7, ఆగస్టు 2016, ఆదివారం

ఫ్రెండ్ షిప్ డే


ఈరోజు ఈ కొటేషన్ కాస్త ఎబ్బెట్టుగా ఉండవచ్చు కానీ  రాజకీయ స్నేహాలకు  దగ్గరగా వుందేమో అనిపించి గుర్తు చేసుకుంటున్నాను.
ఆర్వీయార్ అనే సుప్రసిద్ధరచయిత, మాస్కోలో నా స్నేహితులు.
స్నేహం గురించి రాస్తూ, ఫ్రెంచ్ తత్వవేత్త  వోల్తేర్ ప్రవచించిన  ఒక ‘పనికొచ్చే ముక్క’ చెప్పారు.

“భగవంతుడా! నా స్నేహితుల నుంచి నన్ను రక్షించు. నా శత్రువుల నుంచి నన్ను నేను రక్షించుకుంటాను”   

6, ఆగస్టు 2016, శనివారం

ప్రమాదో ధీమతామపి (చెన్నారెడ్డి)


ఇందిరాగాంధీ హయాములో ఏ రాష్ట్రంలో అయినా స్తానికంగా నాయకుడయినా బలపడుతున్నాడని అనుమానం వచ్చినా సరే, కాంగ్రెస్ అధిష్టానం వూరుకునేది కాదు. వెంటనే అతడి మీద నిర్దాక్షిణ్యంగా వేటు వేసేది. ఒక్కోసారి చర్య ఆత్మహత్యాసదృశమైనా సరే ఎంతమాత్రం ఉపేక్షించేది కాదు. చెన్నారెడ్డి వంటి బలమయిన నాయకులు కూడా అధిష్టానానికి అణగిమణగి వున్నట్టు వుండేవారు కాని ఒక్కోసారి అసహనం బయటకు వస్తుండేది.  ఆరోజుల్లో ప్రభలు వెలిగిపోతున్న సంజయ్ గాంధీ సాయంతో చెన్నారెడ్డి వ్యతిరేకులు  కొందరు రాష్ట్ర నాయకత్వ మార్పిడి విషయంలో అధిష్టానం ఒక నిర్ణయానికి రాగలిగేట్టు చేయగలిగారు. అప్పట్లో సంజయ్ ఏది చెబితే అంత. ఆయన మాటకు ఎదురు వుండేది కాదు. తనని తొలగించే ప్రయత్నంలో సంజయ్ హస్తం వుందని భావించే వారేమో, ఆయనంటే  చెన్నారెడ్డి గారికి గుర్రుగా వుండేది. నేపధ్యంలో సంజయ్ గాంధీ   విమాన ప్రమాదంలో హఠాత్తుగా మరణించడంతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు నిర్ణయం తాత్కాలికంగా వాయిదాపడింది.
సంజయ్  అస్థికలను గోదావరి నదిలో నిమజ్జనం చేసేందుకు అట్టహాసంగా ఏర్పాట్లు జరిగాయి. హైదరాబాదు వచ్చిన  అస్థికల పాత్రను ప్రత్యేక బోగీలో వెంట తీసుకుని ముఖ్యమంత్రి రాజమండ్రి వెళ్లారు. ఒక బోటులో చెన్నారెడ్డి ఆయన పరివారం గోదావరి నదిలో కొంత దూరం వెళ్లారు. ఆకాశవాణి విలేకరిగా టేప్ రికార్డర్ తో నేనూ వెంట వెళ్లాను. నిమజ్జనం అయిన తరువాత అక్కడ విలేకరులతో మాట్లాడారు. చుట్టూ మూగిన జనాలతో అంతా గందరగోళంగా వుంది. తిరిగి హైదరాబాదు వెళ్ళడానికి  రైలు ఎక్కిన తరువాత నాకు కబురు వచ్చింది. వెళ్లాను. ముఖ్యమంత్రి పేషీలో పనిచేసే ఒక ఎస్ అధికారి ' సీ ఎం మాట్లాడింది మొత్తం రికార్డ్ చేసారా’ అని అడిగారు. ఔనన్నాను. వినిపించమన్నారు. కేసెట్ రివైండ్ చేసి వినిపించాను. అప్పుడు ఆశ్చర్యపోవడం నా వంతు అయింది. అందులో చెన్నారెడ్డి మాటలు రికార్డు అయివున్నాయి. ‘సంజయ్ గాంధీ మరణం తనకు బాగా బాధ కలిగించింద’ని చెన్నారెడ్డి అందులో  చెప్పారు. కానీ వాక్యం ఇలా మొదలయింది. " యాం హ్యాపీ దట్ ...సంజయ్.....(సంజయ్ గాంధీ మరణించడం నాకు చాలా...సంతోషంగా....)

