5, జులై 2022, మంగళవారం

తరం మారింది, ఊరూ మారింది – భండారు శ్రీనివాసరావు

 

1341 ఫసలీ (ఫస్లీ అనే ఈ పారశీక పదం  ఉర్దూలోకి దిగుమతి అయి చాలా భారతీయ భాషల్లో స్థిరపడింది. ఫసలీ అని, ఫస్లీ అని కూడా  అంటారు) బ్రిటిష్ జమానాలో ఇది వ్యవసాయక (HARVEST) సంవత్సరం. ఇప్పుడు  ఏప్రిల్ నుంచి మార్చి వరకు పన్నెండు నెలలను ఆర్ధిక సంవత్సరం అంటున్నారు కదా! అలా అన్నమాట. దీనికి 590 కలిపితే గ్రెగేరియన్ కాలండర్ ప్రకారం 1931 అవుతుంది. గ్రెగేరియన్ అంటే  ఇప్పుడు వాడుకలో వున్న కేలండర్. 1931 అంటే  ఇప్పటికి అక్షరాలా తొంభయ్ ఒక్క సంవత్సరాలు గడిచాయి.  అప్పటినుంచి ఇప్పటివరకు మా వంశంలో మూడు తరాలు గడిచి నాలుగోది మా పిల్లల తరం నడుస్తోంది. 

మొన్న మా స్వగ్రామం కంభంపాడు వెళ్ళినప్పుడు ఎప్పటిదో బ్రిటిష్ కాలంనాటి ఓ దస్త్రం నా కంటపడింది.

‘DETAILED LIST OF JOINTLY REGISTERED  HOLDERS IN THE VILLAGE OF KAMBHAMPADU NO.144, NANDIGAMA TALUK, KISTNA DISTRICT అని ఇంగ్లీష్ లోను, కృష్ణ జిల్లా, నందిగామ తాలూకా, నె. 144 రు. కంభంపాడు గ్రామం, జాయింటు పట్టాదారుల లిస్టు వివరం’ అని తెలుగులోనూ వుంది. గ్రామంలోని యావత్తు పట్టాదారుల పేర్లు, పట్టా నెంబర్లు అన్నీ చక్కగా టైప్ చేసి వున్నాయి.

వివరాల్లోకి వెడితే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం దేశం మొత్తంలో గ్రామాల వారీగా సమగ్ర భూ సర్వే చేయించి ఆ వివరాలను అన్నిటినీ ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళీ ప్రభుత్వం పనుపున ఎలాంటి భూ సర్వే జరగలేదని ఊరిలోని కొందరు పెద్దవారు చెప్పారు. అయితే ఈ మధ్య నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అటు తెలంగాణలో కూడా సమగ్ర భూసర్వే జరుగుతోందని, అధునాతన సర్వే పరికరాలు, డ్రోన్ల సాయంతో ఈ సర్వే సాగుతోందని, రేపోమాపో మా ఊరిలో కూడా భూముల సర్వే జరిగి కొత్త సరిహద్దు రాళ్ళతో కూడిన పట్టాలు ఇస్తారని అంటున్నారు. ఇది పూర్తయితే  భూములకు సంబంధించిన వివాదాలు చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందని వారి ఆశ. 

ఇదలా ఉంచితే తొమ్మిది దశాబ్దాల క్రితం జరిగిన ఈ సర్వేలో మా గ్రామానికి సంబంధించిన అనేక విషయాలు తెలిశాయి. అప్పటికే మా ఊరి చెరువు కింద, మునేరు ఆనకట్ట కాలువ కింద భూములకు సేద్యపు నీరు అందేది. సాగుకు వీలైన భూమి మొత్తం 3591.41 ఎకరాలు వుండేది. ఇందులో  128 ఎకరాల్లో వరి, 1101 ఎకరాల్లో జొన్న పండించేవారు. ఇవి కాక, సజ్జలు, రాగులు, మొక్కజొన్నలు, ప్రత్తి, పొగాకు మొదలైన పంటలు కూడా పండించేవారు.  సాగుకు పనికి రాని భూమి 34.40 ఎకరాలు, పోరంబోకు భూములు 365.14 ఎకరాలు కాగా,  గ్రామంలో భూమిశిస్తు మొత్తం  4720 రూపాయలు వసూలు అయ్యేది.   9.85 ఎకరాల్లో బందెలు దొడ్డి వుండేది. రికామీగా  తిరుగుతూ ఊళ్ళో వారి చేలపై పడి మేసే గొడ్లని పట్టుకుని  కట్టివేసే దొడ్డి అన్నమాట.  నిర్ణీత అపరాధ రుసుము చెల్లించి వాటి యజమానులు ఆ పశువులను విడిపించుకునేవారు. 

