6, నవంబర్ 2021, శనివారం
జవాబుకు తగ్గ ప్రశ్న- భండారు శ్రీనివాసరావు
సమాధానంఎలా వుండాలని కోరుకుంటారో ప్రశ్న ఆ విధంగా వుండాలని కార్పొరేట్ గురువులు చెబుతుంటారు.
రాయడం నాకో వ్యసనం ఓ వ్యాపకం - భండారు శ్రీనివాసరావు
కానీ ఆ
రాసిన వాటిలో ఒకటి ఇలా నాలుగు చెరగులా పాకుతుందని అనుకోలేదు. మహా న్యూస్ ఎండీ శ్రీ
వంశీ ఈరోజు అంటే శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు నన్ను స్టూడియోకి ఆహ్వానించి ఈ
అంశంపైన గంట ప్రోగ్రాం చేశారు. అనేక వెబ్ ఛానల్స్ నా దగ్గర ఇంటర్వ్యూలు
తీసుకున్నాయి. ఇవేమీ నాకు కొత్తకావు. కానీ నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక
వ్యాసాన్ని చదివి దానిమీద ఇంటర్వ్యూ చేయడం ఇదే మొదటిసారి. ఇది కేవలం నా వ్యాసానికి
ప్రేరణ ఇచ్చిన జస్టిస్ చంద్రు గొప్పతనం.
నాదేమీ లేదు.నిమిత్తమాత్రుడిని.
మహా న్యూస్ ఛానల్. సుమన్ టీవీల యాజమాన్యాలకు
కృతజ్ఞతలు.
4, నవంబర్ 2021, గురువారం
జై భీమ్ సినిమా
తమిళ్ హీరో సూర్య నటించిన జై భీమ్ డబ్బింగ్ సినిమాపై సాంఘిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్న అనేక పోస్టులు
చూస్తున్నప్పుడు ఈ సినీ కధకు ప్రేరణ అయిన జస్టిస్ చంద్రు గురించి ఎనిమిదేళ్ల క్రితం
నా బ్లాగులో ఆయన్ని గురించి రాసిన వ్యాసం గుర్తుకు వచ్చింది.
పర్వాలేదు, మనం మంచి వాళ్ళ మధ్యనే ఉంటున్నాం – భండారు శ్రీనివాసరావు (2013)
ఒకరకంగా మన అందరం అదృష్టవంతులమే.
ఎందుకంటే , జస్టిస్ చంద్రు వంటి అరుదయిన మంచి మనుషులు జీవిస్తున్న కాలంలోనే మనమూ బతుకుతున్నాము కాబట్టి.
జస్టిస్ చంద్రు చెన్నై హై కోర్టులో
చాలాకాలం జడ్జిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయన్ని గురించిన నాలుగు మంచిమాటలు చెప్పుకునే ముందు మరో
విషయం ప్రస్తావించడం అసందర్భం ఏమీ కాబోదు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.వి.రావు ఒక సంచలన వ్యాఖ్య చేశారు. దేశవ్యాప్తంగా న్యాయస్తానాలలో మూడుకోట్లకు పైగా
కేసులు పరిష్కారానికి నోచుకోకుండా పేరుకుపోయివున్నాయనీ, ఇవన్నీ ఓ కొలిక్కి రావాలంటే 300 లసంవత్సరాలకు పైగా పడుతుందనీ జస్టిస్ రావు చెప్పారు. ఆయన చెప్పింది అక్షరసత్యమే కావచ్చుకాని, జస్టిస్ చంద్రు వంటి న్యాయమూర్తులు మరికొందరు
వుండివుంటే, బహుశా కేసుల పరిష్కారానికి అంత సమయం అవసరం పడదేమో! ఎందుకంటే కేసుల పరిష్కారం విషయంలో జస్టిస్ చంద్రు నెలకొల్పిన రికార్డు
అలాటిది మరి. న్యాయమూర్తిగా ఆయన అక్షరాలా యాభై నాలుగు వేల కేసులను పరిష్క రించారు. భారత న్యాయస్తానాల చరిత్రలో ఇదొక
అరుదయిన రికార్డు.
సరే! విషయానికి వద్దాం.
