4, మే 2022, బుధవారం

టీవీ ప్రసారాల్లో అవాంచిత సంఘటనలు

అమెరికన్ నేషనల్ ఛానల్ లో నా మనుమరాలు సఖి


మహిళల హక్కులకోసం పోరాటాలు, ఆందోళనలు అమెరికాలో కూడా జరుగుతున్నాయి. అటువంటి నిరసన  ర్యాలీ ఒకటి లాస్ ఏంజెల్స్ డౌన్ టౌన్ లో జరిగింది. పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి కొంత అదుపు తప్పింది. ర్యాలీలో పాల్గొన్న  మా మనుమరాలు (నా పెద్ద కుమారుడు సందీప్ కుమార్తె) సఖి  ఈ విషయంపై అమెరికన్ నేషనల్ ఛానల్ CBS NEWS  LIVE INTERVIEW లో ఛానల్  విలేకరి అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చింది.  




https://youtu.be/8Ee8XIoGCLA

2, మే 2022, సోమవారం

ఎప్పుడూ రాజకీయాలేనా!

 

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా ఇదే ప్రశ్నను సంధించారు.

ఇప్పటివరకు జవాబు లేదు.

ఆయన రాసిన వ్యాసంలో ఒక చిన్న పేరా! 

“ఆ మధ్య టెల్ అవీవ్ వెళ్లాను. అంతకుముందు రోజే అక్కడ బాంబు పేలుళ్లు జరిగాయి. కొంతమంది ఆ దాడిలో మరణించారు. మరునాడు ఉదయం ఒక ఇజ్రాయెలీ పత్రిక తిరగేశాను. మొదటి పేజీలో ఒక ప్రధాన వార్త కనబడింది. అది బాంబు పేలుడుకు సంబంధించింది కాదు. ఆ దేశానికి చెందిన ఒక వ్యక్తి అయిదేళ్ళు కష్టపడి పచ్చిక మొలవని ఎడారి భూమిని సస్యశ్యామలం చేసిన వైనం గురించి రాసిన కధనం అది. అలాటి ఉత్తేజకరమైన సమాచారంతో అక్కడివాళ్లు తమ దినచర్య ప్రారంభిస్తారు.

"బాంబు పేలుడు సంఘటన గురించిన వార్త లోపలి పేజీలో వేసారు. చావులు, చంపడాలు, బాంబు దాడులు, పేలుళ్లు, ఇలాటి వార్తలన్నీ అంత ప్రముఖంగా అక్కడి పత్రికలు ప్రచురించవన్న సంగతి అప్పుడే అర్ధం అయింది.

మరి మన దగ్గరో. ఇందుకు పూర్తిగా భిన్నం. చావులు, జబ్బులు, నేరాలు, ఘోరాలు వీటితోనే మీడియా మనకి సుప్రభాతం పలుకుతుంది.

ఎందుకిలా జరుగుతోంది? జవాబులేని ప్రశ్న. సమాధానం వెతుక్కోవాల్సిన ప్రశ్న”



 

