4, డిసెంబర్ 2019, బుధవారం

రేడియో రోజులు - 33 - భండారు శ్రీనివాసరావు


(Published in SURYA daily on 05-12-2019, Thursday)

‘ఆకాశవాణి, విజయవాడ కేంద్రం’
ఒకానొక కాలంలో ప్రాభాత వేళలో ఈ పదాలే  జనపదాలకు మేలుకొలుపు పిలుపులు.
అలాంటి విజయవాడ రేడియోకి ఇప్పుడు డెబ్బయ్ రెండేళ్ళు.
బందరు రోడ్డు, పున్నమ్మతోటలో ఉన్న విజయవాడ రేడియో కేంద్రం గురించి తెలియనివాళ్ళు, వినని వాళ్ళు ఆంధ్రప్రాంతంలో ఉండరంటే అతిశయోక్తి కాదు. సంగీత సాహిత్యాలలో ఘనాపాటీలు, దిగ్గనాధీరులైన అనేకమంది  ప్రముఖులు ఈ కేంద్రం ద్వారా తమ ప్రతిభావ్యుత్పత్తులను ప్రదర్శించిన వాళ్ళే.
ఈ కేంద్రం పుట్టుపూర్వోత్తరాలు గురించి ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ గుర్తు చేసుకుంటూ ఇలా చెప్పారు. 
“1936లో అప్పటి ఆంగ్లేయ ప్రభుత్వం, భారత దేశంలో రేడియో వ్యాప్తిని గురించి పరిశీలించడానికి నిపుణులను నియమించింది. అప్పుడు మద్రాసు రాజధానిలో తమిళ జిల్లాలతో పాటు కొన్ని తెలుగు, కన్నడ, మళయాళ జిల్లాలు కూడా కలిసివుండేవి. మద్రాసునుంచి నాలుగు భాషల్లో ప్రసారాలు చేయాలనీ, విజయవాడ నుంచి కానీ, రాజమండ్రి నుంచి కానీ తెలుగు ప్రసారాలు చేయాలని మొదట్లో అనుకున్నారు. కానీ చివరకు తెలుగు కార్యక్రమాలను కూడా మద్రాసు నుంచే ప్రసారం చేయాలని నిర్ణయించారు.
“1947లో దేశం స్వాతంత్రం సాధించేనాటికి, ఆలిండియా రేడియో వ్యవస్థలో ఢిల్లీ, కలకత్తా (కోల్ కతా), బొంబాయి(ముంబై), మద్రాసు(చెన్నై), లక్నో, తిరుచిరాప్పళ్లి (తిరుచి, ట్రిచి)రేడియో కేంద్రాలు మాత్రమే వుండేవి. మద్రాసు నుంచే కాక డెక్కన్ రేడియో నుంచి, మైసూరు నుంచి(చాలా అరుదుగా) తెలుగు ప్రసారాలు జరిగేవి. స్వాతంత్రం వచ్చిన తరువాత సర్దార్ వల్లభాయ్ పటేల్ సమాచార, ప్రసార శాఖల మంత్రి అయ్యారు. ఆయన పర్యవేక్షణలో దేశంలో రేడియో వ్యాప్తికి కృషి మొదలయింది. 1956 నుంచి ఆలిండియా రేడియో సంస్థను ‘ఆకాశవాణి’గా పేర్కొంటున్నారు.
“1948 అక్టోబర్ 12 నాడు విజయవాడలో రేడియో కేంద్రం మొదలయింది. దీనితో మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమయ్యే తెలుగు కార్యక్రమాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి.
డెక్కన్ రేడియో (హైదరాబాదు, ఔరంగాబాదు) రేడియో కేంద్రాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. 1950 ఏప్రిల్ ఒకటో తేదీన హైదరాబాదు రేడియో కేంద్రం ‘ఆలిండియా రేడియో’ వ్యవస్థలో భాగంగా పనిచేయడం ప్రారంభించింది.
“1955 నవంబర్ రెండో తేదీన మొదలయిన బెంగలూరు రేడియో కేంద్రం, 1963 జూన్ లో మొదలయిన పోర్ట్ బ్లేయర్ కేంద్రం కూడా తెలుగులో ప్రసారాలు చేస్తున్నాయి. 1957 అక్టోబర్ మూడో తేదీన మొదలయిన ‘వివిధ భారతి’ ప్రసారాలలో తెలుగు పాటలు రోజూ అరగంట సేపు వేసేవారు. 1969 సెప్టెంబర్ లో ఢిల్లీ, పాట్నా, రాంచీ, సిమ్లా రేడియో కేంద్రాల నుంచి తెలుగు నేర్పే పాఠాలు ప్రారంభించారు. 1991 మార్చి రెండో తేదీన హైదరాబాదు, విజయవాడలలో వాణిజ్య ప్రసారాలు మొదలుపెట్టారు.
శ్రీ సుధాకర్ మొదునూడికి ( sudhakar modunudi) విజయవాడ ఆకాశవాణితో నలభై నాలుగేళ్లకు పైగా అనుబంధం. పన్నెండేళ్ల వయసులో 'బొమ్మరిల్లు' లో 'బాలల సంగీతసభ' లో పదిహేనురూపాయల కాంట్రాక్టుకు పాడిన రోజునుండి ఈనాడు ఒక సంగీత ప్రయోక్తగా అదే కేంద్రంలో పనిచేయటం దాకా బెజవాడ రేడియోలో ఆయన ప్రస్థానం సాగింది. ఆ అనుబంధం ఏమిటో ఆయన మాటల్లోనే.
“నాచిన్నతనంలోని పాత రేడియో స్టేషను జ్ఞాపకాలు ఎన్నటికీ మార్పున పడవు. ఆ ప్రాంగణాన్ని (ప్రస్తుతం అక్కడ దూరదర్శన్ కేంద్రం వుంది) సమీపించగానే ఏదో లోకంలోకి అడుగిడినట్లు ఉండేది. పెద్దపెద్ద చెట్లమధ్య, పైకి పెంకుటిల్లులా కనిపించేది. ఇరువైపులా దారిపొడుగునా ద్వారం వరకూ పూలకుండీలు వరుసగా పేర్చి ఉండేవి. వాటిలోని బంతిపూలు పరిమళాలు వెదజల్లేవి. నిలయ కళాకారులందరూ తెల్లటి జుబ్బా, పంచెకట్టి, ఒకరితో మరొకరు చతురోక్తులాడుకుంటూ దర్శనమిచ్చేవారు. నాటకాల రిహార్సల్సూ, దేశభక్తి గీతాల సాధనలూ, ఇవన్నీ విశాలమైన ప్రాంగణంలోని చెట్లక్రిందే,  గుంపులుగుంపులుగా కూర్చొని కొనసాగించేవారు. మేడపైకి చెక్కమెట్లు. పైన ఆఫీసుగదులు.
ఇక లోపలికి అడుగిడగానే పెద్దహాలు, మధ్యలో అద్దాలపెట్టెలో కొత్తగా కట్టబోతున్న (ప్రస్తుత)రేడియో స్టేషన్ భవంతి నమూనా, దానిపై అందంగా అమర్చిన పూలగుత్తుల పింగాణీ జాడీ, ఎదురుగా మూడు స్టూడియోలు, ఒకటి సంగీతానికి,రెండవది నాటకాలకు,మూడవది ప్రసంగాలకు. లోపల కార్యక్రమం ప్రసారమౌతున్నదని హెచ్చరిస్తూ తలుపులకు పైన వెలిగే ఎర్రలైట్లు. చేతిలో కాగితాలు పట్టుకొని, హడావుడిగా అటూఇటూ నడిచే అనౌన్సర్లు.  ఒకమూల స్పీకరునుండి మంద్రగంభీరంగా వినిపించే ప్రత్యక్ష ప్రసారం.  పైకప్పున చిన్న శబ్దంతో అలుపెరుగక తిరిగే పంకాలు. తెల్లటి గోడలకు శబ్దనియంత్రణరంధ్రాలు. గది గోడలకానుకొని రెండువైపులా సోఫాలు. వాటిలో కాలుమీద కాలేసుకొని దర్శనమిచ్చే లబ్ధప్రతిష్టులు.
“ఆనాడు నేననుకునేవాణ్ని.'ఏనాటికైనా ఉద్యోగమంటూ చేస్తే ఇక్కడే చేయాలి'.అని. దేవుడు ఆనాడే 'తథాస్తు' అంటూ దీవించాడేమో.ఇప్పటికి 28 ఏళ్లుగా అక్కడ పనిచేస్తూ ఎన్నో కార్యక్రమాలను రూపొందించే భాగ్యం నాకు కలిగింది.”
ప్రముఖ వైణికుడు శ్రీ అయ్యగారి శ్యామసుందర్ విజయవాడ రేడియోను తన మాతృసంస్థగా భావించి గౌరవిస్తానని ఆ కేంద్రంతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వీరు ఎస్సారార్ కాలేజీలో నా సహాధ్యాయి.  శ్యామసుందర్ నాన్నగారు శ్రీ అయ్యగారి సోమేశ్వర రావు మొదట మద్రాసు రేడియో కేంద్రంలోనూ, తరువాత విజయవాడ కేంద్ర ఆవిర్భావం నుంచి 1973  వరకు వీణా వాద్యం వాయించేవారు. తరువాత రేడియోలో పనిచేసే అదృష్టం తనను కూడా వరించిందని, విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుండి 1965లో మొదలు పెట్టి 2005 దాకా వాయిస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుండి టాప్ గ్రేడ్ విద్వాన్ గా వీణా వాద్యం వినిపిస్తున్నానని శ్యామసుందర్  చెప్పారు. రేడియోతో ఈ కుటుంబం సంబంధం అక్కడితో ఆగలేదు. ఆయన చెల్లెలు పరిటి  రాజేశ్వరి సైతం రేడియోలో ఏ గ్రేడ్ వైణికురాలు. ప్రస్తుతం అమెరికాలోని చికాగోలో స్థిరపడి అక్కడ కూడా సంగీత కచ్చేరీలు చేస్తున్నారు. శ్యామసుందర్  భార్య శ్రీమతి జయలక్ష్మి, ఆయన సోదరుడు సత్యప్రసాద్ కూడా రేడియో సంగీత కళాకారులే. పొతే వారి బావమరది శ్రీ పప్పు చంద్ర శేఖర్ కూడా విజయవాడ రేడియో నుంచే తన సంగీత ప్రస్థానం ప్రారంభించారు. వారి మామగారు శ్రీ పప్పు సోమేశ్వర రావు కూడా 1948 నుండి విజయవాడ కేంద్రంలో వైణిక విద్వాంసుడిగా సేవలు అందించారు. అంటే ఒక కుటుంబం యావన్మందికీ విజయవాడ రేడియో కేంద్రం తమలోని సంగీత పాటవాన్ని ప్రదర్శించడానికి  ఆశ్రయం కల్పించిందన్న మాట.
విజయవాడ రేడియో కేంద్రంలో పనిచేసిన మహామహులందరూ ఒక ఫోటోలో కానవచ్చిన ఒక అపూర్వ సంగమానికి కూడా విజయవాడ రేడియో ఒక వేదిక అయింది. తెలుగు ప్ర‌జ‌ల‌కు సుసంప‌న్న‌మైన ఆలోచ‌న‌ల‌ను ధారాద‌త్తం చేసిన ప్ర‌ముఖులు ఈ ఫొటోలో ఉన్నారు. ఆకాశ‌వాణిలో దిగ్దంతులైన క‌ళాకారులు వీరు. ఆకాశవాణి విజయవాడ కళాకారులు శ్రీ కందుకూరి రామభద్రరావు,, శ్రీ ప్రయాగ నరసింహ శాస్త్రి గార్ల పదవీ విరమణను పురస్కరించుకుని జరిగిన వీడ్కోలు సభ సందర్భంగా తీయబడ్డ ఫోటో ఇది. అంద‌రివీ కాక‌పోయినా 99శాతం మంది పేర్లు ఉన్నాయి.




