1, నవంబర్ 2021, సోమవారం

పాత్రికేయ దిగ్గజం పొత్తూరివారికి జీవన సాఫల్య పురస్కారం

(ఏపీ ప్రభుత్వం సీనియర్ పాత్రికేయులు కీర్తిశేషులు పొత్తూరి వెంకటేశ్వరరావు గారికి జీవన సాఫల్య పురస్కారాన్ని ఆయన మరణానంతరం వారి కుమారులకు అందించిన సందర్భంలో వారి యాదిలో...)
‘ఒక పత్రిక ఎడిటర్ అనేవాడు ఎలావుంటాడు? ఎలా వుండాలి?’ అని కళ్ళుమూసుకుని ప్రశాంతంగా ఆలోచిస్తూ నెమ్మదిగా కళ్ళు తెరిచినప్పుడు కనబడే రూపమే శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు.
తెలంగాణా ముఖ్యమంత్రి సీపీఆర్వో వనం జ్వాలా నరసింహారావు నేనూ కలిసి నాలుగేళ్ల క్రితం పొత్తూరి వారి ఇంటికి వెళ్లాం. వారు రాసిన ‘బులేనా’ పుస్తకం సంతకం చేసి ఇచ్చారు.
‘ఎలా వున్నారు, ఆరోగ్యం ఇప్పుడు కులాసా కదా’ అని మేము అడగడం తప్పిస్తే, ఆయన అంతట ఆయన తన అనారోగ్యం గురించి ఒక్క మాటా మాట్లాడలేదు.
ఎంతో ఖరీదయిన వైద్యం. మామూలు మందులు కాక అదనంగా మూడు వారాలపాటు రోజుకొక కాప్స్యూల్ వేసుకోవాలి. ఒక్కొక్కటి అక్షరాలా వెయ్యి రూపాయలు. సాదా సీదా అట్టపెట్టెలోవున్న ఆ మాత్రల బాటిల్ ఇరవై వేల రూపాయలు అంటే నమ్మ బుద్దికాలేదు, కానీ కళ్ళెదుట కనబడుతున్న వాస్తవం అది.
వున్న ఆ కొద్ది సమయంలోనే ఆయన ఎన్నో కబుర్లు చెప్పారు. ప్రత్యేకతెలంగాణా ఉద్యమం కొన్ని దశాబ్దాల క్రితం సికిందరాబాదులోని ఒక హోటల్లో ఎలా ఊపిరి పోసుకున్నదో చెబుతూ ఆనాటి విశేషాలు వివరించారు.
ఇంట్లో పెంచుకుంటున్న ఈశ్వర నామం కలిగిన ఒక మొక్కను చూపించారు. పచ్చటి వర్ణం కలిగిన ఆకులు. వాటి మీద కపిల వర్ణంలో ‘నాగుపాము పడగ’ మీద వుండే కృష్ణ పాద ముద్రలు. ఆ మొక్క చాలా అరుదుగా దొరుకుతుందట. ఆ మొక్క వుంటే పాములు ఆ దరికి కూడా రావట. ఆయుర్వేద వైద్యులు మాత్రమే ఈ మొక్కను గుర్తించగలరట. ప్రాచీన ఔషధీ శాస్త్రంలో ఇటువంటివి ఎన్నో వున్నాయని చెప్పారు.
నిజం కావచ్చు. నిజం కాదని నమ్మే వాళ్ళూ వుంటారు.
నమ్మేవారు మొక్కితే, రాయే సాయి, నమ్మనివారు తొక్కితే, అదే రాయి.
అదలా ఉంచి వెంకటేశ్వరరావు గారు స్వయంగా చెప్పిన కొన్ని విశేషాలు నెమరు వేసుకుందాం.
ఈనాటి పత్రికారంగం వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశాలు వాటిల్లో వున్నాయి.
పత్రిక యజమానికి తన పత్రిక గురించి ఆరా తీసే అధికారం ఉంటుందా?
ఇప్పటి రోజుల్లో అయితే ఇదొక ప్రశ్నే కాదు. ఆరా తీయడమేమిటి, వార్తలను అదుపు చేసే అధికారం కూడా వుంటుంది.
అయితే దాన్ని గురించి ఒక పాత విషయం చెప్పారు. కొంచెం అటూ ఇటూగా మూడు దశాబ్దాల నాటి సంగతి.
అప్పటి ఆంద్రప్రభ దినపత్రికకు పొత్తూరి వెంకటేశ్వరరావు గారు ఎడిటర్.
విజయవాడలో రంగా హత్య దరిమిలా జరిగిన విధ్వంస కాండపై, రామోజీరావు గారు చైర్మన్ గా ఉన్న ఎడిటర్స్ గిల్డ్ ఒక నిజనిర్ధారణ కమిటీ వేసింది. కుల్ దీప్ నాయర్, చెన్నై ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్ జగన్నాధన్ తో పాటు ఆంధ్రప్రభ ఎడిటర్ హోదాలో పొత్తూరి వెంకటేశ్వర రావు గారు కూడా అందులో ఒక సభ్యులు. పొత్తూరివారు విడిగా బెజవాడ వెళ్లి పరిస్తితులను పరిశీలించి ఒక నివేదిక పంపారు. అది ఎలా చేరిందో ఇండియన్ ఎక్స్ ప్రెస్ అధినేత రామనాద్ గోయంకాకు చేరింది. అది ఆయనకు రుచించినట్టు లేదు. వెంటనే వెంకటేశ్వర రావు గారికి ఒక లేఖ పంపారు. ‘మీ నివేదిక నాకు దిగ్భ్రాంతితో కూడిన నిరుత్సాహాన్ని కలిగించింది’ అన్నది దాని సారాంశం. గోయంకా యజమాని. పొత్తూరి వారు ఆయన దగ్గర ఒక ఉద్యోగి. అయినా అలా ఉత్తరం రాయడం ఆయనకు నచ్చలేదు. వెంటనే నిరసనగా రాజీనామా లేఖ గోయంకాకు పంపించారు.
గోయంకా నుంచి పిలుపు వచ్చింది, మద్రాసు వస్తున్నాను అక్కడికి రమ్మని. పొత్తూరిగారు వెళ్ళారు.
“నా ఎడిటర్ అభిప్రాయంతో విబేధించే స్వేచ్చ నాకు లేదా?” అని సూటిగా అడిగారు, రాజీనామా విషయం ప్రస్తావించకుండా గోయంకా.
ఇంకా ఇలా అన్నారు.
“మన పత్రికలో పాఠకుల ఉత్తరాలు ప్రచురిస్తాము కదా. పత్రిక విధానాలతో విబేధించే ఉత్తరాలు కూడా వేస్తుంటాం. యజమానిగా ఒక విషయం మీ దృష్టికి తెచ్చాను. అది మీకు నచ్చలేదు. సరే! ఒక సాధారణ పాఠకుడికి వుండే ఈ వెసులుబాటు కూడా ఒక యజమానిగా నాకు లేదా చెప్పండి”
ఇలాంటి యజమానికి ఏ సంపాదకుడు అయినా ఏం జవాబు చెబుతారు.
అందుకే గుంభనగా వుండిపోయారు. రాజీనామా విషయం పట్టుబట్టలేదు.
గోయంకానే స్వయంగా రాజీనామా లేఖ పొత్తూరి వారి చేతిలో పెట్టి సాదరంగా సాగనంపుతూ అన్నారు.
“మీరు ఎడిటర్ గా ఉన్నంత కాలం మీరు మీ అభిప్రాయాలనే రాస్తూ వుండండి”
పొత్తూరివారి ఆరోగ్యం బాగాలేదని జ్వాలా ద్వారా తెలుసుకున్న తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖరరావు స్వయంగా పొత్తూరి వారిని చూడడానికి విజయనగర్ కాలనీలోని వారి ఇంటికి వెళ్ళారు. అక్కడి పరిస్తితిని ఓ కంట గమనించిన కేసీఆర్ తనదైన శైలిలో స్పందించారు. వారికి పూర్తి స్వస్థత చేకూరేవరకు ఆ బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు అయినప్పటికీ, సుదీర్ఘ కాలం ప్రాంతీయ ఉద్యమాన్ని నడిపిన నేత అయినప్పటికీ ప్రాంతీయతత్వం ఏ కోశానా లేని కేసీఆర్, పొత్తూరి వారిని ఒక పాత్రికేయుడుగా గుర్తించారు కాని, అయన ఏప్రాంతం వారనే వివక్ష చూపలేదు. ఆయనలోని ఈ విలక్షణత్వం పొత్తూరివారికి కూడా తెలుసు. కానీ మొదటే చెప్పినట్టు విలువలకు కట్టుబడి జీవిస్తూ వచ్చిన పాత్రికేయుడాయన. అంచేత కేసీఆర్ సాదరంగా ఇవ్వచూపిన సాయాన్ని వారు సున్నితంగా తిరస్కరించారు.

