4, ఏప్రిల్ 2021, ఆదివారం
3, ఏప్రిల్ 2021, శనివారం
పరిషత్ ఎన్నికల బహిష్కరణ సబబేనా ?
ఎన్నికల బహిష్కరణ అనేది రాజకీయాల్లో కొత్తదేమీ కాదు. గతంలో జరిగింది. భవిష్యత్తులో పునరావృతం అయినా ఆశ్చర్యం లేదు. కాబట్టి ప్రస్తుతం ఏపీ పరిషత్ ఎన్నికల విషయంలో తెలుగు దేశం పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు.
కాకపోతే ఇటువంటి నిర్ణయాలు పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయని అనేంతవరకు చర్చలు సాగుతుండడం కొంత వింతగా వుంది. నిజంగా అలాంటి అవకాశం ఉందా!
చంద్రబాబు నాయుడు సుదీర్ఘ అనుభవం కలిగిన రాజకీయ నాయకుడు. ఆయన ఏ నిర్ణయం అయినా ఆచితూచి తీసుకుంటారు అనేది ప్రతీతి. అందుకు గతంలో యాక్టివ్ జర్నలిజంలో వున్నప్పుడు నేను కూడా ఒక సాక్షిని. ఎన్టీఆర్ నాయకత్వాన్ని కాదని తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టే చారిత్రాత్మక నిర్ణయం తీసుకునే విషయంలో చంద్రబాబు ఎంతగా తటపటాయించారో ఆనాటి జర్నలిస్టులకు బాగా తెలుసు. అలాగే వాజ్ పాయ్ కాలంలో బీజేపీతో జత కట్టే విషయంలో కూడా అనేక చర్చోపచర్చలు జరిగిన తర్వాతనే ఒక నిర్ణయానికి వచ్చిన సంగతి కూడా తెలుసు. ఇక లోకేష్ రాజకీయ రంగప్రవేశం సందర్భంలో జరిగిన తర్జనభర్జనలు ఇన్నీఅన్నీ కావు. అలాగే 2018లో మోడీతో విబేధించి బీజేపీకి రాం రాం చెప్పిన సందర్భంలో కూడా ఆయన ఇదే విధంగా వ్యవహరించారు. ఈ నిర్ణయాన్ని, మరీ ముఖ్యంగా టీడీపీకి ఆగర్భ రాజకీయ శత్రువు అయిన కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలనే పార్టీ నిర్ణయాన్ని తమ పార్టీలోనే చాలామంది స్వాగతించడం లేదు అనే సమాచారం క్షుణ్ణంగా తెలిసికూడా ఆయన ముందుకు వెళ్ళారని చెప్పుకుంటారు.
రాజకీయ నాయకులకు ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. అలాగే చంద్రబాబుది కూడా విభిన్నమైన బాణీ.
తను నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తనది కాదు, మొత్తం పార్టీది అనే అభిప్రాయం వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటారు. పార్టీలో అన్ని నిర్ణయాలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయి అనే సానుకూల సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా ఈ రకమైన చర్చల ప్రక్రియ ఉపయోగపడ్డ మాట కూడా వాస్తవమే.
సరే! ప్రస్తుతానికి వస్తే, పరిషత్ ఎన్నికల విషయంలో టీడీపీ తీసుకున్న నిర్ణయం ముందు ముందు ప్రభావితం చేయబోయే రాజకీయ అంశాల మీద ఈనాడు విస్తృతంగా అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సామాన్య జనంలో చర్చలు సాగుతున్నాయి. ఇదేమంత కొత్త విషయం కాదని వాదించేవారు గతంలో జరిగిన బహిష్కరణలను ప్రస్తావిస్తున్నారు. పొరుగు రాష్ట్రం తమిళనాడులో జయలలిత అసెంబ్లీ ఉప ఎన్నికలను బహిష్కరించిన అంశాన్ని ఉదహరిస్తున్నారు. అయితే ఇక్కడ స్థూలమైన తేడా ఒకటి వుంది.
ఇక తమిళనాడులో పరిస్థితి పూర్తిగా భిన్నం. అక్కడ ఎన్ని పార్టీలు వున్నా కూడా ప్రధానమైన పోటీ రెండు పార్టీల నడుమనే. ఒకరు పోటీ నుంచి తప్పుకున్నంత మాత్రాన ఆ పార్టీ ఓట్లు ప్రత్యర్థి పార్టీకి, లేదా వేరే పార్టీలకూ మళ్లిపోయే అవకాశం అక్కడ బొత్తిగా లేదు.
