7, నవంబర్ 2019, గురువారం

రేడియో రోజులు – 9 – భండారు శ్రీనివాసరావు



(Published in SURYA telugu daily on 07-11-2019, Thursday)
రేడియో  విలేకరిగా పనిచేసిన రోజుల్లో ఒక్క పాలక పక్ష నేతలతోనే కాకుండా ప్రతిపక్షంలో వున్న నాయకులతో కూడా సంబంధ బాంధవ్యాలు బాగానే ఉండేవి.
నేను హైదరాబాదులో రేడియో విలేకరిగా చేరినప్పుడు నాకు బాగా తెలిసిన రాజకీయ నాయకుడు అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు. 1978 ఎన్నికల్లో గెలిచి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన యువ నాయకులు మరో ఇద్దరితో కూడా నాకు బాగా పరిచయం వుండేది. ఒకరు శ్రీ వై.ఎస్. రాజశేఖరరెడ్డి కాగా రెండో నాయకుడు శ్రీ నారా చంద్రబాబునాయుడు. పైగా ఆ రోజుల్లో  వీరిద్దరూ జిగ్రీ దోస్తులు. ఒక మంచం, ఒక కంచం అంటారే అలా అంత స్నేహం వారి మధ్య. నాలాగే ఆ కాలంలో పనిచేసిన విలేకరులందరికీ ఈ విషయం తెలుసు.
ఆ రోజుల్లో సీనియర్ పాత్రికేయులందరూ వయసులో, అనుభవంలో చాలా పెద్ద వారు. వాళ్ళ ఆహార్యం కూడా పెద్దరికంగా వుండేది. కొందరు పంచెలు, లాల్చీలు ధరిస్తే కొందరు సూటూ బూటుతో కనబడేవారు. కొత్తగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఈ ఇద్దరేమో యువకులు.  బహుశా అదొక కారణం అయుంటుంది ప్యాంటూ చొక్కా వేసుకుని తిరుగుతున్న నాలాంటి విలేకరులతో మాటామంతీ కలపడానికి.
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి ఉవ్వెత్తున ప్రచారం చేస్తూ, కాంగ్రెస్ ను అనుదినం దుమ్మెత్తిపోస్తూ వున్నప్పుడు కూడా చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి పోలేదు. పైగా అవకాశం లభిస్తే మామగారి (ఎన్టీఆర్) పైనే పోటీ చేస్తానని విలేకరుల సమావేశంలో చేసిన ప్రకటనను ఆయన చాంబర్ నుంచే నేను రేడియోకి ఫోన్ చేసి చెప్పడం, అది వెనువెంటనే వార్తల్లో రావడం జరిగిగింది. ఎన్టీఆర్ పార్టీ  పెట్టిన తొమ్మిది మాసాల్లోనే కాంగ్రెస్ నుంచి అధికారం కైవసం చేసుకున్న కొన్నాళ్ళ వరకు వై.ఎస్. బాబుల  స్నేహం కొత్త చిగుళ్ళు వేస్తూనే వుంది. తదనంతర కాలంలో చంద్రబాబు టీడీపీ తీర్ధం పుచ్చుకున్న తరువాత వారి దారులూ వేరయ్యాయి, పార్టీలూ  వేరయ్యాయి. దాంతో  సహజంగానే ఆ నాటివరకు వారి నడుమ వెల్లివిరిసిన  స్నేహం వసివాడిపోయింది. వారితో నా పరిచయం కూడా విడివిడిగా కొనసాగింది.
ఇతర పార్టీల్లో కూడా నాకు మంచి పరిచయం వున్న నాయకులు అనేకమంది వుండేవారు. ఆ పరిచయాలు మరింత బలపడడానికి కూడా ప్రధాన కారణం నాకున్న రేడియో విలేకరి అనే ట్యాగ్ లైన్.
శాసనసభలో సీపీఎం నాయకుడిగా ఖమ్మం జిల్లాకు చెందిన బోడేపూడి వెంకటేశ్వర రావు గారు వ్యవహరించేవారు. ఆకారంలోనూ, ఆహార్యంలోను నిజంగా పెద్దమనిషి. ఆ రోజుల్లో అంటే రేడియో ఏకచ్ఛత్రాధిపత్యం సాగిపోతున్న కాలంలో అసెంబ్లీ జరిగే రోజుల్లో ప్రతిరోజూ సభాకార్యక్రమాలపై అదే రోజు రాత్రి రేడియోలో ఒక సమీక్షాకార్యక్రమం ప్రసారం చేసేవాళ్ళం. హైదరాబాదులోని పాత, కొత్త  ఎమ్మెల్యే హాస్టళ్ళలో ప్రత్యేకంగా మైకులు పెట్టి వినిపించేవాళ్ళు. అసెంబ్లీ ముగిసిన తర్వాత హాస్టళ్ళలో చాలామంది శాసన సభ్యులు, ఇతరులు గుమికూడి  ఈ కార్యక్రమం ఆసక్తిగా వినేవాళ్ళు. తమ తమ నియోజక వర్గాల సమస్యలు గురించి తాము సభలో  లేవనెత్తిన విషయాలు తమ ప్రాంతం  వారికి వెనువెంటనే తెలుస్తాయని వారి అభిప్రాయం. అయితే ఈ సమీక్షలను రేడియోలో పనిచేసే మేము కాకుండా పత్రికలలో పనిచేస్తూ అసెంబ్లీ కార్యక్రమాలు రిపోర్ట్ చేసే విలేకరుల చేత  రాయించేవాళ్ళం. అలా అయితే నిష్పాక్షికంగా సమీక్షించే అవకాశం ఉంటుందన్నది రేడియో అధికారుల భావన.  వాటిలో ఏదైనా తప్పులు దొర్లాయా అనేది పర్యవేక్షించడం వరకు మాత్రమే వార్తావిభాగం బాధ్యత. ఒకసారి బోడేపూడి వారు ఏదో అంశంపై సభలో మాట్లాడారు. అందుకు విరుద్ధంగా రేడియో సమీక్షలో ప్రసారం అయిందని వారికి ధర్మాగ్రహం కలిగింది. వెంటనే రేడియో స్టేషన్ అధికారులకు అసెంబ్లీ నుంచి తాఖీదు వచ్చింది. ఏదైనా తభావతు జరిగిందని స్పీకర్ భావిస్తే రేడియో స్టేషన్ డైరెక్టర్ అసెంబ్లీకి హాజరై క్షమాపణ చెప్పాలి. (ఇప్పుడు ఈ నిబంధనలు వున్నాయో లేదో తెలియదు. వున్నా పాటిస్తున్నారో లేదో తెలియదు)
ఇది తెలియగానే నేను  అసెంబ్లీ ఆవరణలో బోడేపూడివారిని కలిసి విషయం చెప్పి పొరబాటు ఎలా జరిగిందో చెప్పాను. ఆయన సంతుష్టపడ్డారు. అంతేకాదు, తన పిర్యాదును ఉపసంహరించుకున్నట్టు స్పీకరుకు లేఖ రాసి ఆ ప్రతిని స్వయంగా తీసుకుని వచ్చి మా స్టేషన్ డైరెక్టర్ కు అందచేశారు. అది వారి మంచితనం, అది వారి హుందాతనం.
(ఇంకా వుంది)

6, నవంబర్ 2019, బుధవారం

రేడియో రోజులు – 8 - భండారు శ్రీనివాసరావు


(Published in SURYA telugu daily on 06-11-2019, Wednesday, Today)

