4, మార్చి 2021, గురువారం

గౌరవం హోదాకే ప్రతిభకు కాదు

 

చిన్నప్పుడు స్కూళ్ళల్లో మోరల్ క్లాస్ అని ఓ పీరియడ్ వుండేది. వారానికి ఒకటో రెండో తరగతులు.
నీతి కధలు, నీతి పాఠాలు బోధించేవాళ్లు.
ఆ రోజుల్లో విన్న కధ ఒకటి జ్ఞాపకం వుంది. ఓ పేద బ్రాహ్మణుడు. వేదవేదాంగాలు చదివాడు. తగిన గుర్తింపు లేకపోగా మాసిపోయిన దుస్తులతో ఉన్న అతడ్ని ఎవరూ పట్టించుకునే వారు కాదు.
పొరుగూళ్ళో పండిత సత్కారం జరుగుతోందని తెలిసి వెడతాడు. మాసిన దుస్తులతో ఉన్న అతడ్ని లోపలకు పోకుండా అడ్డుకుంటారు.
ఇలా పని కాదనుకుని తెలిసిన వారి ఇంటి నుంచి కొత్త బట్టలు అడిగి తీసుకుని వాటిని ధరించి వెడితే అతడికి ప్రవేశం సులభంగా దొరుకుతుంది. అతడి పాండిత్యానికి అక్కడివారు ముగ్ధులు అవుతారు. భోజనాలు చేసేటప్పుడు అడిగి అడిగి మరీ లడ్డూలు వగైరా వడ్డిస్తుంటారు. అతడు వాటిని చేతిలోకి తీసుకుని తను ధరించిన వస్త్రాలకు తినిపించే ప్రయత్నం చేస్తుంటాడు. అక్కడి వాళ్లకి అతడి ప్రవర్తన విచిత్రంగా అనిపించి అతడినే కారణం అడుగుతారు.
“మీరు నాకిచ్చిన గౌరవం నా పాండిత్యానికి కాదు, నేను ధరించిన ఈ దుస్తులకి. కాబట్టి వాటికి తినిపించే ప్రయత్నం చేస్తున్నాను” అని బదులిస్తాడు. దానితో అందరికీ కళ్ళు తెరిపిళ్ళు పడతాయి.
స్థూలంగా ఇదీ కధ.
నిన్న కోవిడ్ టీకా వేయించుకోవడానికి కారులో వెడుతున్నప్పుడు మా అన్నయ్య భండారు రామచంద్రరావు గారు చెప్పిన కొన్ని విషయాలు విన్నప్పుడు, చిన్నప్పుడు విన్న ఈ నీతి కధ గుర్తుకు వచ్చింది.
మా అన్నయ్య చెన్నై లో స్టేట్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నప్పుడు ఆయనకంటే ముందు అదే హోదాలో అదే బ్యాంకులో పనిచేసిన అధికారి ఒకరు రిటైర్ అయిన తర్వాత చెన్నై వచ్చి, చూసిపోదామని మా అన్నయ్య ఇంటికి వచ్చారట. బ్యాంకు టైం కావడంతో ఆ రిటైర్డ్ అధికారిని కూడా వెంటబెట్టుకుని ఆఫీసుకు తీసుకు వెళ్ళారు. సీజీఎం వస్తున్నారు అని తెలియగానే అక్కడ సెక్యూరిటీ అలర్ట్ అయి లిఫ్ట్ ఆపి, ఆయన్ని రిసీవ్ చేసుకోవడం కోసం కొందరు సిబ్బంది వెయిట్ చేస్తూ వుండడం ఆనవాయితీ. లిఫ్ట్ లో వెడుతున్నప్పుడు తన వెంట వచ్చిన రిటైర్డ్ అధికారిని ఎవరూ గుర్తించక పోవడం మా అన్నగారికి విచిత్రంగాను, బాధగాను అనిపించింది. కొన్నేళ్ళ క్రితం ఇదే ఉద్యోగం ఆయన చేశారు. తనకు జరిగిన మర్యాదలే ఆ రోజుల్లో ఆయనకు జరిగివుంటాయి. ఇప్పుడు ఆయన పదవిలో లేరు. పదవినిబట్టి, హోదాను బట్టి అందుకునే మర్యాదలు చాలా తాత్కాలికం అని మా అన్నగారికి అనిపించిందట.
నిజమే అనిపించింది. (04-03-2021)

కోవిడ్ టీకా తీసుకోవాలంటే ..