టీడీపీ పరిస్థితి అల్లా కాదు. నలభయ్ ఏళ్ళుగా తెలుగు రాష్ట్రాలలో పాతుకుపోయిన పార్టీ. లీడర్లు, కేడర్లు కింది స్థాయి నుంచి కలిగిన రాజకీయ పార్టీ, ఆ లీడర్లకు, కేడర్లకు గుర్తింపు వచ్చేది, ఉనికి చాటుకునేది ఎన్నికల సమయంలోనే. పైగా నామినేషన్ల పర్వం కూడా పూర్తయిన తర్వాత బహిష్కరణ నిర్ణయం తీసుకుంటే మరి ఎన్నికల బరిలో ఉన్న తమవారి పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న ఎదురుగా నిలబడి వుంది. బ్యాలెట్ పత్రంలో పేరు, పార్టీ గుర్తు వుండి కూడా ప్రచారం చేసుకోలోని దుస్థితి. ఇదే విషయాన్ని టీడీపీ అగ్రనాయకులు అశోక గజపతి రాజు మరికొందరు లేవనెత్తారు కూడా.
ఈ నేపధ్యంలో ఎన్నికలు జరిగితే టీడీపీ సాంప్రదాయక ఓటర్ల పరిస్థితి ఏమిటి? అలాగే కింది స్థాయిలో పార్టీ పేరు చెప్పుకుని ఉనికిని కాపాడుకుంటున్న కార్యకర్తల సంగతి ఏమిటి? వాళ్ళు ఎవరికి ఓటు వేయాలి? ఒకసారి ఓట్లు అలా చీలిపోతే వాటిని తిరిగి రాబట్టుకోవడం ఎంత కష్టం?
ఈ సందర్భంలో అనేక ఏళ్ళ క్రితం ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు మాటల సందర్భంలో చెప్పిన విషయం జ్ఞాపకం వస్తోంది.
‘మీ పార్టీకి బలం లేదని తెలిసి కూడా ఎందుకు బరిలో దిగుతారు?’ అనే ప్రశ్నకు ఆయన జవాబు.
‘గెలవడం గెలవక పోవడం మాకు ముఖ్యం కాదు. పార్టీ కేడర్ లో విశ్వాసం నింపడం ప్రధానం. ఒకసారి పొత్తుల్లో సీటు వదులుకుంటే ఇక ఆసీటు మీద పూర్తిగా ఆశలు వదులుకోవాల్సి వుంటుంది. ప్రతి రాజకీయ పార్టీకి ఈ కఠిన వాస్తవం తెలుసు’
మరి టీడీపీ ఏం చేయాలి?
‘నిర్ణయం ఉపసంహరించుకోలేని పక్షంలో ఇతర పార్టీలకు కాకుండా ‘NOTA’ కు ఓటు వేయమని తమ కేడర్ కు చెప్పాలి.
(03-04-2021)
రాయని కధ – భండారు శ్రీనివాసరావు
ఎన్నాళ్ళ బట్టో ఒక కధ రాయాలని కోరిక. సిరా పెన్నులూ, కాగితాల రాతల కాలం చెల్లిపోయింది కానీ ఆ కధ ఇంకా ఒక రూపానికి రాలేదు. క్లుప్తంగా ఆ కధ ఏమిటంటే -
ఒక పనిమనిషి దారంటపోతూ పోతూ ఒక రూపాయి
కాసుని నిర్లక్ష్యంగా రొంటిన దోపుకుపోవడం ఒక బిక్షగాడు చూస్తాడు. ఆ ఒక్క రూపాయి
వుంటే తనకీ పూట తిండి సమస్య వుండదు కదా అని నిట్టూరుస్తాడు. పనిమనిషి ఆలోచనలు
వేరు. వున్న ఒక్క రూపాయి ఏ మూలకూ చాలదు. మరో తొమ్మిది అర్జంటుగా కావాలి.
పిల్లాడికి స్కూల్లో పది రూపాయలు ఫీజు కట్టడానికి ఆఖరి గడువు కూడా అయిపోయింది.
