3, ఏప్రిల్ 2022, ఆదివారం

ఐ.ఏ.ఎస్. అంటే ... భండారు శ్రీనివాసరావు

 


(Published in ANDHRA PRABHA on 05-04-2022, SUNDAY)

ఐ.ఏ.ఎస్. అధికారుల విషయంలో ఈ నడుమ పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. స్వతంత్రం వచ్చిన కొత్తల్లో ఆనాటి బ్రిటిష్ సాంప్రదాయిక పరిపాలనా పద్ధతులకు విభిన్నంగా ఒక స్వతంత్ర అధికారిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలనే సదుద్దేశంతో ఈ అఖిల భారత సర్వీసు అధికారుల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. బ్రిటిష్ పాలనలో కొనసాగిన ఐ.సి.ఎస్. వ్యవస్థ స్థానంలో ఐ.ఏ.ఎస్. పరిపాలనా వ్యవస్థ రూపుదిద్దుకుంది.

 ఇన్నేళ్ళ అనుభవంలో ఇది ఏమైనా సత్ఫలితాలు ఇచ్చిందా లేక ఇతర వ్యవస్థల మాదిరిగానే అవసరమైన సచ్ఛీలతను కోల్పోయిందా అనేది ఈ చర్చల సారాంశం.

కాలం గడుస్తున్న కొద్దీ మారుతున్న పరిణామాలకు అనుగుణంగా వ్యవస్థల్లో మంచి చెడులలో కూడా స్థాయీ బేధం తప్పదు. ఐ.ఏ.ఎస్. అంటే అయాం ఎట్ యువర్ సర్వీసు అనే అర్ధం కాస్తా మారిపోయి,  అయాం ఎట్ మై బాస్ సర్వీసు అనే పెడర్ధం వ్యాప్తి చెందుతోంది. ప్రభుత్వ పెద్దలకు తగిన సమయంలో తగిన సలహాలు ఇచ్చి పరిపాలనను గాడిలో పెట్టాల్సిన ఐ.ఏ.ఎస్. అధికారులే దోవ తప్పుతున్నారనే అపార్థాలు ప్రబలుతున్నాయి. బహిరంగ వేదికలపై రాజకీయ పెద్దలకు పాదాభివందనాలు చేయడం, విదూషకులను మించి పొగడ్తలతో ముంచెత్తడం ఐ.ఏ.ఎస్. అధికారుల స్థాయికి తగ్గ పని కాదని విమర్శకుల అభిప్రాయంగా తోస్తోంది.  అయితే ఎవరో  కొందరిని బూచిగా చూపెట్టి మొత్తం వ్యవస్థను తప్పుపట్టడం కూడా మంచి పనికాదు. 

ఈ నేపధ్యంలో కొందరు మంచి అధికారులను సంస్మరించుకోవడం ఈ వ్యాసకర్త ఉద్దేశ్యం.

అనేక సంవత్సరాల క్రితం రెవెన్యూ బోర్డు సభ్యుడు, సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి అనంత రామన్ ఖమ్మం దౌరాకు వచ్చారు. రెవెన్యూ బోర్డు సభ్యుడు అందులోను మొదటి సభ్యుడు అంటే చీఫ్ సెక్రెటరీ తరువాత అంతటి హోదా కలిగిన ఆఫీసరు. ఆ రోజుల్లో ఉన్నతాధికారులు కూడా రైళ్ళల్లోనే ప్రయాణాలు చేసేవాళ్ళు. అలాగే రైల్లో ఖమ్మం చేరుకున్న అనంత రామన్ ని జిల్లా కలెక్టర్ సయ్యద్ హషీం ఆలీ రిసీవ్ చేసుకుని దగ్గరలోని ప్రభుత్వ అతిధి గృహం హిల్ బంగ్లాలో దిగబెట్టారు. మర్నాడు అధికారిక సమావేశాలు, సమీక్షలు ముగించుకున్న తర్వాత అనంత రామన్ గుట్ట మీద నరసింహస్వామి గుడి చూడాలని వుందన్న  కోరిక వెలిబుచ్చారు. కలెక్టరు  జీపులో అనంత రామన్ గుడికి వెళ్లి పూజలు అవీ ముగించుకుని వచ్చారు. హైదరాబాదు రైలెక్కేముందు అనంత రామన్ కలెక్టర్ చేతిలో కొన్ని నోట్లు పెట్టి చెప్పారు.