1929 వ సంవత్సరం జమాబందీ  లెక్కల ప్రకారం ఊరి మొత్తంలో  1620 పశువులు (ఆవులు, ఎడ్లు, గేదెలు, దున్నపోతులు వగైరా)  675 గొర్రెలు, మేకలు వుండేవిట. 

ఒకప్పుడు, నాకు ఎరుక తెలిసేటప్పటికే  మా ఇంట్లోనే డజన్ల కొద్దీ పాడి పశువులు, ఎడ్లూ, కోడె దూడలు, ఎడ్ల బండ్లు  ఉండేవి. ఇప్పుడు చాలా ఇళ్ళల్లో అవి మచ్చుకు కూడా కనిపించడం లేదు. కార్లూ, స్కూటర్లు, ట్రాక్టర్లు వీటికి   మాత్రం కొదవలేదు.



(05-07-2022)

ప్రాంతీయ వార్తలు చదివిన గుడిపూడి శ్రీహరి ఇక లేరు


1975 లో నేను హైదరాబాదు ఆలిండియా రేడియో ప్రాంతీయ వార్తా విభాగంలో అసిస్టెంట్  ఎడిటర్ (రిపోర్టింగ్) గా చేరినప్పుడు, నా ఉద్యోగ బాధ్యత కాకపోయినా వారానికి మూడు రోజులు ఉదయం ఆరుగంటల నలభయ్ అయిదు నిమిషాలకు ప్రసారం అయ్యే ప్రాంతీయవార్తల బులెటిన్ ఎడిటింగ్ బాధ్యతలు చూసేవాడిని. అప్పుడు పరిచయం గుడిపూడి శ్రీహరి.

తిరుమలశెట్టి శ్రీరాములు, డి. వెంకట్రామయ్య, జ్యోత్స్నాదేవి రెగ్యులర్ న్యూస్ రీడర్లు. మాడపాటి సత్యవతి గారు అసిస్టెంట్ ఎడిటర్. అప్పుడప్పుడు  వార్తలు చదివేవారు. వారి వీక్లీ ఆఫ్స్, సెలవు రోజుల్లో వార్తలు చదవడానికి క్యాజువల్ న్యూస్ రీడర్లుగా పీ.ఎస్.ఆర్. ఆంజనేయ శాస్త్రి, సురమౌళి, గుడిపూడి శ్రీహరి గార్లు వచ్చేవారు. అప్పుడప్పుడు అనుకోకుండా వాళ్లకు కూడా  గొంతు  పట్టేసిన సందర్భాలు వచ్చేవి. అప్పుడు నేనే  బులెటిన్ పేపర్లు పట్టుకుని వెళ్లి స్టూడియోలో కూర్చుని వార్తలు చదివేసేవాడిని. (ఈ  అనుభవం తర్వాత రోజుల్లో నాకు అక్కరకు వచ్చింది. రేడియో మాస్కోలో వార్తలు చదవడానికి నన్ను ఎంపిక చేసే సమయంలో, వస్తుతః నేను రేడియో విలేకరిని అయినప్పటికీ, , అవసరార్థం నెత్తికి ఎత్తుకున్న ఈ అనుభవం పనికివచ్చింది) 

ఉదయం పూట న్యూస్ రీడర్లు చదివే వార్తలను ఎడిట్ చేసి ఇవ్వడం నా బాధ్యత. ఉద్యోగంలో చేరకముందే, స్కూలురోజులనుంచే వీళ్ళు చదివే వార్తలు నేను రేడియోలో  వింటూ ఉండేవాడిని. అలాంటి వాళ్ళతో కలిసి పనిచేసే మహత్తర అవకాశం నాకు రేడియో ఉద్యోగం ఇచ్చింది.