1. www.cowin.gov.in లో పేరు నమోదు చేసుకోవచ్చు.
2. కొవిన్‌వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత అందులో Register Yourself అనే బటన్‌ ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేసి మొబైల్‌ నంబరు రాస్తే మన ఫోన్‌కు ఒక ఓటీపీ వస్తుంది.
3. ఆ ఓటీపీని ఎంటర్‌ చేస్తే రిజిస్ట్రేషన్‌ పేజీకి వెళ్తుంది. అక్కడ మీ పేరు, వయసు, పుట్టినతేదీ వంటి వివరాలు ఎంటర్‌ చేయాలి. దీంతో పాటు ఏదో ఒక ధ్రువీకరణ పత్రం (డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డు, ఓటరు కార్డు, ఆధార్‌ కార్డు, పాస్‌పోర్టు తదితర)ఎంచుకుని దాన్ని అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.
4. ఆ తర్వాత మీకు దీర్ఘకాల వ్యాధులు ఉన్నాయో లేదో అని అడుగుంది. 45 నుంచి 60ఏళ్ల లోపు వారైతే వ్యాధిని నిర్ధారించే డాక్టర్‌ సర్టిఫికేట్‌ను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.
5. ఇలా అన్ని వివరాలు నింపిన తర్వాత రిజిస్టర్‌ బటన్‌పైన క్లిక్‌ చేయాలి.
6. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తర్వాత మీ అకౌంట్‌ వివరాలను చూపిస్తుంది. ఆ తర్వాత కుటుంబసభ్యుల వివరాలు కూడా యాడ్‌ చేసుకోవచ్చు.
7. ఒక వ్యక్తి ఒక మొబైల్‌ నంబరు మీద గరిష్ఠంగా ముగ్గురు వ్యక్తులను యాడ్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం ‘యాడ్‌ మోర్‌’ బటన్‌ను క్లిక్‌ చేయాలి.
8. ఆ తర్వాత టీకా కోసం అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేసుకోవాలి. ‘Schedule appointment’ అని బటన్‌ క్లిక్‌ చేస్తే అపాయింట్‌మెంట్‌ పేజీకి వెళ్తుంది. అక్కడ మన రాష్ట్రం, జిల్లా, పిన్‌కోడ్‌ ఎంటర్‌ చేసి మనకు సమీపంలోని టీకా పంపిణీ కేంద్రాలను తెలుసుకోవచ్చు. ఆ జాబితా నుంచి ఒక కేంద్రాన్ని ఎంచుకుంటే అందుబాటులో ఉన్న స్లాట్స్‌ చూపిస్తుంది. వాటిలో నుంచి సమయం, తేదీని ఎంచుకుని కింద ఉండే Book బటన్‌ను క్లిక్‌ చేస్తే అపాయింట్‌మెంట్‌ లభిస్తుంది.
9. అవసరమైతే టీకా తేదీ, సమయాన్ని మార్చుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. అయితే, దీన్ని అపాయింట్‌మెంట్‌ తీసుకున్న తేదీ కంటే ముందే మార్చుకోవాలి. సిటిజన్‌ రిజిస్ట్రేషన్‌లో లాగిన్‌ అయితే రీషెడ్యూల్‌ ఆప్షన్‌ కన్పిస్తుంది.
మరిన్ని వివరాలు..
* టీకా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వ్యాక్సిన్‌ ఇస్తారు.
* తొలి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు తీసుకోవాలి. మొదటి డోసు తీసుకున్నప్పుడే రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలో తెలుస్తుంది.
* రెండో డోసు తీసుకోవడం ద్వారా కొవిడ్‌ టీకా పొందినట్లుగా ధ్రువపత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది.
* టీకా పొందేప్పుడు నమోదు సమయంలో అప్‌లోడ్‌ చేసిన సంబంధిత ధ్రువపత్రాల ఒరిజినల్స్‌ను వెంట తీసుకెళ్లాలి.

