25, మే 2021, మంగళవారం

ఫ్రాడ్ ని మించిన ఫ్రాడ్

 “సేల్ డీడ్ పత్రాలు పోగొట్టిన బ్యాంక్ – రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని జిల్లా కమిషన్ తీర్పు”

ఇది ఈరోజు పత్రికలో వచ్చిన వార్త

ఇప్పుడు ఈ వార్త వెనక కధ చెప్పుకుందాం.

రవి, కళావతి ఇద్దరు వృద్ధ దంపతులు. ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపారు. ఓ పాతికేళ్ళ క్రితం కాబోలు ఇప్పుడు మేముంటున్న అపార్ట్ మెంటులో ఒక వాటా కొనుక్కున్నారు. ఆర్ధిక ఇబ్బందులతో ఇంటి మీద రుణం తీసుకున్నారు. అప్పు ఇచ్చింది  బ్యాంకు ఆఫ్  మైసూరు. తీర్చే టైముకు దాన్ని స్టేట్ బ్యాంకులో విలీనం చేశారు.

అసలు ఫాయిదాలు కట్టాము కనుక మా ఇంటి పత్రాలు మాకు వాపసు చేయమని కోరారు. అవి కనబడడం లేదన్నారు బ్యాంకు వాళ్ళు. వున్న ఒక్క ఇంటికీ పత్రాలు లేకపోతె ఎల్లా అని బ్యాంకు  చుట్టూ తిరిగారు. ఫలితం శూన్యం.

ఎవరో సలహా ఇస్తే ఇంటికి దగ్గరలో వున్న ప్రమోద్ అనే ఒక లాయర్ను పట్టుకుని వినియోగదారుల ఫోరంలో కేసు వేశారు.

తీర్పు వీరికి అనుకూలంగా వచ్చింది.

అయితే అసలు కధ ఇక్కడే మొదలయింది.

రెండు రోజుల క్రితం బ్యాంకు వాళ్ళం అంటూ ఎవరో ఫోన్ చేశారు. మీ కాగితాలు దొరికాయి, మీరు బ్యాంకుకు రాయనక్కరలేదు, మేమే వచ్చి ఇస్తాము అన్నారు.

వీళ్ళ సంతోషానికి అవధులు లేవు.

అన్నట్టే వచ్చారు. పత్రాలు ఇచ్చారు. ముట్టినట్టు సంతకాలు చేయించుకుని వెళ్ళిపోయారు.

ఇది జరిగింది నిన్న. అంటే మే ఇరవై మూడున.

ఈరోజు ఈనాడు దినపత్రిక పదమూడో పేజీలో పైన చెప్పిన వార్త వచ్చింది.  వీళ్ళు పడిన మానసిక సంక్షోభానికి పరిహారంగా అయిదు లక్షలు బ్యాంకు చెల్లించాలని.

వీళ్ళు ప్రతిరోజూ ఈనాడు పత్రిక తెప్పించుకుంటారు. కోవిడ్ బారిన పడినప్పటి నుంచి ఇంటి ముందు దాన్ని కొన్ని గంటలు ఎండలో వుంచి ఆ తరువాత చదువుతారు. ఆవిధంగా అయిదు లక్షల నష్టపరిహారం వార్త ఆలస్యంగా తెలిసింది.

ఇన్నాళ్ళు కనబడని కాగితాలు నిన్న మొన్నట్లో ఎలా దొరికాయి. సాధారణంగా బ్యాంకుకు వచ్చి తీసుకువెళ్ళమనే వాళ్ళు ఇంటికే వచ్చి ముట్టినట్టు  ఎందుకు రాయించుకు వెళ్ళారు. 

ఈ ప్రశ్నలు కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.

కొద్దిసేపటి క్రితమే నాకీ సంగతి తెలిసింది. విషయం కనుక్కుందామని ఈనాడు బ్యూరోలో పెద్ద బాధ్యతలు చూస్తున్న  ఉండ్రు నరసింహారావు గారెకి ఫోన్ చేశాను.  నా  గురించి ప్రవర చెప్పకుండానే,  ఆయన నన్ను గుర్తుపట్టి విషయం విని మా వాళ్ళ చేత మీకు ఫోన్ చేయిస్తామని చెప్పారు. కొద్దిసేపటికే ప్రశాంత్ గారు ఫోన్ చేశారు. ఆయన కూడా ప్రశాంతంగా నేను చెప్పింది విన్నారు.

చూడాలి ఈ కధ ఏ మలుపులు తిరుగుతుందో! 


(ఈనాడు దినపత్రిక- 24-05-2021)


(24-05-2021)      

23, మే 2021, ఆదివారం

పరమాచార్య పావనగాధలు


మా పెద్దన్నయ్య, కీర్తిశేషులు  భండారు పర్వతాల రావు గారు రాసిన పరమాచార్య పావన గాథలు పుస్తకాన్ని ఆయన రెండో కుమార్తె కొలిపాక  కృష్ణవేణి ఆడియో రూపంలోకి తీసుకు వచ్చింది. ఆసక్తి ఉన్నవారు వినవచ్చు.

కోర్టు గుమ్మం జైలు గడప

 

“మీ కేసులో బలం వుంది, కానీ ఈ కేసును కడకంటా తీసుకువచ్చే శక్తి మీలో లేదని అనుకుంటున్నాను” అన్నాడా లాయరు గారు.

