23, ఆగస్టు 2021, సోమవారం

నిశ్శబ్దం రాజ్యమేలిన ముఖ్యమంత్రి సభ

 ఈ విషయం చెప్పే ముందు దీంతో సంబంధం ఉన్న మరో విషయంతో మొదలు పెడతాను.

మా రెండో అన్నయ్య భండారు రామచంద్ర రావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆ స్థాయికి చేరడానికి ముందు ఎక్కిన అనేకానేక నిచ్చెన మెట్లలో నెలకు పాతిక రూపాయల ‘విలేకరి కొలువు’ కూడా వుంది.

ఖమ్మంలోని ఎస్సార్ అండ్ బీజీ ఎన్ ఆర్ కాలేజీలో ఆయన డిగ్రీ పూర్తిచేశారు. రామ్మోహనరావు గారు ఆ కాలేజీలో లెక్చరర్. వారి నాన్నగారికి పత్రికల ఏజెన్సీ కూడా వుంది. అప్పట్లో ఆ ఏజెంట్లే పత్రికా విలేకరుల పాత్ర కూడా పోషించేవారు. మా అన్నయ్యకు తెలుగులో ఉన్న ప్రావీణ్యం గమనించి ‘నెలకు ఓ పాతిక ఇస్తాను, నీకు పాకెట్ మనీగా పనికి వస్తుంది, నువ్వు ఆంద్రజ్యోతి పత్రికకు వార్తలు రాస్తుండు. వాళ్ళు వేస్తె వేస్తారు, లేకపోతే లేదు, కానీ నీకు మంచి కాలక్షేపంగా వుంటుంది’ అని ప్రోత్సహించడంతో మా అన్నయ్య ఒప్పుకున్నాడు.

ఇక అసలు విషయానికి వస్తాను.

నాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఖమ్మం జిల్లా పర్యటన ఖరారు అయింది. అప్పటికే జిల్లాలోని కాంగ్రెస్ ముఖ్య నాయకులు అందరూ రెండు వర్గాలుగా విడిపోయివున్నారు. జలగం వెంగళరావు, శీలం సిద్దారెడ్డి వంటి అతిరధులు కలిగిన ప్రధాన వర్గం అప్పటివరకు ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవ రెడ్డికి అనుకూలం. మరో వర్గం సంజీవయ్య వైపు. దీనికి మాకు బాబాయి వరుస అయిన బొమ్మకంటి సత్యనారాయణ నాయకులు. ఖమ్మం జిల్లాకు సంబంధించినంతవరకు ఆయన ముఖ్యమంత్రి సంజీవయ్యకు కుడి భుజం. సంజీవయ్యకు సంఘీభావం తెలిపేందుకు గోకినేపల్లిలో జిల్లా దళిత మహా సభ ఏర్పాటు చేశారు. ఈ సభను కవర్ చేయడానికి పాతిక రూపాయల విలేకరి అయిన మా అన్నయ్యను పురమాయించారు రామ్మోహన రావు గారు.

సభ బాగా జరిగింది. ముఖ్యమంత్రి ప్రసంగించడానికి మైకు ముందు నిలబడ్డారు. సంజీవయ్య స్వతహాగా మంచి వక్త. ఆయన ప్రసంగం మొదలు పెట్టారు.

నన్ను బాధ పెడుతున్న, నా మనసును కలచి వేస్తున్న ఓ విషయాన్ని మీకు చెప్పదలచుకున్నాను. ఇక్కడ పైనా కిందా కూర్చున్న మనుషులం అందరం ఒకే తీరున ఉన్నాము. ఒంట్లో పారే రక్తం రంగు అందరికీ ఎరుపే. కానీ మనలో చాలామందిమి సాటి మనిషిని మనిషిగా చూస్తున్నామా అంటే అనుమానమే. డబ్బున్న ఖామందులు పెంపుడు బొచ్చు కుక్క పిల్లల్ని తమ పక్కలపై పడుకోబెట్టుకుంటారు. ముద్దు చేస్తారు. అదే సాటి మనిషిని తాకడానికి కూడా వారికి అస్పృశ్యత అనే అనాచారం అడ్డం వస్తుంది. కుక్కలపాటి చేయరా ఈ మనుషులు? ఎందుకీ వ్యత్యాసం? ఎందుకీ వివక్ష?’

రెండు చేతులూ గట్టిగా గాలిలో ఊపుతూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి స్వరం బొంగురుపోయింది. పైకిలేపిన చేతులను అలాగే వుంచి ఆయన కాసేపు మౌనంగా వుండిపోయారు.

సభకు హాజరై ప్రసంగం వింటున్న యావన్మంది చేష్టలు ఉడిగి వుండిపోయారు. అంతటా నీరవ నిశ్శబ్దం.

సరే! ఆ రోజు సభ ముగిసింది. తిరిగి హైదరాబాదు వెళ్ళడానికి దామోదరం సంజీవయ్య అంబాసిడర్ కారు ఎక్కారు. ఆయన పక్కనే మా బాబాయి బొమ్మకంటి సత్యనారాయణ. ముందొక పోలీసు జీపు, వెనక మరో జీపు. అదీ ముఖ్యమంత్రి కాన్వాయ్ ఆ రోజుల్లో.

