5, మార్చి 2017, ఆదివారం

అసెంబ్లీ తీరుతెన్నులు, కొన్ని జ్ఞాపకాలు

(ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అసెంబ్లీల సమావేశాలు మొదలవుతున్న సందర్భంగా) 

1958 - 59 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ పై ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీలో
చర్చ జరుగుతోంది. అంటే దాదాపు యాభై అయిదేళ్ళ కిందటి ముచ్చట.
ఒక సభ్యుడు లేచి అన్నారు. ' పన్నులన్నీ తెలంగాణపై రుద్దుతున్నారుఅని.
ఆర్ధిక మంత్రి వెంటనే  స్పందించారు, 'గౌరవ సభ్యులు వాడిన 'రుద్దుతున్నారుఅనే పదం బయట పర్వాలేదు. కానీ సభలో 'కర్ణ కఠోరం'గా  వుంటుంది'
సభ్యుడు లేచి 'అలా అన్నందుకువిచారం వెలిబుచ్చారు.
ఆ ఆర్ధిక మంత్రి పేరు బెజవాడ గోపాల రెడ్డి.
ఆ పదం వాడితరువాత విచారం వ్యక్తం చేసిన  సభ్యుడు ఎవ్వరో కాదు,  తదనంతర కాలంలో యావత్ భారత దేశానికి అయిదేళ్ళ పాటు ప్రధాన మంత్రిగా పనిచేసిన పీ.వీ. నరసింహారావు.
అవీ ఆ రోజులు.
అలనాటిఅంటే ఓ నలభయ్యాభయ్ ఏళ్ళక్రితం జరిగిన  శాసన సభ సమావేశాల్లో,  తీవ్రమైన చర్చల నడుమ వాతావరణాన్ని చల్లబరచడానికి కొన్ని  చలోక్తులు కూడా వినబడేవి.
తెలుగు పత్రికల్లో  ఈ ఛలోక్తులను  'బాక్స్కట్టి మరీ ప్రచురించేవారు. చదువుకోవడానికి తమాషాగానే కాకుండా ఆహ్లాదకరంగా  కూడా ఉండేవవి.
1958 లో కళా వెంకటరావు గారు రెవెన్యూ మంత్రి.  రాములు అనే సభ్యుడు (ఇంటి పేరు గుర్తు రావడం లేదు) మంత్రిని  తమాషా పట్టించాలని'మంత్రిగారు మాట్లాడుతున్నది కొండ నాలుకతోనా లేక కొన నాలుకతోనాఅని జోకబోయారు. అంటే మంత్రిగారు చెప్పేవన్నీ పై పై మాటలుఒక్కటీ కరెక్టు కాదు అనేది ఆ సభ్యుడి ఉద్దేశ్యం.
కళా వెంకటరావు గారు సామాన్యుడు కాదుకదా! వెంటనే తిప్పికొట్టారు.
'మనిషి అనేవాడు ఎవరయినా నాలుకతోనే మాట్లాడుతాడు. కొండ నాలుకతో ఎవ్వరూ మాట్లాడరు. మరి రాములు గారు కొండ నాలుకతో మాట్లాడుతారేమో నాకు తెలియదు'
ఆ దెబ్బతో రాములుగారు కిమ్మిన్నాస్తి. గమ్మున కూర్చుండిపోయారు.
పూర్వం ఆంద్ర ప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన నీలం సంజీవ రెడ్డి గారు ఒకసారి సభలో ప్రసంగిస్తూ భారతం లోని ఒక ఘట్టాన్ని ఉదాహరించి అందర్నీ ఆశ్చర్య పరిచారు. 1959 ఆగస్టు ఒకటో తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ఆయన సమాధానం చెబుతున్నారు. ఆరోజుల్లోనే  కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేరళలో ఏర్పడ్డ మొట్టమొదటి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన  విధించింది. దీనికి నిరసనగా ఆంద్ర ప్రదేశ్ శాసనసభలోని కమ్యూనిస్టులు సభ నుంచి వాకౌట్ చేసారు. అది సంజీవరెడ్డి గారికి నచ్చలేదు. అదే విషయం తన ప్రసంగంలో ప్రస్తావించారు. 'కేరళలో కమ్యూనిస్టులకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఆ పార్టీ ప్రజల  మన్నన పొందగలిగితే  తిరిగి అధికారంలోకి రావచ్చు. కర్నూలులో వుండగా ప్రకాశం గారి ప్రభుత్వం పోయింది. ఆ తరువాత కాంగ్రెస్ కి నాలుగు సీట్లు కూడా రావనుకున్నాము. కానీమళ్ళీ అధికారంలోకి వచ్చాము. ఒకసారి ఒక పార్టీ , మరొక సారి మరో పార్టీ అధికారంలోకి రావచ్చు. ఇది వేదకాలం  నుంచీ ఎరిగిన  ధర్మం. యుద్ధంలో కూడా ఏదో ఒక పక్షమే గెలుస్తుంది. తిక్కన  భారతం  ఉత్తర గోగ్రహణంలో భీష్ముడు దుర్యోధనుడితో చెబుతాడు.'........పెనంగిన బలంబులు రెండును గెలవ నేర్తునేఅని. ఈ నీతి ఈనాడు కూడా వర్తిస్తుందిఅని చెప్పారు సంజీవరెడ్డి గారు.
1976 లో జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో దాదాపు నలభయ్ యాభయ్ మంది సభ్యులు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడినంత సేపు ముఖ్యమంత్రి సభలో తన స్థానం నుంచి కదల లేదు. మౌనంగా సీట్లో కూర్చుని సభ్యులు ప్రస్తావించిన వివిధ అంశాలపై నోట్స్ రాసుకుంటూ పోయారు. తరువాత తన సమయం రాగానే లేచి సుమారు గంటన్నరపాటు అన్ని అంశాలను స్పృశిస్తూ సమాధానం చెప్పారు. సభలోని యావన్మందీ వెంగళరావు ప్రసంగాన్ని మెచ్చుకున్నారు.
తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ఏ పద్యం అయినా రాగయుక్తంగా కాకపోయినా ఎలాటి స్ఖాలిత్యాలు దొర్లకుండా పండిత ప్రకాండులు  మెచ్చే  విధంగా పాడగలరనేది జగమెరిగిన సత్యం. భారత భాగవతాల్లోని అనేక పద్యాలు కేసీఆర్ కి కంఠోపాఠం. దాశరధినారాయణ రెడ్డి వంటి కవుల గేయాలు ఆయన ప్రసంగంలో ఆశువుగా దొర్లుతుంటాయి. ఒకసారి రవీంద్ర భారతి లో జరిగిన ఒక కార్యక్రమంలో సినారె పక్కన ఉండగానే కేసీఆర్నారాయణరెడ్డి గారు రాసిన తొలి సినిమా పాటను యధాతధంగా వినిపించి శ్రోతలను అలరించారు.  గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య గారు బహిరంగ సభల్లో కూడా పద్యం ఎత్తుకునేవారు. ఆయన ఏ.ఐ.సీ.