అభినవ కార్తవీర్యార్జునులు - భండారు శ్రీనివాసరావు

 వెనుకటి రోజుల్లో సినిమాల్లో అత్తగారి పాత్రలు వేసే సూర్యాకాంతం వంటి నటీమణులు రొంటిన తాళం చేతుల గుత్తి దోపుకుని కనిపించేవాళ్ళు. ఆ గుత్తి ఇంటిపై అధికారానికి గుర్తు. దాన్ని కోడలి చేతిలో పెట్టడం అంటే అప్పటినుంచి ఇంటి పెత్తనం అంతా కోడలికి దఖలు చేసినట్టే అనుకోవాలి. ఇంటి తాళం చెవులు, ఇనప్పెట్టె తాళం చెవులు ఆ గుత్తిలో వుంటాయి కాబట్టి దానికా విలువ. ఇప్పటి అపార్ట్ మెంటు సంస్కృతిలో ఇంటికి ఒక తాళం చెవే. బ్యాంకు లాకర్ల ధర్మమా అని ఇళ్ళల్లో ఇనప్పెట్టెలు ఎలాగూ లేవు. కాకపోతే కంప్యూటర్ల పుణ్యమా అని కొత్త తాళం చెవులు వచ్చిపడ్డాయి. వీటిని గుత్తికి తగిలించి రొంటిన దోపుకునే వీలులేదు. కంప్యూటర్ కు ఒక పాస్ వర్డు. ఏటీఎం కార్డు కార్డుకో పాస్ వర్డు. ఆన్ లైన్ డబ్బు లావాదేవీలకి ఒకటి, మెయిల్ ఐడీ కొకటి, ఫేస్ బుక్కుకొకటి. లింక్ డిన్ కు మరోటి. ట్విట్టర్ కు ఇంకోటి. పైగా అప్పుడప్పుడూ వీటిని మార్చుకుంటే మంచిదంటూ సలహాలు. వెనక తాళం చెవుల గుత్తిని రొంటిన దోపుకున్నట్టు, వీటిని మనసుకు తగిలించుకుంటేనే కానీ రోజుగడవని పరిస్తితి.

కార్తవీర్యార్జునిడికి వేయి చేతులే! కానీ ఈ యుగపు మనుషులకి ఈ నెట్ తాళం చేతులు రోజురోజుకూ పెరిగిపోతూనే వున్నాయి.

Note: Courtesy Image Owner



 

1, మే 2022, ఆదివారం

పుచ్చలపల్లి సుందరయ్యకు తప్పిపోయిన ముఖ్యమంత్రి పదవి – భండారు శ్రీనివాసరావు

 ఈరోజు ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య జయంతి. వామపక్ష పక్షపాతి, ప్రముఖ పాత్రికేయులు శ్రీ వీ.హనుమంతరావు (జర్నలిస్ట్ డైరీ ఫేం సతీష్ బాబు తండ్రి) తన అనుభవాల సమాహారంలో పుచ్చలపల్లి వారి గురించిన ప్రస్తావన వుంది. అదే ఇది:

“1955 మధ్యంతర ఎన్నికలు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల నడుమ అతి భీకరంగా జరిగాయి. కమ్యూనిష్టులు అధికారంలోకి వచ్చేస్తున్నారు, పుచ్చలపల్లి సుందరయ్య ముఖ్యమంత్రి, రాజేశ్వర రావు హోం మంత్రి అనే వాతావరణం రాష్ట్రంలో నెలకొంది. కాని, చివరకు కమ్యూనిష్టులు ఓడిపోయారు. రాష్ట్రంలో పార్టీ పత్రిక విశాలాంధ్ర తప్ప మిగతా పత్రికలన్నీ కాంగ్రెస్ కొమ్ము కాశాయి. ప్రముఖ సంపాదకుడు నార్ల వేంకటేశ్వర రావు సంపాదకత్వంలో ఆంధ్రప్రభ ముందు వరసలో నిలబడి కమ్యూనిష్టులకు వ్యతిరేకంగా ప్రచారం చేసింది. విశాలాంధ్ర, ఆంధ్రప్రభల మధ్య కార్టూన్ల యుద్ధం హోరాహోరీగా నడిచింది. ప్రతి కార్టూనుకు జవాబుగా మరో కార్టూన్ ప్రభలో వచ్చేది. అప్పటికీ, ఇప్పటికీ రాష్ట్రంలో పత్రికల సత్య నిష్ఠ గురించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు పత్రిక అయిన ఆంధ్ర ప్రభ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు అనుకూలంగా రాస్తే, దాని తమిళ్ ఎడిషన్ దానికి వ్యతిరేకంగా రాసేది. ఇదంతా పత్రిక సర్క్యులేషన్ పెంచుకోవడం కోసమే.”

 

ఇక్కడ పనిలో పనిగా శ్రీ హనుమంతరావు గురించిన ఓ పాత వృత్తాంతం చెప్పుకోవాలి.