మా అన్నయ్య ఖమ్మం చేరుకున్న వెంటనే తన రిపోర్ట్ రాసి మర్నాడు పోస్టులో పంపారు. ఆ మరునాడు అది ఆంధ్రజ్యోతిలో వచ్చింది.

ముఖ్యమంత్రి దళిత సభలో రాజ్యమేలిన నిశ్శబ్దం’.

వార్తతో పాటు మా అన్నయ్య పెట్టిన హెడ్డింగ్ కూడా యధాతధంగా పత్రికలో రావడం కొసమెరుపు.

 

ఇచ్చుటలో వున్న హాయీ.......భండారు శ్రీనివాసరావు

 చుట్టూ చిమ్మ చీకటి. ఆ చీకటి నడుమ ఆగిపోయిన కారు. ఆ కారులో వొంటరిగా అనసూయ.

భర్త తరచూ పరిహాసంగా అనే మాటలు ఆ సమయంలో గుర్తుకు వచ్చాయి.
‘నువ్వు మగాడిగా పుడితే సరిపోయేది’
కారులో వొంటరి ప్రయాణాలు ఆమెకు కొత్తేమీ కాదు. కారు ఆగిపోవడాలు, చిన్న చిన్న రిపేర్లు సొంతగా చేసుకోవడాలు కూడా కొత్త కాదు. అందుకే ముందు భయం అనిపించలేదు. కానీ పొద్దుపోయి చీకటి చిక్క పడుతున్న కొద్దీ, కొద్ది కొద్దిగా ఆందోళన మొదలయింది. ఈ ప్రయాణం పెట్టుకోకుండా వుంటే సరిపోయేదేమో అనిపించసాగింది.
అనసూయకు చిన్నతనం నుంచీ ధైర్యం పాలు కొంత ఎక్కువే. వొంటరి ప్రయాణాలు చేయడానికి ఎప్పుడూ జంకేది కాదు. మొగుడి తరపున వ్యాపార వ్యవహారాలు సంభాలించడానికి అనేక వూర్లు తిరగాల్సిన పరిస్తితి. ఆయన కాలం చేసిన తరువాత ఆమెపై ఈ బాధ్యత మరింత పెరిగింది. పిల్లలు పెద్దవాళ్లయి విదేశాల్లో స్తిరపడడంతో భర్త పెంచి పోషించిన సంస్తను తన చేతులతోనే మూసివేయలేక కొంతా, మరో వ్యాపకం లేక మరికొంతా ఏమయితేనేం దాన్ని ముందుకు నెట్టుకొస్తోంది. అందులో భాగంగానే ఈ ప్రయాణం. ఆ ప్రయాణంలోనే ఈ కొత్త అనుభవం.
హైదరాబాదు నుంచి బెజవాడ వెళ్ళే రోడ్డు మార్గాన్ని పెద్దది చేస్తూ వుండడంతో ఆ మార్గంలో రోడ్డు ఎక్కడ వుందో గుంత ఎక్కడ వుందో తెలియని పరిస్తితి. మామూలుగా ఇలాటి ప్రయాణాల్లో డ్రైవర్ ఎప్పుడూ వుంటాడు. కాని ఆ రోజు అతగాడి భార్యకు సుస్తీ చేయడంతో, గంట ప్రయాణమేగా వెంటనే తిరిగిరావచ్చు అన్న సొంత భరోసాతో బయలు దేరింది. తిరుగు ప్రయాణం బాగా ఆలశ్యం అయి చీకటి పడి పోయింది. కారు హెడ్ లైట్లు మొరాయించడంతో ముందు వెడుతున్న ఓ లారీ వెనుక కారు నడుపుతూ వెళ్ళింది. రోడ్ల విస్తరణ వల్ల కాబోలు, లోగడ మాదిరిగా ఎటువంటి మెకానిక్కు షాపు దోవలో కానరాలేదు. పైగా ఆ లారీ వెంట గుడ్డిగా వెడుతూ దోవ తప్పింది. ఆ సంగతి తెలిసివచ్చేసరికి ఆ లారీ కూడా అయిపులేకుండా పోయింది. మొబైల్ వెలుతురులో చూస్తే అదో డొంక దారిలా కానవచ్చింది. కనెక్టివిటీ లేకపోవడంతో హైదరాబాదు ఫోన్ చేసి విషయం చెప్పడానికి కూడా వీలు లేకుండా పోయింది. ఏం చేయాలా అని ఆలోచిస్తూ స్టీరింగ్ మీద తలపెట్టి చూస్తూ కారులో అలాగే వుండిపోయింది.