శ్రీహరి సంగతి కదా చెప్పుకుంటున్నాం.

ఆయన వయసులో నాకంటే పెద్ద.  కానీ ఆహార్యంలో నాకంటే కుర్రవాడు. హాలీవుడ్ సినిమా హీరోమల్లే నెత్తిన హ్యాటు. చలవ కళ్ళజోడు, కోటు, బూటుతో మోటార్ సైకిల్ మీద ఆయన రేడియో ప్రాంగణంలో ప్రవేశిస్తూ వుంటే చూడాలి. శ్రీహరి గారి దగ్గర రకరకాల హ్యాట్లు (టోపీలు కాదు,ఇంగ్లీష్, హిందీ   సినిమాల్లో  హీరోలు పెట్టుకునేవి), పలురకాల నల్ల కళ్ళజోళ్లు, కొట్టవచ్చేటట్టు కనబడే ముదురు రంగుల బుష్ కోట్లు, వీటన్నితో అసలు వయసు కంటే చాలా చిన్నవాడిగా కనబడేవాడు. అంచేత నేను కూడా చనువు తీసుకుని ఏకవచనంలోనే సంబోధించేవాడిని. ఆయనా అల్లాగే నన్నూ ఏమోయ్ శ్రీనివాసరావ్ అని పిలిచేవాడు. అలా అరమరికలు లేని స్నేహం మా నడుమ వుండేది. ఇప్పుడు అలాంటి చనువువుందని చెప్పలేను. వయసు పెరుగుతున్న కొద్దీ ఇచ్చ్చిపుచ్చుకునే మర్యాదలు, పలకరింపుల్లో తేడాలు రావడం సహజం.   

ఆహార్యానికి తగ్గట్టే శ్రీహరి వార్తలు చదివే తీరు కూడా విభిన్నంగా వుండేది. బయట కులాసాగా తిరిగినట్టే స్టూడియో లోపల కూడా బేఫికర్ గా వార్తలు చదివేవాడు. వార్తలు చదువుతూ గొంతు సవరించుకోవడం, ఊపిరి పీల్చి వదిలిన ధ్వని ఇవన్నీ మా రేడియో వాళ్లకి నచ్చవు. అదే రిపోర్టులో రాసి ఆయనకు చెప్పమనే వారు. నేను చెబితే ఆయన నవ్వి ఇలా అన్నాడు.

‘మనం పోటీ ప్రపంచంలో ఉన్నాము. ఇలా అనేవాళ్ళు ఎప్పుడయినా బీబీసీ వార్తలు విన్నారా! వాయిస్ ఆఫ్ అమెరికా వార్తలు విన్నారా! అక్కడ ఇటువంటివి సహజంగా తీసుకుంటారు. నిజానికి అలా చేయడం వల్ల ఈ ప్రోగ్రాము ముందుగా రికార్డు చేసింది కాదు, లైవ్ ప్రోగ్రాం అని శ్రోతలకు తెలుస్తుంది కూడా’

ఆయన చెప్పింది నాకు సరిగ్గానే అనిపించింది. 

కొన్నేళ్ళ క్రితం శ్రీహరికి భార్యావియోగం కలిగింది. ఇద్దరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం అనుకున్నాను.

అయితే ఈ ఉదయం ఓ దుర్వార్త తెలిసింది. శ్రీహరి ఇకలేరు. తన ఎనభయ్ ఎనిమిదో ఏట గత రాత్రి రెండుగంటల సమయంలో తుది శ్వాస విడిచారు.



(05-07-2022)

భయం లేదు! స్పందించే గుణం మిగిలే వుంది!

 

స్పందించే గుణం లేనిపక్షంలో మనిషి గుండెకు, రాతి బండకు తేడా వుండదు.

మనుషులకు స్పందించే గుణం ఇంకా పూర్తిగా పోలేదు అని చెప్పడానికే ఈ ఉదాహరణ.

