యాభయ్ ఏళ్ళ క్రితం ప్రతి ఉద్యోగానికి ఎంప్లాయ్ మెంటు ఆఫీసు నుంచి నెంబరు అడిగేవాళ్ళు. హైదరాబాదు ఆర్టీసీ క్రాస్ రోడ్డులో వుంది ఆ ఆఫీసు. అక్కడి సిబ్బంది నిరుద్యోగులను కొంత చులకనగా చూసేవాళ్ళు. అక్కడికి వెళ్ళిన మా బంధువును కూడా హీనంగా చూసారని చెప్పడంతో నేను పై వారికి చెప్పాను. వాళ్ళు అతడికి ఎంప్లాయ్ మెంట్ ఆఫీసులోనే ఉద్యోగం ఇచ్చారు. కొన్ని నెలలు గడిచిన తరువాత అతడి వైఖరిలో మార్పు మొదలయింది. నిరుద్యోగులను చిన్నబుచ్చి కసురుకోవడం చూసి ఆశ్చర్యపోయాను. గతంలో అతడూ ఇటువంటి తిరస్కారాలకు గురైన వాడే, అదేమిటో కుర్చీలో కూర్చోగానే మారిపోయాడు.
21, జనవరి 2022, శుక్రవారం
20, జనవరి 2022, గురువారం
ఇచ్చుటలో వున్న హాయీ! – భండారు శ్రీనివాసరావు
పాండవాగ్రజుడయిన యుధిష్ఠిరుడు ఓ రోజు జూదమాడుతూ ఆనందిస్తున్న వేళ ఓ భిక్షకుడు వచ్చి ధర్మం చేయమని కోరాడు. ధర్మరాజు జూదం ధ్యాసలో వుండి ‘చేయి ఖాళీ లేదు మర్నాడు రమ్మన్నాడ’ట. ఆ పక్కనే కూర్చుని తన గదకు మెరుగులు దిద్దుకుంటున్న భీముడు, అన్నయ్య ధర్మజుడు నుడివిన మాటవిని ఎంతో సంతోషించాడట. ఎందుకటా!
19, జనవరి 2022, బుధవారం
యూనియన్ – భండారు శ్రీనివాసరావు
చదువుకుండే రోజుల్లో మొదటిసారి ఈ మాట విన్నాను. యూనియన్ అంటే స్టూడెంట్స్ యూనియన్ అనుకునేరు.
ఆంధ్రపత్రికలో
కాబోలు ఓ వార్త వచ్చింది. ఎల్.ఐ.సీ. (జీవిత బీమా సంస్థ)లో కంప్యూటర్లు
ప్రవేశపెట్టాలనే యాజమాన్యం ప్రతిపాదన, యూనియన్ల వ్యతిరేకత కారణంగా బుట్ట దాఖలు
అయిందని. అప్పటికి కంప్యూటర్ అనే పదమే తెలుగు నిఘంటువులో చేరినట్టు లేదు. ఎవరో
కాని ఆ దార్శనికుడు, ఆ కాలంలోనే కంప్యూటర్
గురించి ఆలోచించాడు అన్నమాట. ఇనుప బీరువాల
కన్నా పెద్ద సైజులో ఉంటాయని చెప్పుకునే వారు. కంప్యూటర్లు వస్తే పదిమంది పని అది
ఒక్కటే చేస్తుందని, అంచేత
తమ ఉద్యోగాలకు ముప్పు అని సిబ్బంది భయం. అప్పటికి కంప్యూటర్ అంటేనే తెలియదు కనుక
యూనియన్ల భయం ఏమిటన్నది కూడా జనాలకు పట్టలేదు.
