20, అక్టోబర్ 2020, మంగళవారం

అపభ్రంశపు అనువాదం – భండారు శ్రీనివాసరావు

 మిత్రుడు A.Saye Sekhar ఈ మధ్య Communication”, “Communicator” అనే ఇంగ్లీషు పదాలకు telugu equivalent (బహుశా సమానార్థక తెలుగు పదాలు కాబోలు) ఏమిటనే ప్రశ్నను సంధించారు. నా ఈ పోస్టు దానికి సమాధానం కాదు కానీ ఇటువంటి సందేహాలు పొటమరించినప్పుడు ఏమి చేయాలి అనే దానికి నాకు తెలిసినంతలో చిన్న వివరణ:

మొన్నీ మధ్య ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్న ఓ సినిమా చూస్తుంటే ఇద్దరి మధ్య సంభాషణలో ఒకడు ‘పోనీలేరా! ఇంకేమిటి చెప్పు’ అంటాడు. దానికి కింద సబ్ టైటిల్స్ లో ‘Thanks. Leave it’ అని వేశారు.

మామూలుగా ఇంగ్లీషులో థాంక్స్ అంటే ధన్యవాదాలు అని తెలుగు అనువాదం ఏ నిఘంటువులో అయినా కనిపిస్తుంది. కానీ తెలుగు సంస్కృతిలో ఈ థాంక్స్ సాంప్రదాయం లేదు. ప్రతి దానికీ ఇంగ్లీష్ వాళ్ళు థాంక్స్ అనే పదం విరివిగా వాడతారు. కానీ తెలుగులో మాట్లాడేటప్పుడు ఇలా థాంక్స్ చెప్పడం కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. కానీ జనాలకు అలవాటయిపోయింది. అది వేరే విషయం. అనువాదకులు మాత్రం ఇలాంటి సందర్భాలలో సాధారణ జనం ఏం మాట్లాడుకుంటారో అది గమనించి అనువదిస్తే అందులో కృతకత్వం లోపిస్తుంది.

ఏతావాతా చెప్పేది ఏమిటంటే Communication”, “Communicator” అనే ఇంగ్లీషు పదాలకు telugu equivalent గురించి ఆలోచించేటప్పుడు కూడా మక్కికి మక్కి అనువాదం కాకుండా మామూలు ప్రజలు వాడే భాష ఎలా వుంటుందో ఒకింత అవగాహన చేసుకుని, సందర్భాన్ని బట్టి ఆ పదాలను అనువదిస్తే అది సరయినది అవుతుంది. లేకపోతే అది సాంఘిక మాధ్యమాల్లో బాగా ప్రాచుర్యం పొందిన ‘ఒక పత్రిక భాష’ అవుతుంది.

తోకటపా: అపభ్రంశ అనువాదాలకన్నా మూలంలో వాడిన పదాన్ని యధాతధంగా ఉంచేయడం మేలు. అర్ధం చేసుకోవడానికి పాఠకులు తమ తిప్పలేవో తామే పడతారు.

16, అక్టోబర్ 2020, శుక్రవారం

నీళ్ళ యుద్ధాలు – భండారు శ్రీనివాసరావు

కనీవినీ ఎరుగని కుంభవృష్టి  నేపధ్యంలో చాలా హృదయ విదారక దృశ్యాలు, కొన్ని అవాంఛిత సంఘటనలు చూడాల్సివస్తోంది. హైదరాబాదులో అక్కడెక్కడో వరద నీటి ప్రవాహం తమ ఇళ్ళను ముంచెత్తకుండా  ఒక కాలనీ వాళ్ళు గండి కొట్టే ప్రయత్నం చేస్తే కొంచెం దిగువన ఉన్న కాలనీ వాళ్ళు అభ్యంతరం చెప్పడంతో  మాటామాటా పెరిగి, చేతులు కలుపుకుని, కర్రలతో కొట్టుకునేదాకా వెళ్లిందని ఓ టీవీలో స్క్రోలింగులు  చూశాను.