మీరు జీపు ఇచ్చినన్ను గుడికి పంపారు, సంతోషం. కానీ అది ప్రభుత్వ వాహనం. కాబట్టి ఈ డబ్బు ప్రభుత్వ ట్రెజరీలో జమ చేయించండి’.

ప్రభుత్వ ధనం అంటే పాముగా పరిగణించే రోజులవి.

ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్. పార్ధసారధి ఓ రోజు ఉదయం  జీపు తీసుకుని ఏదో ప్రాంతానికి టూరుకు వెళ్లి తిరిగి వస్తుంటే, రెబ్బవరం అనే గ్రామానికి దగ్గరలో టైరు పంక్చర్ అయింది. పంక్చర్ వేయించడానికి డ్రైవర్ కొన్ని మైళ్ళ దూరంలో వున్న మరో పెద్ద వూరికి వెళ్ళాడు. అతడు రావడానికి బాగా వ్యవధి వుంది. అటూ ఇటూ చూస్తున్న కలెక్టర్ దృష్టికి దగ్గరలో ఓ వూరు జాడ కనిపించింది. కొందరు ఆడవాళ్ళు బిందెలు చంకన పెట్టుకుని వస్తూ కానవచ్చారు. ఆయన వారిని పలకరించి, 'నీళ్ళ కోసం ఇంత దూరం ఎందుకు పడుతూ లేస్తూ వస్తున్నారు, మీ వూళ్ళో మంచి నీటి బావి లేదా?' అని ప్రశ్నించారు. 'వూళ్ళో బావులకేం చాలా వున్నాయి, కానీ మమ్మల్ని అక్కడ నీళ్ళు తోడుకోనివ్వరు' అని బదులు చెప్పారు. కలెక్టర్ సాలోచనగా తలపంకించి ఊరుకున్నారు. ఈలోగా టైరు పంక్చర్ వేయించుకుని డ్రైవర్ తిరిగివచ్చాడు. కలెక్టర్ తన మానాన తాను పొతే కధే లేదు. ఏం చేయాలో వెంటనే ఆలోచించి పెట్టుకున్నారు. డ్రైవర్ ని నేరుగా జిల్లా కేంద్రానికి పంపించి తాను రోడ్డు పక్కన ఓ  మోరీ మీద కూర్చుండిపోయారు. ఈలోగా ఆయన మౌఖిక ఆదేశాలు అందుకున్న కలెక్టర్  సిబ్బంది, స్థానిక తాసిల్దారు  టైప్ రైటర్లు, కలెక్టర్ అధికారిక ముద్రిక తదితరాలతో సహా అక్కడికి వచ్చారు. ఊళ్ళోకి కబురు పంపి సర్పంచుని రప్పించారు. ఈ హడావిడి అంతా చూసి ఊరిజనం అంతా అక్కడ పోగయ్యారు. వూరి వెలుపల నుంచి మంచి నీళ్ళు తెచ్చుకునే వారికి వారి గూడెంలోనే ఒక మంచి నీటి బావి మంజూరు చేయాలని కోరుతూ  సర్పంచు నుంచి ఓ అభ్యర్ధన పత్రం తీసుకున్నారు. దానికి అక్కడికక్కడే స్థానిక అధికారి నుంచి ఆమోద ముద్ర వేయించారు. తనకున్న విశేష అధికారాలను ఉపయోగించుకుంటూ అందుకు అవసరమైన నిధులను తక్షణమే మంజూరు చేస్తూ ఆ మోరీ మీదనే కూర్చుని సంతకం చేసి, కింద స్టాంపు వేసారు. ఆ వెనువెంటనే కూలీలను పిలిపించారు. బావి తవ్వకానికి ఆయనే స్వయంగా గడ్డపారతో మొదటి పలుగు వేసి స్వీకారం చుట్టారు. ఝాము పొద్దెక్కక ముందే ఝామ్మని బావి పని మొదలయింది. అంతకుముందు ఆ ఊరిజనం ఇలాటి అధికారిని చూడలేదు సరికదా కనీసం వినికూడా వుండలేదు. అందుకే అందరి మొహాల్లో నిండుకున్న నిబిడాశ్చర్యం. ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో వారి వూరిలో ఓ అభివృద్ధి కార్యక్రమానికి శుభారంభం జరిగింది. పొద్దుగూకే సమయానికి బావిలో సమృద్ధిగా జలపడింది. ఆ వూరి గూడెం జనానికి కొత్త పొద్దు పొడిచింది.

