14, జనవరి 2022, శుక్రవారం

వివాహత్పూర్వం

 నలుగురిలో వున్నప్పుడు ఉన్న రెండు చెవుల్లో ఓ చెవి అటు పడేస్తే కొత్త విషయాలు తెలుస్తాయి.

దేవరకొండ నరసింహశాస్త్రి గారు అనే పౌరోహితుడు  మా బంధువుల ఇంట్లో పెళ్లి ముహూర్తం పెట్టడానికి వచ్చి ఓ శ్లోకం చదివారు.

“కన్యా వరయతే రూపం

మాతా విత్తం, పితా శ్రుతం

బాంధవాః కులమిచ్చంతి

మృష్టాన్న హితవే జనాః”

శాస్త్రిగారి మాటల్లో దీని భావం ఏమిటంటే పెళ్లి కావాల్సిన వధువు, కాబోయే  వరుడిలో అందచందాలను, అతడి రూపలావణ్యాలను చూస్తుంది. వధువు తల్లి విత్తం అంటే వరుడి కుటుంబం తాలూకు ఆర్ధిక స్థితిగతులను, ఆ ఇంట్లో తన కూతురు సుఖపడగలుగుతుందా అనే విషయాలను  పరిశీలిస్తుంది. వరుడి తండ్రి శ్రుతం అంటే వరుడి చదువు సంధ్యలు, విద్యార్హతలు, ఉద్యోగం మంచి చెడులు గురించి ఊళ్ళో నలుగురు ఏమనుకుంటున్నారు అనే విషయాలను జాగ్రత్తగా గమనిస్తాడు. వధువు తరపు బంధువులు ఈ సంబంధం గురించి చెప్పగానే కులం (అంటే ఇక్కడ సాంప్రదాయం అని అర్ధం, కులం కాదు) ఆచారవ్యవహారాలు (స్వశాఖీయం, పరశాఖీయం) మొదలైనవి చూస్తారు. పొతే, ఇక ఇరుగుపొరుగు  జనాలు మాత్రం  ఆ పెళ్ళిలో భోజనం ఏర్పాట్లు ఎలా వున్నాయి, పదార్ధాలు ఎలా వున్నాయి  అనే అంశం గురించి మాట్లాడుకుంటారు.

శాస్త్రి గారు చెప్పేది ఏమిటంటే చివరివి రెండూ అంత ప్రధానమైనవి కావు కాబట్టి  ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయాలని.

నాదీ, మా పిల్లలవీ పెళ్లి చూపులు, పెళ్లి మాటలు లేని పెళ్ళిళ్ళు కనుక నాకీ విషయాలు కొత్తగానే అనిపించాయి.


NOTE: COURTESY IMAGE OWNER


 

సంక్రాంతికి సొంతూరుకు – ఓ జ్ఞాపకం

 పండక్కి సొంత ఊరుకు వెళ్లాలని ఎంతగా వున్నా కాచుకుని ఉన్న కరోనా భూతం ముందరి కాళ్ళకు బంధాలు వేసింది. అందుకే ఎప్పటి అనుభవాలనూ నెమరు వేసుకుంటూ తృప్తి పడడమే మిగిలింది.

నాలుగేళ్ల క్రితం సంక్రాంతికి సొంతూరుకు వెళ్ళాలనే అభిలాషతో హైదరాబాదులో ఉంటున్న మా కుటుంబ సభ్యులం  అందరం నాలుగు కార్లలో ఉదయమే బయలుదేరి మా వూరు కంభంపాడుకు బయలుదేరాము. టోల్ గేట్ల వద్ద కూడా ఎక్కువ ఆలస్యం కాకుండానే బయటపడ్డాము. మేమే కాకుండా ఖమ్మం, రెబ్బారం, పెనుగంచిప్రోలు నుంచి కూడా చిన్నా పెద్దా యాభయ్, అరవై మందిమి మా వూరికి సంక్రాంతి అతిధులం.

ఆ రాత్రి అక్కడ నిద్ర చేసాం. అర్ధరాత్రి వరకు ఆడవాళ్ళు అందరూ రంగవల్లులు దిద్దుతూనే వున్నారు. ఎంత ఓపికో వారికి.

తెలతెలవారవస్తోంది. పక్కన శివాలయం మైకులోంచి బాలసుబ్రమణ్యం శివస్తుతి బిగ్గరగా వినవస్తోంది. ఇల్లు ఇల్లంతా నిద్ర పోతున్నవారితో నిండిపోయివుంది. ఊరేలా మారిందో కళ్ళారా చూడాలనే కోరిక చలిని జయించింది. నిద్ర మంచం మీద నుంచి లేచి వీధిలో కాలుపెట్టాను. వూళ్ళో వున్నవే మూడు వీధులు. అవన్నీ ముగ్గుల దుప్పట్లు కప్పుకుని కానవచ్చాయి.

