(ఈరోజు ఆంధ్ర ప్రభ దినపత్రికలో ప్రచురితం)
26, డిసెంబర్ 2021, ఆదివారం
నిదురపోరా తమ్ముడా! – భండారు శ్రీనివాసరావు
25, డిసెంబర్ 2021, శనివారం
ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గుడిపూడి శ్రీహరి
1975 లో
నేను హైదరాబాదు ఆలిండియా రేడియో ప్రాంతీయ వార్తా విభాగంలో అసిస్టెంట్ ఎడిటర్ (రిపోర్టింగ్) గా చేరినప్పుడు, నా
ఉద్యోగ బాధ్యత కాకపోయినా వారానికి మూడు రోజులు ఉదయం ఆరుగంటల నలభయ్ అయిదు నిమిషాలకు
ప్రసారం అయ్యే ప్రాంతీయవార్తల బులెటిన్ ఎడిటింగ్ బాధ్యతలు చూసేవాడిని. అప్పుడు
పరిచయం గుడిపూడి శ్రీహరి.
తిరుమలశెట్టి
శ్రీరాములు, డి.
వెంకట్రామయ్య,
జ్యోత్స్నాదేవి రెగ్యులర్ న్యూస్ రీడర్లు. మాడపాటి సత్యవతి గారు అసిస్టెంట్
ఎడిటర్. అప్పుడప్పుడు వార్తలు చదివేవారు. వారి
వీక్లీ ఆఫ్స్, సెలవు
రోజుల్లో వార్తలు చదవడానికి క్యాజువల్ న్యూస్ రీడర్లుగా పీ.ఎస్.ఆర్. ఆంజనేయ
శాస్త్రి,
సురమౌళి,
గుడిపూడి శ్రీహరి గార్లు వచ్చేవారు. అప్పుడప్పుడు అనుకోకుండా గొంతు పట్టేసిన సందర్భాలు వచ్చేవి. అప్పుడు నేనే బులెటిన్ పేపర్లు పట్టుకుని వెళ్లి స్టూడియోలో
కూర్చుని వార్తలు చదివేసేవాడిని. (ఈ
అనుభవం తర్వాత రోజుల్లో నాకు అక్కరకు వచ్చింది. రేడియో మాస్కోలో వార్తలు
చదవడానికి నన్ను ఎంపిక చేసే సమయంలో, వస్తుతః నేను రేడియో విలేకరిని అయినప్పటికీ, , అవసరార్థం నెత్తికి ఎత్తుకున్న ఈ అనుభవం
పనికివచ్చింది)
ఉదయం
పూట న్యూస్ రీడర్లు చదివే వార్తలను ఎడిట్ చేసి ఇవ్వడం నా బాధ్యత. ఉద్యోగంలో
చేరకముందే, స్కూలురోజులనుంచే వీళ్ళు చదివే వార్తలు నేను రేడియోలో వింటూ ఉండేవాడిని. అలాంటి వాళ్ళతో కలిసి పనిచేసే
మహత్తర అవకాశం నాకు రేడియో ఉద్యోగం ఇచ్చింది.
శ్రీహరి
సంగతి కదా చెప్పుకుంటున్నాం.
ఆయన
వయసులో నాకంటే పెద్ద. కానీ ఆహార్యంలో నాకంటే
కుర్రవాడు. హాలీవుడ్ సినిమా హీరో మల్లే నెత్తిన హ్యాటు. చలవ కళ్ళజోడు, కోటు, బూటుతో మోటార్ సైకిల్ మీద ఆయన
రేడియో ప్రాంగణంలో ప్రవేశిస్తూ వుంటే చూడాలి. శ్రీహరి గారి దగ్గర రకరకాల హ్యాట్లు
(టోపీలు కాదు,ఇంగ్లీష్,
హిందీ సినిమాల్లో హీరోలు పెట్టుకునేవి), పలురకాల నల్ల కళ్ళజోళ్లు, కొట్టవచ్చేటట్టు కనబడే ముదురు రంగుల
బుష్ కోట్లు, వీటన్నితో
అసలు వయసు కంటే చాలా చిన్నవాడిగా కనబడేవాడు. అంచేత నేను కూడా చనువు తీసుకుని
ఏకవచనంలోనే సంబోధించేవాడిని. ఆయనా అల్లాగే నన్నూ ఏమోయ్ శ్రీనివాసరావ్ అని
పిలిచేవాడు. అలా అరమరికలు లేని స్నేహం మా నడుమ వుండేది. ఇప్పుడు అలాంటి చనువువుందని
చెప్పలేను. వయసు పెరుగుతున్న కొద్దీ ఇచ్చ్చిపుచ్చుకునే మర్యాదలు, పలకరింపుల్లో
తేడాలు రావడం సహజం.
