ఆయన తన కాలంలో పెద్ద స్టంట్ హీరో. ఒంటి
చేత్తో పాతికమంది రౌడీలను మట్టికరిపించే దృశ్యాలను చూస్తూ ప్రేక్షకులు వేసే ఈలలతో,
చేసే కరతాళ ధ్వనులతో సినిమా హాళ్ళు మారుమోగి పోయేవి. కొన్నాళ్ళకు ఆయన రిటైర్
అయ్యాడు. కొడుకు హీరో అయ్యాడు. స్టంట్ సీన్లలో తండ్రిని మించి పోయాడు. ఒకసారి ఆ
పెద్దాయన కొడుకు నటించిన చిత్రం చూడడానికి థియేటర్ కు వెళ్ళాడు. కొడుకు చేస్తున్న
స్టంట్ సీన్లు ప్రేక్షకులను అదరగొడుతున్నాయి. ‘ఏం కొట్టాడురా మన హీరో ‘ అని కేకలు
పెడుతున్నారు. కాసేపటి తరువాత ఆ రణగొణ ధ్వనుల మధ్యలో పక్కన కూర్చున్న భార్యతో
అన్నాడు. ‘చూశావా కాంతం. ఆ రోజుల్లో రౌడీలను చితకబాదింది నేను కాదు, ఇప్పుడు
మనవాడూ కాదు. అంతా మాయ. సినీ మాయ’
9, మార్చి 2017, గురువారం
డిష్యుం డిష్యుం
8, మార్చి 2017, బుధవారం
బొమ్మను చేసీ....ప్రాణము పోసీ....
బ్రహ్మగారు సత్యలోకంలో బాసింపట్టు వేసుకుని, రేడియో వింటూ చేసే వంట లాగా, అర్ధాంగి వీణావాణి చెబుతున్నవిదంగా సృష్టి కార్యం పూర్తి చేస్తున్నారు.
'అందం అరవై దోసిళ్ళు' అన్నది సరస్వతి.
అక్షరాలా అరవై దోసిళ్ళు అందం కొలిచి పోశాడు విధాత.
'సౌకుమార్యం పాతిక గుప్పిళ్ళు' అన్నది సరస్వతమ్మ.
'తధాస్తు' అన్నాడు బ్రహ్మలుంగారు.
'అమ్మతనం అరవై, ఆత్మబలం ఆరు, అహంకారం మరో ఆరు. వినయం అయిదు, అణకువ ఆరు, మేధస్సు ముప్పై , మానసిక బలహీనతలు నలభై దోసిళ్ళు, శారీరకబలం కూరలో లవణం మాదిరిగా తగినంత.' చెప్పుకుంటూ పోతోంది చదువుల తల్లి. విధాత వింటూ మరో చేత్తో ఆ బొమ్మకు మెరుగులు దిద్దుతున్నాడు.
బొమ్మ పూర్తయింది. దాని అందం చందం చూసి హాటకగర్భురాణికే మతిపోయింది. ఇంత సౌందర్యం, ఇన్ని తెలివితేటలు, అమ్మో ఇంకేమైనా వుందా అని గాభరా పడిపోయింది.
భార్య కంగారు చూసి బ్రహ్మ తన బోసి నోళ్ళతో ముసి ముసి నవ్వులు నవ్వాడు. నవ్వి చెప్పాడు.