కొంతసేపటి తరువాత దూరంగా ఎవరో వస్తున్న అలికిడి. ముందు ప్రాణం లేచివచ్చినట్టు అనిపించినా ఆ సమయంలో వొంటరిగా వచ్చింది ఒక యువకుడు అని తెలియడంతో తెలియని భయం ఆవహించింది. అతడు తన మానాన తను పోకుండా కారు దగ్గరికి వచ్చి అద్దంలోనుంచి తొంగి చూసాడు. ఆ చీకట్లో ఏమీ కనబడకపోయినా ఆమె మనో నేత్రానికి అతగాడొక చిల్లర మనిషిలా కనిపించాడు. అందుకే కిటికీ అద్దాలు తీయకుండా అలాగే వుండి పోయింది. అతడు కాసేపు కారు చుట్టూ తిరిగి తన దారిన పోతుండడం చూసి ఆమె మనసు తేలిక పడింది. కానీ అది ఎంతో సేపు నిలవలేదు. కాసేపటిలో అతడు తిరిగి వచ్చాడు. అతడి చేతిలో ఈ సారి ఓ సంచీ వుంది. కిటికీ దగ్గర నిలబడి అద్దం తీయమని సైగలు చేయడం ప్రారంభించాడు. ఏదయితే అయిందని అద్దం దించింది.
బయట చలిగాలితో పాటు అతడి మాటలు మెల్లగా చెవిలో పడి అనసూయ మనసు చల్లబడింది.
‘అమ్మా! కారుకు ఏదో అయినట్టుంది. అందుకే దగ్గర్లో వున్న మా వూర్లోకి వెళ్లి రిపేరు సామాను తెచ్చాను. మీరలా కారులోనే కూర్చోండి. నేను ఈ లోగా కారు సంగతి చూస్తాను.’
అంత ఖరీదయిన కారు రిపేరు పల్లెటూరి వాడికి వొప్పచెప్పడం ఆమెకు సుతరామూ ఇష్టం లేదు. కానీ ఏం చేస్తుంది. విధిలేని పరిస్తితి.
అతడు ఏం చేసాడో తెలవదు. మంత్రం వేసినట్టుగా హెడ్ లైట్లు వెలిగాయి. మరి కాసేపటిలో కారు ఇంజన్ స్టార్ట్ అయింది. అనసూయ మొహం ఆ చీకట్లో వెలిగిపోయింది.
హాండ్ బ్యాగ్ తీసి చూసింది. అన్నీ క్రెడిట్ కార్డులే. వెతగ్గా కొన్ని వెయ్యి రూపాయల నోట్లు కనిపించాయి. లెక్కపెట్టకుండా తీసి అతడికి ఇవ్వబోయింది. నిజానికి ఆ మొత్తం చాలా ఎక్కువే. కానీ ఆ సమయంలో ఆ మాత్రం సాయం దొరక్కపోతే తను పడే కష్టాలు వూహించుకుంటే తక్కువే అనిపించింది. కానీ, అతడికీ తక్కువే అనిపించిందేమో అన్నట్టుగా ఆ డబ్బు వద్దన్నాడు. ఇంకా ఎక్కువ కావాలేమో అని మళ్ళీ బ్యాగు తెరవబోయి ఇంతలో అతడి మాటలు వినిపించి ఆగిపోయింది.
‘చూడమ్మా మీరింత చీకటిలో వొంటరిగా ఇలా చిక్కుకుపోవడం చూసి నేనేదో నా ప్రయత్నం చేసాను. ఈ పనికి డబ్బుతో సరిపెట్టుకోవడం నాకు నచ్చదు. ఈ డబ్బు మీ వద్దే వుంచండి. అంతగా ఇవ్వాలనిపిస్తే ఇలాగే అవసరంలో వున్న వారికి సాయంగా ఇవ్వండి. దానితో నా లెక్క చెల్లవుతుంది.’
అవాక్కయిన అనసూయ తేరుకునే లోగా అతడు మళ్ళీ అన్నాడు.
‘ఈ పక్కనే మా వూరు. నా పేరు సత్యనారాయణ. అందరూ మెకానిక్ సత్యం అంటారు. ఈ దారంట వెళ్ళండి. మూలమలుపులో ఓ చాయ్ దుకాణం వస్తుంది. అక్కడ రోడ్డెక్కారంటే చక్కగా షహర్ కెళ్ళి పోతారు. వస్తానమ్మా! నేను చెప్పింది మరచిపోకండి’ అంటూ సంచీ భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు.
కారు స్టార్ట్ చేసింది. కొంత దూరంలో అతడు చెప్పిన టీ దుకాణం కనబడింది. లైట్లు వెలుగుతున్నాయి.