చిన్నప్పుడు తిరిగిన వీధుల్లో నడుచుకుంటూ చెరువు గట్టుకు చేరాను. మంచినీళ్ళ బావికి వున్న ఇనుప గిలకలు పూర్వపు ఔన్నత్యానికి గుర్తుగా మిగిలివున్నాయి. మోటారు పెట్టి నీళ్ళు తోడి ఊరి నడుమ నిర్మించిన మంచినీళ్ళ  ట్యాంకును నింపుతూ వుండడం వల్ల  ఆ గిలకల ఉపయోగం లేకుండా పోయింది. చెరువు గట్టు మీద జేసీబీలు, ట్రాక్టర్లు ఇంకా భారీ యంత్రాలు కానవచ్చాయి. గట్టును వెడల్పు చేసి గట్టి పరచడం కోసం ఒక వైపున ఇరవై అడుగుల రిటైనింగ్ వాల్ నిర్మాణంలో వుంది. లింగాల నుంచి కంభంపాడు వరకు నిర్మాణం పూర్తయిన అరవై అడుగుల వెడల్పు రహదారిలో ఇదొక భాగం. వాటిని చూస్తూ గట్టు చివరివరకు పోయి తిరిగి వస్తుంటే చలి కోటు కప్పుకున్న ఒక మనిషి ఎదురు పడ్డాడు. తెల్లటి తొలివెలుగులో నల్లటి రూపం కనిపించింది. తాగుతున్న బీడీ విసిరివేసి నా మొహంలోకి తేరిపారచూసాడు. ‘మీరు కరణంగారి తమ్ముడు కదూ’ అన్నాడు. ఇన్నేళ్ళ తరవాత కూడా వూళ్ళో నన్ను గుర్తు పట్టేవాళ్ళు వున్నారని సంతోషించాను. ‘నాకు తెలిసిపోయింది, మీరు భండారు శ్రీనివాసరావు గారు’ అనేశాడు ఇంటిపేరులో ఉన్న ‘భ’ ని ఒత్తిపలుకుతూ.

మిమ్మల్ని సాక్షి టీవీలో చూస్తుంటాను’ అన్నాడు మరే టీవీలో కనబడనట్టు. ‘మీకు గుర్తుందో లేదో నేను, యేసు రత్నాన్ని. మీ అన్నయ్య గారితో కలిసి చదువుకున్నాను, మీ ఇంటికి వచ్చేవాడిని, అయినా మీరు వూళ్ళో ఎప్పుడు వున్నారు కనుక’ అని కూడా ముక్తాయించాడు.

నేనిక్కడ వాచ్ మన్ని. ఇవిగో వీటన్నిటినీ నేను కనిబెడుతుండాలి’ చెప్పాడు గట్టు మీది యంత్రాలను గర్వంగా చూపెడుతూ.

ఇన్ని ఏళ్ళ తరువాత గుర్తు పట్టిన ఆ పెద్దమనిషిని గుర్తు పెట్టుకునే ఫోటో తీసుకోవాలని అనిపించింది. తీసే వాడు ఎవరా అని ఆలోచిస్తుంటే ఒక ట్రాక్టరు కింద నుంచి ఒక మనిషి బయటకు వచ్చాడు.

రాం సింగ్. వీళ్ళది జార్ఖండ్. జేసీబీ పనిచేస్తాడు.’ అని పరిచయం చేసాడు యేసు రత్నం. ఆ జార్ఖండ్ కుర్రాడు మా ఇద్దర్నీ ఫోటోలు తీశాడు. వాళ్లకి థాంక్స్, సంక్రాంతి శుభాకాంక్షలు జమిలిగా చెప్పేసి మళ్ళీ ఊళ్ళోకి వచ్చాను. దగ్గరలోనే మునసబు మల్లయ్య గారిల్లు. ఇప్పుడు లేరు. ఆయన కొడుకు ప్రతాప్ ఆ ఇంట్లో ఉంటున్నాడు. చాలా ఏళ్ళ క్రితమే, వూళ్ళో ఉన్న ఇతర ఖామందుల ఇళ్ళకు భిన్నంగా రెండతస్తుల భవంతి కట్టించాడు. ఇప్పుడు జూబిలీ హిల్స్, బంజారా హిల్స్ లో కనబడే పెద్ద పెద్ద అధునాతన భవనాలవంటివి నా గ్రామ సందర్శనలో రెండు మూడు కనిపించాయి.

వాసిరెడ్డి జమీందారు కట్టించిన గుడికి మా వంశస్తులు ధర్మకర్తలు. భక్తి ఉన్న చోట సంపద వర్ధిల్లుతుందో, ధనధాన్యాలు సమృద్ధిగా వుంటే భక్తిప్రపత్తులు పెరుగుతాయో తెలియదు కానీ చాలాకాలం నిత్య ధూపం కూడా గగనం అనుకున్న ఆ గుడి పరిస్తితి ఇప్పుడు బాగానే ఉన్నట్టుంది. దానికి దాపుల్లోనే మరో దేవాలయం రూపుదిద్దుకుంది. మరో రెండు నెలల్లో విగ్రహ ప్రతిష్ట అంటున్నారు. ముందు ముందు మా గ్రామానికి ఒక చక్కటి ఆకర్షణ కాగల ఈ రామాలయాన్ని చావా నరసింహారావనే పెద్దమనిషి నిర్మిస్తున్నారు. ఇప్పటిదాకా యాభయ్ లక్షలు అయ్యాయట.