అనుకుంటాం కానీ ప్లీడర్లలో, వైద్యుల్లో అందరూ పీడించేవాళ్లే వుండరు. ఈయన కూడా అలాంటి అరుదైన వాడే అనిపించింది.

నేను 1975లో ఆలిండియా రేడియోలో చేరినప్పుడు ఏడాది తిరగకుండానే పే కమిషన్ సిఫారసులు అమలు చేశారు. ఆ చేయడంలో ఎక్కడో పొరపాటు జరిగి నాకు రావాల్సిన గ్రేడు రాలేదు. కొన్నేళ్ళ తర్వాత న్యూస్ ఎడిటర్ గా వచ్చిన ఆకిరి రామకృష్ణా రావు నాకు జరిగిన అన్యాయం తెలుసుకుని సర్వీసు వ్యవహారాల్లో దిట్ట అయిన ఒక ప్లీడరు గారి దగ్గరకు తీసుకువెళ్లాడు.
విషయం మొత్తం తెలుసుకుని ఆ వకీలు గారు చెప్పిన మాట ఇది.
అంతే కాదు కొన్ని పాయింట్ల రూపంలో గీతా బోధ కూడా చేశారు.
“మీ ప్రొబేషన్ పూర్తి కాలేదు. అంచేత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు వేస్తె కొన్ని ఇబ్బందులు రావచ్చు. ప్రభుత్వం ఒక కాంక్రీటు గోడ లాంటిది. దాన్ని డీకొడితే గోడ పగలడం కంటే డీ కొట్టిన తల పగిలే అవకాశాలే ఎక్కువ. మనం ఒక కోర్టులో గెలిస్తే వాళ్ళు పై కోర్టుకు వెడతారు. అలా మనం ఎక్కలేనన్ని మెట్లు వాళ్ళు సులువుగా ఎక్కేస్తారు. మనమూ ఎక్కే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఆ శక్తి ఉందా లేదా అని ఆలోచించుకోవాలి. ఇటువంటి పొరబాటే ఓ వందా రెండు వందల మందికి జరిగి వుంటే తలా కాస్త ఖర్చు పెట్టుకుని పోరాడవచ్చు. కానీ ఇది ఇండివిడ్యువల్ కేసు. పొరబాటు జరిగినా అది అంగీకరించరు. అంచేత వాళ్ళు లిటిగేషన్ కొనసాగిస్తారు. అంత ఆర్ధిక స్థోమత మీకు వుందని అనుకోను. ప్రొబేషన్ పూర్తి కాలేదు కాబట్టి కేసు తేలే వరకు మీకు పే కమిషన్ ప్రయోజనాలు నిలిపేసినా ఆశ్చర్యం లేదు. కేసు తేలడానికి ఏండ్లూ పూండ్లు పట్టవచ్చు. అప్పటిదాకా తట్టుకోగల శక్తి మీకు వుందని నేను అనుకోవడం లేదు.”

వచ్చిన క్లయింట్లని ఇలా నిరుత్సాహ పరిచే లాయర్లు ఉంటారని నాకు తెలియదు. ఆయన నా మీద సానుభూతితో చెప్పాడా లేక ఈ జర్నలిస్టులు అడిగిన ఫీజు ఇవ్వరు అనే అనుమానంతో చెప్పాడా అదీ తెలియదు. తెలిసినదల్లా అతడిలో సందేహించడానికి ఏమీ లేదనే. ఓ నమస్కారం పెట్టి వచ్చేసాము.

తర్వాత అనేక పే కమిషన్లు వచ్చాయి. నా సర్వీసు చివరాఖర్లో వచ్చిన పే కమిషన్ సిఫారసులతో కేంద్ర సిబ్బంది వేతనాలు ముందెన్నడూ లేని విధంగా పెరిగాయి. కాకపొతే, 2005 డిసెంబరు 31 సాయంత్రం నేను రిటైర్ అయ్యాను. మర్నాడు అంటే 2006 జనవరి ఒకటి నుంచి ఆ సిఫారసులు అమల్లోకి వచ్చాయి. అంటే ఒక్క రోజు తేడాతో పెన్షన్ లో పెద్ద వ్యత్యాసం వచ్చింది.

కానీ నేను ఆకాశవాణిలో గడించిన అనుభవాలు, మాస్కో జీవితం, పిల్లలు ఎదిగిరావడం ఇవన్నీ ఇచ్చిన తృప్తిని ఎన్ని పే కమిషన్లు ఇవ్వగలుగుతాయి? ఆనాడు ఆ లాయరు నన్ను ఆ కేసు గెలిపించి వుంటే నాకీ అవకాశాలు లభించి ఉండేవి కావేమో! ఒకటి తీసుకోవడం అంటే మరోటి ఇవ్వడం అనే లెక్క ఆ పైవాడిది.
“గోదావరిలో ఎన్ని నీళ్లున్నా మనం చెంబు తీసుకువెడితే చెంబెడు, బిందె తీసుకువెడితే బిందెడు. ఏదైనా ప్రాప్తాన్నిబట్టే” అనే మా అన్నయ్య మాటలు నాకు ఊరట. ఆయన ఇంకో మాట అనేవారు.
‘కోర్టు గుమ్మం ఎక్కకుండా, జైలు గడప తొక్కకుండా వెళ్లదీయగలిగితే దాన్ని మించిన ప్రశాంత జీవితం మరోటి వుండదు”
అదృష్టవశాత్తు ఈ రెండూ నా అనుభవంలోకి రాలేదు.