 

నేను ఏది చెబితే అదే జీవో అనే వారు 1978 లో తొలిసారి ముఖ్యమంత్రి అయిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి.
ఆయన వ్యవహారశైలి విలక్షణంగా వుండేది. తను అనుకున్నది నిమిషాలమీద కాదు క్షణాలలో జరిగిపోవాలని పట్టుబట్టేవారు.
చెప్పినవెంటనే జరిగిపోవాలనే ఆయన నైజం నిఖార్సయిన అధికారులకు ఒక పట్టాన మింగుడు పడేదికాదు.

సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి ఎస్. ఆర్. రామ్మూర్తి  ముఖ్యమంత్రి పేషీలో వుండేవారు. ఆయనకేమో అంతా రూలు ప్రకారం నడవాలి. రూలు పేరెత్తితే రూళ్లకర్ర పట్టుకుని హుంకరించే తత్వం చెన్నారెడ్డిది. ఎవరయ్యా ఈ రూల్స్ పెట్టింది. మనం పెట్టుకున్నవేగా, మార్చుకుంటే పోలా!అనే వారు.
అలా మార్చుకున్నప్పుడు మాకేమిటి అభ్యంతరం? కానీ, అప్పటిదాకా, ఇప్పుడున్న రూలే మాకు రూలుఅన్నది రామ్మూర్తి గారి రూలు.
ఏమయితేనేం, కొన్నాళ్ళకి రామ్మూర్తి గారే సర్దుకున్నారు. అంటే రూల్స్ తో సమాధాన పడ్డారని కాదు. అప్పటికి సరే అని,  సంబంధిత ఫైలు మళ్లీ సీ ఏం పేషీకి వచ్చినప్పుడు నెమ్మదిగా చెబితే సేఎమ్  వింటారులే అని ఒక మధ్యేమార్గం కనుక్కున్నారు. అప్పటినినుంచి చెన్నారెడ్డి  ఏదయినా అడగ్గానే రామ్మూర్తి  వెంటనే యస్ సర్’ (తప్పకుండా చేద్దాం సర్) అనేవారు. ఆ ఒక్క మాటతో చెన్నారెడ్డి  ఖుష్. ఫైల్ మళ్లీ పేషీకి వచ్చిన తరవాత సీ ఏం గారికి చూపించేటప్పుడు మాత్రం రూలు ప్రకారం ఆ పని చేయడం ఎలా కుదరదో వివరంగా చెప్పి, నో సర్’ (కుదరదు సర్ ) అనేవారు. ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో ఆ ఆనుపానులన్నీ తెలిసిన చెన్నారెడ్డి కూడా కిమ్మనకుండా తలపంకించి వూరుకునేవారు.

ఇదంతా తెలిసిన వారు, ఆయన ఇంటి పేరు యస్ ఆర్తో ముడిపెట్టి, ఫైలు రాకముందు యస్ సర్ రామ్మూర్తి, వచ్చిన తరవాత నో సర్ రామ్మూర్తిఅని సరదాగా అనుకునే వారు.

సయ్యద్ హషీం ఆలీ ఖమ్మం జిల్లా కలెక్టర్ గా పనిచేశారు.

ఆ రోజుల్లో ఖమ్మం కలెక్టర్ ఆఫీసు ట్రంకు రోడ్డులో వుండేది. చాలా చిన్న భవంతి. మెట్లు ఎక్కగానే ఎదురుగా స్వింగ్ డోర్. దాని వెనుక ఒక నీలంగుడ్డ పరచిన మేజా బల్ల. వెనుక కుర్చీలో కలెక్టర్. అదీ పరిస్తితి. అటాచ్డ్ బాత్ రూమ్ కూడా వుండేది కాదు. వెనక పెరట్లో ఎక్కడో దూరంగా వుండేది.

