11, జులై 2016, సోమవారం

నిమిషము అనగా ఏడాది

(PUBLISHED IN "SURYA" DAILY ON 14-07-2016, THURSDAY)

ఇదేం లెక్క అంటారా? పరీక్షలు నిర్వహించే వారి లెక్కలు ఇలాగే వుంటాయి.
‘ఒక్క నిమిషం ఆలస్యం అయినా సరే పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదు’
ఎం సెట్ పరీక్షలకు ముందు టీవీల్లో  ఈ  స్క్రోలింగు చకచకా పరిగెత్తుతూ పరీక్షార్దుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తూ వుంటుంది. ఎం సెట్ ఒక్కటే కాదు ఏ సెట్టయినా ఇదొక ఆనవాయితీగా మారిపోయింది. ఏదో సబబైన కారణం వుండి నిమిషం ఆలస్యం అయి పరీక్ష హాల్లో ప్రవేశించని వారు మళ్ళీ పరీక్ష రాయాలంటే ఒక ఏడాది నిరీక్షించాలి. పైగా  ఈ ‘సెట్ల’ కు సప్లిమెంటరీలు కూడా వుండవు,  మార్చి తప్పితే సెప్టెంబరు ఉందిలే అనుకోవడానికి. ఏకంగా ఏడాది ఆగాల్సిందే. అందుకే చెప్పింది, నిమిషం అంటే ఏడాది అని.
పరీక్షలు అనేవి రాసే పిల్లలకే కాదు, వాళ్ళ తలితండ్రుల పాలిట కూడా విషమ పరీక్షలే. ఆ  పరీక్షలే పెద్ద పరీక్ష అనుకుంటే పరీక్ష రాయడం, రాయించడం  మరో పరీక్షగా పరిణమిస్తోంది. రాసే పరీక్షకు సిద్ధం అవడం ఒక పరీక్ష అయితే, ఆ పరీక్షరాయడానికి చదువుతో నిమిత్తం లేని అదనపు  కసరత్తులు కొన్ని చేయాల్సివస్తోంది.
ముందు హాలు టిక్కెట్టు వస్తుందో లేదో అన్న ఆందోళన. వచ్చిన తరువాత అది సరిగా వుందో లేదో అని సరి చూసుకోవడం, అచ్చు తప్పులు వుంటే అదో మనాది. అది బాగుంటే, రాయాల్సిన పరీక్షాకేంద్రం ఆనుపానులు కనుక్కోవడానికి దుర్భిణీ వేసి వెతుకులాడడం. మహానగరంలో వాటి   అడ్రసులు  కనుక్కోవడంలోనే తల ప్రాణం తోకకు వస్తుంది. ఎలాగో అలా కనుక్కుని వెడితే ఇది కాదు మరో చోటికి పొమ్మంటారు. అది వెతుక్కుని వెళ్ళేలోగా పుణ్యకాలం ముంచుకు వస్తుంది. ‘నిమిషం నిబంధన’ నెత్తి మీది కత్తిలా వేలాడుతుంటుంది. ఆ ఆందోళన బుర్రల్ని వాళ్ళ నిరామయం చేస్తుంది. ఇన్నాళ్ళు చదివింది పూజ్యంగా మారి, సమయానికి అక్కరకు రాని కర్ణుడి విలువిద్యను గుర్తుకు తెస్తుంది.
ఈ విషయంలో ఒక  అధికారి ఇచ్చిన వివరణ ఇలా వుంది.
“పోటీ పరీక్షల్లో ప్రతి నిమిషం అమూల్యమైంది. ఒక్క మార్కుతో వందల ర్యాంకులు తేడా వచ్చే అవకాశం వుంది. రైలు ప్రయాణాలు చేసేవాళ్ళు రైలు సమయానికి రాదని ఖచ్చితంగా తెలిసినా ఎందుకయినా మంచిదని  ముందుగానే  స్టేషనుకు వెడతారు. అలాగే విమానాల్లో వెళ్ళే వాళ్ళు నిబంధనల ప్రకారమే  వ్యవహరిస్తారు. ఇక  సినిమాలకు వెళ్ళేవాళ్ళు సరే సరి. టైటిల్స్ నుంచి చూడాలనే కోరికతో నానా ఇబ్బందులు పడయినా సరే సినిమా హాలుకు ఒకింత ముందుగా చేరుకుంటారు. మరి తమ భవిష్యత్తుకు కీలకమైన పరీక్షలకు సకాలంలో చేరుకోవడానికి ఇన్ని విమర్శలు అవసరమా?” 
ఏ విషయంలోనయినా క్రమశిక్షణ అవసరమే. సమయ పాలన మరింత ముఖ్యమే. చిన్నతనంలోనే ఈ రెంటికీ సరయిన పునాదులు పడడం అభిలషణీయమే. ఈ దిశగా అధికారులు కానీ, వారిని పర్యవేక్షించే  ప్రభుత్వాలు కానీ చర్యలు తీసుకోవడం కూడా అవశ్యమే.  కాదనలేని సంగతే. అయితే కొండ నాలుకకు మందు వేసే క్రమంలో  వున్న నాలుక ఊడిపోకూడదు. ఇలా  హితోక్తులు పలికేవాళ్ళు తమ మార్గానికి అడ్డం వస్తున్నారని, మార్పుకి వ్యతిరేకులని అనుకోరాదు.