రేపటిలోగా కట్టకపోతే పేరు కొట్టేస్తామని పంతులయ్య చెప్పాడు కూడా. యజమానురాలి
ఇంటికి వెళ్లేసరికి ఆవిడ ఓ పది నోటు గూట్లో విసరడం చూస్తుంది. 'నిన్ననగా చెప్పాను ఈ మనిషికి ఏం లాభం, వంద
ఉంటేగాని టైలర్ దగ్గర వున్న జాకెట్లు ఇంటికి రావు. వున్న ఈ పదీ ఎందుకూ పనికి రావు' ఆవిడ గొణుగుడు ఏనాడూ వినే అవకాశం బొత్తిగా లేని ఆమె మొగుడు ఓ గుమాస్తా
రావు. పద్దులు రాస్తేకానీ పొట్టా గడవదు. పొద్దూ పొడవదు. దుకాణం షావుకారుకు ఒక వంద
ఇవ్వడం ఒక లెక్క కాదు. కానీ 'విసిరి పారేసేది కూడా లెక్కించి
పారేయాల'నే తత్వం ఆయనది. అయితే ఆయన గోల వేరే. సాయంత్రానికల్లా పది వేలు జమ చేయాలి. సరుకులు సప్లయి చేసేవాడి దగ్గర బాకీ కొండలా పెరిగిపోతోంది.
పది వేలు ఆయనకీ పెద్ద విషయమేమీ కాదు. కానీ ఆ ఏజెంటు అవసరం వేరే. గంటలో లక్ష కావాలి. 'ఎవడిస్తాడా ఎవడ్ని పట్టాలా' అని
రాత్రంతా ఆలోచిస్తూనే వున్నాడు. వందకు పది మిత్తి (వడ్డీ) తీసుకుని అప్పులు
ఇచ్చేవాడి దగ్గరికి వెళ్ళాడు.
ఆ సమయంలో ఆయన ఇనప్పెట్టె తెరిచి ఆలోచిస్తున్నాడు. దాంట్లో కట్టల పాములు పుట్టలు
పెట్టినట్టు అన్నీ పెద్ద నోట్ల కట్టలే. కోటికి తక్కువ వుండవు. వడ్డీ వ్యాపారి
నిలువు గుడ్లేసుకుని ఆ నోట్ల వంక చూస్తున్నాడు. ఎన్ని సార్లు లెక్కపెట్టినా అందులో
రెండు కోట్లే లెక్క తేలుతున్నాయి. తన అవసరమా పదికోట్లు. ఎలా ఎలా ? ఇలా ఇలా సాగిపోతుంది, ఆ కధ.
2, ఏప్రిల్ 2021, శుక్రవారం
నేను సైతం - భండారు శ్రీనివాసరావు
‘ఎప్పుడూ ఆ కంప్యూటర్ ముందు కూర్చుని టిక్కు టిక్కుమంటూ టైప్ చేస్తుంటారు, గూడలు అరిగిపోయేలా?’ (ఏమిటి ఉపయోగం? కూటికా! గుడ్డకా! సినిమాకా!) అనేది నా భార్య బతికున్న రోజుల్లో. బ్రాకెట్లో రాసినవి నా సొంత కపిత్వం.
ఆహా ఓహో అని ఎలా అనుకోవాలి? – భండారు శ్రీనివాసరావు
ఎప్పుడో యాభయ్ ఏళ్ళ క్రితం నండూరి వారు, పురాణం వారు ఆంధ్రజ్యోతి దిన, వార పత్రికల్లో రాయించిన సినిమా రివ్యూలు తప్పిస్తే తరువాత ఎప్పుడూ వాటి జోలికి పోలేదు.
