3, సెప్టెంబర్ 2021, శుక్రవారం

ఆ గాలీ .....ఆ నేలా...... భండారు శ్రీనివాసరావు

అరవై అయిదేళ్ళ పైమాటే. అప్పటికి నాకు పదేళ్లు వచ్చాయేమో! ఆనాటి గురుతులన్నీ స్పష్టాస్పష్టంగా మనసులో మెదులుతున్నాయి. మరచిపోతానేమో అన్న సంశయంతో ఈ రాతలకు శ్రీకారం.

మా ఊరు కంభంపాడు. అప్పట్లో చాలా వెనకపడ్డ ప్రాంతం. అయినా అన్నీ ఉండేవి. స్వావలంబన లాంటి మాటలు వాటి అర్ధాలు అప్పట్లో తెలవ్వు. కానీ అన్నీ అమర్చినట్టు ఉండేవి.
మా ఇంటికి దగ్గరలో అంటే నడిచిపోయే దూరంలో చెరువు గట్టు కింద మా మాగాణి పొలాల పక్కన ఓ మెరక మీద మంచి నీళ్ళ బావి. పైగా గిలకల బావి. నాలుగువైపులా గిలకలు ఉండేవి. ఊరి మొత్తానికి అదొక్కటే మంచి నీటి వనరు. మా ఇంట్లో బావిలో నీళ్ళు ఉప్పు నీటి కషాయం. స్నానాలకు, ఇతర అవసరాలకు ఆ నూతి నీళ్ళే వాడేవాళ్ళం. మా అమ్మగారు వెంకట్రావమ్మ, మా చిన్న మేనత్త చిదంబరం తడి మడి చీరెలతో వెళ్లి మంచి నీటి బావి నుంచి బిందెలలో నీళ్ళు తెచ్చేవాళ్ళు. అప్పుడప్పుడూ వాళ్ళతో నేనూ వెళ్ళే వాడిని. దోవలో వీర బ్రహ్మం ఇల్లు. ఆయన ఉలీ, బాడిసె పట్టుకుని ఎడ్లు లాగే బండ్లు తయారు చేసేవాడు. నేను అక్కడే ఒక మొద్దు మీద కూర్చుని చూస్తూ కూర్చుండేవాడిని. బండి చక్రాలు, వాటికి ఆకులు అలా కొలతలకు తగ్గట్టుగా ఎలా చెక్కేవాడో ఆశ్చర్యం అనిపించేది. ఆయన ఏమీ చదువుకున్నవాడు కాదు. కానీ బండి ఇరుసు ఏ కొలతలతో చెక్కితే బండి బ్యాలెన్సుగా నడుస్తుందో ఆ విధంగా తయారు చేసేవాడు.
ఆ పక్క వీధిలో కమ్మరి కొలిమి. ఆయనకూ చదువు రాదు. కానీ ఇనుమును కొలిమిలో ఎర్రగా కాల్చి రకరకాల సామాగ్రి తయారు చేసేవాడు.
ఒక వీధిలో వస్త్రాల హనుమంతరావు అని నా దోస్తు ఇల్లు వుండేది. ఆడామగా బట్టలు నేసేవాళ్ళు. ఇంటి బయట చేతికి రంగులు పూసుకుని దారాలకు రంగులు అద్దేవాళ్ళు. ఇంట్లో మగ్గం మీద చీరెలు దోవతులు నేసేవాళ్ళు.
చిన్ని రాములు కొట్లో మిఠాయి ఉండలు, లౌజు ముక్కలు కూడా అమ్మేవాళ్లు. ఇళ్ళల్లో లాంతర్లు, చిమ్నీ దీపాలకు వాడే కిరసనాయిలు అక్కడే కొనేవాళ్ళం. కిరోసిన్ డబ్బా పైన ఒక మూలలో వున్న రంధ్రంలో గొట్టం లాంటి సాధనం వుంచి పైకీ కిందికీ అంటుంటే డబ్బాలో కిరోసిన్ సీసాల్లో పడేది.
ఆ పక్కనే కుండలు చేసేవారు. కుండలు చేసే విధానం చూస్తుంటే కళ్ళు తిరిగిపోయేవి. ఒక చక్రం మీద మట్టి ముద్ద వుంచి ఆ చక్రాన్ని వేగంగా ఒకసారి తిప్పేవాళ్ళు. చేతి వేళ్ళతో ఆ ముద్దను సుతారంగా తాకుతూ చిత్రవిచిత్రంగా కుండలు తాయారు చేసేవాళ్ళు. ఆ ముద్ద నుంచి కుండల ఆకారాలు వస్తుంటే ఏదో మాయాజాలంగా అనిపించేది.
సాయంత్రం అయ్యేసరికి మా ఇంటికి దగ్గరలో ఉన్న వాడ నుంచి బ్యాండు మేళం వినపడేది. ఆ తర్వాత తెలిసింది వాళ్లకు గిరాకీ లేని రోజుల్లో అలా తీరి కూర్చుని సినిమా పాటలు ప్రాక్టీసు చేస్తుంటారని. అలాగే సన్నాయి మేళం వాయించేవాళ్లు. మా ఇంటికి చుట్టపక్కాలు ఎవరైనా వస్తే వాళ్ళు పెట్రోమాక్స్ లైట్ తెచ్చి పెట్టేవాళ్ళు. ఆ లైటు వెలిగిస్తుంటే పిల్లలం అందరం కళ్ళప్పగించి చూస్తుండే వాళ్ళం. పొడుగాటి వత్తి తగలబడిపోకుండా చిన్న ఆకారంలోకి మారిపోయి తెల్లటి వెలుగులు విరజిమ్మడం నిజంగా ఆశ్చర్యంగా వుండేది. ఆ వత్తి ఎర్రపడి కాంతి తగ్గినప్పుడల్లా గాలి కొట్ట్టేవారు.
