25, మార్చి 2021, గురువారం

‘మృత్యుక్రిమి’ కరోనాకు ఏడాది – భండారు శ్రీనివాసరావు

 

సమస్త మానవాళినీ కలవరపరుస్తున్నది కరోనా అనే మూడక్షరాల పదం. ఏడాది గడిచిన తర్వాత తగ్గుముఖం పడుతోంది, వాక్సిన్  కూడా అందుబాటులోకి వచ్చిందని సంబరపడుతున్న సందర్భంలో మరోసారి ఈ వ్యాధి  కోరలుసాచి విస్తరించబోతోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.

సాధారణంగా, ఈగలు, దోమలు, లేదా ఇతర క్రిమికీటకాల ద్వారా అంటువ్యాధులు వ్యాపిస్తాయి. ఈ కరోనా అనే మాయరోగం మాత్రం మనుషుల నుంచి మనుషులకు పాకుతుంది. ఈ విలక్షణ తత్వమే ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధిపట్ల ప్రజల భయాందోళనలు ఒక స్థాయికి మించి ప్రబలడానికి కారణమయింది.

పనిచేసే ప్రభుత్వం కావాలని అందరం కోరుకుంటాం. అయితే ప్రభుత్వం నిశ్శబ్దంగా పనిచేస్తోంద’ని ఎవరైనా అంటే ఓ పట్టాన నమ్మం. ఇది మానవ మనస్తత్వం.

ఈ వ్యాధి మహమ్మారిలా చుట్టుముడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది’ అనేది ఇలాంటి సందర్భాలలో సాధారణంగా వినబడే మాట.

ఈ మాటలు అనేవాళ్ళు ముందు అర్ధం చేసుకోవాల్సింది ఒక్కటే. ఎవరూ ఈ వ్యాధి రావాలని కోరుకోలేదు. ఎక్కడో చైనాలో పుట్టి చుట్టుపక్కల దేశాలకు పాకి, రోజుల వ్యవధిలోనే ప్రపంచమంతటా విస్తరించింది. ప్రభుత్వాల అలసత్వం వల్లనో, నిర్లక్ష్యం వల్లనో ఈ కరోనా వ్యాధి మనదేశంలో పురుడు పోసుకోలేదు. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారానే ఈ వ్యాధి మన దేశంలో కాలుమోపింది.

ఈ కరోనా అనేది సరికొత్త అంటు వ్యాధి. దీనిని గురించి ఎవరికీ తెలియదు. ఎలా వస్తుందో తెలియదు. ఎలా పోతుందో తెలవదు. విరుగుడు ఏమిటో అసలే తెలియదు. కలరా మొదలైన అంటు వ్యాధులకు రోగ నిరోధక టీకాలు వున్నాయి. కొత్తగా పుట్టుకొచ్చిన ఈ కరోనా వ్యాధిని అరికట్టడానికి ఆ అవకాశమూ లేదు. (ఏడాది క్రితం వరకు)

ఇతరేతర వ్యాధులు ప్రబలినప్పుడు ఆ వ్యాధి పీడితులకు బాసటగా వారి బంధుమిత్రులు వుంటారు. చికిత్సచేయడానికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు అనేకం అందుబాటులో వుంటాయి. ఇవ్వడానికి వాక్సిన్లు, వాడడానికి మందులు వుంటాయి. కానీ కరోనా విషయం పూర్తిగా విభిన్నం. ఈ వ్యాధి సోకిన లేదా సోకినట్టు అనుమానం ఉన్న రోగిని బాహ్యప్రపంచంతో సంబంధం లేకుండా, కుటుంబ సభ్యులను కూడా ముట్టుకోనివ్వకుండా వారిని ఐసొలేషన్ గదుల్లో ఉంచాలి. చికిత్స పెద్ద ఖరీదైనది కాకపోవచ్చుకానీ ఇన్ని రకాల ఏర్పాట్లు చేయడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. మొదటి రెండు దశల్లో వ్యాధిని గుర్తించి చికిత్స చేయగలిగితే ప్రాణహానికి ఆస్కారం వుండదు. కానీ మూడో దశకు చేరుకుంటే ఇక ఆ రోగిని కాపాడడం కష్టం అంటున్నారు వైద్యులు.

మిగిలిన వ్యాధులు వ్యాపించినప్పుడు బాహ్య ప్రపంచం అంతా మామూలుగానే వుంటుంది. ఆఫీసులు పనిచేస్తాయి. దుకాణాలు, మార్కెట్లు తెరుస్తారు. రైళ్ళు, బస్సులు, కార్లు విమానాలతో సహా అన్నీ మామూలుగా రాకపోకలు సాగిస్తాయి. ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం అతి స్వల్పంగా వుంటుంది. అదే కరోనా విషయం తీసుకుంటే పరిస్తితి వేరు. మనిషి నుంచి మనిషికి ఈ వ్యాధి సోకే ప్రమాదం కారణంగా ఈ వైరస్ అతి త్వరితంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. అంచేత ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే స్వచ్చంద స్వీయ గృహ నిర్బంధం మినహా మరో దారి లేదు.