సీ. అధ్యక్షులుగా వున్నప్పుడు ఢిల్లీలో  సంజీవయ్య గారు వుండే బంగళా సాహిత్య గోష్టులకు వేదికగా ఉండేదని 'కలం కూలీజీ. కృష్ణగారు తన అనుభవాల్లో రాసారు. సరే!  ముఖ్యమంత్రిగా ఉంటూ హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించిన   డాక్టర్ రాజశేఖర రెడ్డికి సయితం పద్యాలు వచ్చన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా వున్నప్పుడు ఏకంగా ఒక పద్యం మొత్తం సభలో చదివి వినిపించారు. 2001- 2002 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ పై జరిగిన చర్చను ప్రారంభిస్తూ చంద్రబాబు పరిపాలనలో వున్న రాష్ట్రాన్ని ఆ భగవంతుడే కాపాడాలనిభారతంలో  తిక్కన విరచిత పద్యం - 'సారపు ధర్మమున విమల సత్యము ....అని మొదలెట్టి ఒక పద్యం చదివి వినిపించారు.
"ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు దక్షత కలిగిన భీష్మద్రోణుల వంటి వారు కూడా మౌనంగా వుండిపోయారు. అలా ఉపేక్షిస్తే అది వారికే చేటవుతుంది. కానీ ఏదో ఒకరోజున భగవంతుడే కల్పించుకుని సత్యాన్నిధర్మాన్ని నిలబెడతాడు. ఈ రాష్ట్రాన్ని కూడా ఆ దేవుడే కాపాడాలి"  అని ప్రసంగం  ముగించారు రాజశేఖర రెడ్డి.             
మరోసారి 2003 ఫిబ్రవరిలో గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చలో పాల్గొంటూదేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన గేయభాగాన్ని వై.యస్.ఆర్. చదివి వినిపించారు.
'ఒక్క నిరుపేద ఉన్నంతవరకుఒక్క మలినాశ్రువు బిందువు ఒరిగినంతవరకుఒక్క శుష్క స్థన్య సన్నిధిని క్షుదార్తి ఏడ్చు పసిబాలిక ఉన్నంతవరకునాకు శాంతి కలుగదింక నేస్తం ..... ఈ ఆర్తి ఏ  సౌధాంతరాలకు  పయనించగలదుఏ రాజకీయవేత్త గుండెలను స్పృశించగలదుఅంటూ 'పేదవాడి ఆర్తిని వినే ప్రయత్నం చేయండి ముఖ్యమంత్రిగారుచేయండి ముఖ్యమంత్రిగారుఅని తనదైన శైలిలో ప్రసంగం ముగించారు.   
చంద్రబాబు నాయుడు గారిది అదో తరహా. శాసన సభలో ఆయన చేసే ప్రసంగాలలో పద్యాలుగేయాలు వుండవు. కానీ ఆర్ధిక అభ్యున్నతి గురించి,సంస్కరణలు గురించి కొందరు ప్రముఖులు ఆయా సందర్భాలలో చేసిన  కొటేషన్లు బాగా చోటుచేసుకుంటాయి. ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తాను  చేపట్టిన వివిధ అభివృద్ధి పధకాలు గురించి ప్రతిపక్ష నాయకుడిగా చేసే ఉపన్యాసాలలో వివరించే ప్రయత్నం చేస్తారు. అలాగే,ముఖ్యమంత్రిగా సభలో మాట్లాడేటప్పుడు కూడా ఈ పధకాల వివరాలు ఎక్కువగా ఉండే విధంగా జాగ్రత్త పడతారు.  
1999  నవంబరు 16 వ తేదీన గవర్నర్ ప్రసంగంపై చర్చకు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన సమాధానంలో కొన్ని భాగాలు ఇలా వున్నాయి.
"నేను రాష్ట్రం అభివృద్ధిని కోరుకుంటున్నాను. నా పట్ల ప్రజలకున్న  అభిమానాన్నే  నమ్ముకున్నాను. అందువల్లే ఎన్నికల్లో మీ అంచనాలు తారుమారయ్యాయి. ప్రజల ఆశీర్వాదం నాకుంటుంది అని మొదటినుంచీ చెబుతున్నాను. అదే ఈనాడు నిజమైంది. కుల్  దీప్ నాయర్  మాట్లాడుతూ, 'నేను ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిని అభినందించడం లేదుఆంద్ర ప్రదేశ్ ఓటర్లని అభినందిస్తున్నాను. ఒక విజ్ డమ్ ని వాళ్ళు వ్యక్తం చేసారు. చాలా మెచ్యూరిటీ ప్రదర్శించారు. కర్నాటకమహారాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా ఆంద్ర ప్రదేశ్ మాకు ఆదర్శం అంటున్నారు. ఇండియన్  ప్రైమ్ మినిస్టర్ ఇంకా గట్టిగా చెప్పారు. 'దేనికయినా ఆంద్ర ప్రదేశ్ కొలమానంఅని. 'అభివృద్ధి విషయంలో అన్ని రాష్ట్రాలు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అనుసరించాలిఅని. ఇంటర్నేషనల్ మీడియా కూడా అదే  చెబుతోంది. దేశంలో బెస్ట్ విజన్ వున్న వ్యక్తి  ఎవరంటే ఆంద్రప్రదేశ్ సీ.ఎం. అని విద్యార్ధులు కూడా చెప్పే పరిస్తితి వుంది.ఇలా సాగింది ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం.
'ఈ నడుమ ఒక ఎకానమిస్టు చెప్పాడు. ఆంద్ర ప్రదేశ్ లో నాయుడు కోరుకుంటున్న విప్లవం ఊహల్లో ఊహించుకునేది కాదుచేసి చూపించగలిగేదిఅని. ఇప్పుడు దేశానికి కావాల్సిన సరయిన నాయకుడు చంద్రబాబే అని కూడా ఆ ఎకానమిష్టే చెప్పారన్నారు చంద్రబాబు.
'మహాత్మా గాంధీ అన్నారు. ఒకరికి ఆదర్శం బోధించాలి అంటే ఆ ఆదర్శాన్ని మనమూ పాటించాలి అని. అప్పుడే ఒకళ్ళకు చెప్పినా వాళ్ళు వినే పరిస్తితి వుంటుంది. 'ప్రతిపక్ష నాయకులు (వై.యస్.ఆర్.) చాలా స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తే తప్పకుండా సహకరిస్తామని. వారిని మనః స్పూర్తిగా  అభినందిస్తున్నాను. వాళ్ళు సభలో వన్ తర్డ్ వున్నారు. అందుకే అందర్నీ కలుపుకుని ముందుకు పోవాలని అనుకుంటున్నాను.అన్న అభిలాష వ్యక్తం చేసారు.
ఆనాడు చెప్పిన ఈ మాటను చంద్రబాబునాయుడు ఈనాడు నిలబెట్టుకోగలుగుతున్నారా అంటే అనుమానమే.