Senior Journalist Bhandaru Srinivas Rao about YS Sharmila Party in Telan...


https://youtu.be/rCf7TdeGJiA

3, మార్చి 2021, బుధవారం

కోవిడ్ టీకాపై అవగాహన కోసం.....

 


కోవిడ్ టీకా వేయించుకునే వారికోసం, టీకా వద్దు అని సందేహపడే వారి కోసం ఈ పోస్టు.

ఈరోజు నేను ఈ టీకా వేయించుకున్నాను. వేయించుకుని కూడా చాలా గంటలు గడిచిపోయాయి. సమగ్రమైన పోస్టు పెడదాం, ఈలోపల టీకా విషయంలో నాకున్న సందేహాలు (After effects వంటివి) తొలగిపోవడానికి సమయం దొరుకుతుంది అనే ఉద్దేశ్యంతో కొంత ఆలస్యం చేసిన మాట నిజం.

మరో నిజం కూడా చెప్పాలి. ఈరోజు ఉదయం వరకు టీకా తీసుకోవాలనే ఉద్దేశ్యం కూడా లేదు. దాదాపు ఏడాదిగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు ఇప్పుడీ టీకా గొడవ ఎందుకులే అని సంక్షేపించిన మాట కూడా వాస్తవం.

అయితే గత రెండు రోజులుగా అనేక వాట్సప్ గ్రూపుల్లో నాకు తెలిసిన అనేకమంది టీకా వేయించుకున్నట్టు పోస్టులు పెట్టారు. ఇంకా చిత్రం ఏమిటంటే వీరిలో ఓ పాతిక ముప్పయిమంది దాకా  మా దగ్గరి చుట్టపక్కాలే వున్నారు.

ఇక మనం మాత్రం ఎందుకు లేటు చేయాలి అని మామూలు ప్రొసీజర్ ఫాలో అయి ఓ ఇరవై మందిమి రిజిస్టర్ చేయించుకున్నాము. ఇందులో జ్వాలా కుటుంబం వుండడం మాకు కలిసి వచ్చింది. పబ్లిక్  హెల్త్ శాఖ  డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు గారు సహాయ హస్తం అందించారు.

పదకొండున్నర ప్రాంతంలో అందరం అక్కడ జమ అయ్యాము.  చక్కటి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఆధార్ కార్డు, PAN కార్డు  నెంబర్లు తీసుకుని, ఓ ఫారం మీద మూడు సంతకాలు, వేలి ముద్ర పెట్టించుకుని  ఒక చీటీ ఇచ్చారు. అది తీసుకుని వేరే కౌంటర్ వద్దకు వెడితే బీపీ చెక్ చేసి మరో కౌంటర్ లో  మొబైల్ నెంబరు వివరాలు రాసుకున్నారు. పక్కనే వున్న మరో కుర్చీలో కూచోబెట్టారు.  మంజుల అనే ఓ లేడీ నర్స్ వచ్చి భుజం మీద ఇంజెక్షన్ చేసి చాలా  సున్నితంగా టీకా మందు ఇచ్చారు. సూది  చాలా సన్నగా వుంది. ఏమాత్రం నొప్పి అనిపించలేదు. టీకా ఇవ్వగానే  వేలి మీద ఓటరుకు పెట్టినట్టు చుక్క గుర్తు వేశారు. పక్కన గదిలో కాసేపు కూర్చోమని చెప్పారు. తాగేవారికి తేనీరు ఇచ్చారు.  ఓ అరగంట తర్వాత వెళ్ళిపోయి, ఇరవై ఎనిమిది రోజులు  విరామం ఇచ్చి ఇరవై తొమ్మిదో రోజున  వచ్చి, మళ్ళీ  రెండో డోసు టీకా తీసుకోమని చెప్పారు. దీనికి సంబంధించి  సెల్  ఫోన్  మెసేజ్  పంపుతారు. టీకా వేసిన చోట దద్దురు రావడం కానీ,  తలనొప్పి, కళ్ళు తిరగడం వంటి  సమస్యలు మాకే కాదు, ఈరోజు మాతో పాటు టీకా వేయించున్న ఏ  ఒక్కరికీ ఎదురవ్వలేదు. టీకా వేయక ముందు అందరి మొహాల్లో కనిపించిన ఆందోళన, వేసిన తర్వాత మచ్చుకు కూడా  కనిపించ లేదు. ప్రతి ఒక్కరూ సంతోషంతో ఇళ్లకు వెళ్ళిపోయారు. మేము కూడా  హాయిగా ఇళ్లకు తిరిగి వచ్చి భోజనాలు చేశాము. మా బ్యాచ్ సంఖ్య పెద్దది  కావడం వల్ల కొంచెం ఎక్కువ సమయం పట్టింది. చిన్న కుటుంబం అయితే గంటలో అయిపోయేదేమో. రెండు డోసులు పూర్తయిన తర్వాత  కోవిడ్  టీకా సర్టిఫికేట్  జారీ చేస్తారు.