ఓ ఇరవై ఏళ్ళ క్రితం ఇలాగే  నాకు తెలిసిన కుటుంబం  నగరంలో ఒక కాలనీలో రెండంతస్తులతో ఇల్లు కట్టుకున్నారు. మేము గృహ ప్రవేశానికి  కూడా వెళ్ళాము. ఇంటి ఎదురుగా పెద్ద చెరువు. కాకపోతే నీళ్ళు  ఆట్టే లేవు. వీళ్ళ ఇల్లు  నిజానికి ఆ చెరువుకు నీళ్ళు పారే ప్రదేశంలో వుంది. చెరువుకు నీళ్ళు వస్తే ఇబ్బంది పడతారేమో అని చెప్పాలనిపించింది.  కానీ సందర్భం కాదేమో అని ఊరుకున్నాను.

అంత చక్కటి ప్రదేశంలో మంచి ఇల్లు కట్టుకున్నందుకు వచ్చిన వాళ్ళు అందరూ గృహస్తును  అభినందించారు. అప్పటికే ఆ కాలనీలో చాలా సుందర భవంతులు వెలిశాయి. చూడగానే సంపన్నుల కాలనీ అనిపించేదిగా వుంది. ఆ రోజుల్లో  ముఖ్యమంత్రికి నగర సుందరీకరణ మీద మక్కువ ఎక్కువ కావడంవల్ల ఆ చెరువు కట్టను అందమైన మినీ టాంక్ బండుగా తీర్చిదిద్దారు. దానితో ఆ కట్టకు దిగువన దీనిని తలదన్నే మరో కాలనీ  వెలిసింది. సరే కొంత కాలం ఆ కాలనీ వాళ్ళు, ఈ కాలనీ వాళ్ళు సఖ్యంగానే వున్నారు.

ఆ సమయంలో ఇప్పటిలాగే కనీవినీ ఎరుగని వర్షాలు కురిసి  చాలా కాలనీలు వరద ముంపుకు గురయ్యాయి. చెరువు నిండి ఆ ప్రవాహం వెనక్కి రావడంతో ఎగువ కాలనీలోని ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చాయి. మునిగిపోతాయన్న భయంతో వాళ్ళు ఆ చెరువు కట్టకు గండి కొట్టే ప్రయత్నం చేయబోయారు. అంతే! దిగువన వున్న కాలనీవాళ్ళు గండి కొడితే తమ కాలనీ మునిగిపోతుందని భయపడి ఎగువ కాలనీ వాళ్లకు ఎదురు తిరిగారు. అప్పటిదాకా  సఖ్యతగా ఉన్న రెండు కాలనీల వాళ్ళు ఒకరికొకరు పరమ శత్రువులు అయిపోయారు.

ఈ లోగా వరుణుడు శాంతించడం, వరద తగ్గు ముఖం పట్టడంతో పెద్ద సంఘర్షణకు అవకాశం లేకుండా పోయింది.

ప్రకృతి ప్రజలకు ఉచితంగా ప్రసాదించే నీరు తక్కువైనా కష్టాలే, ఎక్కువైనా కష్టాలే! అయితే ఈ కష్టాలకు తామే కారణం అని ప్రజలకూ తెలుసు. కానీ తెలియనట్టుగా ఉండిపోతారు. (16-10-2020)

13, అక్టోబర్ 2020, మంగళవారం

అసిధారావ్రతం

 


‘మా వెబ్ ఛానల్ కు మీరు ఓ ఇంటర్వ్యూ ఇవ్వాలి, జగన్, కోర్టుల వ్యవహారం మీద’

‘తప్పకుండా. కానీ  అసిధారావ్రతం అనే కండిషన్ మీద

‘అంటే!..’ అన్నదా అమ్మాయి.

నేనూ దాని ఉత్పత్తి అర్ధం జోలికి పోలేదు, పైగా దాని అసలు అర్ధం తెలియకపోవడం మంచిదే అనుకున్నాను.

‘ఏమీ లేదు, కోర్టులకు సంబంధించిన వ్యవహారం కదా! అంచేత మీరు ఏ ప్రశ్న అయినా అడగండి, నాకు అభ్యంతరం లేదు, నేను మాత్రం ఆచితూచి మాట్లాడతాను, మీకేమయినా అభ్యంతరమా

లేదనిపించుకున్న తరవాత ఇంటర్వ్యూ మొదలయింది.

‘ఇప్పుడు ఇలా కోర్టుల మీద యుద్ధం ప్రకటించిన ఏపీ సీఎం జగన్ మోహన రెడ్డికి ఎలాంటి చిక్కులు ఎదురు కాబోతున్నాయి?