వివ‌రాలు:
ముందు వరుసలో కూచున్న మహిళా కళాకారిణులు (ఎడమ నుంచి కుడికి) శ్రీమతులు ఎ. కమల కుమారి, వి. బి.కనక దుర్గ, శ్రీరంగం గోపాలరత్నం, ఎం. నాగరత్నమ్మ, వింజమూరి లక్ష్మి మరియు బి.టి.పద్మిని
కూచున్నవారు:శ్రీయుతులు అన్నవరపు రామస్వామి, ఆయన పక్కన ఎల్లా సోమన్న, వారిపక్కన ఓలేటి ఓలేటి వెంకటేశ్వర్లు , కందుకూరి రామభద్రరావు, ప్రయాగ నరసింహశాస్త్రి, జి వి కృష్ణారావు, రాచకొండ నృసింహ మూర్తి, ఎన్.సిహెచ్. కృష్ణమాచార్యులు.
కూర్చున్నవారి వెనుక నుంచున్నవారు : శ్రీయుతులు రామవరపు సుబ్బారావు,అన్నవరపు గోపాలం, ఎ.కుటుంబయ్య, దండమూడి రామమోహనరావు, బలిజేపల్లి రామకృష్ణశాస్త్రి,ఉషశ్రీ, ఎం.వాసుదేవమూర్తి, సి.రామమోహన రావు,జి.ఎం.రాధాకృష్ణ, సితార్ కనకారావు,చల్లపల్లి కృష్ణమూర్తి, చార్లెస్, సీతారాం
పూర్తిగా పైన నుంచున్నవారు : శ్రీయుతులు అల్లం కోటేశ్వర రావు, నండూరి సుబ్బారావు , దత్తాడ పాండురంగరాజు, సుందరంపల్లి సూర్యనారాయణ మూర్తి, ఎన్.సి వి. జగన్నాధాచార్యులు, ఎ.లింగరాజు శర్మ; ఎ.బి.ఆనంద్, మహమద్ ఖాసిం,ఆ తరువాతి వారు ఫ్లూట్ వై.సుబ్రహ్మణ్యం,.చివరివారు వై.సత్యనారాయణ