ముఖ్యమంత్రి పేషీలో పనిచేసేవారు యెంత అప్రమత్తంగా వుంటారో తెలుసుకోవడానికి ఇదొక ఉదాహరణ.

ప్రమాదో ధీమతామపి


ప్రతిభావంతులు కూడా పొరబాట్లు చేస్తారు, ధీమంతులకు కూడా ప్రమాదాలు తప్పవు అనే అర్ధంలో సంస్కృతంలో వాడే ప్రయోగం ఇది.

2001  లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో  యంపీటీసీ, జెడ్ పీ టీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని పార్టీల వాళ్ళు విసుగూ విరామంలేకుండా ప్రచార పర్వంలో మునిగితేలుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర లో ప్రచారానికి వెళ్ళారు. సాక్షాత్తు రాములవారే అశ్వమేధ యాగాశ్వ పరిరక్షణకు వెళ్లినట్టు ముఖ్యమంత్రి సయితం ఆ స్థానిక ఎన్నికల్లో అలుపు ఎరుగని రీతిలో అనేక సభల్లో ప్రసంగిస్తూ వెడుతున్న సమయంలో ఒకచోట ప్రసంగం ముగిస్తూ ‘తెలుగు దేశం పార్టీ అభ్యర్ధుల్ని చిత్తుగా ఓడించండి’ అని పిలుపు ఇవ్వడంతో పార్టీ కార్యకర్తలు విస్తుపోయారు. జరిగిన పొరబాటు వెంటనే గుర్తించిన చంద్రబాబు దాన్ని వెంటనే సవరించుకున్నారు. ఇప్పట్లా అప్పట్లో ప్రత్యక్ష ప్రసారాల హడావిడి లేకపోబట్టి  ఈ ఉదంతం వెలుగు చూడలేదు. అయినా స్థానిక పత్రిక ఒకటి ప్రచురించింది. ఇంతటి పొరబాటు మాట ఆయన  నోటంట జారిపడడానికి  కారణం ఆయనలో ఏమూలనో దాగున్న కాంగ్రెస్ నేపధ్యం కారణం కాదుకదా అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. 

ఉబుంటు


దక్షిణాఫ్రికాలోలోని కొండ జాతి జనుల భాషకు చెందిన పదం ‘ఉబుంటు’
దీనికి అర్ధం తెలుసుకునే ముందు ఒక ఉదంతం గురించి చెప్పుకుందాం.
పాశ్చాత్య ప్రపంచానికి చెందిన పరిశోధకుడు ఒకడు ఆ కొండ జాతి ప్రజలు నివసించే ప్రాంతానికి వెళ్ళాడు. ఆడుకుంటున్న కొంతమంది పిల్లలు కనిపించారు. వారిని ఆటపట్టించాలని అనిపించిన ఆ పెద్దమనిషి వారిని దగ్గరకు పిలిచాడు. ఒక స్వీట్ ప్యాకెట్ దూరంగా వున్న చెట్టు మొదట్లో వుంచి చెప్పాడు వారితో.
“మీలో ఎవరు ముందుగా పరిగెత్తుకుంటూ వెడితే వారిదే ప్యాకెట్టు”.
పిల్లలు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. వెంటనే ఒకరి చేతులు ఒకరు పట్టుకున్నారు. అంతా కలిసి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ స్వీట్ ప్యాకెట్ అందుకున్నారు.
తెల్ల మనిషి అది చూసి తెల్ల మొహం వేశాడు. అడిగాడు పిల్లల్ని ఎందుకలా చేసారని. వారు చెప్పిన జవాబే ఈ ‘ఉబుంటు’.
వారి భాషలో ఉబుంటు అంటే మానవత్వం. ఒకరి కోసం మరొకరు అనే అర్ధంలో వాడతారు.
కొండకోనల్లో నివసించేవాళ్ళు అయితేనేం నాగరీకులకంటే వారి గుండె కొండ కంటే పెద్దది.