"నువ్వు పాళ్ళు చెబుతున్నప్పుడే అనుమానం వచ్చింది. కొన్ని శృతిమించుతున్నాయేమో అనికూడా అనిపించింది. అదీ మంచిదేలే, సరే పోనీలే అనుకున్నాను. ఎందుకంటావా? శారీరక బలం వంటలో లవణం మాదిరిగా తగినంత అన్నావు. దానికి ఇన్ని పాళ్ళు అని చెప్పలేదు. ఉజ్జాయింపుగా కొలిచివేసేటప్పుడు కొంత తభావతు తధ్యం. ఇక మానసిక బలహీనతలు ఏకంగా ఎక్కువే పెట్టావు. పాళ్ళు ఎక్కువైనా కష్టమే అన్న సూత్రం నువ్వు పట్టించుకోలేదు. వంటకం పూర్తయింది. ఇక రుచి అంటావా. వేసే దినుసుల పాళ్ళని బట్టి వుంటుంది. అలాగే, ఈ బొమ్మ బతుకూ అంతే. తెలివితేటలు, బలాబలాలు, మేధస్సు యేది తీసుకున్నా ఎవరికీ తీసిపోని మాట నిజమే. కానీ పాళ్ళలోనే తేడా. అందువల్లే ఈ విషయాల్లో ఒక స్త్రీకి మరో స్త్రీకీ ఎంతో తేడా. దండలో దారంలాగా అమ్మతనం ఒక్కటే ఆడవారందరికీ ఉమ్మడి ఆభరణం. అదొక్కటే ప్రపంచానికి కూడా పెద్దదిక్కు, ఆ గౌరవంతోనే సరిపుచ్చుకుని మిగిలిన అన్నింటినీ తేలిగ్గా మరచిపోతుంది. ఈ పుత్తడి బొమ్మకు నేనిస్తున్న అదనపు వరం ఇదొక్కటే!'
మనసు వుండాలేకాని మనుషుల్ని ఇలా కూడా మార్చవచ్చు
బహిరంగ సభని తలపించే సందర్భం అది.
చిత్తూరు జిల్లాలో మూడువందల గడప వున్న
ఆ పాత కాలువ గ్రామానికి ఏకంగా పదివేలమంది తరలి వచ్చారు. అంతమంది చేరిన చోట
చిన్న చిన్న సంఘటనలు తప్పవు. చిన్నవి అని ఉపేక్షిస్తే అలవికానివిగా మారే ప్రమాదం
పొంచి వుంటుంది. ఆ సమయంలో ఒక గంభీర స్వరం ఆ ప్రాంతంలో మారు మోగింది.
“రండి, కూర్చోండి. ప్రశాంతంగా వినండి.
“నేను మీ వూరుని దత్తత తీసుకుంటున్నా.
“మీ ఊరికి జరిగే మంచి చెప్పుకుందాం”
“ ఇది ఒక ఊరన్న మాటే కానీ పిల్లలు
చదువు కునేందుకు బడి లేదు.
“మీ పిల్లలు చదువుకోవడానికి కింద కూర్చుని ఇబ్బంది
పడనక్కరలేదు. .. ఆ ముందు వరుసలో కూర్చున్న రాజు గారు మీ బడి నిర్మాణం బాధ్యత
తీసుకుంటారు. బడికి కావాల్సిన బల్లలూ, కుర్చీలు అన్నీ
ఇస్తారు. ఇక అదిగో ఆ వారున్నారే మంచి
ఉదారులు. మీ ఊరూ కాదు, మీ ప్రాంతమూ కాదు. అయినా మీ
ఊరిమొత్తానికి చక్కటి తాగు నీటి సౌకర్యం
కల్పిస్తారు. తాగే నీళ్ళు సరిగా లేకపోతే రకరకాల రోగాలు ఒంటిని చుట్టుకుంటాయి.
అందుకే ఈ ఏర్పాటు. పిల్లలకి మంచి చదువు, మీకు శుద్ధమైన
మంచి నీళ్ళు. ఇంకా ఏమిటి మీ సమస్యలు, మొహమాట
పడకుండాచెప్పండి."
అంతే! సర్వత్రా కాసేపు నిశ్శబ్దం. ఆ వెనువెంటనే హర్షధ్వానాలు.
అప్పటిదాకా వకుళామాత గుడి మూలంగా తమకి
క్వారీ ఉపాధి పోతుందంటూ ఉద్రేక పడుతున్న గ్రామస్తులంతా ఒక్కసారిగా మారిపోయారు.
ఆనందంతో చప్పట్లు కొట్టేశారు. "మన పాత కాలువ స్వామికి జై" అంటూ
ఉత్సాహంగా నినాదాలు చేశారు.
ఆ మాటలు చెప్పింది, ఒక రాజకీయ నాయకుడు కాదు, సర్వం త్యజించిన
ఒక సన్యాసి.
