15, మార్చి 2019, శుక్రవారం

నిదురపోరా తమ్ముడా! – భండారు శ్రీనివాసరావు


(నిన్న అంతర్జాతీయ నిద్రా దినోత్సవం’ట’. కాస్త మాగన్నుగా నిద్ర పట్టడం వల్ల దాన్ని గురించి రాయడంఒకరోజు ఆలస్యం అయింది)
'కంట నిదుర రాకపోతే పడ్డావనుకో ప్రేమలో' అని ఓ సినీ కవి సూత్రీకరించారు. కాకపొతే ఈ సూత్రం ఒక వయస్సులో ఉన్నవారికి మినహా అన్ని వయస్సులవారికీ వర్తించదనుకోండి. ఈ సంగతి అలా ఉంచితే -
నిదురించే తోటలోకి తీపి కబురు వచ్చింది.
‘ఏమిటా మొద్దు నిద్దర మూడు ఝాములు పొద్దెక్కేదాకా’ దాకా అని పెద్దలు సణుగుతున్నా దుప్పట్లో మునగ దీసుకుని పండుకునే వారికోసం ఏడాదిలో ఒక రోజును అంతర్జాతీయ నిద్రా దినోత్సవానికి కేటాయించారు. ప్రతి ఏటా మార్చి నెల మూడో శుక్రవారం నిద్రాప్రేమికుల దినోత్సవం అన్నమాట. నిద్రతో కొన్ని రోగాలు నయం చేయొచ్చన్న ఓ వైద్య ప్రక్రియను ప్రచారం చేసే ఉద్దేశ్యంతో మొదటిసారి 2008 మార్చి 18 వ తేదీన ఈ అంతర్జాతీయ నిద్రా దినోత్సవాన్ని(వరల్డ్ స్లీప్ డే) నిర్వహించారు. ‘మంచి ఆరోగ్యంతో మర్నాడు మేలుకోవడం కోసం ఈ రాత్రి బాగా నిద్ర పొండి!’ అన్నది నిర్వాహకుల నినాదం. ఇంకా మనవైపు జనంలోకి రాలేదు కానీ నిద్రతో రోగాలు నయం చేసే ప్రక్రియ కొన్ని దేశాల్లో బాగానే ప్రాచుర్యంలో వుందన్నది వారి ఉవాచ..
అన్ని వయస్సుల్లోని వారికి నిద్ర అవసరం గురించి ప్రచారం చేయాలన్నది నిర్వాహకుల అభిప్రాయం. అప్పుడే పుట్టిన శిశువులు, స్కూలు పిల్లలు, ఈడొచ్చిన పిల్లలు, యువతీ యువకులు, మధ్య వయస్కులు, వృద్ధులు ఇలా అన్ని వయసులవారు నిద్రకు తగినంత సమయం కేటాయిస్తే రోగాలబారిన పడకుండా ఎంచక్కా గుండెలమీద చేయివేసుకుని గుర్రుపెట్టి నిద్రపోవచ్చని వీరు బల్ల గుద్ది చెబుతున్నారు. వీళ్ళంతా విదేశీయులు కనుకా, మన రామాయణాది పురాణాల అవగాహన అంతగా లేని వారు కనుకా – నిద్రకు నిలువెత్తు నిదర్శనం లాటి కుంభకర్ణుడు మొదలయిన పురాణ పాత్రల ప్రస్తావన తీసుకురాలేకపోతున్నారు. లేకపోతె, ఎంత నిద్రపోతే అంత బలం అన్నటాగ్ లైన్ తో ఏకంగా కుంభకర్ణుడి బొమ్మనే వారి 'లోగో' గా పెట్టుకునివుండేవారు. రాక్షసుడి చిత్రం ప్రచారానికి పనికిరాదని ఎవరయినా అభ్యంతరం చెబితే మన వేంకటేశ్వర స్వామి వారి అనుంగు సోదరులు వరద రాజస్వామివారు వుండనే వున్నారు. తమ్ములుంవారికి ఆయన భక్త కోటి