ఎంసెట్ అనేది చదువుకునే పిల్లలకు, వారి తలితండ్రులకి ఒక అపూర్వమైన ఘట్టం. ఈ పరీక్షే తమ  భవితను నిర్దేశిస్తుందని నమ్మేవారు కోకొల్లలు. వారిలోని ఈ నమ్మకమే ప్రైవేటు విద్యా సంస్థలకు కల్పతరువుగా మారుతోంది. కోట్ల రూపాయలు కురిపించే కామధేనువుగా తయారువుతోంది.
ఈ పరీక్షలు రాసేవాళ్ళు జీవితంలో  ఢక్కామొక్కీలు తిన్న బాపతు కాదు. లేలేత ప్రాయంలో వున్నవాళ్ళు. ఈ వయస్సులో ఎటువంటి  ఎదురుదెబ్బలను అయినా  తట్టుకోగల మానసిక నిబ్బరం వారికి వుండదు. తమ బతుకు బాట మార్చే పరీక్ష రాసే అవకాశం చేజారి పోయిందన్నప్పుడు వారికి కలిగే మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. బస్సు తప్పిపోయో, అడ్రసు దొరక్కనో, వారి చేతిలో లేని వేరేదయినా  కారణం చేతనో,  నిమిషం ఆలస్యం అయిందన్న ఒకే ఒక్క కారణం తమ జీవిత ధ్యేయాన్ని తూట్లు పొడుస్తుంటే వారికి కలిగే క్షోభను అర్ధం చేసుకోవడానికి సైకియాట్రిస్టులు కానవసరం లేదు.         
కొద్దిగా మనసు పెట్టి  ఆలోచిస్తే అసలు ఈ నిమిషం నిబంధన ఎంత అర్ధరహితమో అన్నది అర్ధం అవుతుంది.