(23-05-2021)

‘మరుపు’ మంచిదే!

   

గుర్తు పట్టారా అంటూ సరిగా  తెల్లవారకుండానే ఫోన్లో పలకరిస్తుంది ఓ గొంతు. మధ్యాన్నం ఏ కూరతో అన్నం తిన్నానో సాయంత్రానికి గుర్తుండని గొప్ప  జ్ఞాపక శక్తి నాది. జుట్టు పీక్కున్నా గుర్తు రాదు.

కానీ కధ అంతటితో ఆగదు.

‘నేనెవరో చెప్పుకోండి చూద్దాం’ అంటుందా గొంతు అవతల నుంచి.

పొద్దున్న పొద్దున్నే ఈ అగ్ని పరీక్ష ఏవిటని వాపోవడం ఇవతల మన వంతు.  

మనం గుర్తు పట్టడం, మనల్ని గుర్తు పట్టడం ఈ రెండూ ఏదో ఒకరోజున అందర్నీ వేధించే సమస్యలే అనిపిస్తుంది ఈ పాడు లోకంలో.

నిన్న సాయంత్రం ఒక పెద్దాయన ఫోన్ చేశారు, ఓ అరవై మంది అనాథాశ్రమం వాళ్లకు వాక్సిన్ వేయించాలి ఎలా అని.

ఒకప్పుడు ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్నారు.  ఇంకా ఏదో సేవ చేయాలనే తపన.

ఆయన చెప్పిన మాటలు  వింటుంటే బాధ వేసింది.

గతంలో అలవాటు చొప్పున పెద్ద అధికారులకి ఫోన్ చేసి చెబుదామని ప్రయత్నిస్తే ‘సారు బిజీగా వున్నారు, మీరు ఫోన్ చేశారని తర్వాత చెబుతాను’ అన్నాడట ఆ అధికారి పియ్యే.

ఆయన కంటే ముందు రిటైర్ అయినవాడిని నేను. కనీసం ఆయనకీ ఫోన్ నెంబర్లు అన్నా తెలుసు, నాకదీ తెలియదు.

రోలు, మద్దెల సామెత జ్ఞాపకం వచ్చింది.

ఆలిండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ గా చేసిన వీవీ శాస్త్రి గారు ఒక మాట చెప్పేవారు. ‘మనం సర్వాధికారాలు చెలాయించిన ఆఫీసుకి రిటైర్ అయిన తర్వాత తరచుగా, అదీ పని లేకుండా  పోకూడదు అని.

ఎందుకంటే కొత్త అధికారులు వస్తారు. పాత అధికారులని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం పాత సిబ్బందికి వుండదు. అది సహజం అని సరిపెట్టుకుంటే పర్వాలేదు, లేకపోతె మిగిలేది మనస్తాపమే.  

ఓ యాభయ్ ఏళ్ళ క్రితం కేబినెట్ మంత్రిగా రెవెన్యూ వంటి కీలక శాఖలను నిర్వహించిన శ్రీ పీ. నరసారెడ్డి   చాలా కాలం క్రితం ఏదో ఫంక్షన్ లో కలిసారు.  రేడియో విలేకరిగా నాకు ఆయనతో సన్నిహిత పరిచయం వుండేది. చాలా ఏళ్ళ తరువాత మళ్ళీ ఇదే కలవడం. వృద్ధాప్యపు ఛాయలు మినహా మానసికంగా ఆయన గట్టిగానే కనిపించారు. గతం బాగానే  గుర్తున్నట్టు వుంది. అలనాటి విషయాలు కాసేపు ముచ్చటించారు. ఎలా వున్నారుఅనే నా ప్రశ్నకు ఆయన ఇలా జవాబిచ్చారు.

హైకోర్టులో బార్ రూమ్ అనేది వుంటుంది. యువ లాయర్లతో పాటు వయసు ఉడిగిన మాజీ అడ్వొకేట్లు కూడా అక్కడ కనిపిస్తారు. నిజానికి వారికి వాదించే కేసులు ఏమీ వుండవు. ఇంట్లో ఉబుసుపోక అక్కడికి చేరి కాసేపు కాలక్షేపం చేసి ఇళ్ళకు వెడతారు. నేనూ అంతే. అప్పుడప్పుడూ పార్టీ ఆఫీసుకు వెడతాను. నేను ఎవరన్నది మా  పార్టీలోనే చాలామందికి తెలియదు. తెలిసిన వాళ్ళు కూడా తెలియనట్టు తప్పుకుంటారు. ఒక్కోసారి బాధగా అనిపిస్తుంది. కానీ ఇందిరాగాంధి వంటి  గొప్పనాయకులని తలచుకుంటే, వారితో పోల్చుకుంటే నా  పరిస్తితి చాలా మెరుగు’

ఇలాంటిదే మరో వ్యధాభరిత కధ

ఆయన చాలా కాలం ఒక పెద్ద కార్యాలయానికి ప్రధానాధికారిగా పనిచేశారు. ఆయన కనుసన్నల్లో వందలాదిమంది సిబ్బంది పనిచేసేవారు.  రిటైర్ అయిన తర్వాత కొన్నాళ్ళకు ఏదో పని వుండి ఆ ఊరు వెళ్ళారు. తన పొజిషన్ లో పనిచేస్తున్న మరో అధికారి బాగా తెలిసిన వాడు కావడంతో వాళ్ళ ఇంటికి వెళ్లి కాసేపు కూర్చుని పాత విషయాలు తిరగేసుకున్నారు.