3, మార్చి 2017, శుక్రవారం

రాజకీయ నాయకులు, అధికారులు

‘నిశ్శబ్దం చాలా భయంకరంగా వుంటుంది’ అనే డైలాగు వుంది ఓ సినిమాలో.
ఒక్కోసారి నిశ్శబ్దం దిమ్మ అదరగొడుతుంది.
లెఫ్ట్ నెంట్ జనరల్ నిరంజన్ మాలిక్ అనే రిటైర్డ్ సైనికాధికారి చెప్పిన విషయం ఇది.
1947 లో దేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తల్లో జవహర్  లాల్   నెహ్రూ భారత సర్వ సైన్యాధ్యక్షుడిగా ఎవరిని నియమించాలి అనే విషయంలో సీనియర్ సైనికాధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసారు. అందులో  నెహ్రూ చేసిన ప్రతిపాదన అధికారులను నివ్వెర పరచింది. ‘ఈ పదవికి భారత సైన్యంలో తగినవాళ్ళు ఎవ్వరూ లేరు. కాబట్టి కొంతకాలం పాటు ఎవరయినా  అనుభవం కలిగిన బ్రిటిష్ అధికారితోనే వ్యవహారాలు నడిపించాలనేది నెహ్రూ ఉద్దేశ్యం. ఆ పదవికి తగిన అనుభవం, సమర్ధత వున్న భారతీయులు లేరని తాను అనుకుంటున్నానని ఆయన మొహమాటం లేకుండా చెప్పేశారు. సాక్షాత్తు నెహ్రూనే  అలా అంటుంటే కాదనే ధైర్యం ఎవరికి వుంటుంది. అందువల్ల ఇష్టం లేకపోయినా తల ఊపారు. ఇంతలో నాథూ సింగ్ రాథోర్ అనే సీనియర్ అధికారి లేచి నిలబడి మాట్లాడడానికి అనుమతి కోరాడు. అలా ధైర్యంగా ఒక ఆధికారి చొరవ  తీసుకుని అడగడంతో నివ్వెర పోవడం నెహ్రూ వంతయింది. అయినా తేరుకునిచెప్పదలచుకున్నది సూటిగా, భయపడకుండా చెప్పమని ప్రోత్సహించాడు. అప్పుడు రాథోర్ ఇలా అన్నాడు.
‘సర్! దేశాన్ని పాలించే సమర్ధత కలిగిన నాయకుడు కూడా మనకు లేడనుకుందాం. అలా అని,  బ్రిటన్  నుంచి మంచి అనుభవశాలిని మన ప్రధానమంత్రిగా తెచ్చుకోవడం సబబుగా ఉంటుందా?’
రాథోర్ అలా అడగడంతో అక్కడ కొద్దిసేపు నిశ్శబ్దం రాజ్యం చేసింది. నెహ్రూకు కూడా అతడు అడిగిన దాంట్లో విషయం బోధ పడింది. అయన వెంటనే  రాథోర్ వైపు తిరిగి ‘ఈ పదవి నీకే ఇస్తానునువ్వు నిభాయించుకునిరాగలవా?’ అని అడిగారు.
రాథోర్ తొట్రు పడకుండా సమాధానం చెప్పాడు.  ‘సర్! మన సైన్యంలో అత్యంత సమర్థుడు అయిన ఓ అధికారి వున్నారు.ఆయన  నా సీనియర్. జనరల్ కరియప్ప. మా అందరిలోకి చాలా చేవకలిగినవాడు’
ఆ విధంగా జనరల్ కరియప్ప భారత దేశపు మొదటి సర్వ సైన్యాధ్యక్షుడు కాగలిగారని నిరంజన్ మాలిక్ కధనం.