కరోనా కట్టడి విషయంలో ముఖ్యంగా కోవిడ్ టీకాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ అత్యంత చక్కని సమన్వయం నాకక్కడ కనపడింది.

చివర్లో చెప్పేది ఒక్కటే.

టీకా తీసుకోవడానికి ముందు పాటించాల్సింది ఏమిటి అంటే అది ఒక్కటే.

“భయ సందేహాలను ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్లి టీకా వేయించుకోండి”



(03-03-2021)

     

2, మార్చి 2021, మంగళవారం

కన్నీరు తెప్పించిన కదిలే ఫోటో

మా మూడో అన్నయ్య మనుమడు శైలేష్, చనిపోయిన మా ఆవిడ ఫోటోకు జీవం పోసి అమెరికా నుంచి నాకు గిఫ్ట్ గా పంపాడు. థాంక్స్ రా శైలేష్! 



blob:https://web.whatsapp.com/42775b27-1064-4ed5-bee8-be0e07f7ced5


రాజకీయాల్లో ఇంత డబ్బు ఉందా?

 

“మీరు మహా టీవీకి వెడుతున్నారు. ఖచ్చితంగా అక్కడ బాబు గారికి అనుకూలంగా కొన్ని మాటలు చెబుతారు. నాకు బాగా తెలుసు. మిమ్మల్ని చాలా రోజులుగా టీవీల్లో చూస్తున్నాను. ఈ మధ్య రావడం లేదు. అది వేరే సంగతి”
నాకు వచ్చిన మెసేజ్ ప్రకారం ఆ ఓలా క్యాబ్ డ్రైవర్ పేరు కరుణాకర్.
మూతి గుడ్డ పెట్టుకుని మాట్లాడడం వల్ల ముందు అతనేమంటున్నాడో నాకు అర్ధం కాలేదు. నేను కల్పించుకునే చెప్పేలోగా అతడే ఇంకా ఇలా అన్నాడు.
“మొన్న మిమ్మల్ని సాక్షిలో చూశాను. అక్కడా ఇంతే. జగన్ గారికి కొంత అనుకూలంగా మాట్లాడారు. నేను తప్పు పట్టను. మీలో నాకో సుగుణం కనిపించింది. బాబు అనుకూల ఛానల్లో బాబు వైపు మొగ్గు చూపినా జగన్ గారికి వ్యతిరేకంగా ఒక్క ముక్క కూడా నోరు తెరిచి చెప్పరు. అలాగే సాక్షిలో జగన్ గారికి అనుకూలంగా మాట్లాడుతారు కాని బాబు గారికి వ్యతిరేకంగా ఎవరు రెచ్చగొట్టినా మాట్లాడరు. అయినా మీరు నాకు ఎందుకు నచ్చుతారంటే, ఏ టీవీలో మాట్లాడినా మధ్యలో ఎక్కడో వీలు చేసుకుని ఆ ఛానల్ వాళ్లకు ఇష్టం వున్నా లేకపోయినా మీ మనసులో మాట కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు. అందుకే ఏ ఛానల్లో కనపడ్డా, యూ ట్యూబ్ లో కనపడ్డా నేను తప్పకుండా చూస్తాను”
అన్నాడు కరుణాకర్.
ఇంతకీ పొగుడుతున్నట్టా, తెగుడుతున్నట్టా! ఏదైనా దాచుకోకుండా మనసులో మాట చెబుతున్నాడు. జనం నాడి తెలుసుకోవడానికి ఇలాంటివాళ్ళే బెటరు.
“రాజకీయాలు అంటే ఇంట్రస్టా” అని అడిగాను ఏదో ఒకటి మాట్లాడాలని.
“నాకొకటి చెప్పండి. వీళ్ళకు ఇంత డబ్బు ఎలా వస్తుందండీ. నాకొక దోస్త్ వున్నాడు. వాడూ ఒకప్పుడు నాలాగే డ్రైవర్. ఒక నాయకుడి దగ్గర చేరి ఎక్కువ కాలం కాలేదు. ఏదో ఎన్నికల్లో మా వాడిని మా ఊరి వార్డు మెంబరు చేశారు. ఇప్పుడు అతడి వైభోగం వేరు. సొంత కారుంది. చిన్న ఇల్లు కట్టాడు. చాలా ఖరీదు చేసే సెల్ ఫోన్లు తరచూ మారుస్తుంటాడు. ఒక వార్డు మెంబరు అయితే ఇంత సంపాదన ఉంటుందా! ఈ లెక్కన బడా బడా నాయకుల రాబడి ఎంత వుంటుందో మరి”
జవాబు చెప్పే వ్యవధానం లేకుండా చేరాల్సిన గమ్యం చేరుకోవడం వల్ల అతడి ప్రశ్నకు బదులు ఇవ్వలేదు. నిజానికి ఆ ప్రశ్నకు సమాధానం నాకు కూడా తెలియదు.
(OLACAB : KARNAKAR TS 15UB 3347)