ఇక మా ఇంట్లో సందడే సందడి. నగరాల్లో పుట్టి పెరిగిన కోడలు పిల్లలు కొంగులు దోపుకుని అర్దరాత్రివరకు మేలుకుని ఇంటి ముందు రంగవల్లులు తీర్చి దిద్దారు. మర్నాడు అందరం కలిసి వెళ్లి ఎస్సీ కాలనీలోని మా రెండో అన్నయ్య ధర్మకర్తగా ఉన్న పూర్వీకుల శివాలయాన్ని, మా తోటలో మామూడో అన్నయ్య వెంకటేశ్వరరావుగారు నిర్మించిన మా ‘అమ్మా నాన్నల గుడి’ని దర్శించాము. ఆ పక్కనే మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు, మూడో అన్నయ్య వెంకటేశ్వరరావు గార్ల స్మారక స్తూపాలు వున్నాయి. చుట్టూ పచ్చటి చేలు. పిల్లల హడావిడి చెప్పతరం కాదు. పెద్దవాళ్ళు కూడా వయసు మరిచి పోయి మొక్కజొన్న చేలో కలయతిరుగుతూ ఫోటోలు దిగారు. రేగుపళ్ళు ఏరుకుని తిన్నారు.

వూళ్ళో ఉన్న రెండు రోజులు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుని, కొత్త జ్ఞాపకాలను మూటగట్టుకుని మళ్ళీ అందరం కార్లెక్కి హైదరాబాదు రోడ్డెక్కాము.

మొత్తానికి పెద్దలకూ, పిల్లలకూ మంచి ఎనర్జీ టూర్!



(2018)

అభినవ కార్తవీర్యార్జునులు - భండారు శ్రీనివాసరావు

 

'మా వై ఫై పాస్ వర్డ్
@ Capital A for atom small c # 3 F5' అన్నాడాయన కూల్ గా.
మనం అడిగింది పాస్ వర్డా, లేక మేధమేటికల్ ఈ క్వేషనా తెలియక తల బద్దలు కొట్టుకోవాలి.
‘అది కూడా ఈ ఉదయమే మార్చాడు మా మనుమడు. ఉదయం సాయంత్రం పాస్ వర్డులు మార్చడం వాడి హాబీ’
ఇంకేమంటాం! చిత్తం అంటాము.

వెనుకటి రోజుల్లో సినిమాల్లో అత్తగారి పాత్రలు వేసే సూర్యాకాంతం వంటి నటీమణులు రొండిన తాళం చేతుల గుత్తి దోపుకుని కనిపించేవాళ్ళు. ఆ గుత్తి ఇంటిపై అధికారానికి గుర్తు. దాన్ని కోడలి చేతిలో పెట్టడం అంటే అప్పటినుంచి ఇంటి పెత్తనం అంతా కోడలికి దఖలు చేసినట్టే అనుకోవాలి. ఇంటి తాళం చెవులు, ఇనప్పెట్టె తాళం చెవులు ఆ గుత్తిలో వుంటాయి కాబట్టి దానికా విలువ. ఇప్పటి అపార్ట్ మెంటు సంస్కృతిలో ఇంటికి ఒక తాళం చెవే. బ్యాంకు లాకర్ల ధర్మమా అని ఇళ్ళల్లో ఇనప్పెట్టెలు ఎలాగూ లేవు. కాకపోతే కంప్యూటర్ల పుణ్యమా అని కొత్త తాళం చెవులు వచ్చిపడ్డాయి. వీటిని గుత్తికి తగిలించి రొంటిన దోపుకునే వీలులేదు. కంప్యూటర్ కు ఒక పాస్ వర్డు. ఏటీఎం కార్డు కార్డుకో పాస్ వర్డు. ఆన్ లైన్ డబ్బు లావాదేవీలకి ఒకటి, మెయిల్ ఐడీ కొకటి, ఫేస్ బుక్కుకొకటి. లింక్ డిన్ కు మరోటి. ట్విట్టర్ కు ఇంకోటి. పైగా అప్పుడప్పుడూ వీటిని మార్చుకుంటే మంచిదంటూ సలహాలు. వెనకటి తాళం చెవుల గుత్తిలా వీటిని మనసుకు తగిలించుకుంటేనే కానీ రోజుగడవని పరిస్తితి.

కార్తవీర్యార్జునుడికి వేయి చేతులే! కానీ ఈ యుగపు మనుషులకి ఈ నెట్ తాళం చేతులు రోజురోజుకూ పెరిగిపోతూనే వున్నాయి.