నిమిషం కూడా లేటు కాకూడదు అంటున్నారు సరే! అది ఏ లెక్క ప్రకారం? పరీక్ష రాసే అభ్యర్ధి పెట్టుకున్న గడియారం ప్రకారమా? గేటు కాపలాదారుడి చేతికి వున్న వాచీ ప్రకారమా? పరీక్ష హాల్లో పర్యవేక్షణ చేసే అధికారుల గడియారాల ప్రకారమా? నిమిషం ఆలస్యాన్ని నిర్ధారించడానికి ఏది ప్రామాణికం? ప్రపంచంలో ఏ రెండు గడియారాలు ఒక సమయం చూపెట్టవని అంటారు. అలాంటప్పుడు నిమిషం ఆలస్యం అయిందా లేదా అనే విషయం ఎవరు నిర్ణయించాలి? అసలు ఈ నిమిషం నిబంధన ఈ ప్రాతిపదిక పైన విధించారు?
ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ ఆలస్యం అనేది తమ హక్కుగా పరిగణిస్తున్నప్పుడు, ఒక్క నిమిషం ఆలస్యాన్ని కూడా ఉపేక్షించేది లేదు అనే ఈ వైఖరిని ఒక్క పరీక్షార్ధుల పట్ల  మాత్రమే ఎందుకు వర్తింప చేస్తున్నారు? ఇది  ఏమేరకు సమంజసం?
అధికారులు సమయానికి ఆఫీసులకి రారు. వారికోసం వచ్చిన వారికి, ఇప్పుడే ఒక నిమిషంలో వస్తారు, వేచి వుండండి అనే జవాబు సిద్ధంగా వుంటుంది.  గంటలు గడిచి పోతున్నా ఆ నిమిషం అనేది ఎప్పటికీ రాదు. అదేమని అడిగే హక్కు ఎవరికీ వుండదు. మంత్రులు, ముఖ్యమంత్రుల కోసం సమయానికి  ఎగరాల్సిన విమానాలు ఆగిపోతాయి. బయలుదేరాల్సిన  రైళ్ళు నిలిచిపోతాయి. ఎందుకు ఆలస్యం అని అడిగేవాళ్ళు వుండరు.
ఎవరూ ఎప్పుడూ పాటించని సమయ పాలన అనే నిబంధనను లేలేత ప్రాయంలోని విద్యార్ధుల పట్లనే ఇంత నిర్దయగా ఎందుకు  అమలు చేస్తారు అన్నదే జవాబు దొరకని ప్రశ్న. ఒక్క నిమిషంలో పుట్టేమీ మునగదు అంటూ నీతి సూక్తాలు వల్లె వేసే వాళ్ళే ఈ నిమిషం నిబంధన పట్ల గంభీర ప్రకటనలు చేస్తూ వుండడం విడ్డూరం.
అంశం సమయ పాలన కాబట్టి అందుకు సంబంధించిన మరికొన్ని కబుర్లు చెప్పుకుందాం.
సమయాన్ని ఎవరు పాటించినా పాటించక పోయినా పరవాలేదు కానీ,  రాజకీయ నాయకులు, అధికారులు  పాటించి తీరాలి. ఎందుకంటే, ఈ నియమం వారు  పాటించని పక్షంలో, వారికోసం వేచి చూస్తూ అనేకమంది తమ విలువైన సమయం పాడు చేసుకోవాల్సి వస్తుంది.
