన్నత చదువులు చదివారు. గొప్ప కంపెనీకి సీ.ఈ.ఓ.
వృత్తి పరంగా అనేక దేశాలు అలవోకగా చుట్టి వస్తుంటారు. ఆ జీవితం వదులుకుని ఇప్పుడు
రాజకీయ అరంగేట్రం ఎందుకు చేసినట్టు”
“నాన్నగారికి రాజకీయ వారసుడిగా కాదు, ఆయన
ఆలోచనలకు, తలపెట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వారసుడిగా రాజకీయాల్లోకి
వచ్చాను. ప్రజాసేవకు ఇది ఉత్తమ మార్గంగా నాకు తోచింది”
విలేకరి:
“మీరు గొప్ప జర్నలిష్టు. పెద్ద పెద్ద
రాజకీయ నాయకులకు మీ మాట శిరోధార్యం.అలాంటిది మీరు కూడా రాజకీయ తీర్థం పుచ్చుకోవడం
ఆశ్చర్యంగా వుంది”
“మనం ఎన్ని రాసినా, ఎన్ని
హితోక్తులు చెప్పినా సమాజాన్ని మార్చాలి అంటే రాజకీయాలు తప్పిస్తే వేరే దోవ
కనిపించలేదు. అందుకే ఈ మార్గం పట్టాను”
ఇలాంటి సంభాషణలు తరచుగా వింటున్నప్పుడు
సామాన్యుడికి కలిగే అభిప్రాయం ఒక్కటే!
చివరికి ప్రజాసేవ కూడా సోషలిజం లాగా
అర్ధంపర్ధం లేకుండా వాడే పదంగా మారిపోయిందని.
తోకటపా:
తపస్సు చేసుకోవడానికి అడవుల్లోకి
వెళ్ళనక్కరలేదు. ఉన్నచోట వుండే భగవధ్యానం చేసుకోవచ్చు.