NotePhoto Courtesy : Shri KVS Subrahmanyam

(ఇంకా వుంది)

సినీ ప్రముఖులు - సాంఘిక బాధ్యత


‘కాదేదీ కవితకనర్హం’ మాదిరిగా ఈనాడు ప్రతి విషయమూ టీవీల్లో రోజుల తరబడి చర్చల కొనసాగింపుకు ముడి సరుకుగా మారుతోంది. అది ఇసుక  కావచ్చు, తెలుగు మాధ్యమం కావచ్చు,కులం కావచ్చు, మతం కావచ్చు, కులం కావచ్చు  మరేదైనా కావచ్చు. సినీ పరిశ్రమలోని  కొందరు  ప్రముఖులకు తెలుగే  రాదంటూ ఆ రంగానికే చెందిన మరో ప్రముఖుడి చేసిన  తాజా వ్యాఖ్య ఆ కోవలోనిదే. హైదరాబాదులో ఒక యువతి అత్యాచారానికి, హత్యకు గురైన నేపధ్యంలో తెలుగు సినీరంగ ప్రముఖులు చాలామంది తమ సామాజిక బాధ్యతగా భావించి ఆడపిల్లలకు అండగా నిలబడదాం అంటూ ధైర్యం  చెప్పే ప్రకటనలు టీవీల్లో వస్తున్న సమయంలోనే ఈ రకమైన చర్చకు తెర లేవడం కాకతాళీయం కావచ్చు. 
ఈ సందర్భంలో మహాకవి శ్రీశ్రీ రాసిన అనంతం గ్రంధంలో పేర్కొన్న ఒక విషయం జ్ఞాపకం వస్తోంది.
ఆ రోజుల్లో ‘సినిమా రచయితలు - సాంఘిక బాధ్యత’ అనే అంశంపై ఒక సదస్సు ఏర్పాటు చేసి సినీ ప్రముఖులను ఆహ్వానించారు.    
మహాకవి శ్రీశ్రీతో పాటు  మరో  ప్రసిద్ధ సినీ రచయిత  త్రిపురనేని మహారధికి ఈ సదస్సులో మాట్లాడే పనిపడింది. సమయాభావం కారణంగా కొంతమందికి ప్రసగించే అవకాశం లభించలేదు. మహారధి, శ్రీ శ్రీ పక్కపక్క కుర్చీలలో కూర్చుని వున్నప్పుడు  మహారధి శ్రీశ్రీతో ఇలా అన్నారు.
‘నాకు కనుక మాట్లాడే అవకాశమే వస్తే, నా ప్రసంగాన్ని ‘సినిమా రచయితలు అందరూ సాంఘిక బాధ్యతను  మరచిపోయిన తర్వాతనే సినిమారంగంలో ప్రవేశించారు’ అనే  వాక్యంతో మొదలు పెడతాను’.
మహారధి వ్యక్తపరచిన ఈ అభిప్రాయంతో శ్రీశ్రీ పూర్తిగా ఏకీవభించారు.
అయితే, ముందే అనుకున్నట్టు మహారధి గారికి    సదస్సులో ప్రసంగించే అవకాశం చిక్కనేలేదు.
ఈ విషయాన్ని శ్రీశ్రీ తన ఆత్మచరిత్రాత్మ చరిత్రాత్మక నవల, ‘అనంతం’ లో రాసుకున్నారు.
అనంతం నవల (?) కి ఈ  ‘ఆత్మచరిత్రాత్మ చరిత్రాత్మక నవల’  అనే ట్యాగ్ లైన్  ఎందుకు పెట్టారన్నది తెలియదు. పైగా ఆత్మకధ అని పెట్టరాదని శ్రీశ్రీ ఆంక్ష పెట్టారని శ్రీ చలసాని ప్రసాద్ ఆ పుస్తకం మలి ప్రచురణ ముందు మాటలోనే రాసారు.
       