మా ఊరు పంచాంగాలకు ప్రసిద్ధి. వాటిని రాసే సిద్ధాంతులు ముగ్గురు వుండేవాళ్ళు. ఒకే ఊరు నుంచి మూడు పంచాంగాలు రావడం గొప్పగా చెప్పుకునే వారు. గొలుసుకట్టు రాతలో, తెలుగు అంకెలతో రాసిన పంచాంగాలను ఆ సిద్ధాంతులు తెనాలి తీసుకువెళ్లి అక్కడ అచ్చు వత్తించేవారు. ఉగాది రావడానికి ముందుగానే చుట్టుపక్కల గ్రామాలకు కాలినడకన వెళ్లి అక్కడి మోతుబరులకు పంచాంగాలు ఇచ్చి ఆశీర్వదించేవాళ్లు. సంభావన రూపంలో వచ్చిన ప్రతిఫలం ఎంత ఇస్తే అంత తీసుకుని తిరిగివచ్చేవారు.
మంచి నీళ్ళ బావికి వెళ్ళే దోవలో ముస్లిం ల కోసం పీర్ల సావిడి వుండేది. పీర్లను ఊళ్ళో ఊరేగించిన తర్వాత మళ్ళీ ఈ సావిడిలో భద్రపరిచేవాళ్ళు. షెడ్యూల్ కులాలకోసం ఉసిగెవాగు అవతల ఒక కాలనీ వుండేది. అక్కడ ఒక మిషనరీ స్కూలు వుండేది. ఊళ్ళో మరో బడి వుండేది. అందులోనే మా చదువు. స్కూలు మొత్తానికి కలిపి ఇద్దరు టీచర్లు, అప్పయ్య మాస్టారు, భద్రయ్య పంతులు గారు. బ్లాకు బోర్డులు లేవు. చుట్టూ ఫ్రేం ఉన్న బొందు పలక, సుద్ద బలపం, అవి పెట్టుకునే గుడ్డ సంచీ వుంటే వాడు అందరి దృష్టిలో స్పెషల్.
అప్పయ్య మాస్టారి తండ్రి శివరాజు నాగభూషణం గారు తెలవారకముందే లేచి స్నాన సంధ్యాదులు ముగించుకుని ఇంటి బయట నిలబడి ఉచ్చైస్వరంతో ఆలపించే కృష్ణ శతకంలోని పద్యాలే ఊరంతటికీ కోడి కూత.
మా ఇంటికి వెనుక రెండు దేవాలయాలు ఒకే ప్రాకారంలో ఉండేవి. పక్కనే కోనేరు వుండేది. కాలక్రమంలో అది పూడిపోయింది. ఆ గుళ్ళకు మేమే వంశ పారంపర్య ధర్మకర్తలం. వాటికి మాన్యాల రూపంలో నలభయ్ ఎకరాల దాకా భూమి వుండేది, కానీ వాటి మీద వచ్చే అయివేజు స్వల్పం. వూళ్ళో వాళ్ళే పూనుకుని పండుగ దినాల్లో ఉత్సవాలు మొదలైన కార్యక్రమాలు నిర్వహించేవారు. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ వారి చిన తిరుణాలకు, అది జరిగినన్ని రోజులూ మా వూరినుంచి రంగు కాగితాలతో అలంకరించిన ప్రబ్భండ్లు (ప్రభలు) మేళతాళాలతో ఇంటికొకటి బయలుదేరేవి.
ఆ రోజుల్లో మా ఊర్లో రెండు రకాల సేద్యపు నీటి వనరులు ఉండేవి. ఒకటి చెరువు, రెండోది మునేటి కాలువ. ఒకప్పుడు ఈ రెంటి కిందా అధిక భాగం భూములు మావే. ఐదో అక్కయ్య భర్తది పొరుగూరు పెనుగంచి ప్రోలు. ఆ బావగారు వచ్చినప్పుడల్లా గుర్రపు సవారీ. రాగానే గుర్రాన్ని మేతకు వదిలేసేవాడు. అది మేసినంత మేరా మామగారు (అంటే మా నాన్నగారు) తాలూకు పొలాలే, ఏం పరవాలేదు అని చెప్పుకునే వారు నా చిన్నతనంలో.
ఇప్పుడు ఇవన్నీ ఏవీ లేవు అని చెప్పను కానీ అప్పటి మాదిరిగా లేవు. కొన్ని అసలే లేవు, జ్ఞాపకాలు తప్ప.
వీరబ్రహ్మం లేడు, ఎడ్ల బళ్ళు తయారుచేసే వాళ్ళు లేరు. ఆ బండ్లే లేవు. ఎడ్లూ లేవు. నాటి మగ్గాలు లేవు, బట్టలు నేసేవాళ్ళు లేరు. చిన్ని రాములు కొట్టు లేదు. షట్టర్లు కలిగిన దుకాణాలు వచ్చాయి. కుండల తయారీ లేదు. స్టీలు సామాను, ఫ్రిజ్ లు గృహప్రవేశం చేసాయి.
స్వయం సమృద్ధి కాకపోయినా స్వయం పోషకంగా వుండే మా ఊరు ఇప్పుడు అన్ని ఊళ్లలో ఒక ఊరు. అంతే!
పాస్ పోర్టులో నేటివ్ ప్లేస్ కాలం పూర్తి చేయడానికి మాత్రం పనికి వస్తోంది.




