8, సెప్టెంబర్ 2021, బుధవారం

రాపిడ్ కోవిడ్ టెస్ట్

 కరోనా కు టీకా అందుబాటులోకి రాగానే హైదరాబాదులో కోవాక్సిన్ మొదటి డోసు తీసుకున్న మొదటి వరుస వారిలో నేనున్నాను. అలాగే రెండో డోసు కూడా సకాలంలోనే  తీసుకున్నాను.

ఈ నేపధ్యంలో ఈరోజు నాకు రాపిడ్ కోవిడ్ టెస్ట్ చేశారు. అదీ రాజ్ భవన్ లో.

రాజ్  భవన్ నాకు కొత్త కాదు.  అక్కడ పనిచేస్తున్న పాత సిబ్బందిలో అనేకమంది నన్ను గుర్తు పట్టి పలకరిస్తూ వుంటారు. అలాంటిది ఈరోజు నేను పదకొండు గంటల ప్రాంతంలో  రాజ్ భవన్ మెయిన్ గేటు దాటి లోపలకు వెళ్ళగానే అక్కడ వున్న సిబ్బందిలో ఒకరు కొంచెం  ముందుకు వెళ్ళమని చేత్తో సైగ చేశారు. అలానే వెడితే, అక్కడ రెండు తాత్కాలిక గుడారాలు వున్నాయి. నాకంటే ముందు చేరుకున్న కొందరు సీనియర్ జర్నలిష్టులు, శ్రీయుతులు దాసుకేశవ రావు, గోవిందరాజు చక్రధర్, నందిరాజు రాధాకృష్ణ, ఉడయవర్లు మొదలైన వాళ్ళు  అక్కడ క్యూలో నిలబడి వున్నారు. మా మొబైల్ నెంబర్లు తీసుకున్నారు. కోవిడ్ టీకా ఎన్ని డోసులు తీసుకున్నారు అనే విషయం ఆరా తీశారు. అక్కడ కుర్చీల్లో కూర్చోబెట్టి ముక్కుల్లోకి ఏదో గొట్టం లాంటిది పెట్టి చూసారు. కాసేపటి తరువాత ఏమీ లేదు, ఇప్పుడు వెళ్ళండి అని  మర్యాదగానే చెబుతూ రాజ్ భవన్ లోపలకి అనుమతించారు.

కోవిడ్ గురించి జాగ్రత్తలు తీసుకుంటున్న పద్దతి కొంచెం వింతగా అనిపించింది.  



(08-09-2019)  

సీడ్ గణేష్ మంచి ఆలోచన – భండారు శ్రీనివాసరావు

 

ఎవరికి వారే ఇంట్లోనే గణేష్ ప్రతిమల నిమజ్జనం చేసే ఆలోచన తెలంగాణా ప్రభుత్వం చేసింది.
ఇదిగో కింది బొమ్మల్లో కనబడే ఈ ప్రతిమను పూర్తిగా మట్టితో తయారు చేశారు. గణేష్ పూజ పూర్తయిన తర్వాత విసర్జన సమయంలో ఈ ప్రతిమపై నీళ్ళు చల్లాలి. ఆ నీటిలో ప్రతిమ పూర్తిగా కరిగిపోతుంది. ఏడో రోజున అందులో ఉంచిన విత్తనం నుంచి మొక్క మొలకెత్తుతుంది. పదిహేనో రోజుకి మొక్క పూర్తిగా పెరుగుతుంది అని ఈ ప్రతిమను ఉంచిన చక్కటి ప్యాకింగ్ పై రాసి వుంది.
హైదరాబాదు ప్రెస్ క్లబ్ ద్వారా ఇది నాకు అందింది. వారికి ధన్యవాదాలు.



(08-09-2021)

“నేను పురుళ్లు పోసే డాక్టర్ని, ఆ మాత్రం నెగ్గుకురాలేనా?”

 

ఈ మాట అన్నది తెలంగాణా గవర్నర్ డాక్టర్  తమిళిసై సౌందరరాజన్.

తెలంగాణా గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు రాజ్ భవన్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వర్కింగ్ జర్నలిస్టులతో పాటు కొందరు సీనియర్ పాత్రికేయులను కూడా ఆహ్వానించారు.