అంజయ్య తర్వాత ముఖ్యమంత్రి అయిన శ్రీ భవనం వెంకట్రాం అతి సౌమ్యులు. శాసన మండలి సభ్యుడిగా, ముఖ్యమంత్రిగా భవనంతో సన్నిహిత పరిచయంలేని విలేకరి అంటూ ఆ రోజుల్లో ఎవరూ వుండేవారు కాదు. ముఖ్యమంత్రిగా పదవిని స్వీకరించిన తొలిరోజుల్లోనే ఆయన తన పేరు లోని రెడ్డి అనే రెండు అక్షరాలను తొలగించుకున్నట్టు అధికారికంగా ప్రకటన చేయడం విశేషం. ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయన స్వయంగా కారు నడుపుకుంటూ ఆనాటి సీనియర్ పాత్రికేయుడు, తన స్నేహితుడు అయిన  శ్రీ నరిసెట్టి ఇన్నయ్య ఇంటికి వెళ్లి భోజనం చేయడం నాకు తెలుసు. చాలా నిరాడంబరంగా వుండేవారు. ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఆయన తనకు మంత్రిగా కేటాయించిన క్వార్టర్ లోనే వుండేవారు. ఆయన్ని కలవాలంటే ఎలాంటి అడ్డంకులు ఉండేవి కావు. విలేకరులకు విందు భోజనాలు ఏర్పాటుచేయడం శ్రీ వెంకట్రాం కు ఓ సరదా. ఒకసారి గండిపేటలో విందు ఏర్పాటు చేసి విలేకరులను బస్సులో తీసుకుపోయారు. కానీ ఆయన ఎక్కువ కాలం ఆ పదవిలో కొనసాగలేదు.
దానికి  కాంగ్రెస్ పార్టీలోని అంతఃకలహాలు  కావచ్చు, ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీ నుంచి ఎదురవుతున్న పెను సవాలు కావచ్చు,  శ్రీ భవనం వెంకట్రాం కొద్ది కాలంలోనే పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 
తరువాత ముఖ్యమంత్రి అయిన శ్రీ కోట్ల విజయభాస్కర రెడ్డి చాలా కొద్ది కాలం మాత్రమే ఆ పదవిలో వున్నారు. అంటే కేవలం నాలుగు నెలలు మాత్రమే ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఈలోగా ఎన్నికలు రావడం, ఎన్టీఆర్ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పడ్డ తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేసి అధికారాన్ని కైవసం చేసుకోవడం జరిగిపోయాయి.
శ్రీ విజయ భాస్కర రెడ్డి రూపంలోనూ, వ్యవహారంలోనూ మేఘ గంభీరుడు. నిజాయితీకి నిలువుటద్దం. కానీ ఎన్టీఆర్ వేవ్ లో ఈ మంచి లక్షణాలు ఏవీ పనిచేయలేదు. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఏర్పడ్డ ఏహ్యభావాన్ని ఆయన చెరిపేయలేకపోయారు. ఓ పక్క ఫలితాలు వస్తున్నాయి.  మెజారిటీ స్థానాల్లో టీడీపీకి స్పష్టమైన ఆధిక్యత కనబడుతోంది. ముఖ్యమంత్రి స్పందన కోసం విలేకరులు ఆయన అధికార నివాసానికి వెడితే ఆయన ఏ మాత్రం తొణుకూబెణుకూ లేకుండా తమ పార్టీ విజయం పట్ల విశ్వాసం వ్యక్తం చేయడం విస్మయం అనిపించింది.
సరే! పొలోమని బేగంపేట నుంచి ఆబిడ్స్ లో ఉన్న రామారావు గారింటికి వెళ్ళాము. అక్కడ పరిస్తితి మరింత విచిత్రం అనిపించింది. తెలుగుదేశం గెలుస్తోందని ఉప్పండడంతో ఊరంతా పార్టీ శ్రేణులు టపాసులు పేల్చి సంబరాలు చేసుకుంటూ వుంటే ఎన్టీఆర్ మాత్రం పెందలాడే నిదురించే తన అలవాటు ప్రకారం నిద్రకు ఉపక్రమించారు.
రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత  శ్రీ విజయభాస్కర రెడ్డి తిరిగి కేంద్ర మంత్రిగా నియమితులయ్యారు. వారం వారం హైదరాబాదు వచ్చి తమ వూరు వెడుతుండేవారు. కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి శ్రీ రాం భూపాల్ చౌదరి ఒకసారి పొద్దున్నే ఆయన దగ్గరికి వెడుతూ ఎందుకో జ్వాలాని, నన్నూ వెంటబెట్టుకు వెళ్ళారు. ఎలాగో వెళ్ళాము కనుక, అందులోను కేంద్ర మంత్రి కనుక రేడియోకి ఏదైనా వార్త ఇస్తారా అని అడిగాను. ఆయన ఏదో కేంద్ర పధకం గురించి చెప్పారు. నేను అక్కడినుంచే విజయవాడ వార్తావిభాగానికి ఫోను చేసి న్యూస్ ఎడిటర్ శ్రీ ఆర్వీవీ కి  చెప్పాను. ఈ వార్త ఎప్పుడు, సాయంత్రం వస్తుందా అని అడిగితే, కాదు ఇప్పుడు ఆరూ నలభయ్ అయిదు ప్రాంతీయ వార్తల్లో వస్తుందన్నాను. ఇప్పుడే కదా చెప్పింది అప్పుడే ఎలా వస్తుంది అనుకుంటూ పనివాడ్ చేత రేడియో తెప్పించారు. మేము అక్కడ ఉండగానే వార్తలు మొదలయ్యాయి. మొదటి  హెడ్ లైన్ ఆ వార్తతోనే మొదలయింది. ఆయన ఆసక్తిగా విని థాంక్స్ చెప్పడం సంతోషం అనిపించింది.
(ఇంకా వుంది)

5, నవంబర్ 2019, మంగళవారం

రేడియో రోజులు – 7 - భండారు శ్రీనివాస రావు

(Published in SURYA telugu daily on 05-11-2019, Tuesday)

ఆరోజు మంత్రి వర్గం సమావేశమౌతోంది. మధ్యాహ్నం పన్నెండు తర్వాత ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడతారని కబురొచ్చింది. అందరం బిలబిలమంటూ సచివాలయంలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌కు చేరుకున్నాం. విలేకరులు, అధికారులతో సమావేశాలు నిర్వహించేందుకు ఆ ఛాంబర్‌ ప్రక్కనే ఒక చిన్న హాలు ఉండేది.
ఓ అరగంట తర్వాత అప్పటి ముఖ్యమంత్రి శ్రీ అంజయ్య ఆ హాల్లోకి వచ్చారు. విలేకరులందరినీ పేరుపేరునా పలకరిస్తూ మామూలు కబుర్లలో పడిపోయారు. మధ్యమధ్యలో ఏం మొయిన్‌ ! (మొయినుద్దీన్‌ - ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి) అందరికీ అన్నీ (కాఫీ టిఫిన్లు) అందాయా? అని వాకబు చేస్తున్నారు. అప్పటికి దాదాపు ఒంటిగంట కావస్తుండడంతో చివర్లోకూర్చున్న నాలో అసహనం పెరిగిపోతోంది. మరో పదిమిషాల్లో మధ్యాహ్నం ప్రాంతీయ వార్తలు మొదలవుతాయి. ఈ బులెటిన్‌ తప్పిపోతే మళ్లీ సాయంత్రందాకా దిక్కులేదు. కానీ అంజయ్యగారి కబుర్లు ఒక పట్టాన తేలేలా కనిపించడంలేదు. చివరికి ఏదయితే అదే అయిందని లేచి ఆయన దగ్గరకు వెళ్లాను. వార్తల టైమ్‌ అవుతోందని చెప్పేసి, ఏం చెప్పదల్చుకున్నారో ఒక్క ముక్కలో చెప్పండని కోరాను. దానికాయన పెద్దగా నవ్వేస్తూ `చెప్పడానికేముంది!  మంత్రులందరూ (రాజీనామాలు) ఇచ్చేశారు' అని సైగలతో చెప్పేశారు. నేను రయ్‌ మంటూ బయటకు పరుగెత్తి,  ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రేడియోకి ఫోన్‌ చేసి మంత్రుల రాజీనామా వార్తని అందించాను.
ఇదంతా ఎందుకు చెప్పాల్సివస్తోందంటే,  విలేకరులు వార్తలను అందించే తొందర్లో ఎలా తప్పుల్ని తొక్కుతారో అన్నది తెలియ చెప్పడానికే.  ఇందుకు నేనూ మినహాయింపు కాదని చెప్పడానికే.
అంజయ్యగారి మంత్రి వర్గాన్ని `జంబోక్యాబినెట్‌' అని ఎద్దేవా చేసేవారు. అరవైమంది మంత్రులేమిటి, విడ్డూరం కాకపోతే అనేవారు. కార్టూన్ల సంగతి సరేసరి. అయినా, ప్రతిదీ తేలిగ్గా తీసుకునే తత్వం ఆయనది. యాదగిరి (హెలికాప్టర్‌)తో తనను ముడిపెట్టి ఒక దినపత్రికలో ప్రచురించే వ్యంగ్య చిత్రాలను కూడా  నవ్వుతూ  ఆస్వాదించే మనస్తత్వం ఆయనది.
`వెనకటి రోజుల్లో జిల్లాకు ఒకే ఒక్క అయ్యేఎస్‌ ఆఫీసర్‌ (జిల్లాకలెక్టర్‌) ఉండేవాడు. ఇప్పుడో,  ఇద్దరు ముగ్గురు అలాంటి అధికార్లు జిల్లాల్లో పనిచేస్తున్నారు. అలాంటప్పుడు జిల్లాకు ఇద్దరు మంత్రులు వుంటే తప్పేంటి `శ్రీనివాసూ' అనేవారు ఆంతరంగిక సంభాషణల్లో.
ఇక వార్తల్ని అందించడంలో తొందరపాటు విషయానికి వస్తే ఆ రోజు నేను హడావిడిలో అరవైమంది మంత్రులు రాజీనామా చేశారని చెప్పాను. రేడియోలో కూడా అలాగే ప్రసారమైంది. నిజానికి ముఖ్యమంత్రితో కలిపి మంత్రివర్గంలో సభ్యులసంఖ్య అరవై. 59 మంది మంత్రులే ఆరోజు రాజీనామా చేశారు. సాయంత్రం వార్తల్లో ఈ తప్పు సవరించుకున్నామనుకోండి. ఇలాంటి పొరపాట్లే మరికొన్ని తరహా వార్తల విషయంలో జరిగితేనే వస్తుంది చిక్కంతా.
శ్రీమతి ఇందిరాగాంధీని హత్యచేసినప్పుడు చాల సేపటివరకూ రేడియో ఆ వార్తని వెల్లడించలేదు. ఆవిడ మరణవార్తని జాతికి తెలియచెయ్యడంలో తాత్సారం జరిగిందని దరిమిలా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధానిపై కాల్పులు జరిగాయన్న వార్త బయటకు పొక్కింది కానీ అసలేం జరిగిందన్న దానిపై అందరికీ తీరని సందేహాలే. చివరికి రాజీవ్‌ గాంధీ కూడా శ్రీమతి ఇందిరా గాంధీ మరణం గురించి బీ బీ సీ వార్తలు విని ధృవపరుచుకున్నారు.
 ఆమెపై కాల్పులు జరిపిన అంగరక్షకుల్లో ఒక సిక్కు మతస్తుడు ఉన్నాడన్న సంగతిని రేడియో వార్తల్లో ముందు వెల్లడించలేదు. అందువల్ల, అప్పటివరకూ అందరి మనసుల్లో ఆందోళన, అలజడి తప్పిస్తే అంతా ప్రశాంతమే. కానీ కాల్పులు జరిపిన అంగరక్షకుల్లో ఒకడిపేరు `బియాంత్‌ సింగ్‌' అన్న విషయం వెల్లడి కాగానే ఒక్కసారిగా అంతా తారుమారయింది. పరిస్థితులు వర్ణించలేనంత భీభత్సంగా పరిణమించాయి. ఎక్కడో ఢిల్లీలో జరిగిన ఘాతుకానికి దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల్లో ప్రయాణించే సిక్కు ట్రక్కు డ్రైవర్లు ఊచకోతకు గురయ్యారు. అవేశకావేశాల ముందు వివేకం, విచక్షణ తలవంచాయి.
ఎవరో చెప్పినట్టు ట్యూబునుంచి పేస్టు బయటకు తీయగలమే కానీ మళ్లీ అందులో పెట్టలేం. అలాగే పేల్చిన తూటా కూడా.
నిజమే. వార్తను వెనువెంటనే అందించాలన్న కర్తవ్యదీక్షని మెచ్చుకుని తీరాల్సిందే. కానీ సామాజిక బాధ్యత సంగతేమిటి? పగలసెగలు రగిలించి, వ్యధలు మిగిలించి, విపరీత పరిణామాలకు దారితీసే అవకాశం ఉన్న సమాచారాన్ని కాసేపు తొక్కి పెడితే వచ్చే నష్టం ఏమిటి?
భయంకరమైన పోటీ వాతావరణంలో పయనిస్తున్న ఈనాటి మీడియా మనుగడకు ఎంతో కొంత మేరకు సంచలనాత్మక కథనాలు అవసరమే. కాకపోతే టీ ఆర్‌ పీ రేటింగ్‌లతో పాటు విశాల జనహితాన్ని పట్టించుకోవడం కూడా ఆవశ్యకమే! కాదంటారా!