ఈలోగా ఆఫీసు టైం కావడంతో కొత్త అధికారి పాత అధికారిని మీరు కూడా రండి మన ఆఫీసును చూద్దురు కాని అని కోరడంతో ఆయన కూడా కారెక్కి వెంట వెళ్ళాడు.

ఆ ఆఫీసులో ఒక పద్దతి ఏళ్ళ తరబడి పాటిస్తూ వస్తున్నారు.

ప్రధానాధికారి ఇంటి నుంచి బయలుదేరగానే ఆయన పర్సనల్ స్టాఫ్ అలర్ట్ అవుతారు. ఆఫీసుకు చేరగానే సెక్యూరిటీ చీఫ్ ఫుల్ సెల్యూట్ తో ఆయన్ని  కారు వద్దనే రిసీవ్ చేసుకుని, బ్రీఫ్ కేసు తీసుకుని   వెంట వుండి లిఫ్ట్ దగ్గరకు తీసుకువేడతాడు. ఆ అధికారి వచ్చేదాకా లిఫ్ట్ ను   గ్రౌండ్  ఫ్లోర్ లోనే నిలిపి సానిటైజ్  చేసి ఉంచుతారు. లిఫ్ట్ బాయ్ నమస్కారం పెట్టి పైకి తీసుకువెడతాడు.

సరే! ఇదంతా ఆ రోజు అక్కడ పద్దతి ప్రకారం జరిగింది. విచిత్రం ఏమిటంటే అప్పటికి కొన్నేళ్ళ క్రితం ఆ పాత అధికారిని కూడా  సకల లాంఛనాలతో ఇలాగే రిసీవ్ చేసుకునేవారు. ఆయనా ఈ వైభోగం అనుభవించిన వాడే.

ఇవ్వాళ కూడా  అదే మనిషి. అదే అధికారులు. అదే సిబ్బంది. కనీసం వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయన్ని గుర్తు పట్టినట్టు కనీసం నటించను కూడా లేదు.  

భగవద్గీతలో చెప్పిన మాదిరిగా మానవుడు  జీర్ణమై పోయిన పాత ఉడుపులు వదిలేసి కొత్త వస్త్రాలు ధరించినట్టు, ఉద్యోగాలు కూడా.

కావున, ఓ పార్దా! పాత ఉద్యోగాల వైభోగం  కోసం వర్తమానంలో శోకించుట తగదు. మరచిపోవుట మేలు.

(23-05-2021)    

 

 

22, మే 2021, శనివారం

ఏ నిమిషానికి ఏమి జరుగునో .....

 'శాస్త్రి గారి భార్య పరిస్తితి బాగాలేదు. గంటలు గడిచే పరిస్తితి కూడా లేదు'

అపోలో ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ బాబీ (మా కజిన్) ఫోను. మధ్యాహ్నం నేను వెళ్ళేసరికే అంతా అయిపొయింది.

ఆవిడ నిజానికి శాస్త్రి గారికంటే ఆరోగ్యంగా వుండేవారు. రోగం రొష్టు అంటూ ఏనాడు యాతన పడలేదు, పెట్టలేదు. కొన్నేళ్ళ క్రితం శాస్త్రి గారు, ఆయన భార్య పుణ్యవతిగారితో కలిసి మా దంపతులం కాశీ యాత్ర చేసివచ్చాం. వాళ్ళిద్దరికీ తీర్ధయాత్రలంటే మక్కువ. తిరిగే ఓపిక మాకు లేదు. మాకు ఇల్లే కైలాసం. ఎంతో వెంటబడితే ఒక్కసారి కాబోలు వాళ్లతో వెళ్లి, మేమూ యాత్ర చేసివచ్చాం అనిపించుకున్నాం. నిజానికి, నేనూ ఆర్వీవీ కృష్ణా రావు గారు వారింటికి వెళ్లి కులాసాగా గడిపివచ్చి కొన్ని వారాలు కూడా గడవలేదు. అంతలోనే ఈ కబురు.

శాస్త్రిగారు హైదరాబాదులో ఆకాశవాణి డైరెక్టర్ చేసి రిటైర్ అయ్యారు. వేమూరి విశ్వనాథ శాస్త్రి అంటే ఎవ్వరికీ తెలవదు. వీ.వీ. శాస్త్రి అంటే తెలియని వాళ్ళు లేరు.

ఆసుపత్రిలో వాళ్ళ అల్లుడు శ్రీరాం బిల్లులు వగైరా పనులు చూస్తున్నారు. 'బాడీ' ఇవ్వడానికి కొన్ని గంటలు పట్టేట్టు ఉందన్నారు. అదేమిటో కాసేపటి కిందటి దాకా ఆవిడ 'పుణ్యవతి'. ఇప్పుడేమో 'బాడీ' గట్రా అంటున్నారు. ప్రాణం ఉన్నంతసేపే మనిషి. ఆ కాస్తా తప్పుకుంటే, కట్టెల మీదకు చేరే మరో 'కట్టె'. అంతే.