(01-11-2021) 





అమ్మకు వందనం


శ్రావణ మాసం అనగానే మా అందరికీ నువ్వే గుర్తుకు వస్తావు. జరిగి దాదాపు ముప్పయ్యేళ్ళు కావస్తున్నా ఆ రోజు మా అందరికీ ఇంకా బాగా జ్ఞాపకం వుంది. శుక్రవారం నోముకు అంతా సిద్ధం చేసుకున్న నలుగురు కోడళ్ళు, ఏ నిమిషాన ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో నీ పిల్లలం నలుగురం.
కోడళ్ళని కన్న కూతుళ్ళుగా చూసుకున్న నువ్వు వారి నోముకు అడ్డం ఎలా వస్తావు. పూజలు పూర్తయి, ముత్తయిదువులకు తాంబూలాలు ఇవ్వడం అయిపోయిన తరువాత కానీ నువ్వు దాటిపోలేదంటే అది నీ అవ్యాజ ప్రేమకు నిదర్శనం. ఆ రుణంతీర్చుకోలేనిది.
అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు యావత్ కుటుంబం కాశీ వెళ్లి అంతిమ సంస్కారాల క్రతువు ముగించడం అన్నది నీ ఒక్క విషయంలోనే జరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు నీ ఆబ్దీకం అనేది చుట్టపక్కాలు అందరికీ ఒకచోట కలుసుకునే సందర్భంగా మారిపోయింది. మన ఇంట నలుగురూ కలిసి జరుపుకునే పర్వదినంగా పవిత్రతను సంతరించుకుంది.
నువ్వు ధన్యజీవివి. నీ కడుపునపుట్టి మేము కూడా ధన్యులమయ్యాం.
ఈరోజు నీ పుట్టిన రోజున నిన్ను స్మరించుకుంటూ...



