15, ఆగస్టు 2021, ఆదివారం

ఎర్రకోట మీదనే ఎందుకు?

 మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు అంటే 1947 ఆగస్టు 15 న జరిగిన మొదటి జెండా వందనం ఎర్రకోట బురుజుల నుంచి జరగలేదు. పండిట్ నెహ్రూ పదిహేనవ తేదీనే ఢిల్లీలోని ఇండియా గేటు సమీపంలోని ప్రిన్సెస్ పార్కులో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆయన వెంట ఆ నాటి భారత గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్ కూడా వున్నారు. ఆ బహిరంగ కార్యక్రమానికి ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు. సుమారు అయిదు లక్షల మంది ఆ ప్రాంతానికి ఉత్సాహంగా చేరుకున్నారు. వారిని నిలువరించడానికి చేసిన ప్రయత్నాలన్నీ వమ్ము కావడంతో పోలీసులు చేతులు ఎత్తేసారు. కార్యక్రమానికి అతిధులుగా వచ్చిన అనేకమంది విదేశీ దౌత్య వేత్తలు, మంత్రులు, ఇతర ప్రముఖులు, జన సందోహంతో నిండిపోయిన ఆ ప్రదేశానికి చేరుకోలేక వెనక్కి మళ్ళాల్సి వచ్చింది. ఆ జన సమ్మర్దంలో తప్పిపోయిన పిల్లలను వెతికే కార్యక్రమంలో నెహ్రూ, మౌంట్ బాటెన్ కూడా ఎంతో శ్రమ పడాల్సి వచ్చిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