అందుకే, ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోయే పెను ముప్పు ఓ పక్క పొంచి ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు సాహసం చేసి లాక్ డౌన్  ప్రకటించాయి. ప్రజలు గుంపులుగా తిరుగుతూ, వారికి తెలియకుండానే ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధిని సంక్రమింప చేసే ప్రమాదం ఉన్నందున, కర్ఫ్యూ వంటి తీవ్రమైన చర్యలను అమలు చేయాల్సిన పరిస్తితి కూడా దాపురించింది. మరో ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ఈ రోగం శరీరంలో ప్రవేశించిన రెండు వారాల వరకు ఆ విషయం గుర్తించడం సాధ్యం కాదు. ఇప్పటివరకు బయటకు వచ్చిన సమాచారాన్ని బట్టి విదేశాల నుంచి వచ్చిన వారివల్లనే ఈ వ్యాధి వ్యాపిస్తోందని తెలుస్తోంది. విదేశాల్లో బయలు దేరినప్పుడు వ్యాధి సోకినా ఆ విషయం వారికి తెలియదు. స్వదేశం చేరిన తర్వాత అలాంటివాళ్ళు ఎంతో మందిని కలిసి వుంటారు. అలాంటివారినందరినీ ఇప్పుడు వెతికి పట్టుకుని పరీక్షలు చేయాల్సిన బృహత్తర కార్యక్రమం ప్రభుత్వ భుజస్కంధాలపై పడింది. ఇది సాధారణ విషయం కాదు. సముద్రపు ఒడ్డున ఇసుకలో పడిపోయిన సూదిని వెతకడం వంటిది. అయినా ప్రభుత్వం వెనుకాడడం లేదు.

ఈ సందర్భంలో కొన్ని పాత సంగతులు ప్రస్తావించుకోవాలి.

వ్యాధి ప్రబలంగా ఉన్న తొలి రోజుల్లో శాంతా బయోటిక్ వ్యవస్థాపకులు శ్రీ వరప్రసాదరెడ్డి ఒక టీవీ ఇంటర్వ్యూ లో చెప్పారు. వారి అమ్మాయి ఆ మధ్య కేరళ రాష్ట్రము నుంచి హైదరాబాదు వచ్చారు. తర్వాత ఒక వైద్య బృందం వారి ఇంటికి వెళ్లి ఆవిడ ఆరోగ్యం గురించి విచారించి తగిన పరీక్షలు చేసి, కరోనా వ్యాధి లక్షణాలు లేవని నిర్ధారించుకు వెళ్ళారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ జాగ్రత్తలు చూసి ఆయన ఆశ్చర్యపోయారట. అలాగే హైదరాబాదు నగరంలోని హఫీజ్ పేటలో వున్న ఒక కాలనీకి అధికారుల బృందం వెళ్ళింది. పలానా పేరు కలిగిన వ్యక్తులు పలానా రోజున పలానా దేశం నుంచి వచ్చి మీ కాలనీలో వుంటున్నారు, వారికి తక్షణం పరీక్షలు చేయాలని కాలనీ అధ్యక్ష, కార్యదర్శులను అడిగితే వాళ్ళు నివ్వెర పోయారట. విదేశాలనుంచి ఎవరు వచ్చారో అప్పటిదాకా వారికే తెలియదు. వెళ్లి చూస్తే అది నిజమని తేలింది. వెంటనే ఆ వ్యక్తులకు పరీక్షలు చేసి వారిని స్వీయ గృహనిర్బంధంలో వుండాలని చెప్పారట. అప్పటి నుంచి ప్రతిరోజూ ఫోనులో వారిని సంప్రదించి వారి ఆరోగ్య పరిస్తితి గురించి వాకబు చేస్తున్నారట. ఏదో మొక్కుబడిగా కాకుండా ప్రతిరోజూ అలా కనుక్కుంటూ వుండడం చూసి విదేశాలనుంచి వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారట.

వివిధ దేశాలనుంచి వేలమంది హైదరాబాదు వచ్చి వుంటారు. అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం వుండడం ఒక కారణం కావచ్చు. అలా వచ్చిన వాళ్ళు కార్లలోనో, బస్సుల్లోనో, రైళ్ళలోనో తమ గమ్యస్థానాలకు వెళ్లి వుంటారు. ఈ క్రమంలో వారిలో ఎవరికయినా ఈ వ్యాధి సోకి వుంటే అది ఇతరులకు అంటుకునే ప్రమాదం వుంది. కానీ ఆ ‘ఇతరులు’ ఎవరని గాలింఛి కనిపెట్టడం సామాన్యమైన విషయం కాదు. నగరాలూ, పట్టణాలు, గ్రామాలు ఇలా అన్నిచోట్లా ప్రభుత్వ యంత్రాంగం అలా వచ్చిన వారికోసం జల్లెడ పట్టి గాలిస్తోంది.

కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తోంది అని మెటికలు విరిచేవాళ్ళు ఈ విషయాలను గమనంలో వుంచుకోవాలి. సమస్త ప్రజానీకం సహకరించినప్పుడే    వ్యాధికి  ముకుతాడు  వేయడం సాధ్యం అవుతుంది. అదే ప్రభుత్వాలు చెబుతున్నాయి.

అనవసరంగా రోడ్లమీద తిరగ వద్దంటున్నారు. ఇంటిపట్టునే వుండమంటున్నారు. బయటకు వెళ్ళినప్పుడు  మాస్క్  దరించమంటున్నారు. సామాజిక దూరం పాటిస్తూ నిత్య వ్యవహారాలు సాగించమంటున్నారు. ఇవన్నీ అసాధ్యం అయిన పనులు కావు. సులభంగా పెద్ద ఖర్చు లేకుండా చేసేవే.

  మంచి మాటలు వినడం మనందరి ధర్మం! ఎందుకంటే ఈ మహమ్మారిని అరికట్టగలిగిన సులువు మన చేతుల్లోనే వుంది. మన చేతల్లోనే వుంది.

 ప్రజలు, ప్రభుత్వాలు  కళ్ళల్లో వత్తులు  వేసుకుని ఎదురు చూసిన వాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. మొదటి డోసు వేసుకున్నవారి సంఖ్య గణనీయంగానే వుంది. సమస్త ప్రజానీకానికీ  వాక్సిన్ వేయాలి అంటే కొంత వ్యవధానం పడుతుంది. ఈలోగా వాక్సిన్ వేయించుకున్నవాళ్ళు, వేయించుకోని వాళ్ళు మునుపటి మాదిరిగానే జాగ్రత్తలు పాటించాలి.

లాక్ డౌన్ సడలించగానే ఏమి జరిగిందో అందరికీ తెలుసు.

(25-03-2021)

24, మార్చి 2021, బుధవారం

ఇత్తడి గిన్నె కానుకగా పంపిన కంచి స్వామి

 ఇది ఇప్పటిమాట కాదు. యాభైఏళ్ళ పైమాటే.

మద్రాసు జనరల్ ఆసుపత్రి బీటు చూసే ఒక విలేకరికి ఒక రోజు స్కూటర్ ప్రమాదంలో గాయపడి మరణించిన వ్యక్తి శవం కనిపించింది.

పక్కనే ఎవరికోసమో ఎదురుచూస్తున్న లక్ష్మి అనే అమ్మాయి (పేరు తరువాత తెలిసింది) అతడికి తారసపడింది. ఆమె ఒకనిర్మాణ కూలీ. స్కూటరు పై వెడుతున్న ఓఇద్దర్ని అటుగాపోయే వాహనం కొట్టేసి ఆగకుండా అందరూ చూస్తుండగానే వెళ్ళిపోయింది. కిందపడి గిలగిలాకొట్టుకుంటున్నవారిని అందరితోపాటు ఈమెకూడా చూసింది. అందరూ వింతచూసేవారే కాని ఒక్కరూ కలగచేసుకోలేదు. ఈమే పరిగెట్టుకు వెళ్లి వాళ్ళను లేవదీయాలని ప్రయత్నించింది. ఓటాక్సీని ఆపింది. అప్పటికే ముగ్గురునలుగురు ఆపకుండాపోయారు. మరి కిరాయి ఎవరిస్తారని టాక్సీవాడు అడిగాడు. డబ్బులేదు. ముక్కుపుడక చూపించింది. టాక్సీలో ఇద్దరినీ జనరల్ హాస్పటల్ కి తీసుకువెళ్ళింది. అయిన ఆలస్యంవల్ల ఆ ఇద్దరిలో ఒకడు అప్పటికే చనిపోయాడు. ఈస్తితిలో విషయం తెలుసుకున్న విలేకరి హృదయం ద్రవించింది.