13, జనవరి 2022, గురువారం

వితండవాదం – భండారు శ్రీనివాసరావు


‘వితండవాదంలో కూడా ఓ వాదం వుంది. ముందు అది ఒప్పుకో’ అన్నాడు ఏకాంబరం, తనది వితండవాదం అని ఎద్దేవా చేసిన పీతాంబరంతో.
‘అలాగే చెప్పు’
‘ఈరోజు పేపరు చూసావా కనీసం టీవీ చూసావా’
‘ఇదే వితండవాదం అంటే! మనం మాట్లాడుతోంది కరోనా గురించి కదా!’
‘అవును. అందుకే అడుగుతున్నాను. ఏమి రాశారు. ఈ కాలేజీలో ఒమిక్రాన్ కలకలం. ఆ వూర్లో జడలు విప్పిన కరోనా. ఈరోజు కోడిగుడ్డు ధర మాదిరిగా, కొత్త కేసులు పదివేలు. కోలుకున్న కేసులు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభయి తొమ్మిది. ఊరట కలిగించే ఈ రెండో విషయం ముందు రాయవచ్చుకదా. పదివేలు పదివేలు కొత్త కేసులు అని ఊదరకొడుతూ జనాలను బెదర గొట్టడం ఎందుకు. పదివేల కేసుల్లో ఒకరే ఇంకా కోలుకోవాల్సి వుంది. ఈ సంగతి ఎందుకు హైలైట్ చేసి రాయరు? మీడియాకి ఆ మాత్రం బాధ్యత లేదా! రాజకీయాల్లో సంచలనాల వార్తలు వారిష్టం. కానీ కరోనా విషయంలో సంచలన వార్తలతో సామాన్య ప్రజలను భయబ్రాంతులను చేయడం సబబా! ఇలా అడిగితే నాది వితండవాదమా!’
‘..............’

‘భయపెట్టడం వల్ల ప్రయోజనం లేదు. చిన్న చిన్న జాగ్రత్తలతో ఈ భూతాన్ని ఎలా తరిమికొట్టవచ్చు అనే విషయంలో ప్రజలను జాగృతం చేయాలి. ఈ మాట వితండవాదం అని నువ్వు అనుకుంటే అది నీ విజ్ఞతకే వదిలి వేస్తున్నాను’
‘..............’
(13-01-2022)

శారదక్కయ్య – భండారు శ్రీనివాసరావు

 అమ్మలగన్నయమ్మ ‘మా అమ్మ’ అనుకుంటే, మా అమ్మకు రెండో బిడ్డ, మా రెండో అక్కయ్య కొలిపాక శారదక్కయ్య. ‘మంచి అమ్మకు’ మారుపేరు.

మా అమ్మ భండారు వెంకట్రావమ్మ గారు, 1993 లో తన 84 ఏట మరణించినప్పుడు మేనల్లుడు కౌటూరి దుర్గాప్రసాద్ ఒక సంస్మరణ సంచిక ప్రచురించాడు. మా అమ్మకన్న సంతానం మాత్రమే కాకుండా పిల్లల పిల్లలు కూడా అమ్ముమ్మ గురించిన అనుభవాలను, అనుభూతులను అందులో పంచుకున్నారు. మా శారదక్కయ్య అమ్మను గురించి రాసిందిలా:

పట్టుమని పన్నెండేళ్ళు అయినా నిండకుండానే నా పెళ్లి అయింది. మా పెద్దమ్మాయి శాంత పుట్టిన ఏడాదికే మా వారు (కొలిపాక రామచంద్ర రావు గారు) దేశ దాస్య విమోచనం కోసం జైలుకు వెళ్ళారు. మా పెద్ద బావ అయితరాజు రాం రావు గారు మా వారితో పాటే జైలుకు వెళ్ళడంతో, నన్నూ మా పెద్దక్క రాధనూ మా అప్ప (నాన్న) మా వూరు కంభంపాడు తీసుకు వెళ్ళారు. మా బావగారు, మా వారు జైల్లో వున్న పద్నాలుగు నెలలు మేమిద్దరం మా పుట్టింట్లోనే ఉండిపోయాము. ఆ రోజుల్లో ఇలా గ్యాసు పొయ్యిలు లేవుకదా! మా అమ్మ శనగకట్టె మంట పెట్టి మా అందరికీ వండి పెట్టేది.

మా అప్ప ఊళ్ళోని దుకాణదారుతో చెప్పాడు “ మా పిల్లలు ఏదీ లేక ఇక్కడికి రాలేదు. అల్లుళ్ళు దేశం కోసం జైలుకు వెళ్ళారు. వాళ్లకి అవసరమైనవి ఏవి అడిగినా కాదనకుండా ఇవ్వు”

మా అమ్మకు పుట్టింటి వాళ్ళు ఒక గేదెను అరణంగా ఇచ్చారట. దాన్ని గురించిన కబుర్లు గమ్మత్తుగా చెప్పేది. తాను కోడలిగా ఏనాడు గడప దాటి వెళ్లకపోయినా, తన పేరు మాత్రం ఆ గేదె పుణ్యమా అని నలుగురికీ తెలిసిందట. అది వూళ్ళో అందరిండ్లలో జొరబడి నానా బీభత్సం చేసేదట. ‘వెంకట్రావమ్మ గారి గేదె ఇలా చేసింది, అలా చేసింది’అని వూళ్ళో జనం చెప్పుకునే వారట.

ఆ రోజుల్లో ఏ కబుర్లు వెంటనే తెలిసేవి కాదు. మా వాళ్ళు జైలు నుంచి విడుదల అయినట్టు ముందు ఎవరు కబురు తెస్తే వాళ్ళ కాళ్ళకు దణ్ణం పెట్టుకోవాలని నేనూ మా పెద్దక్కా అనుకునేవాళ్ళం.

