6, జనవరి 2022, గురువారం
చిలక జోస్యం – భండారు శ్రీనివాసరావు
5, జనవరి 2022, బుధవారం
జంధ్యాల బ్యాచ్ గా పిలవబడే మిత్ర సప్తకం
మొన్న హైదరాబాదులో జరిగిన సుబ్బరాయ శర్మ గారి డెబ్బయ్ అయిదవ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న బెజవాడ ఎస్సారార్ కాలేజ్ జంధ్యాల బ్యాచ్ గా పిలవబడే మిత్ర సప్తకం:
సభ్యతకు పలుకే గీటురాయి
మా చిన్నప్పుడు ‘ఏం గురూ’ అనే మాట మా నోట వినబడితే పెద్దవాళ్ళు తొడపాశం పెట్టేవాళ్ళు. ఇప్పటి పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు కూడా అలా పిలుచుకుంటుంటే అది మరీ అంత చెడ్డ మాట కాదేమో అని అనుకోవాల్సి వస్తోంది. తరాలు మారిపోతున్న కొద్దీ మాటల్లో అర్ధం మారి ‘బూతు’ తగ్గి పోతూ వుంటుందేమో మరి.
"కొన్ని పదాలు పలకడం అంటే తగని అసహ్యం. వాటిని
అక్షరీకరించడం అంటే మరింత అసహ్యం. కోపాన్ని, ఆగ్రహాన్ని,అసహనాన్ని
వ్యక్తీకరించడానికి సభ్య సమాజంలో అటువంటి పదాల అవసరం ఉంటుందని అనుకోను. ఆ అవసరమే వస్తే, పర్యాయపదజాలానికి
తెలుగు భాష గొడ్డుపోలేదు.
“అయినా
కానీ టీవీ చర్చల్లో, ఫేస్
బుక్ రాతల్లో ఇంకా అలాంటి దుష్ట పదాలు అలవోకగా జారిపోతూ వుండడం చూస్తే చాలా బాధ
వేస్తుంది”
3, జనవరి 2022, సోమవారం
“శతాయుష్మాన్ భవ” శర్మ గారూ! – భండారు శ్రీనివాసరావు
పెద్ద చిత్రాల్లో చిన్న పాత్ర అయినా, చిన్న చిత్రాల్లో పెద్ద పాత్ర అయినా పాత్రోచితంగా నటించి మెప్పించే సుప్రసిద్ధ నటుడు శ్రీ ఉప్పలూరి సుబ్బరాయ శర్మ.
శర్మగారికి
నాకూ కొన్ని బాదరాయణ సంబంధాలు వున్నాయి. ఆయనదీ నాదీ డిగ్రీ బెజవాడ ఎస్సారార్
కాలేజి. ఆయనకు రేడియో అంటే రేడియో కాదు, ఆకాశవాణి అంటే చాలా చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే తన మొబైల్ కు రేడియో సిగ్నేచర్ ట్యూన్ ని కాలర్
టోన్ గా పెట్టుకునేంత. ( నా మొబైల్ లో
కూడా అదే ట్యూన్) నాకూ రేడియో అంటే ఇష్టమే
ఎందుకంటే అది నా మాతృసంస్థ కాబట్టి. ఆయనకు డెబ్బయి అయిదు సంవత్సరాలు. నా వయసు ఇంకొంచెం
ఎక్కువ.
సంబంధాలు, పోలికలు ఇంత వరకే. ఆయన పాటించే
స్నేహ ధర్మం విషయంలో కాని, ఆయనకు
వున్న మంచి పెద్ద మనసులో కాని, అబ్బే ఆయనతో నాకు సాపత్యమే లేదు. ఈ విషయంలో ఆయన
నాకంటే చాలా చాలా పెద్దవాడు. లేకుంటే
కలిసి దశాబ్దాలు గడిచిన తర్వాత ఈరోజు ఉదయం ఫోన్ చేసి సాయంత్రం కలుద్దాం అంటారా!
ఆయనకే చెల్లు.
వెళ్లాను.
