7, డిసెంబర్ 2021, మంగళవారం
ఎంత కష్టం! ఎంత కష్టం! - భండారు శ్రీనివాసరావు
ఈ కధనానికి ఓ నేపధ్యం వుంది. తర్వాత చెబుతాను.
కొన్నేళ్ళ క్రితం మేము అద్దెకువుంటున్న మా అపార్ట్ మెంటుకు ఐ మూలగా
ఓ ఖాళీ స్థలం వుండేది. కొద్ది రోజుల్లోనే అక్కడ ఇంటి నిర్మాణం మొదలు పెట్టారు.
హైదరాబాదు లాంటి నగరంలో ఇది కొత్త విషయం ఏమీ కాదు. కానీ కొత్తగా
ప్రస్తావించుకోవడానికి కొత్త నేపధ్యం ఒకటి కలిసి వచ్చింది. కరెంటు లేకపోవడం వల్ల
ఎండ గాలో వడ గాలో ఏదో ఓ గాలి వస్తే చాలనుకుని పడక గది కిటికీ తెరిచాను. ఆర్నెల్ల
కిందట ఆకారం కూడా లేని ఆ నిర్మాణం చిత్రంగా రెండంతస్తులు లేచింది. మూడో దానిమీద పిల్లర్లు వేస్తున్నారు. ఓ యాభయ్ అరవై మంది కూలీలు ఆడా మగా
సుశిక్షితులయిన సైనికుల వారి మాదిరిగా నిర్విరామంగా ఆ ఎర్రటి ఎండలో
పనిచేస్తున్నారు. కొందరు కంకర ఎత్తి పోస్తుంటే మరికొందరు ఇసుక, సిమెంటు కొలిచి గుండ్రంగా తిరుగుతున్న ఓ మిక్సింగ్ యంత్రంలో పోస్తున్నారు.
అలా తయారయిన కాంక్రీటును ఓ చిన్న లిఫ్ట్ లాంటి యంత్రం మూడో అంతస్తుకు చేరుస్తోంది. అక్కడ దాన్ని దించుకున్న కూలీలు బొచ్చెల్లో తీసుకు
వెళ్ళి పిల్లర్లను నింపుతున్న కూలీలకు అందిస్తున్నారు. అంతా ఒక క్రమపధ్ధతి ప్రకారం
జరిగిపోతోంది. బోలెడు కష్టపడిపోతున్న ఫీలింగు కూడా వారిలో వున్నట్టు దూరం నుంచి
గమనిస్తున్న నా దృష్టికి ఆనలేదు. సరిగ్గా వొంటి గంట కాగానే గంట కొట్టినట్టు పనులు ఆగిపోయాయి. ఎవరికి
వారు అక్కడ డ్రమ్ముల్లో వున్న నీళ్ళతో మొహం కాళ్ళూ చేతులూ కడుక్కుని, ఇళ్లనుంచి క్యారేజీల్లో తెచ్చుకున్న భోజనాలు చేశారు.
ఈ లోగా ఇంట్లో కరెంటు వచ్చింది. ప్యాను
తిరిగింది. వొళ్ళు చల్లబడింది. కానీ ఎర్రటి ఎండలో కూలీల చుట్టూ తిరిగొచ్చిన మనసు
మాత్రం ఇంకా వేడిగానే వుంది. ఆవిర్లు కక్కుతూనే వుంది.
అసలు విషయం ఇప్పుడు విప్పుతాను.
మొదట్లో నేపధ్యం ఒకటుంది అని చెప్పాను గుర్తుంది కదా! అదే ఇది.
నగరంలో అక్రమ నిర్మాణాల పేరుతొ పెద్ద
పెద్ద భవనాలను కూల్చివేస్తున్న వార్తలు వింటుంటాము.
నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి నిర్మాణాలను అనుమతించకూడదని
నమ్మే వారిలో నేనూ వున్నాను. అక్రమ
కట్టడాలను తొలగిస్తున్న ఫోటోలను పత్రికల్లో చూసినప్పుడు, ఇదిగో ఇప్పుడు చెప్పానే మా ఇంటి దగ్గర నిర్మాణంలో వున్న ఇంటికంటే అవి చాలా
పెద్దవిగా అనిపించాయి. ఆరునెలల నుంచి కడుతున్నా ఇది ఇంకా
పూర్తి కాలేదు. అలాటిది ఆ కూల్చేసిన ఇళ్లు కట్టడానికి కనీసం ఏడాది పట్టి వుంటుంది.
అన్నాళ్ళు అధికారులు, అనుమతులు లేకుండా జరుగుతున్న ఆ
నిర్మాణాలను గమనించలేదా! లేదా కళ్ళుండి కూడా నేను గమనించనట్టు వాళ్ళూ చూడలేదా!
ఒక్క ఇల్లు కట్టడానికే ఇంతమంది ఇంతటి ఎండాకాలంలో తమ రక్త మాంసాలను ఫణంగా పెట్టి
ఎంతో శ్రమ పడుతున్నారు. ఇసుక సిమెంట్ కంకరతో పాటు వారి స్వేదం
కూడా ఆ నిర్మాణం అణువణువులో వుంది.