30, అక్టోబర్ 2021, శనివారం

నాకు తెలిసింది సున్నా! – భండారు శ్రీనివాసరావు


చాలామంది అడుగుతుంటారు అభిమానం కొద్దీ, 'మీకు ఇన్నిన్ని విషయాలు ఎలా తెలుసు' అని. కానీ వాళ్లకి తెలియని విషయం ఏమిటంటే 'నాకు తెలిసింది సున్నా' అని.
కొన్నేళ్ళ క్రితం ఇంటింటి సర్వే వాళ్ళు వచ్చి అడిగారు, 'మీ మండలం ఏమిటి, మీ పోలీసు స్టేషన్ ఏమిటీ' అంటూ. నోరెళ్ళబెట్టడం తప్ప నేనేమీ చెప్పలేకపోయాను. నేనున్న ప్రాంతాన్ని బట్టి వాళ్ళే రాసుకుపోయారు కాబట్టి నా అజ్ఞానం పూర్తిగా బయటపడలేదు.
ఒక విషయం మాత్రం నేను రూడిగా చెప్పగలను. అన్నీ తెలుసనుకుంటాం కానీ, చాలామందికి కొన్నే తెలుసు. ఆ తెలిసినవాటిలో కూడా చాలావరకు మిడిమిడి జ్ఞానం బాపతు. అయితే తెలియచెప్పడంలో కాస్త చాకచక్యం చూపిస్తే మనలో నిండి నిబిడీకృతంగా వున్న అజ్ఞాతిమిరం చాలావరకు అంధకారంలోనే వుండిపోతుంది. సరే! ముందు ఈ అంధకారంలో నుంచి బయటపడి అసలు విషయం మాట్లాడుకుందాం.
నేను రేడియోలో పనిచేసేటప్పుడు అనేకమంది రాజకీయ నాయకులు ప్రకటనలు (డబ్బు చెల్లించే వాణిజ్య ప్రకటనలు కాదు, ఏదైనా అంశం మీద తీవ్రాతితీవ్ర ఖండనముండనలు, హర్షాతిరేక ప్రకటనలు, ప్రగాఢ సంతాపసందేశాలు వగయిరా అన్నమాట) పట్టుకుని వస్తుండేవారు. వారిలో ఎక్కువమంది వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మళ్ళీ వారిలో మాజీలు వుండేవారు. వారిలో మళ్ళీ చాలామంది, వారివారి నొసటిరాత ప్రకారం మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా మారి, వారి వారి ఛాంబర్లలోనే విలేకరుల సమావేశాలు పెట్టే స్థాయికి ఎదిగిపోయేవారు. అదివేరే కధ.
అజ్ఞానం గురించి కదా మాట్లాడుకుంటున్నాం. ఇలా ప్రకటనలు పట్టుకొచ్చేవాళ్ళు, వాళ్ళ లెటర్ హెడ్లమీద చక్కగా ఇంగ్లీష్ లో టైపు చేయించుకుని తెచ్చేవాళ్ళు. ఒకనాడు ఒక పెద్దమనిషి, నిజంగా పెద్దమనిషే సుమా, మా వద్దకు వచ్చి ఒక ప్రకటన పాఠం చేతికి ఇచ్చారు. లెటర్ హెడ్డు మీద పలానా నియోజకవర్గం ఎంపీ అని వుంది. నా మట్టి బుర్రకు యెంత పనిచెప్పినా ' నా ముందు కూర్చుని వున్న ఈ ఎంపీ ఆ నియోజకవర్గపు ప్రస్తుత ఎంపీ ఒకరు కాదు' అని చెబుతూనే వుంది. లెటర్ హెడ్డు అధికారికంగా అన్ని హంగులు, మూడు సింహాల గుర్తుతో కొట్టొచ్చినట్టు కనబడుతోంది. కాసేపు ఆ ప్రకటన చదువుతున్నట్టుగా పరకాయించి చూసే సరికి విషయం అర్ధం అవడమే కాకుండా ఆ పెద్దమనిషి మీద జాలి కూడా వేసింది. ఎందుకంటె ఆయన నిజంగా ఆ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు సభ్యుడే. కానీ ప్రస్తుతం కాదు. గతంలో ఎప్పుడో అయిదేళ్ళు ఎంపీగా పనిచేసిన పెద్దాయనే. అయితే ఇప్పుడు మాజీ. 'అశ్వద్ధామ హతః' అన్నట్టు పేరు హోదా పెద్దగా వేసుకుని కింద చిన్న అక్షరాలతో పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరం వరకు అని బ్రాకెట్లో చిన్న అక్షరాలలో ముద్రించారు. అది చూసి 'ఇంకా అడిగిన వాడ్ని కాదు' అని నాకునేనే సమాధాన పడ్డాను.
ఆ విధంగా నా అజ్ఞానం బయటపడే సమయంలో అది బయటపడకుండా నేను జాగ్రత్తగా బయటపడడం వల్ల, ఇదిగో ఇప్పుడిలా, కొంతమందయినా 'నాకు అన్నీ తెలుసు' అని అనుకునేట్టు చేయగలుగుతున్నాను. కానీ, ముందే చెప్పినట్టు, 'నాకు బాగా తెలుసు, నాకు తెలిసింది సున్నా' అని.
తోక టపా: రేడియో 'ప్రకటనకర్త'ల్లో ఒకాయన గురించి చెప్పుకోవాలి. వారంలో రెండు రోజులు ఏదో ఒక 'ఖండన ముండన' ప్రకటన పట్టుకుని వచ్చేవాడు. రాగానే, 'ఇవ్వాళ ఎవరయినా పోయారా, పొతే సంతాపం ప్రకటించేవాళ్ళల్లో నా పేరు కూడా పెట్టండి' అనే వాడు. పోయినవాళ్ళు ఎవరో కూడా తెలియకుండానే సంతాపం చెప్పిన పుణ్యం ఎక్కడికి పోతుంది ? కొన్నాల్టికి, రాష్ట్రంలో ఒక పెద్ద దేవస్థానం కమిటీ సభ్యుడు అయ్యాడు.