“రెండేళ్ల క్రితం నన్ను నవజాత రాష్ట్రం  తెలంగాణాకు  గవర్నర్ గా నియమించినప్పుడు కొందరు ఎలా నిభాయించుకు రాగలుగుతానని సందేహపడ్డారు. నేను వృత్తి  రీత్యా డాక్టర్ని. అందులోను గైనకాలజిస్ట్ ని. నవజాత శిశువులను కనిపెట్టి చూడడం నాకు కొత్తేమీ కాదు అనుకున్నాను. అదే ధీమాతో పనిచేస్తూ వచ్చాను. ఈ క్రమంలో సమాజ శ్రేయస్సుకి పనికివచ్చే అనేక కార్యక్రమాలు నిర్వహించాను. మళ్ళీ నాకు పుదుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. తిరిగి అవే సందేహాలు. నా సమాధానం మళ్ళీ అదే. నేను గైనకాలజిస్ట్ ని. కవల పిల్లల్ని కూడా సాగగలను”   

గత రెండేళ్ల కాలంలో రాష్ట్ర గవర్నర్ గా తాను చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలను సోదాహరణంగా వివరించే సచిత్ర మాలిక గ్రంధాన్ని (Coffee Table Book)  శ్రీమతి డాక్టర్ తమిళిసై ఆవిష్కరించారు.

ఆహూతుల్లో కొందరిని  నాలుగు ముక్కలు మాట్లాడమన్నారు. నేనూ ఓ మూడు ముక్కలు చెప్పాను.

విలేకరులు అడిగిన అనేక ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానాలు ఇచ్చారు. పత్రికల ఎడిటర్లను, సీనియర్ పాత్రికేయులతో విడిగా ఆత్మీయ సమావేశం జరిపారు.

చక్కటి విందు భోజనంతో ఈ సమావేశం ముగిసింది.








(08-09-2021)  

7, సెప్టెంబర్ 2021, మంగళవారం

వ్యాపకాల జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు

 వెనుకటి రోజుల్లో -

రేడియో ఒక్కటే రాజ్యమేలుతున్న కాలంలో-

ఒక పెద్ద మనిషి నేను పనిచేస్తున్న ఆకాశవాణి కార్యాలయానికి ఫోన్ చేసి, ' మీ రేడియో వార్తలు వినలేక చస్తున్నాము ' అన్నాడు కోపంగా.

'పరిష్కారం మీ చేతుల్లోనే వుందికదా' అన్నాను జవాబుగా.

ఇందులో సమాధానం కన్నా ఎకసక్కెం పాలు ఎక్కువ వుందనుకున్నాడో ఏమో - 'ఎలా?' అన్నాడు మరింత కోపంగా.

'మీ రేడియో నాబ్ ని ఎడమవైపు తిప్పండి సరిపోతుంది.' అన్నాను కూల్ గా.

రేడియో పెట్టుకోవడం, ఆపుచేసుకోవడం మీ చేతుల్లో పనే కదా! అన్నట్టుగా ధ్వనించిన నా జవాబులో - ఏదయినా చమత్కారం తోచిందో ఏమో కాని, 'భలే వారే' అంటూ ఫోన్ పెట్టేసాడా శ్రోత.

మీడియాలో పనిచేస్తున్నప్పుడు ఇలాంటి అనుభవాలు మామూలే.

అయితే- ఎంతో కష్టపడి ప్రోగ్రాం తయారుచేసామనే భావనతో వుండే సిబ్బంది - విమర్శలను తట్టుకోలేకపోవడం కూడా సహజమే. కానీ, ఇక్కడ మరో నిజం కూడా ఒప్పుకోవాలి. వ్యంగాస్త్రాలను అలవోకగా సంధించగల మీడియా వారు కూడా కొండొకచో వ్యంగాన్ని భరించలేరు. కొన్ని పాళ్ళు స్వామి భక్తీ, కొన్నిపాళ్ళు వృత్తిమీది అనురక్తి - కలగలసి వారినలా మారుస్తుంది. అయితే- విమర్శలు చేసేవారికి - వాటిని స్వీకరించగల సహృదయత వుండాలనుకోవడం అత్యాశ కాదేమో!

ఆలోచిస్తే తప్పేముంది?