చివరికి శంభాయి ఆ శుభవార్త మోసుకువచ్చాడు.

మేమిద్దరం ముందు అనుకున్నట్టే, మా ఇంట్లో పనివాడు అయిన శంభాయికి పాదాభివందనం చేశాము”

పెద్ద చదువులు లేకపోయినా చిన్నప్పటి సంగతులను అంత చక్కగా రాసిన మా శారదక్కయ్యకు అన్ని డిగ్రీలు వున్నట్టే లెక్క.

శారదక్కయ్య గురించిన  ఓ జ్ఞాపకం

అరవై ఏళ్ళ కిందటి మాటే.

అప్పుడప్పుడే స్టెయిన్ లెస్ స్టీల్ కంచాలు, గ్లాసులు  మార్కెట్లోకి వస్తున్న రోజులు అనుకుంటాను. మా ఇంట్లో అప్పటికి అవి గృహ ప్రవేశం చేయలేదు. మా రెండో అక్కయ్య శారదక్కయ్య ఓసారి పండక్కి వస్తూ రెండు స్టీలు భోజనం పళ్ళేలు తెచ్చి నాకు ఒకటీ, మూడో అన్నయ్య వెంకటేశ్వర రావుకూ ఒకటీ ఇచ్చింది. అప్పట్లో వాటి ఖరీదు రెండూ కలిపి పదిహేను రూపాయలు. అంటే కరణీకం చేస్తున్నప్పుడు మా నాన్నగారి మూడు నెలల జీతం అన్నమాట. ఇహ అప్పుడు చూడాలి మా మోహంలో సంతోషం. ఏనుగు ఎలా వుంటుందో తెలవదు కానీ అదెక్కినంత ఆనందం.

మా అక్కయ్య ఇచ్చిన ఆ కంచం మీద నాకు మోహం ఎంతగా పెరిగిపోయిందంటే అది నాకే సొంతం అనుకునేవాడిని. ఆ తర్వాత ముప్పయ్ ఏళ్ళకు పైగా అది నాతోనే వుంది. 1987లో మాస్కో వెళ్ళేటప్పుడు లగేజి సమస్య కారణంగా ఆ కంచంతో నా రుణానుబంధం తెగిపోయింది.

తిరిగొచ్చిన తర్వాత లోకమే మారిపోయింది. డిన్నర్ ప్లేట్లు, డిన్నర్ సెట్లు వచ్చిపడిన తర్వాత, చాలా కొద్ది మంది ఇళ్ళల్లో తప్ప, ఇప్పుడు ఈ విడికంచాల గోల లేదు.



ఈరోజు ఆమె జయంతి సందర్భంగా నమోవాకాలు.

(13-01-2022)

 

 

డి. వెంకమయ్య గారు, నేనూ – భండారు శ్రీనివాసరావు

 

(ఈరోజు ఆయన వర్ధంతి)

నా జీవితంలో రేడియో ఉద్యోగం ఓ ప్రధాన అధ్యాయం అనుకుంటే అందులో అన్ని పేజీల్లో కనిపించే పేరు డి. వెంకట్రామయ్య.
నేను అభిమానించే ఓ కధా రచయితే నాకు సహోద్యోగి కాగలడని నేను ఎన్నడు వూహించలేదు.
'డి వెంకట్రామయ్య' కధలపై నేను మరింతగా యిష్టం పెంచుకుంటున్న రోజుల్లోనే ఆయన రాయడం బాగా తగ్గించారు. తగ్గించారు అనడం కంటే రాయడం మానేశారు అంటే బాగుంటుందేమో!

వస్తున్న కధల్లో రాశి పెరిగి, వాసి తగ్గి - ఆ బాపతు వాటిని 'చదవడం మానేస్తే పోలా' అని అనేకమంది చదువరులు అనుకుంటునట్టే , 'కాగితంపై కలం పెట్టగలిగినవాళ్ళందరూ కధలు రాయడం మొదలుపెట్టేసరికి- 'రాయడం మానేస్తే పోలా' అనిపించి రచనా వ్యాసంగానికి ఆయన దూరమయ్యారేమోనని నా అనుమానం.

రచయితగా నాకు తెలిసిన వెంకట్రామయ్య గారు- నాకు వృత్తిపరంగా తెలిసివచ్చేనాటికే 'కలం సన్యాసం' స్వీకరించినట్టున్నారు. అడిగినవారి కోసం అడపా దడపా రాయడం తప్పిస్తే- అప్పటినుంచీ కధా రచయితగా ఆయన రాసిందీ, రాస్తున్నదీ ఏమీ లేదనే చెప్పాలి.