ఏపీ కి నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ : Bandaru Srinivasa Shocking Comments ...

ఇలాంటి శీర్షికలు పెట్టి బెదరగొట్టాలి అనుకున్నారు. ఇంటి పేరు బండారు అని రాసి రక్షించారు. సోషల్ మీడియాలో    బండారు శ్రీనివాస రావు అని ఓ  వ్యక్తి  వున్నాడు. పాపం ఆయనకు  దీనితో  ఏమీ సంబంధం లేదు. ఈ వీడియోలో వున్నది నేనే. కాకపోతే మొత్తం అంతా పుటం వేసి చూసినా నా నోటి నుంచి  శీర్షికలో పెట్టిన   ఆ మాట వినపడదు. 
అది గ్యారెంటీ.
ఈరోజు ఉదయం (03-09-2021) మహా న్యూస్ ముఖాముఖి చర్చా కార్యక్రమంలో యాంకర్ శివతో నేను.



LINK: https://youtu.be/Vd0A1OaQSyw

వై.ఎస్.ఆర్. సంస్మరణ సభ – భండారు శ్రీనివాసరావు

 ఏదైనా క్రతువు, కార్యక్రమం నిర్వహించిన తరవాత దాని నిర్వాహకులు మొదట అనుకునే మాట, ఎంతమందిని పిలిచాం, ఎంతమంది వచ్చారు? ఎవరు రాలేదు అని.

అలానే వై.ఎస్.ఆర్. సంస్మరణ సభకు వెళ్లి వచ్చాను అని తెలిసిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళు అడిగింది కూడా ఇదే, ఎవరు వచ్చారు? ఎవరు రాలేదు?
వై.ఎస్. తో అంతో ఇంతో పరిచయం వున్న నా బోటి జర్నలిస్టులు, బాగా చనువు వున్న పాత్రికేయులు, ఆయనతో కలిసి పనిచేసిన అధికారులలో చాలామంది, అలాగే వివిధ రంగాలలో ప్రసిద్ధులైన వాళ్ళు ఈ సభలో కనపడ్డారు. అలాగే, వై.ఎస్.తో చక్కటి అనుబంధం కలిగిన కేవీపీ, ఉండవల్లి అరుణ్ కుమార్, రఘువీరారెడ్డి ఇత్యాదయః.
రానివాళ్ళు ఎవ్వరు అనేదానిపైనే సహజంగా జనాలకు ఆసక్తి. పైగా, పైకి చెప్పకపోయినా, ఇంతో అంతో రాజకీయ వాసనలు కలిగిన సమావేశం కావడంతో ఈ ప్రశ్న చర్చనీయాంశం అయింది. వై.ఎస్. రాజశేఖర రెడ్డి చనిపోయి పన్నెండేళ్లు అయిన తరువాత, ఇప్పుడు, అందులోనూ హైదరాబాదులో ఈ సంస్మరణ సభ ఏమిటి అనేది వినిపించిన మరో ప్రశ్న. ప్రముఖ సంపాదకులు శ్రీ కె. రామచంద్రమూర్తి యాదాలాపంగా చెప్పిన ఓ సమాధానం బాగుంది.
“పన్నెండేళ్లు అంటే పుష్కరం. నదులకు పుష్కరాలు కూడా పన్నెండేళ్లకు ఒకసారి వస్తాయి. వై.ఎస్.ఆర్. కు రైతులు అంటే మహా అభిమానం. పొలాలకు నీళ్ళు అందించాలనే సదుద్దేశ్యంతో ఆయన జలయజ్ఞం పధకాన్నే అమలుచేసారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానాన్ని తలపెట్టారు. ఆ రోజుల్లో ఆయన్ని అపర భగీరధుడు అన్నారు. ఆయన చనిపోయి పన్నెండేళ్లు గడిచాయి కనుక ఆయన్ని స్మరించుకుంటూ ఈ సభ జరపాలనే ఆలోచన చేసి ఉండవచ్చు”
విషయాలను తేలిగ్గా తీసుకునే వారికి ఈ జవాబు సంతృప్తి కలిగిస్తుంది. కానీ ప్రతిదీ రాజకీయ కోణంలో చూసేవారికి మరికొన్ని సందేహాలు రావడం సహజం. ‘దేవుడు ఎక్కడ ఉంటాడు అని తండ్రి హిరణ్యకశిపుడు అడిగిన ప్రశ్నకు జవాబుగా ‘ఎందెందు వెదకి చూసిన అందందే కలడు’ అంటాడు ప్రహ్లాదుడు. ఈనాడు రాజకీయం చొరలేని ప్రదేశం లేదు. శ్రీహరి వెదికితే కనపడతాడు అని చెప్పాడు ప్రహ్లాదుడు. కానీ నేటి రాజకీయం వెతకకుండానే సర్వత్రా కనిపిస్తుంది.
ఒకప్పుడు అంటే ఉమ్మడి రాష్ట్రంలో వై.ఎస్. ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు చాలామంది రాజకీయ నాయకులు ఆయనతో కలిసి పనిచేశారు. వాళ్ళు ఉభయ రాష్ట్రాల్లోనూ వున్నారు. ఇటు తెలంగాణాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి , అటు ఆంద్రాలో రఘువీరారెడ్డిని మినహాయిస్తే గుర్తించదగిన నాయకులు ఎవ్వరూ ఎందుకు రాలేదు?
అభిమానులు వేరు. రాజకీయ నాయకులు వేరు. అభిమానులకు అధిష్టానాలు వుండవు. కానీ రాజకీయ నాయకులకు అలా కాదు కదా!. పైగా పూర్వం ఉమ్మడి రాష్ట్రంలో వై.ఎస్. మంత్రివర్గంలో వున్న వాళ్ళు, పదవులు అనుభవించిన వాళ్ళు ఇప్పుడు కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వేర్వేరు పార్టీల్లో చేరిపోయారు. దానితో వారి అధిష్టానాలు కూడా మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ తక్కువ అనే అపప్రథ ఉన్నప్పటికీ ఇటువంటి సందర్భాలలో ఆ పార్టీలో మిగిలిన అన్ని పార్టీల కంటే కట్టుబాట్లు మెరుగు అనిపిస్తుంది. దేశానికి అయిదేళ్ళు సుస్థిర ప్రభుత్వాన్ని అందించిన పీ.వీ. అంత్యక్రియలు జ్ఞాపకం ఉన్నవారికి ఇదేమంత పెద్ద విషయం అనిపించదు. నిన్నటి సభ ప్రారంభానికి ముందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం తరపున వెలువడిన ప్రకటనతో వద్దామని గట్టిగా అనుకుని, వై.ఎస్. అభిమానిగా వెళ్లి తీరతానని అంతకు ముందు టీవీల్లో బల్ల గుద్ది చెప్పిన వాళ్ళు కూడా మొహం చాటేశారు. ఆ పార్టీలో చాలామంది ‘వంగోమంటే పారాడే’ బాపతు.
అయితే, ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ ఎం.ఏ. ఖాన్, బీజేపీ నుంచి మాజీ ఎం.పీ. జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ లు సమావేశానికి వచ్చారు.
అయితే మిగిలిన రాజకీయ పార్టీలు ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. కాంగ్రెస్ కనీసం ‘విప్’ లాంటి ఆదేశం అన్నా ఇచ్చింది. ఇతర పార్టీలలో వున్న ఒకప్పటి కాంగ్రెస్ నేతలు ఎలాంటి బహిరంగ ఆదేశాలు లేకపోయినా అధిష్టానం అంతరంగాన్ని వాళ్ళే బేరీజు వేసుకుని తగ్గట్టుగా వ్యవహరించారు.
రాజకీయాల్లో ఎదగాలని అనుకుండేవారికి చాలా వనరులు కావాలి అనేది వాస్తవం. కానీ అక్కరలేనిది మాత్రం ఒక్కటే.
అది ‘మనసు’.



