2, ఏప్రిల్ 2022, శనివారం

పదవులు ఊరికే రావు – భండారు శ్రీనివాసరావు


“కొంత గ్యాసు నూనె కావాలె. మరేమీ అక్కరలేదు” అన్నారు బండారు దత్తాత్రేయ గారు ‘మీకింకా ఏమి కావాలి’ అని అడిగిన ఆనాటి మంత్రి మండలి వెంకటకృష్ణా రావు గారితో.
ఇది 1977 నాటి మాట. ఆ ఏడాది నవంబరు పందొమ్మిది అర్ధరాత్రి విరుచుకు పడిన ఉప్పెన ధాటికి దివి సీమలో ఊళ్లకు ఊళ్ళే తుడిచి పెట్టుకు పోయాయి. కాళరాత్రిగా మారిన ఆనాటి రాత్రి అకస్మాత్తుగా ముంచెత్తిన సముద్రపు అలల తాకిడికి దివి సీమ శవాల దిబ్బగా మారింది. రోజుల తరబడి కరెంటు సరఫరా నిలిచిపోయింది. గ్రామాలతో పాటే అంతంత మాత్రంగా ఉన్న రహదారులు కూడా కొట్టుకుపోవడంతో ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి అన్ని దారులు మూసుకు పోయాయి. పోలీసులు, ప్రభుత్వ సిబ్బంది, విలేకరులు అతి కష్టం మీద కొన్ని రోజుల తర్వాత కానీ అక్కడికి చేరలేకపోయారు. వరద తీసిన తర్వాత పేరుకుపోయిన మట్టి మేటల్లో వందలాది మనుషుల శవాలు, పశువుల కళేబరాలు కూరుకు పోయాయి. నష్టం జరిగింది కానీ ఏమేరకు అని అంచనా వేయడానికి అడుగడుగునా అన్నీ ప్రతిబంధకాలే. ఇప్పటి మాదిరిగా కమ్యూనికేషన్ సదుపాయాలు ఆనాడు లేవు.
ఈ నేపధ్యంలో దత్తాత్రేయ గారు అన్నమాట అది, ‘మాకేమీ అక్కరలేదు, గ్యాసు నూనె చాలు’ అని.
బండారు దత్తాత్రేయ ఏమిటి గ్యాసు నూనె కావాలని అడగడం ఏమిటి ఈ రెంటికి అసలు ఎక్కడ సంబంధం అనుకోవచ్చు. ఒక ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తగా అనేకమంది తోటి సహచరులతో కలిసి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దత్తాత్రేయ గారు దివి సీమకు వెళ్ళారు. వరద నీటిలో తేలుతూ ఉబ్బిపోయిన మనుషుల శవాలను ఒక్క చోటకు చేర్చి వాటికి అనాథ శవ సంస్కారం చేసే ఉత్కృష్టమైన బాధ్యతను ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలు స్వచ్చందంగా నెత్తికి ఎత్తుకున్నారు. ఈ పని చేయడానికి వారికి కిరోసిన్ అవసరం. సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నది స్వయానా నాటి విద్యాశాఖ మంత్రి శ్రీ మండలి వెంకట కృష్ణారావు. ఆయన కూడా రాత్రి పగలు, దారి డొంకా అని లేకుండా కాలి నడకన కలయ తిరుగుతూ ప్రాణాలతో బయట పడిన దివి సీమ వాసులకు ప్రభుత్వ పక్షాన ధైర్యం చెబుతూ, అధికారులతో మాట్లాడుతూ, బాధితులకు అవసరమైన సహాయం అందిస్తూ, కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తూ వుండడం చూసి హైదరాబాదు నుంచి వెళ్ళిన కొందరు వ్లిలేకరులకు ఆశ్చర్యం వేసింది. తెల్లటి ఖద్దరు దుస్తుల్లో హైదరాబాదులో చూసిన మనిషి, మట్టి కొట్టుకుపోయిన దుస్తుల్లో ఊరూ వాడా అనకుండా తిరుగుతూ వుండడం వారికి మరింత ఆశ్చర్యం కలిగించింది.
స్థానికంగా అన్నీ తానే అయి చూస్తున్న మండలి కృష్ణారావు గారిని దత్తాత్రేయ బృందం కలిసింది. ముందు దత్తాత్రేయ వేష భాషలు చూసి నాగపూర్ నుంచి వచ్చి ఉంటారని మంత్రి అనుకున్నారు. ఆంధ్రజ్యోతి తరపున పరాంకుశం దామోదర స్వామి, ఈనాడు తరపున పాశం యాదగిరి ప్రభ్రుతులకు కూడా దత్తాత్రేయ గారిని ఆనాడు చప్పున గుర్తు పట్టలేని పరిస్థితి.
గ్యాసు నూనె అంటున్నారు ఈయన గారిది హైదరాబాదు అయి వుంటుంది అనే అనుమానం కలిగింది.
పాశం యాదగిరిని చిన్నప్పటి నుంచి పండిత్ పొట్టా (బాల మేధావి) అనే వారు. చాలా విషయాలు గుర్తుంచుకునే ధారణ శక్తి పుష్కలం.
బండారు దత్తాత్రేయ ఎవరన్నది యాదగిరికి చప్పున జ్ఞాపకం వచ్చింది.
“ఖాఖీ నిక్కరు వేసుకుని, లాఠీ చేత పట్టుకుని, క్యా ఆలీఘడ్ క్యా గౌహ్వాటీ, అప్ నా దేశ్, అప్నా మాటీ” అంటూ గౌలీగూడాలో తమ ఇంటి మీదుగా వెళ్ళే ప్రభాత్ భేరీ బృందం యాదగిరి స్మృతిపధంలో లీలగా మెదిలింది. అందుకే అతడు యాదగిరి కాదు, యాద్ గిరి అని పిలుస్తాను నేను.
ఇక ఇద్దరికీ తాము ఎవరన్నది తెలిసిపోయింది.
“నువ్వు పాశం గోపయ్య బిడ్డవు కదా!” అన్నారు దత్తాత్రేయ.
యాదగిరి, దామోదరస్వామి దత్తాత్రేయ బృందంతో కలిసి దివిసీమపై పగబట్టిన ప్రకృతి ఆగ్రహంతో చేసిన విలయ తాండవం తాలూకు ఘోర దృశ్యాలను కళ్ళారా చూసారు. వరద పూర్తిగా తీసిన తర్వాత కొన్ని కొబ్బరి చెట్ల మట్టలలో చిక్కుకుని వున్న మానవ కళేబరాలను చూసినప్పుడు నవంబరు పందొమ్మిది అర్ధరాత్రి సంభవించిన ఉప్పెనతో దివి సీమకు వాటిల్లిన ముప్పు తీవ్రత ఎంతటిదో వారికి అర్ధం అయింది. అంటే ఆ ఎత్తులో సముద్రపు కెరటాలు విరుచుకు పడ్డాయి అన్నమాట.
‘ఇంకేమీ అక్కరలేదు గ్యాసు నూనె చాలు’ అని నలభయ్ అయిదేళ్ళ నాడే అనాథ శవాల అంత్యక్రియలు చిత్తశుద్ధితో చేసిన బండారు దత్తాత్రేయ గారు ఈనాడు హర్యానా గవర్నర్.
పదవులు ఊరికే రావు.