ఆ మరునాడు అంటే 1947 ఆగస్టు 16 వ తేదీన నాటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఎర్రకోట వద్ద జరిగిన జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన ఆ కార్యక్రమానికి హాజరయ్యారు కానీ పతాకాన్ని ఎగురవేయలేదు. మరో నమ్మ లేని నిజం ఏమిటంటే ఆనాడు ఎర్రకోటపై పతాకాన్ని ఎగురవేసింది ఆ పనికోసం నియోగించబడ్డ ఒక ఆర్మీ అధికారి. అప్పుడు జరిగిన ఏర్పాట్ల గురించి ఒక ఆర్మీ అధికారి రాసిన పుస్తకంలో ఈ వివరాలు వున్నాయి. బురుజుపై నిలబడి ప్రధాని నెహ్రూ ఒక స్విచ్చి నొక్కగానే బురుజు కింద గంట మోగే ఏర్పాటు చేసారు. నెహ్రూ స్విచ్చి నొక్కి గంట మోగించగానే ఆ సంకేతాన్ని అందుకుని ఆర్మీ అధికారి వెంటనే జాతీయ జెండాను ఎగురవేశారని ఆయన ఆ పుస్తకంలో తెలిపారు.
మరో విశేషం ఏమిటంటే త్రివర్ణశోభితమైన జాతీయ పతాకం వినువీధుల్లోకి ఎగరగానే చిరుజల్లులు కురిశాయి. గగన తలంలో ఇంద్రధనుస్సు దర్శనమిచ్చింది. ఒకవైపు త్రివర్ణ పతాకం, మరో వైపు రంగురంగుల ఇంద్ర ధనుస్సు. నయనానందకరమైన ఆ దృశ్యాన్ని చక్కటి శుభసూచనగా ప్రజలు భావించారు.
1947 దాదిగా స్వతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి ఎర్రకోట బురుజులపై జాతీయ పతాకాన్ని ఎగురవేసే సాంప్రదాయం ఈనాటికీ కొనసాగుతోంది. అయితే ఈ కార్యక్రమానికి మొఘల్ చక్రవర్తుల కోటను ఎందుకు ఎంపిక చేసుకున్నారు అనే విషయంపై సరయిన వివరాలు లభించడం లేదు. 1857లో జరిగిన ప్రధమ స్వాతంత్ర పోరాటాన్ని బహదూర్ షా జాఫర్ ఈ లాల్ ఖిలా నుంచే మొదలుపెట్టారని, అందుచేత స్వాతంత్ర దినోత్సవం నాడు జాతీయ పతాకాన్ని ఎర్రకోట నుంచి ఎగురవేయడం సముచితంగా ఉంటుందన్న భావనతో ఈ సాంప్రదాయం మొదలయిందని కొందరు వివరిస్తున్నారు.
పొతే మరో ఆసక్తికర చారిత్రిక విషయం ఏమిటంటే మొదట బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి స్వతంత్రాన్ని 1948లో ఇవ్వాలని అనుకున్నారు. అయితే 1947 ఫిబ్రవరిలో వైస్రాయ్ గా నియమితులయిన లార్డ్ మౌంట్ బాటెన్ మాత్రం వేరే విధంగా తలపోయడంతో బ్రిటిష్ పాలకులు తమ నిర్ణయం మార్చుకుని స్వతంత్ర భారత ఆవిర్భావానికి 1947 ఆగస్టు పదిహేనును ముహూర్తంగా ఎంచుకున్నారు. ఈ మార్పుకు మరో కారణం కూడా చెబుతారు. అంతకు మునుపు రెండేళ్ళ క్రితం, రెండో ప్రపంచ యుద్ధం ముగియవచ్చే తరుణంలో సరిగ్గా ఆగస్టు పదిహేనవ తేదీనే, జపాన్ సైన్యం బ్రిటిష్ వారికి లొంగిపోవడంవల్ల, ఆ తేదీ పట్ల మౌంట్ బాటెన్ ముచ్చట పడ్డారనేది ఆ కధనం.
ఆగస్టు పద్నాలుగవ తేదీ అర్ధరాత్రి (తెల్లవారితే పదిహేనవ తేదీ) పార్లమెంటు హౌస్ లో జరిగిన భారత రాజ్యాంగపరిషత్తు ఐదో సమావేశంలో, భారత దేశానికి స్వతంత్రం ఇస్తూ బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన అధికారిక ప్రకటన జరిగింది. ఈ సమావేశం పద్నాలుగో తేదీ రాత్రి పదకొండు గంటలకు సుచేతా కృపాలాని వందేమాతరం గీతాలాపనతో మొదలయింది రాజ్యంగ పరిషత్తు చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించారు. పండిట్ నెహ్రూ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది “ప్రపంచం యావత్తూ నిద్రిస్తున్న వేళ, స్వతంత్ర వాయువులు పీలుస్తూ భారత దేశం మేలుకుంటోంది” అనే అర్ధం వచ్చేలా చేసిన ప్రసంగం ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ గా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది.
అనంతరం బొంబాయి (ఇప్పుడు ముంబై) కి చెందిన విద్యావేత్త, ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు హంసా మెహతా, దేశంలోని మహిళలు అందరి తరపున భారత జాతీయ పతాకాన్ని జాతికి సమర్పించారు. సుచేతా కృపాలానీ ‘సారే జహాసే అచ్చా’ గేయం పాడి అలరించారు. ‘జనగణమన’ (అప్పటికి అది జాతీయ గీతం కాదు) గీతాలాపనతో నాటి సమావేశం ముగిసింది.
మరునాడు అంటే ఆగస్టు పదిహేనవ తేదీన ఉదయం ఫెడరల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ హరిలాల్ కనియా, నూతన గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మౌంట్ బాటెన్ నెహ్రూ మంత్రివర్గంతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. జగ్జీవన్ రాం ఆసుపత్రిలో చేరిన కారణంగా ఆయన ఆ రోజున ప్రమాణస్వీకారం చేయలేకపోయారు

14, ఆగస్టు 2021, శనివారం

నాస్తికవాద ప్రబోధి శ్రీ లవణం – భండారు శ్రీనివాసరావు

(ఈరోజు లవణం గారి వర్ధంతి)