 

6, సెప్టెంబర్ 2021, సోమవారం

చింతించి వగచిన ఏమి ఫలము? - భండారు శ్రీనివాసరావు

 ఆ రోజులే వేరు. వొంట్లో యువ రక్తం సలసలా మరుగుతుండేది. మొత్తం ప్రపంచాన్ని ఒక్కమారుగా మార్చేసి నాకు నచ్చిన లోకాన్ని సృష్టించాలని తహతహ లాడుతుండే వాడిని. కానీ ఏమయింది. ప్రపంచాన్ని మార్చడం నా వల్ల కాదని తేలిపోయింది. పోనీ, ప్రపంచం సంగతి అక్కడితో వొదిలేసి నా దేశాన్ని సంస్కరించుకుంటే సరిపోలా అని అనుకున్నాను.

ఆ ప్రయత్నం కూడా వృధా అని త్వరలోనే తెలిసిపోయింది. దాంతో దేశం గొడవ పక్కనబెట్టి మా వూరిని బాగుచేద్దామని పూనుకున్నాను.

అయితే వూరును బాగుచేయడం అన్నది నా ఒక్కడివల్లా అయ్యే పని కాదని తెలిసిరావడానికి కూడా ఎక్కువ కాలం పట్టలేదు.

ఇక అప్పుడు కానీ నాకు నా కుటుంబం గుర్తుకు రాలేదు. ముందు కుటుంబం బాగోగులు చూడాలనిపించింది. కానీ అప్పటికే వయసు మీద పడింది. వెనుకటి సత్తువా లేదు. మునుపటి ఓపికా లేదు.

బోధి వృక్షం లేకుండానే నాకు జ్ఞానోదయం అయింది. కళ్ళు తెరిపిళ్ళు పడ్డాయి. ముందు నన్ను నేను మార్చుకుంటే యెలా వుంటుంది అన్న ఆలోచన మొదలయింది. మొదటే ఈ పని చేసివుంటే ఎంత బాగుండేదో కదా!

క్రమంగా నా ఆలోచనలు కొత్త రూపం తీసుకున్నాయి.

మార్పు అనేది ముందు నాతో మొదలయివుంటే ఆ ప్రభావం నా కుటుంబం పైన పడేది. నేనూ నా కుటుంబం కలిసి మా వూరిని మార్చేవాళ్ళం. మా వూరు బాగుపడితే దానివల్ల నా దేశం బాగుపడివుండేది. మొత్తం ప్రపంచాన్ని మార్చాలని చిన్నతనంనుంచి కంటున్న నా కల ఆ క్రమంలో ఫలించి వుండేది. కానీ ఏంలాభం? శక్తియుక్తులన్నీ ఉడిగిపోయిన తరవాత కానీ తత్వం బోధపడలేదు.

ప్రాధాన్యతలను నిర్ణయించుకోవడం లో నేను చేసిన ఈ పొరబాటు మరెవ్వరూ చేయకూడదని చెప్పడానికే ఈ నాలుగు ముక్కలు.”

(పదకొండో శతాబ్దానికి చెందిన ఓ సన్యాసి చెప్పిన నీతి కధ ఆధారంగా)

 

తరాల అంతరం – భండారు శ్రీనివాసరావు

 

చనిపోయే ముందు కొడుక్కు చెప్పాడు తండ్రి.

నేను ప్రతి రోజూ ఉదయం స్నానం చేసి దేవుడికి దీపం పెట్టి ‘సర్వే జనాస్సుఖినో భవంతు’ అని కోరుకుంటూ ఉండేవాడిని. నువ్వూ అలాగే కోరుకో’ అని కన్నుమూశాడు.

కొడుకు తండ్రి చెప్పినట్టే చేశాడు. కాకపోతే కొద్దిగా మార్చి దేవుడ్ని వేడుకున్నాడు.

నేను బాగుండాలి. అందరూ బాగుండాలి’

అతడికీ ఒకరోజు చివరి రోజు వచ్చేసింది.

తన కొడుకుని పిలిచి తనకు తన తండ్రి చెప్పినట్టే చెప్పి చనిపోయాడు.

అతడి కొడుకూ తండ్రి చివరి కోరికను కొద్దిగా మార్చి నెరవేర్చాడు.

ముందు నేను బాగుంటేనే కదా! ఇతరుల బాగోగులు చూసేది. కాబట్టి నేను బాగుండేటట్టు చూడు స్వామీ!’

అనేది అతడి ప్రార్ధన.