(03-09-2021)

2, సెప్టెంబర్ 2021, గురువారం

విజయమ్మ ఆత్మీయ సమావేశం


10 TV ఛానల్ లో చర్చలకు ఆ ఛానల్ మొదలుపెట్టినప్పటినుండి వారానికోసారి వెళ్ళడం రెండేళ్ల కిందటి వరకు నాకు ఆనవాయితీగా వుండేది. సతీష్ అప్పటి నుండి పరిచయం. ఈనాడు ప్రొడక్ట్.  10 TVలో స్థిరపడి మంచి స్థాయికి చేరుకున్నాడు. సౌమ్యుడు. ఆయనతో చర్చల్లో గడబిడలు, దడదడలు వుండవు. అంచేత పిలవగానే ఈ ఉదయం వెళ్లాను, స్టూడియోలో మీరూ నేనే ఉంటాము, మిగిలిన వాళ్ళు బయటనుండి అని చెప్పిన తర్వాతనే. చర్చలో పాల్గొన్న వి. హనుమంత రావు గారు (టి. కాంగ్రెస్), కొండా రాఘవ రెడ్డి గారు (వై.ఎస్.ఆర్.టి.పి.) ఉభయులు నాకు చిరపరిచితులే.

ఈనాటి చర్చ గురించిన ఓ లింక్ పంపారు. నా వరకు మాత్రమే పరిమితం చేసి ఎడిట్ చేసి పంపడం వల్ల ఇది చూడడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. ఇటువంటి సదుపాయం ఒకటి వుందని కూడా నాకు ఇంతవరకు తెలియదు. మన టెక్నో సావీ నిర్మల్ గారు చెప్పాలి. సతీష్ కి కృతజ్ఞతలు.  

(02-09-2021)



LINK:

https://youtu.be/gCgalfA-SvE

ప్రజావైద్యుడు వై.ఎస్.ఆర్.