1975 నవంబర్లో - తొలిసారి వెంకట్రామయ్యగారిని హైదరాబాద్ ఆకాశవాణి వార్తా విభాగంలో సహోద్యోగిగా కలుసుకున్నాను. ప్రాచుర్యం పొందిన రచయితతో ఏ అభిమానికయినా సాన్నిహిత్యం ఉండవచ్చుకానీ, పాతికేళ్ళకు పైగా ఒకే కార్యాలయంలో కలిసి పనిచేయడం మాత్రం అరుదు.
వృత్తిరీత్యా కలసి పనిచేసే ఉద్యోగాలు. ప్రవృత్తి రీత్యా మావి ఉత్తర దక్షిణ ధృవాలు. ఆయనకూ, నాకూ నడుమ శతసహస్ర వైరుధ్యాలు.
ఆయనకు నిశ్శబ్దం యిష్టం. వార్తలు ఎంపిక చేసేటప్పుడూ, వాటిని అనువాదం చేసేటప్పుడూ పనిచేసే వాతావరణం ప్రశాంతంగా వుండాలని ఆయన కోరుకుంటారు. నేను ఇందుకు పూర్తిగా విరుద్ధం. పనిచేసేచోట, పనిచేసేవాళ్ళందరూ హాయిగా నవ్వుతూ తుళ్ళుతూ పనిచేస్తుంటే అలుపూ సొలుపూ వుండదన్నది నా థియరీ.
వైరుధ్యాలు ఇంతేనా అంటే ఇంతే కాదు ఇంకా వున్నాయి.
టేబుల్ పై కాగితాలన్నీ ఒక పధ్ధతి ప్రకారం సర్దిపెట్టుకోవడం ఆయనకలవాటు.
చెత్తబుట్టకూ, రాతబల్లకూ తేడా తెలియనంతగా - నానా చెత్త మధ్య కూర్చుని చెత్త రాతలు రాస్తూ వుండడం నా ప్రత్యేకత.
ఆ రోజుల్లో ఎవరయినా వార్త పట్టుకు వస్తే- అది ఆయన చేతులో పడితే ఇంతే సంగతులు. రేడియో మార్గదర్శిక సూత్రాలనూ, ఆనాటి బులెటిన్ ప్రాధాన్యతలనూ అప్పటికప్పుడు బేరీజు వేసుకుని 'ఈ వార్త యివ్వడం కుదరద'ని మొహమ్మీదే చెప్పేసేవారు. ‘అంత నిష్టూరంగా అలా చెప్పకపోతే ఏం’ అనిపించేది కానీ ఆయన మాత్రం లేనిపోని భేషజాలు తనకు సరిపడవన్న తరహానే ప్రదర్శించేవారు. స్నేహితులనో- పరిచయస్తులనో –మొహమాటపడిపోయి వ్యవహరించడం ఆయనకు చేతకాని పని. ఇలాంటి విషయాల్లో ఆయనకూ నాకూ మధ్య కొన్నిసార్లు అభిప్రాయ బేధాలు బయటపడేవి. బయట తిరిగే విలేకరులకు కొన్ని కొన్ని రకాల మొహమాటాలు ఉండడానికి అవకాశం ఉండొచ్చన్న అభిప్రాయంతో ఆయన ఏకీభవించేవారు కాదు. దానితో, వార్త ఎందుకు యివ్వలేకపోయామో అన్నది సంజాయిషీ ఇచ్చుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్తితి నాది.
పని పట్ల ఆయన చూపే నిజాయితీ, నిబద్దతా అందర్నీ కట్టిపడేసేవి. బులెటిన్ ఆయన తయారుచేసారంటే, దానిపై ఆయన ముద్ర స్పష్టంగా వుండేది. అందులో యితరుల జోక్యాన్ని ఆయన అనుమతించేవారు కాదు. ప్రజాసంబందాలకు పెద్దపీట వేసే మా బోంట్లకు ఆయన ఈ మొండి వైఖరి కొండొకొచొ కొన్ని చిక్కులు తెచ్చి పెట్టేది. అయినా ఆయన ధోరణి ఆయనదే. సిద్దాంతాలూ, సూత్రాలూ వల్లించే వాళ్ళల్లో - వాటికి కట్టుబడి వ్యవహరించేవాళ్ళని చాలా తక్కువమందిని చూస్తాం! వెంకట్రామయ్యగారు ఈ కొద్ది మందిలో మొదటివారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్త విభాగంలో చేరిన చాలా కాలం తర్వాత నాకు ఆయన కధలు రాయడం పూర్తిగా తగ్గించిన సంగతి తెలిసింది. పత్రికల్లో- మీడియాలో పనిచేసే 'రచయితల'కు సొంత రచనలు చేసే తీరిక తక్కువన్న అభిప్రాయం ఒకటి ఉంది.నిజమేనేమో!
'పని రాక్షసుడి'గా పేరు పడ్డ వెంకట్రామయ్యగారు-
విధి నిర్వహణకు మాత్రమే ప్రాధాన్యం యిచ్చే వెంకట్రామయ్యగారు-
ఉద్యోగిగా తన కర్తవ్యాన్ని వొదిలిపెట్టి-
'వెంకట్రామయ్య'గా కధలు రాసుకోగలరని అనుకోవడం భ్రమ. అందుకే ఆయన 'రాయని రచయితగా మిగిలిపోయారు.
ఆయన మిత్రుల్లో చాలామంది మాదిరిగానే నాకూ ఇది ఏమాత్రం నచ్చలేదు. ఆయనతో పెంచుకున్న చనువునీ, సాన్నిహిత్యాన్నీ, స్నేహాన్నీ ఉపయోగించుకుని- వీలుదొరికినప్పుడల్లా కధలు రాయమని పోరేవాడిని. అలా వెంట పడగా పడగా బద్ధకం వొదుల్చుకుని చివరికి ఒక కధ రాసారు.దాన్ని గురించి స్నేహితులతో చెబుతూ- 'యిది శ్రీనివాసరావు పుణ్యమే' అని - పాపపుణ్యాల పైనా, దేవుళ్ళూ దెయ్యాల పైనా ఏమాత్రం నమ్మకం లేని వెంకట్రామయ్యగారన్నట్టు గుర్తు.
అతికొద్ది 'మంచి' కధలు రాసిన రచయితగా 'డి వెంకట్రామయ్య' అసంఖ్యాక చదువరులకు పరిచయం. కానీ ఆయన తన పేరుపెట్టు కోకుండానో, లేదా కలం పేరులాగా 'గళం'పేరుతోనో (కార్మికుల కార్యక్రమం లో రాంబాబు) - రేడియోకి అసంఖ్యాకంగా రచనలు చేసిన సంగతి అందులో పనిచేస్తున్నవారికే తెలియదు. పేరు మీద వ్యామోహం పెంచుకోకపోవడంవల్లనే ఆయనకు రావాల్సిన పేరు ప్రఖ్యాతులు రాలేదని అనుకునేవారు కూడా వున్నారు. రాసినవి 'కొద్దే' అయినప్పటికీ, పుస్తక ప్రియులను 'పెద్దగా' ఆకట్టుకున్నవే ఆయన ఖాతాలో చేరాయి. అందుకే 'ఎన్ని' రాసారన్నది కాకుండా, 'ఏమి' రాసారన్నదానికి విలువ కట్టి పురస్కారాలు ఇస్తారనే మంచి పేరున్న 'రాచకొండ రచనా పురస్కారం' ఎంపిక కమిటీ ఒక ఏడాది తన వార్షిక పురస్కారాన్ని డి వెంకట్రామయ్యగారికి ప్రకటించింది. పురస్కారానికి వున్న విలువ పురస్కార గ్రహీతను బట్టి మరింత పెరుగుతుంది అనడానికి ఇదో మంచి ఉదాహరణ. అలాగే, రావిశాస్త్రి గారికి వీరాభిమానిగా చెప్పుకోవడానికీ, ఒప్పుకోవడానికీ సంకోచించని వెంకట్రామయ్యగారికి ఇదో కలికితురాయి. మరెన్నో మంచి రచనలు చేయడానికి ఈ పురస్కారం ఆయనకి తగిన ప్రోత్సాహకారకం కాగలదని ఆశించాను కాని, (రచన ఇంటింటి పత్రికలో సాయిగారు పట్టుబట్టి నెలనెలా రాయిస్తున్న రేడియో అనుభవాలు తప్పిస్తే) నాది పేరాశ అనే ఆయన తేల్చేసారు.