‘ఆయనకు ఎదురయ్యే చిక్కుల సంగతి ఏమో కానీ కోర్టుల పట్ల గౌరవంతో కూడిన భయం కారణంగా, రాజకీయ నాయకులు అందరూ  నోరు సంభాళించుకుని మాట్లాడే పరిస్థితి వస్తే జనం చాలా చిక్కులనుంచి బయట పడతారు.’

సరిగ్గా ఇలాగే కాకపోయినా  ఇంటర్వ్యూ ఇలాగే మొదలయింది.

‘ఈ పరిణామాలను వ్యవస్థల మధ్య ఘర్షణగా భూతద్దంలో చూపిస్తున్నారు. నిజానికి ఇది వ్యక్తుల నడుమ, ఇంకా బాగా చెప్పాలంటే రెండు ప్రాంతీయ పార్టీల నడుమ ఎంతో కాలంగా సాగుతూవస్తున్న సంఘర్షణకు పరాకాష్టగా నేను అనుకుంటున్నాను.

‘ఏ వ్యవస్థ అయినా వ్యక్తుల సమూహమే. వ్యక్తులకు వుండే సహజమైన బలాలు, బలహీనతలు ఒక్కొక్కసారి వ్యవస్థల మీద ప్రతిఫలిస్తుంటాయి. అది వ్యవస్థ తప్పుకాదు, కానీ అలాంటి వ్యక్తుల కారణంగా వారు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యవస్థల మీద మచ్చ పడే ప్రమాదం వుంది.

‘కొందరు రాజకీయ నాయకులు మంచి ప్రజాదరణతో గద్దె ఎక్కుతారు. ఏదో చేయాలన్న తపనతో పాటు ఎవరినో సాధించాలి అనే ఆరాటం కూడా వారిలో వుంటుంది. శ్రీమతి గాంధి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకురాలు. ఇదే బలహీనత ఆమెను అధికారానికి దూరం చేసింది. ఆ తరువాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన జనతా పార్టీ ప్రజలకు హామీ ఇచ్చిన పనులు చేయడం కంటే ఇందిరాగాంధీని రాజకీయంగా భ్రస్టు పట్టించడానికే ఎక్కువ సమయం వినియోగించింది. వీటిని ప్రజలు ఎలా గమనిస్తున్నారు అనే విషయం ఆ తదుపరి జరిగిన ఎన్నికల ఫలితాలు నిరూపించాయి.

‘ఇక జగన్ మోహనరెడ్డి విషయానికి వస్తే రెండేళ్ల కంటే కొంచెం తక్కువగా, ఇంతవరకు  సాగిన ఆయన పాలనలో ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను ఏపీ హైకోర్టు తప్పుపట్టింది. మొట్టికాయలు, అక్షింతలు  అని మీడియా వ్యవహరిస్తున్న వీటి సంఖ్య సుమారు నూరువరకు ఉండొచ్చని అంచనా. విచారణ సందర్భంలో  న్యాయమూర్తులు చేసే వ్యాఖలకు  కూడా  మీడియా  విశేష  ప్రాధాన్యం  ఇస్తోంది. వాటిమీద  మళ్ళీ  చర్చలు. ఏతావాతా తమ ప్రభుత్వంపై  అన్యాపదేశంగా  జరుగుతున్న దాడి అనే అనుమానం వారిది.

అయితే  కోర్టుల వ్యాఖ్యల తీరుతెన్నుల ఆధారంగానే  జగన్  పాలన రాజ్యాంగ సమ్మతంగా లేదని కొందరు నిర్ధారిస్తున్నారు. సరే. ఒప్పుకుందాం. కానీ చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండుసార్లు సరయిన టైం చూపిస్తుంది. అటువంటప్పుడు ఇన్ని నిర్ణయాలు వరసగా కోర్టుల స్క్రూటినీలో  తప్పని తేలుతున్నప్పుడు ఎందుకిలా జరుగుతోంది, దీని వెనకాల ఏముంది  అనే అనుమానం వరసగా అక్షింతలు వేయించుకుంటున్న వారికి  కలిగితే దాన్ని మాత్రం ఎలా తప్పుపట్టగలం.