29, అక్టోబర్ 2021, శుక్రవారం

ఆరు ఆటంబాంబులతో కాపురం – భండారు శ్రీనివాసరావు

 1975 లో హైదరాబాదుకు వచ్చినప్పుడు కొత్త కాపురం ఇబ్బందులు  ఎలా ఉంటాయో ఏమిటో తెలియకుండా, అశోక్ నగర్ చమన్ దగ్గర  మా రెండో  అన్నయ్య రామచంద్రరావు గారింట్లో కొన్నాళ్ళు కాలక్షేపం చేశాము. తర్వాత వాళ్ళ పక్కనే ఉన్న  ఇంట్లో చిన్న వాటా దొరికితే అక్కడకు మారాము. ఇల్లుగలవాళ్ళు ఆ ఇంటిని ఎవరికో అమ్మివేయడంతో వాళ్ళకీ, మాకూ ఆ ఇంటితో రుణం తీరిపోయింది. మళ్ళీ ఇల్లు వెతుక్కోవాల్సిన పరిస్థితి. సరే! ఎక్కువ వెతుకులాట, ప్రయాస లేకుండానే చిక్కడపల్లి త్యాగరాయ గానసభ సమీపంలో ఒక పోర్షన్ దొరికింది. మాస్కో వెళ్ళే దాకా అక్కడే మా ఆల్ మకాం.  ఆ ఇంటి వాస్తు మహిమ ఏమోకానీ ఎప్పుడూ నలుగురు వచ్చేపోయేవాళ్ళతో కళకళలాడుతూ వుండేది. పగలల్లా మా ఆవిడ నడిపే అమ్మవొడి, సాయంత్రం అయ్యేసరికి రచయితలు, కవులు, ఉన్నతాధికారులతో కూడిన  ఆస్థానంగా మారిపోయేది. ఆఫీసునుంచి నా రాకతో నిమిత్తం లేకుండా జనం జమ అయ్యేవారు. వాళ్లకు, కాఫీలు, ఉప్మాలు, కొండొకచో అర్ధరాత్రి భోజనాలతో మా ఆవిడ నిర్మల అన్నీ అమర్చిపెట్టేది. ఇవన్నీ చూసి రేడియోలో నా సహచరులు, న్యూస్ రీడర్,  ప్రముఖ రచయిత డి. వెంకట్రామయ్య గారు, వండ నలయదు వేవురు వచ్చిరేని నన్నపూర్ణకు నుద్దియౌ నతనిగృహిణి” అనేవారు, మనుచరిత్రలో అల్లసాని పెద్దన గారి పద్యాన్ని ఉటంకిస్తూ. అనడమే కాదు తన జీవిత చరిత్ర గ్రంథంలో  పేర్కొన్నారు కూడా.  

ఇదలా ఉంచుదాం.

‘పొయ్యి పైనా, పొయ్యి లోపలా వున్నవాడే కలవాడు అనేది మా బామ్మగారు. అంటే నలుగురికి సమృద్ధిగా  వండి పెట్టే సరుకులు, పొయ్యి వెలిగించడానికి ఎండు కట్టెలు ఎల్లప్పుడూ ఇంట్లో వుండాలి అనేది ఆవిడగారి మన్ కి బాత్.

ఆ రోజుల్లో లాగా కట్టెల బాధ ఇప్పుడు లేదు. వచ్చిన బాధల్లా  గ్యాస్  సిలిండర్ ఖాళీ అయితేనే. సింగిల్ సిలిండర్ సిస్టం కావడం వల్ల గ్యాస్ అయిపోతే ప్రత్యామ్నాయం వుండేది కాదు. ఆ కాలంలో సామాన్య గృహస్తుకు డబ్బుతో పాటు బాగా కటకటగా ఉండేవి  మరో మూడు. కరెంటు, నల్లా నీళ్ళు, గ్యాస్ సిలిండరు.    

ఇంట్లో నిత్యం జరిగే సంతర్పణలు, సమారాధనలు, సంభారాల భారంతో  నిమిత్తం పెట్టుకోకుండా అవన్నీ అంతా మా ఆవిడ భుజాల మీదకు వదిలేసి, కొరతలుగా ఉన్న ఈ మూడింటి సంగతి చూడడానికి, అధికార దుర్వినియోగం ఆనండి, ఏదైనా అనండి ఎంతదూరం అయినా వెళ్ళేవాడిని. నీళ్ళు రాని రోజున ఏకంగా మంచినీళ్ళ మంత్రి, ఆయన్ని అలానే పిలిచేవాడిని,  మునిసిపల్ శాఖ మంత్రి, బండారు సత్యనారాయణ మూర్తిగారికి పొద్దున్నే ఫోన్ కొట్టేవాడిని. ఆయన విసుక్కోకుండా ‘ట్యాంకర్ కావాలి కదా పంపిస్తాను అనేవారు. అన్నట్టే అరగంటలో మంచి నీళ్ళ ట్యాంకర్ వచ్చి సంపులో  నీళ్ళు నింపి పోయేది మా  ఇరుగు పొరుగుకు కూడా సరిపోయేలా.   

అలాగే కరెంటు. పోవడం ఆలస్యం, విద్యుత్ బోర్డుచైర్మన్ నార్ల తాతారావు గారెకి ఫోన్. ఆయన నా బాధ పడలేక మా ఇంటి దగ్గరలోనే ఓ ట్రాన్స్ ఫార్మర్ వేయించారు.

పొతే మూడోది మరీ ముఖ్యమైనది గ్యాస్ సిలిండర్. ఖాళీ అయిందని మా ఆవిడ ఫోన్ చేసి చెప్పడం ఆలస్యం అన్ని పనులు వదిలిపెట్టి ఆ పనిమీదనే  కూర్చొనే వాడిని.        