మెకానిక్ సత్యం మాటలే ఆమె చెవుల్లో మార్మోగుతున్నాయి. ఇంత హైరానా ప్రయాణం తరువాత కాస్త వేడి వేడి చాయ్ తాగితే బాగుంటుందనిపించి కారు అక్కడ ఆపి లోనికి నడిచింది. వేళకాని వేళ. జనం లేరు. స్టవ్ మీద గిన్నెలో టీ నీళ్లు మరుగుతున్నాయి. చెక్క బల్ల మీద కూర్చుంటూ వుండగానే లోపలనుంచి నిండు గర్భంతో వున్న మహిళ భారంగా అడుగులు వేస్తూ బయటకు వచ్చింది. కానీ కళ్ళల్లో ఏమాత్రం అలసట లేదు. టీ చెప్పగానే అనసూయ ముందు వున్న బల్లను శుభ్రంగా గుడ్డతో తుడిచింది. మూలగా వున్న ఫ్రిజ్ తెరిచి చల్లని నీళ్ళు తెచ్చిపెట్టింది. ఇంత రాత్రి వేళ ఇలా వొంటరి ప్రయాణం ఎందుకు పెట్టుకున్నారని మందలింపు ధోరణిలో మాట్లాడుతూనే వెళ్లి టీ తయారు చేసి తీసుకు వచ్చింది. దానితో పాటు కొన్ని బిస్కెట్లు కూడా సాసరులో పెట్టి ఇచ్చింది. నెలలు మీదపడ్డ ఆడమనిషి అంత కష్ట పడడం చూసి అనసూయ మనసు కూడా కష్టపెట్టుకుంది. పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో ఆ అమ్మాయి కుటుంబంకోసం పడుతున్న శ్రమ అనసూయను కదిలించింది. ఓ వంద రూపాయల నోటు సాసరులో వుంచింది. చిల్లర తేవడానికి ఆ అమ్మాయి లోపలకు వెళ్ళగానే మెకానిక్ కోసం తీసివుంచిన వెయ్యి నోట్లను ఆ సాసరు కింద వుంచి అక్కడ నుంచి తప్పుకుంది.
చిల్లరతో వచ్చిన అమ్మాయికి అక్కడ ఎవరూ కనిపించలేదు. కారులో వచ్చిన ఆవిడకోసం చుట్టూ చూసింది. ఆవిడ కనబడలేదు కానీ ఆవిడ వొదిలి వెళ్ళిన వెయ్యి నోట్లు కనిపించాయి. వాటితోపాటే వుంచిన మరో చిన్న కాగితం. దాని మీద హడావిడిగా రాసిన రెండే రెండు వాక్యాలు. ‘నువ్వు నాకు ఏమీ రుణపడి లేవు. అలాటి భావన వుంటే మరొకరికి సాయపడు, ఈ రుణం తీరిపోతుంది.’
పాపం ఆ అమ్మాయికి ఏం చెయ్యాలో తోచలేదు. అంత డబ్బు ఉదారంగా వొదిలివెళ్లడం అంటే మాటలు కాదు.
నిజానికి వచ్చేనెలలోనే డాక్టర్ పురుడు వస్తుందని చెబుతూ అందుకు తగ్గట్టుగా డబ్బు సర్దుబాటు చేసుకొమ్మని చెప్పింది. ఎలారా భగవంతుడా అని చూస్తుంటే ఎదురు చూడని విధంగా ఆ కారు ఆవిడ అందించిన అయాచిత ఆర్ధిక సాయం.
ఈ టీ కొట్టుతో వచ్చే రాబడి ఇంటి ఖర్చులకు బొటాబొటిగా సరిపోతుంది. చిన్న చిన్న రిపేర్లు చేసే మొగుడికి వచ్చే కొద్దో గొప్పో సంపాదన కూడా రోడ్డు విస్తరణ పనులవల్ల ఈ మధ్య బాగా తగ్గిపోయింది.
అసలే తొలి చూలు యెలా బయటపడాలి అని అనుకుంటున్న సమయంలో అనుకోని విధంగా ఈ రాత్రి ఈ ధన యోగం. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిపోతూ ఆమె హోటల్ కట్టేసి మొగుడు మెకానిక్ సత్యానికి ఈ కబురు చెవిలో వేయాలని ఆత్రుతగా ఇంటికి బయలుదేరింది. (26-02-2012)