తర్వాత
ఎప్పటికో దశాబ్దం తర్వాత, మొదటి ఉద్యోగం ఆంధ్రజ్యోతిలో చేరిన తర్వాత బీమా ఏజెంటు
మాధవరావు గారి పుణ్యమా అని నేనో ఎండోమెంటు
పాలసీ తీసుకున్నాను. పదేళ్లకో, పదిహేనేళ్లకో మెచూర్
అయ్యే పాలసీ. ఆ పాలసీ డబ్బులు
తీసుకోవడానికి నేను పడ్డ ఇబ్బందులు ఒకటీ
రెండూ కాదు. పైగా డివిజినల్ మేనేజర్ల స్థాయి అధికారులతో మంచి పరిచయాలు వుండి కూడా
నానా తిప్పలు పడాల్సి వచ్చింది. ఏ కాగితము ఒక పట్టాన దొరికేది కాదు. వెతికి పెట్టి
కబురు చేస్తాం అని పంపించేవాళ్లు.
ఎవరు పాలసీ
తీసుకున్నా చిన్న వయసులో తీసుకుంటారు. ఎప్పుడో
నలభయ్ యాభయ్ ఏళ్ళ తర్వాత పాలసీ డబ్బులు రావాలి. అప్పటిదాకా ఆ పత్రాలు
పదిలంగా వుంచుకోవాలి. ఈ ప్రయాస లేకుండా ఆయనెవరో కంప్యూటర్లు అంటే ఆ ఆలోచన
పడనివ్వలేదు. కాలక్రమంలో ఏం జరిగింది? ఇప్పుడు ఆ సంస్థలో అన్నీ
కంప్యూటర్లే. చకచకా పనులు జరిగిపోతున్నాయి.
అది ఏ
సంస్థ అయినా దాని వినియోగదారులు తమకు దొరికే సేవలు గురించి
ఆలోచిస్తారు. అక్కడ పనిచేసే ఉద్యోగులు సంస్థతో పాటు తమ గురించి కూడా అలోచిస్తుంటారు. సహజం
కూడా.
ఒకప్పుడు
హైదరాబాదు నుంచి రైల్లో వైజాగు పోవాలంటే రిజర్వేషన్ నేరుగా చేయించుకోవడానికి
వీలుండేది కాదు. చార్టులో పేరు రాకపోతే
ఇంతే సంగతులు. కంప్యూటర్ల ప్రవేశంతో ఇప్పుడు దేశంలో ఎక్కడినుంచి ఎక్కడికైనా
టిక్కెట్టు కొనుక్కోవచ్చు. ఇలాగే ఎన్నో రంగాల్లో కంప్యూటర్లు మనిషి జీవనంలో వున్న
సంక్లిష్టతలను బాగా తగ్గించివేసాయి.
అయితే, ఒకానొక కాలంలో వీటికి ఉద్యోగ సంఘాల నుంచి గట్టి
వ్యతిరేకత ఎదురయిన సంగతి బహుశా ఈ కాలపు సంఘాలవారికే తెలియకపోవచ్చు.
నేను
పుష్కరం క్రితం యాక్టివ్ జర్నలిజం నుంచి బయట పడ్డాను కాబట్టి బ్యాంకుల్లో ఇప్పటి పరిస్థితి పట్ల అవగాహన
లేదు.
ఓ పాతిక
ముప్పయి ఏళ్ళ క్రితం ప్రభుత్వరంగ
బ్యాంకుల్లో యూనియన్లదే రాజ్యం.
రేడియో
విలేకరిగా నాకు అనేక బ్యాంకుల యూనియన్ నాయకులతో సన్నిహిత పరిచయం వుండేది. అలాగే
బ్యాంకు యాజమాన్యాలతో కూడా. అంటే అత్యున్నత స్థాయి అధికారులు అన్నమాట.
ఈ నేపధ్యంలో మా కుటుంబానికి బాగా దగ్గరైన వారి నుంచి ఆర్డర్
లాంటి అభ్యర్ధన వచ్చింది. వాళ్ళ అబ్బాయికి కొత్తగా పెళ్లయింది. అతడికి హైదరాబాదు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదులో ఉద్యోగం. అతడ్ని చేసుకున్న అమ్మాయికి కూడా అదే
బ్యాంకులో ఉద్యోగం. కాకపోతే ఎక్కడో సుదూర గ్రామీణ ప్రాంతంలో. ఆ అమ్మాయిని కూడా
హైదరాబాదుకు బదిలీ చేయించాలి. అదీ నా మీద పడ్డ భారం.
