25, డిసెంబర్ 2021, శనివారం

ఏదిష్టం? – భండారు శ్రీనివాసరావు

గయలో శ్రాద్ధకర్మలు చేసిన పురోహితుల వారు అడుగుతున్నారు, మీకేది ఇష్టమో దాన్నిఇక్కడ వదిలిపెట్టండి అని.

కళ్ళల్లో నీటిపొర. ఎదురుగా వున్న మనుషులు మసగ్గా కనిపిస్తుంటే, అంతఃచక్షువులకు ఎప్పటెప్పటి సంగతులో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

చిన్నతనంలో తనకు నెయ్యి అంటే తగని ఇష్టం. చారడు నెయ్యి అరచేతిలో పోస్తే కాని ముద్ద ముట్టేవాడు కాదు. చిన్ని చిన్ని వేళ్ళని దగ్గరికి  ముడుచుకుని, అరచేతిని గుంటగా చేసి అది నిండేదాకా నెయ్యి పోయాలి. చేతి వేళ్ళ సందులనుంచి జారిపోయి గుంట నిండేది కాదు. మధ్యతరగతి సంసారాల్లో ఇలా నేతివడ్డన ఎలా సాధ్యం. అయినా నేతి కోసం గుక్క పట్టి ఏడిచేవాడు. ఇది పని కాదనుకుని చిన్న వెండి గిన్నె చేయించి అందులో నెయ్యి నింపి తన కంచం పక్కన పెట్టేవాళ్ళు.  అదేమిటో కొన్నేళ్ళకు ఆ ఆలవాటు అదే పోయింది. నేతి మీది ఇష్టం తగ్గిపోయింది.

ఇలాగే ఎన్నో ఇష్టాలు జీవితంలో భాగమై అవే మెల్లగా తప్పుకున్నాయి.

ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత ఏది ఇష్టం అంటే ఏమి చెప్పాలి?

మీరు ఇప్పటిదాకా నాచేత నువ్వులూ, నీళ్ళూ తర్పణాలు వదిలించిన నా భార్య అంటే ఇష్టం మాత్రం అలాగే మిగిలిపోయిందని, కానీ వదలడానికి వీలు లేకుండా ముందే ఆమె నన్ను వదిలిపోయిందని ఆయనగారితో  ఎలా చెప్పాలి?     

వాజ్ పాయ్ జ్ఞాపకాలు – భండారు శ్రీనివాసరావు

 

అరవై అయిదేళ్ళ పైమాటే. అప్పటికి ఆ పార్టీ పేరు జనసంఘ్. ఇప్పుడు బీజేపీ. ప్రమిదె గుర్తు. బెజవాడలో ఎన్నికలప్పుడు ఏదో ఒక మూల గోడలమీద ఈ గుర్తు కనబడేది. కానీ జనం గుర్తు పెట్టుకునే వాళ్లు కాదు. ఆరోజుల్లో, ఢిల్లీ నుంచి ఒక పెద్దాయన వస్తున్నాడు, మునిసిపల్ స్కూలు ఆవరణలో సాయంత్రం మీటింగు అంటూ వూళ్ళో టముకు వేసారు. తెలిసీ తెలియని వయసు. అయినా పెద్దవాళ్ళతో కలిసి వెళ్లాను. కాసేపటి తరువాత ఆ వచ్చినాయన మాట్లాడడం మొదలు పెట్టాడు. శుద్ధ హిందీ. ఒక్కరికీ అర్ధం అయినట్టు లేదు. మాటల జడివాన మొదలయింది. పిడుగులు పడ్డట్టుగా ప్రసంగం సాగింది. ఒక్క ముక్క అర్ధం కాకపోయినా స్పీచ్ అంటే ఇలా వుండాలి అని అనిపించింది. వచ్చిన వాళ్ళల్లో చాలామంది ఆయనకు అప్పటికప్పుడే అభిమానులు అయిపోయారు. ఆయన ఎవరో కాదు, తదనంతర కాలంలో దేశానికి అయిదేళ్ళు సుస్తిర పాలన అందించిన ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్.
భాష అర్ధం కాని వారిని సయితం తన వాగ్ధాటితో కట్టిపడేసిన ఆయనకు చివరి రోజుల్లో మాట పడిపోవడం ఏమిటో విధి వైచిత్రం కాకపొతే.
చనిపోయి ఏళ్ళు గడిచిపోయినా ఇప్పటికీ ప్రజల మనస్సులో జీవించేవున్న వాజ్ పాయ్ జయంతి ఈరోజు.