నిరక్షురాస్యురాలయిన ఓకూలీ వనిత తన రోజుకూలీ కూడా వొదులుకుని, ముక్కుపుడక టాక్సీవాడికి ఇచ్చి హాస్పటల్ కు చేర్చిన వైనాన్ని ఆ విలేకరి మరునాడు తన పేపర్లో రాసాడు. ‘క్వాలిటీ ఆఫ్ మెర్సీ ‘అనే శీర్షికతో రాసిన ఆవార్త నగరంలో చర్చనీయాంశం అయింది. పోలీసు కమీషనర్ లక్ష్మి కి పాతికరూపాయల నగదు బహుమతి ప్రకటించారు. ఆమె రోజుకూలీ రూపాయన్నరతో పోల్చుకుంటే ఆరోజుల్లో అది పెద్దమొత్తమే. పత్రికా పాఠకులనుంచి కూడా మంచిస్పందన వచ్చింది. అనేకమంది ఆమెకు కానుకలు పంపారు. మధురై నుంచి వెంకటేశ్వరన్ అనేవ్యక్తి ఒక పార్సెల్ పంపాడు.. గాయపడ్డవారి రక్తంతో తడిసిన ఆమె చీరెకు బదులుగా ఒకకొత్త చీరెను కానుకగా పంపించాడు. పాఠకులనుంచి దాదాపు వెయ్యిరూపాయల సాయం అందింది. వంద రూపాయలుమించి వస్తే ఒక ఇత్తడి గిన్నె కొనుక్కుంటానని ఆయువతి తరువాత అదే విలేకరికి ఇచ్చిన ఇంటర్వ్యూ చదివిన కంచికామకోటిపీఠాధిపతి, పరమాచార్య ఒక ఇత్తడిగిన్నెను కానుకగా పంపించారు.

ఇంతకీఅసలువిషయంఏమిటంటే -

ఆవార్త రాసిన పేపరు హిందూ. ఆవార్త రాసింది అందులో కొత్తగా విలేకరిగా చేరిన ఆర్.జే. రాజేంద్రప్రసాద్.

తదనంతర కాలంలో ప్రసాద్ గారు హిందూ హైదరాబాదు ఎడిషన్ రెసిడెంటు ఎడిటర్ గా పనిచేసారు కూడా.

16-04-2013

 

రోజూ చచ్చి బతికే జర్నలిస్టు – భండారు శ్రీనివాసరావు

 ప్రకాశశాస్త్రి గారు పూర్వకాలపు జర్నలిస్టు. మరీ అంత పాతకాలపు మనిషేమీ కాదు. 1975లో హైదరాబాదు ఆలిండియా రేడియోలో చేరిన తర్వాత వారిని ప్రతిరోజూ సచివాలయం ప్రెస్ రూములో కలిసేవాడిని. భేషజాలు అరమరికలు లేకుండా అందరితో కలిసిపోయే తత్వం.

ఆయన ఆంధ్రప్రభలో పనిచేస్తున్నప్పుడు కాబోలు, జూనియర్ రిపోర్టర్ ఎవరైనా కలవగానే, ‘ఏరా అబ్బాయి ఏవిటి విశేషాలు’ అని చాలా ఆప్యాయంగా పలకరించేవారని ఆకాలంలో ఆయనతో పనిచేసి ఇప్పుడు మీడియాలో సీనియర్లుగా ఉన్న చాలామంది గుర్తు చేసుకుంటూ వుంటారు.
తను ఆరోజు రాసిన వార్త మరునాడు పత్రికలో పడగానే అది చూపిస్తూ, ‘అరె అబ్బాయి, ఈరోజుతో మనం చచ్చినట్టే లెక్క. మళ్ళీ మనం రాసిన వార్త రేపు వస్తే అప్పుడు మనం బతికున్నవాళ్ళలో జమ. వార్తలు రాస్తుంటేనే జనాలు మనం బతికున్నట్టు అనుకుంటారు. ఏరోజు రాయకపోతే ఆరోజు అంతే సంగతులు. ఇదేరా మన జీవితం’ అని సరదాగా చెబుతుండేవారట.
అన్నట్టు టీవీ 9 అనగానే గుర్తొచ్చే పేరు మురళి. ఈ మురళి ఎవరో కాదు ఈ ప్రకాశశాస్త్రి గారి కుమారుడే.

23, మార్చి 2021, మంగళవారం

Die empty

 ‘మీ వూరి గురించి, మీ చిన్నతనంలో జ్ఞాపకాలు గురించి బాగా రాసారు  శ్రీనివాసరావు గారూ అన్నారు ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పి.ఎస్. గోపాలకృష్ణ గారు.

‘ఏమోనండీ! ఒక్కోసారి భయం వేస్తుంది ఇలా రాస్తూ పోతుంటే. దేంట్లోకైనా దించుతుందేమో అని. ఈ వయసులో కొత్త జబ్బులు కష్టం కదా!’

అందామని అనుకున్నా. కానీ పైకి అనలేదు. కానీ ఆయన సామాన్యుడు కాదుకదా! మనసులో మాట దొరకపుచ్చుకునే రకం.

అందుకని ఆయన తనదైన శైలిలో నా అనుమానం తీర్చారు ఒక కధ చెప్పి.

అదే “Die Empty”.

పెద్ద నీతితో కూడిన ఈ  చిన్నపుస్తకాన్ని  టాడ్ హెన్రీ (Todd Henry) రాశారు.

ఈ పుస్తకం రాయడానికి ఓ ప్రేరణ వుంది.

టాడ్ హెన్రీ ఒక వ్యాపారపరమైన సమావేశంలో పాల్గొంటున్నప్పుడు వాళ్ళ డైరెక్టర్ ఒక ప్రశ్నవేస్తాడు.