(02-04-2022)

ఏడాదిలో పెరిగిన నా సంపాదన - భండారు శ్రీనివాసరావు

 ఎప్పుడూ ఆ కంప్యూటర్ ముందు కూర్చుని టిక్కు టిక్కుమంటూ టైప్ చేస్తుంటారు, గూడలు అరిగిపోయేలా?’ (ఏమిటి ఉపయోగం? కూటికా! గుడ్డకా! సినిమాకా!) అనేది నా భార్య బతికున్న రోజుల్లో. బ్రాకెట్లో రాసినవి నా సొంత కపిత్వం.

రిటైర్ అయిన తర్వాత నేను రాస్తూ వచ్చిన వ్యాసాలను కొన్ని పత్రికల వాళ్ళు వేస్తూ వచ్చారు కానీ రచయితకు విదిలించింది ఏమీ లేదు. ఎక్కడో అక్కడ నేను రాసిన అక్షరాలకు నలుపూ తెలుపూ రంగులు అంటుతున్నాయి కదా అని నేనూ పట్టించుకోలేదు.

పొతే, నా బ్లాగుకు హిట్లు అన్ని లక్షలు అని చంకలు కొట్టుకోవడం తప్పిస్తే దాని రాతలవల్ల నాకు అంటుకున్నవి మెడ నొప్పులు, గూడ నొప్పులు మాత్రమే.

కొన్నాళ్ళ క్రితం అమెరికాలో ఉంటున్న మా అన్నయ్య కుమారుడు సత్య సాయి కష్టపడి నా బ్లాగును Google Adsense తో అనుసంధానం చేశాడు. పాత వాటిని ఆ సంస్థ లెక్కలోకి తీసుకోదట. పోనీలే అనుకున్నాను.

నిన్ననో మొన్ననో చూస్తే రెండు అమెరికన్ డాలర్లు నా ఖాతాలో పడ్డట్టు కనిపించింది. అవి నా బ్యాంకు ఖాతాకు చేరి, జీ ఎస్ టి పోను ఎంత మిగులుతుందో అది నాకనవసరం.

డెబ్బయి అయిదేళ్ళ వయసులో నా రాతల ద్వారా నేను రెండు డాలర్లు సంపాదించాను, అంతే నాకు కావాల్సింది.

నా భార్య బతికి వుంటే, నేనో మిలియన్ డాలర్లు సంపాదించినంత సంతోషపడి వుండేది.

మొగుడనే వాడు ప్రయోజకుడు కావడాన్ని మించి ఏ భార్యకు అయినా సంతృప్తి ఏముంటుంది?

ఈసారి అమెరికా వెళ్ళినప్పుడు నా మనుమరాళ్లకు నా డబ్బులతో చిన్న చాకలేట్ కొనివ్వగలను అనే ఊహే నాకు ఆనందాన్ని ఇస్తోంది.

(02-04-2021)

 

తోకటపా: ఏడాది క్రితం రెండు డాలర్లు. ఈ ఏడాదిలో పిల్లలు పెట్టినట్టున్నది. ఈరోజు చూస్తే ఆ మొత్తం అక్షరాలా ఇరవై ఏడున్నర అమెరికన్ డాలర్లకు పెరిగింది. ఇప్పటి మార్కెట్ రేటు ప్రకారం  2088 రూపాయలు (ట)   



(02-04-2022)

1, ఏప్రిల్ 2022, శుక్రవారం

లీకు వీరులు – భండారు శ్రీనివాసరావు

 

ఇది రాసే ముందు జర్నలిజం ప్రొఫెషనల్ ఎథిక్స్ గురించి ఆలోచిస్తూ కాసేపు తటపటాయించాను. కానీ ఈరోజుల్లో అవి కలికానికి కూడా కనపడడం లేదని గుర్తుకొచ్చి మళ్ళీ కంప్యూటర్ ముందు కూర్చొన్నాను.