21, ఆగస్టు 2021, శనివారం

చైనా కపట వ్యూహం... అందుకే తాలిబన్లతో స్నేహం


 https://youtu.be/_FUsJCl_mRQ?t=800

వెనకడుగు వేద్దాం రండి! –భండారు శ్రీనివాసరావు

 (ఈరోజు, ఆగస్టు, 21, సీనియర్ సిటిజన్స్ డే)

అరవయ్యో పడిలో పడ్డ చాలామంది ఏదో తెలియని అభద్రతా భావంతో కలత చెందుతుండడం కద్దు. వయసు మీద పడుతోందన్న భావన కావచ్చు. జీవితం మలిసంధ్యలో అడుగు పెడుతున్నామన్న భయం కావచ్చు. సంఘంలో, కుటుంబంలో తమకున్న ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోతున్నదేమో అన్న బాధ కావచ్చు. కారణం ఏదయినా వయసు మీరుతున్నవారిలో ఈ రకమయిన ఆందోళనలు సహజం. అయితే వీటిని అధిగమించి జీవితాన్ని మరింత ఆనందమయం చేసుకోవడం అసాధ్యమేమీ కాదంటున్నారు జీవితాన్ని కాచి వడబోసిన వాళ్లు.
ముందు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే ముసలితనం వచ్చేసిందని చెప్పుకోకపోవడం.
ఆరోగ్యమే మహా భాగ్యం అనే సూక్తి చిన్నప్పటినుంచి వింటున్నదే. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ సూక్తిలోని ‘భాగ్యానికి’ నిర్వచనాన్ని మార్చుకోవాల్సి వుంటుంది.
భాగ్యం అంటే సంపద కాదు. బ్యాంకుల్లో వుండే డబ్బు కాదు. కుటుంబం అందరూ ఆనందంగా సంతోషంగా వుండడం. వయసు మళ్లి పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ ఆలోచించుకోవాల్సింది డబ్బు గురించి కాదు. ఆరోగ్యంగా వుండేట్టు చూసుకోవడం ముఖ్యం. వెనుకటి మాదిరిగా ఉమ్మడి కుటుంబాలకు కాలం చెల్లిపోయింది. ఉద్యోగాలు, ఉపాధులు వెతుక్కుంటూ పిల్లలు దూర ప్రాంతాలకు, ప్రదేశాలకు తరలివెడుతున్న కాలమిది. రోగం రొష్టూ పేరుతొ వారిని ఇబ్బందుల పాలు చేయకుండా ఆరోగ్యాలను మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఈనాటి పెద్దతరంపై వుంది.
ధనమూలం ఇదం జగత్!
డబ్బుతో ఆనందాన్ని కొనడం వీలుకాదు కాని ఆనందంగా జీవించడానికి డబ్బు కావాలి.
అందుకే పశువుకు తిన్నది దండి మనిషికి వున్నది దండి అన్నారు. దీన్ని స్వార్ధం అని ఎవ్వరూ అనుకోరు. మీ పిల్లలు మీ అవసరాలను కనుక్కోగలిగితే అది బోనసుగా భావించాలి. మీ అవసరాలు కనుక్కోలేని అవసరాలు వాళ్లకు వుంటే దాన్ని పెద్దమనసుతో అర్ధం చేసుకునే పెద్దరికం మీకుండాలి.
ఇతరులను హాయిగా వుంచాలి. కుర్రవాళ్లల్లో కుర్రవాళ్ళుగా మసలగలగాలి. అంటే టీ షర్టులు వేసుకోవడం, షార్టులు ధరించడం కాదు. ‘మా రోజుల్లో అయితే...’ అంటూ నస పెట్టకుండా వాళ్లకు నచ్చేరీతిలో మీ రోజుల్లోని సంగతులను మనసుకు హత్తుకునే పద్దతిలో చెప్పడం అలవరచుకోవాలి.
సమయం అమూల్యం
ఈ జీవన యానంలో సంపాదించింది యెంత వున్నా పోగొట్టుకున్నది, పోగొట్టుకునేది మాత్రం అమూల్యమయిన సమయాన్నే అని గుర్తు పెట్టుకోవాలి. ఇకనుంచీ ప్రతి రోజూ కొత్తగా మళ్ళీ పుట్టామని అనుకోవాలి. నిన్న అనేది క్యాన్సిల్ చేసిన చెక్కు. రేపనేది ప్రామిసరీ నోటు. పోతే, ఈ రోజు అనేది వుంది చూసారూ అది మాత్రం చేతిలో వున్న పైకం. ప్రతి క్షణాన్ని జీవించడం, ఆస్వాదించడం నేర్చుకోవాలి.
మార్పు శాశ్వితం.
మార్పును అంగీకరించడం అంటే వరద వాలులో కొట్టుకుంటూపోవడం కాదు. మార్పు అనివార్యం. ఈ సత్యం అంగీకరించగలిగితేనే యువ తరంతో, రానున్న తరంతో సంబంధాలు బాగుంటాయి. పిల్లలు చెప్పేదేమిటి అని కొట్టిపారేయకుండా ఆ చెబుతున్న దానిలో కొత్తదనాన్ని గ్రహించగలిగితే ‘ముసలి వాసనలు’ మన నుంచి తప్పుకుంటాయి.
నాకేమిటి?
స్వార్ధం లేని మనిషంటూ వుండడు.ఏమిచేసినా దీనివల్ల ‘నాకేమిటి’ అనేవాళ్ళే ఎక్కువగా తారసపడుతుంటారు.కానీ వున్న ఈ చిన్ని జీవితంలో అవసరంలో వున్నవాడికి సాయపడడం వల్ల కలిగే సంతృప్తికి ఏదీ సమానం కాదు.ఇచ్చుటలో వున్న హాయిని కనీసం జీవితం చరమాంకంలో కూడా అనుభవించలేకపోతే ఇక దానికి సార్ధకత లేనట్టే. ఆ జీవితానికి అర్ధం లేనట్టే.
మరచిపో !మన్నించు!!
ఈ రెండుపదాలు చాలా చిన్నవే అయినా నిజానికి ఎంతో గొప్పవి.ఇతరుల తప్పిదాలు గురించి అస్తమానం ఆలోచించడం వల్ల వొరిగేదేమీ వుండదు. లేకపోతే పెరిగేది మన ‘బీపీ’నే.
ఇక ఆఖరుదీ అతి ముఖ్యమైనదీ ఏమిటంటే:
మరణ భయం
జాతస్య మరణం ధృవం. పుట్టిన ప్రతి వ్యక్తీ గిట్టక తప్పదు. ఇది తెలియని వాళ్లు వుండరు. కానీ తెలియనట్టుగా వుంటారు. శరీరం బలహీనపడి, అభద్రతాభావం బలపడి ఒక్కసారి మరణ భయం పట్టుకున్నదంటే చాలు ఇక ఆ మనిషి మరణానికి చేరువయినట్టే.
అందుకే మరణం గురించి ఆలోచించడం శుద్ద దండుగ.
జీవితాన్ని అరవైల్లో కూడా మళ్ళీ మొదలు పెట్టవచ్చు. అది మన చేతుల్లోనే వుంది.
వయస్సు మళ్ళిన స్నేహితుల్లారా రండి. దర్జాగా వెనుకడుగు వేద్దాం పదండి. వెనుకటి జీవితాన్ని మళ్ళీ ఆస్వాదిద్దాం రారండి