భక్తి పారవశ్యంతో సమర్పించిన మొక్కుబళ్ల ద్రవ్యాన్ని లెక్కిస్తూ లెక్కిస్తూ అలసిపోయి కొలమానికను తలగడగా పెట్టుకుని నిద్రలోకి జారిపోయిన వరదరాజస్వామిని మించిన 'నిద్రాదేవత' మరొకరు దొరకడం దుర్లభం కూడా. ఇక్కడా మగపెత్తనమేనా అని గునిసేవారికి లక్ష్మణులవారి అర్ధాంగి ఊర్మిళాదేవి ఉండనే వుంది.
అయితే, 'నిద్ర తెరపీ' అని పిలుచుకుంటున్న ఈ వైద్య విధానంలో అదేపనిగా నిద్ర పోవాలని మాత్రమే వైద్యులు చెబుతారని అనుకోవడం పొరబాటు. శరీరాన్ని ఆరోగ్యవంతంగా వుంచుకోవాలని అనుకునేవారు ఎలా నిద్ర పోవాలి, ఎంత నిద్ర పోవాలి, ఎంతసేపు నిద్రపోవాలి అని మాత్రమే వీరు సలహాలు ఇస్తారు. 'నిద్ర పట్టడం లేదు బాబోయ్' అని గాభరా పడిపోయే వారికి నిద్ర మాత్రలతో అవసరం లేకుండా నిద్రపట్టే పద్ధతులు చెప్పి వారిని నిద్రకు దగ్గర చేస్తారు. నిద్దట్లో లేచి ఆ తరవాత మళ్ళీ నిద్రపట్టక జాగారం చేసేవారు, రాత్రంతా నైట్ డ్యూటీలు చేసి మరునాడు నిద్రపట్టక పక్కవారిని నిద్రపోనీకుండా వేధించే వారూ, రాత్రివేళ అంతా నిద్ర పోతున్న సమయంలో నిద్దట్లోనే లేచి నడకలు సాగించే వారూ – ఇదిగో ఈ అమాంబాపతు జనమంతా ఈ తెరపీ వైద్యులను ఆశ్రయిస్తుంటారు. ‘నిద్ర పట్టకపోవడమేమిటండీ మరీ విడ్డూరం కాకపొతే!’ అని దవళ్ళు నొక్కుకునేవాళ్ళు కూడా లేకపోలేదు. ‘మా మూడోవాడు వున్నాడు చూడండీ! పక్కమీద అలా వాలిపోయాడా ఇక అంతే! ఏనుగులతో తొక్కించినా లేస్తే వొట్టు!’ అని వాపోయేవాళ్ళూ వున్నారు. ఇలాటి వారికోసమే, మాయాబజారు సినిమాలో శ్రీకృష్ణులవారి చేత ‘మత్తు వదలరా! నిద్దుర మత్తు వదలరా!!’ అనే పాట పాడించారు. ఆ పాట వింటూ మరింత నిద్రలోకి జారిపోయినవాళ్ళు కూడా వున్నారని చెప్పుకునేవారు. ఘంటసాల వారి గాత్ర మాధుర్యం అలాటిది మరి.
“నవ్వడం ఓ భోగం! నవ్వలేకపోవడం ఓ రోగం!” అన్నారు జంధ్యాల. అలాగే, ‘నిద్రపట్టడం ఓ భోగం. నిద్ర పట్టకపోవడం ఓ రోగం’ అని దీనికి అన్వయించి చెప్పుకోవచ్చు. వెనుకటి రోజుల్లో మనుషులమీదా, మనసుల మీదా ఇన్ని రకాల వొత్తిళ్ళు లేనప్పుడు వున్నవాడూ, లేనివాడూ హాయిగా ఆరుబయట పండుకుని మరింత హాయిగా నిద్రపోయేవాళ్ళు. కడుపునిండా తిండి తిననివాళ్ళు ఉంటారని వాళ్లకు తెలుసుకానీ కంటినిండా నిద్రపోని జనం వుంటారన్నది వాళ్లకు బొత్తిగా తెలియని విషయం. ఈ నాడు ఇన్ని సౌకర్యాలు వుండికూడా