ఇటు రాజకీయులకు, అటు జర్నలిస్టులకు లీకులు అనేవి కొత్తవి కావు. వారిరువురి నడుమా బంధాలు, అనుబంధాలు పెనవేసుకుని పోవడానికి బాగా తోడ్పడేవి నిజానికి లీకులే. పొగడ్తలతో కూడిన గొప్ప వార్తలు, వ్యాసాలు రాయడానికి చాలామంది వుంటారు. రాజకీయ ప్రయోజనాలకోసం కొన్ని కట్టుడు కధలు పత్రికల్లో/ మీడియాలో రావడం వాళ్లకి ప్రధానం.

అయితే ఈ కధనాలు వాళ్ళు చెప్పినట్టే రావాలి కానీ వాళ్ళు చెప్పినట్టు ఎక్కడా బయటకి రాకూడదు. అలా బయటకు వచ్చిన లీకులపై విస్తృతంగా చర్చ జరిగిన పిమ్మట ‘ఆ వార్తలు మీడియా సృష్టి, నాకేమీ సంబంధం లేదు’ అని ఖండన ఇచ్చుకునే విధంగా వుండాలి. అలా అని ఆ వార్తలో పూర్తిగా నిజం వుండకూడదనీ కాదు. అలా అని అసలు నిజం లేదనీ కాదు. ఆ లీకు వీరుడి పేరు ఎటువంటి పరిస్థితుల్లో వెల్లడి కారాదు. (సోర్స్ చెప్పాల్సిన అవసరం మాకు లేదు’ అనే unwritten హక్కు గురించి మాట్లాడేది ఇలాంటి సందర్భాలలోనే). ఇన్ని షరతులతో లీకులు బయటకి వస్తాయి కాబట్టే వాటికి అంతటి డిమాండ్.

ఇంతకీ ఈ లీకులు ఏమిటి? ఎలా పురుడు పోసుకుంటాయి?

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించేరోజుల్లో అధికార పక్షంలోని అసంతృప్తులే ఈ లీకుల్ని విలేకరులకు ఉప్పందించేవారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ సాంప్రదాయం కొనసాగుతూనే వచ్చింది. తదనంతర కాలంలో ఇవి పతాక స్థాయికి చేరి ఏది నిజమో ఏది అబద్ధమూ తెలియనంతగా మారిపోయి పాత్రికేయ ప్రమాణాలను, విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా విశ్వరూపం దాలుస్తున్నాయి.

ముఖ్యమంత్రుల కార్యాలయాల్లో పనిచేసే పౌర సంబంధాల అధికారులు ఈ లీకు వ్యవహారాలను చూస్తుంటారు. అల్లాగే మంత్రుల దగ్గర పనిచేసేవాళ్ళు.

ఒక ఉదాహరణ చెప్పుకుందాం.

ఓ ఉదయం, నేను రేడియోలో చేరిన కొత్తల్లో అనుకుంటాను, (అప్పటికి మీడియా విస్తృతి ఇంత లేదు. పత్రికలే రాజ్యం చేస్తున్నాయి, ఇప్పటికీ వాళ్ళదే రాజ్యం. అందుకే పలానా పత్రిక కావాలని రాసింది అని రాజకీయులు అంటుంటారు. ప్రింటులో వచ్చే వార్త ఖచ్చితం అని నమ్మేవారు ఉండడమే ఇందుకు కారణం) ఓ పత్రికా విలేకరికి ముఖ్యమంత్రి కార్యాలయంలోని సోర్స్ నుంచి ఫోన్ వస్తుంది. సంభాషణ ఇలా నడుస్తుంది.

ఏమిటి సంగతులు ఏమైనా కొత్త విషయాలు ఉన్నాయా!’

మా దగ్గర వార్తలు ఏముంటాయి? మీరిస్తేనే కదా మాకు వార్తలు’

అలా అంటావు కానీ మీరు రాసేవే మాకు వార్తలు. మొన్న చెప్పాను కదా! ఆయన ఆ పెద్దాయన్ని కలిశాడు అంటున్నారు. నీకేమైనా తెలుసా?’

తెలియదే. ఎప్పుడు?’

నేనూ విన్నదే! కనుక్కోని చెప్పు’

ఇక అక్కడినుంచి ఆ విలేకరి పని మొదలవుతుంది. ‘ఆయన’ అంటే ముఖ్యమంత్రి. మరి పెద్దాయన ఎవరు?

ఆయన’ డ్రైవర్ నెంబరుకు ఫోను చేశాడు. వీ ఐ పీ రాకపోకలు కనుక్కోవాలంటే పోలీసులు, డ్రైవర్లను మించి విలేకరులకు మంచి సోర్సు దొరకదు.

డ్రైవర్ దొరికాడు కానీ కావాల్సిన సమాచారం రాలేదు. కాకపొతే ఓ విషయం చెప్పాడు. ఆ రోజు ‘ఆయన’ అధికారిక వాహనం కాకుండా వేరే కారులో వెళ్ళిన మాట ధృవీకరించాడు. వెంట ఎవరు వెళ్లిందీ చెప్పాడు. ఆ వెంట వెళ్ళిన వాళ్ళను పట్టుకుంటే ‘ఆ పెద్దాయన’ ఎవరో తెలిసింది.