(Note: Courtesy Image Owner)


ఆధ్యాత్మిక అధికారి శ్రీ పీ.వీ.ఆర్.కే. – భండారు శ్రీనివాసరావు

 (ఆగస్టు 22 ఆయన జయంతి)

ఒక ఉన్నతాధికారి, ఆయన ఓ జిల్లా కలెక్టర్ కావచ్చు, సచివాలయంలో ఉప కార్యదర్శి కావచ్చు, ఎక్సైజ్ కమీషనర్ కావచ్చు, టీటీడీ ఈవో కావచ్చు, విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ కావచ్చు, ఏకంగా భారత ప్రధానమంత్రి సలహాదారు కావచ్చు, మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ కావచ్చు, ధర్మ పరిరక్షణ సంస్థ గౌరవ అధ్యక్షులు కావచ్చు, అది ఏ ఉద్యోగం అయినా కానివ్వండి, ఏ హోదా వున్నదయినా కానివ్వండి, ఎంతటి బాధ్యత కలిగినదయినా కానివ్వండి దాన్ని ఒకే నిబద్ధతతో, ఒకే అంకితభావంతో, అంతే సమర్ధంగా నిర్వహించుకుని, నిభాయించుకుని సెహభాష్ అనిపించుకోగల అధికారులను వేళ్ళమీద లెక్క పెట్టవచ్చు. ఆ లెక్క తీసుకుంటే ఆ వరుసలో మొదట్లో కానవచ్చే వ్యక్తి, తన డెబ్బయి ఏడో ఏట స్వల్పఅస్వస్థత అనంతరం 2017, ఆగస్టు ఇరవై ఒకటో తేదీ తెల్లవారుఝామున కన్నుమూసిన పీ.వీ. ఆర్. కే. ప్రసాద్. (వారి పూర్తి పేరు పత్రి వేంకట రామకృష్ణ ప్రసాద్)

నలుగురికే కాదు, ప్రపంచం నలుమూలల తెలిసిన మనిషి ఆయన. శనివారం తెల్లవారుఝామున ఆస్పత్రిలో చేరారు.  అస్వస్వతకు గురయిన సంగతి నలుగురికీ తెలిసేలోగానే, ఇరవైనాలుగు గంటలు గడిచీ గడవక ముందే, సోమవారం తెల్లవారుఝామున ఆయన ఈ ప్రపంచాన్ని వీడిపోయారనే కబురు నేల నాలుగు చెరగులా తెలిసిపోయింది. మరణం అలా ముంచుకురావడం పుణ్యాత్ముల విషయంలోనే జరుగుతుందంటారు. అలాగే జరిగింది కూడా.

అంతకుముందు రాత్రి జ్వాలా, నేనూ కలిసి బంజారా కేర్ ఆసుపత్రికి వెళ్ళాము. ఐ.సి.యూ. లో ప్రసాద్ గారిని చూశాము. జీవితంలో ఎలాంటి బంధాలు లేకుండా బతికిన మనిషిని, ముక్కుకు, నోటికి బంధనాలతో చూస్తుంటే ఎంతో బాధ వేసింది. ఈ రాత్రి గడవడం కష్టం అనే భావన డాక్టర్ల అభిప్రాయంగా తోచింది. అయ్యో అనిపించింది. ఆ తెల్లవారుఝామున ఫోను మోగింది. పెద్దాయన దాటిపోయారు అని చెప్పారు. ప్రసాద్ గారి భార్య, కొడుకు, కుమార్తె అంతిమ ఘడియల్లో ఆయన చెంతనే వున్నారు. అదొక ఊరట.

అప్పటికి ఆయన వయస్సు డెబ్బయి ఏడు సంవత్సరాలు. ఆగస్టు ఇరవై రెండు ఆయన పుట్టిన రోజు. అదేమిటో ఆ రోజుకు ఒక్క రోజుముందే ఆగస్టు ఇరవై ఒకటో తేదీనే పీవీఆర్కే మరణించడం దైవలీల.