మూడు మాసాల క్రితం ఓ కధ చెప్పుకుందాం అని ఓ పోస్టు పెట్టాను. నిజానికి ఇది కధ కాదు. నిజజీవితమే.

మా స్వగ్రామం కంభంపాడులో మండే ఎండల్లో కాలిపోతున్న రేకుల షెడ్డులో, కనీస దూరంలో విద్యుత్ వెలుగులు కనిపించని ఊరి బయట పొలాల్లో నివసిస్తున్న ఓ వృద్ధుడి కధ అది.

కదల కోసం కంచికి పోనవసరం లేదు, జీవితాల్లోకి తొంగి చూస్తే కనబడతాయి, మనసును ఆర్ద్రం చేసే అనేక కధలు. అలాంటిదే ఇది.

మా స్వగ్రామంలో పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తి కొంత వుంది. వుందని తెలుసు కానీ వాటి ఆజాపజా  మా అన్నదమ్ములు నలుగురికి కానీ, అన్నదమ్ముల సంతానం పదిమందికి కానీ ఎవరికీ తెలియదు. కొంచెం తెలిసిన మా మూడో అన్నయ్య అకాలంగా కాలం చేశాడు. అల్లాగే మా పెద్దన్నయ్య కూడా. ఇప్పుడు ఇద్దరం మిగిలాము. చిన్నవాడినైన నాకే డెబ్బయి ఆరు. మా రెండో అన్నయ్య ఎనభయ్ కి దగ్గరలో వున్నాడు. ఇక ఆస్తి పాస్తులు గురించి తెలుసుకోవాల్సిన అవసరం మా ఇద్దరికీ ఈ వయసులో ఉంటుందని అనుకోను.

ఈ నేపధ్యంలో మా మూడో అన్నయ్య కొడుకు భండారు రమేశ్ వీటి విషయం తెలుసుకోవాలని నడుం కట్టాడు. అడ్డదిడ్డంగా పెరిగిన చెట్లూ పుట్టల్ని తొలగించి పొలాలని కొత్తగా సర్వే చేయించే బృహత్తర కార్యక్రమాన్ని ఈ మండే ఎండల్లో నెత్తికి ఎత్తుకున్నాడు. ఈ క్రమంలో వాడి కంటికి కనిపించిన ఒక మానవీయ దృశ్యానికి అక్షర రూపం ఇచ్చాడు. అదే ఇది: 

“ఈ ఫోటోలో కనిపిస్తున్న మనిషి పేరు పిండిప్రోలు పిచ్చయ్య. భార్య పేరు పిచ్చమ్మ. వీరికి ఒక కూతురు కూడా ఉంది. ఈమె ఎవరికి కనపడదు. (సరిగా బట్టలు వేసుకోదని బయటకు రానివ్వరు) మండుటెండలో సైతం చెట్టు నీడ కూడా లేకుండా, ఈ రేకుల షెడ్డులోనే ఊరు బయట నాలుగేళ్లుగా ఉంటున్నారు. కనీసం తాగడానికి నీళ్లు లేక పోగా, కనుచూపుమేరలో విద్యుత్ వెలుగులు కనిపించవు. పిలిచినా పలికే నాధుడే లేకపోయినా, కటిక చీకట్లో కాలం వెళ్లదీస్తున్నారు.

“వెనుకటి రోజుల్లో పిచ్చమ్మ అనే ఆమె మన ఊళ్ళో ఉండేది. ఈ పిచ్చయ్య ఆమె కుమారుడు. కంభంపాడులోనే కూలి పనులు చేసుకుని జీవిస్తున్నాడు. కూతురు కుట్టు మిషన్ పనిచేస్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేది. అయితే అనుకోని సంఘటనతో వీరి కుటుంబ జీవనం తలకిందులైంది. కొంతమంది కామాంధుల పైశాచిక చేష్టలతో వీళ్ల కూతురు మానసికంగా దెబ్బతింది. దీంతో ఆమె తల్లి కూడా అనారోగ్యానికి గురైంది. తల్లీ కూతుళ్లు ఇద్దరూ కూడా పిచ్చిపిచ్చిగా  ప్రవర్తిస్తూ వుండడంతో తమ  ఇళ్ళ మధ్య వాళ్ళు ఉండటానికి గ్రామస్తులు ఇష్టపడ లేదు.