ఒకరోజు
గన్ ఫౌండ్రీ లోని బ్యాంకు హెడ్ ఆఫీసుకు
వెళ్లి మేనేజింగ్ డైరెక్టర్ ని కలిసాను. కాఫీ
బిస్కెట్లు తెప్పించి మర్యాద చేస్తున్న ఆ పెద్దాఫీసరు, నా అభ్యర్ధన సంగతి తెలపగానే కొంచెం అనీజీగా ఫీలయ్యారు. నన్ను
వెంటబెట్టుకుని వెళ్ళిన బ్యాంకు పీఆర్వో
నన్ను బయటకు తీసుకువచ్చి, ఎండీకి చెప్పారు కదా! ఏదో విధంగా పని జరుగుతుంది
లెండి అని హామీ ఇచ్చాడు. ఇస్తూనే ఒక సలహా
చెప్పాడు. బ్యాంకుకు రోడ్డు అవతలే యూనియన్ ఆఫీసు వుంది. ఎందుకైనా మంచిది, ఇక్కడి దాకా వచ్చారు కదా, వారి
చెవిలో కూడా ఒక మాట వెయ్యండని కర్ణుడి
జన్మ రహస్యం నా చెవిలో ఊదాడు.
యూనియన్
నాయకులతో నాకు మంచి పరిచయం వుంది కానీ అసలు తాళం చెవి వారిదగ్గర వుందని అప్పటిదాకా
నాకు తెలవదు. వెళ్లి కలిస్తే, వాళ్ళు అయ్యో ఇదెంత పని, ఇందుకోసం ఇక్కడి దాకా రావాలా అంటూ
ఏదో ఫైలు చూసి ఆ అమ్మాయి మెంబర్ షిప్ తీసుకున్నట్టు లేదు, ఆ మాట చెప్పండి ఆమెతో. వచ్చే
బదిలీల్లో తప్పకుండా అవుతుంది. ఆర్డర్ రాగానే ఫోన్ చేసి నేనే చెబుతాను అన్నాడు ఆ
నాయకుడు. అన్నట్టే ఆ బదిలీ జరిగింది. ఆమె సభ్యత్వం తీసుకున్నదో లేదో తెలియదు. పని
అయినందుకు నేను ఎవరికి కృతజ్ఞత చెప్పాలో తెలియలేదు. ఒక విషయం మాత్రం తెలిసింది.
బ్యాంకు ఉద్యోగుల బదిలీల్లో యూనియన్లదే చివరి మాట.
అలాగని
యూనియన్ల మీద నాకు చిన్న చూపేమీ లేదు. ఉదాహరణకు గ్రామీణ బ్యాంకుల్లో పనిచేసే
సిబ్బందికి పేరెంట్ బ్యాంకు సిబ్బంది, అధికార్లతో సమానంగా జీతాలు పెరగడానికి, పెన్షన్ సౌకర్యం ఏర్పడడానికి కారణం ఆ బ్యాంకుల యూనియన్లు దశాబ్దాల పాటు చేసిన న్యాయపోరాటం అని నాకు బాగా తెలుసు. వారి పేరెంటు బ్యాంకు స్టేట్
బ్యాంకులో పనిచేసే వారికన్నా ఎక్కువ పెన్షన్ వాళ్ళు పొందుతున్నారు అంటే నమ్మడం కష్టమే. ఇదంతా
యూనియన్ల చలవే.