ఆహార్యానికి
తగ్గట్టే శ్రీహరి వార్తలు చదివే తీరు కూడా విభిన్నంగా వుండేది. బయట కులాసాగా
తిరిగినట్టే స్టూడియో లోపల కూడా బేఫికర్ గా వార్తలు చదివేవాడు. వార్తలు చదువుతూ
గొంతు సవరించుకోవడం, ఊపిరి పీల్చి వదిలిన ధ్వని ఇవన్నీ మా రేడియో వాళ్లకి నచ్చవు.
అదే రిపోర్టులో రాసి ఆయనకు చెప్పమనే వారు. నేను చెబితే ఆయన నవ్వి ఇలా అన్నాడు.
‘మనం
పోటీ ప్రపంచంలో ఉన్నాము. ఇలా అనేవాళ్ళు ఎప్పుడయినా బీబీసీ వార్తలు విన్నారా!
వాయిస్ ఆఫ్ అమెరికా వార్తలు విన్నారా! అక్కడ ఇటువంటివి సహజంగా తీసుకుంటారు.
నిజానికి అలా చేయడం వల్ల ఈ ప్రోగ్రాము ముందుగా రికార్డు చేసింది కాదు, లైవ్ ప్రోగ్రాం అని శ్రోతలకు తెలుస్తుంది
కూడా’
ఆయన
చెప్పింది నాకు సరిగ్గానే అనిపించింది.
ఈ మధ్యనే శ్రీహరికి భార్యావియోగం కలిగింది. ఇద్దరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం అన్నమాట.
ఏదిష్టం? – భండారు శ్రీనివాసరావు
గయలో శ్రాద్ధకర్మలు చేసిన పురోహితుల వారు అడుగుతున్నారు, మీకేది ఇష్టమో దాన్నిఇక్కడ వదిలిపెట్టండి అని.
కళ్ళల్లో నీటిపొర. ఎదురుగా వున్న మనుషులు మసగ్గా కనిపిస్తుంటే, అంతఃచక్షువులకు ఎప్పటెప్పటి సంగతులో
స్పష్టంగా కనిపిస్తున్నాయి.
చిన్నతనంలో
తనకు నెయ్యి అంటే తగని ఇష్టం. చారడు నెయ్యి అరచేతిలో పోస్తే కాని ముద్ద ముట్టేవాడు
కాదు. చిన్ని చిన్ని వేళ్ళని దగ్గరికి ముడుచుకుని, అరచేతిని గుంటగా చేసి అది నిండేదాకా
నెయ్యి పోయాలి. చేతి వేళ్ళ సందులనుంచి జారిపోయి గుంట నిండేది కాదు. మధ్యతరగతి
సంసారాల్లో ఇలా నేతివడ్డన ఎలా సాధ్యం. అయినా నేతి కోసం గుక్క పట్టి ఏడిచేవాడు. ఇది
పని కాదనుకుని చిన్న వెండి గిన్నె చేయించి అందులో నెయ్యి నింపి తన కంచం పక్కన
పెట్టేవాళ్ళు. అదేమిటో కొన్నేళ్ళకు ఆ
ఆలవాటు అదే పోయింది. నేతి మీది ఇష్టం తగ్గిపోయింది.
ఇలాగే
ఎన్నో ఇష్టాలు జీవితంలో భాగమై అవే మెల్లగా తప్పుకున్నాయి.
ఇప్పుడు
ఇన్నేళ్ళ తర్వాత ఏది ఇష్టం అంటే ఏమి చెప్పాలి?
మీరు
ఇప్పటిదాకా నాచేత నువ్వులూ,
నీళ్ళూ తర్పణాలు వదిలించిన నా భార్య అంటే ఇష్టం మాత్రం అలాగే మిగిలిపోయిందని, కానీ వదలడానికి వీలు లేకుండా ముందే ఆమె
నన్ను వదిలిపోయిందని ఆయనగారితో ఎలా చెప్పాలి?