ఆరేళ్ల క్రితం ఈ రోజు బెజవాడలో కన్ను మూసిన ప్రముఖ నాస్తిక ప్రచారోద్యమ నాయకుడు లవణం గారితో నా పరిచయం వయస్సు నలభయ్ అయిదేళ్లు పైమాటే. లవణం గారి నాన్నగారు గోరా గారి ద్వారా లవణం గారు పరిచయం అయ్యారు. గోరాగారు (గోపరాజు రామచంద్ర రావు గారు) నాస్తికులు. దేవుడ్ని నమ్మేవారు కాదు. దేవుడ్ని గురించి ప్రస్తావన వస్తే ‘దేవుడు లేదు’ అనేవారు. ‘నేను దేవుడ్నే నమ్మను, ఇక ఆయన ఆడో మగో నాకేమిటి నిమిత్తం’ అని వాదించేవారు.
1975 నాటి మాట. బెజవాడ ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నరోజులు. అప్పటికే హైదరాబాదుకు మకాం మార్చిన ఎడిటర్ నార్ల వెంకటేశ్వర రావు గారికి ఓ ఆలోచన వచ్చి బెజవాడలో అసిస్టెంట్ ఎడిటర్ గా వున్న నండూరి రామమోహన రావు గారిని సంప్రదించారు. అనుదినం జరిగే సంఘటనలపై స్పందించి నాలుగు లైన్లలో హస్యస్పోరకంగా వుండే గేయాన్ని రాయించాలని వారి ఉద్దేశ్యం. ‘రాయగలరా అని అడక్కుండా రాయండి’ అనేసారు రామ్మోహన రావు గారు నాతొ. ఆవిధంగా మొదలయ్యాయి ఆంద్రజ్యోతి దినపత్రికలో ఎడిట్ పేజీలో కార్టూన్లవంటి నా వాక్టూన్లు. చిత్రకారుడు రమణ గారు ఓ చిన్న చిత్రాన్ని దానికి జోడించేవారు.
ఆరోజుల్లో గోరాగారి కూరగాయల ఉద్యమం మొదలయింది. బెజవాడ గవర్నర్ పేటలోని రాఘవయ్య పార్కులో కార్యక్రమం. వ్యవసాయశాఖ మంత్రి ఏసీ సుబ్బారెడ్డి గారు ముఖ్య అతిధి. పూలదండల బదులు కూరగాయల దండలు వేయాలనేది గోరాగారి ఉద్యమం. కూరగాయలు పెంచితే ప్రజలకు ఉపయోగం అనేది ఆయన సిద్దాంతం. సరే సభ మొదలయింది. కూరగాయలతో చేసిన దండలు వేసారు, పుష్ప గుచ్చాల బదులు కాలీ ఫ్లవర్, క్యాబేజీలతో రూపొందించిన గుచ్చాలు అందించారు. సుబ్బారెడ్డిగారు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే రకం. మనసులో దాచుకుండే మనిషి కాదు. అయన మాట్లాడుతూ, గోరాగారి ఉద్దేశ్యం మంచిదే అయినా మనిషి మానసిక ఆనందానికి పూలతోటలు కూడా అవసరమన్నారు. పూల చెట్లు పీకి వాటి స్థానంలో కూరగాయల మొక్కలు పెంచేబదులు, కాలువగట్ల మీద, వృధాగా వున్న ప్రాంతాలలో కూరగాయల పాదులు వేస్తె నలుగురుకీ ఉపయోగం అన్నట్టు ప్రసంగించారు. ఆ కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకుని నేను వాక్టూన్ రాసాను. మర్నాడు ఉదయం అది జ్యోతిలో వచ్చింది. అదే ఇది.
కాయ 'గోరా'లు
“కూరగాయలు పెంచండని శ్రీ గోరా
ఇచ్చిన పిలుపును విని, మా శ్రీవారా
రోజంతా పట్టుకు పలుగూ పారా
పెరడంతా తవ్వేస్తే రాత్రికి వొళ్ళు పట్టేది నేనా వారా!”
గోరాగారి గురించి రాసింది లవణం గారికి నచ్చినట్టు లేదు. మర్నాడు ఆ పేపరు పట్టుకుని రామ్మోహన రావు గారిని ఆఫీసులో కలుసుకుని ‘ఇదేమన్నా బాగుందా’ అని అడిగారు. నండూరి రామ్మోహనరావు గారు సీరియస్ గా పైకి కనిపించినా హాస్య ప్రియులు.
‘జోకుని జోక్కా తీసుకోవాలండీ లేకపోతె మేకులా గుచ్చుకుంటుంది. కార్టూన్ చూసి నవ్వుకున్నట్టే శ్రీనివాసరావు వాక్టూన్ చదివి నవ్వుకోండి. ఓ పనయి పోతుంది’
ఇదీ ఆయన జవాబు.
వాక్టూన్ సంగతి ఏమోకానీ, లవణం గారితో నా పరిచయం సుదీర్ఘంగా కొనసాగింది. కొన్నేళ్ళ క్రితం ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఏదో కార్యక్రమానికి వెడితే కలిసారు. ఓ ఫోటో కూడా దిగాము. ఆంధ్రభూమి ఫోటోగ్రాఫర్ అనుకుంటాను తీసింది. ప్రస్తుతం అయితే నా దగ్గర లేదు.