ఇవన్నీ జరిగిన సంగతులు. తర్వాత కావాల్సిన విధంగా మసాలాలు దట్టించి వార్తను వండి వార్చడమే.

అధిష్టానంపై తిరుగుబాటుకు పావులు కదుపుతున్న ముఖ్యమంత్రి!’

కేంద్రంలో చక్రం తిప్పుతున్న ఓ సీనియర్ మంత్రిని రహస్యంగా కలుసుకుని చర్చలు జరిపిన ముఖ్యమంత్రి’

ఇది హెడ్డింగు. అసలు వార్త అనేక సోయగాలు అద్దుకుని అక్షరాల రూపంలో మర్నాడు పత్రికలో మొదటి పేజీలో దర్శనం ఇస్తుంది.

దానితో పాటే ముఖ్యమంత్రి కార్యాలయం జారీ చేసిన ‘ఖండన’ ప్రకటన కూడా ఆ పత్రిక కార్యాలయానికి చేరుతుంది.

ఇతి వార్తాః

 

31, మార్చి 2022, గురువారం

ఐ.ఏ.ఎస్. అధికారులకు జైలు శిక్ష

 వార్త: ఐ.ఏ.ఎస్. అధికారులకు జైలు శిక్ష

వ్యాఖ్య: ఎప్పుడో అయిదేళ్ళ క్రితం TIMES OF INDIA పత్రికలో వచ్చిన వ్యాసానికి నా స్వేచ్చానువాదం
నిజాయితీకి ఇచ్చే నజరానా ఇదా? – పార్ధ సేన్ శర్మ ఐ.ఏ.ఎస్.
(ఒక ఐ.ఏ.ఎస్.అధికారి అంతరంగ ఆవిష్కరణ)
అతనొక నిఖార్సయిన అధికారి. ప్రభుత్వంలో కార్యదర్శి హోదా కలిగిన సీనియర్ అధికారి. అయితే మాత్రమేం ఒక ట్రయల్ కోర్టులో ముద్దాయిగా నిలబడక తప్పలేదు. తప్పు లేదు, చట్టం ముందు అందరూ సమానులే. కానీ ఇతడి విషయం వేరు. కోర్టులో నిలబడి న్యాయమూర్తిని ఏమి కోరాడో తెలుసా? “కోర్టు ఖర్చులు భరించగల స్థోమత లేదు, నన్ను జైలుకు పంపించండి’ అని.
అయితే ఏ దశలోనూ ఆ అధికారి మీద నేరం రుజువు కాలేదు. అంటే ఏమిటి అర్ధం? యావత్ దేశం తలవంచుకోవాల్సిన సందర్భం. అలా జరిగిందా. లేదు. ఎందుకంటే మనది మహాత్ములు పుట్టిన పుణ్యభూమి. సీనియర్ అధికారులు, మీదు మించి సమర్ధులు, నిజాయితీపరులు ఇలా కోర్టు గుమ్మాలు ఎక్కాల్సిన స్తితి దాపురించడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధానమైనది ఒక చట్టం. దానిపేరు అవినీతి నిరోధక చట్టం, 1988. ఎంతో సమున్నత లక్ష్యం కలిగిన ఈ చట్టాన్ని లోతుగా పరిశీలిస్తే అందులో దాగున్న ‘విషపు కోరలు’ కానవస్తాయి. మరీ ముఖ్యంగా ఈ చట్టంలోని 13 వ సెక్షన్. ఒక అధికారి తీసుకునే నిర్ణయం వల్ల ఎవరయినా లబ్ది పొందితే ఆ అధికారి కూడా నేరంలో భాగస్వామి అవుతాడని ఈ సెక్షన్ నిర్దేశిస్తోంది. ప్రభుత్వం అంటేనే పనులు చేసిపెట్టడం. ఎవరికీ ఎలాంటి ప్రయోజనం కలగని పనులంటూ వుండవు. ఉదాహరణకు ఒక ఋణం మంజూరు చేసినా, భూమిని కేటాయించినా, ఒక కాంట్రాక్టు ఇచ్చినా, కొనుగోలు ఒప్పందం చేసుకున్నా ఎవరో ఒకరు ఖచ్చితంగా లబ్ది పొందడం ఖాయం. అలా జరగకుండా పనులు చేయాలంటే అసలు పనులనేవే జరగవు. పాలన స్థభించి పోతుంది. ఇటువంటి సందర్భాలలో ఒక పదం వాడుతుంటారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని. మరి ఇలా తీసుకునే ఈ నిర్ణయాలన్నీ ప్రజా ప్రయోజనాలకోసమేనా అంటే అదొక సమాధానం రాని ప్రశ్న. అంతకంటే జవాబు లేని ప్రశ్న అంటే సముచితంగా ఉంటుందేమో! యావత్ దేశం అభివృద్ధి దిశగా పయనిస్తున్న తరుణం. రాజకీయ వైరుధ్యాలు, నా మాటే చెల్లుబడి కావాలనే తత్వాలు, మీడియా పరిశోధనలు, నైతికపరమైన సంశోధనలు, న్యాయపరమైన అంశాలు ఈ దారిలో ఎదురై ఒక రకమైన అపనమ్మక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. దానితో అధికారులు తీసుకునే ప్రతి నిర్ణయం పరీక్షకు గురవుతోంది. ఆ నిర్ణయం వెనుక ఉద్దేశ్యాలను ఆపాదించడం జరుగుతోంది.
క్రికెట్ మైదానంలో నిలబడ్డ బాట్స్ మన్ ప్రతి బంతినీ సిక్స్ గా ఎందుకు మలచడం లేదు అని గేలరీలనుంచి చూస్తూ ప్రశ్నించడం తేలికే. అదే ఇరవై రెండు గజాల దూరంలో బ్రెట్ లీ బంతిని విసురుతున్నప్పుడు అది ఎంతకష్టమైన కార్యమో అర్ధం అవుతుంది. ఇప్పుడు దేశంలోని సివిల్ సర్వీసు అధికారులు కోరుతున్నది ఒక్కటే. వారు తీసుకునే నిర్ణయం వల్ల అయాచిత ప్రయోజనం ఎవరికయినా కలిగిందని సందేహం కలిగినప్పుడు, అతడిమీద క్రిమినల్ కేసు పెట్టడానికి ముందు, ఆ నిర్ణయం కారణంగా ఆ అధికారికి వ్యక్తిగత ప్రయోజనం లభించిందని రుజువు చేయాలి. యిందుకు అనుగుణంగా అవినీతి నిరోధక చట్టాన్ని సవరించాలి. సమర్దుడయిన, నిజాయితీ పరుడయిన అధికారి ఎవరయినా సరే తన విధులను, కర్తవ్యాలను నిర్భయంగా నిర్వహించాలంటే చట్ట సవరణ ఒక్కటే మార్గం. నిబద్దతతో వ్యవహరించే అధికారులు అనవసరమైన వేధింపులకు గురికాకుండా చూడాలంటే ఇది తప్పనిసరి. రాజ్యసభ సెలెక్ట్ కమిటీ ఇప్పటికే ఇందుకు సంబంధించి ఒక నివేదికను రూపొందించి సభకు సమర్పించింది కూడా. సెక్షన్ పదమూడును మార్చాలని ఈ కమిటీ సూచించింది. 2013లోనే ఈ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కానీ ఇంతవరకు దానికి మోక్షం సిద్దించలేదు. సివిల్ సర్వీసుకు ఎన్నికయిన యువ అధికారులకు సీనియర్ అధికారులు ఒక సలహా ఇస్తుంటారు, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోమనీ, ప్రజల ప్రయోజనాలకోసం తీసుకునే ఏ నిర్ణయమైనా మంచి నిజాయితీ కలిగిన అధికారులకు ఎలాంటి హాని చేయదనీ, వారి నిబద్దతే వారిని కాపాడుతుందని. వాస్తవంగా అలా జరుగుతోందా అంటే అనుమానమే. ఇంకొక విచిత్రం ఏమిటంటే, ఇలా నిర్ణయాలు తీసుకుని చిక్కుల్లో పడ్డ అధికారులలో ఎక్కువమంది మంచి నిజాయితీపరులు వుండడం.
(COURTESY: TIMES OF INDIA)