24, డిసెంబర్ 2021, శుక్రవారం

ఉచిత సలహా – భండారు శ్రీనివాసరావు

 నిర్మాతల గురించి హీరోలు, ధియేటర్ల వాళ్ళని గురించి నిర్మాతలు, ప్రేక్షకులను గురించి సినిమాహాలు వాళ్ళు, మొత్తం సినీ పరిశ్రమ  బాగోగులు గురించి ప్రభుత్వాలు,  సానుకూల, సానుభూతి దృక్పథం అలవరచుకోవడం ఒక్కటే పరిష్కారం అనిపిస్తోంది. ఎవరి గిరిలో, బరిలో వాళ్ళుంటే సమస్య ఇంకా బిగుసుకుపోవడం తప్ప జరిగేది ఏమీ వుండదు.

అన్నింటికన్నా ముఖ్యం ఈ సమస్యను రాజకీయ కోణం నుంచి చూడకపోవడం. రాజకీయం ప్రవేశించిన తర్వాత ఏ సమస్యా పరిష్కారం అయిన దాఖలాలు తక్కువ.

ఎవరో మిత్రుడు అన్నట్టు ఇది ఉచిత సలహానే. ఎందుకంటే ధియేటర్లకు వెళ్లి సినిమాలు చూడడం మానేసి మూడేళ్లు అయింది. సమస్యతో నేరుగా సంబంధం లేదు కాబట్టి ఎన్ని సలహాలు ఇచ్చినా ఇవ్వవచ్చు.

(24-12-2021)

ఉబుంటు – భండారు శ్రీనివాసరావు

మీరు కరక్టుగానే చదివారు. ఉబుంటు

దక్షిణాఫ్రికాలోని కొండజాతి జనుల భాషకు చెందిన పదం ‘ఉబుంటు’
దీనికి అర్ధం తెలుసుకునే ముందు ఒక ఉదంతం గురించి చెప్పుకుందాం.
పాశ్చాత్య ప్రపంచానికి చెందిన పరిశోధకుడు ఒకడు ఆ కొండ జాతి ప్రజలు నివసించే ప్రాంతానికి వెళ్ళాడు. ఆడుకుంటున్న కొంతమంది పిల్లలు కనిపించారు. వారిని ఆటపట్టించాలని అనిపించిన ఆ పెద్దమనిషి వారిని దగ్గరకు పిలిచాడు. ఒక స్వీట్ ప్యాకెట్ దూరంగా వున్న చెట్టు మొదట్లో వుంచి చెప్పాడు వారితో.
“మీలో ఎవరు ముందుగా పరిగెత్తుకుంటూ వెడితే వారిదే ప్యాకెట్టు”.
పిల్లలు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. వెంటనే ఒకరి చేతులు ఒకరు పట్టుకున్నారు. అంతా కలిసి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ స్వీట్ ప్యాకెట్ అందుకున్నారు.
తెల్ల మనిషి అది చూసి తెల్ల మొహం వేశాడు. అడిగాడు పిల్లల్ని ఎందుకలా చేసారని. వారు చెప్పిన జవాబే ఈ ‘ఉబుంటు’.
వారి భాషలో ఉబుంటు అంటే మానవత్వం. ఒకరి కోసం మరొకరు అనే అర్ధంలో వాడతారు.
కొండకోనల్లో నివసించేవాళ్ళు అయితేనేం నాగరీకులకంటే వారి గుండె కొండ కంటే పెద్దది.

23, డిసెంబర్ 2021, గురువారం

సింహం తల మనిషి శరీరం


పీవీ గారి వంటి గొప్పవారి గురించి నా బోటి చిన్నవాళ్ల జ్ఞాపకాలు కొన్నే వుంటాయి. అదే అదృష్టం అనుకుని మననం చేసుకుంటూ వుండాలి.



మరణించడానికి కొన్ని నెలలముందు, శ్రీ పీవీ నరసింహారావు హైదరాబాదు వచ్చారు. మాజీ ప్రధాని హోదాలో రాజ్ భవన్ గెస్టు హౌస్ లో బస చేసారు. గతంలో ప్రధానిగా ఆయన అక్కడ దిగినప్పుడు కనబడే హడావిడి యెలా వుండేదో ఒక విలేకరిగా నాకు తెలుసు. ఆయన చుట్టూనే కాదు చుట్టుపక్కల ఎక్కడ చూసినా అధికారులు, అనధికారులు, మందీ మార్బలాలు, వందిమాగధులు, ఆయన కళ్ళల్లో పడితే చాలనుకునే రాజకీయనాయకులు, ఆ వైభోగం వర్ణించ తరమా? అన్నట్టు వుండేది.