కాసింత నిద్రకు నోచుకోని కోటీశ్వరులు కోట్లలో వున్నారు. నిద్రకోసం 'మందే మందు' అనుకునే మందుబాబులు, నిద్ర మాత్రలు, మత్తు ఇంజెక్షన్లతో నిద్రకు దగ్గర కావాలని ఆరాటపడే గమ్మత్తు బాబులు ఈనాడు కోకొల్లలుగా కానవస్తారు. అందుకే బ్యాంకు బాలెన్సు వున్న కుబేరులకన్నా కంటి నిండా నిద్రపోగలిగిన పేదవాడే అధిక సంపన్నుడని చెబుతారు.
నిద్ర సరిగా పట్టకపోయినా, నిద్ర లేమితో బాధపడుతున్నా దాన్ని అలక్ష్యం చేయకూడదు. ఎందుకంటె, పర్యవసానాలు మరిన్ని సమస్యలకు దారితీసే అవకాశం వుంది. 'ఉత్తిష్టత జాగ్రత - మేలుకోండి. మంచిగా నిద్రపట్టే మార్గాన్ని మేలుకునివున్నప్పుడే వెతుక్కోండి. మంచి నిద్రతో చక్కటి ఆరోగ్యాన్ని ఉచితంగా సంపాదించుకోండి. సంపాదన యావలో పడి బంగారం లాటి నిద్రకు దూరం కాకండి అని ఉచిత సలహాలు ఇస్తున్నారు.
చక్కటి కవిత్వం రాయడానికి ఇంటినిండా తాటాకులూ, చేతిలో ఘంటం వుంటే చాలదూ - “నిరుపహతీ స్తలంబు, రమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చు కప్పురవిడెంబు, బంగరు టూగుటుయ్యెల” ఎట్సెట్రా ఎట్సెట్రా వుండాలని కవి పెద్దన గారు ఏనాడో ఓ పెద్ద జాబితా కవిత్వరూపంలో చెప్పారు. అలాగే మంచి నిద్ర పట్టడానికి కూడా కొన్ని చిట్కాలున్నాయిట. పడకవేయడానికి ముందు గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేసి, వేడి వేడి అన్నం తినాలట. నచ్చిన పుస్తకం కాసేపు తిరగేయాలట. పడకా, పడక గదీ ఆహ్లాదకరంగా వుండేట్టు చూసుకోవాలట. రాత్రిపూట గదిలో వెలుతురూ కూడా కంటికి ఇంపుగా వుండాలిట. అందుకే కాబోలు ఈ మధ్య మినుకు మినుకు మని మెరిసే తారలతో కూడిన వినీలాకాశాన్ని నేరుగా పడక గదిలోకి తీసుకువచ్చి గది పైభాగంలో కృత్రిమంగా తీర్చిదిద్దుకునే ఆధునిక పద్ధతులను అనేకమంది ఆశ్రయిస్తున్నారు. పోతే, మత్తు పదార్దాలకూ, మాదక ద్రవ్యాలకూ దూరంగా వుంటే నిద్ర భేషుగ్గా పడుతుందట. కానీ 'మందు కొడితేనే కానీ నిద్రపట్టదు' అని అనుకునేవాళ్లకు ఈ సలహా రుచించకపోవచ్చు.అయితే, వైద్యులు మాత్రం మత్తు పానీయాలవల్ల నిద్ర పట్టదనీ, పట్టినా సరిగా పట్టదనీ వాళ్ల లెక్కలు వాళ్ళు చెబుతున్నారు. నిద్రకు మొహం వాచిన వాళ్లకు వాళ్ల మాట వింటే పోయేదేమీ లేదు, మందు తప్ప.
ముందే చెప్పినట్టు – పొద్దున్నేఆరోగ్యంగా లేవడం కోసం రాత్రంతా హాయిగా నిద్దుర పోండి.