అప్పుడు తెలిసింది సుబ్బరాయ శర్మ గారి అమృతోత్సవం ఈరోజు అని. 75వ పుట్టిన రోజు అన్నమాట. ఎప్పుడో
నలభయ్ యాభయ్ ఏళ్ళ నాటి పరిచయస్తులు,
చిన్ననాటి స్నేహితులు చాలామంది కలిసారు. ఎస్సారార్ కాలేజ్ మేట్స్
మాధవపెద్ది సురేశ్ (ప్రముఖ సంగీత దర్శకుడు), ఏమ్వీ రఘు (సినీ దర్శకుడు, ప్రసిద్ధ
సినిమాటోగ్రాఫర్) జెన్నీ (ప్రముఖ హాస్య నటుడు), ఒకనాటి ప్రముఖ కథారచయిత దేవరకొండ
మురళి, ధర్మవరపు
రామ్మోహన రావు, ఏలేశ్వరపు
ప్రసాద్,
అలనాటి ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కందుకూరి సూర్యనారాయణ గారు, దూరదర్సన్ ఓలేటి పార్వతీశం, చక్రవర్తి, ప్రసిద్ధ కార్టూనిష్ట్ శంకు,
కళాపోషకుడు మద్దాలి రఘురాం,
జమలాపురం రమణ, ఓపెన్
యూనివర్సిటీ చెన్నయ్య, కోవిడ్
నిబంధనలు లేకపోతే ఇంకా ఎక్కువమంది కలిసేవాళ్ళేమో!
ఇక
ఒకప్పటి నా రేడియో కొలీగ్ వాచస్పతి మురళీకృష్ణ ఈ మొత్తం కార్యక్రమానికి
సంధానకర్తగా సందడి చేశాడు.
సుబ్బరాయ
శర్మ గారి మీద వారి మనుమరాలు మహతి తీసిన చిన్న డాక్యుమెంటరీ అద్భ్తతః. సంస్కృత, ఆంగ్ల, ఆంధ్ర భాషల్లో అనర్ఘలంగా తాతగారి గురించి
చెప్పిన పలుగులు వింటుంటే సుబ్బరాయ శర్మ
గారు చాలా అదృష్ట వంతులు అనిపించింది.
మంచి
భోజనంలో బోలెడు ఆనందాన్ని కలుపుకుని, కడుపులో
నింపుకుని మళ్ళీ ఇంటిబాట పట్టాను.
వయసులో
కొంచెం పెద్దవాడిని అని ఈరోజే తెలిసింది కనుక,
“శతాయుష్మాన్ భవ” శర్మ గారూ!
(03—1-2022)
సర్వనామాలకు సర్వమంగళం – భండారు శ్రీనివాసరావు
పూర్వం కమ్యూనిస్టుల ఏలుబడిలో సోవియట్ యూనియన్ వర్ధిల్లిన కాలంలో రేడియో మాస్కోలో దాదాపు ఎనభైకి పైగా ప్రపంచభాషల్లో వార్తాప్రసారాలు జరిగేవి. నేను తెలుగు విభాగం బాధ్యుడిగా ఉండేవాడిని. అప్పుడు సోవియట్ అధినేత మిహాయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్.
ఇన్ని ప్రపంచ భాషలకు సంబంధించిన వార్తలను ముందు ఇంగ్లీష్ భాషలో తయారు చేసి వాటి ప్రతులను అన్ని విభాగాలకు పంపేవారు. వాటిని ఆయా భాషల నిపుణులు తమ భాషలలోకి అనువదించి ప్రసారం చేసేవాళ్ళు. నాకు సహాయకుడిగా కొద్దిగా తెలుగు తెలిసిన గీర్మన్ అనే రష్యన్ ఉండేవాడు.
‘మీరు అసలు ప్రతి ఇస్తున్నారు సరే. మీ వార్తల్ని మీరు అనుకున్నట్టు యధాతధంగా
అనువదిస్తున్నామా లేదా అనే సంగతి మీకెలా తెలుస్తుంది’ అని అడిగాను. దానికి ఆయన
చెప్పిన సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది.