 

(వై.ఎస్. వర్ధంతిని పురస్కరించుకుని ఈరోజు (02-09-2021) ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)
సుదీర్ఘ రాజకీయ జీవితం గడిపిన వై.ఎస్. రాజశేఖర రెడ్డికి, తనకు తానుగా ప్రజలందరికీ మేలు చేసే అవకాశం పూర్తిగా లభించింది ముఖ్యమంత్రి అయిన తరువాతనే. రాజకీయ ప్రవేశం చేసిన తొలి నాళ్లలో నిర్వహించిన మంత్రి పదవులు మినహా ఆయన ఎక్కువ కాలం సచివాలయానికి, ఆఫీసు ఫైళ్ళకు దూరంగా, పార్లమెంటు సభ్యుడిగానో లేదా ప్రతిపక్ష నాయకుడిగానో వుండిపోయారు. అలాగే వైద్య విద్య పూర్తిచేసుకున్న తొలినాళ్లలో చేసిన డాక్టరు ప్రాక్టీసు తప్పిస్తే తదనంతర కాలంలో ఆయన ఆ పనిచేసిన దాఖలాలు లేవు. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక వైద్యుడిగా తను అనుకున్న విధంగా చేస్తూ పోవడానికి వెసులుబాటు లభించింది ముఖ్యమంత్రి అయినప్పుడే. ఈ అరుదయిన అవకాశాన్ని (గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవ్వరూ వై.ఎస్. మాదిరిగా ఒకే విడతలో నిరవధికంగా అయిదేళ్ళ పదవీ కాలం పూర్తిచేసుకోలేదు) వైఎస్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ప్రజలకు పనికొచ్చే అనేక మంచి పనులు చేసిందీ ఆ సమయంలోనే. వై.ఎస్. చనిపోయిన ఇన్నేళ్ళ తరువాత కూడా ఆయన వల్ల మేళ్ళు పొందిన వాళ్ళు మాత్రం వాటిని ఇంకా జ్ఞాపకం చేసుకుంటూనే వున్నారు. వీళ్లేమీ బడాబడా కాంట్రాక్టర్లు కాదు, గొప్ప గొప్ప రాజకీయ నాయకులు అంతకంటేకాదు. వారందరూ సామాన్యులు. ఇంకా చెప్పాలంటే అతి సామాన్యులు.
ఇందుకు సంబంధించి కొన్ని ఉదాహరణలను, కన్నవి, విన్నవి, ఉదహరించడమే ఈ వ్యాసకర్త ఉద్దేశ్యం.
ప్రింటింగు ప్రెస్సుల్లో అనవసరమైన కాగితాలు రద్దీగా పేరుకు పోతుంటాయి. కొంతమంది వాటిని గోనెసంచుల్లో కూరుకుని వేరే చోట అమ్ముకుని పొట్టపోసుకుంటూ వుంటారు. అలా జీవనం సాగించే ప్రకాష్ అనే వ్యక్తికి గుండె జబ్బు అని డాక్టర్లు చెప్పారు. వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. ఆ మాటతో అతడికి గుండె జారిపోయింది. కాలూ చేయీ ఆడలేదు. ఆ ప్రెస్సు యజమాని , ఈ విషయాన్ని జర్నలిష్టు సంఘం నాయకుడు అమర్ చెవిన వేసి ఏదైనా సాయం జరిగేలా చూడమన్నాడు. రోగి గురించి పూర్తిగా తెలిసివున్న అమర్ వెంటనే వైఎస్ ని కలిసి విషయం చెప్పారు. ప్రకాష్ కుటుంబ సభ్యులు ఇచ్చిన అర్జీని అయన చేతికి ఇచ్చారు. తక్షణ సాయం అందించమని వై.ఎస్. తన పేషీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అయితే సంబంధిత ఉత్తర్వులు వచ్చేలోగా ఆ రోగి మరణించిన సంగతి సీఎం కు తెలిసింది. సహాయ నిధి వ్యవహారాలు చూసే అధికారిని పిలిచి, వెంటనే ఆ రోగి ఇంటికి వెళ్లి ప్రభుత్వం తరపున రెండు లక్షల ఆర్ధిక సాయం అందించి రావాలని కోరారు.
వై ఎస్ ముఖ్యమంత్రి అయిన కొన్ని నెలలకే ముఖ్యమంత్రి సహాయ నిధి ఖాళీ అయ్యే పరిస్తితి ఏర్పడింది. గతంలో అంజయ్య ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కూడా ఇదేవిధమైన పరిస్తితి తలెత్తిందని అధికారులు చెప్పేవారు. దీనికి కారణం వారిద్దరి చేతికీ ఎముక లేకపోవడం. అడగని వారిదే పాపం అన్నట్టు ఎవరు అర్జీ పెట్టుకున్నా వెంటనే ముందు వెనుకలు చూడకుండా డబ్బు మంజూరు చేసేవాళ్ళు. ఒకసారి తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్య శాసన సభ్యుడు, వారికి సంబంధించిన వారికి వైద్యం చేయించేందుకు ఆర్ధిక సాయం కోరుతూ ఒక అర్జీ ముఖ్యమంత్రి వై.ఎస్. చేతికి ఇచ్చారు. అదంతా చదివి వై ఎస్ ఆయనతో ఇలా అన్నారు.” నేను డాక్టరుగా చెబుతున్నా విను. ఈ జబ్బుకి నువ్వడిగిన యాభయ్ వేలు ఏమాత్రం సరిపోవు.రెండు లక్షలు లేనిదే వైద్యం జరగదు. అంచేత అంత డబ్బు ఇస్తాను, వైద్యం చేయించు’
ఆ ఎమ్మెల్యేకు ఆశ్చర్యంతో మాట పెగల్లేదు. బయటకు వచ్చి పేషీ అధికారులతో అన్నాడు “చూశారా, సి ఎం అంటే ఇలా వుండాలి, మా పార్టీ అధికారంలో వున్నప్పుడు ఎవరు వెళ్లి అడిగినా, అడిగిన దానిలో సగం కత్తిరించి శాంక్షన్ చేసే వాళ్ళు. దాంతో ఖర్చు రెట్టింపు చూపించి అడగాల్సి వచ్చేది”
వై ఎస్ ఆర్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఒక ఇంగ్లీష్ పత్రిక విలేకరి తన కుమార్తె పెండ్లికి పిలవడానికి భార్యను వెంటబెట్టుకుని క్యాంప్ ఆఫీసుకు వెళ్ళారు. వైఎస్ లోపలకు వస్తూనే వీరిని చూసి కూర్చోబెట్టమని సిబ్బందికి చెప్పి లోపలకు వెళ్ళారు. సిబ్బంది వారిని ప్రవేశ ద్వారం వద్ద కుర్చీల్లో కూర్చోబెట్టారు. సీఎమ్ కాసేపటి తరువాత వచ్చి బయట కూర్చుని వున్న భార్యాభర్తలను చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గబగబా విలేకరి భార్య దగ్గరికి వెళ్లి, ‘మీరు మాఇంటి ఆడపడుచు వంటి వారు, మీకు సరిగా మర్యాద జరగలేదు, మన్నించమని’ ఒకటికి రెండుసార్లు అనడంతో ఆవిడ విస్తుపోయారు. వెంటబెట్టుకుని లోపలకు తీసుకుని వెళ్లి తన వద్ద కూర్చోబెట్టుకున్నారు. ‘మీకు ఎంతమంది పిల్లలు, ఎందరి పెళ్ళిళ్ళు అయ్యాయి’ అంటూ ఆప్యాయంగా వివరాలు కనుక్కున్నారు. ఇన్నేళ్ళ తరువాత కూడా తెలంగాణా ప్రాంతానికి చెందిన ఆ విలేకరి ఈ సంగతి గుర్తుచేసుకుంటూ వుంటారు.