నేనూ , ఆకాశవాణిలో నా సీనియర్ కొలీగ్ ఆర్వీవీ కృష్ణారావు గారు, గవర్నర్ రికార్డింగ్ నిమిత్తం వెళ్లి, ఆ పని పూర్తిచేసుకున్నతరవాత, రాజ్ భవన్ గెస్ట్ హౌస్ మీదుగా తిరిగి వెడుతూ అటువైపు తొంగి చూసాము. సెక్యూరిటీ మినహా రాజకీయుల హడావిడి కనిపించక పోవడంతో మేము లోపలకు వెళ్ళాము. ‘పీవీ గారిని చూడడం వీలుపడుతుందా’ అని అక్కడవున్న భద్రతాదికారిని అడిగాము. అతడు తాపీగా 'లోపలకు వెళ్ళండి' అన్నట్టు సైగ చేసాడు. ఆశ్చర్యపోతూ లోపలకు అడుగు పెట్టాము.

పెట్టిన తరవాత, మా ఆశ్చర్యం రెట్టింపు అయింది. పీవీ ఒక్కరే కూర్చుని టీవీలో ఫుట్ బాల్ మాచ్ చూస్తూ కనిపించారు. డిస్టర్బ్ చేశామేమో అన్న ఫీలింగుతోనే, మమ్మల్ని పరిచయం చేసుకున్నాము. లుంగీ మీద ఒక ముతక బనీను మాత్రమే వేసుకునివున్న పీవీగారు నా వైపు చూస్తూ, 'మీ అన్నయ్య పర్వతాలరావు ఎలావున్నాడయ్యా !' అని అడిగేసరికి నాకు మతి పోయినంత పనయింది. ఎప్పుడో దశాబ్దాల క్రితం, పీవీగారు ముఖ్యమంత్రి గా వున్నప్పుడు, రాష్ట్ర సమాచార శాఖలో పనిచేస్తున్న మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు ఆయనకు పీఆర్వో గా కొద్దికాలం పనిచేశారు. అసలు పీవీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నదే అతి కొద్దికాలం. అప్పటి విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. అయినా ఆప్యాయంగా గుర్తు పెట్టుకుని మరీ అడిగారు. అదీ పీవీగారి గొప్పతనం. ఆ తరవాత కూడా ఆయన ఏదో మాట్లాడుతున్నారు కానీ మాకు ‘కలయో వైష్ణవ మాయయో’ అన్నట్టుగావుంది. మేము కలసి కూర్చుంది, కొన్నేళ్ళ క్రితం వరకు దేశాన్ని వొంటి చేత్తో పాలించిన వ్యక్తితో అన్న స్పృహ వుండడం వల్ల, కొంత ఇబ్బంది పడుతూ కూర్చున్నాము. కాసేపటి తరవాత, కొణిజేటి రోశయ్య గారు వచ్చారు. ఆయన్ని చూడగానే పీవీ గారి మొహంలో ఒక రిలీఫ్ కనిపించింది. రోశయ్య గారు వచ్చిన తరువాత కాసేపు వుండి మేము వచ్చేశాము.
అంతకుముందు పీవీ గారిని మరోసారి ఢిల్లీలో కలిసాను. రేడియో మాస్కోలో పనిచేయడానికి మాస్కో వెడుతూ అప్పుడు కేంద్రమంత్రిగా అత్యంత ఉచ్ఛస్థానంలో వున్న పీవీ గారిని కలుద్దామని వెళ్లాను. బంగ్లా అంతటా నిశ్శబ్ధం. కాసేపటి తరువాత ఎవరో అటుగా వస్తే, 'పీవీ గారిని కలవడానికి వీలుంటుందా' అని హిందీలో అడిగాను. అతగాడు బంగ్లాలో ఓ గది చూపించి వెళ్ళిపోయాడు. నెమ్మదిగా తలుపు తోసి చూస్తే ఎదురుగా పీవీ గారు. ఎవ్వరూ లేరు. పరిచయం చేసుకుని మాస్కో వెడుతున్నట్టు చెప్పాను. అప్పుడు ఆయన విదేశాంగ మంత్రి అనుకుంటాను. నా మొహంలో భావాలు పసికట్టినట్టున్నారు.
'పనులు చేసి పెడుతూ వుంటే కదా పదిమంది వచ్చేది' అన్నారు ఆయన తన మొహంలో భావాలు ఏమీ తెలియకుండా.
'మాస్కో ఎందుకయ్యా వేరే దేశంలో మీ రేడియో ఉద్యోగాలు లేవా ? బాగా చలిదేశం. పెళ్ళాం పిల్లలతో ఎలావుంటావు' అని అడిగారు. చాలా ముక్తసరిగా మాట్లాడేవారని పేరున్న పీవీ గారు, నేను వూహించని విధంగా చనువుగా ఆ రెండు ముక్కలు మాట్లాడ్డం నా అదృష్టం అనే భావిస్తాను.