‘ప్రతి వార్తలో దాదాపు మా నాయకుడి పేరు అనేకసార్లు వస్తుంది. మీరు ఎన్నిసార్లు ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ అంటారో దాన్ని మా వాళ్ళు విని, మా దగ్గర వున్న ఒరిజినల్ బులెటిన్లో ఆ పేరు ఎన్ని సార్లు వచ్చిందో సరిచూసుకుని అప్పుడు మీరు సరిగా అనువాదం చేస్తున్నారో లేదో మావాళ్ళు కనుక్కుంటారు’ అని కర్ణుడి జన్మ రహస్యం నా చెవిన వేశాడు.
అంటే ఇక ఎటువంటి పరిస్తితిలోనూ అతడు, ఆయన అనే సర్వనామాలు పనికిరావు అనేది బోధపడింది.
‘ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ ప్రకటించారు, ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ ఇంకా ఇలా అన్నారు, ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ పేర్కొన్నారు, ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ ఉద్ఘాటించారు’ అంటూ ఒకే పేరాలో నాచేత అష్టోత్తరం చదివిస్తున్నారు అనే వాస్తవం ఎరుకలోకి వచ్చింది.
సరే! ఆ శకం ముగిసింది.
ఇలాంటిదే మరో విశేషం నా కంట పడింది.
ఆఫ్రికా దేశం అయిన ఉగాండాను ఇదీ అమీన్ అనే నియంత పాలించేవాడు. రేడియో కంపాలాలో ప్రతి రోజు అయన గురించిన వార్తలే ప్రముఖంగా ప్రసారం అయ్యేవి. ఆయనకు రేడియోలో తన పూర్తి పేరు చెప్పాలని మక్కువ. నియంత తలచుకుంటే కానిదేముంది. కాకపోతే ఒక ఇబ్బంది ఎదురయింది. పూర్తి పేరు అయితే పరవాలేదు కానీ తనకున్న బిరుదులు, మెడల్స్ కూడా జోడించి చెప్పాలని ఆదేశం. నియంత పాలించే ఆదేశంలో ఆయన ఆదేశం శిరోధార్యమాయే. దాంతో ఒకటికి పదిసార్లు రేడియోలో ఆయన పేరు వచ్చేది. ఒకటికి పదిసార్లు జనం దాన్ని వినాల్సివచ్చేది. ఎలా అంటే ఇలా:
“His Excellency the President of the Republic of
Uganda, General al Haji Idi Amin Dada, VC, DSO, MC……”
2, జనవరి 2022, ఆదివారం
గుర్తింపుకో గుర్తింపు కార్డు – భండారు శ్రీనివాసరావు
(Published in Andhra Prabha on 02—1-2022, SUNDAY)
1, జనవరి 2022, శనివారం
అలవాటులేని ఔపోసనం – భండారు శ్రీనివాసరావు
మాది, అంటే
నాది మా ఆవిడది (కలిపి) గుళ్ళో పెళ్లి.
1971 డిసెంబరు 16 వ తేదీన తిరుపతిలో ‘Simple than the word simple’ గా జరిగింది. మరి ఆ పెళ్లి సంగతి నలుగురికీ తెలియడం ఎల్లా? ఈ ఆలోచనే నన్ను మొదటి సారి ‘గ్రీటింగ్ కార్డు’ ఐడియా దిక్కుగా అడుగు వేయించింది. గ్రీటింగ్ కార్డుల పేరుతొ డబ్బులు
తగలేయడం వృధా అని అప్పటివరకు అనుకుంటూ ఉండేవాడిని.