ఏదయినా ఉద్యోగంలో వున్న వ్యక్తి యెంతటి సమర్ధుడైనా సరే, ఏదో ఒకనాడు పదవీ విరమణ చేయకతప్పదు.
జస్టిస్ చంద్రుకు కూడా ఆ రోజు వచ్చింది.
మామూలుగా ఇలాటి సందర్భాలలో కొన్ని
సంప్రదాయాలు వుంటాయి. న్యాయమూర్తి ఎవరయినా రిటైర్ అవుతున్నప్పుడు కోర్టులోనే అధికారికంగా ఒక వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేస్తారు. ప్రధాన
న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ వగైరా హాజరవుతారు. వీడుకోలు ప్రసంగాలు చేస్తారు. పుష్పగుచ్చాలు అందచేస్తారు. తేనీటి విందు జరుగుతుంది. అందరూ కలసి ఫోటో దిగుతారు. వీలునుబట్టి, ఆ సాయంత్రం ఓ ఫైవ్ స్టార్ హోటల్లో వీడ్కోలు విందు ఏర్పాటుచేస్తారు.
కానీ జస్టిస్ చంద్రు తరహానే వేరు.
అందువల్ల ఆయన పదవీ విరమణ ఆయన పద్దతిలోనే జరిగింది. ఏడేళ్ళపాటు జడ్జిగా పనిచేసి రిటైర్ అయ్యేముందు ఆయన ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు. వీడ్కోలు సమావేశం ఏర్పాటు
చేయవద్దని అందులో ముందుగానే అభ్యర్ధించారు.
ఒక జడ్జి నిరాడంబరంగా పదవీ విరమణ చేయడం ఎన్నడూ జరగలేదా అంటే జరిగింది. కానీ ఎప్పుడూ? మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు 1929లో జరిగింది. ఆరోజుల్లో జస్టిస్ జాక్సన్ నాటి అడ్వొకేట్ జనరల్ తో చెప్పారు. ‘ నా రిటైర్
మెంటు విషయంలో అనవసరమైన హడావిడి ఏమీ చేయవద్దు. నా విధులు నేను నిర్వర్తించాను. వీడ్కోలు ఇవ్వాల్సిన అవసరం ఏమి వుంది?’
మళ్ళీ ఎనభై రెండేళ్ళ తరువాత జస్టిస్
చంద్రు అలాటి నిర్ణయం తీసుకోగలిగారు.
మార్చి ఎనిమిది, శుక్రవారం.
జస్టిస్ చంద్రు రోజుమాదిరిగానే కోర్టుకు వచ్చారు. తన ఆస్తిపాస్తుల వివరాలను
స్వచ్చందంగా తెలియచేస్తూ ఒక డాక్యుమెంటును ప్రధాన న్యాయమూర్తికి అందచేసారు. తరువాత
తన చాంబర్స్ కు వచ్చి అవసరమైన కొన్ని పత్రాలపై సంతకాలు చేశారు. మీడియా మిత్రులతో
కూర్చుని తేనీరు సేవిస్తూ కొద్దిసేపు ముచ్చటించారు.
రిటైర్ అయినరోజున కూడా ఆయన అధికారిక
వాహనాన్ని వాడుకోలేదు. అన్నిసంవత్సరాలుగా వెన్నంటివున్న
డఫేదారునూ వెంటతీసుకోపోలేదు.
తరువాత హై కోర్టు బయటకు వచ్చి
నడుచుకుంటూ సుభాష్ చంద్రబోస్ రోడ్డు దాటి అక్కడవున్న సంగీత రెస్టారెంటులో
మిత్రులతో కాఫీ తాగుతూ ముచ్చట్లు చెబుతూ గడిపారు. ఆ పిదప, బీచ్ రోడ్డు స్టేషన్ కు వెళ్ళి వేలాచెర్రి వెళ్ళే ఎం.ఆర్.టీ.ఎస్. లోకల్
ట్రైన్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయారు.