NOTE: మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్.వీ. సుబ్రహ్మణ్యం ఇప్పుడే తెలియచేసారు. ఈ పోస్టులో నేను ఉటంకించిన చట్ట సవరణ జరిగిందని. అయిదేళ్ళ నాటి పోస్టు ఇది. అంచేత సమాచార లోపం. క్షంతవ్యుడిని.
(25-02-2017)

30, మార్చి 2022, బుధవారం

ఇడ్లీల గొప్పతనం ఇంతింత కాదయా!

ఈరోజు ఇడ్లీల దినోత్సవం అంటున్నారు. కాబట్టి ఒక కధ చెప్పుకుందాం.

భారత దేశానికి అప్పటికి ఇంకా స్వాతంత్రం రాలేదు.

ఆ రోజుల్లో ఒక అయ్యరు గారు మద్రాసు నుంచి కలకత్తాకు హౌరా మెయిల్లో వెడుతున్నారు. అదే బోగీలో ఓ ఆంగ్లేయుడు కూడా ప్రయాణం చేస్తున్నారు. తెల్లారేసరికి రైలు బెజవాడ స్టేషన్ చేరుకుంది. ఉన్నత తరగతిలో ప్రయాణించే వారికి రైల్వే వారు స్పెన్సర్ బ్రేక్ ఫాస్ట్ ఉచితంగా అందించేవారు. ఆ బ్రిటిషర్ దాంతో కడుపు నింపుకున్నారు. అయ్యరు గారు మాత్రం ఇంటి నుంచి తెచ్చుకున్న నాలుగు గిన్నెల టిఫిన్ క్యారియర్ విప్పి అందులో ఒక గిన్నెలోని రెండు ఇడ్లీలు తీసి తినడం ఆ ఆంగ్లేయుడు గమనించాడు. తెల్లగా, గుండ్రంగా ఉన్న ఆ పదార్ధం ఏమిటో తెలుసుకోవాలనే ఉత్సుకత ఆయనలో మొదలయింది. అయితే అడగడం మర్యాదగా ఉండదని మిన్నకుండిపోయాడు.