‘ఈ ప్రపంచం మొత్తంలో అత్యంత ఖరీదైన భూమి ఎక్కడ వుంది?’ అనేది ఆ ప్రశ్న.

‘గల్ఫ్ దేశాలు అని ఒకరు, వజ్రాల గనులు ఉన్న ఆఫ్రికా’ అని మరొకరు ఇలా జవాబులు చెబుతారు.

అప్పుడా డైరెక్టర్ అందర్నీ ఆశ్చర్యచకితులను చేసే సమాధానం చెబుతాడు.

‘ఈ లోకంలో అతి ఖరీదైన స్థలం స్మశానం’ 

‘ఎందుకంటే...

 అంటూ ఆయనే వివరణ ఇస్తాడు.

‘ఈ ప్రపంచంలో అనాదిగా కోటానుకోట్లమంది పుట్టారు, మరణించారు. ఇంకా పుడుతూనే వున్నారు, ఇంకా చనిపోతూనే వున్నారు. పుట్టిన వారిలో చాలా కొద్దిమంది మాత్రమే తమలోని తెలివితేటలను ప్రపంచానికి పంచారు. కానీ అధికసంఖ్యాకులు మాత్రం తమలో నిగూఢ౦గా వున్న మేధస్సును, అనేక ఆలోచనలను, అద్భుతమైన ఐడియాలను తమలోనే దాచుకుని ఈ లోకాన్ని దాటిపోయారు. అవేవీ వెలుగు చూడలేదు. వాటివల్ల ఈ ప్రపంచానికి దక్కాల్సిన ప్రయోజనమూ దక్కకుండా పోయింది. అవన్నీ సమాధుల్లోనే నిక్షిప్తం అయిపోయాయి. అంతటి విలువైన సంపదను దాచుకున్న స్మశానం కంటే విలువైన భూమి ఇంకెక్కడ వుంటుంది చెప్పండి

డైరెక్టర్ చెప్పిన మాటలు టాడ్ హెన్రీ మనస్సులో గట్టిగా నాటుకుని పోయాయి.

ఆ ప్రేరణతోనే  టాడ్ హెన్రీ "Die empty” అనే  పుస్తకం రాసి అద్భుతమైన రచయితగా పేరు పొందాడు.

ఆయన ఈ పుస్తకంలో అంటాడు ఇలా ఒకచోట.

‘మీరు మీలోని సృజనాత్మకతను మీలోనే దాచుకుని సమాధుల్లో శాశ్వతంగా నిద్రించడానికి వెళ్ళకండి. అవేవో ఈ ప్రపంచానికి పంచేసి వెళ్ళండి  

నిజానికి  టాడ్ హెన్రీ చెప్పదలచుకున్నది ఏమిటంటే:

‘మీలోని మంచిని మీరు ఈ లోకాన్ని వీడేలోగా ప్రపంచానికి పంచేసి వెళ్ళండి.  

‘మీ దగ్గర మంచి ఆలోచన వుంటే చనిపోయేలోగా దాన్ని ఆచరణలో పెట్టండి.

‘మీలోని జ్ఞానాన్ని నలుగురికీ పంచండి.

‘మీకేదైనా లక్ష్యం వుంటే చనిపోయేలోగా దాన్ని సాధించండి.

 ‘ప్రేమను పంచండి, మీలోనే  దాచుకుని వృధా చేయకండి’

వున్నది నలుగురికీ పంచడం ఈనాటి నుండే మొదలు పెడదాం. మన మంచితనంలోఉన్న ప్రతి అణువునూ అందరికీ ఇచ్చేద్దాం!

‘అప్పుడు హాయిగా ...ప్రశాంతంగా....

Let us Die Empty

(23-03-2021)

ఆ గాలీ .....ఆ నేలా...... భండారు శ్రీనివాసరావు

 

అరవై అయిదేళ్ళ పైమాటే. అప్పటికి నాకు పదేళ్లు వచ్చాయేమో! ఆనాటి గురుతులన్నీ స్పష్టాస్పష్టంగా మనసులో మెదులుతున్నాయి. మరచిపోతానేమో అన్న సంశయంతో ఈ రాతలకు శ్రీకారం.
మా ఊరు కంభంపాడు. అప్పట్లో చాలా వెనకపడ్డ ప్రాంతం. అయినా అన్నీ ఉండేవి. స్వావలంబన లాంటి మాటలు వాటి అర్ధాలు అప్పట్లో తెలవ్వు. కానీ అన్నీ అమర్చినట్టు ఉండేవి.

