15, డిసెంబర్ 2021, బుధవారం

నాన్నకు నివాళి – యాజి

 


జంధ్యాల వెంకటేశ్వర్లు గారు మరణించి నలభయ్ ఏళ్ళు దాటిపోయాయి. ఆయన తన జీవిత కాలంలో రాసుకున్న అనేక రచనలు కొన్ని వెలుగు చూసాయి. మరికొన్ని వ్రాత ప్రతులుగానే మిగిలిపోయాయి. వారి కుమారుడు జే.వి.పి.ఎస్. సోమయాజులు (యాజి) గారు వాటిని క్రోడీకరించి ‘నాన్నకు నివాళి’ పేరుతొ  ప్రచురించారు.

ఈ పుస్తకం ఈరోజు నా చేతికి అందినప్పుడు యాదాలాపంగా కొన్ని పేజీలు  తిరగేశాను. విషయ సూచికలో చంద్రమౌళీశ్వర శతకం, చంద్రమౌళీశ్వరి శతకం అని కనపడ్డాయి. ఇందులో రెండోది కొంత విచిత్రంగా అనిపించింది. చంద్రమౌళీశ్వరి అని అమ్మవారి పేరు మీద వుండడం దానికి కారణం.

సరే! అది పక్కనబెట్టి ఈ పుస్తకానికి పరిచయ వాక్యాలు రాసిన విశ్వనాధ వారి పలుకుల్లో ఆయన శైలి ప్రస్పుటంగా  ఉన్నప్పటికీ వాటిలో రాసిన విషయాలు పుస్తకం మీద ఆసక్తి కలిగించేవిగా వున్నాయి.

కవిసామ్రాట్ కధనం ఇలా సాగింది.

“పంచశీలను గురించి, చీనా దురాక్రమణ గురించి కూడా వీరు (వెంకటేశ్వర్లు గారు) వ్రాసిరి. ఒక దృష్టితో చూచినచో వారు వ్రాసినదంతయు సమంజసముగా కన్పించును. సామంజస్యమనగా నేమి? పాఠకుని ఇష్టప్రకారముండుట. వానికి కొన్ని యభిప్రాయములుండును. ఆ అభిప్రాయములు తాను చదివిన గ్రంధములో నున్నచో వాడు గొప్ప కవి.  లేనిచో కాదు. సర్వ విధములైన భావములను చదివి వానియందున్న గుణములను చూడగలవాడే పాఠకుడు”   

ఈ అభిప్రాయం 1967 నాటిది. ఇది చదివిన తర్వాత విశ్వనాధ వారి దూరదృష్టి బోధపడింది. తర్వాత ఎప్పుడో దశాబ్దాల తర్వాత వచ్చిన ఫేస్ బుక్ పాఠకుల మనస్తత్వాన్ని ఆయన అంత ముందుగా ఎలా పసికట్ట కలిగారా అని అనిపించింది.

పొతే రచయిత పేరు చూసినా, విషయ పట్టిక చూసినా ఇందులో ఆధ్యాత్మిక భావాలు తప్ప వేరేమీ ఉండకపోవచ్చు అనే అభిప్రాయం కలుగుతుంది. కానీ ఈ రచయిత రాసిన పద్యాలు చదివితే, గ్రాంథికభాషలో రాసిన శ్రీశ్రీ కవితల విప్లవతత్వం గోచరిస్తుంది.

అంటరానితనాన్ని ఏవగించుకుంటూ  జంధ్యాల వారు అల్లిన పద్యం మచ్చుకు ఒకటి:

“వేయి పల్కులేల వీధులందున సూక

రములు గార్దభములు గ్రామసింహ

ములు నిరంతరంబు మెలగవచ్చును గాని

అడుగునిడలేడు హరిజనుండు”

 

“నీచముగ నిట్లు మిమ్ముల జూచువారి

పొలము పనులకు మీరలు పోవనేల?

వారి వీధుల నడుగిడి ఘోరమైన

శాపముల బొందనేల నిష్కారణముగ!”