రేడియో రోజులు- 32- భండారు శ్రీనివాసరావు


(Published in SURYA daily on 04-12-2019, Wdenesday)

ఏవిటో ఈయన పాటా అర్ధం కాదు, మాటా అర్ధం కాదుఅంటూ శంకరాభరణం సినిమాలో వీధి అరుగుమీద సంగీతం పాఠాలు చెబుతూ శంకర శాస్త్రి గారిని ఎద్దేవా చేస్తూ తనదయిన బాణీలో తెలుగు ప్రేక్షకులను ఆహ్లాదపరచిన పొట్టి (సంగీతం) మేష్టరు గుర్తున్నాడా. గుర్తుంచుకోని ప్రేక్షకుడంటూ వుండరు. ఎందుకంటే ఒకే ఒక చిన్న సన్నివేశంలో నటించి ప్రేక్షకులను  అంత గొప్పగా ఆకట్టుకున్న నటుడు కాబట్టి.
ఆ సినిమాకి, ఈ రేడియోకి ఏమిటి సంబంధం అంటే ఈ రేడియో శ్రీ గోపాలే ఆ సంబంధం. పొతే, పేరులో వున్న ఈ శ్రీ అనేది ఆయన పేరుకు ముందు గౌరవవాచకం కాదు, అసలు పేరులో భాగమే.
శ్రీ గోపాల్ తో నాకు పరిచయం వుంది. ఆయన ఎక్కడ వుంటే అక్కడ ఉత్సాహం వెల్లివిరిసేది. మాటల పోగు. పరిచయం అయిన వారందరూ ఆయనకు  స్నేహితులే. చొరవతో నలుగురిలో దూసుకుపోయే తత్వం. మాటల్లో హాస్యం చిప్పిల్లేది.
నా పేరు బుడుగు, అసలు పేరు చాలా పొడుగుఅని  ముళ్ళపూడి వారన్నట్టు శ్రీగోపాల్ అసలు పేరు కొంపెల్ల శ్రీ గోపాలకృష్ణమూర్తి. చేసే ఉద్యోగం ఒకటే అయినా ఆయన బహురూపి. రచయిత, కార్టూనిస్టు, ఫ్రీలాన్స్ జర్నలిస్టు. రంగస్థల, చలన చిత్ర నటుడు. ఇన్ని కోణాలు ఉన్న మనిషి కాబట్టే ఆ శరీరం త్వరగా అలసినట్టుంది. విశ్రాంతి కోరుకుంది. అందుకే, యాభయ్ ఏళ్ళు కూడా నిండకుండానే నలభయ్ ఎనిమిదో ఏటనే ఆయనకు నిండు నూరేళ్ళు నిండాయి.           
రేడియో పట్ల రేడియో కళాకారుల పట్లా స్వతహాగా అభిరుచి పెంచుకున్న శ్రీ గుర్రం మధుసూదన్ సేకరించి పెట్టుకున్న సమాచార భాండాగారంలో శ్రీ గోపాల్ వివరాలు కూడా వున్నాయి.
1938 జనవరి 20 వ తేదీన శ్రీ గోపాల్ కాకినాడలో జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మే పట్టా పొందారు. పట్టాతో పాటు స్వర్ణ పతకం సాధించారు. 1965 లో ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో ట్రాన్స్ మిషన్ ఎక్జిక్యూటివ్ (డ్యూటీ ఆఫీసర్) గా ఉద్యోగపర్వానికి శ్రీకారం చుట్టారు. అంతకుముందే విద్యార్ధి దశనుంచే రాజకీయ కార్టూన్లు వేయడం మొదలు పెట్టారు. ఆలిండియా రేడియో మద్రాసు, పోర్ట్ బ్లెయిర్(అండమాన్,నికోబార్) గోవా, విజయవాడ, కడప కేంద్రాలలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఆ రోజుల్లో కొత్తగా ప్రారంభించిన యువవాణి విభాగం అధిపతిగా రేడియో మాధ్యమం పట్ల అభిరుచి వున్న అనేకమంది యువతీ యువకులకు ప్రోత్సాహం కల్పించారు.  ఆకాశవాణి ఏటా నిర్వహించే పోటీల్లో నాలుగు సార్లు బహుమతులు అందుకున్నారు. ఎవరెస్ట్ విజేత టెన్సింగ్ నార్కే గురించి విక్రాంత గిరి శిఖరంపేరుతొ శ్రీ గోపాల్ సమర్పించిన రూపకానికి 1974 లో ప్రధమ బహుమతి లభించింది. గోదావరి నదిపై శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారి నిర్వహణలో కొండ నుండి కడలి దాకాఅనే పేరుతొ శ్రీగోపాల్ సమర్పించిన రూపకం ఆయనకు చక్కటి పేరు తెచ్చింది. అలాగే భగవాన్ రమణ మహర్షి పై ఆయన రూపొందించిన రూపకం రేడియో కార్యక్రమాలలో తలమానికంగా చెప్పుకుంటారు.
చలం నవల మార్తా ఆధారంగా పూర్ణ మానవుడు అనే పేరుతొ శ్రీ గోపాల్ సమర్పించిన రేడియో నాటకానికి వార్షిక పోటీల్లో బహుమతి లభించింది.
1979 లో ఢిల్లీలో జరిగిన ఇండో అమెరికన్  డ్రామా ప్రొడ్యూసర్ల సదస్సుకు అప్పటి ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీ గోపాల్ ప్రతినిధిగా ఎంపికయ్యారు.
జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన శంకరాభరణం చిత్రంలో సంగీతం మాష్టారు దాసుగా శ్రీ గోపాల్ పాత్రపోషణ ప్రేక్షకులకు చిరకాలం గుర్తువుంటుంది. ఆయన ఆ సినిమాలో ఆండాళ్ అనే పాపకు సంగీతం నేర్పుతూ, సంగీతం లో వేగం పెరిగిందని, బ్రోచే వారెవరు రా అంటూ ఆ  పాటను విరిచి, విరిచి పాడుతుండగా, శంకర శాస్త్రిగారు వచ్చి, ‘సంగీతాన్ని ఖూనీ చెయ్యొద్దు దాసూఅని హెచ్చరిస్తారు.
మంచుపల్లకి, స్వాతిముత్యం, ఆలాపన, తాయారమ్మ బంగారయ్య చిత్రాలలో కూడా ఆయన నటించారు.
1979 నుండి 82 వరకు హైదరాబాదు దూరదర్శన్ కేంద్రంలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా ఎన్నో కార్యక్రమాలు రూపొందించారు.
కడప ఆకాశవాణిలో పనిచేస్తూ అనారోగ్యంతో 1986 మే 18న హైదరాబాద్ లో శ్రీ గోపాల్ తుది శ్వాస విడిచారు.
(ఇంకా వుంది)



రేడియో రోజులు -31 - భండారు శ్రీనివాసరావు

(Published in SURYA daily  on 03-12-2019, Tuesday)