ఓ రోజు కలెక్టర్ ని కలవడానికి భద్రాచలం దగ్గర ఓ పల్లెటూరు నుంచి ఓ రైతు వచ్చాడు. గుమ్మం ముందు హమేషా వుండే డవాలా బంట్రోతు ఆ సమయంలో ఏదో పనిమీద వెళ్ళాడు. లోపల కలెక్టర్ గారు బాత్రూంకు పోవడానికి లేచి పెరటి ద్వారం వైపు వెడుతున్నారు. సరిగ్గా ఆ టైంలో రైతు స్వింగ్ డోర్ తెరుచుకుని ‘కలెక్టర్ దొరగారెక్కడ?’ అని అడిగాడు. తాను అడుగుతున్నది సాక్షాత్తు కలెక్టర్ నే అని అతడికి తెలియదు. హషీం ఆలీగారు ఏమాత్రం నొచ్చుకోకుండా, అతడిని కూర్చోబెట్టి విషయం తెలుసుకుని సమస్యను పరిష్కరించే విషయంలో తన కింది సిబ్బందికి తగు సూచనలు ఇచ్చి పంపేశారు.

సురేష్ చందా అనే ఓ ఐ.ఏ.ఎస్. అధికారి తెలంగాణా సచివాలయంలో ఒక ఉన్నత స్థానంలో పని చేసేవారు. రాష్ట్రం మొత్తంలో ఆరోగ్య, వైద్య సేవలు ఆయా ప్రభుత్వ ఆసుపత్రులలో ఎలా అందుతున్నాయో పర్యవేక్షించే బాధ్యత ఆయనది. యువకుడు కావడం వల్ల కంప్యూటర్ పరిజ్ఞానం హెచ్చుగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. అంచేత తన శాఖ పని తీరు మెరుగుపరుచుకోవడానికి ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవాలని భావించి, తెలంగాణాలో పేరొందిన గాంధి ఆసుపత్రితో మొదలు పెట్టి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని అనుకున్నారు. గాంధీ ఆసుపత్రిలో ఏమూల ఏం జరుగుతున్నదో సచివాలయంలోని తన చాంబర్ నుంచే కనిపెట్టి చూసే ఉద్దేశ్యంతో ఆ ఆసుపత్రిలో సుమారు రెండువందల నిఘా కెమెరాలను అమర్చాలని తలపెట్టారు. కిందవాళ్ళు చేసే పనులను కనిపెట్టి చూడడం ఆయన బాధ్యతల్లో ఒకటి. కానీ, తాను ఎలా పనిచేస్తున్నది కూడా నలుగురికీ తెలియాలి కదా! అందుకని ఈ ప్రయోగాన్ని ఆయన తనతోనే ప్రారంభించారు. చడీచప్పుడూ కాకుండా తన కార్యాలయంలో ఒక నిఘా కెమెరాను ఏర్పాటు చేసుకున్నారు. తన గదిలో ఏం జరిగేది, తనను కలుసుకోవడానికి ఎవరెవరు వచ్చేది, ఏం మాట్లాడేది రికార్డు చేయడం కోసం ఈ కెమెరా. అయితే ఈ కెమెరా రికార్డు చేసేది తను ఒక్కరే కాకుండా ఎవరయినా సరే చూడగలిగేలా ఇంటర్నెట్ తో  దాన్ని అనుసంధానం చేయడం ఇందులోని ఒక ప్రత్యేకత.

వ్యవస్థకు చీడలు పట్టకుండా చూడడానికి ఇలాంటి అధికారులు,,  సంఖ్య స్వల్పమే అయినా ఇంకా మరికొందరు వున్నారు. అదే ఊరట.