కొందరు న్యాయమూర్తుల పనితీరు, లేదా వారి నిర్ణయాల పట్ల సందేహాలు  వ్యక్తం చేస్తూ చేసిన ప్రకటనను కూడా న్యాయ వ్యవస్థ పట్ల తమ ప్రభుత్వానికి ఎనలేని గౌరవం వుందని ఉద్ఘాటిస్తూనే మొదలుపెట్టారు. ఈ ఫిర్యాదును  నేరుగా సుప్రీం కోర్టు  ప్రధాన న్యాయమూర్తి  దృష్టికే లిఖిత పూర్వకంగా దాఖలు చేసుకున్నారు. ఇది ఒక వ్యక్తిగానే కాకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా ఆయనకు ఉన్న హక్కు. దానిని ఆయన ఉపయోగించుకుంటే ఎలా తప్పుపడతాం చెప్పండి. కాకపొతే, సర్వోన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తికి ఒక ఫిర్యాదు ఇచ్చిన తరువాత, కొంత సమయం ఇచ్చి  వేచి వుండాల్సింది. ఈ లోపలే ఆ విషయాన్ని మీడియా ద్వారా బహిరంగ పరచడం నైతికంగా చూసినప్పుడు పొరబాటే. న్యాయస్థానం  దీన్ని  కోర్టు ధిక్కరణ కింద  పరిగణించే అవకాశం వుంది.

‘కానీ  వర్తమాన రాజకీయాల్లో తప్పుఒప్పుల నడుమ విభజన రేఖ ఎప్పుడో చెరిగిపోయింది. ఎలాగంటే ఒక పార్టీ నాయకుడు రాష్ట్రపతికి ఓ లేఖ రాస్తారు. అది ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కు చేరకమునుపే అందులోని విషయాలను మీడియాకు వెల్లడిస్తారు. అయితే సుప్రీం కోర్టు  ప్రధాన న్యాయమూర్తికి చేసిన  ఫిర్యాదు, రాష్ట్రపతికి ఇచ్చిన విజ్ఞాపన పత్రం ఒకటేనా అనే సందేహం మీకూ, నాకూ  రావచ్చు. కానీ రాజకీయాల్లో ఈ విధమైన విచక్షణ నానాటికీ లుప్తం అవుతోంది.

‘పునరుక్తి దోషం అయినా మళ్ళీ ఒకసారి చెప్పాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతోంది, రాజ్యాంగ వ్యవస్థల నడుమ ఘర్షణ కాదు, రెండు రాజకీయ పార్టీల నడుమ కొనసాగుతూ వస్తున్న సంఘర్షణ ఈ రూపం తీసుకుంటోంది.  

‘ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోర్టుల పట్ల చేసిన వ్యాఖ్యలను గురించి అడిగారు. ఈ పిటీషన్ విచారణ సందర్భంలో న్యాయమూర్తి ఒకరు ఒక ప్రశ్న అడిగారు. ‘ఈ వ్యాఖ్యలు ఆయన సభలో చేసారా లేక బయట చేసారా’ అని. ‘తిరుమలలో చేశార’ని జవాబు వచ్చిన జ్ఞాపకం. అంటే సభ వెలుపల చేస్తే కోర్టు ధిక్కరణ కిందికి రావచ్చేమో. సభలో చేస్తే స్పీకర్ కూడా రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న కారణం చేత అలాంటి తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉండకపోవచ్చేమో!

‘ఇదే సూత్రం సోషల్ మీడియాకు కూడా వర్తిస్తుందా? నాకు అంత న్యాయ శాస్త్ర పరిజ్ఞానం లేదు. కోర్టు బయట చేసిన ఇలాంటి వ్యాఖ్యలు  కూడా న్యాయమూర్తుల అభిశంసనకు గురవుతాయా అనేది  న్యాయ కోవిదులే చెప్పాలి.

‘ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్య ప్రియులకు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటికి ఎంత త్వరగా ముగింపు పలికితే అంత శ్రేయస్కరం  

ఇలాగే సాగింది ఆ ఇంటర్వ్యూ. అచ్చం ఇలాగేనా అంటే కొంత వాచకంలో తేడా వుండి ఉండొచ్చు.

తోకటపా:

ఇక ఆ అమ్మాయి అడిగిన ‘అసిధారావ్రతం’ అంటే ఏమిటో నేను చెప్పలేదు కదూ.

‘చాలా కష్టమైన పని’ అనే అర్థంలో ఈ జాతీయాన్ని ప్రయోగిస్తారు.

అసి అంటే కత్తి. ధారా అంటే అంచు. అసిధారావ్రతమంటే కత్తి అంచు మీద పడుకోవడమనేది భౌతికార్థం!