మధ్యాన్నానికల్లా రైలు వాల్తేరు చేరుకుంది. రైల్వే వాళ్ళు ఆంగ్లేయుడికి చక్కటి, రుచికరమైన భోజనం అందించారు. అయ్యరు గారు రైల్వే భోజనాన్ని మృదువుగా తిరస్కరించి తన క్యారియర్ తెరిచి రెండో గిన్నెలో వున్న మరో రెండు ఇడ్లీలు కమ్మగా తినడం ఆ బ్రిటిష్ వ్యక్తి గమనిస్తూనే వున్నాడు. యెంత ఆలోచించినా తోటి ప్రయాణీకుడు తింటున్నవేమిటి అనేది ఆయనకు అర్ధం కాలేదు. దాంతో ఆయన ఉత్కంఠ మరింత పెరిగింది.

రైలు బెర్హంపూరులో ఆగింది. మళ్ళీ అదే సీను.

బ్రిటిషర్ ఇక తట్టుకోలేక నేరుగా అడిగేశాడు.

అయ్యా! ఇలా అడగడం మర్యాద కాదని తెలిసీ అడుగుతున్నాను. మీరు తింటున్న ఆ తెల్లటి పదార్ధాలను నేను ఎప్పుడూ చూడలేదు. అవేమిటో తెలుసుకోవాలని నాకు ఆసక్తిగా వుంది”

అయ్యరు ఇలా జవాబిచ్చారు.

ఇవి ఐ.క్యు. టాబిలెట్స్. అర్ధం మీకు తెలుసుగా. మేధస్సు పెంచడానికి వీలైన పోషకాలు వీటిలో వున్నాయి. వీటిని తిని, భోజనం గట్రా ఏమీ లేకుండా మేము రోజులతరబడి వుండగలం”

వీటిని ఎలా తయారు చేస్తారు” బ్రిటిషర్ ఆరా.

అయ్యరు గారు ఇడ్లీలు తయారు చేయడానికి కావాల్సిన సంభారాలు గురించీ, తయారు చేసే విధానం గురించీ వివరంగా చెప్పారు.

మంచి సంగతులు మీనుంచి తెలుసుకున్నాను. మీకు అభ్యంతరం లేకపోతె నాకూ ఓ రెండు టాబ్ లెట్లు ఇవ్వగలరా! వూరికే కాదు, మీరు చెప్పిన మొత్తాన్ని నేను చెల్లించుకుంటాను” అని ఆంగ్లేయుడు అభ్యర్ధించాడు.

అయ్యరు ఒక క్షణం ఆలోచించి చెప్పాడు.

నా దగ్గర ఇంకా మూడే మిగిలాయి. కలకత్తాలో నేను మా చుట్టాల ఇంటికి వెడుతున్నాను, కనుక నాకు ఇబ్బంది లేదు. మీరే చెప్పారు కాబట్టి ఇడ్లీకి ఓ ఇరవై రూపాయల చొప్పున ఇవ్వండి చాలు”

బ్రిటిషర్ యెగిరి గంతేసినంత పనిచేసి అరవై రూపాయలు అయ్యరుకు ఇచ్చి మూడు ఇడ్లీలు తీసుకుని తిన్నాడు.

మర్నాడు ఉదయానికల్లా హౌరా స్టేషన్ వచ్చింది.

రైలు దిగి ఎవరి దారిన వారు విడిపోయే సమయంలో బ్రిటిషర్ అడిగాడు. “ఈ టాబ్ లెట్లు తయారు చేసే విధానం చెప్పారు. అంతా చెప్పారా! ఏమైనా మరచిపోయారా!”

చెప్పేందుకు ఏమీ లేదు, అంతా వివరంగా చెప్పాను”

మరి ఈ టాబ్ లెట్ల ఖరీదు అంత వుండకూడదే”

చెప్పాను కదా ఇవి మేధస్సును వికసింప చేసే ఐ.క్యు. ట్యాబ్ లెట్లని. మీరు మూడే తిన్నారు. రాత్రికి ఇప్పటికీ మీలో యెంత తేడా వచ్చిందో చూడండి. అంటే అవి పనిచేయడం మొదలయిందన్న మాట” అని అంటూ అయ్యరు తన హోల్డాలు, టిఫిన్ క్యారియర్ చేతబుచ్చుకుని చక్కాపోయాడు.


(Courtesy Image Owner)


(ఒక ఇంగ్లీష్ కధనానికి స్వేచ్చానువాదం)

 


29, మార్చి 2022, మంగళవారం

చంద్రబాబు నాయుడు – నేను.

 