నిజానికి ఇక్కడ రేడియో రోజులు అంటే నేను రేడియోలో పనిచేసిన రోజులని కాదు. ఆ రోజుల్లో రేడియో అని. నాకన్నా ముందు పనిచేసిన వారి జ్ఞాపకాలు మరింత ఆసక్తిగా వుంటాయని వారిలో కొందరితో  ముచ్చటించినప్పుడు తెలిసింది. వాళ్లు వయస్సులో చాలా పెద్దవాళ్ళు కావడం మూలాన పేర్లూ తారీఖులూ సరిగా గుర్తురావడం లేదని వారే చెప్పారు. అంటే ఏదన్నా విషయం గురించి చెప్పినప్పుడు దాని స్తూల భావాన్ని మాత్రం తీసుకుని, మూలాల్లోకి, చర్చల్లోకి పోకుండా స్వీకరించలిగితే నాటి స్మృతులను ఆస్వాదించడానికి ఆస్కారం వుంటుంది. లేదా చదువరుల్లో ఎవరయినా నాటి సంఘటనలకు ప్రత్యక్ష సాక్షులు వుండి, తప్పొప్పులను సవరించగలిగితే  ఈ రచనకు సంపూర్ణత్వం, సాధికారికత సిద్ధిస్తుందని నా మనవి.
తోకచుక్క రాలినప్పుడు ఎవరో పెద్దవారికి కాలం మూడిందని నా చిన్నతనంలో చెప్పుకునేవారు. అలాగే తుమ్మెదలు వున్నట్టుండి గుంపులు గుంపులుగా కానరావడం, కప్పలు సంగీతం మొదలుపెట్టడం వాన రాకడకు  సూచనలుగా పేర్కొనేవారు.
ఈ సందర్భంలో చెప్పుకోవలసిన విషయం మరొకటి వుంది. రేడియోలో మామూలు కార్యక్రమాలు నిలిపేసి విషాద సంగీతం ప్రసారం చేస్తున్నారంటే ఎవరో జాతీయ నాయకుడు కన్నుమూశారని జనాలకు అర్ధం అయ్యేది.
మరణవార్తను ప్రసారం చేసేముందు రేడియో అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. విషయం తెలిసినా, అధికారికంగా నిర్ధారణ చేసుకోకుండా మరణ వార్తలను ప్రసారం చేయరు. అధికారిక నిర్ధారణ జరగడానికి జరిగే కాలయాపన కారణంగా అనేకసార్లు ఆ నిందను ఆకాశవాణి వారే మోసేవారు.
ఇంతకీ విషయానికివస్తే,
ఆ రోజు నిజాం నవాబు మరణించారు. ఆ వార్తను ధృవీకరించడానికి నిజాం కుటింబీకులే చాలా సమయం తీసుకున్నారు. కానీ చావుకబురు ఆగదు కదా. ఆ నోటా ఈ నోటా పడి కొందరికి తెలిసిపోయింది. యూ.ఎన్. ఐ. వార్తాసంస్థ మాత్రం  ధ్రువీకరణతో నిమిత్తం లేకుండానే ఆ  సమాచారాన్ని ప్రపంచానికి తెలిపింది. ప్రపంచం అంటే ఇక్కడ పత్రికలు. వార్తాసంస్థ పంపిన వార్త రాష్ట్రం వెలుపలి ప్రాంతాల్లోని పత్రికలకు తెలిసిపోయింది కాని ఇప్పట్లా త్వరితగతిన  సమాచారం  చేరవేతకు అవకాశం లేకపోవడంవల్ల దాని ప్రభావం హైదరాబాదులో అంతంత మాత్రమే అని చెప్పాలి. కానీ వార్త తెలిసిన రేడియో అధికారులు అప్రమత్తం అయ్యారు. రేడియో ట్రాన్స్ మిషన్ వ్యవధి పెంచడానికి నిర్ణయం తీసుకున్నారు. కానీ అధికారిక సమాచారం  అందేదాకా విషాద సంగీతం ప్రసారం విషయం పక్కనబెట్టారు. ఈలోగా ఉన్నతాధికారి ఒకరు రేడియో ప్రసార వ్యవధిని పొడిగిస్తున్నట్టు సిబ్బందికి తెలియ చెయ్యడానికి  స్టూడియోలోకి వెళ్లారు. గుమ్మం దగ్గర నిలబడి తలుపు ఓరగా తెరిచి సిబ్బందితో మాట్లాడుతున్నప్పుడు బయట నడవాలో వున్న వేరే సిబ్బంది నిజాం మరణంపై వినవస్తున్న వదంతులు గురించి పెద్దగా మాట్లాడుకోవడం కూడా ప్రసారం అయిపోయింది. అప్పటి హడావిడిలో దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కాని హైదరాబాదు నుంచి వెలువడే ఒక చిన్న పత్రికలో ఆ విషయం ప్రచురించారు. ఆ తర్వాత కూడా  జనంలో ఈ విషయం చర్చకు రాలేదుకానీ, పత్రికావార్తపై మాత్రం రేడియో అధికారులు స్పందించి విచారణ జరిపారు. సంబంధం వున్నవారికి సంజాయిషీ నోటీసులు ఇచ్చారు.
నిజానికి అంతగా బయటకు రాని విషయాలపై కూడా అధికారులు అంతటి జాగ్రత్త చూపేవారనడానికి ఇదొక దృష్టాంతం.

(ఇంకా వుంది)

30, నవంబర్ 2019, శనివారం

రేడియో రోజులు - 30 - భండారు శ్రీనివాసరావు


(Published in SURYA daily on 01-12-2019, SUNDAY)
వార్తలు చదువుతున్నది కందుకూరి సూర్యనారాయణ
కందుకూరి రామభద్రరావు గారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు అయినప్పటికీ ప్రవృత్తి రీత్యా కవి, పండితుడు, రచయిత. గోదావరీ తీర ప్రాంతంలో ప్రసిద్ధ కవులైన  దేవులపల్లి కృష్ణశాస్త్రి, వేదుల సత్యనారాయణ శాస్త్రి, కాటూరి వెంకటేశ్వరరావు మొదలైన భావకవులకు ఆయన సమకాలికులు. వీరందరూ కలిసి నవ్య సాహిత్య పరిషత్ పేరుతొ ఒక సంస్థని నడిపేవారు. కందుకూరి రామభద్రరావు గారు  కవిమాత్రమే కాదు, చక్కని వక్త కూడా. తదనంతర కాలంలో భారత రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ వంటి దిగ్గజాలు సయితం రామభద్రరావుగారి ప్రసంగ పాటవానికి పరవశులయ్యారని చెప్పుకునేవారు. రేడియో ద్వారా బహుళ ప్రాచుర్యం పొందిన ‘ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట – ఎంతపరిమళమోయి ఈ తోట పూలు’ అనే కవిత వీరి కలం నుంచి జాలువారినదే.  టీచరుగా పదవీ విరమణ పొందిన తర్వాత దాదాపు పది సంవత్సరాలకు పైగా విజయవాడ ఆకాశవాణిలో విద్యావిషయిక కార్యక్రమాల ప్రొడ్యూసరుగా కూడా అయన పనిచేశారు.   
ఈ రామభద్రరావుగారి పుత్రుడే ఈ వ్యాసానికి ప్రేరణ అయిన శ్రీ కందుకూరి సూర్యనారాయణ.
వీరిది రాజమండ్రి దగ్గర రాజవరం.