నిజానికి ఇది బ్రహ్మచర్య దీక్షలో ఒక భాగం. మనసు నిలకడస్థితికి పరీక్ష పెట్టే వ్రతమిది. నాతిగల బ్రహ్మచర్యం విషయంలో కూడా వాడతారు.

ఇక నా కవి హృదయం ఏమిటంటే కోర్టుల వ్యవహారాలు  గురించి  వ్యాఖ్యానించేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి అని. (13-10-2020)


Note: Courtesy Image Owner




ఇలాటి అధికారులు కావాలి

 ఒకానొక కాలంలో జిల్లాను మొత్తం తమ కనుసన్నల్లో శాసించే జిల్లా కలెక్టర్లకు తమ జిల్లాలో తిరగడానికి జీపు సౌకర్యం మాత్రమే వుండేది. అదీ టార్పాలిన్ పట్టాలు అటూ ఇటూ టపటపా కొట్టుకుంటూ వేళ్ళాడే పాతతరం జీపులు.

అలాటి కాలంలో, ఒకానొక జిల్లాలో, కలెక్టర్ గా పనిచేస్తున్న ఓ ఐ.ఏ.ఎస్. అధికారి జీపు తీసుకుని ఓ రోజు ఉదయం ఏదో గ్రామానికి టూరుకు వెళ్లి తిరిగి వస్తుంటే జీపు టైరు పంక్చర్ అయింది. సెల్ ఫోన్లు లేని రోజులాయె. డ్రైవర్ పంక్చర్ వేయించుకుని రావడానికి కొన్ని మైళ్ళ దూరంలో వున్న మరో పెద్ద వూరికి వెళ్ళాడు. కలెక్టర్ గారి వెంట వున్న బిళ్ళ బంట్రోతు, అయ్యగారికి చెట్ల నీడన వున్న ఒక మోరీ చూపించి అక్కడ కూర్చోపెట్టాడు. డ్రైవర్ రావడానికి బాగా వ్యవధి వుంది. అటూ ఇటూ చూస్తున్న కలెక్టర్ గారి దృష్టికి దగ్గరలో ఓ వూరు జాడ కనిపించింది. కొందరు ఆడవాళ్ళు బిందెలు చంకన పెట్టుకుని వస్తూ కానవచ్చారు. ఆయన వారిని పలకరించి, 'నీళ్ళ కోసం ఇంత దూరం ఎందుకు పడుతూ లేస్తూ వస్తున్నారు, మీ వూళ్ళో మంచి నీటి బావి లేదా?' అని ప్రశ్నించారు. 'నువ్వేమన్నా ఆర్చేవాడివా, తీర్చేవాడివా' వంటి చొప్పదంటు ప్రశ్నలు వాళ్ళు వేయకుండా, 'వూళ్ళో బావులకేం చాలా వున్నాయి, కానీ మమ్మల్ని అక్కడ నీళ్ళు తోడుకోనివ్వరు' అని బదులు చెప్పారు. కలెక్టర్ సాలోచనగా తలపంకించి ఊరుకున్నారు. ఈలోగా టైరు పంక్చర్ వేయించుకుని డ్రైవర్ తిరిగివచ్చాడు. కలెక్టర్ తన మానాన తాను పొతే కధే లేదు. ఆయన అల్లాంటి ఇల్లాంటి అధికారి కాదు