(14-08-2021)

13, ఆగస్టు 2021, శుక్రవారం

మంచి పలుకు

శ్రీ పీఠం ఆద్యాత్మిక మాస పత్రిక తాజా సంచికలో శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచించిన సుభాషితం:


“గంగను భువికందించిన భగీరధుని కధను రామాయణంలో కూడా వివరించారు. సగరులను తరింపచేయడానికి గంగను భువికి తీసుకురావాలని వారి పుత్రుడు అంశుమంతుడు తపస్సు చేశాడు. కానీ తన జీవితకాలంలో సాధించలేకపోయాడు. తరువాత అతని కుమారుడు దిలీపుడు తపమాచరించాడు. ఆయన వల్ల కూడా సాధ్యం కాలేదు. అటుపై దిలీపతనయుడు భగీరధుడు తపస్సు చేసి గంగను సాధించాడు.
గంగను సాధించిన భగీరధుడి వద్దకు బ్రహ్మ వచ్చి, ‘నాయనా! నీ పెద్దలు సాధించలేనిది నువ్వు సాధించావు’ అని ప్రశంసించాడు. వెంటనే భగీరధుడు, ‘స్వామీ! అది నిజం కాదు. వారు చేసిన తపస్సు నా దాకా వచ్చి నా దగ్గర ఫలించింది. అంతే! నా పూర్వీకులే చేయకుంటే, నాతోనే తపస్సు ప్రారంభమైతే, ఇది ఫలించడానికి మరో రెండు తరాలు పట్టేది. మా పూర్వీకులు నా వరకు తీసుకువచ్చిన తపోరూప సూత్రాన్ని నేను అందుకుని సాధించగలిగాను’ అని సమాధానమిచ్చాడు.
దానికి విరించి, ‘అద్భుతంగా చెప్పావు. నీ వినయం, వివేకం గొప్పవి. నువ్వు గంగని సాధించడం ఒక ఎత్తు, ఈ మాట ఒక్కటీ ఒక ఎత్తు’ అని అభినందించాడు.
(శ్రీ పీఠం, ఆధ్యాత్మిక మాస పత్రిక, ఆగస్టు సంచిక నుంచి)
(13-08-2021)

జయాలకు అపజయం లేదు – భండారు శ్రీనివాసరావు

(గురువారం నాడు శ్రీహరికోట నుంచి  ఇస్రో  ప్రయోగించిన జి.ఎస్.ఎల్.వి. ఎఫ్.10 వైఫల్యం గురించిన వార్తలు విన్నప్పుడు  గుర్తుకువచ్చిన పాత సంగతి)

1987, మార్చి నెల

ASLV-1 ప్రయోగానికి శ్రీహరికోటలో సర్వం సిద్ధం అయింది. 31 గంటల కౌంట్ డౌన్ కూడా పూర్తయింది. అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధి, గవర్నర్ కుముద్ బెన్ జోషి, ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ఇస్రో చైర్మన్ డాక్టర్ యు.ఆర్.రావు రెండతస్తుల మిషన్ కంట్రోల్ రూమ్ టెర్రేస్ మీద నుంచి రాకెట్ ప్రయోగాన్ని వీక్షించడానికి ఆసీనులయివున్నారు. భారత దేశానికి గర్వకారణం కాగల ఈ ప్రయోగాన్ని కళ్ళారా చూడడానికి సుమారు పదివేలమంది ప్రేక్షకుల గేలరీలో వేచి వున్నారు.

అనుకున్న సమయానికి రాకెట్ ప్రయోగించారు. నిప్పులు చిమ్ముతూ రాకెట్ గగనంలోకి దూసుకుపోయింది. రాకెట్ పైకి లేస్తుండగానే వారందరూ ఒకరికొకరు అభివాదాలు తెలుపుకుంటూ, కరచాలనాలు చేసుకుంటూ ఉద్విగ్నంగావున్న సమయంలో జరగరానిది జరిగిపోయింది. ప్రయోగించి నిమిషం కూడా గడవకముందే రాకెట్ బంగాళాఖాతంలో కూలిపోయింది. ఒక్క లిప్తపాటు భయంకర నిశ్శబ్దం. అందరి మొహాల్లో ఆనందం తప్పుకుంది. విషాదం అలముకుంది.

