23, మార్చి 2021, మంగళవారం
ఆ గాలీ .....ఆ నేలా...... భండారు శ్రీనివాసరావు
నాలుకే నా శత్రువు - భండారు శ్రీనివాసరావు
'మీకు శత్రువులు ఎవ్వరూ లేరా స్వామీ?' అని అడిగాడు ఓ ఆసామీ ఓ స్వామివారిని.
'లేకేం! నా నాలుకే
నా శత్రువు' అన్నారా స్వామి.
తరచి చూస్తె
అందులో ఎంతో నిజం వుందని అనిపిస్తుంది.
ఆ మధ్య
ఎప్పుడో అనుకోకుండా ఓ స్వామి వారి ప్రవచనం
నా చెవిన పడింది.
ఆయన కంఠం కంచుగంట.
చెప్పే విషయం ఏదయినా ఓ కధలా వినసొంపుగా వుంటుంది.
భార్యాభర్తల
సంబంధాలు, విడాకుల ప్రస్తావన దొర్లింది. స్వాములేమిటి? విడాకుల గొడవేమిటి
అనుకునేవాళ్ళకు ఆయన ప్రసంగమే సమాధానం. క్రమంగా
దేశంలో విడాకుల కేసులు వేగంగా పెరిగిపోతాయని
స్వామి ఉవాచ. మరి ఏమిటి మార్గం?
ఉందన్నారు ఆయనే.
నాలుకను అదుపులో ఉంచుకోవడం ఒక్కటే శరణ్యం ఆన్నారాయన. సరిగ్గా ఇలాగే కాకపోయినా
దాదాపు ఇదే అర్ధం వచ్చేలా చెప్పారు.
'మొగుడొకటి అంటాడు.
భార్య ఒకటి అంటుంది. ఆ ఒక్కటే విడాకులదాకా వెడుతోంది. వెనుకటిలా ఈనాటి తరానికి
మంచీచెడూ చెప్పీవాళ్ళు ఇళ్ళల్లో వుండడం లేదు. చెప్పినా వినిపించుకునే పరిస్తితి
లేదు. చిన్న విషయాలు పెద్దవి అవుతున్నాయి.
మునుపటి రోజుల్లో కూడా ఇలా జరక్కపోలేదు. కానీ కుటుంబ సంబంధాలు కట్టి పడేసేవి.
ఇప్పుడలా కాదు. అప్పటికప్పుడే వేడి మీద నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకే కాస్త
నాలుకను అదుపులో పెట్టుకుంటే ఇలాటి సమస్యలు అన్నీ అదుపులోకి వస్తాయి. లేకపోతే
అదుపుతప్పి పోతాయి'
స్వామి వారు చెప్పింది అందరూ విన్నారు. బాగా చెప్పారు అని కూడా అనుకున్నారు. ఆ
హితవచనాలను ఇంటిదాకా ఎంతమంది మోసుకెళ్లారన్నది అనుమానమే.
నేనూ దీనికి
మినహాయింపు కాదని ఓ చర్చలో కూర్చున్నప్పుడు తెలిసిపోయింది.
నా నాలుకే నా
శత్రువు. నిజానికి ఈ శత్రువును జయించాల్సిన పనిలేదు. స్వామి చెప్పినట్టు అదుపులో వుంచుకుంటే
చాలు.
కానీ అయ్యే పనా!
22, మార్చి 2021, సోమవారం
వంద సమర్పణ
సన్మాన సభ ముగింపుకు వచ్చింది. అధ్యక్షుల వారు వందన సమర్పణ చేయాల్సిన వ్యక్తిని ఆహ్వానించారు. అతడొక పత్రికలో ప్రూఫ్ రీడర్.
అతడు నీరసంగా వేదిక మీదకు వచ్చి, తన చేతిలో ఉన్న
ఆనాటి ఆహ్వాన పత్రికని సభికులకు చూపుతూ మరింత
నీరసంగా ఇలా అన్నాడు.