పీవీ గారు మాజీ ప్రధానమంత్రిగా పాల్గొన్న ఒక సదస్సు హైదరాబాదులోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో జరిగింది.
మధ్యాన్నం భోజన విరామ సమయంలో విలేకరులు ఒక్కొక్కరుగా కలుస్తున్నారు. ఆలిండియా రేడియో ప్రాంతీయ విభాగంలో పనిచేసే ఆర్వీవీ కృష్ణారావు గారు నేనూ కాస్త వెనగ్గా నిలబడివున్నాం.
చివరికి ఆయనే మమ్మల్ని దగ్గరకు పిలిచారు.
‘ఏమయ్యా కృష్ణారావూ. ఢిల్లీలో పద్మనాభరావుకి కూడా చెప్పాను. ఏవయ్యా నా టేపులు?”
పీవీ గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తెలుగులో అనేక రేడియో ప్రసంగాలు చేశారు. వాటిని గురించి చేసిన వాకబు ఇది.
కృష్ణారావు గారు ఏదో చెప్పారు.
ఆయన నా వైపు తిరిగారు.
‘మీ అన్నయ్య (కీర్తిశేషులు పర్వతాలరావు గారు) పుట్టపర్తిలో ఉంటున్నాడట కదా! ఏం చేస్తున్నాడు?”
‘నరసింహావతారం గురించి పుస్తకాలు రాస్తున్నాడు’
‘అలా అయితే నేనడిగానని చెప్పు. మనిషి శారీరకంగా సింహం కంటే బలహీనుడు. ఆ అవతారంలో సింహం తలా, మనిషి శరీరం ఏమిటో రాయమని చెప్పు’
నమస్కారం పెట్టి మేము వచ్చేశాము.

పీవీ గారి సందేహానికి మా అన్నయ్య ఆ పుస్తకంలో చాలా పెద్ద వివరణే ఇచ్చారు.

ఓపిక ఉన్న వారు చదువుకోవడానికి పూర్తి పాఠం ఇస్తున్నాను.

హిరణ్యకశిపుడు స్వతహాగా మహాబలుడు. దానికి తోడు తపశ్శక్తితో పొందిన వరాలు. అతడిని చంపేందుకు వెళ్ళే విష్ణువు నర సింహ మిశ్రమ రూపం ధరించాల్సి వుంటుంది. అలాంటప్పుడు రెంటిలోనూ గల బలమైన అంశాలనే స్వీకరించాల్సి వుంటుంది. నరుని మేధ సింహపు మేధ కన్నా చురుకు. సింహపు శరీరం నరుడి దేహం కన్నా బలమైనది. కనుక నరుని తల, సింహపు శరీరం కలిస్తే రెండు బలమైన అంశాలను స్వీకరించినట్టు అయ్యేది. కాని విష్ణువు ఈ అవతారానికి సింహపు తల, మనిషి శరీరం ఎన్నుకున్నాడు. రెండు బలహీనమైన అంశాల మిశ్రమం అది. మరి విష్ణువు అలా ఎందుకు చేశాడు? కొందరు కరాటే ఉదాహరణ చెప్పారు. కరాటేలో చేయి బలహీనంగా వుండడంకన్నా ఆ చేయిని ప్రయోగించడంలో చూపే వేగం, గురి, ఏకాగ్రత ప్రధానం. కనుక బలహీనమైన శరీరాన్ని ఎన్నుకున్నా ఇబ్బంది లేదని వారి అభిప్రాయం. అలా అనుకున్నా అట్టి ఏకాగ్రత నరుని మేధ సాధించినట్టు సింహపు మెదడు సాధించగలదా! మానసిక పటుత్వాన్ని సాధించడం నరునికే సాధ్యం కాని సింహానికి కాదు. జంతువు కావాలంటే సింహమే ఎందుకు? జిత్తులమారి నక్క తల అయితే ఇంకా ఎక్కువ ప్రయోజనకారిగా వుండేదేమో! మరి స్వామి సింహపు తలనే ఎందుకు ఎన్నుకున్నట్టు!

హిరణ్యకశిపుడు యావత్ ప్రకృతిని తన కనుసన్నలలోకి తెచ్చుకున్నాడు. అసలు హిరణ్యకశిపుడు అంటే అర్ధం ఏమిటి? కళాప్రపూర్ణ వేదుల సూర్యనారాయణ శర్మగారీ విషయాన్ని తమ ‘అంతరార్ద భాగవతం’ లో చెప్పారు. హిరణ్యం అంటే ప్రకృతి (బంగారం కూడా). కశిపుడు అంటే హింసించేవాడు. ప్రకృతిని తన దోవన పోనీయకుండా, తాను చెప్పిన దోవనే అది నడవాలని కట్టడి చేసినవాడు. ప్రకృతిని అలా నిర్బందించడమే హింస. ఆ రాక్షసుడి కట్టడిలో ప్రకృతి విలవిలలాడిపోయింది.