వ్యవస్థల నడుమ ఘర్షణలు –కొన్ని జ్ఞాపకాలు


ఇది ఇప్పటి మాట కాదు, జరిగి అటూ ఇటూగా  యాభయ్ ఏళ్ళు.
బెజవాడ రైల్వే ప్లాటు ఫారం. కృష్ణా జిల్లా కలెక్టర్ హడావిడిగా రాత్రివేళ అక్కడికి చేరుకున్నారు. కారణం వుంది. రైల్వే అధికారులపై ఆయనకు ఆగ్రహం  వచ్చింది. హైదరాబాదు నుంచి వైజాగ్ వెడుతున్న ఒక ఉన్నతాధికారికి కలిగిన అసౌకర్యం అందుకు కారణం. అధికారి రైల్వే రిజర్వేషన్ గురించి ముందుగానే రెవెన్యూ అధికారులు రైల్వే వారికి సమాచారం అందించి, రిజర్వేషన్ గురించిన అర్జీ ముందుగానే అందచేశారు కూడా. ఆరోజుల్లో రిజర్వేషన్ల వ్యవహారం ఇప్పట్లా కంప్యూటర్ల సాయంతో జరిగేది కాదు. హైదరాబాదు నుంచి వైజాగ్  వెళ్ళే వాళ్ళు బెజవాడలో రైలు మారి మరో రైల్లో వెళ్ళాలి. రిజర్వేషన్ చార్టులో హైదరాబాదు అధికారి పేరు లేదు. రెవెన్యూ అధికారులకు ఏం చెయ్యాలో పాలిపోలేదు. కలెక్టర్ నేరుగా రైల్వే ఉన్నతాధికారితో మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. రైల్వే వారికీ, రెవెన్యూ వారికీ మాట పట్టింపు వచ్చింది. ఎవరికి వారు తమ వాదనే సరయినది అనుకోవడం వల్ల ఆ పట్టింపు పంతానికి దారి తీసింది. రిజర్వేషన్ ఇవ్వడం కుదరదు అంటే కుదరదు అన్నారు.
కలెక్టర్ తన పవర్ చూపించారు. జిల్లా మేజిస్ట్రేట్ అధికారాలను ఉపయోగించుకుంటూ అక్కడికక్కడే ప్లాటు ఫారం మీదనే కోర్టు ఏర్పాటు చేశారు. దురుసుగా ప్రవర్తించిన రైల్వే అధికారిని అరెస్టు చేయాలని ఆర్డరు వేశారు. రైల్వే వారికి పరిస్తితి అర్ధం అయింది. మెట్టు దిగి వచ్చి హైదరాబాదు అధికారికి బెర్తు ఏర్పాటు చేశారు.
ఇటువంటిదే మరో ఘర్షణ హైదరాబాదు పోలీసులకు, మిలిటరీ వారికీ జరిగింది. ఆబిడ్స్ పోలీసులు  ఒక మిలిటరీ జవానుతో మాటామాట పెరిగి అతడిని  అరెస్టు చేశారు. ఆ రాత్రి ఒక పెద్ద వ్యానులో వచ్చిన మిలిటరీ వారు పోలీసు స్టేషన్ పై దాడి చేసి తమ వాడిని విడిపించుకుని పోవడమే కాకుండా కొందరు పోలీసులను కూడా తమవెంట పట్టుకుపోయారు.

ఈ వివాదం సమసిపోయేలా చేయడానికి ఉన్నతాధికారులకు తల ప్రాణం తోకకు వచ్చింది.           