5, సెప్టెంబర్ 2021, ఆదివారం

వసంత్ విహార్ ఓ జ్ఞాపకం – భండారు శ్రీనివాసరావు

 

ఒకానొక కాలంలో పనుల మీద వివిధ జిల్లాల నుంచి హైదరాబాదు వచ్చే ఆ నాటి కాంగ్రెస్ నాయకులకు ఆబిడ్స్ లో వుండే వసంత్ విహార్ హోటల్ ఒక విడిది. నాకు బాబాయి వరస అయ్యే నాటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బొమ్మకంటి సత్యనారాయణ రావు గారు ఎప్పుడు హైదరాబాదు వచ్చినా ఆ హోటల్లోనే దిగేవాడు. ఒక నెంబరు గదిని ఆయన కోసం ప్రత్యేకించేవారు. అంతే కాదు పీటలు వేసి విస్తరిలో భోజనం వడ్డించే వారు. మర్రి చెన్నారెడ్డి వంటి నాయకులు బొమ్మకంటిని కలుసుకోవడానికి ఆ హోటల్ కు వెళ్ళే వాళ్ళు. ఆ రోజుల్లో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా వుండడం వల్ల ఆయనకు ఆ గౌరవం. బొమ్మకంటి తెలంగాణాకు చెందిన రాజకీయ నాయకుడు అయినప్పటికీ సమైక్యవాది.

నేను రేడియోలో చేరడానికి చాలా ముందుగానే నా మిత్రుడు వనం జ్వాలా నరసింహారావు పై చదువులు, ఉద్యోగం నిమిత్తం హైదరాబాదులోనే ఆయన మకాము. చిన్నప్పటి నుంచి  తన గ్రామ రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటూ ఉండేవాడు. పాలిటిక్స్  అంటే తగని ఆసక్తి. నాకు ఆసక్తి ఎలావున్నా వృత్తిరీత్యా రాజకీయ నాయకులను కలుసునే వెసులుబాటు వుండేది.

ఒకరోజు జ్వాలా నన్ను ఆయన స్కూటర్ పై  ఎక్కించుకుని ఆబిడ్స్ లోని వసంత్ విహార్ కు తీసుకువెళ్లాడు.

అప్పటికే జాతీయ పార్టీ కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధి నాయకత్వంలో  కాంగ్రెస్ (ఐ) పార్టీ ఏర్పాటు అయింది. కొత్త పార్టీ పట్ల రాష్ట్రంలోని పాత కాంగ్రెస్ నాయకులకు ఆట్టే గురి కుదరలేదు. గుర్తింపు కలిగిన నాయకత్వం కొరత వుంది. చెన్నారెడ్డి అప్పటికి ఇంకా ఆ పార్టీ  రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు తీసుకోలేదు.

ఈ నేపధ్యంలో మేము వసంత్ విహార్ హోటల్లో బస చేసిన బొమ్మకంటి సత్యనారాయణ రావు గారెని కలుసుకున్నాము. (మేము ఆయన్ని సత్యం బాబాయ్ అని పిలుస్తాము. ఆయన కుమారుడే బొమ్మకంటి శంకర రావు, ఐ.పి.ఎస్.  పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ గా రిటైర్ అయ్యాడు)

మామూలుగా కుటుంబ క్షేమ సమాచారాలు వగైరా మాట్లాడుకున్న తరువాత జ్వాలా ఆయన్ని నేరుగా రాజకీయాల్లోకి దించాడు. ఇందిర పార్టీకి రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సరైన నాయకుడు లేదు. మీరు ఆ బాధ్యత తీసుకోవచ్చు కదా! అని సూచనగా చెప్పాడు.

అప్పుడు ఆయన నవ్వి ఇలా అన్నాడు.

“ఒర్రేయ్  నరసింహం!  పార్టీ అంటే మాటలు కాదురా! అంత  బరువు ఇప్పుడు ఎవడు మోస్తాడు? ఈ వయసులో అవసరమా చెప్పు” అని ఎదురు ప్రశ్న వేసాడు.

ఇంకో మాట కూడా అన్నాడు. ఆయనకు ఇందిరాగాంధి శక్తి సామర్ధ్యాల పట్ల అంత నమ్మకం వున్నట్టు అనిపించలేదు. మరి ఆమె గురించి అన్నాడో సరిగా గుర్తు లేదు కానీ ‘గాంధారి గర్వ భంగం అవుతుంది చూడండి అన్న మాట గుర్తుంది.  

(05-09-2021)