 

 

2, ఏప్రిల్ 2022, శనివారం

పదవులు ఊరికే రావు – భండారు శ్రీనివాసరావు


“కొంత గ్యాసు నూనె కావాలె. మరేమీ అక్కరలేదు” అన్నారు బండారు దత్తాత్రేయ గారు ‘మీకింకా ఏమి కావాలి’ అని అడిగిన ఆనాటి మంత్రి మండలి వెంకటకృష్ణా రావు గారితో.
ఇది 1977 నాటి మాట. ఆ ఏడాది నవంబరు పందొమ్మిది అర్ధరాత్రి విరుచుకు పడిన ఉప్పెన ధాటికి దివి సీమలో ఊళ్లకు ఊళ్ళే తుడిచి పెట్టుకు పోయాయి. కాళరాత్రిగా మారిన ఆనాటి రాత్రి అకస్మాత్తుగా ముంచెత్తిన సముద్రపు అలల తాకిడికి దివి సీమ శవాల దిబ్బగా మారింది. రోజుల తరబడి కరెంటు సరఫరా నిలిచిపోయింది. గ్రామాలతో పాటే అంతంత మాత్రంగా ఉన్న రహదారులు కూడా కొట్టుకుపోవడంతో ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి అన్ని దారులు మూసుకు పోయాయి. పోలీసులు, ప్రభుత్వ సిబ్బంది, విలేకరులు అతి కష్టం మీద కొన్ని రోజుల తర్వాత కానీ అక్కడికి చేరలేకపోయారు. వరద తీసిన తర్వాత పేరుకుపోయిన మట్టి మేటల్లో వందలాది మనుషుల శవాలు, పశువుల కళేబరాలు కూరుకు పోయాయి. నష్టం జరిగింది కానీ ఏమేరకు అని అంచనా వేయడానికి అడుగడుగునా అన్నీ ప్రతిబంధకాలే. ఇప్పటి మాదిరిగా కమ్యూనికేషన్ సదుపాయాలు ఆనాడు లేవు.
ఈ నేపధ్యంలో దత్తాత్రేయ గారు అన్నమాట అది, ‘మాకేమీ అక్కరలేదు, గ్యాసు నూనె చాలు’ అని.
బండారు దత్తాత్రేయ ఏమిటి గ్యాసు నూనె కావాలని అడగడం ఏమిటి ఈ రెంటికి అసలు ఎక్కడ సంబంధం అనుకోవచ్చు. ఒక ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తగా అనేకమంది తోటి సహచరులతో కలిసి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దత్తాత్రేయ గారు దివి సీమకు వెళ్ళారు. వరద నీటిలో తేలుతూ ఉబ్బిపోయిన మనుషుల శవాలను ఒక్క చోటకు చేర్చి వాటికి అనాథ శవ సంస్కారం చేసే ఉత్కృష్టమైన బాధ్యతను ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలు స్వచ్చందంగా నెత్తికి ఎత్తుకున్నారు. ఈ పని చేయడానికి వారికి కిరోసిన్ అవసరం. సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నది స్వయానా నాటి విద్యాశాఖ మంత్రి శ్రీ మండలి వెంకట కృష్ణారావు. ఆయన కూడా రాత్రి పగలు, దారి డొంకా అని లేకుండా కాలి నడకన కలయ తిరుగుతూ ప్రాణాలతో బయట పడిన దివి సీమ వాసులకు ప్రభుత్వ పక్షాన ధైర్యం చెబుతూ, అధికారులతో మాట్లాడుతూ, బాధితులకు అవసరమైన సహాయం అందిస్తూ, కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తూ వుండడం చూసి హైదరాబాదు నుంచి వెళ్ళిన కొందరు వ్లిలేకరులకు ఆశ్చర్యం వేసింది. తెల్లటి ఖద్దరు దుస్తుల్లో హైదరాబాదులో చూసిన మనిషి, మట్టి కొట్టుకుపోయిన దుస్తుల్లో ఊరూ వాడా అనకుండా తిరుగుతూ వుండడం వారికి మరింత ఆశ్చర్యం కలిగించింది.
స్థానికంగా అన్నీ తానే అయి చూస్తున్న మండలి కృష్ణారావు గారిని దత్తాత్రేయ బృందం కలిసింది. ముందు దత్తాత్రేయ వేష భాషలు చూసి నాగపూర్ నుంచి వచ్చి ఉంటారని మంత్రి అనుకున్నారు. ఆంధ్రజ్యోతి తరపున పరాంకుశం దామోదర స్వామి, ఈనాడు తరపున పాశం యాదగిరి ప్రభ్రుతులకు కూడా దత్తాత్రేయ గారిని ఆనాడు చప్పున గుర్తు పట్టలేని పరిస్థితి.
గ్యాసు నూనె అంటున్నారు ఈయన గారిది హైదరాబాదు అయి వుంటుంది అనే అనుమానం కలిగింది.
పాశం యాదగిరిని చిన్నప్పటి నుంచి పండిత్ పొట్టా (బాల మేధావి) అనే వారు. చాలా విషయాలు గుర్తుంచుకునే ధారణ శక్తి పుష్కలం.
బండారు దత్తాత్రేయ ఎవరన్నది యాదగిరికి చప్పున జ్ఞాపకం వచ్చింది.
“ఖాఖీ నిక్కరు వేసుకుని, లాఠీ చేత పట్టుకుని, క్యా ఆలీఘడ్ క్యా గౌహ్వాటీ, అప్ నా దేశ్, అప్నా మాటీ” అంటూ గౌలీగూడాలో తమ ఇంటి మీదుగా వెళ్ళే ప్రభాత్ భేరీ బృందం యాదగిరి స్మృతిపధంలో లీలగా మెదిలింది. అందుకే అతడు యాదగిరి కాదు, యాద్ గిరి అని పిలుస్తాను నేను.
ఇక ఇద్దరికీ తాము ఎవరన్నది తెలిసిపోయింది.
“నువ్వు పాశం గోపయ్య బిడ్డవు కదా!” అన్నారు దత్తాత్రేయ.
యాదగిరి, దామోదరస్వామి దత్తాత్రేయ బృందంతో కలిసి దివిసీమపై పగబట్టిన ప్రకృతి ఆగ్రహంతో చేసిన విలయ తాండవం తాలూకు ఘోర దృశ్యాలను కళ్ళారా చూసారు. వరద పూర్తిగా తీసిన తర్వాత కొన్ని కొబ్బరి చెట్ల మట్టలలో చిక్కుకుని వున్న మానవ కళేబరాలను చూసినప్పుడు నవంబరు పందొమ్మిది అర్ధరాత్రి సంభవించిన ఉప్పెనతో దివి సీమకు వాటిల్లిన ముప్పు తీవ్రత ఎంతటిదో వారికి అర్ధం అయింది. అంటే ఆ ఎత్తులో సముద్రపు కెరటాలు విరుచుకు పడ్డాయి అన్నమాట.
‘ఇంకేమీ అక్కరలేదు గ్యాసు నూనె చాలు’ అని నలభయ్ అయిదేళ్ళ నాడే అనాథ శవాల అంత్యక్రియలు చిత్తశుద్ధితో చేసిన బండారు దత్తాత్రేయ గారు ఈనాడు హర్యానా గవర్నర్.
పదవులు ఊరికే రావు.