(ఇంకా వుంది)

4, నవంబర్ 2019, సోమవారం

ఆ గొప్పతనం నాదెంతమాత్రం కాదు, అది రేడియోదే


శ్రీనివాసరావు గారు,

మీరు ఇక్కడ నెమరు వేసుకునే జ్ఞాపకాలు ఆసక్తికరంగా ఉంటున్నాయి. అప్పుడప్పుడు కొన్ని రిపీట్ అవుతున్నప్పటికీ ... ఫరవాలేదు, ఎప్పటికప్పుడే చదివించేలా ఉంటున్నాయి.

ఒక మాటడుగుతాను, ఏమనుకోకండి. విలేకరిగా మీ అనుభవాలను చెబుతుంటే చాలాసార్లు నాకొక సందేహం కలుగుతుంటుంది. ప్రతి ముఖ్యమంత్రికి, ప్రభుత్వంలోని ఉన్నతొద్యోగులకు మీరు అంత సన్నిహితులవడం ఎలా సాధ్యమయింది? ప్రతి రేడియో / దూరదర్శన్ విలేకరికి అది మామూలేనా? ముఖ్యమంత్రితో కలిసి వారి కారులోనే వెళ్ళడం, మిమ్మల్ని రోడ్డు మీద చూసి ముఖ్యమంత్రి గారు తన కారాపి మిమ్మల్ని కూర్చోబెట్టుకోవడం, ఫొటోలో పడేటంత దగ్గరగా వారి పక్కనే నిలబడుండటం, మీకు కాలు ఫ్రాక్చర్ అయితే మీ ఇంటికొచ్చి పరామర్శించడం, వగైరాలు ... అంత సన్నిహితులు ఎలా అవగలిగారు? మీ విజయరహస్యం ఏమిటి? మీలో ఉన్న ఆ స్పెషల్ క్వాలిటీస్ ఏమిటి?

సాధారణంగా మీ బ్లాగులో వ్యాఖ్యలకు మీరు మౌనం వహిస్తుంటారు అని తెలిసినదే అనుకోండి. కానీ నా ఈ సందేహాన్ని మాత్రం తీర్చమని మనవి. ఎందుకంటే మీ జవాబుని బట్టి "విలేకరినైనా కాకపోతిని, సి ఎం కారులో వెళ్ళగా" అని నా గురించి నేను వాపోవచ్చా లేదా అనేది తేల్చుకుందామని (వాపోయినా ఒక జీవితకాలం లేటనుకోండి, ఈసారికిలా పోనియ్యి అనుకోవడమే), హ్హ హ్హ హ్హ :)
నిజాయితీ+సిన్సియారిటి+ప్రతిభ+లౌక్యం - awesome combination
-అజ్ఞాత
@విన్నకోట నరసింహారావు గారూ. (And also @ అజ్ఞాత) మీ అభిమానానికి ధన్యవాదాలు. నేను ప్రతి వ్యాఖ్యకి ప్రతిస్పందించని మాట నిజం. మీ ప్రశ్నకు కింద ఎవరో అజ్ఞాత చక్కటి సమాధానం ఇచ్చారు (నిజాయితీ+సిన్సియారిటి+ప్రతిభ+లౌక్యం - awesome combination). నిజాయితీ, సిన్సియారిటీ, ప్రతిభ వీటి సంగతి పక్కన బెడితే చివరిది లౌక్యం కరక్టేమో అనిపిస్తోంది. అందుకే అజ్ఞాత గారికి కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
ఈ విషయాలు అన్నీ లోగడ నా బ్లాగులో వచ్చినవే. ఈ మధ్య నా వ్యక్తిగత జీవితంలో సంభవించిన ఒక పూడ్చుకోలేని నష్టంతో (నా భార్య మరణం) బాధ పడుతున్నప్పుడు మనసు మళ్ళించుకోవడానికి నేను ఎన్నుకున్న మార్గం ఇది. సూర్య పత్రిక సంపాదకులు కూడా ప్రోత్సహించారు. అందువల్ల ఈ పాత కధలు చాలావరకు పునర్దర్సనమిస్తున్నాయి.
ఇకపోతే మరో ప్రశ్న అడిగారు. పెద్దపెద్ద వారితో ఈ విధమైన సాంగత్యం, సాన్నిహిత్యం ఒక రేడియో విలేకరికి ఎలా సాధ్యమని?. ఈ రోజుల్లో అది అసాధ్యం. నా ఉద్యోగం చివరి దశలో నాకీ వైభోగంలేదు. వందలో ఒకడిని. మందలో అంటే బాగుంటుందేమో.
ఒక ఈనాడు, ఒక టీవీ నైన్ ఇప్పుడు ఎలాగో, ఇన్ని రకాల ప్రచార, ప్రసార మాధ్యమాలు లేని రోజుల్లో రేడియోదే అగ్రస్థానం. నేను వచ్చానా లేదా అన్నది చూసుకున్న తర్వాతే ముఖ్యమంత్రులు ప్రెస్ కాన్ఫరెన్సులు మొదలు పెట్టిన రోజులు వున్నాయి. అది నా గొప్పతనం ఎంతమాత్రం కాదు, అది నూటికి నూరు శాతం రేడియోదే. నమస్కారాలు.
-      భండారు శ్రీనివాసరావు


3, నవంబర్ 2019, ఆదివారం

రేడియో రోజులు - 6


(Published in SURYA Telugu Daily on 03-11-2019, SUNDAY)