ఆంధ్రరాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు




దాదాపు 64 సంవత్సరాలక్రితం  వెనుకటి మద్రాసు రాష్ట్రం నుంచి విడివడి కర్నూలు రాజధానిగా ఆంద్ర రాష్ట్రం ఏర్పడితే, 1956 లో అవతరించిన  మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రం అయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి  తెలంగాణా విడిపోవడంతో 2014 జూన్ లో రాజధాని అంటూ లేని కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్  ఊపిరి పోసుకుంది. నాటి ఆంధ్ర రాష్ట్రంలో తాత్కాలిక ప్రాతిపదికపై ఏర్పాటుచేసిన భవనాల్లో అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఈనాటి ఆంధ్రప్రదేశ్ లో తాత్కాలిక ప్రాతిపదికన నిర్మించిన శాశ్విత భవనంలో అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఆరు నుంచి జరగబోతున్నాయి. కొత్త రాష్ట్రం ఏర్పడ్డ అనతికాలంలోనే శాసన వ్యవస్థను అక్కడికి తరలించడం ఒక శుభ పరిణామం. శాసన నిర్మాతలకు ముందస్తు  శుభాకాంక్షలు.
ఈ సందర్భంగా కొన్ని గత కాలపు ముచ్చట్లు.
1953 అక్టోబరు ఒకటవతేదీన అప్పటి మద్రాసు రాష్ట్రం నుంచి విడివడి ఆంద్ర రాష్ట్రం ఏర్పడింది. మద్రాసు అసెంబ్లీకి ఆంద్ర ప్రాంతం నుంచి ఎన్నికయిన 140 సభ్యులతో ఆంధ్ర రాష్ట్రం శాసన సభను ఏర్పాటు చేసారు.118 నియోజక వర్గాలనుంచి ఎన్నికయిన సభ్యులు వాళ్ళు. ఇప్పటి కాలం వారికి తెలియని మరో విషయం ఏమిటంటే  ఆ రోజుల్లో ద్విసభ్య నియోజక వర్గాలు ఉండేవి. మొత్తం  118 నియోజక వర్గాల్లో  22 ద్విసభ్య నియోజకవర్గాలు. మళ్ళీ వీటిలో  19 షెడ్యూల్డ్ కులాలకు కేటాయించగా మిగిలిన మూడు ద్విసభ్య నియోజక వర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున మూడు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేసారు. 1953  నవంబరు  23 వతేదీన ఆంధ్రా అసెంబ్లీ మొదటి సమావేశం జరిగింది. ఎం.వీ.ఎల్. నరసింహారావు ప్రోటెం స్పీకర్ గా నియమితులయ్యారు. ఆయన ఆధ్వర్యంలో అదే రోజున నల్లపాటి  వెంకటరామయ్యను స్పీకర్ గా, పసల సూర్యచంద్ర రావును డిప్యూటీ స్పీకర్ గా ఎన్నుకున్నారు. అయితే ఈ శాసన సభ పూర్తికాలం గడవకముందే  1954 నవంబరు  15 తేదీన రద్దయింది.
తరువాత  హైదరాబాదు స్టేట్  విలీనంతో ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి  నిజాం నవాబులు నిర్మించిన అపూర్వ సౌధాలు విడిదిగా మారాయి. తదనంతర కాలంలో పెరిగిన అవసరాలకు తగ్గట్టుగా నూతన అసెంబ్లీ భవనం నిర్మించాలనే ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి తలంపు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాములో ఒక రూపానికి వచ్చింది. అన్ని హంగులతో నిర్మించిన  ఆ కొత్త భవనానికి నాటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధి ప్రారంభోత్సవం చేశారు. అప్పుడు స్పీకర్ గా వున్నది జీ. నారాయణ రావు. కాంగ్రెస్ వ్యతిరేక విధానంతో పురుడుపోసుకున్న తెలుగుదేశం పార్టీ హయాములో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రధానమంత్రిని ముఖ్య అతిధిగా ఆహ్వానించడం ఒక విశేషం. రాజీవ్ గాంధి ప్రారంభోత్సవ ప్రసంగం చేస్తున్నంత సేపు ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆయన పక్కనే గౌరవపురస్సరంగా నిలబడి తెలుగువారి అతిధి మర్యాదలకు కొత్త నిర్వచనం  ఇచ్చారు.


ఇప్పుడు వెలగపూడిలో నిర్మించిన అధునాతన అసెంబ్లీ భవనానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారంనాడు  ప్రారంభోత్సవం చేసారు. నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో ఇది తొలి సోపానంగా భావించవచ్చు.
ఒక చిన్న పోలిక ఏమిటంటే నాడు ఆంధ్ర అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన నల్లపాటి వెంకటరామయ్య, ఈనాటి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఇద్దరూ గుంటూరు జిల్లాకు చెందినవారు కావడం.
వెలగపూడిలో అసెంబ్లీ భవనం హంగులను గురించి మీడియాలో చక్కని కధనాలు వెలువడుతున్నాయి.
నూతన భవనం  ఎంతో  అందంగా అన్ని హంగులతో  వుంది సరే! మరి  అందులో కార్యకలాపాలు సొగసుగా జరగాలి కదా!
ఈ విషయంలో కూడా శాసనకర్తలు తమ కర్తవ్యాన్ని సరిగా నిర్వహిస్తే అంతకంటే కావాల్సింది ఏముంటుంది!        

2, మార్చి 2017, గురువారం

ఈగ పాతదే, ఈ కధా పాతదే!