(19-01-2022)
రచయితలు- సంపాదకులు (ఎవరి బాధలు వారివి)
రచయిత ఏం చేస్తాడు? మరీ చచ్చు ప్రశ్న. ఏంచేస్తాడు ? రాస్తాడు. రాసింది నలుగురు చదవాలని ఆశ పడుతూ రాస్తూ పోతుంటాడు. పత్రికలకి పంపిస్తాడు. వాళ్ళు వేస్తె వేస్తారు. లేకపోతే లేదు. వెయ్యకపోతే మరో పత్రిక్కి పంపిస్తాడు. వెనుకటి మాదిరిగా పోస్ట్ చేయడాలు, తిప్పి పంపడానికి తగినన్ని తపాలా బిళ్ళలు జతచేయడాలు వంటి బాదరబందీలు ఈనాడు లేవు. రాసేసి ఎంచక్కా ఒక్క క్లిక్కు నొక్కితే చాలు. కానీ ఇదొక్కటే చాలదు కదా! సంపాదకుడు చూడాలి, మెచ్చాలి. వెయ్యాలి. ఈలోపు సంపాదకులు మరో రిటర్న్ క్లిక్కు నొక్కి ‘వేస్తున్నాం వేయడం లేదు అని కాకపోయినా, మీ రచన అందింది’ అని కబురు ఏమన్నా చేస్తారా అంటే అదీ లేదు. మరి వారు సంపాదకులాయే. అంత త్వరగా నిర్ణయాలు తీసుకోవడం వారికి కుదరక పోవచ్చు. వ్యవధి, తీరుబాటు లేకపోవచ్చు.
మరి రచయిత సంగతి. అతగాడికి తన రచన ‘కాకిపిల్ల కాకికి ముద్దు’ సామెత మాదిరి.
అంచేత మరో పత్రిక్కి క్లిక్కు మనిపిస్తాడు. ఏదో జంధ్యాల సినిమాలో మూడును బట్టి
మార్కులు వేసే ధర్మవరపు సుబ్రహ్మణ్యం మేష్టారిలా ఆ రచన ఆ రెండో పత్రిక సంపాదకుడి
మూడును బట్టి నచ్చి కూర్చుంటుంది. అయన వేసేస్తాడు. ఈలోగా మొదటి ఎడిటర్ గారి మూడు
కూడా మారి ఆయనా తన పత్రికలో వేసేస్తాడు. రచయిత పని నక్కతోక తొక్కిన చందంగా
మారుతుంది. ఒక్క క్లిక్కుకు రెండు పక్షులు. సరే. ఈ పత్రిక
ఎడిటర్ ఆ పత్రిక చదవడు. చదివినా పైకి ఏమీ అనలేని పరిస్తితి. కాకపొతే ఇంకోసారి ఆ
రచయిత రచనలు ఆ పత్రికలో వెలుగుచూడక పోవచ్చు.
సరఫరా, గిరాకీ సిద్దాంతం
ప్రకారం ఇప్పటివరకు రచయితల మీద సంపాదకులదే పైచేయి. ఫేస్ బుక్ , బ్లాగర్ వంటి సాంఘిక
మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తరువాత వర్ధమాన రచయితలు చెలరేగిపోయి అద్భుతంగా
రాస్తున్నారు. ఇప్పటిదాకా పత్రికలకే పరిమితమై ఇంతో అంతో పేరు తెచ్చుకున్న రచయితలు
కూడా ఈ వైపే మళ్ళారు. అయితే ఈ మీడియంలో ఓ చిక్కు వుంది. స్వపర బేధాలు లేవు. పోస్ట్ అయిన ప్రతి రచన మీద,
అది ఎవరిదైనా, ఎవరికివారు సర్వస్వామ్యాలు తీసేసుకుంటున్నారు. ఒకరి రచనను మరొకరు
కాపీ కొట్టడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ‘కాపీ రైట్’ అంటే ‘కాపీ కొట్టే రైట్’
అనుకుంటున్నారు. పొద్దున్నే ఇంత పురాణ
కాలక్షేపం ఎందుకంటే: పాత సంగతులు
తిరగమోత పెడుతుంటే ఆరేళ్ల క్రితం 2016లో జరిగిన ఓ సంగతి గుర్తుకు వచ్చి.