 ఒక్క రోజు గడిచి వుంటే డెబ్బయి ఎనిమిదిలో ప్రవేశించి వుండేవారు. ఈరోజులలో ఇదేమంత పెద్ద వయస్సేమీ కాదు. కానీ ఆయన నమ్ముకున్న తిరుపతి వెంకటేశ్వరుడికి ఆయన్ని తన దగ్గరకు పిలిపించుకోవాలనే కోరిక కలిగిందేమో. అందుకే ప్రసాద్ గారు ఎవరినీ కష్ట పెట్టకుండా, తను మరీ కష్టపడకుండా దాటిపోయారు. ఆధ్యాత్మిక అంశాలతో కూడిన చక్కటి రచనలను మనకు మిగిల్చిపోయారు.


ఎన్నెన్నో బాధ్యతాయుతమైన ఉద్యోగాలు చేసినా ఎలాటి మచ్చ పడకుండా నెగ్గుకువచ్చారు. తన పైవారికి కానీ, కింది సిబ్బందికి కానీ మాట రాకుండా నిప్పులాంటి నిజాయితీతో విధులను నిర్వహించారు. ఎన్ని గిరులు గీసుకున్నా,మరెన్నో బరులు తన చుట్టూ బారులు తీరినా, ఏదైనా విషయం సమాజానికి మేలు చేసేది అని తను మనసారా నమ్మితే చాలు, అంతే! ఎలాంటి సంకోచాలు లేకుండా, ఎలాటి భేషజాలకు పోకుండా, అడ్డొచ్చే నిబంధనలను తోసిరాజనికూడా ప్రజాక్షేమానికి పెద్దపీట వేసే గుండెధైర్యం ఆయన సొంతం. ఇలాటి విషయాల్లో యువ ఐ.ఏ.ఎస్. అధికారులకు ఆయన చక్కని స్పూర్తి ప్రదాత. నిబంధనల పేరుతొ అధికారుల్లో వుండే చొరవను చిదిమేయవద్దని ప్రసాద్ గారు తరచుగా అంటుండేవారని ఆయన కింద పనిచేసిన ఓ అధికారి గుర్తు చేసుకున్నారు. యువ అధికారులు చొరవ తీసుకుని చక్కని ఫలితాలు రాబట్టే క్రమంలో కొన్ని కొన్ని పొరబాట్లు చేసినప్పుడు ఆయన పెద్ద మనసుతో సర్దిపుచ్చేవారు. నల్గొండ జిల్లాలో ఎస్.ఎఫ్.డి.ఏ. అధికారిగా పనిచేస్తున్నప్పుడు సన్నకారు రైతులకు ప్రయోజనం కల్పించే ఒక పధకం అమల్లో ఆయన అలాంటి చొరవనే ప్రదర్శించారు. ఆ జిల్లాలో అయన వేసిన కొత్త బాటకు దేశవ్యాప్త ప్రచారం లభించింది. ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధానమంత్రి స్వయంగా నల్గొండ ప్రయోగం గురించి ప్రస్తావించిన విషయాన్ని నాటి ముఖ్యమంత్రి శ్రీ పీ.వీ. నరసింహారావు గారు స్వయంగా పీవీఆర్కే చెవిన వేశారు. ఈ సంగతిని ఆయన తన అనుభవాల గ్రంధంలో రాసుకున్నారు కూడా.

అకీర్తిం చాపి భూతాని కధయిష్యంతి తేవ్యయామ్

సంభావితస్యచా కీర్తిర్మరణా దతిరిచ్యతే”

ప్రజలెప్పుడూ నీ అపకీర్తి గురించే చెప్పుకుంటారు. ఆత్మగౌరవం కలిగిన వ్యక్తికి అపకీర్తి అనేది మరణం కంటే దుర్భరమైనది”

భగవద్గీతలో గీతాకారుడు చెప్పిన ఈ సూక్తిని శ్రీ పీ.వీ.ఆర్.కే. ప్రసాద్ తన జీవిత పర్యంతం మనసా వాచా కర్మణా గుర్తుంచుకుని జీవనయానం సాగించారేమో అనిపిస్తుంది ఆయన జీవితాన్ని తరచి చూస్తే.

నాహం కర్తా హరి:కర్తా”

(నేను కాదు కర్తని. చేసేది చేయించేది అంతా శ్రీహరే!)

ఇదీ శ్రీ ప్రసాద్ గారి నమ్మకం. అందుకే కాబోలు తన తిరుపతి అనుభవాల గ్రంధానికి దీన్నే మకుటంగా పెట్టుకున్నారు.

పుణ్యజీవితం గడిపిన ధన్యజీవి శ్రీ పీ.వీ.ఆర్.కే. ప్రసాద్.

20, ఆగస్టు 2021, శుక్రవారం

పాపం సీబీఐ – భండారు శ్రీనివాసరావు

 గుర్తుంది కదా! కొన్నేళ్ళ క్రితం ఒక కేసు విషయంలో కోల్ కతా పోలీసు కమీషనర్ ను విచారించడానికి సీబీఐ అధికారుల బృందం వెళ్ళింది. స్థానిక పోలీసులు వారిని అడ్డుకున్నారు. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హుటాహుటిన అక్కడికి వెళ్ళారు. ప్రధానమంత్రి మోడీ, సీబీఐని అడ్డుపెట్టుకుని తమ ప్రభుత్వంలో పనిచేసే అధికారులను వేధిస్తున్నారని ధర్నాకు దిగారు. ఆనాటి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి, అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయుడుతో సహా దేశవ్యాప్తంగా అనేకమంది బీజేపీ వ్యతిరేకులు కోల్ కతా దీదీకి సంఘీభావం తెలిపారు.