చాలాకాలంగా కలవని వాళ్ళు తటస్థపడి పలకరించినప్పుడు కలిగే ఉత్సాహం తీరే వేరు.
మొన్నటికి మొన్న ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో పెద్దలు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు కలిసారు. వారిని కలవక దాదాపు పదిహేను సంవత్సరాలు పైనే అవుతోంది. ఇన్నేళ్ళ తర్వాత కూడా ఆయన నన్ను గుర్తుపట్టి ఆత్మీయంగా పలకరించడమే ఒక గొప్ప అనుభవం. ఎప్పటివో నా రేడియో జీవితం నాటి కబుర్లు గుర్తు చేయడం ఇంకా గొప్ప విషయం.
మళ్ళీ నిన్న సాయంత్రం హోటల్ దసపల్లాలో మిత్రుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రాసిన, నేను- తెలుగుదేశం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్లాను. దత్తాత్రేయ గారితో కలిసి అప్పుడే సభామందిరంలోకి ప్రవేశిస్తున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెనక వరసలో కూర్చొన్న నన్ను చూసి, ఆగి పలకరించారు.
‘ఎలా వున్నారు, ఆరోగ్యం బాగుంది కదా! కరోనా ఏమీ ఇబ్బంది పెట్టలేదు కదా!’ అంటూ భుజం మీద చేయి వేసి ఆత్మీయంగా మాట్లాడారు. చివర్లో ఒక మాట అన్నారు, అయాం వాచింగ్ యు అని. ఎందుకలా అన్నారని ఆలోచించుకోవడం నావంతయిది.
నేను చంద్రబాబుగారిని ఆఖరు సారి కలిసింది 2013, ఆగస్టు 20వ తేదీన. ఇంత ఖచ్చితంగా ఎలా గుర్తుంది అంటే దానికి ఒక కారణం వుంది.
ఆరోజు సాయంత్రం ఒక టీవీ ఛానల్ నుంచి తిరిగి వస్తుంటే ఫోను.
చిరపరిచితమైన నెంబరు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నుంచి ఆ ఫోను. అయిదేళ్ళ క్రితం వరకు ఆ నంబరు నుంచి రోజూ అనేక ఫోన్లు వచ్చేవి. అప్పుడు నేను దూరదర్శన్/ ఆకాశవాణిలో విలేకరిగా పనిచేస్తున్నాను.
‘ఎడ్వైజర్ కృష్ణయ్య గారు మాట్లాడుతారు’ ఆపరేటర్ పలకరింపు.
టీటీడీ ఈవోగా, సీనియర్ ఐఏఎస్ అధికారిగా జర్నలిస్టులందరికీ కృష్ణయ్య గారు చిరపరిచితులు. ఉన్నత ఉద్యోగం వొదులుకుని రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
‘రేపు నాలుగు గంటలకు బాబుగారు మీడియా విశ్లేషకులు కొందరితో ఇష్టాగోష్టిగా ముచ్చటించాలని అనుకుంటున్నారు. మీరు కూడా వస్తే బాగుంటుంది’.
కాస్త ఆశ్చర్యం అనిపించింది ఈ పిలుపు.
2005లో దూరదర్సన్ లో పదవీ విరమణ చేసినప్పటి నుంచి మళ్ళీ ఏనాడు ఏ పార్టీ గుమ్మం ఎక్కలేదు.
అయితే ఈ ఆహ్వానం కాదనడానికి కూడా కారణం కనిపించలేదు. ఎందుకంటే అది విలేకరుల సమావేశం కాదు. పార్టీ ఆఫీసులో కూడా కాదు. చంద్రబాబునాయుడి గారి ఇంట్లో.
ఇంతకీ ఆయన ఏం అడుగుతారు ? ఏం చెప్పాలి ?
ఇప్పటికే మీడియా విశ్లేషకుల మీద సోషల్ మీడియాలో అనేక రకాల వ్యాఖ్యలు వెలువడుతున్నాయి, వీళ్ళు విశ్లేషకుల రూపంలో, చక్రాంకితాలు బయటకు కనబడకుండా టీవీ చర్చల్లో పాల్గొనే వివిధ పార్టీల అనధికార ప్రతినిధులంటూ.
ఏదిఏమైనా, చంద్రబాబు గారిని ఎన్నో ఏళ్ళ తరువాత కలుసుకోబోతున్నాను.
షరా మామూలుగా ఆయనే చెబుతారా లేక ఎవరైనా చెప్పింది వింటారా ? అనుకుంటూనే వెళ్లాను.
జూబిలీ హిల్స్ లో చంద్రబాబు నివాసం. పాతికేళ్ళకు పైగా చిరపరిచితమైన ప్రదేశం. మాజీ ముఖ్యమంత్రి అయినా, జెడ్ కేటగిరి భద్రత కలిగిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కావడం మూలాన సెక్యూరిటీ హడావిడి ఎప్పటి మాదిరిగానే వుంది.
రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్న దరిమిలా తెలంగాణా ఏర్పాటు తధ్యం అనుకుంటున్న నేపధ్యంలో ఏర్పాటయింది ఈ సమావేశం.
టీవీల్లో తరచూ కానవచ్చే విశ్లేషకులు, నాగేశ్వర్, ఘంటా చక్రపాణి, సి. నరసింహారావు, జ్వాలా నరసింహారావు, తెలకపల్లి రవి, ఎల్. రామానాయుడు ఇత్యాదయః అందరం ఆసీనులమైన అనంతరం చంద్రబాబుగారు వచ్చి కూర్చుని, పేరుపేరునా అందర్నీ పలకరిస్తూ వారి అభిప్రాయాలను స్వీకరించే పనిలో పడ్డారు. దాదాపు గంటకు పైగా సాగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబుగారు మాట్లాడింది తక్కువ, విన్నది ఎక్కువ.
మొత్తం మీద పెద్ద విశేషంగా నాకనిపించింది ఇదొక్కటే.
పొతే,
హైదరాబాదు జర్నలిష్టుల్లో చాలామందికి కళ్ళ ముందు పుట్టి పెరిగిన పార్టీ తెలుగుదేశం. ఆ పార్టీ నలభయ్ వసంతాల ఉత్సవం జరుపుకుంటున్న సందర్భంలో పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు
(29-03-2022)

28, మార్చి 2022, సోమవారం

లోనారసి

(నమస్తే తెలంగాణా పత్రికలో ప్రచురితం)

