27, ఆగస్టు 2021, శుక్రవారం

వయో వృద్ధులు, జ్ఞానవృద్ధులు – భండారు శ్రీనివాసరావు


“ఏమిటో మునుపటి మాదిరిగా కాదు కదా! వయసు మీద పడుతోంది” చెప్పాడు ఓ వయోవృద్ధుడు తనకంటే చిన్న వాడయిన జ్ఞానవృద్దుడితో.
“అలా ఎప్పుడూ అనుకోకండి”
“నిజమే కదా! అనుకుంటే ఏముంది?”
“మీరు లోపల అనుకునే ఈ మాటను మీ మెదడు చప్పున గ్రహిస్తుంది. అది మన కంప్యూర్లకంటే చురుకు. దాని నోట్లో ఆవగింజ నానదు. ఏదీ తనలో దాచుకోదు. ఆ ముక్కను ముక్కున పట్టుకుని మీ ఒంట్లో వున్న అన్ని అవయవాలకు దాన్ని చేరవేస్తుంది.
‘ఇదిగో చెవీ విన్నావా! మనవాడికి వయసు మీద పడిందట’ అంటుంది.
ఆమాట చెవి, చెవిలో పడగానే, అలాగా! వయసు అయిపోతే మరి నేను ప్రతిదీ అంత శ్రద్ధగా వినక్కరలేదు అనుకుని రెండు చెవులు మూసుకుంటుంది.
అలాగే కళ్ళు, నోరు, కాళ్ళు, చేతులు ఇలా అన్ని అవయవాలు మెదడు ఇచ్చిన ఆ సంకేతాలను అందుకుని. జీతాలు తీసుకుంటూ పనిచేయని ఉద్యోగుల్లా, వేటికవి బద్ధకంగా పడుకుంటాయి.
దాంతో చెవులు వినపడక వినికిడి సమస్య, కళ్ళు కనపడక కంటి చూపు సమస్య ఇలా రకరకాల సమస్యలు శరీరాన్ని చుట్టబెడతాయి.
అదే, ‘నాకేం! నేను ఆల్ రైట్’ అనుకోండి, మీ మెదడు కూడా అదే ఆదేశాలు అవయవాలకు పంపుతుంది. నిజంగా మీకు వయసు మీద పడ్డా, మీ శరీరానికి ఆ విషయం తెలవక, ఎంచక్కా ఎప్పటిమాదిరిగా హాయిగా, హుషారుగా వుంటుంది. వయసుకు వచ్చిన ముసలితనం మనసుకు రాదు’
దాంతో మీరు హ్యాపీ, మీ పక్కవాళ్లు హ్యాపీ. ఆ పక్కవాళ్లు హ్యాపీ. ఆల్ హ్యాపీస్ అన్నమాట!”
జ్ఞానవృద్ధుడు చెప్పిన ఈ మాట ఆ వయోవృద్ధుడు విని వుంటే, ఇప్పుడు అక్కడ ఇద్దరు జ్ఞానవృద్ధులు వుంటారు. వినకపోతే ఒకడే మిగులుతాడు. రెండోవాడికి వయోభారం మరింత పెరుగుతుంది.

రాజకీయ గీత

 "అదేమిటండీ. ప్రెస్ ని ఎదురుగా పెట్టుకుని అంతేసి అబద్ధాలు అలవోకగా చెప్పేశారు?"

"చూడూ. రాజకీయాల్లో నేనెక్కడ వున్నాను? తెలుసుకదా! నువ్వెక్కుతున్న నిచ్చెన పైమెట్టు మీద. నువ్వేమో ఇంకా మొదటి మెట్టు దాటలేదు. ఒక నీతిపాఠం చెబుతా, గుర్తెట్టుకో. అబద్ధం చెప్పు. కానీ గోడ కట్టినట్లు ధాష్టీకంగా చెప్పు. జనం అప్పుడే నమ్ముతారు. అది అబద్దమో కాదో నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎదుటి పార్టీ మీద వుంటుంది. ఇంకో సంగతి. ప్రెస్ కి కూడా ఇలాంటి సంగతులే కావాలి. పెద్దగా కష్టపడకుండా పెద్దగా ఖర్చు పెట్టకుండా పబ్లిసిటీ రావాలంటే ఇదే ఉత్తమ మార్గం. సరే పోయి వాళ్ళకి ఏమేం కావాలో దగ్గరుండి చూసుకో. పో."

26, ఆగస్టు 2021, గురువారం

చట్టాలున్నా శిక్షలు లేవ్.. ఏపీ మహిళలపై ఆగని అకృత్యాలు | MAHAA NEWS



ప్రశ్నలు అడిగేవారు వాళ్ళ కోణంలో వేసి జవాబులు రాబట్టాలని చూస్తారు. తప్పులేదు. కానీ ఏ కోణానికి చిక్కకుండా మనదైన పద్దతిలోనే సూటిగా, సుతిమెత్తగా సమాధానాలు చెప్పవచ్చు.