కాబట్టి ఏం చేయాలో వెంటనే ఆలోచించి పెట్టుకున్నాడు. డ్రైవర్ ని నేరుగా జిల్లా కేంద్రానికి పంపించి తాను ఆ మోరీ మీదనే కూర్చుండిపోయాడు. ఈలోగా ఆయన మౌఖిక ఆదేశాలు అందుకున్న కలెక్టర్ గారి సిబ్బంది, స్థానిక తాసిల్దారు టైప్ రైటర్లు, కలెక్టర్ గారి అధికారిక ముద్రిక తదితరాలతో సహా అక్కడికి వచ్చారు. ఊళ్ళోకి కబురు పంపి గ్రామ సర్పంచుని రప్పించారు. ఈ హడావిడి అంతా చూసి ఊరిజనం అంతా అక్కడ పోగయ్యారు. వూరి వెలుపల నుంచి మంచి నీళ్ళు తెచ్చుకునే వారికి వారి గూడెం లోనే ఒక మంచి నీటి బావి మంజూరు చేయాలని సర్పంచు నుంచి ఓ అభ్యర్ధన పత్రం తీసుకున్నారు. దానికి అక్కడికక్కడే స్థానిక అధికారి నుంచి ఆమోద ముద్ర వేయించారు. తనకున్న విశేష అధికారాలను ఉపయోగించుకుంటూ అందుకు అవసరమైన నిధులను తక్షణమే మంజూరు చేస్తూ ఆ మోరీ మీదనే కూర్చుని సంతకం చేసి, కింద స్టాంపు వేసారు. ఆ వెనువెంటనే కూలీలను పిలిపించారు. బావి తవ్వకానికి ఆయనే స్వయంగా గడ్డపారతో మొదటి పలుగు వేసి స్వీకారం చుట్టారు. ఝాము పొద్దెక్కక ముందే ఝామ్మని బావి పని మొదలయింది. అంతకుముందు ఆ ఊరిజనం ఇలాటి అధికారిని చూడలేదు సరికదా కనీసం వినికూడా వుండలేదు. అందుకే అందరి మొహాల్లో నిండుకున్న నిబిడాశ్చర్యం. ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో వారి వూరిలో ఓ అభివృద్ధి కార్యక్రమానికి శుభారంభం జరిగింది. పొద్దుగూకే సమయానికి బావిలో సమృద్ధిగా జలపడింది. ఆ వూరి గూడెం జనానికి కొత్త పొద్దు పొడిచింది.
ఆ జిల్లా ఖమ్మం జిల్లా. ఆ వూరు రెబ్బారం అని అందరూ పిలుచుకునే రెబ్బవరం. ఆ కలెక్టర్ గారి పేరు ఆర్. పార్ధసారధి. ఆయన ఇప్పుడు జీవించి లేరు. కానీ ఆ గూడెం ప్రజల మనస్సులో ఇంకా జీవించే వున్నారు.
నేను ఖమ్మం కాలేజీలో చదువుకునే రోజుల్లో పార్ధసారధి ఆ జిల్లా కలెక్టర్. తరువాత హైదరాబాదులో రేడియో విలేకరిగా వారిని కలుసుకునే అవకాశం అనేక సార్లు లభించింది.