నా భార్యకు ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ గోపీచంద్, గుండెలో వాల్వ్ మార్పిడి ఆపరేషన్ చేశారు. ఐ.సీ.యు.లో వున్నప్పుడు చూడడానికి వెడితే, పక్క బెడ్ మీద మరో అమ్మాయి పడుకుని వుంది. పదిహేను ఏళ్ళు ఉంటాయేమో. చాలా క్రిటికల్ ఆపరేషన్ చేశారు. ఆ అమ్మాయి తండ్రి ఆదిలాబాదు జిల్లాలో ఓ రోజు కూలీ. లక్షల్లో ఖర్చయ్యే ఆ ఆపరేషన్, వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ వల్ల ఒక్క రూపాయి ఖర్చు కాకుండా జరిగిందని ఆ తండ్రి నాతో చెప్పాడు. పేదా గొప్పా అనే తేడా లేకుండా అందరికీ వైద్య సౌకర్యం అందించే ఆరోగ్య శ్రీ పధకం మా వంటి పేదల ప్రాణాలను కాపాడుతోందని అన్నాడు.
అలాగే ఓసారి సెలూన్ కు వెళ్లినప్పుడు అక్కడ పనిచేసే ఓ కుర్రాడి అనుభవం ఒకటి తెలిసి వచ్చింది. వాళ్లది మహబూబ్ నగర్ జిల్లాలో ఓ కుగ్రామం. పొట్టచేతపట్టుకుని నగరానికి వచ్చి, తనకు ఇలవరుసగా అబ్బిన విద్యతో పొట్టపోసుకుంటున్నాడు. తను పదో తరగతి పాసయాడు. చెల్లెలు చదువులో ఎదిగివచ్చే నాటికి వై.ఎస్. అమలుచేస్తున్న ఫీజు రీఇంబర్స్ మెంట్ పధకం అమల్లోకి వచ్చింది. ఇంటర్ పాసుకాగానే ఇంజినీరింగ్ కాలేజీలో చేరింది.
‘నేను ఊరికి పొతే కత్తెర్లు వేసేవాడు అంటారు, అదే మా చెల్లెల్ని ఇంజినీర్ అంటారు. ఈ పధకం వల్ల చదువు అంటడం సంగతి అటుంచి మాలో ఆత్మన్యూనత పోయి మామీద మాకు విశ్వాసం కలుగుతోంద’ని చెప్పుకోచ్చాడా అబ్బాయి.
అప్పటికే, ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యం ప్రాతిపదికన ఏర్పాటయి, పనిచేస్తున్న -104- ఉచిత వైద్య సలహా కేంద్రం నిర్వాహకులు, హెచ్.ఎం.ఆర్.ఐ. వారు మరో ఆరోగ్య పధకానికి రూపకల్పన చేశారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు మూడు కిలోమీటర్ల ఆవల వుండే ప్రతి పల్లెకు, నెల నెలా క్రమం తప్పకుండా వెళ్లి, వూరివారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించే సంచార వాహనానికి రూపకల్పన చేశారు. 108 అంబులెన్సు ప్రమాదం అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించినదయితే ఈ 104 సంచార వైద్య వాహనం, పేద పల్లెప్రజల ప్రాణాలు జబ్బుల కారణంగా ప్రమాదం అంచుకు చేరకుండా చూస్తుంది. ఇంతా చేసి ఈ పధకం కింద లబ్ది పొందేవారి సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే, ఒక్కొక్కరిపై పెట్టె ఖర్చు ఏడాదికి కేవలం ఎనభయి రూపాయలు మాత్రమే. అంటే, వైద్య ఆరోగ్య రంగం బడ్జెట్ లో పది శాతం కన్నా తక్కువన్నమాట.
ఈ 104 వాహనం ప్రతి నెలా ఒక నిర్దేశిత దినం నాడు క్రమం తప్పకుండా ఒక గ్రామాన్ని సందర్శిస్తుంది. ఇందులో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ముగ్గురు ఏ.ఎన్.ఎం. లు(నర్సులు), ఒక ఫార్మసిస్టు, ఒక లాబ్ టెక్నీషియన్, ఒక డ్రయివర్తో సహా మొత్తం ఏడుగురు సిబ్బంది వుంటారు. బయో మెట్రిక్ పద్దతి ద్వారా రోగుల వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తారు. గర్భిణీ స్త్రీలను, బాలింతలను పరీక్షించి మందులు ఇస్తారు. గర్భిణి కడుపులో పిండం పెరుగుదలను నెలనెలా గమనిస్తూ తగిన జాగ్రత్తలు సూచిస్తారు. అవసరమని భావిస్తే, 108 అంబులెన్సు ఫోన్ చేసి రప్పించి ఆసుపత్రిలో చేర్పిస్తారు. రక్త పోటు, షుగర్ ఉన్నవారికి నెలవారీగా చేయాల్సిన రక్త పరీక్షలు , ఇతర పరీక్షలు నిర్వహిస్తారు.
'దర్వాజాలో దవాఖానా' వంటి ఈ పధకానికి సంబంధించిన మొత్తం వివరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ రూపంలో ముఖ్యమంత్రికి వివరించడానికి హెచ్.ఎం.ఆర్.ఐ. నిర్వాహకులు ముఖ్యమంత్రి సమయం తీసుకుని ఒకనాడు సచివాలయానికి వెళ్ళారు. ఆనాటి ఆర్ధిక మంత్రి అయిన రోశయ్య గారు కూడా పాల్గొన్న ఆ సమావేశం మొదలయి, మూడు నాలుగు స్లయిడులు వేసారో లేదో, రాజశేఖరరెడ్డి గారు ఇక వినాల్సింది ఏమీ లేదన్నట్టు, హఠాత్తుగా 'అయాం సోల్డ్ '(ఫర్ థిస్ ఐడియా) అనేసారు.
అంతే!
దాదాపు ఏడాదికి నూరు కోట్ల రూపాయలకు పైగా ఖర్చయ్యే ప్రాజక్టును పది నిమిషాల్లో ఖరారుచేసి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.