LINK:
https://youtu.be/UVY-P9Y_Poo

ఒక దాడి తర్వాత మరో దాడి.. ఏపీలో రెచ్చిపోతున్న మృగాళ్లు | Mahaa News

25, ఆగస్టు 2021, బుధవారం

ఆగస్టు 25న ఏం జరుగుతుంది?

 ఏపీ  ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన రెడ్డికి బెయిలా! జెయిలా అంటూ మీడియాలో చాలా రోజులనుంచి  తీవ్రాతితీవ్రంగా చర్చలు సాగుతూ వచ్చాయి. ఎందుకంటే ఆ రోజున సీబీఐ కోర్టు ఈ కేసులో తుది తీర్పు ఇస్తుందని లోగడే ప్రకటించడం జరిగింది.  

గతంలో ఒకసారి శ్రీ కృష్ణ కమిషన్ నివేదిక నేపధ్యంలో, డిసెంబరు 31 తరువాత ఏం జరుగుతుంది? అని ఢిల్లీలో విలేకరులు అడిగిన ప్రశ్నకు అప్పటి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ జవాబిస్తూ, ‘ఏం జరుగుతుంది, జనవరి ఒకటి వస్తుంది’ అని చెప్పడం గుర్తుకువస్తోంది.

చివరికి 25న ఏం జరిగింది అంటే, తీర్పును వచ్చేనెల (సెప్టెంబరు) పదిహేనుకు  సీబీఐ కోర్టు వాయిదా వేసింది.

(25-08-2021)

 

24, ఆగస్టు 2021, మంగళవారం

15 రోజుల్లో ముగిసిన కధ

 2019 ఆగస్టు  పదిహేడో తేదీ అర్ధరాత్రి దాటిన  తర్వాత, కార్డియాక్  అరెస్టుతో ఆకస్మికంగా నా భార్య నిర్మల చనిపోవడానికి ముందు, కేవలం  రెండు వారాల లోపు వ్యవధానంలో వేడుకలు, వినోదాలు, శ్రావణ శుక్రవారం  నోములు, ముత్తయిదువులకు  వాయినాలు, చుట్టాల ఇళ్ళు చుట్టబెట్టడాలు,  ఇంటికి వచ్చిన వారికి అతిధి మర్యాదలు, హైదరాబాదులో ఇన్నేళ్ళుగా ఉంటున్నా ఎన్నడూ చూడని  రామోజీ  ఫిలిం సిటీలో ఒక రోజల్లా  సరదా తిరుగుళ్ళు...ఒకటా రెండా....అలుపు లేకుండా తిరిగి ఆ అలసట తీర్చుకోవడానికా అన్నట్టు చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయింది.

తిథుల ప్రకారం ఈరోజు మా ఆవిడ ఆబ్దీకం.

అమెరికాలో మా పెద్దవాడు సందీప్, కోడలు భావన, ఇక్కడ రెండోవాడు సంతోష్, కోడలు నిషా ఆబ్దీకం బాధ్యత నిర్వర్తిస్తున్నారు. కర్త బాధ్యత లేని భర్తగా మౌనంగా నేను ఇదంతా  చూస్తున్నాను.




(24-08-2021)

23, ఆగస్టు 2021, సోమవారం

వర్షం రాకడ కరెంటు పోకడ


చెట్ల కొమ్మలు అంటూ ఏదో కారణం చెబుతారు కానీ, వర్షానికి కరెంటుకు ఎక్కడో జ్ఞాతి వైరం ఉన్నట్టుంది.

వర్షం మొదలయింది కదా భాగ్యనగరంలో, దానితోపాటే కరెంటు ఇబ్బందులు. అన్ని చోట్లా ఎలా ఉన్నదో తెలియదు కానీ ఎల్లారెడ్డి గూడాలో ఓ రెండు గంటల నుంచి కరెంటు రాకపోకలు ముమ్మరం అయ్యాయి. ఓ నిమిషం పోవడం, ఓ క్షణం రావడం. కూర్చుని చూస్తుంటే ఆ క్రమం ఇలా వుంది.

కరెంటు రాగానే ముందు ఫ్యాను తిరుగుతుంది. తర్వాత కళ్ళార్పుకుంటూ ట్యూబు లైటు వెలుగుతుంది. ఆ తర్వాత నింపాదిగా టీవీ హాత్ వే లైటు ఎర్రబడుతుంది. తెరమీద ‘సిగ్నల్ నాట్ ఫౌండ్’ అని కనబడుతుంది. ఆహా అనుకునే లోగా మళ్ళీ సీను రివర్స్. అదే క్రమంలో కరెంటు పోతుంది. కాకపొతే ఈసారి ట్యూబ్ లైట్ కళ్ళార్పకుండానే తాత్కాలికంగా కన్ను మూస్తుంది. ఇన్వర్టర్ వుంది కాబట్టి కంప్యూటర్ తోడు వుంటుంది.

కరెంట్ మళ్ళీ వచ్చేదాకా పక్కవాళ్లకు వినబడకుండా ‘వస్తావు పోతావు నాకోసం’ అని పాడుకుంటూ కూర్చోవడమే.
23-08-2021