(దీని ఇంగ్లీష్ కధనాన్ని షేర్ చేసిన 'నరసింహం శ్రీధర గారికి కృతజ్ఞతలతో)

5, ఆగస్టు 2016, శుక్రవారం

రోజులు మారాయి




వెనుకటి రోజుల్లో పిల్లలు పెరిగి పెద్దయ్యేదాకా ఒక రకంగా వాళ్ళు జీవితంలో స్థిరపడే వరకూ వాళ్ళ బరువు బాధ్యతలు పెద్దవాళ్ళు కనిపెట్టి చూసేవాళ్ళు. అంటే పిల్లలకు ఓ పాతికేళ్ళు వచ్చేదాకా.
ఇన్నాళ్ళు చూస్తే సరిపోతుంది అని ఓ లెక్క వేసుకోగలిగే వెసులుబాటు పెద్దవాళ్ళకు వుండేది. ఇప్పుడు రోజులు మారాయి. పెద్దవయస్సులో వున్న తమ పెద్దవాళ్ళను కన్నపిల్లలే కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. కాకపోతే ఎన్నాళ్ళు అనే ప్రశ్నకు జవాబు లేదు. ఇన్నాళ్ళని ఓ లెక్కా లేదు. ఆ లెక్కలూ డొక్కలూ అవన్నీ పై వాడి చేతిలో వుంటాయి. అంటే ఏమన్నమాట. ఒకప్పటి పెద్దవాళ్ళకంటే ఇప్పటి పిల్లలే బాధ్యతగా ఉంటున్నారని. 


పిల్లలు పెద్దల మధ్య కృతజ్ఞతలు గట్రా వుండవు, వుండకూడదు. కానీ, ఈ ఆగస్టు అయిదున పుట్టిన రోజు జరుపుకుంటున్న మా పెద్ద కుమారుడు సందీప్ కి శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలపాలనుకున్నప్పుడు ఎందుకో ఏమిటో ఈ విషయాలు గుర్తుకు వచ్చాయి.
సందీప్ HAPPY BIRTH DAY (USA Time)

కృష్ణా పుష్కర కరదీపిక

శ్రీ పీఠంతో కృష్ణా పుష్కర యాత్ర  
మా  చిన్న తనంలో మా బావగారు కొమరగిరి వెంకటప్పారావు గారు  ‘ముముక్షువు’ అనే ఒక ఆధ్యాత్మిక  పత్రిక తెప్పించేవారు. చాలా విషయాలు అర్ధం అయ్యీ  కానట్టుగా ఉండేవి. అర్ధం చేసుకోవాలనే తాపత్రయం వున్నా, మనసు మరో వాటి మీదకు లాగేది. ఒకటి మాత్రం నిజం. ఈనాటికీ  కొన్ని ఆధ్యాత్మిక అంశాల గురించి రాయగలుగుతున్నాను  అంటే  అది ఆ పత్రిక పుణ్యమే.
ఇప్పుడు కూడా తెలుగునాట అనేక  ఆధ్యాత్మిక పత్రికలు వెలువడుతున్నాయి. పరిపూర్ణానంద స్వామి సంకల్ప బలంతో నెలనెలా శోభాయమానంగా ప్రచురితమవుతున్న ‘శ్రీ పీఠం’ పత్రిక వీటిల్లో ఒకటి. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని తాజా సంచికలో అనేక ఆసక్తికరమైన వ్యాసాలను పొందు పరిచారు.