మా ఇంటికి దగ్గరలో అంటే నడిచిపోయే దూరంలో చెరువు గట్టు కింద మా మాగాణి పొలాల పక్కన ఓ మెరక మీద మంచి నీళ్ళ బావి. పైగా గిలకల బావి. నాలుగువైపులా గిలకలు ఉండేవి. ఊరి మొత్తానికి అదొక్కటే మంచి నీటి వనరు. మా ఇంట్లో బావిలో నీళ్ళు ఉప్పు నీటి కషాయం. స్నానాలకు, ఇతర అవసరాలకు ఆ నూతి నీళ్ళే వాడేవాళ్ళం. మా అమ్మగారు వెంకట్రావమ్మ, మా చిన్న మేనత్త చిదంబరం తడి మడి చీరెలతో వెళ్లి మంచి నీటి బావి నుంచి బిందెలలో నీళ్ళు తెచ్చేవాళ్ళు.

అప్పుడప్పుడూ వాళ్ళతో నేనూ వెళ్ళే వాడిని. దోవలో వీర బ్రహ్మం ఇల్లు. ఆయన ఉలీ, బాడిసె పట్టుకుని ఎడ్లు లాగే బండ్లు తయారు చేసేవాడు. నేను అక్కడే ఒక మొద్దు మీద కూర్చుని చూస్తూ కూర్చుండేవాడిని. బండి చక్రాలు, వాటికి ఆకులు అలా కొలతలకు తగ్గట్టుగా ఎలా చెక్కేవాడో ఆశ్చర్యం అనిపించేది. ఆయన ఏమీ చదువుకున్నవాడు కాదు. కానీ బండి ఇరుసు ఏ కొలతలతో చెక్కితే బండి బ్యాలెన్సుగా నడుస్తుందో ఆ విధంగా తయారు చేసేవాడు.
ఆ పక్క వీధిలో కమ్మరి కొలిమి. ఆయనకూ చదువు రాదు. కానీ ఇనుమును కొలిమిలో ఎర్రగా కాల్చి రకరకాల సామాగ్రి తయారు చేసేవాడు.

ఒక వీధిలో వస్త్రాల హనుమంతరావు అని నా దోస్తు ఇల్లు వుండేది. ఆడామగా బట్టలు నేసేవాళ్ళు. ఇంటి బయట చేతికి రంగులు పూసుకుని దారాలకు రంగులు అద్దేవాళ్ళు. ఇంట్లో మగ్గం మీద చీరెలు దోతులు నేసేవాళ్ళు.

చిన్ని రాములు కొట్లో మిఠాయి ఉండలు, లౌజు ముక్కలు కూడా అమ్మేవాళ్లు. ఇళ్ళల్లో లాంతర్లు, చిమ్నీ దీపాలకు వాడే కిరసనాయిలు అక్కడే కొనేవాళ్ళం. కిరోసిన్ డబ్బా పైన ఒక మూలలో వున్న రంధ్రంలో గొట్టం లాంటి సాధనం వుంచి పైకీ కిందికీ అంటుంటే డబ్బాలో కిరోసిన్ సీసాల్లో పడేది.

ఆ పక్కనే కుండలు చేసేవారు. కుండలు చేసే విధానం చూస్తుంటే కళ్ళు తిరిగిపోయేవి. ఒక చక్రం మీద మట్టి ముద్ద వుంచి ఆ చక్రాన్ని వేగంగా ఒకసారి తిప్పేవాళ్ళు. చేతి వేళ్ళతో ఆ ముద్దను సుతారంగా తాకుతూ చిత్రవిచిత్రంగా కుండలు తాయారు చేసేవాళ్ళు. ఆ ముద్ద నుంచి కుండల ఆకారాలు వస్తుంటే ఏదో మాయాజాలంగా అనిపించేది.

సాయంత్రం అయ్యేసరికి మా ఇంటికి దగ్గరలో ఉన్న వాడ నుంచి బ్యాండు మేళం వినపడేది. ఆ తర్వాత తెలిసింది వాళ్లకు గిరాకీ లేని రోజుల్లో అలా తీరి కూర్చుని సినిమా పాటలు ప్రాక్టీసు చేస్తుంటారని. అలాగే సన్నాయి మేళం వాయించేవాళ్లు. మా ఇంటికి చుట్టపక్కాలు ఎవరైనా వస్తే వాళ్ళు పెట్రోమాక్స్ లైట్ తెచ్చి పెట్టేవాళ్ళు. ఆ లైటు వెలిగిస్తుంటే పిల్లలం అందరం కళ్ళప్పగించి చూస్తుండే వాళ్ళం. పొడుగాటి వత్తి తగలబడిపోకుండా చిన్న ఆకారంలోకి మారిపోయి తెల్లటి వెలుగులు విరజిమ్మడం నిజంగా ఆశ్చర్యంగా వుండేది. ఆ వత్తి ఎర్రపడి కాంతి తగ్గినప్పుడల్లా గాలి కొట్ట్టేవారు.