రాజీవ్ గాంధి అందరికంటే ముందు తేరుకున్నారు. ఇస్రో అధికారులను, సిబ్బందిని అనునయించారు. ఇటువంటి శాస్త్రీయ ప్రయోగాలలో విజయాలే తప్ప, అపజయాలు ఉండవన్నారు. ముందుకు దూసుకుపోవడానికి ఇదొక అవకాశంగా భావించాలని ధైర్యం చెప్పారు.

అలా పోగుపడిన ధైర్యమే ఈనాడు ఇస్రో బృందాన్ని ప్రపంచ రికార్డు సొంతం చేసుకునేలా చేసింది.

అక్షరాలా నూట నాలుగు ఉపగ్రహాలను ఏక కాలంలో అంతరిక్షంలోకి పంపేలా చేయగలిగింది.

నిజమే. అంతకు ముందు తెలియని విషయాలను కనుగొనేముందు ఎన్ని అపజయాలు ఎదురయినా శాస్త్రవేత్తలు వెనక్కి తగ్గక పోవడం వల్లనే ఈనాడు ప్రపంచానికి ఇన్ని శాస్త్రీయ పరిశోధనల ఫలితాలు అందుతున్నాయి. మొదటి వైఫల్యానికే చతికిల పడివుంటే ఇప్పుడూ అక్కడే వుండేవాళ్ళం.

కాబట్టి గురువారం ప్రయోగం విఫలం అయిందని కుంగిపోనక్కరలేదు. ఆ వైఫల్యం మరో ఘన విజయానికి  సోపానం కావాలని కోరుకుందాం!



(Image Courtesy ISRO)


(13-08-2021)

అతడు – ఆమె - ఆవిడ

 ఓసారెళ్ళి ఆవిడ్ని చూసిరండి. ఒకటే కబుర్లు చేస్తోంది.’

ఆఫీసు నుంచి ఇంటికి వచ్చి సైకిల్ స్టాండ్ వేస్తున్న శంకరం కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. భార్య నోటి వెంట ‘ఆవిడ’ ప్రస్తావన రావడం ఈ అయిదేళ్ళలో ఇదే మొదటిసారి.

పెళ్ళయిన నాటి నుంచీ ఇదే తంతు.

'నేను మీ జీవితంలోకి వచ్చాను. అంతే. ఇక ఆవిడ ప్రస్తావన మన మధ్య రావడానికి వీల్లేదు’ దాదాపు హుకుం జారీ చేసింది.

మొదటి రాత్రే తనంటే ఏమిటో స్పష్టంగా తెలియచెప్పింది. కాస్త వయసు మీదపడ్డ తరువాత పెళ్లి చేసుకుంటే ఇంతేనేమో. తానూ అప్పటినుంచి కుక్కిన పేను మాదిరిగానే పడివుంటున్నాడు, 'భార్య గీసిన గీత దాటడు' అనే పేరు బయట మారుమోగుతోందని తెలిసినా.

ఇక, ఇంట్లోఆవిడ’ ప్రసక్తి తేనంతవరకు, రానంతవరకు భార్య తనని పల్లెత్తు మాట అనదు. పొరబాటున వచ్చిందంటే చాలు ఇక తన మాట వినదు.

ఏమిటో ఈ ఆడవాళ్ళు. మరో ఆడదాని మాట మొగుడి నోట వెంట 'వినాల'ని కూడా అనుకోరు.

ఇంతకీ శంకరం భార్య మొగుడ్ని వెళ్ళి చూసిరమ్మని చెప్పిన ‘ఆవిడ' ఎవరో కాదు, శంకరాన్ని నవమాసాలు మోసి కని పెంచిన అతడి కన్నతల్లి. పదిహేనేళ్ళ క్రితం తండ్రి చనిపోయిన నాటి నుంచి తన బాగోగులు చూస్తూ తను ఒక ఇంటివాడు అయ్యేంతవరకు కనిపెట్టుకుని చూసిన మనిషి. పెళ్ళయిన మరుసటి నెలలోనే, కోడలి దాష్టీకం పుణ్యమా అని ఇల్లు వొదిలి పెట్టి పరాయి ఇంట్లో తలదాచుకుంటూ, ‘వంటలమ్మగా’ రోజులు వెళ్లమారుస్తోంది.

భార్యే స్వయంగా చూసి రమ్మని చెప్పడంతో ఇక శంకరం ఆఘమేఘాలమీద తల్లి దగ్గర వాలిపోయాడు. తనకోసమే కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నట్టు వుంది. కానీ ఆ తల్లి కళ్ళల్లో కొడుకుని చూసిన తృప్తే తప్ప జీవం లేదు.