(02-04-2022)

ఏడాదిలో పెరిగిన నా సంపాదన - భండారు శ్రీనివాసరావు

 ఎప్పుడూ ఆ కంప్యూటర్ ముందు కూర్చుని టిక్కు టిక్కుమంటూ టైప్ చేస్తుంటారు, గూడలు అరిగిపోయేలా?’ (ఏమిటి ఉపయోగం? కూటికా! గుడ్డకా! సినిమాకా!) అనేది నా భార్య బతికున్న రోజుల్లో. బ్రాకెట్లో రాసినవి నా సొంత కపిత్వం.

రిటైర్ అయిన తర్వాత నేను రాస్తూ వచ్చిన వ్యాసాలను కొన్ని పత్రికల వాళ్ళు వేస్తూ వచ్చారు కానీ రచయితకు విదిలించింది ఏమీ లేదు. ఎక్కడో అక్కడ నేను రాసిన అక్షరాలకు నలుపూ తెలుపూ రంగులు అంటుతున్నాయి కదా అని నేనూ పట్టించుకోలేదు.

పొతే, నా బ్లాగుకు హిట్లు అన్ని లక్షలు అని చంకలు కొట్టుకోవడం తప్పిస్తే దాని రాతలవల్ల నాకు అంటుకున్నవి మెడ నొప్పులు, గూడ నొప్పులు మాత్రమే.

కొన్నాళ్ళ క్రితం అమెరికాలో ఉంటున్న మా అన్నయ్య కుమారుడు సత్య సాయి కష్టపడి నా బ్లాగును Google Adsense తో అనుసంధానం చేశాడు. పాత వాటిని ఆ సంస్థ లెక్కలోకి తీసుకోదట. పోనీలే అనుకున్నాను.