(శ్రీ  కందుకూరి  సూర్యనారాయణ)

సూర్యనారాయణ మద్రాసులో ఎమ్మే చేసారు. ఏడాది ఎదురు చూసినా సరైన ఉద్యోగం రాలేదు. అలా రోజులు దొర్లిస్తున్నప్పుడు, 1960 లో  ఆంధ్రజ్యోతి ఎడిటర్  నార్ల వెంకటేశ్వర రావు గారు, రామభద్రరావు గారిపట్ల ఉన్న మిత్రవాత్సల్యంతో, ఆయన కుమారుడు అయిన సూర్యనారాయణకు తమ పత్రికలో సబ్ ఎడిటర్ ఉద్యోగం ఇచ్చారు. విద్వాన్ విశ్వం అసిస్టెంట్ ఎడిటర్. నండూరి రామమోహన రావు సీనియర్ సబ్ ఎడిటర్, తుర్లపాటి కుటుంబరావు, ఎల్లోరా, వీరభద్రరావు  ఇతర సహోద్యోగులు.
అలా ఓ ఏడాది  గడిచిన తర్వాత, న్యూస్ రీడర్ ఉద్యోగాలకు  రేడియో వాళ్ళు ఇచ్చిన ఒక ప్రకటన చూసి దరఖాస్తు చేసారు. ఇంటర్వ్యూకు పిలుపు వచ్చింది. హైదరాబాదులో ఇంటర్వ్యూ. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు. సూర్యనారాయణగారిని ఢిల్లీలో న్యూస్ రీడర్ గా సెలక్ట్ చేసారు. అదే సమయంలో శ్రీ దుగ్గిరాల పూర్ణయ్య, శ్రీమతి జోళిపాల్యం మంగమ్మ గార్లను కూడా న్యూస్  రీడర్లుగా ఎంపిక చేశారు.
1962 లో ఢిల్లీ వెళ్లి ఆకాశవాణిలో తెలుగు న్యూస్ రీడర్ గా చేరిపోయారు. అప్పటికే అక్కడి తెలుగు వార్తావిభాగంలో శ్రీయుతులు పన్యాల రంగనాధరావు, కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, బుచ్చిరెడ్డి, తిరుమలశెట్టి శ్రీరాములు పనిచేస్తున్నారు. శ్రీమతి జోళిపాల్యం మంగమ్మ, మావిళ్ళపల్లి రాజ్యలక్ష్మి, దుగ్గిరాల పూర్ణయ్య, అద్దంకి మన్నార్, ఏడిద గోపాలరావు తరువాత చేరారు.    
1967 లో మాస్కో రేడియోలో పనిచేసే అవకాశం వచ్చింది.  సూర్యనారాయణ గారికి మాస్కో పోవాలని మనసులో పడింది.  కానీ ఆయనది రేడియోలో కాంట్రాక్టు ఉద్యోగం. స్టాఫ్ ఆర్టిస్ట్ కేటగిరీ. ప్రభుత్వ కొలువు కాదు. మాస్కో పంపడానికి రేడియోవారికి ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఇక్కడి ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళాలి. మంచి ఉద్యోగం. ఎందుకు పోగొట్టుకోవాలి అని హితైషులు సలహా చెప్పారు. ఉన్న ఉద్యోగం వదులుకోవాలి అనే షరతు నచ్చని కందుకూరివారు ఆ ఆఫర్  తిరస్కరించారు. దాంతో ఆఫీసు వారే దిగివచ్చి, మూడేళ్ళ లోపు తిరిగొస్తే ఉద్యోగం ఉంటుందని హామీ ఇవ్వడంతో ఆయన మాస్కో ప్రయాణానికి అవరోధం తొలిగి పోయింది.
1967 లో మాస్కో వెళ్ళారు. ప్రాస్పెక్ట్ మీరా ప్రాంతంలో అపార్ట్ మెంటు ఇచ్చారు. కొన్నాళ్ళ తరువాత  కుటుంబాన్ని పిలిపించుకున్నారు. అలా మాస్కో రేడియోలో తెలుగు ప్రసారాలను ఆయన మొట్ట మొదటిసారి ప్రారంభించారు. (ఇక్కడ ఓ స్వవిషయం ప్రస్తావించడం సముచితంగా వుంటుంది. సూర్యనారాయణ గారు మొదటి సారి మాస్కో నుంచి, రేడియో మాస్కో ద్వారా  తెలుగులో వార్తలు చదవడం ప్రారంభిస్తే, 1991 లో నేను అదే మాస్కో నుంచి అదే రేడియో మాస్కో ద్వారా చిట్టచివరిసారి తెలుగు వార్తలు చదివి అక్కడి తెలుగు ప్రసారాలకు మంగళం పాడాను. మా ఇద్దరి నడుమ తిరుమలశెట్టి శ్రీరాములు, అద్దంకి మన్నార్, ఏడిద గోపాలరావు గార్లు రేడియో  మాస్కోలో పనిచేశారు.)
రెండేళ్ళ పదవీ కాలం ముగిసిన తరువాత సూర్యనారాయణ గారి పనితీరు నచ్చి మరో ఏడాది పొడిగించారు. అలా మొత్తం మీద దాదాపు మూడున్నరేళ్ళు మాస్కోలో గడిపి, 1970 లో ఢిల్లీ తిరిగివచ్చారు.
ఆశ్చర్యం. ఢిల్లీ రేడియోలో ఉద్యోగం సిద్ధంగా వుంది. వెంటనే చేరిపోయారు. కానీ తరువాత తెలిసిందేమిటంటే ఉద్యోగం అయితే ఇచ్చారు కానీ ఆయన సీనియారిటీ కోల్పోయారు. 1995 లో రిటైర్ అయ్యారు. ఢిల్లీలోనే సెటిల్ అయ్యారు. భార్య శ్రీమతి కందుకూరి మహాలక్ష్మి. మంచి రచయిత్రి. నాలుగు కధా సంపుటాలు వెలువారించారు.
‘మీ రేడియో జీవితంలో ఏదైనా ఆసక్తికరమైన సంఘటన జరిగిందా?’
ఫోనులో గంటకుపైగా హైదరాబాదు నుంచి కందుకూరి సూర్యనారాయణ గారితో మాట్లాడిన తర్వాత నేను అడిగిన ప్రశ్న.  
‘మీరూ రేడియోలో పనిచేసారు కదా! మీకు తెలియంది కాదు. జనరల్ న్యూస్ రూమ్ లో అనేక భారతీయ భాషా విభాగాలు వుంటాయి. అన్నింటికీ కలిపి ఉమ్మడిగా బులెటిన్ తయారు చేసి వివిధ విభాగాలకు పంపిస్తారు. మనం కొత్తగా కలపడం కానీ, లేదా ఉన్నది తీసివేయడం కానీ జరగడానికి వీల్లేదు. ఒకసారి  ఢిల్లీ తెలుగు అకాడమీ నాగరాజు నలుగురితో పాటు నన్నూ పిలిచి సత్కరించారు. నాతొ పాటు వివిధ రంగాలకు చెందిన తెలుగు ప్రముఖులు కూడా పురస్కారాలు స్వీకరించారు. రేడియో తెలుగు వార్తల్లో చెప్పడానికి అధికారులు అభ్యంతర పెట్టారు. చివరికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన సంస్థ పేరు లేకుండా తెలుగు వార్తల్లో చివరన చేర్చడానికి వారిని ఒప్పించేందుకు  చాలా కష్టపడాల్సి వచ్చింది.
‘సరే! మీరు అడిగారు కాబట్టి ఒక సంగతి చెబుతాను. అరవైలలో కాబోలు గోవధను నిషేధించాలని కోరుతూ సాధువులు పార్లమెంటు భవనాన్ని ముట్టడించారు. పార్లమెంటు భవనానికి దగ్గరగా వుండడం వల్ల రేడియో స్టేషన్ నుంచి ఇంటికి పోయే వీలు లేదు. ఇంటి నుంచి ఆఫీసుకు వచ్చే అవకాశం లేదు. దాంతో రెండ్రోజులు ఆఫీసులోనే వుండిపోవాల్సి వచ్చింది. అక్కడే పడక, అక్కడే భోజనాలు’ 
80 ఏళ్ళ వయస్సులో కూడా ఆయన స్వరం స్పుటంగా వుంది. అంతసేపు మాట్లాడినా అలసట కనబడలేదు. స్వరాన్ని వరంగా పొందిన ధన్యుల్లో ఆయన ఒకరు.
అందుకే రేడియో వార్తలు చదివే రోజుల్లో కందుకూరివారికి అంతమంది అభిమానులు.
(ఇంకా వుంది)
  
