11, సెప్టెంబర్ 2021, శనివారం
మరో చిత్తరువు జ్ఞాపకం
10, సెప్టెంబర్ 2021, శుక్రవారం
మిచ్చామి దుఃఖడం – భండారు శ్రీనివాసరావు
పూర్వం కార్డులు, కవర్లు రాజ్యమేలే రోజుల్లో ప్రతి ఉత్తరం విధిగా ‘తప్పులున్న క్షమించగలరు’ అనే అభ్యర్ధనతో ముగిసేది.
అమెరికా ఉలిక్కిపడ్డ రోజు – భండారు శ్రీనివాసరావు
భయపెట్టడమే తప్ప భయమంటే ఏమిటో తెలియని అగ్రరాజ్యం అమెరికా మొట్టమొదటిసారి ఉలిక్కి పడింది 2001 సెప్టెంబర్ పదకొండవ తేదీన.
కారణం, అమెరికా గడ్డమీద
ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం వలస వచ్చిన వారికీ, నేటివ్ రెడ్
ఇండియన్లకు నడుమ జరిగిన పోరాటాలు మినహాయిస్తే అభివృద్ధిచెందిన దేశంగా, అన్ని దేశాల్లో
తలమానికంగా రూపొందిన తర్వాత అక్కడ యుద్ధాలు జరిగింది లేదు. ఆ దేశంపై ఒక దాడి
జరిగిందీ లేదు. అమెరికన్ సైన్యాలు ఎక్కడో సుదూరంగా ఉన్న వియత్నాం, కొరియావంటి చిన్న
దేశాలపై జరిగిన దాడుల్లో పాల్గొన్నాయి కానీ ఆ దేశం మీద దండెత్తిన దేశం అంటూ లేదు, ఎప్పుడో మొదటి
ప్రపంచ యుద్ధంలోనో, ద్వితీయ ప్రపంచ సంగ్రామంలోనో అరుదుగా జరిగిన సంఘటనలు తప్ప.
అలాంటి దేశంపై
ఇటీవలి కాలంలో జరిగిన మొటమొదటి విదేశీ దాడి రెండువేల ఒకటో సంవత్సరం
సెప్టెంబర్ పదకొండో తేదీన. అమెరికాకు గర్వకారణంగా నిలచిన వరల్డ్ ట్రేడ్
సెంటర్ ఆకాశ హర్మ్యాల జంటను విమానాలతో డీకొట్టి
కూల్చివేయడం ఒక్కటే అయితే దాడి అనలేము కానీ, అమెరికా రక్షణ
శాఖకు చెందిన ప్రతిష్టాత్మక కార్యాలయం ‘పెంటగాన్’ పై జరిగిన దాడితో కలిపి చూస్తే
ఇది నిస్సంశయంగా అమెరికా దేశంపై శత్రు మూకల దాడిగానే పరిగణించాలి.
ఈ దాడితో
బెంబేలెత్తిపోయిన అగ్రదేశం ఇటువంటివి పునరావృతం కాకుండా అనేక భద్రతా చర్యలు
తీసుకుంది. ఫలితంగా స్వేచ్చా ప్రియులయిన అమెరికన్ పౌరులు భద్రత పేరుతొ
తీసుకుంటున్న అనేక చర్యలతో విసుగెత్తి పోతున్నారు.
పొతే, అమెరికన్
ప్రభుత్వం తనపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకుంది. దాడికి కారకుడయిన ఉగ్రవాద
నాయకుడు లాడెన్ ను మట్టుబెట్టేంత వరకు నిద్రపోలేదు. పాకీస్తాన్ లో తలదాచుకున్న
లాడెన్ ఆచూకీ పట్టుకుని అతడ్ని కాల్చి చంపడమే కాకుండా లాడెన్ భౌతిక కాయాన్ని
సముద్ర జలాల్లో ముంచేసి ఇక అతడి శవాన్ని జలచరాలకు ఆహారంగా చేసింది. లాడెన్ ను
అమెరికన్ సీక్రెట్ పోలీసులు వేటాడి వధిస్తున్న లైవ్ దృశ్యాలను ఆనాటి అమెరికా
అధ్యక్షుడు వైట్ హౌస్ లో కూర్చుని చూడడం జరిగిందంటే తనపై జరిగిన దాడికి ఆ దేశం
ఎంతగా కక్ష పెంచుకున్నదో అర్ధం అవుతుంది.