‘ఈ కార్యక్రమానికి రావడానికే మూడు బస్సులు మారి
వచ్చాను. ఈ ఇన్విటేషన్ లో చూస్తే నా పేరు రాసి, ‘పలానా ఆయన వంద సమర్పణ’
చేస్తారు అని వుంది. వంద కాదుకదా ఇంటికి
పోవడానికి బస్సు చార్జీలు కూడా లేవు’
ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పీ.ఎస్. గోపాల
కృష్ణ నిన్న ఫోనులో కబుర్లు చెబుతూ రువ్విన జోకు.
ఇల్లెందుకే నీకు చిలకా! – భండారు శ్రీనివాసరావు
'డెబ్బయ్ అయిదేళ్లు వచ్చాయి. సొంత ఇల్లంటూ వున్నట్టు లేదు. ఇలా ఎన్నాళ్ళు' అని శ్రేయోభిలాషులు తరచూ అడిగే ప్రశ్న.
మరపురాని గతం
చిన్నప్పుడు సెలవుల్లో కంభంపాడు వెళ్లి అమ్మ దగ్గర కొన్నాళ్ళు వుండి మళ్ళీ బెజవాడ బయలుదేరే వాడిని. ఆ రోజు అమ్మ ఎందుకో చాలా దిగులుగా వుండేది. మాటిమాటికీ మళ్ళీ ఎప్పుడు వస్తావురా అని అడుగుతుండేది. నాకూ అమ్మను వదిలి వెళ్ళాలి అంటే బెంగగానే వుండేది. కానీ స్కూలు, చదువులు గుర్తొచ్చి బట్టలు సదురుకునేవాడిని ప్రయాణం కోసం.
దొడ్లో చింతచెట్టు పక్క నుంచి పెనుగంచి ప్రోలు వెళ్ళడానికి ఓ రాళ్ళ దారి వుండేది. వెనక్కి వెనక్కి చూస్తూ ముందుకు నడిచేవాడిని. ముందు వంటింటి గుమ్మంలో నిలబడ్డ అమ్మ మొహం కనిపించేది. కాసేపటి తర్వాత ఆ గుమ్మం మెట్లు దిగివచ్చి చింతచెట్టు కింద నిలబడి వుండేది. వెనక్కి చూసినప్పుడు అమ్మ నా వంకే చూస్తూ కనపడేది. మళ్ళీ ఎప్పుడు చూస్తానురా నిన్ను అన్నట్టు ఉండేవి ఆ చూపులు. తిరిగి వచ్చేదాకా నా మొహాన్ని తన కనురెప్పల నడుమ దాచి వుంచుకోవాలి అన్నట్టు దీక్షగా నా వైపు చూస్తున్నట్టు అనిపించేది.
ఎంతైనా అమ్మ అమ్మే.
(21-03-21)
20, మార్చి 2021, శనివారం
ఇరవై ఏడు రౌండ్లు
ఇదేమీ సాయంత్రం రౌండ్ల లెక్క కాదు.
మళ్ళీ
నలభయ్ ఏళ్ళ నాటి ముచ్చటే
ఆ
రోజుల్లో ఇలాగే పట్టభద్రుల స్థానానికి ఎన్నిక జరిగింది.(అప్పుడు ఒకటే సీటు అని
గుర్తు)
పోలింగు
పూర్తయింది. ఓట్ల లెక్కింపు మొదలయింది.
ఒకటో
రౌండ్, రెండో రౌండ్
(అంటే లెక్కింపులు) ఇలా అక్షరాలా ఇరవై ఏడు
రౌండ్లు పూర్తయిన తరువాత కానీ తుది ఫలితం రాలేదు. నాటి విజేత చివరికి గెలిచింది
అక్షరాలా ఇరవై ఎనిమిది ఓట్ల మెజారిటీతో.
శాసనసభలో పద్యం పాడిన వై.ఎస్.ఆర్. - భండారు శ్రీనివాసరావు
ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా వున్నప్పుడు శాసనసభలో ఏకంగా ఒక పద్యం మొత్తం చదివి వినిపించారు.