అలాగే రెండు శతకములలో కూడా మకుటంగా చంద్రమౌళీశ్వరా! చంద్రమౌళీశ్వరీ! అనే శివ పార్వతుల సంబోధనలు ఉన్నప్పటికీ ఆ పద్యాలలోని సారాంశం అంతా సామాజికమే కావడం ఓ విశేషం. మరో విశేషం ఏమిటంటే రచయిత కీర్తిశేషులు జంధ్యాల వెంకటేశ్వర్లు గారు విశ్వనాధ వారికి గొప్ప అభిమాని, శిష్యుడు, మిత్రుడు కూడా. విశ్వనాధ వారు తాము రచించిన ప్రద్యుమ్నోదయం ప్రబంధ కావ్యాన్ని తమ స్నేహానికి గుర్తుగా వెంకటేశ్వర్లు గారెకి అంకితం ఇచ్చారు.



తొంభయ్ పేజీల ఈ పుస్తకం ప్రచురణకర్త శ్రీమతి జంధ్యాల కల్పకం. ప్రతులకు (మూల్యం ఇవ్వలేదు) శ్రీ JVPS SOMAYAJULU, Mobile: 98490 80949        

బస్సులో వచ్చిన మనిషి హెలికాప్టర్ ఎలా సంపాదించాడు?

 రోశయ్య గారి గురించిన మరో జ్ఞాపకం – భండారు శ్రీనివాసరావు

నాయుడమ్మ అవార్డు తీసుకునేవాడు అల్లాటప్పా మనిషి కాకూడదు అనేది ఆ అవార్డు కమిటీ బాధ్యుడు అయిన  విష్ణుమూర్తిగారి  మొదటి షరతు. దానికి కట్టుబడే ఇరవై నాలుగుమంది ప్రముఖులకు  ఏడాదికి ఒక్కరి చొప్పున ఇన్నేళ్ళుగా ఆ అవార్డును తెనాలిలో ఇస్తూనే వచ్చారు.

 ఇక ముఖ్య అతిధి సంగతి, ఆయన ముఖ్యమంత్రి అయినా, గవర్నర్ అయినా తెనాలి రావాల్సిందే. విష్ణుమూర్తి గారి  ఈ షరతు కారణంగా కొందరు రావడానికి ఒప్పుకుని కూడా రాలేని పరిస్తితి. వారిని తప్పుపట్టడానికి కూడా వీల్లేదు.

ఒకసారి సామ్ పెట్రోడా కి నాయుడమ్మ అవార్డు  ఇవ్వాలనుకున్నారు. కానీ ఆయన్ని ఒప్పించడం ఎలా! సీనియర్ జర్నలిస్ట్  ములుగు సోమశేఖర్  ఇత్యాది బృందం తలలు పట్టుకున్నారు. ఈ బృందంలో హిందూ మాధవరావు గారు, వెనిగళ్ళ  వెంకటరత్నం,  జ్వాలా, నేనూ శాశ్వత ఆహ్వానితులం. మా కార్యస్థానం లక్ డి కా పూల్ లోని ద్వారక హోటల్ లో ఒక రూము. తెనాలి నుంచి బస్సులో హైదరాబాదు వచ్చి విశుమూర్తి గారు రెగ్యులర్ గా దిగే హోటల్ అదే.

చేతులకు, మూతులకు పనులు చెబుతూనే, తలలు పట్టుకోగా, పట్టుకోగా  చివరికి ఓ మార్గం దొరికింది. ప్రముఖ చిత్రకారుడు ఎస్వీ రామారావు గారు చికాగోలో వుంటారు. ఆయనకీ, పెట్రోడా గారికీ స్నేహం అన్న సంగతి సోమశేఖర్ బయట పెట్టాడు. అంతే! అమెరికాలో ఉన్న ఆయన్ని పట్టుకుని పెట్రోడా మహాశయుల్ని ఒప్పించడం జరిగింది.  అక్కడికి ఒక సమస్య తీరింది.

అవార్డు కార్యక్రమం రోజు ఉదయం  సామ్ పెట్రోడా మహాశయులు ఢిల్లీ నుంచి హైదరాబాదు విమానంలో  వస్తారు. ఆయన్ని అదేరోజు తెనాలి తీసుకుపోయి, మళ్ళీ తీసుకురావాలి అంటే హెలికాప్టర్ కావాలి. రోడ్డు మార్గంలో సమయం సరిపోదు. మరెలా!

మళ్ళీ మిత్రబృందం ద్వారకలో భేటీ అయి మరోసారి తలలు పట్టుకుంది. అంతే! ఓ ఐడియా తలుక్కున మెరిసింది.