న్యాయమూర్తిగా వున్నప్పుడు కూడా
జస్టిస్ చంద్రు ఉద్యోగంతోపాటు వచ్చే హంగులు ఆర్భాటాలకు దూరంగానే వుంటూ వచ్చారు. సాధారణంగా న్యాయమూర్తులు తమ చాంబర్ నుంచి కోర్టు
హాలుకు వెళ్ళేటప్పుడు యూనిఫారం ధరించిన బిళ్ళ బంట్రోతు వొకరు చేత దండం ధరించి ముందు నడుస్తూ వెళ్లడం ఆనవాయితీ.
జస్టిస్ చంద్రు దీనికి స్వస్తి చెప్పారు. తన
అధికారిక వాహనానికి యెర్ర దీపం ఏర్పాటు తీసేయించారు. సెక్యూరిటీ సిబ్బందిని అవసరంలేదని చెప్పి వాపసు పంపేసారు. ఇంటివద్ద
పనులకోసం బంట్రోతులను వాడుకోలేదు.
చెన్నై హైకోర్టులో జస్టిస్ చంద్రు
చాంబర్ ముందు ఒక బోర్డు మీద ఇలా రాసివుండేది.
“పూలు,బొకేలు పట్రాకండి – నేనేమీ దేవుడ్ని
కాను
ఆకలితో లేను – కాబట్టి పళ్ళూ మిఠాయిలు తేకండి
చలితో గడగడలాడిపోవడం లేదు – శాలువల అవసరం ఏమీ లేదు
అలా అని మీనుంచి నేనేమీ
ఆశించడంలేదనుకోకండి.
లోపలకు వచ్చేటప్పుడు శుభాశీస్సులు
పట్టుకురావడం మాత్రం మరచిపోకండి.”
బహుశా ఇప్పుడాబోర్డు అక్కడ వుండి
వుండదు. దాని అవసరం కూడా వుండకపోవచ్చు.
(09-04-2013)
3, నవంబర్ 2021, బుధవారం
పతి ప్రేమకు పరీక్ష – భండారు శ్రీనివాసరావు
2, నవంబర్ 2021, మంగళవారం
రూపాయి నోటుపై సంతకం
“మీరు ఎవరు? మీ సంతకం పోల్చి చెప్పడానికి ఈ బ్యాంకులో మీకు తెలిసిన ఖాతాదారులెవరయినా వున్నారా?”
తవ్వి తీసిన ఓ జ్ఞాపకం – భండారు శ్రీనివాసరావు
సీ.జీ.హెచ్.ఎస్.
కేంద్ర
ప్రభుత్వంలో పనిచేస్తున్న యాభై లక్షలమంది ఉద్యోగులకు, ముప్పై లక్షలమంది
రిటైర్డ్ సిబ్బందికీ సుపరిచితమైన పదం. సిబ్బంది అనారోగ్యాలకు గురైనప్పుడు
ఆదుకునేందుకు ఉద్దేశించిన సెంట్రల్ గగవర్నమెంట్ హెల్త్ స్కీమ్,(C.G.H.S.)
1975 నుంచి 2005 వరకు నేను
ఆకాశవాణి, దూరదర్శన్ లలోనే ఉద్యోగం చేసాను. మధ్యలో ఓ అయిదేళ్ళు మాస్కో రేడియోలో
పనిచేయడం కోసం మాస్కోలో వున్నాను. ఆ సమయంలో ఓ సారి 1989లో సెలవుమీద మాస్కోనుంచి హైదరాబాదు వచ్చినప్పుడు అనుకోకుండా మా ఆవిడను
ఆస్పత్రిలో చేర్చాల్సివచ్చింది. అప్పుడే కొత్తగా మొదలయిన జూబిలీ హిల్స్ అపోలో
ఆసుపత్రిలో డాక్టర్ వెంకట్రామరెడ్డి గారు ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. ఆ రోజుల్లో
మొత్తం అంతా కలిపి ముప్పై వేలు అయివుంటాయి. నేను మాస్కోలో పనిచేస్తున్నందువల్ల
సీజీహెచ్ఎస్ కిందికి రానని తేల్చారు. మాస్కోలో ఆపరేషన్ చేసివుంటే మొత్తం అణాపైసలతో
(రూబుళ్ళు,కోపెక్కులతో) సహా మాస్కో రేడియో భరించేది. కావున మాకు సంబంధం లేదని వాళ్లు
తేల్చారు. సరే! మా ఆవిడ ఆరోగ్యం ముఖ్యం కనుకా, విదేశాల్లో
ఉద్యోగం కాబట్టి ఆసుపత్రి ఖర్చు సొంతంగా పెట్టుకున్నా పెద్ద భారం కాదు కనుకా
అప్పటికి ఆ అంకాన్ని అలా ముగించాము. ఆ తరువాత ఆమెకే మళ్ళీ 2009 లో మరో ఆపరేషన్.