మా ఊరు పంచాంగాలకు ప్రసిద్ధి. వాటిని రాసే సిద్ధాంతులు ముగ్గురు వుండేవాళ్ళు. ఒకే ఊరు నుంచి మూడు పంచాంగాలు రావడం గొప్పగా చెప్పుకునే వారు. గొలుసుకట్టు రాతలో, తెలుగు అంకెలతో రాసిన పంచాంగాలను ఆ సిద్ధాంతులు తెనాలి తీసుకువెళ్లి అక్కడ అచ్చు వత్తించేవారు. ఉగాది రావడానికి ముందుగానే చుట్టుపక్కల గ్రామాలకు కాలినడకన వెళ్లి అక్కడి మోతుబరులకు పంచాంగాలు ఇచ్చి ఆశీర్వదించేవాళ్లు. సంభావన రూపంలో వచ్చిన ప్రతిఫలం ఎంత ఇస్తే అంత తీసుకుని తిరిగివచ్చేవారు.

మంచి నీళ్ళ బావికి వెళ్ళే దోవలో ముస్లిం ల కోసం పీర్ల సావిడి వుండేది. పీర్లను ఊళ్ళో ఊరేగించిన తర్వాత మళ్ళీ ఈ సావిడిలో భద్రపరిచేవాళ్ళు.

షెడ్యూల్ కులాలకోసం ఉసిగెవాగు అవతల ఒక కాలనీ వుండేది. అక్కడ ఒక మిషనరీ స్కూలు వుండేది. జంధ్యాల హరి నారాయణ గారు కృష్ణా జిల్లా కలెక్టరుగా వున్నప్పుడు మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు గారు అక్కడ కొత్త కాలనీ నిర్మాణం కోసం సుమారు ఇరవై ఎకరాలు భూమి ఇచ్చారు.

ఊళ్ళో మరో బడి వుండేది. అందులోనే మా చదువు. స్కూలు మొత్తానికి కలిపి ఇద్దరు టీచర్లు, అప్పయ్య మాస్టారు, భద్రయ్య పంతులు గారు. బ్లాకు బోర్డులు లేవు. చుట్టూ ఫ్రేం ఉన్న బొందు పలక, సుద్ద బలపం, అవి పెట్టుకునే గుడ్డ సంచీ వుంటే వాడు అందరి దృష్టిలో స్పెషల్.

అప్పయ్య మాస్టారి తండ్రి శివరాజు నాగభూషణం గారు తెలవారకముందే లేచి స్నాన సంధ్యాదులు ముగించుకుని ఇంటి బయట నిలబడి ఉచ్చైస్వరంతో ఆలపించే కృష్ణ శతకంలోని పద్యాలే ఊరంతటికీ కోడి పిలుపు.

మా ఇంటికి వెనుక రెండు దేవాలయాలు ఒకే ప్రాకారంలో ఉండేవి. పక్కనే కోనేరు వుండేది. కాలక్రమంలో అది పూడిపోయింది. ఆ గుళ్ళకు మేమే వంశ పారంపర్య ధర్మకర్తలం. వాటికి మాన్యాల రూపంలో నలభయ్ ఎకరాల దాకా భూమి వుండేది, కానీ వాటి మీద వచ్చే అయివేజు స్వల్పం. వూళ్ళో వాళ్ళే పూనుకుని పండుగ దినాల్లో ఉత్సవాలు మొదలైన కార్యక్రమాలు నిర్వహించేవారు.

పెనుగంచిప్రోలు తిరుపతమ్మ వారి చిన తిరుణాలకు, అది జరిగినన్ని రోజులూ మా వూరినుంచి రంగు కాగితాలతో అలంకరించిన ప్రబ్భండ్లు (ప్రభలు) మేళతాళాలతో ఇంటికొకటి బయలుదేరేవి.

ఆ రోజుల్లో మా ఊర్లో రెండు రకాల సేద్యపు నీటి వనరులు ఉండేవి. ఒకటి చెరువు, రెండోది మునేటి కాలువ. ఒకప్పుడు ఈ రెంటి కిందా అధిక భాగం భూములు మావే. ఐదో అక్కయ్య భర్తది పొరుగూరు పెనుగంచి ప్రోలు. ఆ బావగారు వచ్చినప్పుడల్లా గుర్రపు సవారీ. రాగానే గుర్రాన్ని మేతకు వదిలేసేవాడు. అది మేసినంత మేరా మామగారు (అంటే మా నాన్నగారు) తాలూకు పొలాలే, ఏం పరవాలేదు అని చెప్పుకునే వారు నా చిన్నతనంలో.

ఇప్పుడు ఇవన్నీ ఏవీ లేవు అని చెప్పను కానీ అప్పటి మాదిరిగా లేవు. కొన్ని అసలే లేవు, జ్ఞాపకాలు తప్ప.