అప్పటిదాకా ప్రపంచంలో
అన్ని దేశాలను, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలను పట్టి పీడిస్తున్న ఉగ్రవాదభూతం ఎంత ప్రమాదకరమో అమెరికాకు కూడా తెలిసివచ్చింది. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో
నలిపివేస్తామని ప్రకటనలు చేసే దేశాల జాబితాలో అమెరికా చేరిపోయింది.
అయితే ఇవన్నీ షరా
మామూలు ప్రకటనలుగా మిగిలిపోకూడదు. ఉగ్రవాదం ఒక దేశాన్ని బలహీన పరచడం తమకు
రాజకీయంగా మంచిదే అని అనేక దేశాలు తలపోస్తూ వుండడం అంతగోప్యమేమీ కాదు. తమ
ప్రత్యర్ధి దేశం ఉగ్రవాదపు కబంధ హస్తాలలో నలిగిపోవడం కొందరికి కొంత ఉపశమనం
కలిగించవచ్చు. కానీ అది తాత్కాలికమే. పెంచి పోషించే ఉగ్రవాద భూతానికి కృతజ్ఞత
ఉంటుందని ఆశించడం అత్యాశే అని అనేక దేశాల విషయంలో పలుమార్లు రుజువయింది. ఎందుకంటే
ఉగ్రవాద ఉన్మాదులకు వివేచన పూజ్యం. వారికి తలకెక్కిన తలతిక్క మినహా మరేదీ
తలకెక్కదు. నాశనం, వినాశనం అనే రెండు పదాలే తప్ప వారికి శాంతి వచనాలు తెలవ్వు. ‘చంపు, లేదా చచ్చిపో’ అనే
రెండే రెండు పదాలు వంటబట్టించుకున్న మరమనుషుల వంటి వాళ్ళు ఈ ఉగ్రవాదులు.
ఈ ఉగ్రవాదుల బలం
అవతలి వాళ్ళలోని చావు భయం. చావు భయం లేకపోవడం వారికున్న మరో బలం. సంఖ్యాబలం రీత్యా
చూస్తే అత్యంత బలహీనులయిన వీరు ఇంతగా రెచ్చిపోవడానికి ప్రధాన కారణం, వారిని ఎదురించాల్సిన
శక్తుల మధ్య ఐకమత్యం లేకపోవడం.
ప్రపంచంలో ఎక్కడ
ఉగ్రవాదులు జెడలు విదిల్చినా వీరందరూ గళం కలిపి చెప్పే మాట ఒక్కటే. ఉగ్రవాదాన్ని
ఉక్కుపాదంతో అణచి వేస్తామని. కానీ కార్యాచరణ శూన్యం.
అధిక సంఖ్యలో
వున్న మంచివారి మౌనమే అల్పసంఖ్యలో వున్న ఉగ్రవాదుల బలం. కలిసికట్టుగా అందరూ కృషి
చేస్తే ఉగ్రవాద భూతాన్ని ప్రపంచం నుంచి తరిమివేయడం అంత అసాధ్యమేమీ కాదు. కానీ ఈ
విషయంలో ఎవరి ఆలోచనలు వారివి. ఎవరి స్వార్ధాలు వారివి.
వీటి నుంచి ప్రపంచ
దేశాలు బయట పడనంత వరకు ఉగ్రవాదులు తోకలు ఝాడిస్తూనే వుంటారు.
9, సెప్టెంబర్ 2021, గురువారం
నందమూరి తారకరామారావు గారితో ఓ జ్ఞాపకం
ఉమ్మడి రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం సాగుతున్నరోజులు. ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును అధికారం నుంచి అక్రమంగా తొలగించారని, ఆయన్ని వెంటనే తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని కోరుతూ ఆ ఉద్యమం మొదలయింది.