ఆయనది కలిగిన కుటుంబం కాదు. వారాలు చేసి చదువుకున్నారని చెబుతారు. చిన్నతనంలోనే టైపూ, షార్ట్ హాండు నేర్చుకుని వైజాగ్ పోర్టులో (అప్పుడు దాని పేరు వేరేగా వుండేది) ఓ చిన్న ఉద్యోగంలో చేరారు. సహజంగా వామపక్ష పాతి అయిన శ్రీ హనుమంత రావు, కమ్యూనిస్టు నాయకుడు అయిన శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య దృష్టిలో పడ్డారు. ఆయన కోరికపై చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి శ్రీ సుందరయ్య దగ్గర చేరిపోయారు. ఆయన డిక్టేటర్ చేస్తుంటే ఈయన పక్కన కూర్చుని షార్ట్ హాండ్ లో రాసుకుని, తరువాత టైప్ చేసేవారు. ఆవిధంగా వెలువడిందే శ్రీ సుందరయ్య రాసిన విశాలాంధ్రలో ప్రజారాజ్యం.

 

1980 ప్రాంతాల్లో శ్రీ హనుమంతరావు డేటా న్యూస్ ఫీచర్స్ సంస్థ ఆధ్వర్యంలో నేటి రాజకీయం అనే పక్ష పత్రిక వచ్చేది. దీనికి ఆయన గౌరవ సంపాదకులు కాగా, ఆయన కుమారుడు  జర్నలిష్ట్ డైరీ ఫేం సతీష్ ఎడిటర్.

ఆ కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఓ సాహసం చేశారు. కాంగ్రెస్ పార్టీకి బద్ధ శత్రువు అయిన కమ్యూనిష్ట్ పార్టీ (సీపీఎం) నాయకుడు అయిన శ్రీ పుచ్చలపల్లి సుందరయ్యను డ్రైనేజ్ బోర్డు చైర్మన్ గా నియమించారు. డ్రైనేజ్ అంటే నగరాల్లో భూగర్భ డ్రైనేజ్ కాదు. మురుగు నీటి సమస్యతో పంటలు నష్ట పోతున్న డెల్టా ప్రాంతంలోని డ్రైనేజ్ సమస్యను పరిష్కరించడానికి ఈ బోర్డును ఏర్పాటు చేశారు.

ఈ నేపధ్యంలో ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ నరిసెట్టి ఇన్నయ్య( ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయ్యారు) నేటి రాజకీయం పత్రికకు ఓ వ్యాసం పంపారు.

‘సైకిల్ మీద పార్లమెంటుకు వెళ్ళిన నిరాడంబర చరిత్ర కలిగిన శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య, ముఖ్యమంత్రి పేషీకి  ఫైళ్ళు పట్టుకుపోవడం విడ్డూరమని దాని సారాంశం.

శ్రీ సుందరయ్య అంటే గౌరవ ప్రతిపత్తులు కలిగిన శ్రీ హనుమంతరావుకు ఈ వార్త రుచించలేదు. అయినా ప్రచురణ విషయంలో తుది నిర్ణయాన్ని పత్రిక ఎడిటర్ కే వదిలేశారు.



(01-05-2022)

చిక్కులకు చిరు పరుష్కారం - భండారు శ్రీనివాసరావు

 

(Published in Andhra Prabha today, Sunday, on 01-05-2022)


'యాభయ్ ఏళ్ళక్రితానికి,  ఇప్పటికీ కొట్టొచ్చినట్టు కనబడే మార్పు ఏమిటి?' అని అడిగితే,  'ఆ రోజుల్లో సినిమా హాళ్ళలో చుట్ట, బీడీ, సిగరెట్లు తాగేవారు, ఇప్పుడది లేద'ని,  ఆరు పదులు వయసు దాటిన వారెవరైనా జవాబు చెబుతారు. 