‘పాతకాలువ స్వామీ దండాలు’ అన్నాయి అక్కడి గొంతులు.
ప్రపంచానికి పరిపూర్ణానంద స్వామిగా
పరిచితులయిన శ్రీ పీఠం స్వామి వారు, ఆ క్షణంలో పాతకాలువ స్వామిగా మారిపోయారు.
స్థానికులతో మమేకం కావడం అంటే ఇదే.
స్థానికుల మనసులను దోచుకోవడం అంటే ఇదే!
మన రాజకీయ నాయకులు ఎప్పుడు
నేర్చుకుంటారు - ఇలా ప్రేమతో మనుషుల్ని గెలవటం?
ఎప్పుడో కాదు ఇది జరిగింది, మొన్నీ
మధ్యనే. మార్చి నెల ఐదో తేదీన.
లేబుళ్లు:
పరిపూర్ణానంద స్వామి
పూబోండ్లకు పూల కానుకలు
అలనాటి, అంటే ముప్పయ్యేళ్ళ నాటి మాస్కో
ముచ్చట. మేము అయిదేళ్లున్న కమ్యూనిస్ట్
రష్యాలో మహిళా దినోత్సవం వేడుకలు చూడడానికి రెండు కళ్ళు చాలవు. మొత్తం దేశం దేశం
అంతా పండగ వాతావరణంతో నిండి పోతుంది. ఆడవారికి ఆ దేశంలో ప్రతి రోజూ ప్రత్యేకమైన
రోజయినా ఇక మార్చి ఎనిమిదో తేదీ మరింత ప్రత్యేకం. మహిళలకు కానుకలు ఇవ్వడానికి
పురుష ప్రపంచం పోటీ పడుతుంది. రష్యన్ మహిళలకు నగలూ, నాణ్యాలు కన్నా పూలు అంటే
ముచ్చట ఎక్కువ. పూలంటే జడలో పెట్టుకునే పూలు కాదు. సన్న సన్న కాడలతో వున్న పూలు. మైనస్
ఫార్టీ డిగ్రీలు వుండే ఆ చలిదేశంలో నిజానికి
పూలకు పెద్ద కరువు. ఆడవారికి కానుకగా ఇచ్చేటప్పుడు
బొకేల్లో వుండే పూల కాడలు బేసి సంఖ్యలో
ఉండేలా చూసుకోవాలి. సరి సంఖ్య పనికి రాదు. అంటే, మూడు, అయిదు, ఏడు, తొమ్మిది ఇలా
అన్నమాట. తెలిసినా తెలియకున్నా, ముఖ పరిచయం కూడా లేకున్నా ఈ పూల గుత్తులను ఆరోజు
బహుకరిస్తే వారు చాలా ఆనందంగా స్వీకరిస్తారు. వెలిగిపోతున్న మొహంతో కృతజ్ఞతలు
చెబుతారు. ముందే చెప్పినట్టు ఈ దృశ్యాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు.
7, మార్చి 2017, మంగళవారం
ఉబెర్ డ్రైవర్ నేర్పిన ఓ కొత్త పాఠం
పట్టుమని పాతికేళ్ళు వున్నట్టు లేవు. చేసేది డ్రైవర్ పని. ఇంటర్ చదివాడు. మునిసిపల్
కార్పోరేషన్ లో తాత్కాలిక ఉద్యోగం కొన్నాళ్ళు చేశాడు. అదీ ఒదిలేశాడు. జీతం చాలక
కాదు. ఎక్కువై. వినడానికే వింత అనిపించేలా వున్నాయి అతడి మాటలు. నెలకు ఆరువేలు
ఇచ్చేవారు. అదేమంత పెద్ద జీతం కాదు, కానీ అందుకు తగ్గ పని వుండేది కాదు,
రెండుగంటలు పనిచేయడం, ఆరుగంటలు గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవడం. ఆరువేలు తీసుకుని
రోజుకు రెండు గంటలే పనిచేయడం అతడికి అస్సలు నచ్చలేదు. అందుకే ఒదిలేసి ఉబెర్
డ్రైవర్ పనిలో చేరాడు. పేరు మోడరన్ గా
ప్రభాత్ కుమార్. కానీ కదిలిస్తే అన్నీ ఆధ్యాత్మిక భావాలు.