“ఈ విషయం నాకు ఒకరిద్దరు చెప్పడంతో, కంభంపాడు వెళ్లి మన ట్రాన్స్ఫారం పొలం ఆనుకుని ఒక మూలన పొలంకు అడ్డులేకుండా చివరన తాత్కాలికంగా ఉండమని చెప్పాను. దీంతో వాళ్లు అక్కడ ఒక రేకుల షెడ్డు నిర్మించుకొని ఉంటున్నారు. ప్రతిరోజు వాళ్లకు కావలసినవన్నీ పిచ్చయ్య సమకూర్చుతూ ఉంటాడు. రోజువారి వాడే నీళ్ల నుంచి మంచినీళ్ల వరకు తానే స్వయంగా తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాడు. పిచ్చయ్య ఒక్కడి రెక్కల కష్టంతోనే వాళ్ళిద్దరూ జీవిస్తున్నారు. పిచ్చయ్య కూడా పెద్దవాడు కావడంతో ఓపిక సన్నగిల్లి ఆదాయవనరులు తగ్గిపోయాయి. తల్లి కూతుర్లు ఆ రేకుల షెడ్డు దాటి బయటకు రారు, రాలేరు.

“అయితే ఇప్పుడు మన పొలాలు కొలిపిస్తున్నందున అక్కడినుంచి వాళ్ళని ఖాళీ చేయమని చెప్పాను. పిచ్చయ్య నన్ను అడిగిన దాని ప్రకారం ఎక్కడో ఒకచోట వారికి నివాసం ఏర్పాటు చేయాలని అనుకున్నాను. నేను నాతో పాటు నా మిత్రులు, అన్నయ్య రఘు,  ఇంగువ అనంత రామయ్య గారి మనుమడు గోపాలకృష్ణ అందరం కలిసి వీళ్ళకి పోరంబోకు స్థలం చూపించి నివాసం ఏర్పాటు చేయాలని భావించాము. వాళ్ళకి మన ఊళ్ళోనే ఒక నివాసం ఏర్పాటు చేసేందుకు తలా ఒక చేయి వేస్తున్నాము” ((25-04-2022)

ఇదీ మూడు మాసాల క్రితం నేను పెట్టిన పోస్టు.

ఈ కధ సాంఘిక మాధ్యమంలో కనిపించిన తర్వాత కదలిక మొదలయింది.  గ్రామ పంచాయతీ వాళ్ళు మా పొలం పక్కనే వున్న  పోరంబోకు స్థలం కేటాయించారు. ప్రభుత్వం తరపున, సొంత ఇంటి పధకం కింద పిచ్చయ్య  ఇంటి నిర్మాణానికి డబ్బులు మంజూరు అయ్యాయి. పిచ్చయ్యకు శాశ్వత ఆవాస నిర్మాణం మొదలయింది.

మొన్న మేము మా ఊరు వెళ్ళినప్పుడు పిచ్చయ్య  నిర్మించుకుంటున్న ఇంటిని చూశాము.

అవే కింది ఫోటోలు:






(05-07-2022)