ఎంతో కష్టపడి కట్టిన ఇళ్లను ఏమాత్రం కష్టపడకుండా యంత్రాల సాయంతో కూల్చివేయడం ఏం
న్యాయం? ఎలాటి న్యాయం అనిపించుకుంటుంది. అంత
డబ్బుకు, అది ఎవరిదయినా కావచ్చు పూర్తిగా నీళ్లు వొదులుకున్నట్టే కదా! ఇన్నాళ్ళు
అనుమతి లేని నిర్మాణాలను కాసులకు కక్కుర్తిపడి అనుమతిస్తూ వచ్చిన అధికారులను, సిబ్బందిని వారు ఎవరయినా సరే, వారి వెనుక ఎవరు వున్నా సరే, కనీసం ఓ యాభయ్ మందిని నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాలనుంచి
ఉన్నపెట్టున శాశ్వితంగా తొలగిస్తే మళ్ళీ ఇలాటి నిర్మాణాలు
జరుగుతాయా!
ఎప్పుడో జరిగిన ఈ విషయాలు ఇప్పుడు
గుర్తుకు రావడానికి కారణం ఈరోజు పత్రికల్లో వచ్చిన అలాంటి వార్తే.
హైదరాబాదు పొలిమేరల్లో మల్లంపేట చెరువులో
అక్రమనిర్మాణాలు. ఏకంగా 260 ఖరీదైన విల్లాలు. రాత్రి రాత్రి
సాధ్యం అయ్యే నిర్మాణ వ్యవహారం కాదు. విషయం బయటకి పొక్కడంతో వాటిల్లో 120
విల్లాలను అధికారులు సీజ్ చేశారు. వాటిని ఏం చేస్తారు. కూల్చేస్తారా! అదే
పరిష్కారమా!
ఇంతకాలం కళ్ళు మూసుకున్న వారిపై చర్యలు
ఉండవా!
ఉంటాయో ఉండవో తెలియదు కానీ ఈ ప్రశ్నలకు
జవాబులు మాత్రం వుండవు.
(07-12-2021)
మారని వ్యవస్థ
తప్పతాగిన స్తితిలో అతి వేగంగా ఓ యువవిద్యార్ధి కారు నడిపిన ఫలితంగా సంభవించిన ప్రమాదంలో రెండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఒక కుటుంబం మొత్తం చితికి పోయింది. ఉద్యోగం నిమిత్తం అమెరికా వెడుతున్న ఒక యువకుడి కలలన్నీ అతడి కనురెప్పల కిందే కరిగిపోయాయి. అప్పటివరకు చదువుతున్న స్కూలును ఒదిలి మరో స్కూల్లో చేరి బంగారు భవిష్యత్తు దిశగా తొలి అడుగు వేసిన పదేళ్ళ బాలిక రమ్య ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య కొట్లాడుతూ వారం రోజుల తరువాత మృత్యు దేవత ఒడిలో ఒదిగి పోయింది. హైదరాబాదు పంజాగుట్ట ఫ్లై ఓవర్ ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో చిన్నారి రమ్య, ఆమె బాబాయి రాజేష్ చనిపోవడం, ఆ కారులో వున్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో మొత్తం నాలుగు కుటుంబాలు భరించలేని దుఃఖంలో మునిగిపోయాయి. సహచర విద్యార్ధులతో కలిసి పగటి పూటే పూటుగా మద్యం సేవించిన ఒక ఇంజినీరింగ్ విద్యార్ధి నడుపుతున్న కారు, అదుపు తప్పి బోల్తా కొట్టి, మరో వాహనంపై పడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
6, డిసెంబర్ 2021, సోమవారం
రాముడు మంచి బాలుడు - భండారు శ్రీనివాసరావు
5, డిసెంబర్ 2021, ఆదివారం
రోశయ్య గారు – కూరల కత్తి
ఆ రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు. ప్రతిపక్ష నేత డాక్టర్ రాజశేఖరరెడ్డి. రామకృష్ణుడు రాష్ట్ర ఆర్ధిక వ్యవహారాలు గురించి సుదీర్ఘంగా మాట్లాడి, ప్రభుత్వ పధకాల అమలుకు అవసరమయితే అప్పులు చేసినా తప్పులేదన్న అర్ధం ధ్వనించేలా వ్యాఖ్యానించారు. పైగా ఓవర్ డ్రాఫ్ట్ తీసుకునేందుకు అవకాశం వుందని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.
రోశయ్య
లేచి ఇలా అన్నారు.
“అప్పులు
అభివృద్ధి కోసం అంటున్నారు, ఇదేమి
లాజిక్కో నాకు అర్ధం కాదు. పరిమితికి మించి ఓడీలు తీసుకుంటే నష్టపోయేది రాష్ట్రమే.
అయినా వంటింట్లో కూరగాయలు కోసే కత్తి
వుందని మెడ కోసుకుంటామా!” అని చమత్కరించారు.
తర్వాత
సభ బయట విలేకరులతో ముచ్చటిస్తూ ఇంకా ఇలా అన్నారు.
‘కాఫీపొడుం, పంచదార అయితే ఏదో అనుకోవచ్చు.
కానీ పప్పూ ఉప్పూ నూనె నెయ్యి
ఇలా ప్రతిదీ పొరుగింటమ్మ దగ్గర
చేబదులు తీసుకుని నడిపే దాన్ని సంసారం అనరు. ప్రభుత్వం అయినా అంతే’
05-12-2021