ఈగఖరీదు
(రాజమౌళి ‘ఈగ’ సినిమాకు స్వర్ణ నంది పురస్కారం లభించిన సందర్భంలో మా మూవీస్ లో ఆ సినిమా వేస్తున్నారు. అది చూస్తున్నప్పుడు ఎప్పుడో 2012 లో జులై 15 వతేదీన ఆ సినిమా గురించిన ఓ జ్ఞాపకం ఇది)
No automatic alt text available.
ఈగఖరీదు అక్షరాలా నాలుగువేల ఎనిమిది  వందల ఎనభై రూపాయలు. ఇదెలాగంటారా! చిత్తగించండి.
హైదరాబాదులో థియేటర్ కు వెళ్లి సినిమా చూడడమనేది చాలా అరుదు. అధవా, ఎప్పుడయినా వెళ్ళామంటే గోకుల్ థియేటర్ కే. అదీ ఏదయినా కొత్త సినిమా మొదటి వారంలోనే. ఎందుకంటే ఆ సినిమాహాల్లో వారం వారం పిక్చర్లు మార్చి వేస్తుంటారు. ఆ థియేటర్ ఓనర్లలో ఒకడయిన శ్రీనివాస యాదవ్, మా రెండో అన్నయ్య కుమారుడు సుభాష్ చంద్ర బోస్ చిన్ననాటి స్నేహితులు కావడం మూలాన, టిక్కెట్లు దొరకవు అన్న బాధ లేకపోవడం మూలాన, మా అన్నదమ్ముల కుటుంబసభ్యులం అందరం కట్టగట్టుకుని వెళ్ళే సందర్భం కావడం మూలాన,  సాధారణంగా నేను కూడా ఇరవై నుంచి పాతిక వరకు వుండే ఈ కొత్త సినిమా ప్రేక్షక వర్గంలోచేరుతూనే వుంటాను. అలా చూసిన సినిమా నాలుగు రోజులు గుర్తుండి పోయే సినిమా కావడం అన్నది సక్రుత్తు గా జరిగే విషయం.
నిన్న శనివారం కూడా అలాటి సందర్భం వచ్చింది. పెద్దా చిన్నా, పిల్లా మేకా, ముసలీ ముతకా  పాతికమందిమి కలిసి వెళ్లి ఆ థియేటర్లో ఈగసినిమా చూసాము. చూసినవాళ్లలో మెజారిటీ రాజమౌళి అభిమానులే కాబట్టి సినిమా గురించిన చర్చ హద్దులలోనే సాగింది. ఈగవీక్షణానంతరం సాయివాళ్లింట్లో భోజనాలు మొదలు పెట్టబోయేలోగా సెల్లు సుతారంగా మోగింది. చూస్తే బ్యాంకు నుంచి అలర్ట్  మెసేజి. ఫలానా షాపులో మీరు ఇప్పుడే ఇంత తగలేశారు. తగలేయగా పోను మీకు ఇంకా తగలడివున్న బ్యాలెన్సు ఇంతఅంటూ ఓ శ్రీముఖం. కార్డు సొంతదారునయిన నేను,  ఆ కార్డుకు  యాడాన్’  కార్డు సొంతదారిణి ( అదేవిటో తెలుగు కూడా అలాగే తగలడి చస్తోంది సుమా) అయిన మా ఆవిడ వైపు ఓ చూపు పారేసి, సినిమా మధ్యలో కూడా లేచి వెళ్లి షాపింగు చేసి వచ్చిన ఆవిడ సామర్ధ్యాన్ని కంటి చూపుతోనే మెచ్చుకోబోయాను. కానీ నా వాలకాన్ని పసికట్టిన మా ఆవిడ యేమయిందంటూతన తరహాలో గుడ్లురిమి చూస్తూ నాకర్ధమయ్యే భాషలో ఇతరులకు తెలియకుండా అడిగింది. అలా నలుగురిలో పడ్డ పాము ఎవరిచేతిలో చావకుండా ఇప్పుడేంచేయాలన్న ప్రశ్నను మాముందుంచి తాను చల్లగా తప్పుకుంది. కార్డును డీయాక్టివేట్ చేయడం ఒక్కటే మార్గమని మా కుటుంబం యావత్తూ ఏకాభిప్రాయానికి వచ్చేలోగా చేతిలో సెల్లు మరోమారు మోగింది. చూస్తే ఏముంది. బ్యాంకు నుంచి మరో ఎస్సెమ్మెస్ ఎలర్ట్. ఏంచేయాలేంచేయాలని అలా ఆలోచిస్తూనే వుండండి, ఈ లోగా మీ కార్డు కొట్టేసిన దొంగ గారు,   ‘విజిటింగు కార్డు బదులు క్రెడిట్ కార్డు నొక్కేస్తే పోయేదన్న ఈగసినిమా డైలాగు పట్టుకుని ఇప్పటికప్పుడే మరో రెండువేల ఐదువందలకు దర్జాగా షాపింగు చేసి అంత దర్జాగా వెళ్లిపోయాడన్నదిఆ ఎలర్టు సారాంశం.
ఈ తరహా చర్చల్లో పడితే, ‘ఈగసినిమా బడ్జెట్ పదికోట్లనుంచి ముప్పయి కోట్లకు పెరిగిపోయిన చందంగా దొంగ గారి షాపింగ్ స్ప్రీ అదే తరహాలో సాగిపోయే ప్రమాదాన్ని మేమందరం కొంచెం కొంచెం పసికడుతున్న  తరుణంలో రాచ పీనుగ తోడు లేకుండా  కదలదుఅన్నట్టు పోయిన కార్డుతో పాటు మరో బ్యాంకు కార్డు కూడా కనబడం లేదని మా శ్రీమతి చావుకబురు చల్లగా చెప్పింది. దాంతో అందరం ఎమర్జెన్సీ యమర్జెంటుగా ప్రకటించేసుకున్నాం.   తలా ఒక లాప్ టాప్ పట్టుకుని కొందరూ,  సెల్ ఫోన్లతో మరికొందరూ,  లాండ్ లైన్ సాయంతో ఇంకొందరూ ఒక్కుమ్మడిగా రంగంలోకి దిగి, ‘ఒకటి నొక్కండి, ఏడు నొక్కండిఅనే బ్యాంక్ కస్టమర్ కాల్ సెంటర్ సూచనలను ఖచ్చితంగా  పాటించే పనిలో పడ్డాం.  ఆ కంగారులో యాడాన్కార్డుతో పాటు నా ప్రైమరీ కార్డు లావాదేవీలను కూడా జయప్రదంగా స్తంభింపచేశాం.  దరిమిలా,  ‘మూడు వర్కింగు  డేస్ నుంచి  పదిహేను దినాలలోపల మీకు కొత్త కార్డు జారీ చేస్తామని మా పుట్టిన తేదీలు, మాతాపితరుల నామాలు వాళ్ల రికార్డులతో పోల్చుకున్న పిమ్మట కాల్ సెంటర్ వాళ్లు ప్రకటించారు.
అమ్మయ్యఅని అనుకుంటున్న  సంతోషం కాస్తా కాసేపటిలోనే  ఆవిరావిరయిపోయింది.
అదేమిటంటే మేము మళ్ళీ ‘1975’ మోడల్ సంసారానికి మారిపోయాము. అంటే ఏమిటి? ‘చేతిలో క్యాషూ  లేదు, జేబులో  కార్డూ లేదుఅనే పాత  రోజులకన్న మాట.
ఇంతకీ, ‘ఈగసంగతేమిటంటారా!  ప్రధమ కబళే మక్షికాపాతఃఅన్నట్టు ఈ కార్డు తస్కరణ ఉదంతం ఈగను కమ్మేసింది.
ఇంటిల్లిపాదిదీ ఒకటే మాట. సినిమా చాలా బాగుంది. రాజమౌళి హాట్స్ ఆఫ్’  సినిమాలు బాగా చూసేవారు కాబట్టి వాళ్ల మాటే  రైట్ అనుకోవాలి. అయితే-
విలన్ని  ఓసారి ఈగ’  చంపేసినట్టుగా చూపించిన తరువాత కధానాయిక  కాల్చిన బాణసంచాలో పని పూర్తయిందిఅనే సందేశం కనిపిస్తుంది. అక్కడితో సినిమా ఆపేసివుంటే బాగుండేదని నాకనిపించింది. అట్టే సినిమాలు చూడని నా అభిప్రాయం కరెక్టని నేనూ అనుకోవడం లేదు. బహుశా బడ్జెట్ ముప్పయి కోట్లని అంటున్నారు కదా. దానికోసం సినిమా నిడివి పెంచారేమోనని మాత్రం అనుకుంటున్నాను. (15-07-2012)