            

తొంభయ్ ఏళ్ళు వచ్చినా ఆ ముసలితనపు ఛాయలు కనబడకుండా ఉండాలంటే.....


(అమెరికాలోని, ఒహియో రాష్ట్రం, క్లీవ్ లాండ్ కు చెందిన రెగీనా బ్రెట్ అనే రచయిత్రి  ఏర్చి కూర్చిన హితోక్తులు)
“జీవితం మనం అనుకునేటంత చెడ్డదీ కాదు, మనం ఊహించుకునేటంతటి చెడ్డదీ కాదు.
“ఏదైనా సందేహం కలిగినప్పుడు అక్కడే ఆగిపోండి. తర్వాత నెమ్మదిగా మరో చిన్న ఆడుగు  వేయండి
“నిండు నూరేళ్ళ జీవితం అంటారు కానీ, చూస్తుండగానే కరిగిపోయి ఇంత చిన్నదా  అనిపిస్తుంది. అంచేత ఉన్న  కాస్త సమయాన్ని ఇతరులను  ఆడిపోసుకోవడానికో, వాళ్ళ మీద ద్వేషం పెంచుకోవడానికో వృధా చేసుకోకండి.
“ఉన్నట్టుండి పడకేస్తే మనల్ని ఆదుకునేది, కనిపెట్టుకు చూసుకునేది మన చుట్టపక్కాలు, మన స్నేహితులే అని మరచి పోకండి.
“చేసే ప్రతి వాదనలో మనదే పై చేయి కావాలని భీష్మించుకోకండి. కాస్త పట్టూ విడుపూ ప్రదర్శించండి.
“దుఖం కలిగితే ఒంటరిగా ఏడవకండి.  ఎవరో ఒకరితో మీ బాధను పంచుకోండి.
“దేవుడి మీద కోపం వస్తే దాన్ని ఆయన మీద చూపండి. ఆయనకి ఇలాటివి కొత్తేమీ కాదు.  
“గతంతో రాజీ పడి, పాత వాటిని మరచిపోతే, ఆ అనుభవాలు భవిష్యత్తులో శాంతిని కలిగిస్తాయి.
“ఇతరులతో మనల్ని పోల్చి చూసుకోవడం అంటే మన మనశ్శా౦తిని మనమే చేతులారా పోగొట్టుకున్నట్టే”
“ప్రపంచంలో ప్రతిదీ కనురెప్పపాటులో మారిపోతుంటుంది. భయం లేదు. ఆ భగవంతుడికి మనలా కనుగీటడం  తెలియదు.
“నువ్వు తప్ప  నీ ఆనందాన్ని ఎవరూ దూరం చేయలేరు.
“అన్నీ మరచిపోయి అందర్నీ క్షమించండి.
“మీ గురించి  బయటవాళ్ళు ఏమనుకుంటున్నారనేది మీకు అస్సలు సంబంధం లేని విషయం.
“అన్ని బాధలను, అన్ని వేదనలను, అన్ని గాయాలను నయం చేసే శక్తి కాలానికి ఒక్కదానికే వుంది. దానికి కొంత  వ్యవధానం ఇవ్వండి.
“అద్భుతాలను ఆస్వాదించండి.        
“ప్రతి రోజూ అలా కాసేపు బాహ్య ప్రపంచంలోకి వెళ్లి చూడండి. మీరు ఊహించని అద్భుతాలు మీ కళ్ళబడతాయి.
“అసూయ పడితే ప్రయోజనం వుండదు. శుద్ధ టైం వేస్టు. మీకు కావాల్సినవి, మీరు కోరుకున్నవీ మీచెంతనే  వున్నాయి. ఆ సంతృప్తి ఒక్కటే అసూయని మీకు దూరం చేస్తుంది”