శాస్త్రి గారిని తీసుకుని పక్కకు వచ్చాను. ఏదో చోటు చూసి కూర్చున్నాం. ఏడుస్తారేమో అనుకున్నాను. కానీ ఆయన మాట్లాడ్డం మొదలు పెట్టారు. అన్నీ పచ్చి నిజాలు. అందులో కనిపించని వేదాంతం వుంది.

"యాభయ్ ఆరేళ్ళు నాతొ కాపురం చేసింది. సుఖం నాకు ఒదిలి కష్టం తను పంచుకుంది. బయట పెత్తనాలు చేసిరావడం తప్ప ఇంట్లో ఇంతమంది ఆడపిల్లలు ఎలా పెరుగుతున్నారు, పిల్లాడు ఎలా చదువుతున్నాడు ఏమీ పట్టించుకోకుండా తిరిగాను. అన్నీ తెలుసని పైకి విర్రవీగాను కానీ ఏమీ తెలియదని నాకు బాగా తెలుసు. ఏమీ తెలియని నన్ను ఇలా ఒదిలేసి వెళ్ళిపోయింది. బడాబడా అరవడం తప్ప నాకు స్టవ్ అంటించడం కూడా రాదు. లక్షలు బిల్లు తీసుకుని ఆసుపత్రివాళ్ళు నా భార్యని ఇలా నా చేతిలో పెట్టారు. వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేసేవుంటారు. నేను చేయగలిగింది నేనేమైనా చేసానా. గత కొద్ది రోజులుగా నాది ఇదే ఆలోచన. ఇంట్లో గిరగిరా తిరిగే మా ఆవిడ కాలూ చేయీ కదపలేని స్తితిలో ఉండిపోయింది. ఏనాడూ ఆమెకు ఏమీ చేయలేదని తెలుసు. అందుకే నేనే అన్నీ చేయడం మొదలు పెట్టాను. మొహం కడిగేవాడిని. జుట్టు దువ్వేవాడిని. నీ దగ్గర దాపరికం ఎందుకు. మల మూత్రాలు సయితం నా చేతులతో శుభ్రం చేసేవాడిని. ఇదంతా గొప్పకు చెప్పడం లేదు'

శాస్త్రి గారి కళ్ళల్లో నీళ్ళు. కాసేపు నిశ్శబ్దం.

నిజమే. ఆయన నాకు ఎన్నో ఏళ్ళుగా తెలుసు. రిటైర్ అయ్యేంత వరకు ఇల్లు, ఇల్లాలిని పట్టించుకోలేదు. రిటైర్ అయిన తరువాత ఆయన ఇంటినీ, ఇల్లాలినీ వదిలి బయట తిరగలేదు. ఎవరయినా ఆయన ఇంటికి వెళ్ళాల్సిందే. బయటకు రమ్మంటే 'నేను రాను ఇంట్లో తనొక్కతే వుండాలి, కరెంటు పొతే భయపడుతుంది' అనేసేవారు.

'బహుశా నేను అలా అలవాటు లేని సేవలు చేసి వుండాల్సింది కాదేమో. నాచేత చాకిరీ చేయించుకోవడం ఇష్టం లేకే ఇలా దాటిపోయిందేమో!' అంటున్నారు శాస్త్రి గారు

ఈసారి నీళ్ళు నా కళ్ళల్లో.

ఇది జరిగి ఆరేళ్లు అయింది.

మరో నాలుగేళ్ళలో  నా పరిస్థితి అలానే అవుతుందని అనుకోలేదు.

రెండేళ్ల క్రితం, 2019 ఆగస్టులో మా ఆవిడకి రెండ్రోజులు జ్వరం. నిజంగా పెద్ద జ్వరమేమీ కాదు. టెంపరేచర్ వంద దాటలేదు.

ఆరోజు ఉదయం కూడా ఓ టీవీ చర్చకు వెళ్లి వచ్చాను. సాయంత్రం ఏదో టీవీ వాళ్ళు రమ్మన్నారు కానీ వెళ్ళలేదు. రాత్రి భోజనం తర్వాత (ఇంగ్లీష్ వైద్యం వాళ్లకి పథ్యం లేదు, జ్వరం వున్నా కాస్త ఎంగిలి పడమనే చెబుతారు) నిద్రపోవడానికి ముందు ఓ పదాటలు కార్డ్సు ఆడటం, అలెక్సా ఆన్ చేసి ఘంటసాల పాడిన పాత సినిమా  పాటలు వినడం, మావాడు, కోడలు ఉద్యోగరీత్యా బెంగళూరు వెళ్ళిన తర్వాత   ఒక అలవాటుగా మారింది. ఆ రోజు కార్డ్సు ఆడాలని తను అడగలేదు. అలెక్సా ఆన్ చేశాను. విచిత్రంగా ఘంటసాల భగవద్గీత మొదలయింది.