తిరుపతి నుంచి రాగానే ముందు బెజవాడ గవర్నర్ పేట లోని వాణీ ప్రెస్ కి
వెళ్లి, నా పేరూ, మా
ఆవిడా పేరూ కలిపి ఓ వంద గ్రీటింగు కార్డులు ప్రింటు
చేయించాను. చుట్టపక్కాలకి వాటిని పోస్ట్ చేస్తున్నప్పుడు మరో బ్రిలియంట్ ఐడియా
మనసులో మెదిలింది. ముందూ వెనుకా చూడకుండా దాన్ని
వెంటనే ఆచరణలో పెట్టేసాను. పనిలో పనిగా ఆఫీసులో నా తోటి సిబ్బందికి కూడా ఆ
చేత్తోనే గ్రీటింగు కార్డులు పోస్ట్ చేసాను.
జనవరి ఒకటో తేదీ రానే వచ్చింది. నేను
పనిచేసే లబ్బీపేట ఆంధ్రజ్యోతి ఆఫీసుకి వెళ్లాను. మొదటి
అంతస్తులో గుర్రపు నాడా ఆకారంలోని బల్ల చుట్టూ సబ్ ఎడిటర్లం అందరం కూర్చునే వాళ్ళం. మధ్యలో న్యూస్ ఎడిటర్ వీరభద్రరావు గారు, ఆ దాపునే అసిస్టెంట్ ఎడిటర్ తుర్లపాటి కుటుంబ రావు గారు, ఆ పక్కనే ఇంచార్జ్ ఎడిటర్
నండూరి రామ్మోహన రావు గారు, సీనియర్ సబ్ ఎడిటర్ ఉపేంద్ర బాబు గారు ఇలా అందరం కూర్చుని వున్న సమయంలో అటెండర్ నాగేశ్వరరావు నా
దగ్గరకు వచ్చి పలకరించాడు.
‘ఇన్నేళ్ళుగా ఈ ఆఫీసులో పనిచేస్తున్నాను. ఒక్కరంటే ఒక్కరు కొత్త ఏడాది
శుభాకాంక్షలు చెప్పిన పాపాన పోలేదు. మీరు నిజంగా గ్రేట్. ఏకంగా గ్రీటింగు కార్డే నా పేరు మీద పోస్ట్ చేసారు. చాలా చాలా థాంక్స్ అండీ’ అన్నాడు, అందరూ వింటుండగా. అందరూ నా వైపు గుర్రుగా చూసినట్టు అనిపించింది. ఇంతమంది వుంటే అందర్నీ కాదని ఆఫీసులో పని చేసే అటెండర్ కి గ్రీటింగ్ కార్డా అన్నట్టు చూసారు. మర్నాడు పరిస్తితి పెనం మీద నుంచి
పొయ్యిలో పడ్డట్టు అయింది. పోస్టల్ వాళ్ళ పుణ్యమా అని, నేను పోస్ట్ చేసిన కార్డులన్నీ లెక్క
పెట్టినట్టు రోజుకొక్కటి చొప్పున ఒక్కొక్కరికి, అదీ అడ్డదిడ్డంగా రావడం, రానివాళ్ళు
నా వైపు మరోసారి అదోలా చూడడం ఇదంతా ఇబ్బందిగా మారింది. కార్డు వచ్చిన వాళ్ళు కూడా, విషయం తెలిసి, మళ్ళీ పోస్ట్ చేసి వుంటాడు కానీ మన మీద అతగాడికి అంత కారిపోయే ప్రేమ లేదని పరోక్షంలో గొణుక్కున్నారేమో తెలవదు. కానీ ఆ ఫీలింగు మాత్రం నన్ను పట్టుకుంది. వారం
పది రోజులు ఇలా ఇదో సీరియల్ లాగా సాగింది. ‘చక్కటి కవిత్వం రాసాడు’ అని
మెచ్చుకుంటారని అనుకుంటే సీను కాస్తా రివర్స్ అయింది.
గ్రీటింగు కార్డు ‘గ్రివింగ్ కార్డు
అవడం అంటే ఏమిటో తెలిసివచ్చింది.
అంతే! నేను మరుసటి ఏడు నుంచి మళ్ళీ నా
పాత పద్ధతికి మళ్ళిపోయాను.
గ్రీటింగులు అందుకోవడమే కానీ పంపే
పద్ధతికి స్వస్తి చెప్పాను.