ఎన్టీఆర్ ని సమర్ధిస్తున్న టీడీపీ
సభ్యులతోపాటు మిత్ర పక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా హైదరాబాదు, ముషీరాబాద్ లోని రామకృష్ణా స్టుడియోలో బస చేస్తున్నారు. అందులోకి పోవాలన్నా, బయటకి రావాలన్నా బోలెడన్ని ఆంక్షలు ఉండేవి. అయితే విలేకరులు మాత్రం తమ
గుర్తింపు కార్డులు చూపించి వెళ్ళే వెసులుబాటు వుండేది. ఇక రేడియో విలేకరిగా నేను
దాదాపు ప్రతిరోజూ వెళ్లి వస్తుండేవాడిని.
ఒకరోజు నాతోపాటు మిత్రుడు జ్వాలా
నరసింహారావు, మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు
కూడా వచ్చారు.
లోపలకు వెళ్ళాము. స్టూడియో అంతా
సందడిగా వుంది. ఎమ్మెల్యేలు పేపర్లు చదువుతూ, పచార్లు
చేస్తూ అటూ ఇటూ తిరుగుతున్నారు. చంద్రబాబునాయుడు కూడా హడావిడిగా తిరుగుతూ పైనుంచి
అన్నీ కనుక్కుంటూ వున్నారు. ఆయన్ని పలకరించి ఏమిటి న్యూస్ అని అడిగితే
"రిలెయబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం రేపు ఎల్లుండిలో కేంద్రం నుంచి మాకు
అనుకూలమైన నిర్ణయం వస్తుంది" అని చెప్పారు.
(ఆయన అన్నట్టే రెండోరోజున ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం
చేశారు)
తర్వాత ఖమ్మం సీపీఎం ఎమ్మెల్యే మంచికంటి రాంకిషన్ రావు గారి వద్దకు వెళ్ళాము. మాకు బంధువు కూడా. ఆయన కాస్త దిగులుగా కనిపించారు. భార్యకు ఒంట్లో నలతగా వున్నట్టు ఇంటి నుంచి
కబురు వచ్చినట్టు వుంది.
ఆయన మాతో చెప్పారు.
“రామారావు గారితో విషయం చెప్పి ఓ రెండు రోజులు ఖమ్మం వెళ్లి వద్దామని వారి
దగ్గరకు వెళ్లాను. మా ఆవిడ సుస్తీ సంగతి చెప్పాను. ఆయన ఇలా అన్నారు. ‘రాం కిషన్
రావు గారు, మీరు పెద్దవారు. మీకు చెప్పదగిన వాడిని
కాను. కానీ నా విషయం తీసుకోండి. మా ఆవిడ (శ్రీమతి బసవ తారకం) మద్రాసు కేన్సర్
ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య వుంది. అయినా నేను వెళ్ళలేని పరిస్తితి. పెద్ద మనసుతో
కాస్త అర్ధం చేసుకోండి’ అని ఆ పెద్దమనిషి
అంటుంటే ఇక నేనేమి మాట్లాడను?” అంటూ
ముగించారు రామకృష్ణారావు గారు.
8, సెప్టెంబర్ 2021, బుధవారం
రాపిడ్ కోవిడ్ టెస్ట్
కరోనా కు టీకా అందుబాటులోకి రాగానే హైదరాబాదులో కోవాక్సిన్ మొదటి డోసు తీసుకున్న మొదటి వరుస వారిలో నేనున్నాను. అలాగే రెండో డోసు కూడా సకాలంలోనే తీసుకున్నాను.
ఈ
నేపధ్యంలో ఈరోజు నాకు రాపిడ్ కోవిడ్ టెస్ట్ చేశారు. అదీ రాజ్ భవన్ లో.