నిన్ననో మొన్ననో చూస్తే రెండు అమెరికన్ డాలర్లు నా ఖాతాలో పడ్డట్టు కనిపించింది. అవి నా బ్యాంకు ఖాతాకు చేరి, జీ ఎస్ టి పోను ఎంత మిగులుతుందో అది నాకనవసరం.

డెబ్బయి అయిదేళ్ళ వయసులో నా రాతల ద్వారా నేను రెండు డాలర్లు సంపాదించాను, అంతే నాకు కావాల్సింది.

నా భార్య బతికి వుంటే, నేనో మిలియన్ డాలర్లు సంపాదించినంత సంతోషపడి వుండేది.

మొగుడనే వాడు ప్రయోజకుడు కావడాన్ని మించి ఏ భార్యకు అయినా సంతృప్తి ఏముంటుంది?

ఈసారి అమెరికా వెళ్ళినప్పుడు నా మనుమరాళ్లకు నా డబ్బులతో చిన్న చాకలేట్ కొనివ్వగలను అనే ఊహే నాకు ఆనందాన్ని ఇస్తోంది.

(02-04-2021)

 

తోకటపా: ఏడాది క్రితం రెండు డాలర్లు. ఈ ఏడాదిలో పిల్లలు పెట్టినట్టున్నది. ఈరోజు చూస్తే ఆ మొత్తం అక్షరాలా ఇరవై ఏడున్నర అమెరికన్ డాలర్లకు పెరిగింది. ఇప్పటి మార్కెట్ రేటు ప్రకారం  2088 రూపాయలు (ట)   



(02-04-2022)

1, ఏప్రిల్ 2022, శుక్రవారం

లీకు వీరులు – భండారు శ్రీనివాసరావు

 

ఇది రాసే ముందు జర్నలిజం ప్రొఫెషనల్ ఎథిక్స్ గురించి ఆలోచిస్తూ కాసేపు తటపటాయించాను. కానీ ఈరోజుల్లో అవి కలికానికి కూడా కనపడడం లేదని గుర్తుకొచ్చి మళ్ళీ కంప్యూటర్ ముందు కూర్చొన్నాను.

ఇటు రాజకీయులకు, అటు జర్నలిస్టులకు లీకులు అనేవి కొత్తవి కావు. వారిరువురి నడుమా బంధాలు, అనుబంధాలు పెనవేసుకుని పోవడానికి బాగా తోడ్పడేవి నిజానికి లీకులే. పొగడ్తలతో కూడిన గొప్ప వార్తలు, వ్యాసాలు రాయడానికి చాలామంది వుంటారు. రాజకీయ ప్రయోజనాలకోసం కొన్ని కట్టుడు కధలు పత్రికల్లో/ మీడియాలో రావడం వాళ్లకి ప్రధానం.

అయితే ఈ కధనాలు వాళ్ళు చెప్పినట్టే రావాలి కానీ వాళ్ళు చెప్పినట్టు ఎక్కడా బయటకి రాకూడదు. అలా బయటకు వచ్చిన లీకులపై విస్తృతంగా చర్చ జరిగిన పిమ్మట ‘ఆ వార్తలు మీడియా సృష్టి, నాకేమీ సంబంధం లేదు’ అని ఖండన ఇచ్చుకునే విధంగా వుండాలి. అలా అని ఆ వార్తలో పూర్తిగా నిజం వుండకూడదనీ కాదు. అలా అని అసలు నిజం లేదనీ కాదు. ఆ లీకు వీరుడి పేరు ఎటువంటి పరిస్థితుల్లో వెల్లడి కారాదు. (సోర్స్ చెప్పాల్సిన అవసరం మాకు లేదు’ అనే unwritten హక్కు గురించి మాట్లాడేది ఇలాంటి సందర్భాలలోనే). ఇన్ని షరతులతో లీకులు బయటకి వస్తాయి కాబట్టే వాటికి అంతటి డిమాండ్.

ఇంతకీ ఈ లీకులు ఏమిటి? ఎలా పురుడు పోసుకుంటాయి?