తలనొప్పిగావుంది అమృతాంజనం కావాలంది. అదెక్కడ వుంటుందో తెలియని అజ్ఞానం. తానే చెప్పింది పలానా చోట చూడమని. వెతికి పట్టుకొస్తే అదికాదు జిందాతిలిస్మాత్ తెమ్మంది. అత్తయ్య గారి పొటో పెట్టిన ఫ్రేము పక్కన వుంటుంది చూడమని అంది. తెచ్చిన తర్వాత ఏదీ రాసుకోలేదు. మంచినీళ్ళు, కాదు కాదు, ఏదైనా జ్యూస్ కావాలంది. నా చేతులతోనే తాగిస్తే కొద్దిగా తాగింది. తర్వాత బాగా ఆయాసపడింది. చూడలేక అంబులెన్స్ పిలిపించాను. బాత్ రూం కు పోతానంటే అడుగులు తడబడుతుంటే నేనే తీసుకువెళ్ళి తీసుకుని వచ్చాను. ఇంతలో అంబులెన్స్ వచ్చింది. ఇంట్లో తను నేను తప్ప ఎవరు లేరు. అపోలో ఆసుపత్రికి తీసుకువెళ్ళాను. 48 ఏళ్ళ సంసార జీవితంలో నాకు నేనై ఆమెకు చేసిన సేవలు ఇవే. 
ఆస్పత్రికి వెళ్ళిన 15 నిమిషాల్లో చావుకబురు చల్లగా చెప్పారు. 
నిజంగా ఇలా కూడా మనుషులు చనిపోతారా!



(కాశీ యాత్రలో ఒక చోట పుణ్యవతి గారు, నా భార్య నిర్మలతో నేను)

  

 

21, మే 2021, శుక్రవారం

ఓ రామ నీ నామమెంతో రుచిరా!

 “కలియుగంలో మానవుల  శక్తి సామర్ధ్యాలు అతిస్వల్పం. వారికి జవసత్వ్వాలు కలిగించే విధానం ఏమైనా ఉందా” అని పార్వతీదేవి తన భర్త అయిన పరమేశ్వరుడిని అడిగింది. దానికి ఈశ్వరుడు, “లేకేమి! వుంది. అది రామనామం. దాన్ని భజిస్తే శరీరం సర్వ శక్తి సంపన్నం అవుతుంది” అని సెలవిచ్చారు.

ఆ మాట నూటికి నూరు శాతం నిజమంటున్నాడు పదిహేను రోజులు కరోనాతో పోరాడి ఈరోజే దాని కబంధ హస్తాల నుంచి విడుదల అయిన మిత్రుడు జ్వాలా నరసింహారావు. ముందు ఆయన భార్య నా మేనకోడలు అయిన విజయలక్ష్మి,  వారి అమ్మాయి టీవీ నైన్ ప్రేమ మాలిని, ఆ వరుసలోనే చివర్లో జ్వాలా అందరూ కరోనా చేతికి చిక్కారు. పదిహేను రోజులు ఇంట్లోనే వేర్వేరు గదుల్లో ఒంటరిగా ఉంటూ కరోనాను ఎదుర్కున్నారు. విజయవంతంగా బయట పడ్డారు. విశేషం ఏమిటంటే ఈ ముగ్గురూ రెండు డోసులు వాక్సిన్ తీసుకుని రెండు నెలలు అవుతోంది. వాక్సిన్ తీసుకోవడం వల్లనే నెగిటివ్ ఎఫెక్ట్స్ తీవ్రత అదుపులో వుందని డాక్టర్ల ఉవాచ.

జ్వాలా చెబుతోంది ఒక్కటే. ముందు పరమేశ్వరుడు చెప్పిన రామనామం. ఈ పదిహేను రోజులు తమ నాలుకల మీద నిర్విరామంగా రామ రామ అనే పదాలు ఆడుతూనే వున్నాయని అంటూ,  భగవత్ కృప, దానితో పాటు   నారాయణుడి రూపంలో కొందరు డాక్టర్లు తాము కోలుకోవడానికి దోహద పడ్డారని చెప్పాడు.

డాక్టర్ రాజ్ కిరణ్, డాక్టర్ గంగాధర్ (నిమ్స్), డాక్టర్ రామకృష్ణ, డాక్టర్, కిషోర్, డాక్టర్ మనోహర్ ఈ పదిహేను రోజులు తమని ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉంటూ ఫోనులో తగిన సలహాలు, సూచనలు ఇస్తూ వచ్చారని జ్వాలా వారికి కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే కరోనా రోగులు మసిలే వార్డుల్లో నర్సులు ధరించే ప్రత్యేక రక్షణ దుస్తులు వేసుకుని సర్వెంట్ మెయిడ్ అనిత తమకు ఎనలేని సాయం అందించిందని చెప్పాడు.

కరోనాతో  పోరాటానికి కావాల్సిన ఆత్మబలాన్ని తమకు రామనామం ప్రసాదించిందని ఆయన నమ్మకం. కరోనా ఐసోలేషన్ కాలంలోనే జ్వాలా,  ప్రతి శని వారం, ఆదివారం హైదరాబాదు ఆకాశవాణికి గత ఏడాది కాలంగా ప్రసార నిమిత్తం అందిస్తూ వచ్చిన రామాయణ రసరమ్య గాధలు ధారావాహికకు ఆటంకం కలగకుండా  ఫోను ద్వారా రికార్డు చేయడం ఇందుకు ఉదాహరణ.