ఇప్పుడు శిధిలావస్థలో వున్న (కూలగొట్టారేమో తెలియదు, సచివాలయానికి వెళ్లక ఏండ్లూ పూండ్లు గడిచిపోయాయి) ఓ పాత భవనం మొదటి అంతస్తులో సీఎం  పేషీ వుండేది.  ఆ భవనాన్ని నిజాం బకింగ్ హాం ప్యాలెస్ నమూనాలో నిర్మించారని చెబుతారు. మొదటి అంతస్తు చేరుకోవడానికి వున్న చెక్క మెట్ల వరుస కూడా రాజభవనాన్ని గుర్తుకు తెచ్చే విధంగా వుండేది. దాని రెయిలింగుకు వాడిన కలప ఎంతో ఖరీదయినది. 'మహోగని' అనే అరుదయిన వృక్షజాతికి చెందిన ఆ కలప బంగారం కంటే విలువయినదని చెబుతారు. ఫలక్ నామా ప్రాసాదంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన, అతి పొడవైన భోజనాల బల్ల కూడా ఆ కలపతో తయారైనదే. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, ఆయనకూ సచివాలయ ఉద్యోగులకూ నడుమ ఏదో పేచీ వచ్చి అందరూ ఆయన కార్యాలయంపై విరుచుకు పడ్డారు. ఆ సందర్భంలో మెట్లకు అమర్చిన రెయిలింగు దెబ్బతిన్నది. సచివాలయంలో పనిచేసే ఓ పాతకాలపు వడ్రంగి అది చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయ్యో అది బంగారం కంటే ఖరీదు, వీళ్ళెవ్వరికీ తెలిసినట్టు లేదు' అని వాపోయాడు.
ప్రస్తుత తెలంగాణా ప్రభుత్వం కొత్త సచివాలయం నిర్మించే పట్టుదలతో వుంది కాబట్టి ఆ పాత గుర్తులను ఫోటోలలో లేదా వీడియోలలో నిక్షిప్తం చేస్తే భావి తరాలకు ఉపయుక్తంగా వుంటుంది.
సరే విషయానికి వస్తే,
నాలుగు దశాబ్దాలకు పూర్వం ఇప్పుడు ఉన్న  సచివాలయం ఫ్లై ఓవర్ లేదు. ప్రధాన ద్వారం కూడా హుస్సేన్ సాగర్ వైపున కాకుండా మెయిన్ రోడ్డు మీద వుండేది. ఇనుప చువ్వలతో కూడిన పెద్ద గేటు. ఆ గేటు దగ్గర ఇప్పట్లోలా మందీ మార్బలం వుండేది కాదు. ఒకళ్ళో ఇద్దరో సచివాలయం సిబ్బంది కాపలాగా వుండేవాళ్ళు. సచివాలయం బీట్  చూసే విలేకరులం అందరం ప్రతి రోజూ అక్కడ కలిసేవాళ్ళం.  ఎంట్రీ పాసు వున్నా కూడా లోపలకు వెళ్ళడానికి మొదట్లో బెరుగ్గా వుండేది. ఆదిరాజు వెంకటేశ్వర రావు గారు సీనియర్ జర్నలిస్టు. ఆయన పనిచేసే ఆంధ్రజ్యోతి ఆఫీసు సచివాలయం ఎదురుగానే వుండేది. ఆయన ఫుల్ సూటు ధరించి ఒక చేతిలో బ్రీఫ్ కేసు, మరో చేతి వేళ్ళనడుమ వెలుగుతున్న సిగరెట్టుతో దర్జాగా వస్తుంటే అల్లంత దూరం నుంచే కాపలాదారు గుర్తుపట్టి, సెల్యూట్ చేసి గేటు తెరిచేవాడు. విలేకరి జీవితం అలవాటు అయిన పిదప ఈ వైభోగం నాకూ పట్టింది అనుకోండి. విజిటింగ్ కార్డు అవసరం లేని విలేకరిగా అందరూ గుర్తుపట్టే పరిస్తితి వచ్చింది. చిత్రం ఏమిటంటే రేడియో స్టేషన్ దగ్గర కాపలా వాళ్ళు మాత్రం ప్రతిసారీ మీరు ఎవరి కోసం వచ్చారు అని అడిగేవారు. ఎందుకంటే నేను అక్కడ  గడిపేది కాసేపే.
సచివాలయంలో రోజువారీ విలేకరుల సమావేశాలు ముగిసిన తర్వాత  నడుచుకుంటూ రేడియోకి వెళ్ళేవాడిని. ఓ రోజు అలా వెడుతూ గోపీ హోటల్ (ఆ రోజుల్లో చాలా ఫేమస్. కామత్ హోటల్ ఎదురుగా ఓ పాత భవనంలో వుండేది) దాకా వచ్చాను. ఇంతలో సైరన్ మోగించుకుంటూ ఓ పోలీసు వాహనం వెళ్ళింది. కాసేపటికి మరో వాహనం నా పక్కగానే వెళ్లి  కొంత ముందుకు పోయి ఆగింది. అందులో నుంచి ముఖ్యమంత్రి భద్రతాధికారి బాలాజీ దిగి నా వైపుగా వచ్చాడు. సిఎం గారు కారులో వున్నారు అని చెప్పి ఎక్కించాడు. అది సరాసరి రేడియో స్టేషన్ ఆవరణలోకి వెళ్ళింది. ఈలోగా  ముందు వెళ్ళిపోయిన  పైలట్ కారు  వెనక్కి వచ్చింది. నన్ను దింపేసిన తర్వాత సీఎం కాన్వాయ్ తిరిగి వెళ్ళిపోయింది. చెప్పాపెట్టకుండా ముఖ్యమంత్రి రేడియో స్టేషన్ కి రావడం చూసి అందరూ నివ్వెర పోయారు.
నడిచి వెడుతున్న నాకు ఆఫీసుదాకా అడగకుండా లిఫ్ట్ ఇచ్చిన ఆ ముఖ్యమంత్రి ఎవరంటే ఆరణాల కూలీగా ప్రసిద్ధి చెందిన టి. అంజయ్య గారు.
ఆయన భోళాతనం, అమాయకత్వం రాజకీయ నాయకులకు వేళాకోళంగా అనిపించేవేమో కానీ సామాన్య జనం మాత్రం బాగా ఇష్టపడేవారు. మనసులో ఏదీ దాచుకునేవారు కాదు. మాటల్లో, చేతల్లో తానొక ముఖ్యమంత్రిని అనే అతిశయం, ఆర్భాటం కానవచ్చేది కాదు.