అస్మదీయంబగు నాదేశమున గాని

మిక్కిలి రవి మింట మెరయ వెరచు’

అని ప్రగల్భాలు పలికిన వాడు ఆ రాక్షస రాజు.

అలాగే ఇంద్రుడు, యముడు, అగ్ని, వాయువు అంతా గడగడలాడారు.

పృధు చక్రవర్తి కాలంలో కూడా ప్రకృతి అన్నివిధాల ఆయనకు అనుకూలంగా నడిచింది. దున్నకుండానే పంటలు పండేవి. పృధువు పట్ల భక్తీ గౌరవం వల్లనే కాని చండశాసనుడు అనే భయంతో కాదు. రెంటికీ ఎంత తేడా! నియంతృత్వానికి, ఆదర్శ ప్రజాస్వామ్యానికి ఉన్నంత తేడా.

అలా ప్రకృతిని తన కనుసన్నల్లో పెట్టుకోవడం ఎందుకు? ఇంద్రియ సుఖాలను అనుభవించడానికే. ప్రకృతి అందరికీ అవసరమైన మేరకు ఇస్తుంది. కానీ ఆశ పడ్డంత కాదని గాంధీజీ చెప్పారు.

నరసింహావతారంలో విష్ణువుకి మనిషి తల పనికి రాకపోవడానికి ఈ ఆబే (అత్యాశే) కారణం. మనిషికి ‘ఆశాపాశము తా కడున్ నిడుపులేదంతంబు’. అట్టి ఆశలమారి మేధ ఆబను, కక్కుర్తిని మరింత పెంచుతుంది. తృప్తి చెందదు. సింహం అలా కాదు. అది మృగరాజు. దానికి లేకితనం, పేరాశ లేవు. ఏ పూటకు ఎంత అవసరమో ఆ పూటకు అంతే వేటాడి సంపాదించుకుంటుంది. ఆ పైన దాచుకోవడం ఎరగదు. రేపుమాపు అన్న చింత దానికి లేదు. అన్ని జంతువులూ అలా కాదు. పులీ, చిరుతపులి కూడా వేటాడిన జంతువును దాచుకుని తింటాయి. సింహానికి అది పనికిరాదు. తన కడుపు నిండితే పక్క నుంచి పోయే జంతువులను కూడా అది పట్టించుకోదు. రేపుతో లంకె పెట్టుకొని తత్వం. ఆధ్యాత్మికంగా చూసినప్పుడు అంతకన్నా నిస్సంగత్వం లేదు. ఇలాంటి తత్వం సమాజానికి ఎంతో అవసరం. అట్టి సంస్కృతి వుంటే ప్రస్తుత పర్యావరణం ఇంత దెబ్బతినేది కాదు. అనేక పక్షి, జంతుజాలాలు అంతరించిపోయేవి కావు. మనిషిలో ఆబ పెరగడం వల్లనే ఈ వినాశనమంతా.

అట్టి ఆబ (GREED) లేని సింహం తలను స్వామి ఎంచుకోవడం హిరణ్యకశిపుని ఆబ (GREED) కు వ్యతిరేకంగా వుండే సమాజాన్ని ఆవిష్కరించడం కోసమే. మనిషి శరీరాన్ని ఎంచుకున్నా దాని బలహీనత వల్ల స్వామికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. స్వామిది సంకల్పబలం. నిజానికి తాను ఎలాంటి చావు చావాలో హిరణ్యకశిపుడే కోరుకున్నట్లయింది. అతడు కోరిన కోర్కెలే, అతడు పెట్టిన నిబంధనలే అతడిని సంహరించే వ్యక్తి ఎలా ఉండాలో, ఏ సమయంలో ఎక్కడ ఎలా అతడిని చంపాలో నిర్దేశించాయి”

(ఓం నమో శ్రీ నారసింహాయ, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దివ్య చరిత్ర, ప్రధమ సంపుటం, రచన: కీర్తిశేషులు భండారు పర్వతాలరావు, సమర్పణ: శ్రీ వేదభారతి, హైదరాబాదు)

 

 

 


21, డిసెంబర్ 2021, మంగళవారం

మంచి ఎమ్మెల్యే – భండారు శ్రీనివాసరావు

 మంచి ఎమ్మెల్యేనా! అలాంటి వారు కూడా ఉంటారా అనకండి. ఇప్పటి సంగతి నాకు తెలియదు. వున్నారేమో! కానీ నేను విలేకరిగా పనిచేసే రోజుల్లో కొంతమంది  తటస్థపడ్డారు. ఒకరు బత్తిన సుబ్బారావు గారు, మరొకరు చప్పిడి వెంగయ్య గారు. ఇంకొకరు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు. వేరొకరు చిక్కాల రామచంద్ర రావు గారు. ఇంకా వున్నారు కానీ ప్రస్తుతానికి ఈ నలుగురి గురించి చెప్పుకుందాం.