శ్యాం రావు గారు అనే ప్రముఖ జర్నలిష్టు
కన్ను మూశారు. ఆయనతో సన్నిహిత పరిచయం వున్న మరో జర్నలిష్టు మిత్రుడు (ఆయన ఇంగ్లీష్
పేపర్లో పనిచేసే తెలుగు జర్నలిష్టు) శ్యాం రావుగారి గురించి చక్కటి ఆంగ్ల కధనం ఒకటి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడు. మరునాడో, ఆ మరునాడో తెలియదు కాని , అదే కధనానికి మక్కికి మక్కి
తెలుగు అనువాదం రెండు ప్రధాన దినపత్రికల్లో ఒకే రోజున వచ్చింది. ఆ వ్యాస రచయిత
కూడా సామాన్యుడు కాదు. విదేశాల్లో చాలా పేరొందిన సీనియర్ జర్నలిష్టు. ఫేస్ బుక్ లో రాసిన ఇంగ్లీష్ పేపరు జర్నలిష్టు తల్లి గారికి తెలుగు పత్రికలు చదవడం అలవాటు. ఆవిడ చదివి కొడుకుతో చెప్పింది. ఆయన పత్రికల వారిని సంప్రదిస్తే ఒక పత్రిక మాత్రం, ‘ఆ వ్యాస రచయితను నేను!’ అనే శీర్షిక పెట్టి
సవరణ కాని సవరణ రూపంలో ఒక వివరణ ఇచ్చింది. కింద ఫోటో అదే. రచయితలు – సంపాదకులు అని రాసి పక్కన బ్రాకెట్లో ‘ఎవరి బాధలు
వారివి’ అని ఎందుకు రాసానో అర్ధం అయిందనుకుంటాను.
18, జనవరి 2022, మంగళవారం
మాస్కోలో మా ఆవిడ విగ్రహం వేయాలనేది నటాషా
కొన్ని వింటున్నప్పుడు, మరి కొన్ని చూస్తున్నప్పుడు ఎప్పుడో విన్న, ఎన్నడో కన్న సంగతులు, విన్న వింతలు గుర్తుకు వస్తుంటాయి, మూగమనసులు సినిమాలాగా.
ఎన్నాళ్ళు ఇలా ఈ కలకలాలు
గూడూరు
ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం ఆరుగురు
డాక్టర్లకు పాజిటివ్
అంతరిక్ష
కేంద్రం సిబ్బందిలో తొంభయ్ రెండు మందికి కరోనా
విదేశాల
నుంచి వచ్చిన ఒక విమానంలో నూట పాతిక మందికి కరోనా
వరంగల్
ఎం.జి ఎం ఆసుపత్రిలో అరవై తొమ్మిది మంది సిబ్బందికి కరోనా పాజిటివ్
ఆ
మంత్రికి పాజిటివ్ ఈ కేంద్రమంత్రికి
పాజిటివ్
వారికి
కరోనా వీరికి కరోనా
అక్కడ
కరోనా ఇక్కడ కరోనా
గత
చాలా రోజులుగా ఇలాంటి వార్తలే. కరోనా పాజిటివ్ అయినా పది రోజుల్లోపే నెగిటివ్ అవుతుంది ఏవో కొన్ని అరుదయిన
సందర్భాలలో తప్పిస్తే
అలా
నెగిటివే అయిన సమాచారం కూడా ఇలాగే ప్రముఖంగా ఇస్తే జనంలో ఆందోళన, కంగారు తగ్గించినవాళ్ళు అవుతారు
కదా!
కొంచెం
ఆలోచించండి!
18-01-2022
చిక్కుల్లో ‘చింతామణి’ – భండారు శ్రీనివాసరావు
చింతామణి నాటకం చిక్కుల్లో పడడం కొత్తేమీ కాదు. దాదాపు పుష్కర కాలం క్రితమే కొన్ని కుల సంఘాల వారు ఈ నాటకాన్ని నిషేధించాలని ఆనాటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.
కాళ్ళకూరు నారాయణ రావు గారు
రెండు నాటకాలు రాసారు వొకటి ‘చింతామణి’ రెండోది ‘వర విక్రయం’.