వేంకట్రామయ్య గారికి పుస్తకాలన్నా, సినిమాలన్నా ప్రాణం. ఆరోజు ఉదయం మనమడ్ని తీసుకుని వరసగా రెండు సినిమాలు, సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠ పురములో చూడాలని కూకట్పల్లి పీవీఆర్ ఫోరం మాల్ కి వెళ్ళారు. ఒక ఆట చూసి రెండో సినిమాకు వెడుతూ మధ్యలో కుప్పకూలిపోయారు. దగ్గరలోని ఆసుపత్రికి తీసుకు వెళ్ళారు. ఫలితం లేకపోయింది.
హాయిగా సినిమాకని వెళ్ళిన మనిషి విగతజీవుడిగా ఇంటికి రావడంతో వారి కుటుంబ సభ్యులకు ఎంతటి విషాదాన్ని మిగిల్చి వుంటుందో!

కింది ఫోటోలో :

ఇద్దరు గొప్ప రచయితలు ఇలపావులూరి మురళీ మోహన రావు, వెంకట్రామయ్య నడుమ నేను






12, జనవరి 2022, బుధవారం

ఓ పాము కధ – భండారు శ్రీనివాసరావు

 ముందు మీ గోల ఆపి నేచేప్పేది కాస్త వింటారా”

ఇన్నాళ్ళుగా కస్సూబుస్సులు లేకుండా తమ మధ్యనే ఉంటున్న ఆ నాగుపాము పడగవిప్పి, నోరు తెరిచి రెండు నాలుకలతో అలా అనగానే యావన్మందీ నిశ్చేష్టులయ్యారు.