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో తెలిసిన జనరల్ మేనేజర్లకు ఫోన్ చేసేవాడిని. అరగంటలో సిలిండర్ డెలివరీ అయిన సంగతి తెలిసిన  తర్వాతనే ఆఫీసు పనయినా  ఏదైనా. నా బాధ ప్రపంచం బాధ అన్నట్టు సాగేది నా వ్యవహారం. అదేమిటో ఆ రోజుల్లో ఒక సిలిండర్ ఇరవై రోజులు కూడా వచ్చేది  కాదు. ఇప్పుడు రెండు నెలలు వస్తోంది. ఈ ఖర్చులు అయితే తగ్గాయి. కానీ మరో రూపంలో పెరిగాయి. పక్షి పిల్లలు రెక్కలు వచ్చి ఎగిరి పోయిన తర్వాత గూడు విశాలమైనట్టు ఇప్పుడు  ఇళ్లు కూడా ఖాళీగా, విశాలంగా  కనిపిస్తున్నాయి.

ఆ తర్వాత అయిదేళ్లు ఇలాంటి ఏ కొరతలు లేని సోవియట్ యూనియన్ లో కాలుమీద కాలేసుకుని దర్జాగా బతికాము. దేనికీ కొరతలేదు, చివరాఖరుకి డబ్బుకు కూడా. పైగా గ్యాసు, కరెంటు, ఫోను, మూడు పడక గదుల ఇల్లు ఉచితం. దాంతో వారానికి రెండు మార్లు, వారాంతపు రోజుల్లో  మాస్కోలోని తెలుగు విద్యార్ధులతో, తెలుగు కుటుంబాలతో  మా ఇల్లు నిత్య కల్యాణం పచ్చ తోరణం.

ఇక అయిదేళ్ళ ప్రవాస జీవితం తర్వాత తిరిగి వస్తే, హైదరాబాదు ఎయిర్ పోర్టులోనే నాటి కమ్యూనికేషన్ల మంత్రి రంగయ్య నాయుడు గారు కలిసి ఫోన్ లేకపోతె ఎల్లా అంటూ ఆయనే చొరవ తీసుకుని  ఫోన్  కనెక్షన్  మంజూరు చేశారు. డిపార్ట్ మెంటు వాళ్ళు మర్నాడు  ఫోను, లాంగ్ కార్డు పట్టుకుని రేడియో స్టేషన్ కు వచ్చారు, ఇల్లెక్కడ అడ్రసు చెప్పండని అంటూ. అప్పటికి రెంటుకు ఇల్లే దొరకలేదు. మా పెద్దన్నయ్య పర్వతాలరావుగారింట్లో ఉంటున్నాము.

ఆకస్మికంగా వచ్చి పడ్డ ఫోన్ కోసం ఇంటి వేట ముమ్మరం చేశాము. చివరికి పంజాగుట్టలోని మా అన్నయ్య ఇంటికి దగ్గరలోనే దుర్గానగర్ కాలనీలో ఓ ఇల్లు దొరికింది. ఓడలో మాస్కో సామాను వచ్చేలోగా  దగ్గరలో ఉన్న మరో పెద్ద ఇంటికి మారాము. అద్దె రెండు వేలు. లంకంత కొంప. ఇంటివాళ్ళు ముస్లిమ్స్. ఎక్కడో ఏదో దేశంలో వుంటారు. ఆ ఇల్లు కట్టిన తాపీ మేస్త్రీకి  చిన్న చిన్న గదులు కట్టడం తెలియదల్లె వుంది. అన్నీపెద్ద పెద్ద  హాల్సే. ఇల్లంతా కట్టిన తర్వాత చూసుకుంటే వంటిల్లు కనబడనట్టుంది. ఏదో చిన్న జాగా చూసి వంట గది అనిపించాడు. ఆ ఇంట్లో మా మాస్కో సామాను భేషుగ్గా సరిపోయింది కానీ సిలిండర్లకు ఆ చిన్న కిచెన్ లో  జాగా దొరకలేదు. దాంతో వున్న ఆరు సిలిండర్లలో  ఒకటి స్టవ్ కు బిగించి, మిగిలిన అయిదింటినీ బయట హాల్లో దసరా బొమ్మల కొలువులా వరసగా పెట్టేవాళ్ళం.

ఆరు సిలిండర్లు కధ ఏమిటంటారా!

నేను మాస్కోనుంచి వచ్చిన తర్వాత కొద్ది రోజులకే అప్పటి పెట్రోలియం మంత్రి చింతా మోహన్ గారు ఓ రెండు,  ఎంపీలు డాక్టర్ మల్లు రవి, రాయపాటి సాంబశివరావు గార్లు చెరి రెండు సిలిండర్లు నోరు తెరిచి అడగకుండానే తమ కోటాలో ఇప్పించారు. దాంతో ఆరు సిలిండర్లు గృహ ప్రవేశం చేసాయి. నట్టింట్లో బాంబులు పెట్టుకుని శ్రీనివాసరావు మళ్ళీ కొత్త కాపురం మొదలు పెట్టాడని ఫ్రెండ్స్ సరదాగా అనేవారు. అయితే మా ఆవిడ పబ్లిక్ రిలేషన్స్ కు అవి బాగా ఉపయోగపడ్డాయి. ఎవరికి ఎప్పుడు సిలిండర్ అవసరమైనా వాళ్ళు గ్యాస్ కంపెనీకి కాకుండా మా ఆవిడకు  ఫోన్ చేసేవాళ్ళు. అలా కొన్నాల్తికి ఎవరికి ఇచ్చామో తెలియని పరిస్థితుల్లో చివరికి మా ఇంట్లో అయిదే మిగిలాయి.

ఈలోగా రూల్స్ మారి ఒక పేరు మీద ఒకే కనెక్షన్ అన్నారు. శాపవిమోచనం అయిన గంధర్వుల మాదిరిగా ఓ మూడు సిలిండర్లు  రెక్కలు కట్టుకుని తమ దేవలోకానికి తరలి పోయాయి. ఆచూకీ దొరక్కుండా పోయిన సిలిండర్ డబ్బు మా చేత కట్టించుకున్నారు. అలా ఆరు సిలిండర్ల కధ కంచికి చేరింది.