ఇవి రాసి తొంభయ్ ఏళ్ళు అయిందేమో. ఇంకా వందేళ్ళు పూర్తి కాలేదు. ఆ రోజుల్లో జటిలంగా
వుండే రెండు సామాజిక సమస్యలను తీసుకుని ప్రజల్లో చైతన్యం రగిలించేందుకు వీటిని రాసారు. గురజాడ అప్పారావుగారి
కాలంలో ‘కన్యాశుల్కం’ వుంటే కాళ్ళకూరి వారి సమయంలో వరకట్నం సమస్య బాగా
ప్రబలివుంది. ‘వర విక్రయం’ ఎందుకో కాని, స్టేజి
మీద పాపులర్ కాలేదు. బెజవాడ రేడియోలో నండూరి సుబ్బారావు,
శ్రీరంగం గోపాలరత్నం, చిరంజీవిరావు
వాళ్ళు వేసారు. చాలాసార్లు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు వర విక్రయం
నాటకం ప్రసారం చేశారు. సింగరాజు
లింగరాజు మరిచిపోలేని లోభి క్యారెక్టర్ వేసేవారు. పొతే,
రెండో నాటకం ‘చింతామణి’ బాగా పాపులర్ అయింది. ‘కురుక్షేత్రం’,
‘రామాంజనేయ యుద్ధం’ వంటి నాటకాలు పోయినా, అడపా తడపా ఇంకా ఆడుతున్న నాటకం ‘చింతామణి’.
కథా వస్తువు చిన్నదే. చింతామణి ఓ
సంస్కారమున్న వేశ్య. చదువుకున్నది. విద్యా వంతులంటే వల్లమాలిన
అభిమానం. ఆ ఊళ్లోనే భవానీ శంకరుడనే జల్సా రాయుడు వుంటాడు. అతను తనకున్నదంతా
చింతామణికి సమర్పించుకొని జులాయిగా తిరుగుతూ ఉంటాడు. చింతామణి అమ్మ
శ్రీహరి. వాళ్ళ
ఇంటికి వచ్చే విటులందరికి శ్రీహరి అంటే భయం. ఏ రోజు ఎకౌంటు ఆ రోజే తేల్చివేసే రకం.
మర్నాడు మళ్ళీ డబ్బు దశకం తెస్తేనే ఇంట్లోకి
అడుగు పెట్టనిచ్చేది. కొన్నాళ్ళకు
భవాని
శంకరుడి దగ్గర మొత్తం సొమ్ము అయిపోవడంతో
వెళ్ళగొడుతుంది. ఇతనికో
మిత్రుడు వున్నాడు బిల్వమంగళుడు. అందమైన వాడు. విద్యావంతుడు. ఆస్తి పరుడు.
అన్నిటికి మించి మంచి ప్రవర్తన వున్నవాడు. భవానీ శంకరుడు ఓసారి చింతామణి దగ్గర బిల్వమంగళుడి
ప్రసక్తి తీసుకు రావడం, అతన్ని ఎలాగయినా ఓ
మాటు ఇంటికి తీసుకురమ్మని ఆమె కోరడం, చింతామణి
ప్రాపకం కోసం భవానీ శంకరుడు ఒక రోజు బిల్వ
మంగళుడిని చింతామణి ఇంటికి తీసుకురావడం, క్రమేపీ వారిద్దరి మధ్య అనుబంధం ఏర్పడడం, చివరికి
చింతామణి పశ్చాత్తాప పడడం ఇలా నాటకం
నడుస్తుంది. పెద్ద పాత్రలు ఏమీ లేవు కూడా. చింతామణి,
బిల్వమంగళుడు, భవానీ శంకరుడు, చింతామణి
తల్లి శ్రీహరి, చెల్లెలు చిత్ర,
బిల్వమంగళుడి భార్య రాధ, అతడి స్నేహితుడు దామోదరుడు. ఇంతవరకు బానే వుంది
సుబ్బిశెట్టి అనే మరో పాత్ర ఈ నాటకానికి జీవం పోసింది. అదే ఇప్పుడు చింతామణి
నాటకాన్ని వివాదాస్పదం చేస్తోంది. చింతామణి మీద మోజుతో
వున్నదంతా పోగొట్టుకున్న సుబ్బిశెట్టి
చివర్లో తిరగేసిన జల్లెడలో పెసర పునుకులు,
మసాలా వడలు పెట్టుకుని బజార్లవెంట తిరుగుతూ అమ్ముకునే దుస్తితికి దిగజారిపోతాడు. భవాని శంకరుడు బ్రాహ్మణుడు
కాబట్టి, నీళ్ళకావిళ్ళు మోస్తూ ‘తాతలనాటి క్షేత్రములు తెగనమ్మి దోసిళ్ళతో తెచ్చి
ధారపోసినాను, అత్తవారిచ్చిన అంటుమామిడితోట
నీవు కోరగనే రాసి ఇచ్చినాను’ అంటూ గతాన్ని
తలచుకుంటూ పద్యాలు పాడుకుంటూ వుంటాడు. ఇంతవరకు బానే వుంది
సుబ్బిశెట్టి అనే పాత్ర ఈ నాటకానికి జీవం పోసింది అని చెప్పుకున్నాము కదా! అదే ఇప్పుడు చింతామణి నాటకాన్ని వివాదాస్పదం
చేస్తోంది. చేసింది కూడా.