హెలికాప్టర్ సదుపాయం వున్న ముఖ్యమంత్రిని ముఖ్య అతిధిగా పిలిస్తే!

ఇక్కడ తెనాలి, తెనాలి వరస కుదిరింది. పొలోమని వెళ్లి రోశయ్యగారికి చెప్పుకోవడం, ఆయన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిని ముఖ్య అతిధిగా ఒప్పించడం చకచకా జరిగిపోయాయి. అప్పుడు మరో అవాంతరం. అది బయట వాళ్ళనుంచి కాదు, ఏకంగా విష్ణుమూర్తి గారి నుంచి. చెప్పాకదా! ఆయనో సీతయ్య. ఎవరి మాట వినరు.

హెలికాప్టర్ వెలుతురు వున్నప్పుడే తెనాలి నుంచి టేకాఫ్ అవ్వాలి. ప్రోగ్రాంని కాస్త ముందుకు జరపవయ్యా మగడా అంటే  విష్ణుమూర్తి గారు ససేమిరా అంటాడు.

మొత్తం మీద కాస్త పట్టు సడలించేలా చేయడానికి ద్వారకలో కాస్త ఎక్కువ సమయం గడపాల్సి వచ్చింది.

 ఇక శుభం కార్డు వేయొచ్చు అనేంతలో, వై.ఎస్.ఆర్. ఆ కార్యక్రమానికి హాజరుకాలేనటువంటి అర్జంటు పనేదో పడింది. అయితే ఆ సమస్యను ఆయనే తెలివిగా పరిష్కరించారు. రోశయ్యగారయితే ప్రసంగాలు చేయడంలో దిట్ట, నా బదులు ఆయన వస్తారని చెప్పి మొత్తం మీద టెన్షన్ తగ్గించారు. ముఖ్య అతిధిగా రోశయ్యగారు, అవార్డు గ్రహీతగా సామ్ పెట్రోడా గారు హెలికాప్టర్ లో హైదరాబాదునుంచి తెనాలి వెళ్లి వచ్చారు.

ఇన్నిన్ని పనులు చక్కబెట్టాలంటే ఆ వ్యక్తి వెనుక యెంత దన్ను వుండాలి?

విష్ణుమూర్తి గారి వెనుక ఏమీ లేదు, కేవలం పట్టుదల, పని పట్ల నిబద్ధత తప్పిస్తే!

ఓ చేదు జ్ఞాపకం మా పెళ్లి రోజు - భండారు శ్రీనివాసరావు


రెండేళ్ళ నాడు ఆగస్టు మొదటి వారంలో మిత్రుడు జ్వాలా, మా మేనకోడలు విజయలక్ష్మి దంపతుల యాభయ్యవ వివాహ వార్షికోత్సవం జరిగింది. హితులు, సన్నిహితులు, చుట్టపక్కాల నడుమ జ్వాలా దంపతుల పిల్లలు ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగలా నిర్వహించారు. “మరో రెండేళ్లలో మీ గోల్డెన్ జూబిలీ రెడీగా వుండు దుర్గత్తయ్యా!” అంది మా మేనకోడలు మా ఆవిడతో.

దేవతలకు ఉన్నట్టే మాఆవిడకు అనేక పేర్లు. పుట్టినప్పుడు కన్న తలితండ్రులు బియ్యంలో రాసి పెట్టిన పేరు కనకదుర్గ. కానీ ఆమె పుట్టింటి వాళ్ళందరూ చిట్టి అనే పిలిచేవాళ్ళు. పెళ్లి అయిన తర్వాత మా బామ్మ గారు నిర్మల అని మార్చింది. స్నేహితులందరికీ ఇదే పేరు వాడుక. చుట్టాల్లో చాలామందికి చుట్టరికం ఏదైనా అందరికీ ఆవిడ దుర్గత్తయ్యే.

సిల్వర్ తప్పితే మా ఆవిడకు గోల్డ్ ఇష్టం లేనట్టుంది. అందుకే అప్పటిదాకా ఆగకుండా వెళ్ళిపోయింది.

రేపు డిసెంబరు పదహారు మా పెళ్లిరోజు.
ఆ రోజు గురించి తలచుకుని మురిసిపోయే మంచి సంగతులేవీ మాకు లేవు. ఎందుకంటే అది కన్నీళ్ళ పెళ్లి.