'నీతో కలిసి భోంచేయాలని వుందిరా శంకరం. నీకు అంత తీరుబడిఉందా? వెంటనే వెళ్ళాలా!' అని అడిగింది. పర్మిషన్ తీసుకునే వచ్చాడు కనుక 'దానికేముందమ్మా! అన్నం తినడమే కాదు ఈరోజంతా నీతో కలిసేవుంటాను' అనేసాడు. ఆ తల్లి తబ్బిబ్బయింది. తత్తరపాటుతో లేచి వెళ్లి వంట మొదలు పెట్టింది. శంకరం కూడా పక్కనే పీట వేసుకు కూర్చున్నాడు. ఆవిడ ఒక పక్క వంట చేస్తూనే శంకరం చిన్నతనపు అల్లరి గురించీ, తిండి అలవాట్లు గురించి గుర్తుచేసుకోవడం మొదలుపెట్టింది. ఆ కబుర్లు వింటుంటే చిన్నప్పుడు తల్లిని ఎంతగా ప్రాణాలు కొరుక్కు తినేవాడో అ విషయాలన్నీ కన్నీటిపొర తెరలా కమ్మిన కళ్ళల్లో గిర్రున తిరిగాయి.

ఇద్దరూ కలిసి అన్నం తిన్నారు. తిన్నంత సేపూ తనివితీరా కబుర్లు చెప్పుకున్నారు. పాత సంగతులు గుర్తుచేసుకున్నారు. కానీ ఆవిడ పొరబాటున కూడా 'ఆమె' ప్రసక్తి తీసుకురాలేదు.

బయలుదేరేటప్పుడు ఒక మూట చేతిలో పెట్టింది. ఇంటికి చేరగానే ఆ మూటను భార్య చేతిలో పెట్టాడు. ఆమె విసురుగా దాన్ని అటక మీదకు గిరవాటు వేసింది.

రోజులు గడిచాయి. మళ్ళీ కబురు. కానీ ఈసారి ఆవిడ నుంచి కాదు. ఆవిడ వంటలు చేసిపెట్టే వారినుంచి.

'అంతా అయిపొయింది. ఇన్నేళ్ళు మా ఇంట్లో వంటలు చేసి పెడుతోంది కానీ ఆవిడ ఎవ్వరో, ఎవరి తాలూకో కూడా తెలియదు. మొత్తం మీద మీ చిరునామా కనుక్కునేసరికి ఇన్నాళ్ళు పట్టింది. అనాధ శవాలకు అంతిమ సంస్కారాలు చేసే ఒక సంస్థ వారు ఆపని పూర్తిచేశారు'

శంకరం బావురుమన్నాడు. ఇంటివారు కబురుచేసిన దానిప్రకారం తల్లితో కలిసి భోంచేసిన రాత్రే ఆవిడ కన్ను మూసింది. భార్యకు ఇచ్చిన మూట జ్ఞాపకం వచ్చి అటక మీద నుంచి తీసి చూశాడు. తల్లికి పుట్టింటివాళ్ళు పెట్టిన నాలుగు బంగారు గాజులు, వొంటిపేట చంద్రహారం అందులో వున్నాయి. వాటితో పాటే ఓ చీటీ.

'ఒరేయ్ శంకరం. నువ్వు పెళ్లి చేసుకుని కోడల్ని తీసుకురాగానే ఇవి ఇద్దామనుకున్నాను. ఇల్లు వొదిలి రావడం వల్ల కుదరలేదు. తరువాత ఇద్దామని ఎన్నోసార్లు అనిపించినా మళ్ళీ దేనికోసమో ఆరాటపడుతోంది అని అనిపించుకోవడం ఇష్టం లేక ఆ ఉద్దేశ్యం మానుకున్నాను. నా తరువాత ఇవన్నీ కోడలికే దక్కాలి. మనసులో ఏవీ పెట్టుకోకుండా తీసుకోమని చెప్పు. నేను ఇక ఎన్నో రోజులు బతుకుతానని అనుకోను. నిన్ను చూసాక ఇక నా ఆఖరి కోరిక కూడా తీరిపోయింది'

శంకరం ఆశ్చర్యంతో ఏడుపు ఆపేసాడు.

మరొకరు ఆ గదిలో రోదిస్తున్న ధ్వని సన్నగా వినబడుతోంది.