News Talk |Special Discussion With Senior Journalist Bhandaru Srinivas R...

14, మార్చి 2019, గురువారం

ఏది నిజం



కంటికి కనిపించేది, చెవికి వినిపించేది నిజమే అనుకుంటే పప్పులో కాలేసినట్టే.
పలానా పార్టీకి పలానా నాయకుడి గుడ్ బై. పలానా పార్టీలో చేరబోతున్న పలానా.
ఈ స్క్రోలింగులు అన్నీ నిజం కావచ్చు, కాకపోవచ్చు. ఈ లీకులన్నీ ఎలా వస్తాయి, ఎవరు ఇస్తారు అనేది జర్నలిజంలో అంతోఇంతో అనుభవం ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. ఆ ఊహాగానాల మీద ఊహాగానాలు. ఈ చర్చలు అవసరమా అంటే అవసరమే. జనాలకు అవసరం కాకపోవచ్చు కానీ,  ఆ అభ్యర్దులకు ఇవి చాలా అవసరం. తమ అభ్యర్ధిత్వం పట్ల బేరసారాల్లో పై చేయి సాధించడానికి ఇవి ఉపయోగపడతాయి. ఆ లీకులకి మరింత బలం చేకూర్చడానికి వాళ్ళే మళ్ళీ ప్రకటనలు చేస్తుంటారు, వాటిని నమ్మవద్దనీ, అవన్నీ ఆధారరహితమనీ.
ఈమధ్య ఒక పార్టీ అభ్యర్ధుల అధికార జాబితా అంటూ అన్ని టీవీల్లో స్క్రోలింగులు అదేపనిగా పరుగులు పెట్టాయి. చివరకి ఆ పార్టీ అధ్యక్షుడే స్వయంగా ప్రకటన చేయాల్సివచ్చింది, వాటిని నమ్మవద్దని, తాము అధికారికంగా ఎలాటి జాబితా విడుదల చేయలేదని.
అధ్యక్షుల వారి ప్రకటన కూడా అధికారికమా, లేక లీకుల్లో భాగమా అని సందేహించే స్థాయికి ఈ లీకుల వ్యవహారం సాగుతోంది.
కాబట్టి, కావున చెప్పేది ఏమిటంటే స్క్రోలింగులు చూసి వ్యాఖ్యానాలు చేస్తే తర్వాత నాలుక కరుచుకునే ప్రమాదం లేకపోనూ లేదని.      
   