4, జులై 2022, సోమవారం

అన్నీ ఇంటిదగ్గరే ! - భండారు శ్రీనివాసరావు


నిన్నా మొన్నా మా స్వగ్రామం కంభంపాడులో గడిపినప్పుడు మూడు విషయాలు నా దృష్టికి వచ్చాయి. నేను విన్న విషయాలు వాస్తవం అనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఊరివాళ్ళే నాకీ సంగతులు చెప్పారు. దాదాపు కొన్ని దశాబ్దాలుగా నగరవాసిగా జీవితం దొర్లిస్తున్న నాకివి కొత్తగానూ, వింతగాను అనిపించాయి.
ఊళ్లోనుంచి వెడుతున్నప్పుడు కొన్ని ఇళ్ళ ముందు వంట గ్యాస్ సిలిండర్లు కనిపించాయి. వంట గ్యాస్ సిలిండర్లతో ఒక వ్యాన్ వత్సవాయి మండలం లోని సుమారు నలభయ్ గ్రామాలను చుట్టబెడుతూ ఒక వ్యాన్ తిరుగుతుంటుంది. ఊళ్లలోకి ప్రవేశించగానే సైరన్ మోగిస్తుంది. ఖాళీ సిలిండర్లు ఉంచిన ఇంట్లోకి వెళ్లి డబ్బులు తీసుకుని కొత్త సిలిండర్ ఇస్తారు. ఖాళీ సిలిండర్ తీసుకువెడతారు. అన్ని గ్యాస్ కంపెనీల వాళ్ళు పల్లెటూర్లకి ఈ సదుపాయం కల్పిస్తున్నాయట. విడిగా గ్యాస్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదట. ఇందుకోసం అదనంగా ఏమీ చెల్లించాల్సిన పని లేదట.
ఊళ్ళో ఏటీఎం ఉందా అని అడిగితె ఆ అవసరం మాకు లేదన్నారు. ఊళ్లోనే వివిధ బ్యాంకుల ఏజెంట్లు వున్నారు. ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి ఆధార్ కార్డు చూసి, కార్డు SWIPE చేసి డబ్బులు ఇస్తున్నారట. ఏ బ్యాంకు కార్డు అయినా పర్వాలేదట. అదనంగా చెల్లించేది ఏమీ వుండదు అన్నారు. విచిత్రం అనిపించింది.
అలాగే విద్యుత్ శాఖ వాళ్ళు ప్రతి నెల ఆరో తేదీ, మళ్ళీ పన్నెండో తేదీన రెండుసార్లు ఊరికి వచ్చి విద్యుత్ బిల్లులు అక్కడికక్కడే వసూలు చేసుకుని వెడతారట.
(04-07-2022)

1, జులై 2022, శుక్రవారం

స్వతంత్ర స్వతంత్రంగా మనగలుగుతుందా! – భండారు శ్రీనివాసరావు


‘ఈ సినిమాలో నేను చేస్తున్నది పూర్తిగా ఓ డిఫరెంట్ రోల్. ఇంతవరకు వేయని పాత్ర’ అని అంటుంటారు నటీ నటులు.
‘మా ఈ సినిమా మామూలు సినిమాలకు విభిన్నం. వైవిధ్యభరితంగా వుండే కధ’ అని చెబుతుంటారు నిర్మాత దర్శకులు.
అయితే ఆ సినిమాలు చూసేవారికి అలా అనిపించకపోవచ్చు. ఆ సినిమాలు అలానే చూసేవారికి అందులో కొత్తదనం కనిపించవచ్చు. నిజానికి ఈ రెండోరకం ప్రేక్షకుల వల్లే చిత్ర విజయం ఆధారపడుతుందని ఆ రంగానికి చెందిన పండితులు అంటుంటారు.
ఈ మధ్య ఈ మాధ్యమంలో, దాన్ని ప్రచారం అనాలో సమాచారం అనాలో తెలియదు కానీ ఒక కొత్త టీవీ ఛానల్ గురించి చదివాను. తమది డిఫరెంట్ ఛానల్ అనేది వారి నమ్మకం. దాన్ని తప్పుపట్టడానికి వీల్లేదు. పైగా ‘రెచ్చగొట్టం, రచ్చ చేయం’ అనేది ఆ ఛానల్ ట్యాగ్ లైన్.
మూడు పెగ్గులు తాగేవాడికి ఒక పెగ్గు ఆననట్టుగా ఇన్నేళ్ళుగా రచ్చలకు అలవాటు పడిన వాళ్ళు, ఈ ఛానల్ ని ఆదరిస్తారా! వీక్షకాదరణ లేకుండా ఈ రోజుల్లో ఓ ఛానల్ నడపడం ఈ పోటాపోటీ కాటాకుస్తీ కాలంలో సాధ్యమా! ఎంతమంది చూస్తే అంత గొప్ప ఛానల్, అంత మంచి ఆదాయం అని లెక్కల వేసుకునే రోజుల్లో ఇలాంటి ప్రయోగం విజయవంతమౌతుందా!
అయినా ఈ ప్రశ్నలు వేసుకోవాల్సింది, జవాబులు రాబట్టుకోవాల్సింది ఆ ఛానల్ నిర్వాహకులు.
వేసుకునే వుంటారు. జవాబులు అనుకూలంగా రాకపోయినా ఛానల్ ప్రారంభం జరిగిపోయింది అంటే ఏదో గట్టి పట్టుదల మీదే వున్నారని అనుకోవాలి. అందుకే కాబోలు విభిన్నంగా తమ ఛానల్ కు స్వతంత్ర టీవీ అని పేరు పెట్టుకున్నారేమో!
"మనం చేసేది జనం చూడవలెనా!
జనం కోరేది మనం శాయవలెనా!"
అనే పాతాళ భైరవి మాంత్రికుడి నోటవచ్చిన ఈ వాక్యం ఇక్కడ అతికినట్టు సరిపోతుంది.