రేడియో రోజులు - 29 - భండారు శ్రీనివాసరావు


(Published  in SURYA daily on 30-11-2019, Saturday)

'జ్ఞానపీఠ్' అవార్డ్ గ్రహీత రావూరి భరద్వాజ అసలు పేరు

నేను రేడియోలో చేరిన రోజుల్లో తెల్లని ధోవతి, లాల్చీ  ధరించి, చేతిలో కొన్ని కాగితాలతో ఒక పెద్దాయన రేడియో ఆవరణలో కనిపించేవారు. వెంకట్రామయ్య గారు కాబోలు ఓసారి ఆయన్ని నాకు పరిచయం చేశారు. ఆయనే  రావూరి భరద్వాజ.
నా చిన్నతనంలోనే ఆయన రాసిన 'పాకుడురాళ్ళు' నవల సీరియల్ గా వచ్చేది. ఆ నవల ఆకర్షణకు గురయిన అనేక వేలాదిమందిలో నేనొకడిని. సాక్షాత్తు ఆ నవలా రచయిత పనిచేస్తున్న రేడియోలోనే నేనూ పనిచేస్తున్నాను అనే ఎరుక నాకు చాలా ఆనందాన్ని కలిగించేది. తర్వాత నేను ఎక్కడ కనబడినా ‘ఏమయ్యా శ్రీనివాసూ! ఎలా వున్నావు’ అని ఆప్యాయంగా పలకరించేవారు.
నేను చదువుకునే రోజుల్లో చదివిన ఈ పాకుడు రాళ్ళు నవలకే తదనంతర కాలంలో 'జ్ఞానపీఠ్' అవార్డ్ లభించింది. ఈ అవార్డు  ఆయన స్థాయికి చిన్నదని చెప్పను కాని ఆలస్యంగా వచ్చిందని మాత్రం చెప్పగలను. ఎంత ఆలస్యం జరిగిందంటే అది స్వీకరించిన కొద్దిరోజుల్లోనే ఆయన మరణించడమే అందుకు తార్కాణం.
భరద్వాజ గారు రేడియో మీడియంను ఆపోశన పట్టారేమో అనిపిస్తుంది. స్పోకెన్ వర్డ్ కార్యక్రమానికి ఆయన ఆధ్వర్యం వహించేవారు. రేడియోలో మాట్లాడినట్టు వుండాలి కానీ, కాగితం చూసి చదివినట్టు వుండకూడదు అనేవారు. స్క్రిప్ట్ రాసుకుని స్టుడియోలోకి వెళ్ళి చదివినా ఏదో కబుర్లు చెబుతున్నట్టు వుండేది. స్క్రిప్ట్ ఆ విధంగా తయారు చేసుకోవడం కూడా ఒక కళ. ప్రముఖుల ప్రసంగాలను రికార్డు చేసేటప్పుడు కూడా వారి రాత ప్రతిని తేలిగ్గా చదవడానికి వీలుగా సవరించేవారు.
రావూరి భరద్వాజ గారు  ఇంత పొడవు గడ్డం  పెంచనప్పుడే కాదు అసలు గడ్డం ఏదీ లేనప్పుడు కూడా నాకు తెలుసు. నేను రేడియోలో పనిచేస్తున్నప్పుడు,  విలక్షణ వ్యక్తిత్వం కలిగిన ఈ మహా రచయితతో సన్నిహిత పరిచయం వుండేది.  
భార్య చనిపోయిన తర్వాత అనుకుంటాను ఆమెను గుర్తు చేసుకుంటూ  కాంతం కధలు రాశారు. ఆ వియోగభారంతోనే కాబోలు రావూరి భరద్వాజ గారు గడ్డం మీసాలు పెంచడం మొదలుపెట్టారంటారు.
జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికయిన రావూరు భరద్వాజ, పూర్వాశ్రమంలో రావూరు శరభాచారి.
ఆయన గురించిన  మరో చిన్న జ్ఞాపకం:
మొగ్గ తొడిగిన ఎర్ర గులాబి అనే పేరుతొ తెలుగులో భరద్వాజ అనువదించిన ఈ పుస్తకం వెనుక చిన్నకధ చెప్పుకోవడం నాకు తెలుసు. రాజకీయ నాయకుల్లో నెహ్రూ ఒక్కరినే అమితంగా అభిమానించే సుప్రసిద్ధ జర్నలిస్టు కేఏ అబ్బాస్, నెహ్రూ అనంతరం ఆయన బిడ్డ ఇందిర ప్రధాని కాగానే 'Return of the RED ROSE' అనే పేరుతొ ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని 'మొగ్గ తొడిగిన ఎర్రగులాబి' పేరుతొ శ్రీ రావూరి భరద్వాజ తెనిగించారు.
ఒకసారి  శ్రీమతి గాంధి హైదరాబాదు వచ్చినప్పుడు, అప్పుడు రేడియోలో పనిచేస్తున్న భరద్వాజగారే స్వయంగా తాను అనువదించిన ఈ పుస్తకాన్ని శ్రీమతి ఇందిరాగాంధీకి బహుకరించారు. ఆవిడ అంతకుముందు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా వున్నప్పుడు రేడియోలో (అప్పటికి దూరదర్శన్ లేదు) పనిచేస్తున్న స్టాఫ్ ఆర్టిస్టుల ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగాలతో సరిసమానం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రేడియోలో స్టాఫ్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న భరద్వాజ గారు ఆమె చేసిన ఈ మేలుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ పుస్తకాన్ని ఆమెకు అందచేసారు.
తన మేలైన జ్ఞాపకాలను మనకు వొదిలేసి రావూరి భరద్వాజగారు 2013 లో  హైదరాబాదులో స్వల్ప అస్వస్థత అనంతరం  కన్నుమూశారు.