అప్పటికీ, ఇప్పటికీ పొగత్రాగేవారి సంఖ్య తగ్గిందా అంటే అదీ లేదు. 'సినిమా హాల్లో సిగరెట్ తాగితే జరిమానా వేస్తామ'ని బెదిరించారా అంటే అదీ లేదు, 'హాలులో పొగ తాగరాదు' అంటూ, ఏదో మొక్కుబడిగా ఓ స్లయిడ్ వేయడం తప్ప. 'అన్ని సినిమా హాళ్ళ వద్ద ప్రత్యేక సిబ్బందిని నియమించి కట్టుదిట్టం చేశారా' అని ప్రశ్నించుకుంటే 'లేద'నే సమాధానం వస్తుంది. 'పొగరాయుళ్ళను వెతికి పట్టుకుని కౌన్సిలింగులూ గట్రా నిర్వహించారా' అంటే అదీ లేదు. 'ప్రేక్షకులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, పొగత్రాగవద్దని క్లాసులు తీసుకున్నారా' అంటే ఆ దాఖలాలూ లేవు. మరి పొగత్రాగందే పట్టుమని పది నిమిషాలు ఓపలేని ధూమపాన ప్రియులు, సిగరెట్ల జోలికి పోకుండా థియేటర్లలో కూర్చుని సినిమాలు ఎలా చూస్తున్నారు?

ఈ ప్రశ్నకి సమాధానం ఒక్కటే. ప్రజల్లో ఓ సుగుణం ఉంది. అదేమిటంటే, చూసి నేర్చుకోవడం. డేరా టాకీసులూ, టూరింగ్ హాళ్ళు, రేకుల సినిమాషెడ్లు, సిమెంటు ధియేటర్ల  కాలం ముగిసి, ఎయిర్ కండిషన్ థియేటర్ల కాలం మొదలు కాగానే 'సినిమా హాళ్ళలో పొగత్రాగడం మంచిది కాద'ని పక్క వాళ్ళని గమనిస్తూ ఎవరికి వారే తెలుసుకున్నారు. 

జనంలో వున్న ఈ సుగుణాన్ని, జనంతో సంబంధం వుండి వారిపై పెత్తనం చేసే ప్రభుత్వ అధికారులు, సిబ్బంది గమనించి నడుచుకుంటే, ఈనాడు మనం ఎదుర్కుంటున్న అనేక చిక్కు సమస్యలకి చిరు పరిష్కారాలు లభించే అవకాశాలు ఉన్నాయనడానికి ఈ ఉదంతాన్ని ఓ ఉదాహరణగా చెప్పడం జరిగింది. 

ముఖ్యంగా నగరాల్లో పెచ్చు పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలకి పరిష్కారం కోసం నానా మార్గాలు వెతుకుతున్న అధికారులు, ఈ సూత్రాన్నే అమలు చేస్తే అనేక సమస్యలకు కనీసం సగం పరిష్కారం అయినా లభిస్తుంది. లేని పక్షంలో, అప్పుడెప్పుడో ఒక దినపత్రికలో పేర్కొన్నట్టు, "సమస్యమీదే,  పరిష్కారం మీదే, మేం నిమిత్త మాత్రులం!  ఇదీ ట్రాఫిక్ పోలీసుల వరుస" అనే విమర్శల తాకిడిని తట్టుకోక తప్పదు. 

హైదరాబాద్ వంటి సువిశాల నగరంలో ట్రాఫిక్ ని చక్కదిద్దడం అన్నది ఆషామాషీ వ్యవహారం కాదు. 

అయితే, కొన్ని కొన్ని చిన్న చిన్న చర్యలతో సమస్యకు పరిష్కారం లభిస్తుందేమో ప్రయత్నించి చూడడంలో తప్పేమీ లేదు.

అన్నింటికంటే ముందు చేయాల్సింది,  ట్రాఫిక్ అధికారులు తమ ప్రాధాన్యతలను నిర్ధారించుకోవడం. హెల్మెట్లు, సీటు బెల్టులవంటి నిబంధనల అమలుకు తీసుకుంటున్న శ్రద్ధని, కొంతకాలం పాటయినా,  ట్రాఫిక్ చిక్కుముళ్ళని చక్కదిద్దే దిశగా మరల్చాలి. ఎక్కడ, ఏ సమయంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందో అధ్యయనం చేసి అందుకు తగ్గట్టుగా అదనపు సిబ్బందిని  ఆయా కూడళ్ళలో, అవుట్ సోర్సింగ్ పద్ధతిపై నియమించాలి. ఈ సిబ్బంది కయ్యే ఖర్చుని ఆయా కూడళ్ళ చుట్టు పక్కల ఉండే దుకాణాలు, నివాస సముదాయాలనుంచి పారదర్శక పద్ధతిలో వసూలు చేసినా తప్పులేదు. 