ఒక పక్క యాదాద్రి అంటూ ఇదేమి తెలుగు అనుకుంటున్నారా! లేదు. ఇది అచ్చ తెలుగు పదం. దీని సంగతి తర్వాత చెప్పుకుందాం.
ఈరోజు నాకు తెలిసి తెలంగాణలో అన్ని లోగిళ్ళలో అందరి కళ్ళు టీవీల్లో చూపిస్తున్న యాదాద్రి వైభవం చుట్టూనే అల్లుకు పోయి వున్నాయని చెబితే అతిశయోక్తి కాదు.
తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గారు యాదగిరి గుట్ట దేవాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం స్థాయిలో పునర్నిర్మించడానికి ఏ ముహూర్తం లో నిర్ణయించారో కానీ, ఆ సుమూహర్తం ఈనాటికి నిజమైంది. గతంలో ఆ గుడినీ, ఆ పరిసరాలను చూసిన వారు ఇప్పుడు కనిపిస్తున్న బ్రహ్మాండమైన కట్టడాలను, శిల్పాలను చూసి ఆశ్చర్యచకితులు కాక మానరు.
వేల కోట్ల ధనం, వందలాదిమంది శిల్పులు, అహరహం ప్రత్యక్ష పర్యవేక్షణలో తలమునకలయిన వందలాది అధికారులు, సిబ్బంది శ్రమ ఫలితం ఈనాడు మనం అక్కడ సుందర అద్భుత నిర్మాణాల రూపంలో చూస్తున్నాం. ఇదంతా కేవలం ఆరేళ్ల కాలంలో జరిగింది అంటే నమ్మశక్యం కాని సంగతి.
ఇందుకు కర్తా, కర్మా, క్రియా యావత్తు ముఖ్యమంత్రి కేసీఆరే. అనుమానం లేదు. ఆయన సంకల్ప బలం ఫలితమే ఈనాటి మహాకుంభ సంప్రోక్షణ క్రతువు.
ఆలయ పునర్నిర్మాణంలో సహకరించిన, కృషి చేసిన స్థపతులను, ఇతరులను ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు సముచిత రీతిన సత్కరించారు.
ఈ కార్యక్రమాన్ని టీవీలో లోనారసిగా వీక్షిస్తే (లోనారసి అనే పదాన్ని లోతుగా (లోతులకు వెళ్లి పరీక్షగా చూడడం) అనే అర్ధంలో వాడతారు) అప్పుడు కనబడ్డారు, ఓ పక్కగా అంతవరకూ కనబడని జి. కిషన్ రావు గారు. ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉన్న యాదాద్రి టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ ఆయన. ఈ బృహత్ కార్యానికి ముఖ్యమంత్రి సర్వస్వం అయితే, కిషన్ రావు మాత్రం నేపధ్యంలోనే ఉంటూ, ముఖ్యమంత్రి మనసులో యేమని అనుకుంటున్నారో అచ్చం ఆవిధంగానే ఆచరణలో చేసి చూపించారు. దండలో దారంలాగా ఈ పునర్నిర్మాణ క్రతువులో ఆయన నిర్వహించిన పాత్ర చిన్నదేమీ కాదు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు శాలువా కప్పి తగిన రీతిన సత్కరించారు.
ముఖ్యమంత్రి పర్యటనకు వస్తే ఆయనకు సమీపంలో వుండాలని, ఫోటోల్లో పడాలని, టీవీల్లో కనబడాలని చోటా మోటా నాయకులు, చిన్నా పెద్దా అధికారులు తెగ తాపత్రయపడడం కొత్తేమీ కాదు. అయితే ఈనాడు జరిగిన యావత్ కార్యక్రమంలో కిషన్ రావు అలా ఎక్కడా కనబడలేదు. ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంటే ఈయన ఎక్కడికి పోయారు అని సందేహించిన వాళ్ళు వున్నారు. కానీ ఆయన తత్వం తెలిసిన వారికి ఇదేమీ ఆశ్చర్యం అనిపించదు. ఎందుకంటే ఆయన ప్రచారాలకు దూరం. అప్పగించిన కర్తవ్యమ్ తప్పిస్తే ఆయనకు ఏదీ పట్టదు.
కిషన్ రావు గారిని తెలియని జర్నలిష్టు ఉండడేమో. ఎందుకంటే ఆయన చేసిన ఉద్యోగాలు అలాంటివి. పార్టీలతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రులు అందరూ ఆయన సేవలను అడిగి మరీ ఉపయోగించుకున్నారు. ఆనాటి ఎన్టీఆర్ దగ్గర నుంచి ఈనాటి కేసీఆర్ వరకు ఇదే వరస. వయసు ఎనభయ్ దాటినా ఆయనలో ఆయనకు అలసట అనేది లేదు. పని లేకపోతె జ్వరం వచ్చినట్టు వుంటుంది అనే సీనియర్ ఐఏఎస్ అధికారి కిషన్ రావు గారు తన పెన్షన్ డబ్బులు తప్ప, రిటైర్ అయిన తర్వాత చేసిన, చేస్తున్న ఏ ఉద్యోగానికి జీతం తీసుకోరు.
కొత్తగా నిర్మించిన యాదాద్రి ఆలయం ఆ నారసింహుడు కిషన్ రావు గారికి ఇచ్చిన జీవన సాఫల్య పురస్కారం.
ఒకప్పుడు శిల్పారామం అంటే గుర్తుకు వచ్చే కిషన్ రావు గారి పేరు, యాదాద్రి వెళ్ళినప్పుడల్లా స్పురణకు రావడం ఖాయం.







(28-03-2022)