రాజకీయుల నాలుకకు నరం వుంటుందా!

 

అడ్లాయ్ స్టీవెన్సన్ పాత తరం అమెరికన్ రాజకీయవేత్త. రాజకీయాల్లో దురదృష్టం వెంటాడిన వారిలో ఆయన ఒకరు. ఇలినాయిస్ గవర్నర్ గా వున్న ఆయనకు 1952 లో అమెరికన్ అధ్యక్ష పదవికి పోటీచేయడానికి డెమొక్రాటిక్ పార్టీ నామినేషన్ లభించింది. ఆ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి ఐసెన్ హోవర్ చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. 1956 లో మళ్ళీ డెమోక్రటిక్ పార్టీ ఆయన్నే అభ్యర్ధిగా నిలబెట్టింది. కానీ ఐసెన్ హోవర్ తిరిగి గెలుపొందడంతో వైట్ హౌస్ కు దూరమయ్యారు. 1960 అధ్యక్ష ఎన్నికలనాటికి డెమొక్రాటిక్ పార్టీ తన అభ్యర్ధిని మార్చి జాన్ ఎఫ్ కెన్నెడీని బరిలో దించింది. ఆ ఎన్నికలో కెన్నెడీ రిపబ్లికన్ అభ్యర్ధిని ఓడించి అమెరికా అధ్యక్షుడిగా అధికారం స్వీకరించారు. కెన్నెడీ శ్వేతసౌధంలో అడుగుపెట్టగానే చేసిన మొదటి పని ఏమిటంటే – తనకు ముందు రెండు ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన అడ్లాయ్ స్టీవెన్సన్ ను ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా నియమించడం.
అడ్లాయ్ స్టీవెన్సన్ సంభాషణా చతురుడు. హాస్యోక్తులతో కూడిన ఆయన ఎన్నికల ప్రసంగాలను ప్రజలు ఎంతో ఆసక్తిగా వినేవారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఒక విషయాన్ని పలుమార్లు చెబుతుండేవారు. తన ప్రత్యర్ధులకు సవాలుతో కూడిన ఒక అవకాశాన్ని అందిస్తూ వుండేవారు. ‘ మీరు నా గురించి అసత్యాలు చెప్పకుండా వున్న పక్షంలో మీ గురించిన వాస్తవాలు వెల్లడించకుండా వుంటాను’ అన్న స్టీవెన్సన్ వ్యాఖ్యకు ఆ రోజుల్లో విస్తృత ప్రచారం లభించింది.
రాజకీయాల్లో అసత్యాలు వల్లె వేసి జనాలను నమ్మించడానికి ప్రయత్నించే సంప్రదాయం ఆ రోజుల నుంచే వుందనుకోవాలి.
అసత్యాలు సరే గతంలో అన్న మాటలనే మరచిపోయి స్వవచనఘాతానికి పూనుకునే ప్రబుద్ధులు ఈనాడు రాజకీయాల్లో ప్రబలిపోయారు. వర్తమాన రాజకీయాల తీరుతెన్నులను గమనిస్తున్నవారికి ఇది కరతలామలకమే.
‘కండవర్ విండిలై విండవర్ కండిలై’ అని తమిళంలో ఓ సూక్తి వుంది. అంటే చూసిన వారు చెప్పలేరు, చెప్పినవారు చూడలేరు అని అర్ధం. ‘కళ్ళు చూస్తాయి కాని మాట్లాడలేవు, నోరు మాట్లాడుతుంది కాని చూడదు’ అని ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ దాన్ని వివరించి చెప్పేవారు. ఆయన మాటల్లో చెప్పాలంటే – ఒకే విషయం గురించి చెప్పవలసినప్పుడు కూడా పదుగురు పది రకాలుగా చెబుతూ వుండడం కద్దు. ప్రతి ఒక్కరూ ప్రపంచం యెట్లా వుండాలని తాము అనుకుంటున్నారో ఆ దృక్పధంతో చూస్తూ వుండడమే దీనికి కారణం. కళ్ళ ముందు ఒక వేలును పెట్టుకుని చూడాలనుకోండి. మూడురకాలుగా చూడవచ్చు. రెండు కళ్ళతో కలసి ఒక చూపు. అలాగే ప్రతి కంటితో విడివిడిగా రెండు చూపులు. చూసే వస్తువు ఒక్కటే కనబడడంలోనే తేడాలు.
ఈ నిజం తెలుసుకోవడానికి పెద్ద కష్టపడక్కరలేదు. ఓ పదినిమిషాలు అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారం లేదా ఏ టు జెడ్ టీవీ ఛానల్లు ప్రసారం చేసే చర్చాకార్యక్రమాలు చూస్తే చాలు. వాళ్ళ నాలుకలు ఎన్ని వంకర్లు తిరుగుతాయో అర్ధం అవుతుంది. ఇంత కరాఖండిగా ఎలా చెబుతున్నానంటే ఇది స్వానుభవం కనుక.
NOTE: Courtesy Image Owner