కాళ్ళకూరి వారు రాసిన
ఉద్దేశ్యం మంచిదే అయివుండవచ్చు కానీ, కాలక్రమంలో ప్రేక్షక జనాలను
ఆకట్టుకోవడం కోసం సుబ్బిశెట్టి, చిత్ర, శ్రీహరి
పాత్రల నడుమ మోటు సరసం,
ముతక హాస్యం ప్రవేశపెడుతూ వచ్చారు. ఓ దశలో అది సభ్యత హద్దులు దాటిపోయి
కుటుంబపరంగా చూడడం సాధ్యం కాకుండా పోయింది. కాళిదాసు కోటేశ్వరరావు అనే ఆయన
సుబ్బిశెట్టి వేషం వేసేవారు. సూరవరపు వెంకటేశ్వర్లు శ్రీహరి వేషం
కట్టేవారు. నాటకాల తొలి రోజుల్లో ఆడ పాత్రలు
నటీమణులు దొరక్క మొగవాళ్ళే
ఆడవేషాలు వేయాల్సివచ్చేది. సూరవరపువారు ‘హరిశ్చంద్ర’ లో
కాలకౌసికుడి భార్య కలహకంటిగా, ‘సక్కుబాయి’లో
అత్తగా పెద్ద పేరు సంపాదించుకొన్నారు. కాళిదాసు, సూరవరపు కాంబినేషన్
ఎప్పుడు హద్దులు దాటలేదు.
శ్రీ రామనవమికి బెజవాడ
బీసెంటు రోడ్డులో ఏటా ‘చింతామణి’ నాటకం వేసేవారు. ఆ రోడ్డులో నిజానికి ఎక్కువమంది
వ్యాపారుల దుకాణాలు ఆర్య వైశ్యులవే. అరవపల్లి సుబ్బారావు అనే ఆయన సుబ్బిశెట్టి
వేషం వేసేవారు. కాకపొతే, కారణాలు ఏమయినా ఈ నాటకంలో పోనుపోను అశ్లీల సంభాషణలు, సినిమా
డైలాగులు, పాటలు పెట్టి నాటకం
స్తాయిని దిగజార్చారు. ఇప్పుడు
ఆర్య వైశ్య మహా సభ అభ్యంతరం చెప్పిందంటే నిజమే మరి. నాటకాన్ని నిషేధించాలా
లేక ఇటువంటి ద్వందార్ధ సంభాషణలు లేకుండా
చూస్తామని, ఆపేస్తామని నాటక సమాజాలు, నటులు హామీ ఇస్తారా
చూడాలి. అంత వరకు కాళ్ళకూరి వారికి క్షమాపణలు చెప్పి ‘చింతామణి’కి కొన్నాళ్ళు
రెస్ట్ ఇవ్వడం మంచిదేమో!
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం చింతామణి నాటక ప్రదర్శనపై నిషేధం విధించిందని వార్తలు వస్తున్నాయి.
ఏదైనా వర్గపు
మనోభావాలు గాయపడేలా ప్రదర్శనలు వుంటే ఇలాగే జరుగుతుంది.
నిషేధం వంటి తీవ్ర
చర్య కాకుండా ద్వంద్వార్ధ సంభాషణలు లేకుండా చూస్తే బాగుండేది.
18-01-2022