ముఖ్యమంత్రి వెంగళరావు వ్యవహార శైలి చాలా విలక్షణంగా వుండేది. సమయపాలనకు ఆయన పెట్టింది పేరు. పంజాగుట్ట - ద్వారకాపురి కాలనీలోని ఇంటినుంచి ఆయన సచివాలయానికి బయలుదేరారంటే చాలు, గడియారాల్లో టైం సరిచేసుకోవచ్చని చెప్పుకునేవారు. అంత ఖచ్చితంగా ప్రతి రోజూ ఒకే సమయానికి బయలుదేరడంతిరిగి ఇంటికి చేరడం వెంగళరావు గారికే చెల్లింది. తదనంతర కాలంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు సమయపాలన పాటిస్తామని ప్రకటనలు చేయడమే కానీ కానీ నిలబెట్టుకున్నవాళ్ళు లేరు. మాజీ ముఖ్యమంత్రిగా కూడా ఆయన నియమాన్ని ఎన్నడూ వొదులుకోలేదు. హైదరాబాద్ పొలిమేరల్లోవున్న ఫాం హౌస్ కు వెళ్లడంతిరిగి రావడం అంతా కూడా నిమిషం అటూ ఇటూ తేడా లేకుండా ప్రతి రోజూ ఒక నియమిత సమయంలో జరిగేలా ఆయన ఎంతో శ్రద్ధ తీసుకునేవారు.
రేడియో విలేకరిగా వెంగళరావుగారి పద్దతులు నాకు బాగా నచ్చాయి. ఎందుకంటెఆయన విలేకరుల సమావేశాలను చాలా క్లుప్తంగా ముగించేవారు. రేడియో వార్తలకు తప్ప రోజుల్లో మరెవరికీ టైం కు సంబంధించిన ‘డెడ్ లైన్లు’ వుండేవి కావు. చెప్పాల్సింది చెప్పేసిలేచి నిలబడి - ‘మంచిది వెళ్ళిరండి” అనేవారు. విలేకరులతో మాట్లాడే కొద్దిసమయంలో కూడా రొటీన్ ఫైల్స్ పై సంతకాలు పెడుతూనే వుండేవారు. 
జలగం వెంగళరావు  ఓసారి బ్యాంకర్ల మీటింగు పెట్టారు. ఇప్పట్లోలా అప్పుడిన్ని  ప్రభుత్వ బ్యాంకులు  ఉండేవి కావు. పది మంది బ్యాంకు ఉన్నతాధికారులు హాజరయ్యేవారు.
ముఖ్యమంత్రి ఛాంబరులో మీటింగు. అధికారులు ఎందుకయినా మంచిదని పది నిమిషాలు ముందే వెళ్ళారు. ఇప్పట్లోలా సెక్యూరిటీ  బాదరబందీలు లేవు కాబట్టి వెళ్లి సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి  భద్రతాధికారి సీతాపతిని కలిసారు. ‘రండి రండి మీ కోసమే సి ఎం ఎదురు చూస్తున్నారు’ అంటూ లోపలకు తీసుకువెళ్ళి కూర్చోపెట్టారు. సరిగ్గా చెప్పిన టైముకు నిమిషం తేడా లేకుండా వెంగళరావు గారు గదిలోకి వచ్చారు. ఎజెండా ప్రకారం మాట్లాడాల్సినవి మాట్లాడి, వినాల్సినవి విని, ఇచ్చిన సమయం అరగంట కాగానే మంచిది వెళ్ళిరండి అని వీడ్కోలు పలికారు. గంటలు గంటలు పడిగాపులు పడకుండా వచ్చిన పని పూర్తయినందుకు అధికారులు కూడా సంతోషపడుతూ వెళ్ళిపోయారు.
ఇక నాణేనికి మరోవైపు.
వెంగళరావు తరువాత ముఖ్యమంత్రి అయిన డాక్టర్ చెన్నారెడ్డి  విజయనగరం జిల్లాలో రెండు రోజుల పర్యటన పెట్టుకున్నారు. మొదటి రోజల్లా ఊపిరి  తిరగని కార్యక్రమాలు. రెండో రోజు ఉదయం పది గంటలకు పార్వతీపురంలో విశాఖ గ్రామీణ బ్యాంకు శాఖకు ప్రారంభోత్సవం చేయాలి. అప్పటి కలెక్టర్ భిడే,  ముఖ్యమంత్రి చెన్నారెడ్డిని  వెంటబెట్టుకుని  పది గంటలకల్లా అక్కడికి చేరుకున్నారు. అప్పటికి నిర్వాహకులు ఎదురు చూస్తూనూ,   ఆహూతులందరూ నిద్రమత్తులోనూ  జోగుతున్నారు. ఎందుకంటే, చెప్పిన ప్రకారం ముఖ్యమంత్రి పది గంటలకే వచ్చారు. కాకపొతే, రాత్రి పది  గంటలకు.  