25, ఫిబ్రవరి 2017, శనివారం

నిజాయితీకి ఇచ్చే నజరానా ఇదా? – పార్ధ సేన్ శర్మ ఐ.ఏ.ఎస్.


(ఒక ఐ.ఏ.ఎస్.అధికారి అంతరంగ ఆవిష్కరణ)
అతనొక నిఖార్సయిన అధికారి. ప్రభుత్వంలో కార్యదర్శి హోదా కలిగిన సీనియర్ అధికారి. అయితే మాత్రమేం  ఒక ట్రయల్ కోర్టులో ముద్దాయిగా నిలబడక తప్పలేదు. తప్పు లేదు, చట్టం ముందు అందరూ సమానులే. కానీ ఇతడి విషయం వేరు. కోర్టులో నిలబడి న్యాయమూర్తిని ఏమి కోరాడో తెలుసా?
“కోర్టు ఖర్చులు భరించగల స్థోమత లేదు, నన్ను జైలుకు పంపించండి’ అని.
అయితే ఏ దశలోనూ ఆ అధికారి మీద నేరం రుజువు కాలేదు. అంటే ఏమిటి అర్ధం? యావత్ దేశం తలవంచుకోవాల్సిన సందర్భం. అలా జరిగిందా. లేదు. ఎందుకంటే మనది మహాత్ములు పుట్టిన పుణ్యభూమి.
సీనియర్ అధికారులు, మీదు మించి సమర్ధులు, నిజాయితీపరులు ఇలా కోర్టు గుమ్మాలు ఎక్కాల్సిన స్తితి దాపురించడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధానమైనది ఒక చట్టం. దానిపేరు అవినీతి నిరోధక చట్టం, 1988. ఎంతో సమున్నత లక్ష్యం కలిగిన ఈ చట్టాన్ని లోతుగా పరిశీలిస్తే అందులో దాగున్న ‘విషపు కోరలు’ కానవస్తాయి. మరీ ముఖ్యంగా ఈ చట్టంలోని 13 వ సెక్షన్. ఒక అధికారి తీసుకునే నిర్ణయం వల్ల ఎవరయినా లబ్ది పొందితే ఆ అధికారి కూడా నేరంలో భాగస్వామి అవుతాడని ఈ సెక్షన్ నిర్దేసిస్తోంది.
ప్రభుత్వం అంటేనే పనులు చేసిపెట్టడం. ఎవరికీ ఎలాంటి ప్రయోజనం కలగని పనులంటూ వుండవు. ఉదాహరణకు ఒక ఋణం మంజూరు చేసినా, భూమిని కేటాయించినా, ఒక కాంట్రాక్టు ఇచ్చినా, కొనుగోలు ఒప్పందం చేసుకున్నా ఎవరో ఒకరు ఖచ్చితంగా లబ్ది పొందడం ఖాయం. అలా జరగకుండా పనులు చేయాలంటే అసలు పనులనేవే జరగవు.  పాలన స్థభించి పోతుంది. ఇటువంటి సందర్భాలలో ఒక పదం వాడుతుంటారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని. మరి ఇలా తీసుకునే ఈ నిర్ణయాలన్నీ ప్రజా ప్రయోజనాలకోసమేనా అంటే అదొక సమాధానం రాని  ప్రశ్న అనడం కంటే జవాబు లేని ప్రశ్న అంటే సముచితంగా ఉంటుందేమో!
యావత్ దేశం అభివృద్ధి దిశగా పయనిస్తున్న తరుణం. రాజకీయ వైరుధ్యాలు, నా మాటే చెల్లుబడి కావాలనే తత్వాలు, మీడియా పరిశోధనలు, నైతికపరమైన సంశోధనలు, న్యాయపరమైన అంశాలు ఈ దారిలో ఎదురై ఒక రకమైన అపనమ్మక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. దానితో అధికారులు తీసుకునే ప్రతి నిర్ణయం పరీక్షకు గురవుతోంది. అంతే నిర్ణయం వెనుక ఉద్దేశ్యాలను ఆపాదించడం జరుగుతోంది. క్రికెట్ మైదానంలో నిలబడ్డ బాట్స్ మన్ ప్రతి బంతినీ సిక్స్ గా ఎందుకు మలచడం లేదు అని గేలరీలనుంచి చూస్తూ ప్రశ్నించడం తేలికే. అదే ఇరవై రెండు గజాల దూరంలో బ్రెట్ లీ బంతిని విసురుతున్నప్పుడు అది ఎంతకష్టమైన కార్యమో అర్ధం అవుతుంది.
ఇప్పుడు దేశంలోని సివిల్ సర్వీసు అధికారులు కోరుతున్నది ఒక్కటే. వారు తీసుకునే నిర్ణయం వల్ల అయాచిత ప్రయోజనం ఎవరికయినా కలిగిందని సందేహం కలిగినప్పుడు, అతడిమీద క్రిమినల్ కేసు పెట్టడానికి ముందు, ఆ నిర్ణయం కారణంగా ఆ అధికారికి వ్యక్తిగత ప్రయోజనం లభించిందని రుజువు చేయాలి. యిందుకు అనుగుణంగా అవినీతి నిరోధక చట్టాన్ని సవరించాలి. సమర్దుడయిన, నిజాయితీ పరుడయిన అధికారి ఎవరయినా సరే తన విధులను, కర్తవ్యాలను నిర్భయంగా నిర్వహించాలంటే చట్ట సవరణ ఒక్కటే మార్గం.నిబద్దతతో వ్యవహరించే అధికారులు అనవసరమైన వేధింపులకు గురికాకుండా చూడాలంటే ఇది తప్పనిసరి. రాజ్యసభ సెలెక్ట్ కమిటీ ఇప్పటికీ ఇందుకు సంబంధించి ఒక నివేదికను రూపొందించి సభకు సమర్పించింది కూడా. సెక్షన్ పదమూడును మార్చాలని ఈ కమిటీ సూచించింది. 2013లోనే ఈ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కానీ ఇంతవరకు దానికి మోక్షం సిద్దించలేదు.