మరో ఉదాహరణ ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన  జ్వాలా రాసిన  వ్యాసం ‘ సర్వ జగత్తూ భగవత్ సృష్టే.



(21-05-2021)

తరుముకొచ్చిన మృత్యువు

 (రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆంధ్ర ప్రభ దినపత్రికలో నా వ్యాసం)

మృత్యుపాశం చాలా బలమైనది. పలానా చోట చావు రాసిపెట్టి వుంటే, వేల మైళ్ళ దూరంలోని వ్యక్తిని కూడా ఆ పాశం పట్టేసి అక్కడికి లాగేస్తుంది. రాజీవ్ విషయంలో అదే జరిగింది.
1991 లో లోకసభకు మధ్యంతర ఎన్నికలు. ఆ ఎన్నికల్లో గెలిచి మరోమారు ప్రధాని కాగలనే నమ్మకంతో నాటి కాంగ్రెస్ నేత రాజీవ్ గాంధి దేశ వ్యాప్తంగా ముమ్మరంగా ప్రచార కార్యక్రమంలో నిమగ్నమై వున్నారు. అందులో భాగంగా హైదరాబాదు, విశాఖ పట్నాల్లో ఎన్నికల ర్యాలీలు పెట్టుకున్నారు. మే నెల ఇరవై ఒకటో తేదీ సాయంత్రం ఆరుగంటలకు విశాఖ నుంచి మద్రాసు వెళ్ళాల్సి వుంది. గెస్ట్ హౌస్ నుంచి విమానాశ్రయానికి వెడుతుండగా పైలట్ నుంచి మెసేజ్ వచ్చింది. సాంకేతిక లోపం కారణంగా ఈరోజు ప్రయాణం వీలుపడదని. రాజీవ్ నిరుత్సాహంగా వెనుదిరిగారు. ఆ రాత్రి విశాఖ గెస్ట్ హౌస్ లో వుండి మర్నాడు మద్రాసు వెళ్ళాలి. ప్రయాణం ఇలా వాయిదా పడడం ఆయనకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఏమైనా సరే వెళ్లి తమిళనాడులో ఎన్నికల ప్రచారం కొనసాగించాలని ఆయనకు మనసులో బాగా కోరిక. కానీ ఏం చేయాలి.
ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఓ మెసేజ్. లోపం సరిచేసారు, ఎయిర్ పోర్టుకు వస్తే మద్రాసు వెళ్ళ వచ్చని. రాజీవ్ మనసులో కోరుకున్నట్టే జరిగింది కాబట్టి క్షణం ఆలస్యం చేయకుండా కారును వెనక్కి తిప్పమని ఆదేశించారు. ఈ తొందరలో మరో వాహనంలో వస్తున్న తన ప్రధాన భద్రతాదికారి ఓపీ సాగర్ కి ప్రయాణంలో మార్పు గురించి తెలియచెప్పలేదు.
చివరికి సొంత సెక్యూరిటీ సిబ్బంది లేకుండానే రాజీవ్ మద్రాసు వెళ్ళిపోయారు. (చాలా మందికి సందేహం కలిగే విషయం. మాజీ ప్రధాన మంత్రి సెక్యూరిటీ విషయంలో పైకి కనపడని లోపం ఏదో జరిగినదని అనిపిస్తుంది, ప్రయాణం చేస్తున్నది ప్రత్యేక విమానం అయినప్పుడు వ్యక్తిగత భద్రతాసిబ్బందికి కబురు చేసి వెంట తీసుకు వెళ్ళవచ్చు కదా అని. అధికారిక ఏర్పాట్ల పరంగా చూస్తే ఇదో లోపం. కర్మను నమ్మేవారికి విధి ఆడిన నాటకం)
రాజీవ్ మద్రాసు చేరుకొని అక్కడినుంచి ఎన్నికల సభ జరిగే శ్రీ పెరంబదూర్ చేరుకునే సరికి రాత్రి పది గంటలు దాటింది. సభికులవైపు చేయి ఊపుతూ రాజీవ్ వేదిక వైపు వెడుతున్నారు. మహిలళ గేలరీలో స్త్రీలు రాజీవ్ ను చూస్తూ కేరింతలు కొడుతున్నారు. ఈ సందడిలో ఓ ముప్పయ్యేళ్ల మహిళ రాజీవ్ వైపు దూసుకురాబోయింది. ఈ లోగా అనసూయ అనే లేడీ పోలీసు ఆమెను అడ్డగించింది. ఇది గమనించిన రాజీవ్ ‘ఏం పర్వాలేదు, రానివ్వు’ (Don’t worry, relax!) అంటూ ఆ పోలీసును వారించారు.
రాజీవ్ గాంధి జీవితంలో ఆఖరుసారి మాట్లాడిన మాటలు ఈ రెండే.