ఈసారి స్టార్ ఆసుపత్రిలో డాక్టర్ గోపీచంద్, గుండెలో వాల్వ్
మార్చి కొత్తది వేసారు. అప్పటికి నేను కేంద్ర ప్రభుత్వంలో మాజీ ఉద్యోగిని. 2005 లో దూరదర్శన్ లో
పదవీ విరమణ చేసినప్పుడు సీజీహెచ్ఎస్ కార్డు రెన్యూ చేయించుకోమని వాళ్ళూ చెప్పలేదు, నేనూ చేయించుకోలేదు. ఆ విధంగా మూడు దశాబ్దాల పైచిలుకు సర్వీసులో
సీజీహేచ్ఎస్ సేవలను వాడుకోగల అవకాశం నాకు ఎన్నడూ దొరకలేదు. డీడీ లో
నా సీనియర్ సహోద్యోగి ఆర్వీవీ కృష్ణారావు గారు
సీజీహేచ్ఎస్ కార్డు అవసరాన్ని గురించి వెంటబడి చెబితే బేగంపేట పాత ఎయిర్ పోర్ట్ పక్కన వున్న సీజీహేచ్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లాను.
ప్రభుత్వ కార్యాలయాల్లో పని పడ్డప్పుడు కానీ అవి యెలా పనిచేస్తాయన్న విషయం బోధ
పడదు. కొంచెం కష్టంగా, కొంచెం ఇష్టంగా పని పూర్తిచేశారు. పది రోజుల్లో వచ్చి కార్డు
పట్టుకుపొమ్మన్నారు. వాళ్లు చెప్పిన తేదీకి, ఇచ్చిన సమయానికి
వెడితే, ఫోటో కార్డులు తయారు చేయడానికి వొప్పుకున్న ఓ చెన్నై కంపెనీ మధ్యలోనే కాడి
కిందపారేసిన కారణంగా 'కార్డు బదులు ఫోటోలు అతికించిన కాగితం ఇస్తాం తీసుకెళ్ళి లామినేట్ చేసుకొని
వాడుకోండ'ని సలహా ఇచ్చారు. ఆరోజు రావాల్సిన సిబ్బంది రాలేదో, లేక అక్కడ అదే
రివాజో తెలియదు కాని, ఫైలు చేతికిచ్చి పలానా రూములో పలానా అధికారి సంతకం పెట్టించుకురమ్మన్నారు.
ఆయన దగ్గరకు వెడితే 'మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు వుందే' అంటూనే సంతకం
పెట్టి మళ్ళీ ఫైలు నా చేతికి ఇచ్చారు. మొత్తానికి ఆ కార్యాలయంలో ఫైళ్ళ కదలికలో
నేను కూడా పాలు పంచుకుని, ఇచ్చిన కాగితం పట్టుకుని, నేను సయితం సర్కారు ఆఫీసుల్లో పనులు చేసుకుని రాగలనన్న గర్వంతో బయట పడ్డాను.
కొసమెరుపు: ఇందులో
ఏముంది అందరిలా మీదీ ఓ అనుభవం అంటారేమో. కానీ వుంది. బయటకు వచ్చిన తరువాత ఆ
కాగితాన్ని తేరిపార చూస్తే 'VALID UPTO : 01-01-2099' అంటే అప్పటికే
ఏడుపదులకు దగ్గర పడిన నేను మరో 80 ఏళ్ళకు పైగా ఈ
కార్డు వాడుకోవచ్చు అన్నమాట.
ఆరోగ్య సేవల పధకం కదా! దీర్ఘాయుష్మాన్ భవ! అని దీవిస్తూ ఇచ్చివుంటారని
సరిపెట్టుకున్నాను.