సివిల్ సర్వీసుకు ఎన్నికయిన యువ అధికారులకు సీనియర్ అధికారులు ఒక సలహా ఇస్తుంటారు, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోమనీ,  ప్రజల ప్రయోజనాలకోసం తీసుకునే ఏ నిర్ణయమైనా మంచి నిజాయితీ కలిగిన అధికారులకు ఎలాంటి హాని చేయదనీ, వారి నిబద్దతే వారిని కాపాడుతుందని. వాస్తవంగా అలా జరుగుతోందా అంటే అనుమానమే. ఇంకొక విచిత్రం ఏమిటంటే, ఇలా నిర్ణయాలు తీసుకుని చిక్కుల్లో పడ్డ అధికారులలో ఎక్కువమంది మంచి నిజాయితీపరులు వుండడం.
(టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో)

20, ఫిబ్రవరి 2017, సోమవారం

భయం లేదు! స్త్రీ జాతి సంసిద్ధమయింది!!


ఆ మాటలు వింటుంటే ఆశ్చర్యం అనిపించింది.
‘పొద్దున్నే  హైదరాబాదు వచ్చాను. ఆర్మూరులో అంతా బాగే. అపోలోలో చిన్నక్కను చేర్పించారని బావ ఫోను చేశాడు. ఇప్పుడక్కడికే వెడుతున్నా. చూశాక ఎట్లుందీ మళ్ళీ ఫోను చేసి చెబుతా’
ఇందులో ఆశ్చర్యం ఏముందంటారా!
ఈమధ్య ఊబెర్ లో తిరిగేటప్పుడు ఒక్కన్నీ కాకుండా వీలయినప్పుడల్లా పూల్ (షేరింగ్) పద్దతి ఎంచుకుంటున్నాను. డబ్బులు సేవ్ చేయడంకోసం కాదు. రకరకాల వ్యక్తుల్ని కలవడానికి వీలుంటుందని. కారులో వుండగా ఎవరితో మాటలు కలపను.  డ్రైవర్ పక్కన ముందు సీట్లో కూర్చుని మనుషుల్ని చదివే ప్రయత్నం చేస్తుంటాను. పుటకలతో పుట్టిన బుద్ది కదా!
అలాగే, ఈరోజు ఊబెర్ ఎక్కాను. వెనక సీట్లో ఒకమ్మాయి కూర్చుని వుంది. ఎవరో ఫోను చేస్తే ఆ అమ్మాయి అంటున్న మాటలు ఇవి. నిజానికి నేను విన్నవి కావు, వినపడ్డవి.
ఊరు నుంచి పట్నం వచ్చింది. నిర్భయంగా ఊబెర్ టాక్సీ పిలుచుకుంది. డేరింగుగా షేరింగు పద్దతి ఎంచుకుంది. ఆసుపత్రిలో వున్న అక్కను పరామర్శించడానికి వెడుతోంది.
ఈ దేశానికి ఇంతకంటే ఏం కావాలి?
చాలా సంతోషం అనిపించింది.