రాజ్ భవన్ నాకు కొత్త కాదు. అక్కడ పనిచేస్తున్న పాత సిబ్బందిలో అనేకమంది
నన్ను గుర్తు పట్టి పలకరిస్తూ వుంటారు. అలాంటిది ఈరోజు నేను పదకొండు గంటల
ప్రాంతంలో రాజ్ భవన్ మెయిన్ గేటు దాటి
లోపలకు వెళ్ళగానే అక్కడ వున్న సిబ్బందిలో ఒకరు కొంచెం ముందుకు వెళ్ళమని చేత్తో సైగ చేశారు. అలానే
వెడితే, అక్కడ రెండు తాత్కాలిక
గుడారాలు వున్నాయి. నాకంటే ముందు చేరుకున్న కొందరు సీనియర్ జర్నలిష్టులు, శ్రీయుతులు దాసుకేశవ రావు, గోవిందరాజు చక్రధర్, నందిరాజు రాధాకృష్ణ, ఉడయవర్లు మొదలైన వాళ్ళు అక్కడ క్యూలో నిలబడి వున్నారు. మా మొబైల్ నెంబర్లు
తీసుకున్నారు. కోవిడ్ టీకా ఎన్ని డోసులు తీసుకున్నారు అనే విషయం ఆరా తీశారు. అక్కడ
కుర్చీల్లో కూర్చోబెట్టి ముక్కుల్లోకి ఏదో గొట్టం లాంటిది పెట్టి చూసారు. కాసేపటి
తరువాత ఏమీ లేదు, ఇప్పుడు వెళ్ళండి అని మర్యాదగానే చెబుతూ రాజ్ భవన్ లోపలకి
అనుమతించారు.
కోవిడ్
గురించి జాగ్రత్తలు తీసుకుంటున్న పద్దతి కొంచెం వింతగా అనిపించింది.
(08-09-2019)
సీడ్ గణేష్ మంచి ఆలోచన – భండారు శ్రీనివాసరావు
“నేను పురుళ్లు పోసే డాక్టర్ని, ఆ మాత్రం నెగ్గుకురాలేనా?”
ఈ మాట
అన్నది తెలంగాణా గవర్నర్ డాక్టర్ తమిళిసై
సౌందరరాజన్.
తెలంగాణా
గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని
ఈరోజు రాజ్ భవన్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వర్కింగ్ జర్నలిస్టులతో
పాటు కొందరు సీనియర్ పాత్రికేయులను కూడా ఆహ్వానించారు.
“రెండేళ్ల
క్రితం నన్ను నవజాత రాష్ట్రం తెలంగాణాకు గవర్నర్ గా నియమించినప్పుడు కొందరు ఎలా
నిభాయించుకు రాగలుగుతానని సందేహపడ్డారు. నేను వృత్తి రీత్యా డాక్టర్ని. అందులోను గైనకాలజిస్ట్ ని.
నవజాత శిశువులను కనిపెట్టి చూడడం నాకు కొత్తేమీ కాదు అనుకున్నాను. అదే ధీమాతో
పనిచేస్తూ వచ్చాను. ఈ క్రమంలో సమాజ శ్రేయస్సుకి పనికివచ్చే అనేక కార్యక్రమాలు
నిర్వహించాను. మళ్ళీ నాకు పుదుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు
అప్పగించారు. తిరిగి అవే సందేహాలు. నా సమాధానం మళ్ళీ అదే. నేను గైనకాలజిస్ట్ ని.
కవల పిల్లల్ని కూడా సాగగలను”
గత రెండేళ్ల
కాలంలో రాష్ట్ర గవర్నర్ గా తాను చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలను సోదాహరణంగా వివరించే
సచిత్ర మాలిక గ్రంధాన్ని (Coffee
Table Book) శ్రీమతి డాక్టర్ తమిళిసై ఆవిష్కరించారు.
ఆహూతుల్లో
కొందరిని నాలుగు ముక్కలు మాట్లాడమన్నారు.
నేనూ ఓ మూడు ముక్కలు చెప్పాను.
విలేకరులు
అడిగిన అనేక ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానాలు ఇచ్చారు. పత్రికల ఎడిటర్లను, సీనియర్ పాత్రికేయులతో విడిగా
ఆత్మీయ సమావేశం జరిపారు.
చక్కటి
విందు భోజనంతో ఈ సమావేశం ముగిసింది.
(08-09-2021)