ఉపశృతి:
ఎనభయ్యవ దశకంలో కౌలాలంపూర్ లో ప్రపంచ తెలుగు  మహాసభలు జరిగాయి. నిర్వాహకుల  ఆహ్వానం మేరకు అంజయ్య  వెళ్ళారు. కారణాలు ఏమైతేనేం కాంగ్రెస్ అధిస్థానం అంజయ్యపై కినుకతో వున్నరోజులవి.  ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన తరవాత అంజయ్య గారు హోటల్ రూముకి తిరిగొచ్చేసారు. వెంట షరా మామూలుగా నేను. కాస్త నలతగా కనిపించారు. అంత పెద్ద గదిలో ఆయనా నేను ఇద్దరమే. సాయంత్రం అవుతోంది. ఆయన దీర్ఘంగా ఆలోచిస్తూ కిటికీలోనుంచి బయటకు చూస్తున్నారు. విశాలమయిన రోడ్డు. వచ్చే కార్లు. పోయే కార్లు. పక్కనే ఏదో ఫ్యాక్టరీ లాగావుంది.
ఆయన వున్నట్టుండి “చూసావా!” అన్నారు. నాకేమీ అర్ధం కాలేదు.
పొద్దున్న బయలుదేరేటప్పుడు చూసాను. అందులో ( ఫ్యాక్టరీ లో) పనిచేసేవాళ్లందరూ గంట కొట్టినట్టు టైము తప్పకుండా వచ్చారు. అయిదు నిమిషాల్లో లోపలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్లీ అంతే. షిఫ్ట్ పూర్తికాగానే ఠంచనుగా ఇళ్లకు పోతున్నారు. పనిచేసేవాళ్లకు వాళ్లకు కావాల్సింది ఇవ్వాలి. కావాల్సిన విధంగా పని చేయించుకోవాలి. ఇలా మన దగ్గర కూడా చేస్తే కావాల్సింది ఏముంటుంది!” అన్నారాయన యధాలాపంగా.
అంటే ఇప్పటిదాకా ఆయన ఆలోచిస్తోంది ఇదన్నమాట.
కౌలాలంపూర్ తెలుగు మహాసభల ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదనీఇందిరాగాంధీ విషయంలో ముఖ్యమంత్రి పట్ల చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారనీ, హైదరాబాదులో ఒక పత్రిక రాసిన విషయం ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న అంజయ్య గారికి “రాజకీయ జ్వరం” పట్టుకున్నట్టు అప్పటికే గుసగుసలు మొదలయ్యాయి. అందుకే ఆయన సభా ప్రాంగణంలోనే వుండిపోకుండా వొంట్లో బాగోలేదనే నెపంతో హోటల్ రూముకి తిరిగొచ్చేసారని వదంతులు హైదరాబాదు దాకా పాకాయి. ఈయనగారేమో ఇక్కడ తాపీగా కూర్చుని కార్మికులు గురించి ఆలోచిస్తున్నారు. అలావుండేది అంజయ్య వ్యవహారం. (12-07-2016)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595