ఈ మధ్య కరోనా కాలంలో కాలక్షేపం కోసం పిల్లలు
పెట్టించిన (ఓటీటీ ప్లాట్ ఫారం) ఛానల్స్ లో సినిమాలు చూస్తున్నాను. మొదట్లో కొత్తవాళ్లు
తీసిన, కొత్తవాళ్లు
వేసిన కొంగొత్త సినిమాలు ఒకింత ఊరట, ఉల్లాసం కలిగించిన మాట నిజమే. కానీ తరువాత తరువాత ఈ
సినిమాల్లో కొత్తదనం పూర్తిగా లోపిస్తోంది, ఒక్క ఫోటోగ్రఫీ మినహాయిస్తే. ఈ
కొత్త నటులు కూడా పాత పద్దతుల్లోనే పోతున్నారు. హీరో ఇంట్రడక్షన్ సీన్లు అవసరమా
అనిపించేంత వెగటు కలిగిస్తున్నాయి. కధానాయకుడి (అతడి మొహం ఇంతకుముందు ఎప్పుడూ
చూసిన దాఖలాలేదు) బూటుకాలు నేలను తాకగానే భూనభోంతరాలు దద్దరిల్లేటట్టు
దుమ్ము లేవడాలు, ఒక్క
చేత్తో పాతిక ముప్పయి మందిని చితక్కొట్టడాలు, చెవులు తుప్పు వదిలేలా ధ్వనులు ఇవి
చూస్తుంటే, వింటుంటే ఇక వీటిని చూడడం దండగ
అనిపిస్తోంది. థియేటర్లలో అంటే ఇలాంటి
జిమ్మిక్కులు అవసరం కావచ్చు. కానీ ఇళ్ళల్లో కుటుంబాలతో కూర్చుని చూసేటప్పుడు
ఆహ్లాదకరమైన దృశ్యాలు,
సహజమైన వాతావరణం వుంటే ఆ తీరే వేరు. వెనక
బాపూ రమణలు సినీ రంగ ప్రవేశం చేయడానికి పూర్వం ఆంధ్ర సచిత్ర వారపత్రికలో తెలుగు
సినిమా తీరుతెన్నులు గురించి అనేక కధనాలు సీరియల్ గా రాసేవారు. బెల్లం వ్యాపారంలో
నాలుగు డబ్బులు వెనకేసుకున్నవాళ్ళు సినిమాలు తీయాలనే కోరికతో మద్రాసు వచ్చి నాలుగు రీళ్ళు చుట్టేసి చేతులు కాల్చుకున్న
వైనాలను వైనవైనాలుగా రాసేవారు. ఈ సినిమాలు చూస్తుంటే ఆ రోజులు గుర్తొస్తున్నాయి.
నేనయితే ఈ సినిమాలను, స్థాలీపులాక న్యాయంగా ఓ పది
నిమిషాలు చూసి కట్టేస్తున్నాను,. బాగుంది అనిపిస్తే మరి కాసేపు చూస్తాను.
వీటి పేర్లు ఎందుకు రాయడం లేదంటే, సోషల్ మీడియాలో
వచ్చే అభిప్రాయాలను బట్టే ఈ సినిమాల ఊపిరి ఆడుతుంది.
వాళ్ళ ఉసురు నాకెందుకు?
1, ఏప్రిల్ 2021, గురువారం
రజనీకాంత్ కి ఫాల్కే అవార్డ్
‘రజనీకాంత్ కి ఫాల్కే అవార్డ్ అని స్క్రోలింగ్ వస్తోంది.
అదేమిటి ఆయన స్టేచర్ కి ఎప్పుడో వచ్చి
ఉండాలే. ఇప్పుడేమిటి ఇలా! నిజానికి ఆయనకి ఇవ్వాల్సింది భారతరత్న’
అన్నాడు ఓ మిత్రుడు ఫోన్ చేసి.
సరే ఆయన భాషా
అభిమాని,
కాబట్టి ఆయనకు అర్ధం అయింది అది.
నాకు అర్ధం కాని విషయం ఓటుంది. ఇలా ఫాల్కే
అవార్డుల వంటివి సమయం సందర్భం చూసుకోకుండా
ప్రకటించవచ్చా!
గతంలో ఇలాగే తమిళనాడు ఎన్నికలకు ముందు అప్పటి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్జీ రామచంద్రన్ కు ఏకంగా భారత రత్న ప్రకటించింది కదా!
ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఫాల్కే అవార్డ్ ప్రకటించింది అని సర్దిపుచ్చుకుంటే పోలా!
కానీ ఈ ట్రిక్కులు ఓట్లు రాల్చవని కాంగ్రెస్ కు
అప్పుడు బోధ పడిన సంగతి ఇప్పటి పాలకులకు గుర్తు లేదేమో!
ఏదిఏమైనా ఒక మంచి నటుడికి ఒక మంచి అవార్డ్ ఇవ్వడం
సంతోషించదగ్గ విషయం.
ఇచ్చిన ప్రభుత్వానికి,
పుచ్చుకునే భాషాకు అభినందనలు.
(01-04-2021)