పుష్కరాలు అనగానే తటాలున గుర్తుకువచ్చేవి నదీ జలాల్లో పుణ్య స్నానాలు. ఆ పుణ్యస్నాన ఫలితాలతో పాటు పుష్కర వైశిష్ట్యాలను అరటి పండు ఒలిచి చేతికి అందించేంత సులభశైలిలో పలు వ్యాసాలను ఈ సంచికలో ప్రచురించారు. పుష్కర యాత్రీకులకు ఒక రకంగా ఇది కరదీపిక.
పుష్కర స్నానం సరే, అనుదిన స్నానాలను గురించి పరిపూర్ణానంద స్వామి సూటిగా ఓ మాట సెలవిచ్చారు.
“ఉత్తమం నదీ స్నానంచ మధ్యమంతు తటాకే
అధమం కూప స్నానంచ భాండ స్నానేన నిష్పలం”
నదీ స్నానం ఉత్తమం. చెరువు స్నానం మధ్యమం. ట్యాంకుల్లో, బిందెల్లో నిల్వవుంచిన నీతితో స్నానం చేయడం వల్ల ఏ ఫలితం వుండదని అర్ధం.
అంటే ఈ ఆధునిక కాలంలో ఏదైతో చేయరాదో అదే చేయాల్సి వస్తోంది. అంచేత పన్నెండేళ్ళకు ఓసారి వచ్చే నదీ పుష్కరాల్లో పుణ్య స్నానాలు చేయడం మంచిది. పుష్కరాలు, కుంభమేళాల రూపంలో మన పూర్వీకులు ముందు చూపుతో కల్పించిన బంగారు అవకాశం అనుకోవాలి. అందులో భాగమే ఆగష్టు పన్నెండున  సూర్యోదయంతో మొదలవుతున్న కృష్ణా పుష్కరాలు.  
పరిపూర్ణానంద స్వామి పుష్కర యాత్రీకులకోసం ప్రస్తావించిన కొన్ని పసిడి పలుకులు ఈ ‘శ్రీ పీఠం’ ప్రత్యేక సంచికలో వున్నాయి. గత గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో జరిగిన దుర్ఘటన నేపధ్యంలో అ పలుకులను ఒక హెచ్చరికగా తీసుకోవాల్సి వుంటుంది.
“పుష్కర స్నానానికి ఒక ప్రత్యేక ముహూర్తం అంటూ ఏమీ  వుండదు. పుష్కర దినాల్లో ఏరోజునైనా సరే, ఉదయం నుంచి మధ్యాన్నం లోపు ఎప్పుడు కృష్ణలో  స్నానం చేసినా సరిపోతుంది అని స్వామి చెప్పారు.
“స్నాన సమయంలో సబ్బులు, షాంపూలు, ఆఖరికి సున్నిపిండి వాడడం కూడా కూడదని ఆయన సెలవిస్తున్నారు. నదిలో మట్టి విసిరివేయడం, పసుపు కుంకుమలు చల్లడం తగదని కూడా చెప్పారు.
మానవ నాగరికత మూడుపూవులు ఆరుకాయలుగా విలసిల్లడానికి మూలకారణం అయిన నదీమతల్లులను గౌరవించి, పూజించి కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశాన్ని కల్పించడానికి కూడా ఈ పుష్కర సంప్రదాయాలు ఎంతగానో తోడ్పడతాయి.
పరిపూర్ణానంద స్వామి అనుగ్రహ హితోక్తులతో పాటు, ‘పుష్కర మహాత్యం’ గురించి బాచంపల్లి సంతోషకుమార శాస్త్రి, ‘పుష్కర విధుల’పై అన్నదానం చిదంబర శాస్త్రి, ‘జలసంపద లక్ష్మీ నారాయణులే’ అంటూ ధూళిపాళ మహాదేవమణి, ‘నేను, మీ కృష్ణమ్మను’  అనే పేరుతొ కృష్ణానది పుట్టుక నుంచి సాగర సంగమం వరకు ఆ నదీమతల్లి పోకడలను వివరిస్తూ ప్రయాగ రామకృష్ణ రాసిన సచిత్ర వ్యాసం, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ‘కృష్ణవేణీ౦ నమామ్యహం’, ఆచార్య విజయశ్రీ కుప్పా రచించిన కృష్ణవేణి పుష్కర రాణి’, డి.వి.ఎస్.ఎస్.సోమయాజులు చారిత్రిక నగరం పేరుతొ వివరించిన బెజవాడ వైశిష్ట్యం,   పురిఘెళ్ళ వెంకటేశ్వర్లు రాసిన ‘కృష్ణాతీరంలో పొంగిన దేశభక్తీ’, ‘కృష్ణా తీరం పుణ్య క్షేత్రాల నిలయం’, కృష్ణా పుష్కరాల ప్రధాన వేదిక  బెజవాడ గురించి భండారు శ్రీనివాసరావు జ్ఞాపకాలు  మొదలయిన విశేషాలతో కూడిన రచనలను ఈ సంచికలో పొందుపరిచారు. చిత్రకారుడు, స్వామి వారి అనుగ్రహపాత్రుడు 'బ్నిం'.     
ముందే చెప్పినట్టు పుష్కర యాత్రీకులకు ‘శ్రీ పీఠం ప్రత్యేక సంచిక’ నిజంగా ఒక కరదీపిక.
“కృష్ణవేణీ౦ నమామ్యహం!!”

(www.sreepeetham.in, www.facebook.com/paripoornandaswami)  

4, ఆగస్టు 2016, గురువారం

ఎక్కడయినా ఇంతే!


“ఒదినగారూ, మా ఇంట్లో  టీవీలోనే అనుకున్నా కానీ  మీ టీవీలో కూడా చెత్త ప్రోగ్రాములే సుమా!”
చాలా ఏళ్ళక్రితం  బాపూ గీసిన  కార్టూన్  లో అంటుందో  ఇల్లాలు.
“ట్రంపు రాక్షసుడు” – ఒబామా
“ఒబామా చెత్త అధక్షుడు” – ట్రంప్

మనదగ్గర రాజకీయ నాయకులు వాడుతున్న భాష చూసి కంపరం వేస్తున్న సమయంలో అక్కడ అమెరికాలో కూడా  ఇంతేనా అని   అనిపించినప్పుడు  అలనాటి ఈ బాపూ కార్టూన్ గుర్తుకు వచ్చింది.