రోడ్లు దాటడానికి రాజధాని నగరంలో అనేక చోట్ల ఫుట్ వోవర్ బ్రిడ్జీలు నిర్మించారు. వాణిజ్య ప్రకటనలకు మినహా, వాటిని జనం ఉపయోగిస్తున్న దాఖలాలు లేవు. స్త్రీ, బాల, వృద్ధులు ఆ వంతెనలు ఎక్కలేరు. ఎక్కగలిగిన వారు ఎక్కనే ఎక్కరు. అందువల్ల వాటిని మరింత ఉపయోగంలోకి తీసుకురావడానికి వాటికి లిఫ్టులు అమర్చాలి. అందుకయ్యే వ్యయాన్ని కొద్ది కొద్దిగా వినియోగదారుల నుంచి రుసుము రూపంలో రాబట్టుకోవాలి. హైదరాబాదు నగరంలో ఇప్పటికే కొన్ని చోట్ల ఈ సదుపాయం వుంది. కానీ వాడుతున్న దాఖలా లేదు.

ప్రైవేటు విద్యాసంస్థల వద్ద నిర్మించిన కాలి వంతెనల పూర్తి వ్యయాన్ని ఆ సంస్థల నుంచే వసూలు చేయాలి. విద్యార్ధుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు పిండుతున్న ఆ సంస్ధలకి ఇదేమంత పెద్ద భారం కాబోదు.

ఇలాటి ఏర్పాట్లకి వీలులేనిచోట్ల ప్రత్యామ్నాయాలు పరిశీలించాలి. అనేక రద్దీ కూడళ్ల వద్ద రోడ్డు దాటలేక అవస్తలు పడేవారు అనేకమంది కనిపిస్తుంటారు. భవసాగరం ఈదడం కంటే రోడ్డు దాటడం కష్టంగా భావిస్తుంటారు. 

బాగా అభివృద్ధిచెందిన ప్రపంచ నగరాలలో రోడ్డుదాటడానికి పుష్ బటన్  వ్యవస్థలు వుంటాయి. రోడ్డుపక్కన వున్న పుష్ బటన్ నొక్కగానే రోడ్డు క్రాస్ చేయడానికి వీలుగా పచ్చ దీపం వెలుగుతుంది. వారు రోడ్డుదాటి వెళ్ళేవరకు ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోతాయి.

విద్యుత్ దీపాలతో కూడా పని లేకుండా,  జండాలను ఉపయోగించే ఒక విధానం కొన్ని విదేశాల్లో అమల్లోవుంది. అదేమిటంటే, రోడ్డుకు ఇరువైపులా  విద్యుత్  స్తంభాలకు బాస్కెట్లలో కొన్ని జండాలను ఉంచుతారు. రోడ్డు దాటాలనుకునేవారు ఆ జండాను తీసుకుని చేతిలో పట్టుకుని ఊపుకుంటూ వెళ్లిపోవచ్చు. రోడ్డు దాటిన తరవాత అవతలవైపు వున్న బాస్కెట్లో వుంచి తమదారిన వెళ్లిపోవచ్చు. ఇరుకైన రోడ్లు వున్న పాత బస్తీ వంటి ప్రాంతాల్లో ఈ పద్దతి ఉపయుక్తంగా వుంటుంది.

పోతే, థియేటర్లు, పాఠశాలలు, ఆఫీసుల వేళల్లో తగుమార్పులు చేయడం ద్వారా, ఒకే సమయంలో, ప్రజలు, వాహనాలు భారీ సంఖ్యలో రోడ్ల మీదకు రాకుండా నియంత్రించడానికి వీలుపడుతుంది. 