మేకు జోకు - జోకు మేకు - భండారు శ్రీనివాసరావు

 

కొన్ని సందర్భాలలో జోకు మేకయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కొన్ని జోకులు ఆడవారి మీద పేలిస్తే అవి రివర్స్ లో తగిలే ప్రమాదం వుంది. కాకపోతే ఇలాటి జోకులన్నీ స్త్రీ స్వాతంత్రం ఎక్కువగా వున్న దేశాల్లోనే ఎక్కువగా పుట్టి మన దగ్గరికి దిగుమతి అయ్యాయి. ఆ పరాయి జోకుల్ని సొంత భాషలోకి అనువదించాలనే ఉత్సాహపరులకి కొండొకచో కొన్ని పాట్లు (కామెంట్లు) తప్పవు. అయినా సరే, కామెంట్లే కదా సర్దిపుచ్చుకుందాం అని అనువాదం చేస్తే ఇదిగో ఆ జోకులు ఇల్లా వుంటాయి.

అమెరికా తండ్రికి కూతురు ఫోను చేసి చెప్పింది.'సారీ డాడ్. నిన్న అనుకోకుండా నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నీకు ఫోన్ చేసి చెప్పే టైం లేకపోయింది'

తండ్రి: పర్వాలేదులే. మళ్ళీ ఇలాటి సందర్భం రాకపోదులే. అప్పుడు మాత్రం గుర్తుంచుకుని కబురు చెయ్యి'

ఇండియా పిల్లాడు తన అమెరికన్ స్నేహితుడితో చెప్పాడు, ' నాకు నలుగురు అక్కయ్యలు, ముగ్గురు తమ్ముళ్ళు మరి నీ సంగతేమిటి?'

'నాకా! నాకు అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎవ్వరూ లేరు. కాకపోతే నా మొదటి అమ్మద్వారా నలుగురు నాన్నలు, మొదటి నాన్న ద్వారా ముగ్గురు అమ్మలు'

"ఆడవాళ్ళు ముగ్గురి మాటే చెవిపెట్టి వింటారు. అంతే కాదు, వారు చెప్పిన మాటలు అక్షరాలా ఆచరిస్తారు. అని ఓ మగ పిశాచి ఉవాచ.

ఆ ముగ్గురు ఎవ్వరంటే ఒకడు టైలర్, రెండోవాడు ఫోటోగ్రాఫర్, మూడో వ్యక్తి బ్యుటీషియన్. వీళ్ళు ముగ్గురు కాకుండా తలకిందుగా తపస్సు చేసినా సరే, ఆడంగులు ఈ భూప్రపంచంలో ఎవ్వరి మాట వినరుగాక వినరు. కాకపోతే కొందరు విన్నట్టు నటిస్తారుట"