1971 డిసెంబరు 15 వ తేదీ రాత్రి మద్రాసు నుంచి అంబాసిడర్ కారులో తిరుపతి ప్రయాణం. దారిలో భోరున వాన. అట్లా ఇట్లా కాదు, ఉరుములు, మెరుపులు, పిడుగులు. మధ్యమధ్యలో ఆగుతూ తెల్లారేలోపునే తిరుమల చేరాము. ఎస్వీ కాటేజీలో పైన గదులు తీసుకున్నాము. పురోహితుడు ఎలా దొరికాడో తెలవదు. మా ఆవిడ పిన్నివసుంధర కొన్న నీలం రంగు ఫారెన్ నైలెక్స్ చీరే పెళ్లి చీరె. నేను ధోవతి కట్టుకున్నానో, ప్యాంటు షర్టుతో పెళ్లి చేసుకున్నానో గుర్తు రావడం లేదు. ఎందుకంటే సందర్భం, సన్నివేశం అలాంటివి. తొమ్మిదీ పది గంటల నడుమ పెళ్లి జరిగిపోయింది. వెంటనే వెళ్లి బాలాజీ దర్శనం చేసుకున్నాము. ఇప్పట్లోలా క్యూ లైన్లు లేవు. కొండ దిగి వచ్చి భోజనం చేసి వచ్చిన కారులోనే మళ్ళీ మద్రాసు వెళ్ళాము. మా ఆవిడ స్నేహితులు టీ నగర్ హోటల్లో విందు ఇచ్చారు. అటునుంచి మా మామగారి వద్దకు వెళ్లాం. కూతుర్ని చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. “నీకు ఏం తక్కువ చేస్తానని అనుకుని ఇలా పెళ్లి చేసుకున్నావ”ని మా ఆవిడను అడిగారు. కన్నీళ్ళే జవాబు.
రిజర్వేషన్ల గొడవ లేని రోజులు. అంచేత 16 వ తేదీ రాత్రి రైల్లో బయలుదేరి మర్నాడు ఉదయం బెజవాడ చేరుకున్నాము. రిక్షా చేసుకుని మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారింటికి వెళ్ళాము. మా అమ్మగారు కూడా అక్కడే వుంది. మమ్మల్ని చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. కాళ్ళకు దణ్ణం పెట్టగానే దగ్గరకు తీసుకుని మనసారా ఆశీర్వదించింది.
‘పెళ్లి వద్దు! పెళ్ళాం కావాలి’ అనే నా మొండి పట్టుదల ఫలితం మా పెళ్లి. ఇరువైపుల పెద్దల చేత కళ్ళనీళ్ళు పెట్టించింది కూడా. బహుశా అదే ఆఖరిసారి కావచ్చు.
పెళ్లి అనేది ఇద్దరి మధ్య వ్యవహారం. మూడో వ్యక్తికి ఇందులో సంబంధం లేదు. పెళ్లి మీద ఖర్చుచేయడం వృధా అనే సిద్దాంతాన్ని నాకు నేనే ప్రతిపాదించుకుని, దానిమీదే భీష్మించుకుని కూర్చోవడంతో మా ప్రేమ పెళ్ళికి పెద్దల ఆమోదం లభించినా కొన్నేళ్ళు గా వాయిదా పడుతూ వచ్చింది. ఒక్కగానొక్క పిల్లకు గుళ్ళో పెళ్లి చేయలేను అనే మా మామగారి వాదన నేను పట్టించుకోలేదు.
అందుకే ఆయన ఇష్టపడిన పెళ్లిని ఇష్టం లేని గుళ్ళో పెళ్ళిగా చేసుకోవాల్సివచ్చింది. పెద్దతనంలో ఇప్పుడు తలచుకుంటే చిన్నతనంగా అనిపిస్తుంది.
ఏదిఏమైనా అన్నింటినీ నా జ్ఞాపకాలకు వదిలేసి తాను తప్పుకుని వెళ్ళిపోయింది. పెళ్ళంటే నా ఇష్టప్రకారం చేసుకున్నాను. ఇది నా చేతిలో లేదుగా!
(దండలు కూడా లేని పెళ్ళికి ఫోటోలు ఏమి వుంటాయి?)