ఒకరోజు మెదక్ జిల్లా పర్యటనకోసం సచివాలయం నుంచి ముఖ్యమంత్రి బయలుదేరారు. నేనూ ఆయన కారులోనే వున్నాను. అప్పటికి ఖైరతాబాదు ఫ్లై ఓవర్ లేదు. కాన్వాయ్ రాజభవన్ రోడ్డులోకి ప్రవేస్తుండగా అంజయ్య గారు ఇక్కడెక్కడో మదన్ ఇల్లు ఉండాలే అన్నారు. మదన్ అంటే మదన్ మోహన్. అంజయ్య మంత్రివర్గంలో ముఖ్యుడు. ఆయన ఇంటికి పోదాం అని చెప్పడంతో కారును అటు తిప్పారు. ముఖ్యమంత్రి హఠాత్తుగా చెప్పాపెట్టకుండా రావడంతో అక్కడ సిబ్బంది కంగారుపడి మంత్రికి చెప్పారు. మదన్ మోహన్ గారు లోపల నుంచి హడావిడిగా బయటకు వచ్చారు. ముఖ్యమంత్రి తాపీగా ‘మదన్! బాత్ర్రూం ఎక్కడ?’ అని అడిగి కాలకృత్యం తీర్చుకుని వచ్చారు. తర్వాత మదన్ మోహన్ గారి శ్రీమతి తాయారు చేసిచ్చిన చాయ్ తాగి మళ్ళీ బయలుదేరారు. అలా వుండేది అంజయ్య గారి వ్యవహార శైలి. ఎలాంటి భేషజాలు లేని మనిషి.
అంజయ్య గారిని మార్చాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. వెంటనే అంజయ్య గారు  ముఖ్య మంత్రి పదవికి  రాజీనామా చేసారు. మర్నాడు – కొత్త నాయకుడి ఎన్నిక. అప్పటికి  ఇంకా ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రే. నేనూ జ్వాలా కలసి ముఖ్యమంత్రి అధికార నివాసం ‘జయప్రజాభవన్’ ( గ్రీన్ లాండ్స్) కు వెళ్లేసరికి పొద్దు బాగా  పోయింది. అంతా బోసిపోయి వుంది. నాయక జనం జాడ లేదు.  మేడ మీద అంజయ్య గారు తన షరా మామూలు వస్త్ర ధారణతో అంటే - గళ్ళ లుంగీ, ముతక బనీనుతో కనిపించారు. ఏమి మాట్లాడాలో తోచలేదు. కాసేపువుండి వచ్చేస్తుంటే వెనక్కి పిలిచారు. ఒక పిల్లవాడిని చూపించి ‘చూడు శ్రీనివాస్ – ఇతడికి దూరదర్శన్ లో ఏదో కాజువల్ ఉద్యోగం కావాలట. ఎవరికయినా చెప్పి చేయిస్తావా ?’ అని అడుగుతుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నేను పని చేసేది రేడియోలో అని ఆయనకు బాగా తెలుసు. అయినా తనని నమ్ముకుని వచ్చిన ఆ పిల్లవాడిని చిన్నబుచ్చడం ఇష్టం లేక నన్ను అడిగి వుంటారు.
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత అంజయ్య ఇలా అన్నారు.
“మేడం (ఇందిరాగాంధీ) దయవల్ల నేను ఈ పదవిలోకి వచ్చాను. ఆవిడ ఆదేశాలకు కట్టుబడి దాన్ని వదులుకుంటున్నాను. కానీ ఎందుకు వచ్చానో, ఎందుకు వెళ్లిపోతున్నానో నాకు ఇప్పటికీ అర్ధం కావడం లేదు”
కానీ తెలుగు ప్రజలకు ఒకటి బాగా అర్ధం అయింది. అమాయకుడు అయిన అంజయ్యని కాంగ్రెస్ అధిష్టానం ఘోరంగా అవమానించింది. అందుకే ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా పార్టీ పెట్టిన ఎన్టీ రామారావును గెలిపించి, కాంగ్రెస్ ను అంతకంటే ఘోరంగా ఓడించారు.
ఆ తర్వాత చాలా కాలానికి అంజయ్య గారు అస్వస్థతకు గురై దేల్హిలోని రామమనోహర్ లోహియా ఆసుపత్రిలో కన్ను మూశారు. ఆ వార్త వెంటనే హైదరాబాదుకు తెలిసింది. అప్పుడు కేంద్రమంత్రిగా ఉన్న శ్రీ పీవీ నరసింహారావు అంజయ్య భౌతిక కాయాన్ని విమానంలో హైదరాబాదు తీసుకు వస్తున్నట్టు జాతీయ వార్తా ఛానళ్ళు సమాచారం ఇచ్చాయి. బెజవాడ నుంచి వెలువడే కొన్ని ప్రధాన పత్రికల్లో కూడా అంజయ్య మరణ వార్త ‘లేట్ న్యూస్’ రూపంలో సంక్షిప్తంగా ప్రచురించారు.
విజయవాడ ఆకాశవాణి న్యూస్ ఎడిటర్ గా  ఉన్న ఆర్వీవీ  కృష్ణారావు గారు ఫోను చేసి విషయం అడిగారు. వార్త కరక్టే అని చెప్పాను. కానీ ఆయన చనిపోయింది ఢిల్లీలో. నిబంధనల ప్రకారం  ఢిల్లీ విలేకరి ఆ  వార్తను ధ్రువపరచాలి. అందుకోసం ప్రయత్నించారు కానీ ఆ సమయంలో ఢిల్లీలోఎవరూ దొరకలేదు. చనిపోయింది రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. నిబంధనల పేరుతొ ఆరోజు న్యూస్ బ్రేక్ చేయక పొతే  ప్రజలనుంచి పెద్ద నిరసన వచ్చే ప్రమాదం వుంది. దాంతో ఏమైతే ఏమైందని కృష్ణారావు  అంజయ్య గారి మరణ వార్తను ఇతర వివరాలతో కలిపి ఉదయం ఆరూ నలభయ్ అయిదు  నిమిషాలకు మొదలయ్యే ప్రాంతీయ వార్తల్లో ప్రముఖంగా ప్రసారం చేసారు.
ఆ వెనువెంటనే ప్రసారం అయిన  ఢిల్లీ తెలుగు వార్తల్లో ఆ ముచ్చటే లేదు.
‘తెలుగు ప్రముఖుడు ఒకరు చనిపోతే ఆ వార్తకు ఢిల్లీ తెలుగు వార్తల్లో ఆ విషయం చెప్పరా’ అంటూ  టీడీపీ పార్లమెంటు సభ్యుడు శ్రీ పుట్టపాగ రాధాకృష్ణ హడావిడి చేసారు.
అంజయ్య గారి భౌతిక కాయం హైదరాబాదు బర్కత్ పురాలోని ఆయన ఇంటికి చేరకముందే జనం కిక్కిరిసిపోయారు. బీదా బిక్కీ కుటుంబాల వాళ్ళు ఆడవాళ్ళతో సహా గుండెలు బాదుకుంటూ వీధుల్లోకి వచ్చారు. 
 అందుకే ఆయన చనిపోయినప్పుడు ఒక పత్రిక (ఆంధ్రప్రభ) పెట్టిన పతాక శీర్షికను  జర్నలిస్టు మిత్రుడు పాశం యాదగిరి ఎప్పుడూ గుర్తు చేస్తుంటాడు.
“గరీబోళ్ళ బిడ్డ – నిను మరవదు ఈ గడ్డ”.
(ఆ శీర్షిక పెట్టింది ప్రస్తుతం సాక్షి దినపత్రిక ఎడిటర్ శ్రీ మురళి)