బత్తిన సుబ్బారావు గారు గోదావరి జిల్లానుంచి శాసన సభకు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఒకానొక కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. అతి పేద దళిత కుటుంబం నుంచి మంత్రి స్థాయికి ఎదిగినా ఆయన ఆర్ధిక పరిస్తితిలో ఏమార్పూ లేదు. ఆయన తల్లిగారు కూలీపని చేసుకుని జీవనం గడిపేవారు. రాజ్యసభ ఎన్నికల్లో రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా డబ్బు తీసుకుంటారని ప్రచారం సాగే రోజుల్లో, అనారోగ్యానికి గురై, నిమ్స్ ఆసుపత్రిలో వుండి కూడా వీల్ చైర్ మీద వెళ్లి పైసా తీసుకోకుండా ఓటు వేసి వచ్చారు. చివరకు ఎంతటి గర్భదారిద్య్రంలో కూరుకు పోయారంటే చనిపోయినప్పుడు దహనం చేయడానికి డబ్బులు లేని దౌర్భాగ్య స్తితి.

ఈ విషయాన్ని అప్పటి బీజేపీ శాసనసభ్యులు శ్రీ వేమా, మరికొందరు గోదావరి జిల్లాల సభ్యులు అసెంబ్లీలో ప్రస్తావిస్తే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించి ప్రభుత్వం తరపున కొంత ఆర్ధిక సాయం ప్రకటించారు.

అలాగే, ప్రకాశం జిల్లాకు చెందిన చప్పిడి వెంగయ్య గారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ అభ్యర్ధిగా ఆయన 1994 లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చాలా సింపుల్ గా వుండేవారు.

‘ఎన్నిసార్లు మొత్తుకున్నా ఫలితం వుండడం లేదు, కనీసం ఈసారయినా నా పేరు సరిగా రాయండయ్యా’ అని అసెంబ్లీ కవరేజ్ కి వెళ్ళే పాత్రికేయులతో అనేవారు సరదాగా. ఆయన పేరు చప్పిడి వెంగయ్య. వెంగయ్య అయివుండదు, అది వెంకయ్య అయివుంటుందని  హైదరాబాదు రిపోర్టర్లు  తామే తీర్మానించుకుని, చప్పిడి వెంకయ్య అని రాసేవారు.

వెంగయ్య గారి ఎన్నికల ప్రచారాన్ని కవర్ చేయడానికి హైదరాబాదు నుంచి డెక్కన్ క్రానికల్ తరపున సుశీల్ కుమార్ (ప్రస్తుతం హైదరాబాదు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నతోద్యోగంలో వున్నారు) ప్రకాశం జిల్లాకు వెళ్ళారు. వెంగయ్య గారి ఇల్లు చూసి ఆశ్చర్యపోయారు. రెండే గదులు. టీవీ కాదుకదా, కనీసం రేడియో కూడా లేదు. కాలినడకనే ప్రచారం. అయినా గెలిచారు. కాదు ప్రజలు గెలిపించారు. సుశీల్ ఆ రోజుల్లో వెంగయ్య గారి గురించి క్రానికల్ లో రాసిన రైటప్ చాలా సంచలనాన్ని సృష్టించింది.

మరోసారి ఎన్నికల్లో పార్టీ ఫండ్ స్వయంగా అందచేయడానికి ఒక మంత్రిగారు వెళ్ళారు. కానీ ఆయన పైసా కూడా తీసుకోలేదు. చిత్రం! ఆ ఎన్నికల్లో ఓడిపోయారు’

రాజ్యసభకు ఎన్నికయిన శ్రీ పిల్లి సుభాష్ చంద్ర బోస్ చాలా సౌమ్యులు. రేడియో విలేకరిగా నాకు కొంత పరిచయం వుంది. గతంలో వై.ఎస్. రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన రోజుల్లో కూడా ఆయన నిరాడంబరంగా వుండడం నాకు తెలుసు. వై.ఎస్.ఆర్.కు, ఆయన కుటుంబానికి బాగా కావాల్సిన వారు. గతంలో జగన్ మోహన రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు మంత్రి పదవికి రాజీనామా చేసిన జగన్ పార్టీలో చేరిపోయారు.

రాజ్యసభకు ఎన్నిక అయిన అనంతరం సుభాష్ చంద్ర బోస్ మాట్లాడిన విషయాలు విన్నప్పుడు తనని రాజకీయాల్లో ప్రోత్సహించిన వారిని ఆయన ఎలా గుర్తుంచుకున్నదీ తెలిసి ఆశ్చర్యం వేసింది. ఇలాంటి సందర్భాలలో ఎవరయినా సరే, ముందు తమ పార్టీ నాయకుడిని పొగడ్తలతో ముంచెత్తిన తర్వాతనే ఇతరులను తలుచుకుంటారు.