14, డిసెంబర్ 2021, మంగళవారం

గీతాజయంతి

 కంచి పరమాచార్య వద్దకు ఒక పండితుడు వచ్చి తనను తాను పరిచయం చేసుకున్నాడు. భగవద్గీత ప్రవచనంలో తనకు అద్భుతమైన అనుభవం వుందనీ, పది రోజులపాటు గీతను బోధించడానికి ఏదైనా స్థానిక దేవాలయంలో వసతి కల్పిస్తే తన పాండిత్యాన్ని ప్రదర్శిస్తానని చెప్పాడు. స్వామి అలాగే అన్నారు.

మొదటి రోజు సుమారు యాభై మంది దాకా ఆయన ఉపన్యాసం వినడానికి వచ్చారు. మరునాడు సగం తగ్గిపోయారు. మూడోనాడు వచ్చిన జనం వేళ్ళమీద లెక్కబెట్టే విధంగా అతితక్కువగా వున్నారు. ఆ పండితుడు పరమాచార్యను కలిసి చెప్పాడు. “ఏమి కాంచీపురం అండీ ఇది. ఇంతకష్టపడి భగవద్గీతను చెబుదామని వస్తే మొదటి రోజు పట్టుమని యాభై మంది కూడా రాలేదు. మర్నాడు ఇంకా పలచపడ్డారు. వరస చూస్తుంటే రేపు ముగ్గురు కూడా వచ్చేట్టు లేరు.”

స్వామి మందహాసం చేసి ఇలా అన్నారు.

“నువ్వు అదృష్టవంతుడవే! కృష్ణ పరమాత్మ భగవద్గీత బోధించినప్పుడు వినడానికి వున్నది ఒకే ఒక్కడు. అందుకు సంతోషించు”

 

(మా అన్నయ్య భండారు పర్వతాలరావు గారు రాసిన పరమాచార్యుల పావనగాధలు పుస్తకం నుంచి)

 

 

భగవద్గీతా గానము, పావన గంగా స్నానము

 

తాతయ్య పొద్దున్నే లేచి భగవద్గీత చదువుతుండేవాడు. అది భగవద్గీత అని చాలా రోజులకుగానీ మనవడికి తెలియలేదు. అయితే ఎన్నిసార్లు విన్నా ఒక్క ముక్క అర్ధం అయ్యేది కాదు. ఆ సంగతి తెలిసి తాతయ్య చెప్పాడు. 'ఇదిగో ఈ ఖాళీ బొగ్గుల బస్తా తీసుకు వెళ్లి మన ఇంటి దగ్గర వాగులో నుంచి ఓ బస్తాడు నీళ్ళు పట్రా'

మనమడు వెళ్ళాడు. బస్తాను నీళ్ళల్లో ముంచి తీసాడు. ఒక్క చుక్క కూడా మిగలకుండా మొత్తం నీళ్ళు కారిపోయాయి. మనుమడు మళ్ళీ ముంచి తీసాడు. మళ్ళీ తీసాడు. ఎన్ని సార్లు ముంచి తీసినా చారెడు నీళ్ళు కూడా బస్తాలో మిగిలేవి కావు. ఇలా కాదనుకుని ఈసారి బస్తాను నీటిలో ముంచి క్షణం ఆలస్యం చేయకుండా పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి చేరేసరికల్లా మళ్ళీ బస్తా ఖాళీ. 'తాతయ్యకు కావాల్సింది నీళ్ళే అయినప్పుడు బస్తా ఎందుకు బకెట్టు తీసుకువెడితే సరి' అని అది చేత్తో పట్టుకున్నాడు. తాతయ్య ససేమిరా వల్లకాదన్నాడు. బస్తాతోటే నీళ్ళు తెమ్మన్నాడు. మనుమడి మళ్ళీ వాగు దగ్గరికి వెళ్ళాడు. బస్తాను నీటిలో ముంచి తీసి మెరుపు వేగంతో ఉరుక్కుంటూ ఇంటికి వచ్చాడు. ఆయాసమే మిగిలింది కాని బస్తాలో చేరెడు నీళ్ళు కూడా లేవు. అన్నీ దోవలోనే కారి పోయాయి. 'ఏమిటి తాతయ్యా ఇదంతా' అని అడిగాడు. తాతయ్య మందహాసం చేసాడు.