కింది ఫోటో: ముఖ్యమంత్రి అంజయ్య, ఆయనతో పాటు టేప్ రికార్దర్ తో నేను)

 
(ఇంకా వుంది)

2, నవంబర్ 2019, శనివారం

రేడియో రోజులు - 5 - భండారు శ్రీనివాసరావు




(Published in SURYA daily today, Dt. 02-11-2019)
“ఏమయినా చెప్పు! రెడ్డి సాబ్ టేస్టే టేస్టు! ఈ కుర్చీ చూడు ఎంత గొప్పగావుందో!” - అన్నారు ముఖ్యమంత్రి అంజయ్య ఆ కుర్చీలో అటూ ఇటూ కదులుతూ.
అంజయ్య గారిది పిల్లవాడి మనస్తత్వం. ఇందిరాగాంధీ దయవల్ల తాను ముఖ్యమంత్రిని అయ్యానన్న భావం ఆయనలో వుండేది. దాన్ని దాచుకోవడానికికానీ, లేనిపోని భేషజం ప్రదర్శించడానికి కానీ ఎప్పుడూ ప్రయత్నించేవారు కాదు. ప్రతి సందర్భంలో ‘అమ్మ అమ్మ’ అంటూ ఆమెని హమేషా తలచుకుంటూనే వుండేవారు.
చెన్నారెడ్డి గారి వంటి చండశాసనుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన తరవాత ఆ స్తానంలో మేదకుడయిన అంజయ్య గారిని ఊహించుకోవడం రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులకు ఒక పట్టాన మింగుడుపడేది కాదు. ఆయన గురించి తేలిగ్గా మాట్లాడుకునేవారు. ఈ విషయం ఇందిరాగాంధీకి తెలియకుండా వుంటుందా. వెంటనే ఒకరోజు ఆమె పనికట్టుకుని హైదరాబాదు వచ్చారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసారు. మామూలుగా ఈ మీటింగులు శాసనసభ ఆవరణలో జరుగుతుంటాయి. కానీ ఈ సారి ఆ సంప్రదాయానికి విరుద్ధంగా అంజయ్యగారు ముఖ్యమంత్రిగా నివాసం వుంటున్న ‘జయప్రజాభవన్’ (గ్రీన్ లాండ్స్ గెస్ట్ హౌస్) లో నిర్వహించారు. ఇందిరాగాంధీ ఆ సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఇంట్లో సమావేశం జరిపి అందులో మాట్లాడడం ద్వారా ఆమె కాంగ్రెస్ వాదులందరికీ ఒక స్పష్టమయిన సందేశం పంపారు. అంతే! అంజయ్య గారిని గురించి అంతవరకూ తేలికగా మాట్లాడిన వారందరూ నోళ్ళు కుట్టేసుకున్నారు.
ఎందుకో ఏమో కారణం తెలియదు కాని, నా పట్ల ఆయన అపారమయిన వాత్సల్యం చూపేవారు. ఒక్కోసారి ఈ ప్రవర్తన ఇరకాటంగా వుండేది. ముఖ్యమంత్రిని కలవడానికి ఎవరెవరో వస్తుంటారు. ఏదయినా చెప్పుకోవాలనుకుంటారు. అక్కడ నాలాటి బయటవారువుంటే ఇబ్బంది. పైగా విలేకరిని. కానీ ఆయన నన్ను తన చాంబర్ నుంచి అంత తేలిగ్గా కదలనిచ్చేవారు కాదు. “వెడుదుగానిలే! కాసేపు కూర్చో!” అనేవారు నేను లేవగానే. ఇబ్బంది పడుతూనే కూర్చుండిపోయేవాడిని పనేమీ లేకపోయినా.
ఆంధ్రప్రదేశ్ కు అంజయ్య గారు ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధి తనయుడు రాజీవ్ గాంధి విమానాల పైలట్ గా పనిచేస్తున్నారు. ఓ రోజు ముఖ్యమంత్రిగారు సచివాలయంలో నలుగురితో మాటా మంతీ సాగిస్తున్న సమయంలో ఆయనకు ఓ ఫోన్ వచ్చింది. ఆయన తత్తరపడుతూ లేచి వున్నపాటున బరకత్ పురాలో వున్న తన ఇంటికి బయలుదేరారు. అప్పటికి అంజయ్య గారు అధికార నివాసం గ్రీన్ లాండ్స్ (ముద్దుగా ఆయన పెట్టుకున్న పేరు ‘జయ ప్రజా భవన్) కి మకాం మార్చలేదు. బరకత్ పురాలో హౌసింగ్ బోర్డ్ వారి టూ ఆర్ టీ ఇంట్లోనే వుంటున్నారు. ఇప్పటి రోజులతో పోలిస్తే అది ఒక విడ్డూరమే. ఆ చిన్న ఇంటిపైనే గది మీద గది నిర్మించుకుంటూ వెళ్లడం వల్ల చాలా ఇరుకుగా వుంటుంది. మెట్లు కూడా సౌకర్యంగా వుండవు.
సరే! అంజయ్య గారు హడావిడి పడుతూ ఇంటికి వెళ్ళి ఆయాసపడుతూ మెట్లెక్కినప్పుడు కనబడ్డ దృశ్యం ఈనాటి ఛానళ్ళకు దొరికివుంటే పండగే పండగ. రాజీవ్ గాంధీ అక్కడి చిన్న గదిలో అంతకంటే చిన్న కుర్చీలో కూర్చుని తనను పీక్కుతింటున్న దోమల్ని తోలుకునే పనిలో నిండా మునిగి తేలుతున్నాడు. అసలే పండంటి మనిషి. లేత శరీరం. ఆయన మొహం మీద దోమ కాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అసలు జరిగిన విషయం ఏమిటంటే, రాజీవ్ గాంధీ పైలట్ గా హైదరాబాదు వచ్చిన ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం, తిరిగి వెళ్ళడానికి బాగా వ్యవధానం వున్నట్టుంది. యెందుకు అనిపించిందో తెలియదు కాని, ఆయన బేగం పేట ఎయిర్ పోర్ట్ లో ఎవర్నో అడిగి ఓ కారు తీసుకుని నేరుగా బరకత్ పురాలోని అంజయ్య గారి నివాసానికి వెళ్ళిపోయారు. ఈ కబురు అంది, ముఖ్యమంత్రిగారు ఆఘమేఘాలమీద ఇంటికి వచ్చేసరికి ఇదీ సీను.
'అమ్మ ఇచ్చిన ఉద్యోగం' ఇది అని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రిగా అంజయ్య గారు ఏనాడు నామోషీ పడలేదు. పైగా కూసింత గర్వంగా చెప్పుకునేవారు. రాజీవ్ గాంధీ ఆయన ఇంటిని చూసి వాళ్ల అమ్మ సెలెక్షన్ మంచిదే అనుకుని కూడా వుంటారు. కాకపొతే పేరడీ ఏమిటంటే అంజయ్య గారి ముఖ్యమంత్రి పదవి వూడడానికి కూడా తదనంతర కాలంలో రాజీవ్ గాంధీయే కారణం అయ్యారు.
అంజయ్య గారు గతంలో వెంగళరావుగారి మంత్రివర్గంలో – కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. కార్మికుల సంక్షేమం గురించి అహరహం ఆలోచిస్తుండేవారు.
పురుళ్ళ ఆసుపత్రిలో ‘లేబర్ రూము’ పై అంజయ్య గారి జోకు సుప్రసిద్ధం. లేబర్ మినిస్టర్ గా ఈ ఎస్ ఐ ఆసుపత్రికి వెళ్లారట. అక్కడ మెటర్నిటీ వార్డులో పురుళ్ళ గదికి ‘లేబర్ రూం’ అని బోర్డు వుండడం చూసి ఆయన సంతోషపడి తన ఆనందాన్ని దాచుకోలేక ‘చూసారా ఈ ఆసుపత్రిలో లేబరోళ్లకోసం ప్రత్యెక ఏర్పాట్లు వున్నాయి” అనేశారట.