(శ్రీ ప్రభాత్ కుమార్)
తీరిక దొరికినప్పుడల్లా ఇందిరా పార్కు
దగ్గర రామకృష్ణ మఠంలో గడుపుతాడు. రామకృష్ణ ప్రభ కు ఏడాది చందా కట్టాడు. కానీ రెండు
నెలలు గడవక ముందే ఇల్లు మారాల్సి వచ్చింది. ఆ పత్రిక చదవకపోతే అతడికి తోచదు.
అందుకని మళ్ళీ వెళ్లి కొత్త చిరునామాతో మరో ఏడాది చందా కట్టాడు. నిజానికి ఆ పత్రిక
తిరగేయడానికి ఎంతో టైం పట్టదు. కానీ అతడు తిరగేయడు. చదువుతాడు. అదీ మనసుపెట్టి. ఆ మాసపత్రికను
నెలంతా చదువుతూనే ఉంటాడు. చదివినదే అయినా మరోసారి, మరోసారి, అలా చదువుతూనే ఉంటాడు.
బిజినెస్ మేనేజ్ మెంట్ లాగా ఫ్యామిలీ మేనేజ్
మెంట్ కోర్సులు పెట్టాలంటాడు. చిన్నాభిన్నమైపోతున్న కుటుంబ వ్యవస్థను
కాపాడుకోవాలంటే అలాంటి చదువులు అవసరమంటాడు ప్రభాత్ కుమార్.
చిన్నవాడయినా మంచి మాట చెప్పాడు.
ఉబెర్ డ్రైవర్ పుణ్యమా అని ఈరోజు ఓ
కొత్త పాఠం నేర్చుకున్నాను.
లేబుళ్లు:
ఉబెర్ డ్రైవర్ నేర్పిన ఓ కొత్త పాఠం
5, మార్చి 2017, ఆదివారం
హృదయ వైశాల్యం
కొన్నేళ్ళ క్రితం అమెరికాలో ఉంటున్న మా
మనుమరాళ్ళ క్లాసు టీచరు మిసెస్ సూజన్ విల్సన్, ఆమె కుటుంబం హాలీడే కోసం ఇండియా వచ్చారు. ‘పనిలోపనిగా హైదరాబాదు కూడా చూసిరండి’ అని మా
వాళ్ళు మా అడ్రసు ఇవ్వడంతో మా ఇంటికి వచ్చారు. ఇంట్లో వుండడం వసతిగా వుండదేమో అన్న
సందేహంతో మేము వారికోసం రెండు హోటల్ గదులు బుక్ చేసాము. అయినా వాళ్ళు మాతో పాటు మా
ఇంట్లోనే మూడు రోజులు వున్నారు. పిజ్జాలు అవీ ఆర్డరు చేసినా వాళ్ళు వేలేసి
ముట్టుకోలేదు. కూరలు, పచ్చళ్ళతో మా ఆవిడ పెట్టిన భోజనమే తిన్నారు. ఆటోలలో ఊరంతా
తిరిగారు. అమెరికాలో తమ స్నేహితులకి కానుకలుగా ఇవ్వడానికి చార్మినార్ దగ్గర గాజులు
కొనుక్కుని వెళ్ళారు. వున్న మూడు రోజులు మాతో కలిసే వున్నారు కానీ కలిసి ఉంటూ విడిగా
ఉండడానికి ప్రయత్నించ లేదు.
అదే మేము అమెరికా వెళ్లినప్పుడు ఇడ్లీ,
దోసె దొరికే హోటళ్ళ మీద పడ్డామే కానీ, వాళ్ళ ఆహార విహారాల ముచ్చటే పట్టించుకోలేదు.
ఇతరులతో కలిసిపోయే తత్వం, అంతటి విశాల
హృదయం మాలో లేదని ఎందుకో ఇప్పుడు
తలచుకుంటే అనిపిస్తోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)