కనిపించిన చోటల్లా `నోపార్కింగ్' బోర్డులు పెట్టకుండా పార్కింగ్ కి అనువయిన స్ధలాలని ముందుగా గుర్తించాలి. పోలీసు వాహనాలు `నోపార్కింగ్' ప్రదేశాల్లో నిలపకుండా చూడాలి.

ప్రయివేటు బస్సులని ఎలాగూ అదుపు చేయలేరు కనుక, రాత్రి సమయాలల్లో కొన్ని కొన్ని విద్యాసంస్థలకున్న ఖాళీ జాగాలలో ప్రయాణీకులను ఎక్కించుకునేందుకు అనుమతి ఇవ్వాలి. ఇందుకోసం వసూలు చేసే రుసుముని ఆయా విద్యా సంస్థలకే ఇవ్వాలి. ఇలాచేయడంవల్ల అనేక ప్రాంతాలలో రాత్రివేళల్లో ట్రాఫిక్ జామ్స్ తగ్గిపోతాయి. 

స్కూళ్ళకీ, ఆఫీసులకీ వెళ్ళే రద్దీ సమయాల్లో చెకింగులు జరిపే పద్ధతికి స్వస్తి చెప్పాలి. సిగ్నల్ జంపింగ్ చేసే వాహనదారులను పట్టుకుని భారీ జరిమానాలు విధించాలి. అసలు ఇలాటి వాహనదారుల వల్లనే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. 

అలాగే, రద్దీ సమయాలని దృష్టిలో పెట్టుకుని నగరాల్లో 'వీ.ఐ.పీ. ' ల పర్యటనలు, రాకపోకల సమయాల్లో మార్పులు చేయాలి. 'ప్రజలకోసమే మేము, ప్రజాసేవలో మేము' అంటూ నిత్య జపం చేసే నాయకులు, ఇందుకు ఏమాత్రం సహకరిస్తారో చూడాలి. 

ఇవన్నీ చేసినా, సమస్య నూటికి నూరుపాళ్లు పరిష్కారం కాకపోవచ్చు. కానీ పరిస్థితి కొంతలో కొంత మెరుగు పడడానికీ , పోలీసుల పట్ల ప్రజలకున్న అవగాహన, అభిప్రాయాల్లో సానుకూల మార్పు రావడానికే ఈ చర్యలు ఖచ్చితంగా దోహదం చేస్తాయి.




30, ఏప్రిల్ 2022, శనివారం

మనుషుల్లో దేవుళ్ళు - భండారు శ్రీనివాసరావు

 

తల వాకిలి ఓరగా వేసివుంది.

లోపల నుంచి మాటలు వినపడుతున్నాయి. ఆ గదిలో వున్న ఇద్దరూ నా రాకను గమనించలేదు. నడిచివచ్చిన బడలిక తీర్చుకోవడానికి ఓ కుర్చీలో కూలబడ్డాను.

వారిలో ఒకావిడ వృద్ధురాలు. ఎనిమిది పదులు దాటిన వయసు. ఆవిడ ఎవరో కాదు, స్వయానా నాకు పెద్ద వదిన. పెద్దన్నయ్య కీర్తిశేషులు  పర్వతాల రావు గారి భార్య. మా ఇంటికి  అరకిలోమీటరు దూరంలో ఉన్న కొడుకు రాఘవరావు ఇంట్లో ఉంటోంది. అయిదు రోడ్లు కలిసే ఒక రోడ్డు కూడలిలో అడ్డదిడ్డంగా వచ్చే వాహనాలను తప్పించుకుంటూ రోడ్డు దాటడం ఒక్కటే ఇబ్బంది. అయినా   రోజూ సాయంత్రం వెళ్లి కాసేపు ఆమె దగ్గర కూర్చుని రావడం అలవాటు.

నేను వెళ్లేసరికి వదిన మంచం మీద దిండును  ఆనుకుని కూర్చుని,  ఎదుటి మనిషి చెబుతున్న మాటలను ఏకాగ్రతగా వింటోంది.