వాజ్ పాయ్ జ్ఞాపకాలు – భండారు శ్రీనివాసరావు
24, డిసెంబర్ 2021, శుక్రవారం
ఉచిత సలహా – భండారు శ్రీనివాసరావు
నిర్మాతల గురించి హీరోలు, ధియేటర్ల వాళ్ళని గురించి నిర్మాతలు, ప్రేక్షకులను గురించి సినిమాహాలు వాళ్ళు, మొత్తం సినీ పరిశ్రమ బాగోగులు గురించి ప్రభుత్వాలు, సానుకూల, సానుభూతి దృక్పథం అలవరచుకోవడం ఒక్కటే పరిష్కారం అనిపిస్తోంది. ఎవరి గిరిలో, బరిలో వాళ్ళుంటే సమస్య ఇంకా బిగుసుకుపోవడం తప్ప జరిగేది ఏమీ వుండదు.
అన్నింటికన్నా ముఖ్యం ఈ సమస్యను రాజకీయ
కోణం నుంచి చూడకపోవడం. రాజకీయం ప్రవేశించిన తర్వాత ఏ సమస్యా పరిష్కారం అయిన
దాఖలాలు తక్కువ.
ఎవరో మిత్రుడు అన్నట్టు ఇది ఉచిత
సలహానే. ఎందుకంటే ధియేటర్లకు వెళ్లి సినిమాలు చూడడం మానేసి మూడేళ్లు అయింది.
సమస్యతో నేరుగా సంబంధం లేదు కాబట్టి ఎన్ని సలహాలు
ఇచ్చినా ఇవ్వవచ్చు.
(24-12-2021)
ఉబుంటు – భండారు శ్రీనివాసరావు
మీరు కరక్టుగానే చదివారు. ఉబుంటు
23, డిసెంబర్ 2021, గురువారం
సింహం తల మనిషి శరీరం
పీవీ గారి సందేహానికి మా అన్నయ్య ఆ పుస్తకంలో చాలా పెద్ద వివరణే ఇచ్చారు.
ఓపిక ఉన్న వారు చదువుకోవడానికి పూర్తి పాఠం ఇస్తున్నాను.
“హిరణ్యకశిపుడు స్వతహాగా మహాబలుడు. దానికి తోడు తపశ్శక్తితో పొందిన వరాలు. అతడిని చంపేందుకు వెళ్ళే విష్ణువు నర సింహ మిశ్రమ రూపం ధరించాల్సి వుంటుంది. అలాంటప్పుడు రెంటిలోనూ గల బలమైన అంశాలనే స్వీకరించాల్సి వుంటుంది. నరుని మేధ సింహపు మేధ కన్నా చురుకు. సింహపు శరీరం నరుడి దేహం కన్నా బలమైనది. కనుక నరుని తల, సింహపు శరీరం కలిస్తే రెండు బలమైన అంశాలను స్వీకరించినట్టు అయ్యేది. కాని విష్ణువు ఈ అవతారానికి సింహపు తల, మనిషి శరీరం ఎన్నుకున్నాడు. రెండు బలహీనమైన అంశాల మిశ్రమం అది. మరి విష్ణువు అలా ఎందుకు చేశాడు? కొందరు కరాటే ఉదాహరణ చెప్పారు. కరాటేలో చేయి బలహీనంగా వుండడంకన్నా ఆ చేయిని ప్రయోగించడంలో చూపే వేగం, గురి, ఏకాగ్రత ప్రధానం. కనుక బలహీనమైన శరీరాన్ని ఎన్నుకున్నా ఇబ్బంది లేదని వారి అభిప్రాయం. అలా అనుకున్నా అట్టి ఏకాగ్రత నరుని మేధ సాధించినట్టు సింహపు మెదడు సాధించగలదా! మానసిక పటుత్వాన్ని సాధించడం నరునికే సాధ్యం కాని సింహానికి కాదు. జంతువు కావాలంటే సింహమే ఎందుకు? జిత్తులమారి నక్క తల అయితే ఇంకా ఎక్కువ ప్రయోజనకారిగా వుండేదేమో! మరి స్వామి సింహపు తలనే ఎందుకు ఎన్నుకున్నట్టు!
హిరణ్యకశిపుడు యావత్ ప్రకృతిని తన కనుసన్నలలోకి తెచ్చుకున్నాడు. అసలు హిరణ్యకశిపుడు అంటే అర్ధం ఏమిటి? కళాప్రపూర్ణ వేదుల సూర్యనారాయణ శర్మగారీ విషయాన్ని తమ ‘అంతరార్ద భాగవతం’ లో చెప్పారు. హిరణ్యం అంటే ప్రకృతి (బంగారం కూడా). కశిపుడు అంటే హింసించేవాడు. ప్రకృతిని తన దోవన పోనీయకుండా, తాను చెప్పిన దోవనే అది నడవాలని కట్టడి చేసినవాడు. ప్రకృతిని అలా నిర్బందించడమే హింస. ఆ రాక్షసుడి కట్టడిలో ప్రకృతి విలవిలలాడిపోయింది.