నేను ఇన్నాళ్ళు పుట్టల్లో, గుట్టల్లో తిరుగుతూ నోటికి అందిన పురుగూపుట్రా తింటూ హాయిగా శేష జీవితాన్ని గడుపుతున్న సమయంలో ఓ జెర్రి గొడ్డుతో వెర్రిస్నేహం చేసి, దాని మాయ మాటల్లో పడి ఇదిగో ఈ ఊరు చేరుకొని ఒక ఇంటి చూరుపై తల దాచుకున్నాను. ఆ రాత్రి వాళ్ళింట్లో పిల్లాడు పెద్దవాళ్ళు నిద్రపోయిన తరువాత లేచి ‘జంతు ప్రపంచం’ ఇంగ్లీష్ ఛానల్ పెట్టాడు. అందులో ఒక పాము కనిపించింది. ఎవరో ఓ తెల్ల పిల్లాడు ఆ నల్లతాచును ఎంచక్కా తన చేతిలో పట్టుకుని ఆడిస్తున్న దృశ్యం కంట పడింది. అది చూసి నాకూ కన్ను కుట్టింది. ఒక్క సారయినా అలా తెరపై కనిపిస్తే జన్మధన్యం అనికూడా అనిపించింది. కొన్నాళ్ళు ‘కాటు’ వేసే బుద్ధి మానుకుంటే ఇలా ఎంచక్కా టీవీలలో చూపెడతారు అనిపించి మర్నాడు తెల్లారగానే ఈ కొత్త అవతారం ఎత్తాను. ముందు నన్ను చూసి జనం భయపడ్డా, వారిలోని భక్తిప్రపత్తులు నన్ను ఒడ్డున పడేశాయి. ప్రాణ భయం లేదని తేలిపోయింది కాబట్టి కొన్నాళ్ళు ఉపాసం వుంటే ఏం పోయిందని నేనూ ఇదే బాగుందని నిర్ణయించుకున్నాను. అనుకున్నట్టే టీవీ వాళ్ళు రంగప్రవేశం చేసారు. ఆ హాలీవుడ్ పాముకు బుల్లితెరకు ఎక్కడానికి ఎంత కాలం పట్టిందో తెలియదు కానీ నాకు మాత్రం ఆ భాగ్యం వెంటనే వెతుక్కుంటూ వచ్చింది. నాలాగే ఆ టీవీ వాళ్ళూ ఇక్కడే మకాం వేసి ఉదయం నుంచి రాత్రి దాకా అలసట లేకుండా లైవ్ టెలికాస్టులు మొదలెట్టారు. వాళ్ళు రాగానే వూళ్ళో వాళ్లకు పూనకాలు పూనాయి. ‘ఒకరికి పుట్టె, ఇద్దరికి పుట్టె, అర్ధరాత్రి వేళకు అందరికీ పుట్టింది’ అన్నట్టు పూనకాలు, పూజలూ పెరిగిపోయి నాకు కంటిమీద కునుకు లేకుండా చేసాయి. మధ్యలో జంతు ప్రేమికులూ, జీవ కారుణ్య సంఘాల వాళ్ళు వచ్చేసి ‘నాకేదో జరిగి పోతోంది, తమ ప్రాణాలు పణంగా పెట్టయినా సరే నా ప్రాణాన్ని కాపాడతాం’ అంటూ వాదించడం మొదలెట్టారు. ఇన్నాళ్ళు నిద్రాణంగా ఉన్న తమ ఊరుకు ఇంత వైభోగం తెచ్చిన ఈ పామును వూరు దాటించాలని చూస్తే ఊరుకునేది లేదంటూ అప్పటికప్పుడు నాకు భక్తులు అయిపోయినవాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళతో గిల్లీ కజ్జాకు దిగారు. పోలీసులు, అధికారులూ సరేసరి. ఈ మూడువారాల పూజలకే నాకు మతిపోతోంది. మరి తిరుపతి దేవుడు అర్ధరాత్రి దాకా ఈ తాకిడి ఎలా తట్టుకుంటున్నాడో ఏమిటో!

మీ అందరికీ చెప్పేది ఏమిటంటే నేను వచ్చిన పని అయిపొయింది. టీవీల్లో కనబడీ కనబడీ నాకే చిర్రెత్తుతోంది. ఈ విషయంలో ఊళ్లోవాళ్లకు ఉన్న టీవీ కాపీనం కూడా తీరి పోయుంటుంది. ఇన్నాళ్ళు మీరు చేసిన పూజా ఫలం ఏమో తెలియదు కానీ నాకూ కొంత మహత్తు వంట్లోకి వచ్చింది. కావున, కాబట్టి నేను ఇంతటితో ఈ కధ ముగించి అంతర్ధానం అయిపోతున్నాను. మళ్ళీ అడవిలోకి వెళ్లి దొరికిన కప్పనో, చిప్పనో తిని కడుపు నింపుకుంటాను. మీరు కూడా మీ లగేజి సర్దుకుని ఎవరి ఊళ్లకు, ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపొండి. శ్రీశ్రీశ్రీ మంగళం మహత్!’

పాము అలా చెప్పి మాయం అయిపోగానే అప్పటిదాకా శిలలమాదిరిగా అయిపోయిన జనం మళ్ళీ తెలివిలోకి వచ్చారు.

వున్నట్టుండి నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ ఒకడు గట్టిగా అరిచాడు.

ఈ పాము నోరు తెరవడంతో నా తెలివికాస్తా తెల్లారి పోయింది. పాము మాట్లాడుతున్న షాట్ తీయడం మరచిపోయాను’

అతడు ఆ టీవీ కెమెరామన్.

ట్యాగ్ లైన్ : మూఢనమ్మకాలు విశ్వసించరాదు, ప్రచారం చేసుకోవచ్చు.