ఇక ఇప్పుడు దేనికీ కొరత లేదు, ఒక్క మా ఆవిడ లేదనే చింత తప్ప. అనుభవించే దశలో దాటిపోయింది.

(29-10-2021)    

28, అక్టోబర్ 2021, గురువారం

నడిచి వచ్చిన దారి – భండారు శ్రీనివాసరావు

 ఇక్కడి నా మిత్రులలో అన్ని వయసులవాళ్ళు ఉన్నప్పటికీ చాలామంది కొంచెం అటూఇటూగా నా ఈడువాళ్ళే. నా తరం వాళ్ళే. కాబట్టి మా పెంపకాల్లో, జీవన విధానాల్లో కొంచెం పోలికలు కనిపిస్తాయి. మొదటి మెట్టు మీద కాలు మోపిన దగ్గరినుంచి పడిన కష్టాలు, ఇబ్బందులు ఇప్పుడు పై మెట్టు మీద నిలబడి చూసుకుంటూ వుంటే చాలా వింతగా వుంటుంది. నడిచి వచ్చినదారి ఇలాంటిదా అని ఆశ్చర్యం వేస్తుంది.

ఈరోజు పొద్దున్న ఒక పోస్టు పెడితే మితృలు అనేకమంది స్పందించారు. ధరవరల్లో తేడాలు గురించి మాట్లాడారు.
నిజం చెప్పాలి అంటే నాకు ఇప్పటికీ పాల ప్యాకెట్ ధర ఎంతో తెలియదు.
‘ఇలా గారాబం చేసి మీ ఆయన్ని చెడగొడుతున్నావు అనేవారు మా ఆవిడతో ఆమె ప్రాణస్నేహితురాలు వనం గీత.
వనం జ్వాలా నరసింహారావు, మా అన్నయ్య భండారు రామచంద్ర రావు గారు, నేను కొద్ది సంవత్సరాల తేడాతో హైదరాబాదులో కాపురాలు పెట్టాము. ఈ విషయంలో జ్వాలా సీనియర్. ఆయన భార్య అయిన మా మేనకోడలు విజయలక్ష్మి, మా వదిన గారు విమల, మా ఆవిడ నిర్మల కలిసి చిక్కడపల్లిని కాలినడకన చుట్టబెట్టేవారు. మా అన్నయ్య అప్పటికే స్టేట్ బ్యాంకులో రీజినల్ మేనేజర్. (చీఫ్ జనరల్ మేనేజర్ గా రిటైర్ అయ్యారు). ఉద్యోగ రీత్యా ఎన్నో వ్యాపార సంస్థలకు రుణాలు ఇచ్చారు. కానీ ఆయన అశోక్ నగర్ లో తన ఇంటికి దగ్గరలో వున్న కిరాణా దుకాణంలో రెండు వందలు ఖాతా పెట్టాల్సి వస్తే, తెలిసిన వాళ్ళు ఎవరైనా చెబితే ఇస్తాను అన్నాడు ఆ దుకాణదారు. చివరికి మా మేనకోడలు కూతురి సిఫార్స్ మీద ఆ రెండు వందలు అప్పు పుట్టిందట.
మా మేనకోడలు , మా వదిన గారు అశోక్ నగర్ నుంచి నడుచుకుంటూ త్యాగరాయ గానసభ దగ్గర వున్న మా ఇంటి (అమ్మవొడి)కి వచ్చి మా ఆవిడను తీసుకుని సరుకులు కొనడానికి చిక్కడపల్లి మెయిన్ రోడ్డుకు వెళ్ళేవాళ్ళు.
ఎండ బాగా వుంటే ముగ్గురూ కలిసి ఒక రిక్షా మాట్లాడుకుని మధ్యలో మా ఆవిడను దింపేసి వాళ్ళిద్దరూ అశోక్ నగర్ వెళ్ళేవాళ్ళు.
లక్ష్మీ షో రూములో వాయిదాల మీద చీరెలు కొనుక్కునే వాళ్ళు.
ఆ రోజుల్లో లోటస్ స్టీల్ షాపులో నెలకు పది రూపాయలు చొప్పున పది నెలలు కడితే నెలకోసారి లాటరీ తీసి వంద రూపాయల స్టీలు వస్తువు ఇచ్చేవాడు. ప్రతినెలా ఆ షాపు దగ్గరికి పోవడం, బోర్డు మీద చాక్ పీసుతో రాసిన విజేతల జాబితాలో తమ నెంబరు లేకపోవడం, ఉసూరుమంటూ తిరిగివస్తూ సుధా హోటల్లో టు బై త్రీ కాఫీ తాగడం నెలనెలా ఓ తంతుగా మారింది.
ఇంట్లో అందరి పేరు మీద కట్టినా, లాటరీ ఎప్పుడూ తగలకపోవడంతో, మా వదిన గారు ఓ నెల, మా రెండో పిల్లవాడు సంతోష్ పేరు మీద కడితే మూడో నెలలోనే లాటరీ తగిలిందట. వంద రూపాయల వస్తువు తీసుకుంటూ, మా వాడికి కూడా, పాలు పట్టడానికి ఓ స్టీలు గ్లాసు కొనిచ్చింది.
ఆ రోజుల్లో ఇలా ఇబ్బందులు అందరికీ ఉండేవి కానీ, అవి ఇబ్బందులుగా అనిపించక పోవడానికి కారణం అందరూ ఒకే బోటులో ప్రయాణీకులు కావడమేమో మరి!
(28-10-2021)