ఓ పదేళ్ళు వెనక్కి వెడదాం.

2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించినప్పుడు అహమ్మదాబాదులో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న మోడీ ఏమన్నారో చూడండి.

సీబీఐ అంటే ఏమిటో తెలుసునా ! కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ సీబీఐ తమ ఢిల్లీ బాసులను మెప్పించడం కోసం మా ప్రభుత్వాన్ని వేధిస్తున్నారు. మా మంత్రులను, అధికారులను టార్గెట్ చేస్తున్నారు. అయితే ఈ అధికారులు ఒక విషయం మరచిపోవద్దు. ఏదో ఒకరోజున మీరు జవాబు చెప్పుకోవాల్సివస్తుంది సుమా!’

మళ్ళీ ఓసారి వెనక్కి వెడదాం!

2013. సుప్రీం కోర్టు. కోర్టు హాలు సూదిపడితే వినబడేంత నిశ్శబ్దంగా వుంది.

జస్టిస్ ఆర్. ఎం. లోధా గొంతు పెంచి తీవ్ర స్వరంతో అన్నారు.

సీబీఐ. ప్రభుత్వ పంజరంలోని చిలుక’

కోర్టు హాలులో వున్నవాళ్ళందరూ నివ్వెర పోయారు న్యాయమూర్తి చేసిన ఈ బహిరంగ వ్యాఖ్యతో.

అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు బొగ్గు కేటాయింపులలో జరిగిన అవకతవకలను కప్పిపుచ్చుకోవడానికి సీబీఐని ఓ పావులా వాడుకుంటోందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు, సుప్రీం న్యాయమూర్తి చేసిన ఈ వ్యాఖ్యతో మంచి ఊతం చిక్కినట్టయింది. ‘కోల్ గేట్’ కుంభకోణంగా మీడియా దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

కొన్నేళ్ళ క్రితం సీబీఐ గురించి అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి ఏమన్నారో చూద్దాం.

ఉత్తరప్రదేశ్ లోని సిధౌలిలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఇలా చెప్పారు. ‘సమాజ్ వాది, బిఎస్ పి లను అదుపు చేయడానికి, తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్ద ఒక తాళం చెవి వుంది. దాని పేరే సీబీఐ’.

మరిప్పుడు మద్రాస్ హైకోర్ట్ మధురై బెంచ్, సీబీఐ పంజరంలో చిలక అంటూ వ్యాఖ్యానించింది. ఆ చిలకను పంజరం నుంచి విడిపించడానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరింది.

దీనిపై మళ్ళీ చర్చలు.

జరిగేది ఏమీ వుండదు అనడానికి పై ఉదంతాలే రుజువు.

(20-08-2021)

తక్కువేమి మనకు ? – భండారు శ్రీనివాసరావు

 ‘పాజిటివ్ థింకింగ్ అంటుంటారు, ఏమిటి గురువు గారు ?’

‘మన దేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ బానిస సంకెళ్ళ నుంచి బయట పడి ప్రజాస్వామ్య విధానంలో గత ఏడు దశాబ్దాలకు పైగా ముందుకు సాగుతోంది.

‘ఆఫ్ఘనిస్థాన్  మనకంటే ఇరవై  ఎనిమిదేళ్లు ముందుగానే బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందింది. 1919లోనే  ఆ దేశానికి స్వాతంత్రం వచ్చింది. అంటే స్వతంత్రం వచ్చి వందేళ్ళు దాటిందన్నమాట. అయినా ఇప్పటికీ  అక్కడ రాజకీయంగా  గందరగోళ పరిస్థితులే. కొన్నేళ్ళు ప్రజాస్వామ్యం, మరి కొన్నేళ్ళు నియంతల రాజ్యం, లేదా సైనిక పాలన.  మనతో పాటే స్వాతంత్రం పొందిన పొరుగు దేశం పాకిస్తాన్ లో, ఇరుగు దేశం శ్రీలంకలో అదే పరిస్థితి.

‘అదే మన దేశంలో చూడు. ఏ పార్టీ పాలించినా, ఆ పాలన బాగున్నా లేకపోయినా, మనదేశంలో మాత్రం ప్రజాస్వామ్య ప్రభుత్వాలే మనల్ని పాలిస్తున్నాయి. ఓటు ద్వారానే ప్రజలు తమని పాలించే ప్రభుత్వాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఇష్టం లేని పార్టీలను అధికారానికి దూరం చేస్తున్నారు. అంచేతే  ప్రపంచ దేశాల్లో మనం ఎవరికీ లోకువ కాలేదు. 

‘ఇలా ఆలోచించడాన్నే నేను పాజిటివ్ థింకింగ్ అంటాను అన్నారు గురువుగారు.

(!9-08-2021)