ఆయన అమాయకత్వాన్నిబట్టి ఇలాటి జోకులు పుట్టివుంటాయి కానీ, అంజయ్య గారు విషయాలను యెంత నిశితంగా పరిశీలించేవారో నాకు తెలుసు.
ఒకసారి కౌలాలంపూర్ లో తెలుగు మహాసభలు జరిగాయి. ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన తరవాత అంజయ్య గారు హోటల్ రూముకి తిరిగొచ్చేసారు. వెంట షరా మామూలుగా నేను. కాస్త నలతగా కనిపించారు. అంత పెద్ద గదిలో ఆయనా నేను ఇద్దరమే. సాయంత్రం అవుతోంది. ఆయన దీర్ఘంగా ఆలోచిస్తూ కిటికీలోనుంచి బయటకు చూస్తున్నారు. విశాలమయిన రోడ్డు. వచ్చే కార్లు. పోయే కార్లు. పక్కనే ఏదో ఫ్యాక్టరీ లాగావుంది.
ఆయన వున్నట్టుండి “చూసావా!” అన్నారు. నాకేమీ అర్ధం కాలేదు.
“పొద్దున్న బయలుదేరేటప్పుడు చూసాను. అందులో (ఆ ఫ్యాక్టరీ లో) పనిచేసేవాళ్లందరూ గంట కొట్టినట్టు టైము తప్పకుండా వచ్చారు. అయిదు నిమిషాల్లో లోపలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్లీ అంతే. షిఫ్ట్ పూర్తికాగానే ఠంచనుగా ఇళ్లకు పోతున్నారు. పనిచేసేవాళ్లకు వాళ్లకు కావాల్సింది ఇవ్వాలి. కావాల్సిన విధంగా పని చేయించుకోవాలి. ఇలా మన దగ్గర కూడా చేస్తే కావాల్సింది ఏముంటుంది!” అన్నారాయన యధాలాపంగా.
అంటే ఇప్పటిదాకా ఆయన ఆలోచిస్తోంది ఇదన్నమాట.
‘కౌలాలంపూర్ తెలుగు మహాసభల ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదనీ, ఇందిరాగాంధీ ఈ విషయంలో ముఖ్యమంత్రి పట్ల చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారనీ’ – హైదరాబాదులో ఒక పత్రిక రాసిన విషయం ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న అంజయ్య గారికి “రాజకీయ జ్వరం” పట్టుకున్నట్టు అప్పటికే గుసగుసలు మొదలయ్యాయి. అందుకే ఆయన సభా ప్రాంగణంలోనే వుండిపోకుండా వొంట్లో బాగోలేదనే నెపంతో హోటల్ రూముకి తిరిగొచ్చేసారని వదంతులు హైదరాబాదు దాకాపాకాయి. ఈయనగారేమో ఇక్కడ తాపీగా కూర్చుని కార్మికులు గురించి ఆలోచిస్తున్నారు. అలావుండేది అంజయ్య గారి వ్యవహారం.
అంజయ్య ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో ఓ రోజు ఆయనతో కలిసి మా ఇంటికి వచ్చిన వాళ్ళలో ఇద్దరు ఆ తరువాతి కాలంలో మన (ఉమ్మడి) రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు.
ఆ సాయంత్రం రేడియో వార్తలు ముగిసిన అనంతరం బస్సుపట్టుకుని హిమాయత్ నగర్ లో దిగి చిక్కడపల్లి (వివేక్ నగర్ అనాలా?)లో ఇంటికి నడిచి వస్తుంటే త్యాగరాయ గానసభ ముందు ముఖ్యమంత్రి పైలట్ కారు కనిపించింది. అప్పుడే గానసభలో ఏదో కార్యక్రమం ముగించుకుని ముఖ్యమంత్రి అంజయ్య గారు బయటకు వచ్చి కారెక్కుతూ అక్కడ గుమికూడిన జనంతో ముచ్చటిస్తూ నన్ను చూసి ‘ శ్రీనివాస్ ఈ పక్కనే కదా నీ ఇల్లు పోదాం పద’ అన్నారు. నాకు ఒక్క క్షణం ఏం జవాబు చెప్పాలో తోచలేదు. ఇల్లు ఏ పరిస్తితిలో తెలవదు. ఎందుకంటే పగలల్లా మా ఆవిడ ఇంట్లో ‘అమ్మవొడి’ పేరుతొ చైల్డ్ కేర్ సెంటర్ నడుపుతుంది. కొంతమంది తల్లులు చాలా పొద్దుపోయిందాకా పిల్లల్ని తీసుకు వెళ్లరు. అలా ఆలోచించే లోపలే, అక్కడినుంచి మూడో ఇల్లే మాది, ముఖ్యమంత్రితో సహా అందరం మా ఇంటికి నడుచుకుంటూ వచ్చేసాము. అప్పుడే వర్షం పడి రోడ్డంతా చిత్తడిగా వుంది. అందులో మేము వుండే వాటా ఇంట్లో బాగా వెనగ్గా వుంటుంది. గేటు తీసుకుని కొంతదూరం వెళ్ళాలి. వాన నీళ్ళు నిలవడంతో ఎక్కడ గుంటవుందో ఎక్కడ చదునుగా వుందో తెలవడం లేదు. పైగా బయట లైటు లేకపోవడంతో వెలుతురు కూడా లేదు. అలాగే ఇంట్లోకి వచ్చాము. అదృష్టం. కేర్ సెంటర్ పిల్లలందరూ వెళ్ళిపోయారు. మా ఆవిడ అప్పుడే ఇల్లు తుడిచి బాగుచేసినట్టుంది. ఒక్క పెట్టున వచ్చిన అంతమందిని చూసి ముందు కంగారు పడినా వెంటనే సంభాలించుకుంది. గోడకు ఆనించి పెట్టిన ఇనుప కుర్చీలు మూడు వేసినా అవి ఎవరికీ సరిపోయేలా లేవు. ఒక కుర్చీలో ముఖ్యమంత్రి కూర్చుంటే మిగిలిన రెండింటిలో మరో ఇద్దరు సర్దుకున్నారు. వాళ్ళే తరువాత కాలంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు. ఒకరు భవనం వెంకట్రాం గారు కాగా రెండవవారు కోట్ల విజయభాస్కరరెడ్డి గారు. మిగిలినవారందరూ నిలబడేవుండాల్సిన పరిస్తితి. వారిలో ఇద్దరు ముగ్గురు ఆనాటి మంత్రులు కూడా. మా ఆవిడ హడావిడిగా టీ కలిపి తెచ్చింది. కొందరికి కప్పుల్లో. మరికొందరికి స్టీలు గ్లాసుల్లో. సాసర్లు లేవు. వచ్చిన పెద్దలు కూడా పెద్ద మనసు చేసుకుని ఇచ్చిన ఆతిధ్యం(?) స్వీకరించి, మా పిల్లల్ని పలకరించి బయటకు వచ్చారు. మళ్ళీ కారెక్కేటప్పుడు అదే జనం. అసలు అంజయ్య గారంటేనే జనం. జనమే ఆయనకు ఆక్సిజన్. అయితే, ముఖ్యమంత్రిని అలా చెప్పాపెట్టకుండా ఇంటికి తీసుకువెళ్లడం భద్రతాదికారికి నచ్చినట్టులేదు. కార్లో కూర్చుంటూ ‘ఇదేం పద్ధతిగా లేదు’ అన్నాడు.
నాకు కోపం చర్రున లేచింది. ‘ఆయన్నేమన్నా బొట్టుపెట్టి పిలిచానా?’ అనేశాను. ఆ వయసు అలాటిది. ఇప్పుడు తలచుకుంటే చిన్నతనం అనిపిస్తుంది.
అతడు ఎవరో కాదు జర్నలిస్టులు అందరం ముద్దుగా ‘బోలోజీ’ అని పిలుచుకునే బాలాజీ.
ఏవయినా అవి బంగారు రోజులు.
(ఇంకా వుంది)
(దిగువ ఫోటో: శ్రీ అంజయ్య చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్న ఆనాటి గవర్నర్ శ్రీ కే.సి.అబ్రహాం. వెనుక చెంప మీద చేయి పెట్టుకుని నిలుచున్నది వ్యాస రచయిత)