తన మరణం గురించి ఏడేళ్ల నాడు రాజీవ్ చెప్పిన మాటలు మరుక్షణంలోనే నిజమయ్యాయి. రాజీవ్ గాంధీ పాదాలకు నమస్కారం చేయడానికి ఆ మహిళ ముందుకు వంగింది. రాజీవ్ వద్దని వారిస్తూ పైకి లేపుతున్నప్పుడు తన శరీరానికి అమర్చుకున్న బాంబులు పేలేలా మీటను నొక్కింది. అంతే! భయంకర విస్పోటనం. ఏం జరిగిందో తెలిసేలోగా జరగరానిది జరిగిపోయింది. రాజీవ్ శరీరం దూరంగా ఎగిరిపడింది. తల గుర్తు పట్టడానికి వీల్లేకుండా పేలిపోయింది. ఆ ప్రాంతం అంతా ఏడ్పులు, రోదనలతో రణరంగాన్ని తలపించింది.
అదే రాత్రి ఢిల్లీలో నిద్ర పోవడానికి సిద్ధం అవుతున్న సమయంలో సోనియా గాంధీకి ఒక ఆగంతకుడి నుంచి ఫోన్ వచ్చింది. ‘అంతా కులాసే కదా!’ అని అడిగి ఫోన్ పెట్టేయడంతో ఆవిడ కంగారు పడింది. కొద్దిసేపటి క్రితమే ఆమె వ్యక్తిగత కార్యదర్శి జార్జ్ ఇంటికి వెళ్ళిపోయాడు. వెంటనే రమ్మని చెప్పడానికి ఫోన్ చేస్తే అది ఎంగేజ్. ఆ సమయంలో మద్రాసు నుంచి జార్జికి కబురు తెలిసింది. వెంటనే జార్జ్ 10 జనపద్ నివాసానికి వెళ్ళాడు. విషయం తెలిసి సోనియా దుఖం కట్టలు తెంచుకుంది. ఆమెను ఆపడం ఎవరి తరం కాలేదు. ఆ దుఃఖంలో ఉండగానే ఆమెకు అస్తమా అటాక్ వచ్చింది. ముందుగా తేరుకున్నది ప్రియాంక గాంధీ. వెంటనే మద్రాసు పోవడానికి ఏర్పాట్లు చూడమని జార్జ్ తో చెప్పింది. ఈలోగా రాజీవ్ హత్య సంగతి తెలుసుకున్న రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ సోనియాను ఫోనులో పరామర్శించారు. మద్రాసులో పరిస్థితులు బాగాలేవని, ప్రయాణం మానుకొమ్మని సలహా చెప్పారు. కానీ భర్త మరణ వార్త తెలిసిన తర్వాత ఉండబట్టలేక సోనియా ప్రియాంకను వెంటబెట్టుకుని మూడుగంటల్లో మద్రాసు చేరుకున్నారు. కానీ ఏం లాభం. రాజీవ్ శరీర భాగాలను శవపేటికలో భద్రపరచి ఉంచారు. గుర్తు పట్టడానికి తల కూడా లేదు.
తన మరణం గురించి రాజీవ్ జోస్యం
ఇందిరాగాంధి వద్ద చిరకాలం పనిచేసిన పీసీ అలగ్జాండర్ My Days With Indira అనే పుస్తకం రాసారు. ఇందిరాగాంధి తన సొంత సెక్యూరిటీ చేతుల్లో దారుణ హత్యకు గురైన తర్వాత ఆమెను హుటాహుటిన ఆలిండియా మెడికల్ సైన్సెస్ సంస్థకు తరలించారు. ఇందిర మరణించిన విషయం అప్పటికి వెల్లడి కాలేదు. ఆ సమయంలో ఆసుపత్రి కారిడార్ లో సోనియా, రాజీవ్ గాంధీ నడుమ జరిగిన సంభాషణను యధాలాపంగా విన్నట్టు ఆయన ఆ పుస్తకంలో ఉటంకించారు.
ఇందిరాగాంధి మరణానంతరం తాను ప్రధాని కాగోరుతున్నట్టు రాజీవ్ తన మనసులోని మాట బయట పెట్టారు. దాన్ని సోనియా ససేమిరా కాదన్నారు. ‘వద్దు. నాకు ఏమాత్రం ఇష్టం లేదు.వాళ్ళు నిన్ను కూడా చంపేస్తారు”
రాజీవ్ ఇలా బదులిచ్చారు. “అవును చంపేస్తారు. అది తథ్యం. మరి మార్గాంతరం ఏమిటి? ప్రధానిని కాకపోయినా చంపేస్తారు”
సరే! ఈ సంభాషణలో నిజమెంత అనేది తెలియదు. ఎందుకంటే సోనియా మీద అలగ్జాండర్ మహాశయులకు కొంత కినుక వుంది. రాష్ట్రపతి అభ్యర్ధిగా తనను పార్టీ తరపున నామినేట్ చేయడాన్ని సోనియా వ్యతిరేకించిన విషయం ఆయన మనసులో పెట్టుకున్నారని, అంచేతనే ఇలాంటి కధలు సృష్టించారని అనేవాళ్ళు కూడా వున్నారు.
ఈ మొత్తం కధనంలో పేర్కొన్న వ్యక్తులు సోనియా, ప్రియాంక, మినహా ఎవ్వరూ ప్రస్తుతం జీవించి లేరు కాబట్టి ఇందులో రంధ్రాన్వేషణకు తప్ప సత్యాన్వేషణకు అవకాశం లేదు.
కావున, కాబట్టి చర్చించి వగచిన ఏమి ఫలము?

https://epaper.prabhanews.com/c/60583698