కానీ ఆయన ముందుగా తలచుకున్న రాయవరం మునసబు ఎవరన్నది ఈ తరం వారికి తెలియదు. ఆయనే తనకు రాజకీయాల్లో ఓనమాలు నేర్పించారన్నారు. ఒకానొక కాలంలో రాయవరం మునసబు అంటే జిల్లామొత్తానికి తెలిసిన పేరు. ఆయన జిల్లా దాటి రాజకీయాలు చేసింది లేదు. కానీ రాష్ట్ర రాజధానివరకు ఆయన ఎవరో తెలుసు.

తర్వాత తలచుకున్న పేరు వై.ఎస్. ఆయన తనను రాజకీయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ని చేశారని సుభాష్ చంద్ర బోస్ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆ పిదప వై.ఎస్. జగన్ వల్లనే తనకు ఇన్ని రాజకీయ పదవులు వచ్చాయని చెప్పుకొచ్చారు.

పదవిని అనుభవించిన రోజుల్లో నాయకుడే తమ అధినాయకుడని ప్రస్తుతించి పదవి పోగానే అతడెవరో తెలియనట్టుగా ప్రవర్తించే రాజకీయ నాయకులు కోకొల్లలుగా ఉన్న నేటి రాజకీయాలు మాత్రమే తెలిసిన ఈనాటి తరానికి ఈ రకం నాయకులు నిజంగా కొత్తే.

ఈ విధేయతలు అనేవి పార్టీ వ్యవహారాలు. అవి పక్కన పెడదాం. మరి ఆయన నిరాడంబరత్వం. దాన్ని గురించి తప్పనిసరిగా చెప్పుకోవాలి.

గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పిల్లి సుభాష్ చంద్ర బోస్ మంత్రిగా వున్నప్పుడు మా అన్నయ్య భండారు రామచంద్రరావు గారు మా వదినె గారితో కలిసి వైజాగ్ నుంచి హైదరాబాదు రైల్లో వస్తున్నారు. ఇద్దరికీ ఏసీ సెకండ్ క్లాసులో అప్పర్ బెర్తులు దొరికాయి. కింద బెర్తులు ఖాళీగా వుంటే, టీసీని అడిగారు. రాజమండ్రిలో ఒక మంత్రి గారి కోసం రిజర్వ్ అయ్యాయి, లాభం లేదు అన్నాడాయన. మంత్రి గారికి ఫస్ట్ ఏసీ ఎలిజిబిలిటీ వుంటుంది కదా, ఈ సెకండ్ ఏసీ ఎందుకు అనేది మా అన్నయ్య అనుమానం.

రాజమండ్రి వచ్చేసరికి తొమ్మిది దాటింది. మంత్రిగారు భార్యతో కలిసి బోగీలోకి వచ్చారు. సామాన్లు సర్దుకున్న తరువాత ఆయన మా అన్నయ్యని అడిగారట. మీ మిసెస్ పైకి ఎక్కి పడుకోవడం కష్టం, ఆవిడ, మా ఆవిడ కింద బెర్తుల్లో పడుకుంటారు, మనం పైన సర్డుకుందాం అన్నారట ఆ మంత్రిగారు. ఇది విని మా అన్నయ్య ఎంతో ఆశ్చర్యపోయారు.

ఆయన ఎవరో కాదు, ఈనాటి రాజ్యసభ సభ్యులు అయిన పిల్లి సుభాష్ చంద్ర బోస్ గారు.

మంత్రిగారికి ఫస్ట్ ఏసీ ఎలిజిబిలిటీ వున్న మాట నిజమే. కానీ మా మేడం గారు ఆయనతో ప్రయాణం చేస్తే మాత్రం సెకండ్ ఏసీ బుక్ చేయమంటారు”

మర్నాడు ఉదయం సికిందరాబాదులో రైలు దిగిన తర్వాత మంత్రిగారి పియ్యే మా అన్నగారి అనుమానం తీర్చారు.

మరో ఉదంతం చెప్పుకుందాం.

మంత్రిగారు ఆఫీసులో రివ్యూ మీటింగులో వుండగా ఇంటర్ కం మోగింది.

అవతల పియ్యే.

సార్! ఇంటి నుంచి ఫోన్, మేడం గారు లైన్లో వున్నారు’

మంత్రిగారు విసుగ్గా ఫోన్ తీసుకున్నారు. మరింత విసుగ్గా అన్నారు.

ఎన్ని సార్లు చెప్పాను, ఆఫీసులో మీటింగులో వున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దని. ఇంతకీ ఏమిటంత అర్జంటు పని’

‘........’