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించేరోజుల్లో అధికార పక్షంలోని అసంతృప్తులే ఈ లీకుల్ని విలేకరులకు ఉప్పందించేవారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ సాంప్రదాయం కొనసాగుతూనే వచ్చింది. తదనంతర కాలంలో ఇవి పతాక స్థాయికి చేరి ఏది నిజమో ఏది అబద్ధమూ తెలియనంతగా మారిపోయి పాత్రికేయ ప్రమాణాలను, విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా విశ్వరూపం దాలుస్తున్నాయి.

ముఖ్యమంత్రుల కార్యాలయాల్లో పనిచేసే పౌర సంబంధాల అధికారులు ఈ లీకు వ్యవహారాలను చూస్తుంటారు. అల్లాగే మంత్రుల దగ్గర పనిచేసేవాళ్ళు.

ఒక ఉదాహరణ చెప్పుకుందాం.

ఓ ఉదయం, నేను రేడియోలో చేరిన కొత్తల్లో అనుకుంటాను, (అప్పటికి మీడియా విస్తృతి ఇంత లేదు. పత్రికలే రాజ్యం చేస్తున్నాయి, ఇప్పటికీ వాళ్ళదే రాజ్యం. అందుకే పలానా పత్రిక కావాలని రాసింది అని రాజకీయులు అంటుంటారు. ప్రింటులో వచ్చే వార్త ఖచ్చితం అని నమ్మేవారు ఉండడమే ఇందుకు కారణం) ఓ పత్రికా విలేకరికి ముఖ్యమంత్రి కార్యాలయంలోని సోర్స్ నుంచి ఫోన్ వస్తుంది. సంభాషణ ఇలా నడుస్తుంది.

ఏమిటి సంగతులు ఏమైనా కొత్త విషయాలు ఉన్నాయా!’

మా దగ్గర వార్తలు ఏముంటాయి? మీరిస్తేనే కదా మాకు వార్తలు’

అలా అంటావు కానీ మీరు రాసేవే మాకు వార్తలు. మొన్న చెప్పాను కదా! ఆయన ఆ పెద్దాయన్ని కలిశాడు అంటున్నారు. నీకేమైనా తెలుసా?’

తెలియదే. ఎప్పుడు?’

నేనూ విన్నదే! కనుక్కోని చెప్పు’

ఇక అక్కడినుంచి ఆ విలేకరి పని మొదలవుతుంది. ‘ఆయన’ అంటే ముఖ్యమంత్రి. మరి పెద్దాయన ఎవరు?

ఆయన’ డ్రైవర్ నెంబరుకు ఫోను చేశాడు. వీ ఐ పీ రాకపోకలు కనుక్కోవాలంటే పోలీసులు, డ్రైవర్లను మించి విలేకరులకు మంచి సోర్సు దొరకదు.

డ్రైవర్ దొరికాడు కానీ కావాల్సిన సమాచారం రాలేదు. కాకపొతే ఓ విషయం చెప్పాడు. ఆ రోజు ‘ఆయన’ అధికారిక వాహనం కాకుండా వేరే కారులో వెళ్ళిన మాట ధృవీకరించాడు. వెంట ఎవరు వెళ్లిందీ చెప్పాడు. ఆ వెంట వెళ్ళిన వాళ్ళను పట్టుకుంటే ‘ఆ పెద్దాయన’ ఎవరో తెలిసింది.

ఇవన్నీ జరిగిన సంగతులు. తర్వాత కావాల్సిన విధంగా మసాలాలు దట్టించి వార్తను వండి వార్చడమే.

అధిష్టానంపై తిరుగుబాటుకు పావులు కదుపుతున్న ముఖ్యమంత్రి!’

కేంద్రంలో చక్రం తిప్పుతున్న ఓ సీనియర్ మంత్రిని రహస్యంగా కలుసుకుని చర్చలు జరిపిన ముఖ్యమంత్రి’

ఇది హెడ్డింగు. అసలు వార్త అనేక సోయగాలు అద్దుకుని అక్షరాల రూపంలో మర్నాడు పత్రికలో మొదటి పేజీలో దర్శనం ఇస్తుంది.

దానితో పాటే ముఖ్యమంత్రి కార్యాలయం జారీ చేసిన ‘ఖండన’ ప్రకటన కూడా ఆ పత్రిక కార్యాలయానికి చేరుతుంది.

ఇతి వార్తాః