ఎదురుగా వున్న ఆవిడ పేరు స్వరూప. పేరు ఆధునికంగా వున్నా పల్లెటూరు మనిషి అని చూడగానే తెలిసి పోతుంది. ఆవిడ మా వదిన గారికోసం వాళ్ళ అబ్బాయి, హైదరాబాదులోని రమణాశ్రమం సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన కేర్ టేకర్. ఈ మధ్యనే మా వదిన  తూలిపడడం చేత కుడిచేయి మణికట్టు దగ్గర ఎముక  విరిగింది. కట్టు వేశారు. జాగ్రత్తగా ఉండమని, తోడు, సాయం లేకుండా నడవ వద్దని, నాలుగు అడుగులు కూడా వేయవద్దని  డాక్టరు జాగ్రత్తలు చెప్పి పంపాడు. ఇదీ నేపధ్యం.

మా వదినను మాట్లాడనివ్వకుండా, ఆమె రెండు చేతులూ పట్టుకుని స్వరూప ఏకబిగిన చెప్పుకుపోతోంది.

నేను మౌనంగా వింటున్నాను.

“అమ్మా! మీరు పెద్దవారు. ఎనభయ్ దాటాయని చెబుతున్నారు. మీ వయసులో సగం లేదు నా వయసు. మిమ్మల్ని కనిపెట్టుకుని చూడమని మా యజమాని నన్ను మీ వద్దకు పంపాడు. ఆయనకు మాట రానివ్వకుండా చూడాలి నేను. మీరేమో రాత్రుళ్లు  నాకు చెప్పకుండా లేస్తున్నారు. మీ పక్కనే పడుకుంటున్నాను. ఓ చేయి మీ వంటిమీదే ఉంచుతున్నాను. ఏమాత్రం అవసరం వున్నా నన్ను లేపండి. నేను దగ్గర వుండి మిమ్మల్ని బాత్ రూముకు తీసుకువెడతాను. మీరు నా కంటే చాలా పెద్ద. కానీ నాకంటికి నువ్వు  రెండేళ్ల పిల్లవే. కన్నబిడ్డ పక్కబట్టలు ఆగం చేస్తే తల్లి శుభ్రం చేయదా! నేనూ అంతే! పక్క మీద నుంచి రాత్రి వేళ కదిలే పనిలేకుండా నేనే చూస్తాను. లోగడ కొన్నాళ్ళు ఓ ఆసుపత్రిలో ఆయాగా పనిచేశాను. ఇవన్నీ నాకు అలవాటే.  కాబట్టి నా మాట వినండి. నేను ఈ పనులు డబ్బుల కోసం చేస్తున్నా, డబ్బొక్కటే ముఖ్యం కాదు. నాకిక్కడ మూడు పూటలా అన్నం పెడుతున్నారు. చక్కగా కనుక్కుంటున్నారు. నా పనిలో ఏదైనా తేడా వస్తే ఆపైన దేవుడు నన్ను వదిలిపెడతాడా!  

“మళ్ళీ చెబుతున్నాను. ఈసారి అరిచి కసిరి చెబుతాను. పిల్లలకు తల్లి చెప్పదా! అలాగే నేనూ గట్టిగానే చెబుతాను. మనసులో పెట్టుకోకండి. మీ కట్టు విప్పి, మీ చేయి నయం అయ్యేవరకు నేను మిమ్మల్ని వదిలిపోను. తర్వాత మీ ఇష్టం. అంతవరకూ నాకు మాట రానీయకండి”

ఇదంతా విన్న తర్వాత నాకు అక్కడ ఉండాల్సిన అవసరం కనపడలేదు. ఎంత మౌనంగా వచ్చానో అలాగే బయటకు వచ్చేశాను. వదిన ఎలా వుందో  చూడాలని వచ్చాను. ఆమెను పదిలంగా చూసుకునే మనిషి దొరికింది.

గుళ్ళో వుండే దేవుడు మనుషుల్లో కూడా ఉంటాడు. ఈ దేవత కొలువైన గుడి నుంచి బయలుదేరి మా ఇంటికి వెళ్లాను.

ఇది జరిగిన కొద్ది రోజులకే చేతి కట్టు విప్పారు.





(30-04-2022)