ఐ నో సీఎం, ఐ నో పీఎం - భండారు శ్రీనివాసరావు

 మా పాత డైరీల్లో రాసుకున్న పాత విషయాలు

న్యూ ఇయర్ గిఫ్ట్ లకింద జర్బలిష్టులకు యెంత ఖరీదయిన డైరీలు వచ్చినా వాటిల్లో చాలామంది (వారి భార్యలు) రాసుకునేవి కిరాణా పద్దులే. ఎందుకంటే రాసేదంతా ఆఫీసులోనే రాసి వస్తారు కాబట్టి ఇక సొంత గోల రాసుకోవడానికి ఓపికా వుండదు. రాయడానికి విషయాలు వుండవు.
అలా 1973 లో మార్చి నెల 31 వ తేదీన మా ఆవిడ డైరీలో రాసిన ఒక రోజు ఖర్చు చిట్టా ఇది. (అంటే సుమారుగా నలభయ్ ఎనిమిదేళ్ళ కిందటి మాట అన్నమాట)
నూనె : Rs.3-25
నెయ్యి:Rs. 2-75
పెరుగు: Rs.0-20
టమాటాలు:Rs. 0.55
అగ్గిపెట్టె: Rs. 0.10
సబ్బు: Rs.1-00
రిక్షా: Rs. 0-50
వక్కపొడి పొట్లం: Rs. 0-10
(NOTE: నూనె, నెయ్యి కూడా రోజువారీగా కొని సంసారం నడిపిందేమో తెలవదు. ఎందుకంటే జర్నలిష్టులకు ఇల్లు పట్టదు. అంతా ఐ నో సీ ఎం - ఐ నో పీఎం బాపతు)


(2021)
Ramakrishna Jagarlamudi and Subramanyam Dogiparthi

26, అక్టోబర్ 2021, మంగళవారం

రేడియో చిన్నక్క రతన్ ప్రసాద్ – భండారు శ్రీనివాసరావు

 