కారు పపించాలా! ఎందుకు ఈమీటింగు కాగానే నేనే ఇంటికి వస్తున్నాను. ఈ అరగంటలో కొంపలేం మునగవ్. డ్రైవర్ అటూ ఇటూ రెండు సార్లు తిరగడం దండగ. నేను వచ్చాక వెడుదువ్ కాని’

ఆరోజు మంత్రి ఛాంబర్లో దివాలా తీసిన ప్రూడెన్షియల్ సహకార పట్టణ బ్యాంకు గురించిన మీటింగ్ జరుగుతోంది. సీనియర్ ఐఏఎస్ అధికారులయిన సహకార శాఖ కార్యదర్శి శ్రీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, సహకార శాఖ రిజిస్ట్రార్ శ్రీ గార్గ్, ఆ బ్యాంక్ లిక్విడేషన్ వ్యవహారాలను చూడడానికి నియమితులయిన ఎస్బీఐ రిటైర్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ అయిన మా రెండో అన్నయ్య భండారు రామచంద్ర రావు అందులో పాల్గొంటున్నారు.

నిజానికి మంత్రులు ఇంటి పనులకోసం అధికారిక వాహనాలను వాడుకోవడం అనేది సామాన్యంగా జరిగే విషయమే. అలాటి వాటిని చాలా సాధారణ విషయంగా తీసుకోవడానికి జనం అలవాటుపడ్డారు. ప్రతి మంత్రికీ ఆయన శాఖ కిందికి వచ్చే కార్పొరేషన్ వాళ్ళే వాహనాలు ఒకటో రెండో అదనంగా సమకూర్చడం అనేది బహిరంగ రహస్యమే. మరి ఇదేమిటి ఈ మంత్రిగారు భార్య కారు కావాలంటే ఇలా విసుక్కుంటున్నారు?

ఆయన అంతే! ఆయన మంత్రే కాని అందరివంటి వాడు కాదు. ఆయన పేరే చిక్కాల రామచంద్రరావు. అనేకమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవులు నిర్వహించారు. మంత్రి అయిన తర్వాత కూడా ఆయన తన సొంత అంబాసిడర్ కారునే వాడేవారు. ప్రభుత్వం ఇచ్చే అలవెన్స్ వాడుకునేవారు.

సింపుల్ గా వుండడం ఆయనకు ఇష్టం. మంత్రిగా వున్నప్పుడు ఈ ఇష్టాన్ని మహబాగా తీర్చుకున్నారు.

 

 

 

20, డిసెంబర్ 2021, సోమవారం

నేను హిందువుని

 

(హిందూ అనగానే మనువును గుర్తు చేసుకోవద్దు. మనువు పుట్టక ముందే హిందూ మతం వుంది. నిజానికి ఇది ఒక మతం కాదు, జీవన విధానం)

నేను ఆచరించి, పాటించే హిందూ మతం గురించి నాకు మా పెద్దవాళ్ళు చెప్పింది వేరు. నేనిప్పుడు చూస్తున్నది వేరు.

ఎందరు గజనీలు దండెత్తి వచ్చినా, ఎందరు ఘోరీలు యుద్ధాలు చేసినా హిందూ దేవతా విగ్రహాల ధ్వంసం చేయగలిగారు కానీ హిందూ మత ధర్మాన్ని ఏమీ చేయలేకపోయారు. వందల వేల సంవత్సరాలు విదేశీయుల ఏలుబడిలో వున్నా హిందూ మతం చెక్కుచెదరలేదు. అదీ ఈ మతం గొప్పతనం. అంచేత ఎవరో ఏదో చేస్తారనీ, చేస్తున్నారనీ అనుకోవడంలో సహేతుకత వుందని నేననుకోను. సాధారణంగా నేను మతపరమైన, రాజకీయ పరమైన విషయాలపై వ్యాఖ్యానాలు చేయను. కానీ ఈ నడుమ సాంఘిక మాధ్యమాల్లో ఒకరకమైన మొండి ధోరణి కనబడుతోంది. ఇది మన మత విధానాలకే వ్యతిరేకం. హిందూ మతాన్ని మొండిగా సమర్ధించే వాళ్ళలో కనీసం కొందరు కూడా మతం చెప్పిన దాన్ని పాటించడం లేదు. సహనావతు అనేది వేదవాక్యం. ఆ సహనం ఇవ్వాళ కనబడడం లేదు. ఇతర మతాల వాళ్ళు ఏం చేస్తున్నారనే దానితో నిమిత్తం లేదు. ఏమి చేసినా ఏమీ కాదు. చరిత్రే ఇందుకు సజీవ సాక్ష్యం.

నా దృష్టిలో హిందూ మతం బలమైన పునాదులపై ఉద్భవించింది. తనని తాను కాపాడుకోగల సామర్ధ్యం, సత్తా ఈ మతానికి ఈనాటికీ పుష్కలంగా వుంది. అందుకు సందేహం లేదు.  (December, 2017)