బుల్లి తెరలపై అనునిత్యం సాగుతున్న రాజకీయ పోరాటాలు చూసి చూసి సాధారణ ప్రేక్షకులు విసుగెత్తి వున్నారు కనుక అటువంటి వాళ్లకి కొంత ఉపశమనం ఇచ్చే ప్రత్యామ్నాయంగా తమ ఛానల్ ఉంటుందని నిర్వాహకుల ఉద్దేశ్యంగా వుంది.
ప్రముఖ ఆంగ్ల, తెలుగు దినపత్రికల్లో విశేష అనుభవం కలిగిన కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో, తెలుగు టీవీ రంగంపై డాక్టరేట్ పుచ్చుకున్న సీనియర్ గా పేరు తెచ్చుకున్న భావనారాయణ సారధ్యంలో, పలు ప్రముఖ పత్రికలు, టీవీ ఛానల్స్ లో మంచి అనుభవం గడించిన అమరయ్య, తాడి ప్రకాష్, mnr M వంటి వాళ్ళు వెన్నుదన్నుగా ఉన్న ఈ కొత్త ఛానల్ వాళ్ళు తమ మాట నిలబెట్టుకోవాలని ఆశించడం అత్యాశ కాదు.
ఏదైనా మంచి ప్రయత్నం. మంచే జరగాలని కోరుకుందాం.
మండే ఎండాకాలంలో మలయ మారుతంలా వచ్చి విజయవంతం అయిన శంకరాభరణం చిత్రం ఉదాహరణ ఉండనే వుంది.


(01-07-2022)

హస్తవాసి వైద్యం – భండారు శ్రీనివాసరావు


(ఈరోజు జులై ఒకటి డాక్టర్స్ డే)