1, సెప్టెంబర్ 2021, బుధవారం

కూతురి పాత్రలో కోడలు – భండారు శ్రీనివాసరావు

 

“మీరు చాలా అదృష్టవంతులండీ” అన్నది పొద్దున్న వచ్చిన పనిమనిషి.
నేనేమీ మాట్లాడలేదు. ఎందుకంటే, అది ఎందుకు అని అడిగే సందర్భం కాదు కదా!
మళ్ళీ తనే చెబుతోంది.
“పొద్దున్న వస్తానా, ఆయమ్మ అదే మీ కోడలు గారు ప్రతిరోజూ తను పని(అంటే Work from Home అన్నమాట)లోకి వెళ్ళే ముందు నాకు ఇవన్నీ పదేపదే చెబుతుంటారు.
‘పాపా పడుకునే బెడ్డు క్లీన్ చేయి. పక్క బట్టలు రెండ్రోజులకోసారి మార్చు. దిండు కవరు మార్చి వేయి. గది బాగా శుభ్రంగా ఉంచు. బాత్‌రూం లో తడి లేకుండా పొడి బట్టతో తుడిచేయి. బయట ఆరేసిన ఆయన బట్టలు అన్నీ తెచ్చి ఆయన అలమారాలో పెట్టు. మంచి నీళ్ళ సీసా గ్లాసు మరిచిపోకు.’
“ఇలాగే ఎన్నెన్నోజాగర్తలు చెప్పి వెళ్లి ఆ మిషన్ ముందు కూచుంటారు. అదేమిటో, ఇవ్వాళ రావడం లేటయింది. కానీ నేను వచ్చేలోపే నాకు చెప్పిన పనులన్నీ ఆమెగారే చేసినట్టున్నారు. గదంతా శుభ్రంగా వుంది. ఇలా కనిపెట్టి చూసే కోడలు దొరకడం మీ అదృష్టం అంటున్నాను. పాపం ఆ మహాతల్లి వుంటే ఆమెని ఎంత సుఖపెట్టేదో ఈ అమ్మాయి”
అలాగా! అనుకున్నాను. ప్రతిరోజూ నా గది అలాగే శుభ్రంగా వుంటుంది. పనిమనిషి రాని రోజున కోడలు నిషానే ఇవన్నీ చేస్తోంది అని కూడా తెలియదు. అసలు ఎవరు ఏ పని చేస్తున్నారో గమనించే తీరిక లేకుండా ఏదో కొంపలు మునిగినట్టు కంప్యూటర్ ముందు కూచుంటాను. ఇంట్లో ఏమి జరుగుతుందో తెలవదు, ఒకప్పుడు ఇప్పుడు కూడా. వెనుకటిలాగే నా ప్రమేయం లేకుండానే అన్నీ జరిగిపోతున్నాయి.
పనిమనిషి మహాలక్ష్మి అన్నట్టు నేను అదృష్టవంతుడినే! కానీ కోడలికి థాంక్స్ ఎలా చెప్పాలి?
(01-09-2021)