రతన్ ప్రసాద్ అంటే చాలా మందికి తెలుసు. అదే రేడియో చిన్నక్క అంటే ఒకతరం తెలుగువారిలో తెలియనివారంటూ వుండరేమో!
మొన్న ఫోన్ చేశారు. ఏదో పనిలో వుండి నేను రెస్పాండ్ కాలేదు. రాత్రి నేనే ఫోన్ చేశాను. ఇప్పుడు ఆవిడ హైదరాబాదులో లేరు. ఢిల్లీలో మనుమల దగ్గర వుంటున్నారు. ఎనభయ్ ఎనిమిది సంవత్సరాల ముది వయసులో కూడా ఆమె కంఠస్వరం , ఓ నలభయ్ అయిదేళ్ళ క్ర్తితం నేను రేడియోలో చేరినప్పుడు ఎలా వుందో అలానే వుంది. అమృతం తాగిన ఆ స్వరంలో అతులిత మాధుర్యం అలాగే వుంది ఇప్పటికీ. కట్టుకున్న భర్త, కన్న కొడుకు కళ్ళ ముందే దాటిపోయారు అనే దుఖం ఆవిడ గొంతులో ఇంకా సజీవంగా వుంది. ‘అయితే నా మనుమలు ఇద్దరూ ఈ వయసులో తనని కంటికి రెప్పలా కనిపెట్టుకుని చూస్తున్నారన్న తృప్తితో కొంత ఊరటగా వున్నాను నాన్నా!’ అన్నారావిడ విచారం,ఆనందం సమ్మిళితమైన గొంతుకతో.
ఫ్యాను, ఏసీ వేసుకోవాలన్నా, టీవీ పెట్టుకోవాలన్నా, లైట్లు ఆఫ్ చేయాలన్నా దేనికీ కాలు కదపకుండా తన పడక పక్కనే అన్ని పరికరాలు తనకు అందుబాటులో ఉంచారని, వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిన తర్వాత పాత రోజులు జ్ఞాపకం చేసుకుంటూ రోజులు దొర్లిస్తున్నానని చెప్పుకొచ్చారు.
అదృష్టం! ఆవిడ ధారణ శక్తి ఏమాత్రం తగ్గలేదు. పాత విషయాలు అనేకం చెప్పుకొచ్చారు. (వీటిల్లో చాలా వరకు గతంలో వార్త దినపత్రిక కోసం కె.ఎం.జి. కృష్ణకు ఇచ్చిన ఇచ్చిన ఇంటర్వ్యూలో రతన్ ప్రసాద్ చెప్పారు. Courtesy: రేడియో అభిమాని శ్రీ కప్పగంతు శివరామ ప్రసాద్)
రేడియోలో సంగీతం ఆడిషన్ కోసం వెడితే తన స్వరానికి, ఉచ్ఛారణకు ముచ్చట పడి అనౌన్సర్ గా సెలక్ట్ చేశారట. రేడియో అనౌన్సర్ గా చేనుగట్టు కధాపఠంనంతో 1955లో మొదలైన తన రేడియో ప్రస్థానం సుదీర్ఘ కాలం సాగి 1992లో సెలక్షన్ గ్రేడ్ అనౌన్సర్ గా ముగిసిందని చెప్పారు. కార్మికుల కార్యక్రమంలో చిన్నక్కగా తాను పోషించిన పాత్ర తనను శ్రోతలకు మరింత దగ్గర చేసిందని, అంతకుముందు (ఆవిడ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు) తెలంగాణా యాసలోనే చంద్రి అనే పాత్రలో గ్రామసీమలు కార్యక్రమం నిర్వహించానని గుర్తు చేసుకున్నారు. చిన్నక్క పాత్రకు ముందు రతన్ ప్రసాద్ రమణక్క పేరుతొ ఆ కార్యక్రమాన్ని మరో అనౌన్సర్, వి. సత్యనారాయణతో (పాత్ర పేరు జగన్నాధం) కలిసి నిర్వహించారు. అనుకోకుండా ఒకరోజు ఆ కార్యక్రమం ప్రసారం అవుతున్నప్పుడు జగన్నాధం పాత్రధారి, ‘రమణక్కా! నీకు నోరు ఎక్కువ’ అంటాడు. ఇది ఆంధ్రప్రాంతం శ్రోతలకు మనస్తాపం కలిగించింది. పెద్ద సంఖ్యలో నిరసన లేఖలు వెల్లువెత్తడంతో అధికారులు కొంత కాలం ఆ కార్యక్రమాన్ని నిలిపివేశారు.
తరువాత అదే కార్యక్రమాన్ని పాత్రల పేర్లు మార్చి చిన్నక్క(రతన్ ప్రసాద్), ఏకాంబరం (వి.సత్యనారాయణ) పేర్లతో, మూడో పాత్రను మొదట్లో పెదబాబు (ఉషశ్రీ), తరువాత యాదగిరి ( టీ.వీ.ఆర్కే సుబ్బారావు, ఆ పిమ్మట చాలా కాలం రాంబాబు (డి.వెంకట్రామయ్య) లతో జోడించి ప్రసారం చేయడం మొదలుపెట్టారు.
చాలా ఏళ్ళ కిందట ఓసారి గండిపేటకు గండి పడింది అనే వదంతులతో హైదరాబాదు అట్టుడికి పోయింది. ప్రజలు ప్రాణాలు చేతిలో పట్టుకుని భయాందోళనలకు గురైన సమయంలో ‘వదంతులు నమ్మకండి, మీ ఇళ్లకు వెళ్ళిపొండి’ అంటూ తాను పదేపదే రేడియో ద్వారా విజ్ఞప్తులు చేశానని, మరునాడు పోలీసు కమిషనర్ స్వయంగా రేడియో స్టేషన్ కు వచ్చి తనని అభినందించడం ఇప్పటికీ మరిచిపోలేదని రతన్ ప్రసాద్ చెప్పారు.
ఆవిడ అసలు పేరు రత్నావళి. భర్త ప్రసాద్ పేరులో ప్రసాద్ అనే పదాన్ని, తన పేరులోని రత్న అనే పదాన్ని కలిపి రతన్ ప్రసాద్ గా రేడియో పేరు పెట్టుకున్నారట. (రత్న రతన్ గా మారడానికి కారణం ఉత్తర హిందూస్థానంలోని పై అధికారులు అనేది ఆవిడ నమ్మకం)
సుబ్బులక్ష్మిగారి సంగతితో కదా మొదలు పెట్టింది. కింది ఫోటో చూశారా! ఎం ఎస్ సుబ్బులక్ష్మి గారి కచ్చేరీ. పక్కన నిలబడి రేడియోకి అనౌన్స్ మెంట్స్ చేస్తున్నది అప్పటికి పాతికేళ్ళు కూడా నిండని రేడియో చిన్నక్క అనబడే రతన్ ప్రసాద్.
ఈ కధ ఆవిడ మాటల్లోనే.
“అప్పుడు రేడియో సంగీత సమ్మేళనాలు జరుగుతున్నాయి. జూబిలీ హాల్ వేదిక. అక్కడ ఆహూతుల నడుమ జరిగే ఎం ఎస్ సుబ్బులక్ష్మి సంగీత కచ్చేరీని హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. కార్యక్రమానికి ముందు నేను ఎమ్మెస్ గారెని కలిసి ఆమెగారు పాడబోయే కీర్తనల వివరాలు తీసుకుంటున్నాను. ఏ వరసలో పాడుతారో తెలిస్తే ఒక కీర్తన పూర్తికాగానే మరో కీర్తన పలానాది వినబోతున్నారు అని నేను అనౌన్స్ చేయాలి.
‘ఒక కీర్తన పూర్తికాగానే పక్కకి తిరిగి నావైపు చూస్తే చాలు ఆ సంకేతాన్ని అందుకుని నేను అనౌన్స్ మెంట్ చేస్తాను’ అని ఆవిడగారితో చెప్పాను. అప్పుడు ఎమ్మెస్ తన అరచేతిని చాపి ఇలా అన్నారు, ‘నేను ఉంగరపు వేలు చూపెడితే మరొక కీర్తన వుందని అర్ధం. చిటికిన వేలు ముడిచి చూపిస్తే అదే ఆఖరి కీర్తన అనుకోండి’.
కచ్చేరీ పూర్తయిన తరువాత ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు నాతొ చెప్పారు మెచ్చుకోలుగా.
‘బాగా అనౌన్స్ చేశావు, మంచి సంగీత పరిజ్ఞానం వున్నదానివే’
ఆవిడ ఇచ్చిన ఈ చిన్ని కితాబు నాకు పెద్ద ఆస్కారుతో సమానం’
ఇలా రతన్ ప్రసాద్ ఫోనులో చెబుతూనే వున్నారు. నాకూ వినాలనే వుంది కానీ అవన్నీముక్కున పెట్టుకుని రాయాలి కదా!
అంచేత మళ్ళీ మరో రోజు నేనే ఫోన్ చేస్తాను అని సంభాషణ ముగించ బోయాను. ఇదంతా నేను బుద్ధిగా విన్నది రాయడానికి అని ఎలా గ్రహించారో ఏమో!
చటుక్కున ఇలా అన్నారు.
‘నాన్నా! నాదో కోరిక. నువ్వు రాసేవన్నీ మా మనుమలు చదువుతుంటారు. నా గురించి కూడా ఏమైనా రాయవూ?
కళ్ళు చెమర్చాయి. నోరు పూడుకుపోయింది.
ఫోన్ పెట్టేసాను, కంప్యూటర్ ముందు కూర్చోడానికి.


(26-10-2019)