'ఒకసారి ఆ బస్తా వంక చూడు మనవడా' అన్నాడు. మనుమడు చూసాడు. నల్లటి బొగ్గుల బస్తా కాస్తా ఇప్పుడు మసంతా కొట్టుకు పోయి శుభ్రంగా వుంది.

తాతయ్య చెప్పాడు. 'చూసావా. నాలుగు సార్లు నీళ్ళల్లో ముంచితేనే బస్తాకు పట్టుకున్న బొగ్గుమసి కొట్టుకు పోయింది. నీళ్ళల్లోముంచి తీస్తుంటే మసి పోతుందని కూడా తెలవకుండా నువ్వు ఇదంతా చేసావు. భగవద్గీత కూడా అంతే! అర్ధం అయిందా లేదా అనికాదు. చదువుతూ పోతుంటే అది మన మనసుల్లోని కల్మషాన్ని తొలగిస్తుంది. తేరుకున్న నీటిలా మన మనసును తేటపరుస్తుంది. అదే భగవద్గీత మహత్యం!'

13, డిసెంబర్ 2021, సోమవారం

గాంధీభవన్ పంతులు గారు

 (2014 డిసెంబరులో మరణించిన ఎస్వీ. పంతులు గారి సంస్మరణార్ధం)

"ఆంద్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక ఆయన జీవనం చాలా దుర్భరంగా గడిచేది. మద్రాసులో న్యాయవాదిగా సంపాదించిన అపార ధన రాశులు, అంతులేని ఆస్తిపాస్తులు స్వాతంత్రోద్యమ కాలంలో హారతి కర్పూరంలా కరిగిపోయాయి. రాజకీయాల్లో సమస్తం పొగొట్టుకున్న ఆంద్ర కేసరి చివరి రోజుల్లో కనాకష్టమైన జీవితం గడిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినెలా గౌరవ వేతనం కింద అందించే 750 రూపాయలను నేనే (గాంధీ భవన్ పంతులు గారు) స్వయంగా తీసుకెళ్ళి ఆయనకు అందించేవాడిని. సిరి సంపదలతో తులతూగిన ప్రకాశం పంతులు గారిని ఆ స్తితిలో చూస్తుంటే కడుపు తరుక్కుపోయేది"

హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం అయిన గాంధీభవన్ లో శేషజీవితం గడిపిన ఎస్వీ పంతులు గారు ఒకప్పుడు గుర్తుచేసుకున్న విషయాలు ఇవి. ముఖ్యమంత్రులుగా పనిచేసిన శ్రీయుతులు నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానంద రెడ్డి, పీవీ నరసింహారావు, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య, భవనం వెంకట్రాం, కోట్ల విజయ భాస్కర రెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, వై యస్ రాజశేఖర రెడ్డి, రోశయ్య, వీరందరికీ గాంధీ భవన్ లో 'తలలో నాలుక' పంతులు గారే. 'నేనూ కోట్లు కొల్లగొట్టే వాడినయితే ఇంతమంది గొప్పవాళ్ళ స్నేహం నాకు దొరికేదా' అనుకునే అల్ప సంతోషి పంతులు గారు మాత్రం సాయంత్రం సిటీ బస్సెక్కి ఇంటికి పోయేవారు. వీరిలో రోశయ్యగారితో పంతులు గారి అనుబంధం సుదీర్ఘ కాలం సాగింది. ఉదయం నుంచీ రాత్రి పొద్దుపోయే వరకు రోశయ్య గారితోనే వుండి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరినన్నా రెండు రూపాయలు అడిగి తీసుకుని సిటీ బస్సెక్కి పోయేవారు. 'మళ్ళీ రేపు రావాలి కదా ఈ పదీ వుంచండి' అని ఏ ధర్మాత్ముడన్నా అంటే 'టిక్కెట్టుకు రెండు రూపాయలు చాలు, రేపటి సంగతి రేపే' అనేసి వెళ్ళిపోయేవారట. దటీజ్ పంతులు గారు. అలాటి పంతులు గారు, ఎవర్నీ టిక్కెట్టుకు డబ్బులు అడక్కుండా ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. నాకాయనతో నలభయ్ ఏళ్ళ అనుబంధం.