వీరబ్రహ్మం లేడు, ఎడ్ల బళ్ళు తయారుచేసే వాళ్ళు లేరు. ఆ బండ్లే లేవు. ఎడ్లూ లేవు. నాటి మగ్గాలు లేవు, బట్టలు నేసేవాళ్ళు లేరు. చిన్ని రాములు కొట్టు లేదు. షట్టర్లు కలిగిన దుకాణాలు వచ్చాయి. కుండల తయారీ లేదు. స్టీలు సామాను, ఫ్రిజ్ లు గృహప్రవేశం చేసాయి.
స్వయం సమృద్ధి కాకపోయినా స్వయం పోషకంగా వుండే మా ఊరు ఇప్పుడు అన్ని ఊళ్లలో ఒక ఊరు. అంతే!

పాస్ పోర్టులో నేటివ్ ప్లేస్ కాలం పూర్తి చేయడానికి మాత్రం పనికి వస్తోంది.
(23-03-2021)

నాలుకే నా శత్రువు - భండారు శ్రీనివాసరావు

 'మీకు శత్రువులు ఎవ్వరూ లేరా స్వామీ?' అని అడిగాడు ఓ ఆసామీ ఓ స్వామివారిని.

'లేకేం! నా నాలుకే నా శత్రువు' అన్నారా స్వామి.

తరచి చూస్తె అందులో ఎంతో నిజం వుందని అనిపిస్తుంది.

ఆ మధ్య ఎప్పుడో  అనుకోకుండా ఓ స్వామి వారి ప్రవచనం నా చెవిన పడింది.

ఆయన కంఠం కంచుగంట. చెప్పే విషయం ఏదయినా ఓ కధలా వినసొంపుగా వుంటుంది.

భార్యాభర్తల సంబంధాలు, విడాకుల ప్రస్తావన దొర్లింది. స్వాములేమిటి? విడాకుల గొడవేమిటి అనుకునేవాళ్ళకు ఆయన ప్రసంగమే సమాధానం. క్రమంగా  దేశంలో విడాకుల కేసులు  వేగంగా పెరిగిపోతాయని స్వామి ఉవాచ. మరి ఏమిటి మార్గం?

ఉందన్నారు ఆయనే. నాలుకను అదుపులో ఉంచుకోవడం ఒక్కటే శరణ్యం ఆన్నారాయన. సరిగ్గా ఇలాగే కాకపోయినా దాదాపు ఇదే అర్ధం వచ్చేలా చెప్పారు.

'మొగుడొకటి అంటాడు. భార్య ఒకటి అంటుంది. ఆ ఒక్కటే విడాకులదాకా వెడుతోంది. వెనుకటిలా ఈనాటి తరానికి మంచీచెడూ చెప్పీవాళ్ళు ఇళ్ళల్లో వుండడం లేదు. చెప్పినా వినిపించుకునే పరిస్తితి లేదు. చిన్న విషయాలు పెద్దవి అవుతున్నాయి. మునుపటి రోజుల్లో కూడా ఇలా జరక్కపోలేదు. కానీ కుటుంబ సంబంధాలు కట్టి పడేసేవి. ఇప్పుడలా కాదు. అప్పటికప్పుడే వేడి మీద నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకే కాస్త నాలుకను అదుపులో పెట్టుకుంటే ఇలాటి సమస్యలు అన్నీ అదుపులోకి వస్తాయి. లేకపోతే అదుపుతప్పి పోతాయి'

స్వామి వారు చెప్పింది అందరూ విన్నారు. బాగా చెప్పారు అని కూడా అనుకున్నారు. ఆ హితవచనాలను ఇంటిదాకా ఎంతమంది మోసుకెళ్లారన్నది అనుమానమే.

నేనూ దీనికి మినహాయింపు కాదని ఓ చర్చలో కూర్చున్నప్పుడు తెలిసిపోయింది.

నా నాలుకే నా శత్రువు. నిజానికి ఈ శత్రువును జయించాల్సిన పనిలేదు. స్వామి చెప్పినట్టు అదుపులో వుంచుకుంటే చాలు.

కానీ అయ్యే పనా!

 

22, మార్చి 2021, సోమవారం

వంద సమర్పణ

 సన్మాన సభ ముగింపుకు వచ్చింది. అధ్యక్షుల వారు వందన సమర్పణ చేయాల్సిన వ్యక్తిని ఆహ్వానించారు. అతడొక పత్రికలో ప్రూఫ్ రీడర్.

అతడు నీరసంగా వేదిక మీదకు వచ్చి, తన చేతిలో ఉన్న ఆనాటి ఆహ్వాన పత్రికని  సభికులకు చూపుతూ మరింత నీరసంగా ఇలా అన్నాడు.

‘ఈ కార్యక్రమానికి రావడానికే మూడు బస్సులు మారి వచ్చాను. ఈ ఇన్విటేషన్ లో చూస్తే నా పేరు రాసి, ‘పలానా ఆయన వంద సమర్పణ చేస్తారు  అని వుంది. వంద కాదుకదా ఇంటికి పోవడానికి బస్సు చార్జీలు కూడా లేవు

ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పీ.ఎస్. గోపాల కృష్ణ నిన్న ఫోనులో కబుర్లు చెబుతూ రువ్విన జోకు.