 

 

ఆర్. పార్ధసారధి గారి లాంటి అధికారులు అరుదుగా కనిపిస్తారు. సురేష్ చందా అనే ఓ ఐ.ఏ.ఎస్. అధికారి కూడా ఈ కోవలోకే వస్తారు. తెలంగాణా ప్రభుత్వంలో పనిచేస్తున్న ఈ అధికారి గురించి కొన్నేళ్ళ క్రితం పత్రికల్లో అనేక కధనాలు వచ్చాయి. వాటి ఆధారంగా రూపొందించిన వ్యాసం ఇది.
గత యాభై ఏళ్ళలో అనేక మార్పులు వచ్చాయి. జిల్లాకు ఒక ఐ.ఏ.ఎస్. అధికారి మాత్రమె వుండే పద్దతి మారి జిల్లాకు ముగ్గురు నలుగురు వచ్చారు. టార్పాలిన్ పట్టాలు వున్న జీపులు పోయి అధునాతన వాహన శ్రేణి వచ్చి చేరింది. జిల్లా మొత్తంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో తెలియచెప్పే సమాచార వ్యవస్థ చేతికి అందివచ్చింది. సిబ్బంది పెరిగారు. జనం ఇబ్బందులూ పెరిగాయి. మరీ అంతలా కాకపోయినా, రాజకీయ అవరోధాలను అధిగమించి, పదిమందికి పనికి వస్తాయని తాము అనుకున్న మంచి పనులను అనుకున్న రీతిలో చేసి పెట్టె అధికారులు కూడా మన మధ్యనే వున్నారు.సురేష్ చందా అనే ఒక ఐ.ఏ.ఎస్. అధికారి తెలంగాణా సచివాలయంలో ఒక ఉన్నత స్థానంలో పనిచేస్తున్నారు. రాష్ట్రం మొత్తంలో ఆరోగ్య, వైద్య సేవలు ఆయా ప్రభుత్వ ఆసుపత్రులలో ఎలా అందుతున్నాయో పర్యవేక్షించే బాధ్యత ఆయనది. యువకుడు కావడం వల్ల కంప్యూటర్ పరిజ్ఞానం హెచ్చుగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. అంచేత తన శాఖ పని తీరు మెరుగుపరుచుకోవడానికి ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవాలని ఆయన భావించారు. తెలంగాణాలో పేరొందిన గాంధి ఆసుపత్రితో మొదలు పెట్టి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని అనుకున్నారు. గాంధీ ఆసుపత్రిలో ఏమూల ఏం జరుగుతున్నదో సచివాలయంలోని తన చాంబర్ నుంచే కనిపెట్టి చూసే ఉద్దేశ్యంతో ఆ ఆసుపత్రిలో సుమారు రెండువందల నిఘా కెమెరాలను అమర్చాలని తలపెట్టారు. కిందవాళ్ళు చేసే పనులను కనిపెట్టి చూడడం ఆయన బాధ్యతల్లో ఒకటి. కానీ, తాను ఎలా పనిచేస్తున్నది కూడా నలుగురికీ తెలియాలి కదా! అందుకని ఈ ప్రయోగాన్ని ఆయన తనతోనే ప్రారంభించారు. చడీచప్పుడూ కాకుండా తన కార్యాలయంలో ఒక నిఘా కెమెరాను ఏర్పాటు చేసుకున్నారు. తన గదిలో ఏం జరిగేది, తనను కలుసుకోవడానికి ఎవరెవరు వచ్చేది, ఏం మాట్లాడేది రికార్డు చేయడం కోసం ఈ కెమెరా. అయితే ఈ కెమెరా రికార్డు చేసేది తను ఒక్కరే కాకుండా ఎవరయినా సరే చూడగలిగేలా ఇంటర్నెట్తో దాన్ని అనుసంధానం చేయడం ఇందులోని ఒక ప్రత్యేకత. 'సమాచార చట్టం ప్రకారం ప్రజలకు తెలుసుకునే హక్కు వచ్చింది. వాళ్ళు అడిగితే ఇవ్వడం కాకుండా అడక్కుండానే యావత్ సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచితే తప్పేమిట'నేది ఈ అధికారి అభిప్రాయం. తన దృష్టికి వచ్చిన ఫైళ్ళపై తాను రాసిన నోట్ వివరాలను కూడా వెంటవెంటనే ఆయన ఇంటర్నెట్లో పెడుతుంటారని పత్రికల్లో చదివినవారికి ఒకింత ఆశ్చర్యం కలగడం సహజం. అవసరానికి మించిన గోప్యతను అధికారులు పాటించడం వారికో అలవాటని జనంలో ఒక అభిప్రాయం బలంగా నాటుకుని ఉండడమే ఇందుకు కారణం. తాము చెప్పినది సావకాశంగా విని, కోరిన సమాచారం ఓ మేరకయినా అధికారులు అందించగలిగితే, తమ సమస్య సగం పరిష్కారం అయిందని సంతోషించే సామాన్యుల సంఖ్య కూడా అధికమే.
'
అనుమతి లేకుండా పురుగు కూడా ప్రవేశించలేని అతి శీతల గదుల్లో కూర్చుని అధికారులు ఏం చేస్తుంటారు?' అనే అనుమానం సాధారణ జనంలో వుంది. అ అధికారుల గదుల్లోకి కనీసం తొంగి చూడడానికి కూడా వీలుపడని వారికి సురేష్ చందా అనే ఈ అధికారి చేస్తున్నది అబ్బురం అనిపించడంలో సందేహం లేదు.
అడగగానే మెచ్చి వరాలు ఇచ్చే దేవుళ్ళకు మన పురాణాల్లో కొదవలేదు. అడగకుండానే సమాచారం ఇవ్వాలనే అభిమతం కొందరు అధికారుల్లో అయినా ఊపిరి పోసుకోవడం అభిలషణీయం. ఆహ్వానించదగ్గ పరిణామం .
మొత్తం పరిపాలన ఇలా ప్రజల కళ్ళ ముందు జరగడం అంటూ జరిగితే పాలకుల పట్ల ప్రజల్లో పేరుకుపోతున్న అసహనం ఓ మేరకయినా తగ్గడం కూడా ఖాయం. (02-05-2015)
తోకటపా: ఇది రాసి నాలుగేళ్ళు దాటింది. ఏ హోదాలో వున్నా ఆ అధికారి ఇప్పటికీ అలానే వ్యవహరిస్తున్నారని ఆశిద్దాం.

Top of Form

Bottom of Form