12, మార్చి 2019, మంగళవారం

ఉడ్డుగుడుచుకుంటున్న పార్టీలు


నాలుగే నాలుగు వారాలు. అంటే నెల రోజులు.
తాము నమ్ముకున్న ప్రజలు, తాము ఇన్నాళ్ళుగా నమ్మించాలని విశ్వ ప్రయత్నం చేసిన ఆ ప్రజలు, ఇటా, అటా, ఎటో అన్న సంగతి నిర్ధారించే ఘడియకు రాజకీయ పార్టీలకు ఇప్పుడు మిగిలిన వ్యవధానం ఇంచుమించు ఇంతే!
ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్ధుల నామినేషన్లు దాఖలు  చేయడానికి తుది గడువు రెండు వారాల్లో  మార్చి ఇరవై అయిదో తేదీతో ముగిసిపోతుంది. ఈ గడువులోగా అభ్యర్ధులను ఖరారు చేయడానికి, తిరస్కరణకు గురికావడానికి ఆస్కారం లేని రీతిలో వారి నామినేషన్లను సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సకాలంలో  సమర్పించడానికి పార్టీలు, అభ్యర్ధులు  ఎంతగా అతలాకుతం ఊహకు అందని సంగతి కాదు.
గత డిసెంబరు లోనే తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిగాయి కనుక, ప్రస్తుతం ఆ రాష్ట్రంలోని పదిహేడు లోకసభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకసభతో పాటు శాసన సభకు కూడా ఎన్నికల నగారా మోగింది. అంటే, రెండువారాల వ్యవధిలో  ఆంధ్రప్రదేశ్ లోని 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోకసభ సీట్లకు ఎన్నికలు ఏ క్షణంలో వచ్చినా వాటిని ఎదుర్కోవడానికి సదా, సర్వదా సంసిద్ధంగానే ఉన్నామంటూ పలుమార్లు ఉద్ఘాటించిన నాయకులు ఇప్పుడు మల్లగుల్లాలు పడుతున్నారు.     
ఎంత కాకలు తిరిగిన రాజకీయ యోధుడికయినా ఎన్నికలు అంటే ఆషామాషీ కాదు.
ఎన్నో వ్యవహారాలు చక్కదిద్దుకుంటేనే ఆ క్రతువు పూర్తవుతుంది.
అభ్యర్ధుల ఎంపిక పెద్ద సమస్య. ఇందులో ఎన్నో విషయాలు పైకి చెప్పుకోలేనివి వుంటాయి. బయటకు మాత్రం ‘గెలుపు గుర్రాలు’ అని ఒక్క పదంతో సరిపుచ్చుతున్నారు. అభ్యర్ధి కులం ఏమిటి, ఆ నియోజక వర్గంలో ఆ కులానికి ఉన్న సంఖ్యాబలం ఏమిటి, ప్రత్యర్ధి కాగల అవకాశాలు వున్న వ్యక్తి కులం ఏమిటి ఆ కులపు బలం ఏమిటి, అభ్యర్ధి ఆర్ధిక స్థోమత ఏమిటి (దీన్ని ఎన్నికల పరిభాషలో ధన బలం అంటారు), పార్టీ పట్ల అతడి నిబద్దత ఏమిటి (నిజానికి అంచనా వేసుకోవడానికే కానీ వాస్తవంగా ఎక్కడా రుజువు కాని విషయమే, ఇది టిక్కెట్టు ఇచ్చేవారికీ తెలుసు, పుచ్చుకునేవారికీ తెలుసు, అంచేత పెద్దగా పట్టించుకోవాల్సిన సంగతి ఎంతమాత్రం కాదు) ఇలా అనేక వివరాల ఆరాలు తీసుకుని కాని అభ్యర్ధి ఎంపిక జరగదు. దీనికి ముందు కూడా  ఎంతో తంతు నడుస్తుంది. పలానా సీటు పలానా వారికి అంటూ మీడియాలో లీకులు మొదలవుతాయి. వాటి ఆధారంగా వెనక్కి తిరిగివచ్చే సమాచారం కూడా అభ్యర్ధుల ఎంపికలో కీలక భూమిక పోషిస్తుంది. చివరికి బరిలో అతడే మిగులుతాడా లేదా వేరే ‘నల్ల గుర్రం’ ఆ టిక్కెట్టు తన్నుకుపోతుందా అనేది చిట్ట చివరివరకు అనుమానమే. బీ ఫారం చేతిలో పడిన తర్వాత కూడా అమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవడానికి వీలు లేదు. చివరి ఘడియలో కూడా బొమ్మలు మారిపోవచ్చు.
ప్రచారానికి గడువు తక్కువ వుంటే ఒక రకంగా అభ్యర్ధులకు కాస్త వెసులుబాటు. ప్రచారం ఖర్చు కొంత కలిసివస్తుంది.  అయితే చాలా సందర్భాలలో ఇబ్బంది కూడా. ఉన్నట్టుండి ఎన్నికల ఘడియ తోసుకువస్తే పార్టీలు ఉడ్డుగుడుచుకుంటాయి. పోటీకి దిగాలని అనుకునే అభ్యర్ధులు ఉక్కిరిబిక్కిరి అవుతారు. దీనికి తోడు టిక్కెట్టు ఆశించి భంగపడ్డవాళ్ళు, అనుకున్న సీటు రానివాళ్ళు అటూ ఇటూ గెంతులాటలు.  
ప్రస్తుతం నడుస్తున్న కధ ఇదే!

KSR Live Show: YSRCP 9th Anniversary | YS Jagan Values and Ethics - 12th...





ప్రతి మంగళవారం మాదిరిగానే ఈరోజు ఉదయం సాక్షి టీవీ KSR LIVE SHOW చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీమతి  లక్ష్మి పార్వతి (వై.ఎస్.ఆర్.సీ.పీ), శ్రీ ఫల్గుణ (జనసేన), శ్రీ రఘురాం (బీజేపీ), శ్రీ నవీన్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్)

11, మార్చి 2019, సోమవారం

Congress Leader Tulasi Reddy Satires on Janasena and YSRCP | The Debate ...





ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు  ఉదయం AP 24 X 7 News Channel  The Debate With Venkata Krishna  చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ దినకర్ (టీడీపీ), శ్రీమతి వాసిరెడ్డి పద్మ (వైసీపీ), శ్రీ బొలిశెట్టి సత్యనారాయణ (జనసేన),  డాక్టర్ ఎన్. తులసిరెడ్డి (కాంగ్రెస్), శ్రీ సత్యమూర్తి (బీజేపీ).