(ఉమ్మడి రాష్ట్రంలో శాసన మండలి  చైర్మన్ గా పనిచేసిన చక్రపాణి గారితో పంతులు గారు)




 

12, డిసెంబర్ 2021, ఆదివారం

బెజవాడ ఆనకట్టకు గండి

(విజయవాడ వీధుల కధలు – రచన: లంక వెంకట రమణ)

మితృడు రమణ ఈ పుస్తకానికి విజయవాడ వీధుల కధలు అని ఎందుకు పేరు పెట్టాడో తెలియదు కానీ ఇందులో విజయవాడ విశేషాలే ఎక్కువగా వున్నాయి. బెజవాడ వద్ద కృష్ణానదిపై కట్టిన ఆనకట్టతో మొదలయిన ప్రకాశం బరాజ్ కధ వీటిల్లో ప్రధానమైనది. అదిలా సాగింది.
“ప్రధానమైన నిర్మాణాలన్నీ మాయా మంత్రాలతో నిర్మించినవి కావు. వాటి వెనుక అనేకమంది త్యాగం వుంది. చిందించిన స్వేదం వుంది. కాటన్ దొర కృష్ణపై ఆనకట్ట నిర్మించిన నూరేళ్ళకు ప్రకాశం బరాజ్ కధ మొదలయింది. 1855 లో ఆ ఆనకట్టను కాటన్ మహాశయుడు నిర్మించి ఇచ్చాడు. దరిమిలా దానికింద ఆయకట్టు విస్తీర్ణం అయిదు లక్షల ఎనభయ్ వేల ఎకరాల నుంచి బాగా పెరుగుతూ వచ్చింది. తదనుగుణంగా ఆనకట్ట ఎగువన ఏర్పాటు చేసిన మూడు అడుగుల తలుపుల ఎత్తును ఆరడుగుల వరకు పెంచుతూ పోయారు. అవి 1925 నుంచి 1954 వరకు నమ్మకంగా పనిచేశాయి. ఎనిమిది అడుగులకు పెంచాలని ఆలోచన చేస్తున్న సమయంలో 1954 సెప్టెంబరులో కృష్ణకు వరదలు వచ్చాయి. ఆ నెల నాలుగో తేదీ సాయంత్రం ఆనకట్ట బయట గోడకు పెద్ద గండి పడింది. క్రమంగా గండి వెడల్పు 70 అడుగుల నుంచి 134 అడుగులకు పెరిగింది. దిగువ ప్రాంతాలన్నీ ఆకస్మిక వరద ముంపుకు గురయ్యాయి. అప్పటి సూపరింటెండింగ్ ఇంజినీరు వేపా కృష్ణ మూర్తి గారు ఉన్నతాధికారులతో చర్చలు జరిపి గండి స్వరూప స్వభావాలు తెలుసుకునేందుకు పడవలో వెళ్లాలని నిర్ణయించారు. ఇంజినీర్లు, లస్కర్లు అంతా ఒక పెద్ద పడవలో బయలుదేరారు. తిన్నగా గండి వద్దకు చేరుకున్నారు కానీ ఏమైందో ఏమో పడవతో సహా అందరూ వరదలో కొట్టుకు పోయారు. అయినా ఇంజినీర్లు ప్రయత్నం మానలేదు. చీఫ్ ఇంజినీరు జి.ఏ. నరసింహారావు గారు పెద్ద పెద్ద పంటుల మీద బ్రహ్మాండమైన బండ రాళ్ళు పెట్టి, గండికి ఎగువన ఫర్లాంగు దూరంలో లంగరు వేసిన స్టీమరుకు పంటును కట్టాలని, సమయం చూసి పంటుకు రంధ్రాలు పెట్టి, అది మునిగిపోయేలోగా ఇనుప తాళ్ళను తెంచి వేయాలనీ, అలా చేస్తే పంటు సరిగ్గా గండి వద్దకు వచ్చి మునిగి పోతుందనీ, ఆ విధంగా గండికి అడ్డుకట్ట వేయవచ్చనీ నిర్ణయించారు. చివరికి వారి ప్రయత్నం ఫలించింది. గండిని పూడ్చి వేయడం జరిగింది. అరవై ఏళ్ళకు పూర్వమే తెలుగు ఇంజినీర్లు ప్రదర్శించిన అసమాన ప్రతిభకు ఇది తార్కాణం.