1, నవంబర్ 2019, శుక్రవారం

రేడియో రోజులు - 4




(Published in SURYA daily on 01-11-2019, Friday, today)
వెంగళరావు గారి తరువాత ముఖ్యమంత్రి అయిన చెన్నారెడ్డి గారికి పరిపాలనాదక్షుడు అనే మంచి పేరుతొ పాటు చండశాసనుడు అనే కితాబు కూడా వుండేది. ముఖ్యమంత్రి పేషీ కోసం సీ బ్లాకులో తన అభిరుచులకు తగ్గట్టుగా ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. ఖరీదయిన ఆధునిక ఫర్నిచర్ తో చూడముచ్చటగా వుండేది. సిబ్బంది సంఖ్య కూడా పెరిగింది. ఇద్దరు ముగ్గురు సీనియర్ ఐ ఏ ఎస్ అధికారులు పనిచేసే వారు. శ్రీయుతులు ఎస్ ఆర్ రామమూర్తి, గోవిందరాజన్, సంతానం, యుగంధర్, పరమహంస మొదలయిన వారు వున్నా వారిలో ఎక్కువకాలం వున్నది పరమహంస గారే. రామమూర్తిగారు తదనంతర కాలంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఎస్పీ రాంక్ ఐ పీ ఎస్ అధికారి శ్రీ మురళీధర్ ప్రధాన భద్రతాధికారి. పీ ఆర్ వొ గా సమాచారశాఖలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారిని నియమించుకున్నారు. (అంతకు ముందు కొద్దికాలం సి. నరసింహారెడ్డి గారు కూడా ఈ బాధ్యతలు నిర్వహించారు. పర్వతాలరావు గారికి చెన్నా టు అన్నా అనే పేరు వుండేది. అంటే చెన్నారెడ్డి, అంజయ్య, భవనం వెంకట్రాం, విజయభాస్కర రెడ్డి, ఎన్టీ రామారావు ఇలా వరసగా అయిదుగురు ముఖ్యమంత్రుల వద్ద పీఆర్వో గా పనిచేసారు)
చెన్నారెడ్డి గారు ఎటువెళ్ళినా కొంతమంది మంత్రులు మరో పని ఏమీ లేదన్నట్టు ఆయన వెంటే వెళ్ళేవారు. దాంతో, సీ ఎం కాన్వాయ్ లో వాహనాల సంఖ్య కూడా పెరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి అయిన ఘనత దక్కిన కాంగ్రెస్ నాయకుల్లో చెన్నారెడ్డి గారొకరు. మొదటి సారి, అలాగే రెండోసారి కూడా ఆ పదవి కోల్పోవడానికి కారణం సొంత పార్టీలో ఆయన పట్ల చెలరేగిన అసమ్మతి. మరో విశేషం ఏమిటంటే ఆ రెండుసార్లు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం కూడా చెన్నారెడ్డి గారే కావడం. అయినా కాంగ్రెస్ పార్టీలో ఆయన వ్యతిరేకులు ఆయన దిగిపోయేదాకా నిద్రపోలేదు.
చెన్నారెడ్డి గారి వ్యవహార శైలి చాలా విలక్షణంగా వుండేది. మొదటిసారి సీఎం అయినప్పుడు చేతిలో వెండి పిడి తాపడం చేసిన పొన్నుకర్రతో అధికార దర్పం ప్రదర్శించిన తీరు ఆయన్ని విమర్శలకు గురిచేసింది. ఆయన పార్టీకే చెందిన బీ. రామారావు అనే జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఆయన్ని అనుకరిస్తూ శాసనసభలో పొన్ను కర్ర వూపుకుంటూ తిరగడం ఒక ఉపాఖ్యానం.
పేరుకుపోయిన ఫైళ్ళను ఒక్క పెట్టున క్లియర్ చేయడానికి ఆయన అనేక పద్దతులు అనుసరించేవారు. ఒక్కోసారి వూరికి బాగా దూరంగా వున్న బీ హెచ్ ఈ ఎల్ గెస్ట్ హౌస్ ల్లో రాత్రి పొద్దుపోయేదాకా వుండి పని పూర్తి చేసేవారు. అలాగే హైదరాబాదు నుంచి యే విశాఖపట్నమో వెళ్ళాల్సి వస్తే, ఫైళ్ళు వెంటబెట్టుకుని రైల్లో ప్రయాణం చేసేవారు. రైలు కాజీపేటలో ఆగగానే అప్పటివరకు సంతకం చేసిన ఫైళ్ళను హైదరాబాదు చేర్చడానికి ప్రభుత్వ వాహనం ఒకటి అక్కడ స్టేషన్లో సిద్దంగా వుండేది. అలాగే ఖమ్మం, విజయవాడ వచ్చేసరికి మరికొన్ని ఫైళ్ళు చూసి సంతకం చేసేవారు. అవన్నీ ఆ రాత్రికి రాత్రే హైదరాబాదులోని సచివాలయానికి చేరేవి.
చెన్నారెడ్డి గారికి అభిజాత్యం ఎక్కువ కావొచ్చుకాని ప్రచారంలో వున్నట్టు కుల దురభిమానం లేదని ఆయన్ని బాగా ఎరిగున్న వారు చెబుతుంటారు. రెండోసారి పదవీ గండం దాపురించినప్పుడు, రేపోమాపో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్న సమాచారం తెలియగానే చెన్నారెడ్డి మద్దతుదారులయిన నాటి మంత్రులు శ్రీ బాగారెడ్డి, శ్రీ హషీం కలసి నామినేటేడ్ పదవుల భర్తీ కోసం ఒక జాబితా తయారు చేసి ఇచ్చారు. దాన్నొకసారి పరకాయించి చూసిన చెన్నారెడ్డి గారు 'ఇదేమిటయ్యా అందరూ రెడ్లే వున్నారు, వేరేవాళ్ళు ఎవరూ మీ కంటికి ఆనలేదా!' అని నిలదీశారు. అప్పుడు వాళ్లు ఇచ్చిన సమాధానం ఆనాటి వాస్తవ రాజకీయ పరిస్తితికి అద్దం పడుతుంది.'రెడ్లు కానివాళ్ళు ఇంకా మనవెంట ఎవరున్నారు సారూ, అందరూ అటే (అసమ్మతి వైపు) వెళ్ళిపోయారు".
ఏ రాష్ట్రంలో అయినా స్తానికంగా ఏ నాయకుడయినా బలపడుతున్నాడని అనుమానం వచ్చినా సరే, కాంగ్రెస్ అధిష్టానం వూరుకునేది కాదు. వెంటనే అతడి మీద నిర్దాక్షిణ్యంగా వేటు వేసేది. ఒక్కోసారి ఆ చర్య ఆత్మహత్యాసదృశమైనా సరే ఎంతమాత్రం ఉపేక్షించేది కాదు. చెన్నారెడ్డి వంటి నాయకులు కూడా అధిష్టానానికి అణగిమణగి వున్నట్టు వుండేవారు కాని ఒక్కోసారి ఆ అసహనం బయటకు వస్తుండేది. చెన్నారెడ్డి వ్యతిరేకులు ఆరోజుల్లో ప్రభలు వెలిగిపోతున్న సంజయ్ గాంధీ సాయంతో నాయకత్వ మార్పిడి విషయంలో ఒక నిర్ణయానికి రాగలిగేట్టు చేయగలిగారు. అప్పట్లో సంజయ్ ఏది చెబితే అంత. ఆయన మాటకు ఎదురు వుండేది కాదు. తనని తొలగించే ప్రయత్నంలో సంజయ్ హస్తం వుందని భావించే వారేమో, ఆయనంటే చెన్నారెడ్డి గారికి గుర్రుగా వుండేది. ఈ నేపధ్యంలో సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించడంతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు తాత్కాలికంగా వాయిదాపడింది. సంజయ్ అస్థికలను, దేశంలోని ప్రధాన నదులతో పాటు, గోదావరి నదిలో నిమజ్జనం చేసేందుకు అట్టహాసంగా ఏర్పాట్లు జరిగాయి. హైదరాబాదు వచ్చిన అస్థికల పాత్రను ప్రత్యేక బోగీలో వెంట తీసుకుని ముఖ్యమంత్రి రాజమండ్రి వెళ్లారు. ఒక బోటులో చెన్నారెడ్డి ఆయన పరివారం గోదావరి నదిలో కొంత దూరం వెళ్లారు. ఆకాశవాణి విలేకరిగా టేప్ రికార్డర్ తో నేనూ వెంట వెళ్లాను. నిమజ్జనం అయిన తరువాత అక్కడ విలేకరులతో మాట్లాడారు. చుట్టూ మూగిన జనాలతో అంతా గందరగోళంగా వుంది. తిరిగి హైదరాబాదు వెళ్ళడానికి రైలు ఎక్కిన తరువాత నాకు కబురు వచ్చింది. వెళ్లాను. ముఖ్యమంత్రి పేషీలో పనిచేసే ఒక ఐ ఏ ఎస్ అధికారి, 'సీ ఎం మాట్లాడింది మొత్తం రికార్డ్ చేసారా’ అని అడిగారు. ఔనన్నాను. వినిపించమన్నారు. కేసెట్ రివైండ్ చేసి వినిపించాను. అప్పుడు ఆశ్చర్యపోవడం నా వంతు అయింది. సంజయ్ గాంధీ మరణం తనకు బాగా బాధ కలిగించిందని చెన్నారెడ్డి చెప్పారు. కానీ ఆ వాక్యం ఇలా మొదలయింది. "ఐ యాం హ్యాపీ దట్ ...సంజయ్.....(సంజయ్ గాంధీ మరణించడం నాకు చాలా....ఆనందం...)
ముఖ్యమంత్రి పేషీలో పనిచేసేవారు యెంత అప్రమత్తంగా వుంటారో తెలుసుకోవడానికి ఇదొక ఉదాహరణ.మొత్తం మీద అసమ్మతి సెగలు పనిచేసో, లేక దాన్ని అడ్డం పెట్టుకుని చెన్నారెడ్డి అడ్డు తొలగించుకోవాలని శ్రీమతి గాంధీ భావించారో, కారణం ఏదయినా, 1980 అక్టోబర్ 10 న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
చెన్నారెడ్డి 1989 లో రెండోమారు ముఖ్యమంత్రి అయ్యారు కాని, నేను అప్పుడు మాస్కోలో వున్నాను. అప్పుడు ఆయన పేషీలో పీ ఆర్ వొ గా చేరింది నా మిత్రుడు జ్వాలా నరసింహారావు. ప్రస్తుతం జ్వాలా, తెలంగాణా మొదటి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర రావు వద్దకూడా సీ పీ ఆర్ వొ గా పనిచేస్తున్నారు. పాతికేళ్ళ తరువాత ఆయన అదే పదవిలో చేరడం ఒక విశేషం.
1989 లో కూడా ఇదే అదే సీను రిపీట్ అయింది. పీసీసీ అధ్యక్షుడిగా వుండి, ఎన్నికల్లో ఎన్టీయార్ నాయకత్వంలోని అధికార తెలుగుదేశం పార్టీని వోడించి కాంగ్రెస్ ను మళ్ళీ అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఆయనదే . కానీ ఏడాదిలోనే చెన్నారెడ్డిని తిరిగి మాజీ ముఖ్యమంత్రిని చేసింది కూడా అదే అసమ్మతి. అదే అధిష్టానం.
చెన్నారెడ్డి గురించిన అధ్యాయం ముగించేముందు ఆయనతో నా సొంత అనుభవం ఒకటి చెప్పాలి.
ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఆకాశవాణి ఏర్పాటుచేసిన ఒక శిక్షణ కోసం ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పట్లా జర్నలిష్టులకు ఢిల్లీ ఏపీ భవన్ గెస్ట్ హౌస్ లో ప్రత్యేక కేటగిరీ వుండేది కాదు. గెస్ట్ హౌస్ కూడా ప్రస్తుతం వున్న విలాసవంతమైన పలు అంతస్తుల భవనం కాదు. పక్కనే ఆనుకుని వున్న అశోకా రోడ్లో మొదటి నెంబరు భవనం. పాతదే అయినా చాలా వసతిగా వుండేది. రోజు కిరాయి కూడా తక్కువే. అయితే, శిక్షణ కోసం వెళ్లడం వల్ల ఎక్కువ రోజులు వుండాల్సి వచ్చింది. హైదరాబాదు తిరిగివచ్చిన తరువాత ప్రైవేట్ అతిధుల జాబితాలో పెట్టి బిల్లు పంపించారు. వందల్లోనే వున్నా అప్పటి ప్రమాణాల ప్రకారం భారమే అనిపించి, సీ.ఎం. చెన్నారెడ్డి గారి దృష్టికి తీసుకు వెళ్లాను. ఆయన ఓ ధరఖాస్తు ఇమ్మన్నారు. వెంటనే ఓ జీవో జారీ అయింది. అక్రిడిటేషన్ కలిగిన జర్నలిష్టులను కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమానంగా పరిగణిస్తూ ఇచ్చిన జీవో అది. దాని కాపీ మా ఆఫీసు చిరునామాతో నాకు కూడా పంపారు. చాలాకాలం వుంది కానీ, మేము మాస్కో వెళ్ళినప్పుడు ఎక్కడో కాగితాల్లో మరుగునపడి, ఇప్పుడు కానరావడం లేదు. జర్నలిష్టులు ఎవరి వద్ద అన్నా వుంటే చూడండి. ఆ జీవోలో నా పేరు కూడా వుంది. 'పలానా శ్రీనివాసరావు ఇచ్చిన ధరకాస్తును జాగ్రత్తగా పరిశీలించిన మీదట ప్రభుత్వం .....' అని వుంటుంది. (ఇంకా వుంది)