‘అస్మదీయంబగు నాదేశమున గాని
మిక్కిలి రవి మింట మెరయ వెరచు’
అని ప్రగల్భాలు పలికిన వాడు ఆ రాక్షస రాజు.
అలాగే ఇంద్రుడు, యముడు, అగ్ని, వాయువు అంతా గడగడలాడారు.
పృధు చక్రవర్తి కాలంలో కూడా ప్రకృతి అన్నివిధాల ఆయనకు అనుకూలంగా నడిచింది. దున్నకుండానే పంటలు పండేవి. పృధువు పట్ల భక్తీ గౌరవం వల్లనే కాని చండశాసనుడు అనే భయంతో కాదు. రెంటికీ ఎంత తేడా! నియంతృత్వానికి, ఆదర్శ ప్రజాస్వామ్యానికి ఉన్నంత తేడా.
అలా ప్రకృతిని తన కనుసన్నల్లో పెట్టుకోవడం ఎందుకు? ఇంద్రియ సుఖాలను అనుభవించడానికే. ప్రకృతి అందరికీ అవసరమైన మేరకు ఇస్తుంది. కానీ ఆశ పడ్డంత కాదని గాంధీజీ చెప్పారు.
నరసింహావతారంలో విష్ణువుకి మనిషి తల పనికి రాకపోవడానికి ఈ ఆబే (అత్యాశే) కారణం. మనిషికి ‘ఆశాపాశము తా కడున్ నిడుపులేదంతంబు’. అట్టి ఆశలమారి మేధ ఆబను, కక్కుర్తిని మరింత పెంచుతుంది. తృప్తి చెందదు. సింహం అలా కాదు. అది మృగరాజు. దానికి లేకితనం, పేరాశ లేవు. ఏ పూటకు ఎంత అవసరమో ఆ పూటకు అంతే వేటాడి సంపాదించుకుంటుంది. ఆ పైన దాచుకోవడం ఎరగదు. రేపుమాపు అన్న చింత దానికి లేదు. అన్ని జంతువులూ అలా కాదు. పులీ, చిరుతపులి కూడా వేటాడిన జంతువును దాచుకుని తింటాయి. సింహానికి అది పనికిరాదు. తన కడుపు నిండితే పక్క నుంచి పోయే జంతువులను కూడా అది పట్టించుకోదు. రేపుతో లంకె పెట్టుకొని తత్వం. ఆధ్యాత్మికంగా చూసినప్పుడు అంతకన్నా నిస్సంగత్వం లేదు. ఇలాంటి తత్వం సమాజానికి ఎంతో అవసరం. అట్టి సంస్కృతి వుంటే ప్రస్తుత పర్యావరణం ఇంత దెబ్బతినేది కాదు. అనేక పక్షి, జంతుజాలాలు అంతరించిపోయేవి కావు. మనిషిలో ఆబ పెరగడం వల్లనే ఈ వినాశనమంతా.
అట్టి ఆబ (GREED) లేని సింహం తలను స్వామి ఎంచుకోవడం హిరణ్యకశిపుని ఆబ (GREED) కు వ్యతిరేకంగా వుండే సమాజాన్ని ఆవిష్కరించడం కోసమే. మనిషి శరీరాన్ని ఎంచుకున్నా దాని బలహీనత వల్ల స్వామికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. స్వామిది సంకల్పబలం. నిజానికి తాను ఎలాంటి చావు చావాలో హిరణ్యకశిపుడే కోరుకున్నట్లయింది. అతడు కోరిన కోర్కెలే, అతడు పెట్టిన నిబంధనలే అతడిని సంహరించే వ్యక్తి ఎలా ఉండాలో, ఏ సమయంలో ఎక్కడ ఎలా అతడిని చంపాలో నిర్దేశించాయి”
(ఓం నమో శ్రీ నారసింహాయ, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దివ్య
చరిత్ర, ప్రధమ సంపుటం, రచన: కీర్తిశేషులు భండారు పర్వతాలరావు, సమర్పణ:
శ్రీ వేదభారతి, హైదరాబాదు)