వాస్తవానికి సమాజంలో వైద్యులది విశిష్టమయిన స్తానం. అందుకే డాక్టరును ‘డాక్టరు గారు’ అని గౌరవంగా
సంబోధిస్తారు. నలుగురిలో వారికి పెద్దపీటవేసి మన్నన చేస్తారు. రోగాలబారి నుంచి కాపాడే అపర ధన్వంతరులుగా, ప్రాణబిక్ష పెట్టే కలియుగ దైవాలుగా కొలుస్తారు. నాకిప్పటికీ గుర్తు. మా చిన్నతనంలో మా వూరికి వారానికోసారి ఆలూరుపాడు నుంచి రామకృష్ణయ్య గారనే ఓ డాక్టరుగారు సైకిలు మీద వచ్చేవారు. చిన్న చితకా జ్వరాలకు తనతో తెచ్చుకున్న తోలుపటకా సంచీ నుంచి మందు గోలీలు ఇచ్చి వైద్యం చేసేవారు. పంటలు చేతికందినప్పుడు వూళ్ళోని పెద్ద పెద్ద ఆసాములు ఏడాదికోసారి కొలిచి ఇచ్చే ధాన్యం మినహా ఆ డాక్టరు గారు ఏనాడూ రోగులనుంచి ఫీజు వసూలు చేసిన దాఖలా లేదు. ఆయన వూరికి వస్తే చాలు దేవుడే నడిచివస్తున్నట్టుగా జనం భక్తి ప్రపత్తులు ప్రదర్శించేవారు. నాడి పట్టుకుని చూసి ‘ఇప్పుడెలావుందయ్యా రాముడూ’ అని ఆప్యాయంగా అడగగానే సగం రోగం చేతులతో తీసివేసినట్టు వుండేది. చుట్టుపక్కల అయిదారు వూళ్ళకు ఆయనే దిక్కు. సైకిల్ తొక్కుకుంటూ రోజుకో వూరు చుట్టబెట్టేవారు. ఆ రోజుల్లో సౌకర్యాలు అంతంత మాత్రమే. కరెంటు వుండేది కాదు. ఉక్కపోస్తున్నా, నులక మంచంమీద కూర్చుని తన మానాన తాను రోగులకు వైద్యం చేస్తుండేవారు. కళ్ళల్లో కారుణ్యం. మొహంలో చెదరని చిరునవ్వు. ఆయన హస్తవాసిపట్ల అందరికీ అపరితమయిన గురి. జనాలకు కొండంత ధైర్యం.
మరి ఇప్పుడో. ఆ చిత్రం పూర్తిగా మారిపోయింది.
రోగులు పెరిగారు. రోగాలు పెరిగాయి. వైద్యులూ పెరిగారు. ఇచ్చే మందులూ పెరిగాయి. వాటి ఖరీదులూ పెరిగాయి. పెరగనిదల్లా వైద్యులపట్ల రోగులకు వుండే భరోసా! వుండాల్సిన దిలాసా!!
వైద్యులకు రోగులకు నడుమ ఉండాల్సిన అనుబంధం క్రమంగా కనుమరుగవుతోంది.
ఇప్పుడు వైద్యం అనేది వైద్యుల చేతుల్లో నుంచి కార్పొరేట్ల హస్తాలలోకి వెళ్ళిపోయింది. ఇక వాళ్ళు మాత్రం ఏం చెయ్యగలరు?

30, జూన్ 2022, గురువారం

వేణీ దానం అను సతీ పూజ – భండారు శ్రీనివాసరావు

చాలా ఏళ్ల క్రితం మేము సకుటుంబంగా అంటే దాదాపు ముప్పైమందిమి కాశీయాత్ర చేసాము. మార్గమధ్యంలో ప్రయాగ త్రివేణీ సంగమం వద్ద తర్పణ కార్యక్రమాలకు ముందు మా బృందంలోని దంపతుల చేత ఈ వేణీ దానం (పూజ) చేయించారు.

త్రివేణీ సంగమం దగ్గర గంగా, యమునా, సరస్వతి (అంతర్వాహినిగా) మూడు నదులు కలుస్తాయి. ఆడవారి పొడవైన తల వెంట్రుకలను మూడు పాయలుగా చేసి జడ అల్లడం తెలిసిందే. దానికీ దీనికీ ముడిపెట్టి ఈ పూజలు చేయిస్తారు. ఏడుజన్మల పాపాలు కొట్టుకుపోతాయని ఐతిహ్యం. సరే అదలా ఉంచుదాము.
నాకు ఈ పూజలో నచ్చినదేమిటంటే మొగుడి చేత భార్యకు సపర్యలు చేయించడం. అది చూసిన తర్వాత ఈ జన్మలో మొగుళ్ళు చేసిన పాపాలకు ప్రక్షాళన జరగడం ఖాయం అనిపించింది.
ఈ ప్రక్రియలో భర్త తన ఇల్లాలిని తొడపై కూర్చుండబెట్టుకోవాలి. ఆమె మొహాన్ని కడిగి తుడవాలి. కుంకుమ బొట్టు పెట్టాలి. వధువుగా మరి కొన్ని అలంకరణలు చేయాలి. లాలనగా మాట్లాడుతూ, భార్య జుట్టును మూడు పాయలుగా చేసి జడ అల్లాలి. ఇలా కొన్ని పనులు చేయించి మగవాడి ఆధిపత్య, అహంకార ధోరణికి అడ్డుకట్ట వేసే విధానం నాకీ క్రతువులో కనిపించింది.