12, ఆగస్టు 2021, గురువారం

నాకు వచ్చిన కల – భండారు శ్రీనివాసరావు

 యాభయ్ ఏళ్ళ క్రితం నేను ఆంధ్రజ్యోతిలో పనిచేసే రోజుల్లో ఆంధ్రజ్యోతి వారపత్రిక (ఇప్పుడు నవ్య అనే పేరుతొ వస్తోంది) ఎడిటర్ పురాణం సుబ్రమణ్య శర్మ గారు పాఠకులు పాల్గొనే ఒక శీర్షిక ప్రారంభించారు. దాని పేరు ‘నాకు వచ్చిన కల’

పుంఖానుపుంఖాలుగా పాఠకుల నుంచి రచనలు వచ్చేవి. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మగారు అస్వస్థత కారణంగా సెలవు పెడితే కొన్నాళ్ళు పురాణం గారికి సహాయకుడిగా పనిచేశాను. అలా ఈ శీర్షికకు వచ్చే రచనలు పరిశీలించే అవకాశం నాకు లభించింది. వీటిలో ఒకటి ఇప్పుడు స్పురణకు వస్తోంది.
ఒకడు కల కంటాడు. తాను ఒక స్నేహితుడికి ఇచ్చిన బాకీని ఆ మిత్రుడు తీర్చేస్తాడు. అయితే అది కలలో.
నిజజీవితంలో ఆ స్నేహితుడు అప్పు తీర్చబోతే అదేమిటి బాకీ ఎప్పుడో చెల్లు అయింది కదా అంటే ఆ స్నేహితుడు తెల్లబోతాడు. బాకీ తీర్చింది కలలో అనే విషయం చివరికి అర్ధం అవుతుంది. అదే తాను స్నేహితుడివద్ద అప్పుచేసి అతడి బాకీ తీర్చినట్టు కలకని, దాని విషయం పూర్తిగా మరచిపోతే ఏమయ్యేదో అని తీరిగ్గా మధన పడతాడు.
ఈ సంగతి గుర్తు రావడానికి ఒక కారణం వుంది.
ఈరోజు ఒక ఛానల్ లో చర్చ చూశాను. అది కేవలం ఊహాగానాల మీద సాగిన చర్చ. అంటే టీవీ వాళ్ళే( ఆ కలలో లాగా) ఒక పరిణామం ఊహించుకుని, అది జరిగిందని నమ్మి చర్చపెట్టారు. సరే! అందులో పాల్గొన్నవాళ్ళు కూడా అది జరిగిందనే నమ్మి యధారీతిగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
శుభం భూయాత్!
(12-08-2021)

నవ్వుకునేవాళ్ళకు నవ్వుకున్నంత

 ఆఫీసరు కొత్తగా చేరిన ఉద్యోగితో అన్నాడు.

"ఇక్కడ పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తాం. నువ్వులోపలకి వచ్చేటప్పుడు డోర్ మ్యాట్ మీద బూట్లు శుభ్రంగా తుడుచుకుని వచ్చావా?"

"అవునండీ!"

"అలానా! మేము మరో విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటాము. ఇక్కడ పనిచేసేవాళ్ళు నిజం చెబుతున్నారా అబద్దం చెబుతున్నారా అని. అసలా గుమ్మం దగ్గర డోర్ మ్యాటే లేదు"


"కుక్కలు ఎందుకు పెళ్లి చేసుకోవు"

"ఇదో ప్రశ్నా! ఎందుకంటె వాటిది అప్పటికే కుక్క బతుకు"


"తల్లికీ భార్యకూ తేడా?"

" ఏడుస్తున్న నిన్ను, తల్లి ఈ లోకంలోకి తెచ్చిపడేస్తుంది. రెండో ఆవిడ నువ్వు జీవితాంతం ఆ ఏడుపు ఆపకుండా జాగ్రత్తగా కనిపెట్టి చూస్తుంది"


"మగ సెక్రెటరీకి ఆడ సెక్రెటరీకి తేడా?"

"మగ సెక్రెటరీ ఆఫీసుకు వెళ్ళగానే బాసుకు 'గుడ్ మార్నింగ్' చెబుతాడు. ఆడ సెక్రెటరీ 'ఇక లేవండి బాస్ తెల్లారింది' అంటుంది"

(మళ్ళీ మళ్ళీ చెప్పక్కరలేదు - యధావిధిగా ఇంగ్లీష్ జోకులకు స్వేఛ్చానువాదం)