NOTE: COURTESY IMAGE OWNER

8, జులై 2016, శుక్రవారం

ఒక్క క్షణం


‘ఏవిటి నారదా ఆలస్యం’  చతుర్ముఖ బ్రహ్మ అడిగాడు మూడో ముఖానికి వున్న మీసాన్ని రెండోసారి దువ్వుకుంటూ.
‘పితృ దేవులు క్షమించాలి. భూలోకానికి వెళ్ళే పనిలో వుండి  అనుకున్న సమయానికి ఓ యుగం ఆలస్యంగా వచ్చాను’  నొచ్చుకుంటూ చెప్పాడు కలహభోజనుడు.

‘పరవాలేదులే పుత్రా! ఎటు తిరిగీ  ఆ లోకవాసులకు ఈ ఏడాది ఒక క్షణం అదనంగా కలిపానులే. అక్కడికి నువ్వెప్పుడెళ్లినా  లెక్క సరిపోతుంది!’  అన్నాడు విధాత.


వై ఎస్ ఆర్ చెప్పిన గానుగెద్దు కధ


2004 జులై 21 న అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఒక కధ చెప్పారు.
“బాగా చదువుకున్న పండితుడు ఒకాయన నూనె గానుగ వద్దకు వెళ్ళాడు. అక్కడ గుండ్రంగా తిరుగుతున్న ఎద్దు తప్ప ఎవరూ కనిపించలేదు. ఆ ఎద్దు మెడలోని గంటల చప్పుడు తప్ప ఏ అలికిడీ లేదు. పండితుడు గానుగ మనిషిని పేరు పెట్టి పెద్దగా పిలిచాడు. ఆ పిలుపు విని అతడు బయటకు వచ్చాడు.
నూనె కొన్న తరువాత పండితుడు అడిగాడు.
‘ఎప్పుడు వచ్చినా నువ్వుండవు.  గానుగ పని మాత్రం నడుస్తూనే వుంటుంది. ఎలా’ అని.
‘ఎద్దు మెడలో గంట కట్టిందే అందుకోసం. గంట చప్పుడు వినబడుతున్నదీ అంటే ఎద్దు తిరుగుతున్నట్టే లెక్క. తిరగడం మానేస్తే గంట చప్పుడు వినబడదు. నేను ఏ పనిలో వున్నా బయటకు వచ్చి ఎద్దుకు మేత వేస్తాను. నీళ్ళు పెడతాను. మళ్ళీ దాని పని మొదలు. నాపనిలో నేనుంటాను’ గానుగవాడు చెప్పాడు.
పండితుడు కదా! అనుమానాలు ఎక్కువ.
‘అలా అయితే ఎద్దు ఒకచోటనే నిలబడి తల ఊపుతుంటే గంటల శబ్దం వినబడుతుంది. కాని పని సాగడుదు. అప్పుడెలా?’ అడిగాడు. 
‘నా ఎద్దు అలా చేయదు’ అన్నాడు గానుగ మనిషి.
‘అంత నమ్మకంగా ఎలా చెప్పగలవు?’ అని గుచ్చి  అడిగాడు పండితుడు.
‘ఎందుకంటే, నా ఎద్దు మీలా చదువుకోలేదు కాబట్టి’
ఆ జవాబుతో పండితుడి కళ్ళు తెరిపిళ్ళు పడ్డాయి.”   


వై.ఎస్.ఆర్. హెల్త్  సీక్రెట్
ఆయనోసారి ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూ లో తన ఆరోగ్య రహస్యం చెప్పారు.

“మితాహారం, యోగ. అంతకు మించి ఏమీ లేవు. నేను ఉదయం తీసుకునే అల్పాహారంలో ఇడ్లీ, కానీ దోశ కానీ వుంటాయి. నూనె వస్తువులకు దూరం. ఫ్రూట్ సలాడ్ తప్పనిసరి. మధ్యాన్న భోజనంలో రెండు పుల్కాలు, రెండు వెజిటేరియన్  కూరలు, కొంచెం పెరుగన్నం. సాయంత్రం కూడా ఇంతే.  మధ్య మధ్యలో కీరా ముక్కలు తింటుంటాను. నీళ్ళు ఎక్కువ తాగుతాను. వారానికి రెండు సార్లు రాగి సంకటి తప్పనిసరి. నాన్ వెజ్ అప్పుడప్పుడు మాత్రమే” 

ఒక దార్శనికుడి కరిగిన కల

(ఈ రోజు వై.ఎస్.ఆర్. జయంతి)

(PUBLISHED IN "SAKSHI" TELUGU DAILY ON 09-07-2016, SATURDAY)

చీకటి చిక్కబడుతున్న కొద్దీ సుశీలకు కంగారు ఎక్కువయింది. కారు నడుపుతున్న భర్త వున్నట్టుండి కారు పక్కకు తీసి స్టీరింగుపై వాలిపోయాడు. జన సంచారం లేదు. దగ్గరలో ఊరున్న దాఖలాలు కనబడడం లేదు?  దిక్కులేని ప్రదేశంలో దిక్కుతోచని స్తితి ఆమెది. ఏం చెయ్యాలి?
పీతాంబరం స్తితిమంతుడు. ఆయన వున్న ఊరూ సంపన్న గ్రామమే. మనుమడికి నీళ్ళ విరోచనాలు మొదలై పూట గడిచిపోయింది. ఊళ్ళో ఫోనులు వున్నాయి. ఆసుపత్రే లేదు. అది వున్నచోటికి పోవడానికి రోడ్డు వుంది. కానీ ఆ రాత్రివేళ వెళ్ళడానికి బస్సులు లేవు. ఏం చెయ్యాలి?
ఏకాంబరానిది మరో పరిస్తితి. ఊళ్ళో ఆసుపత్రి వుంది. డాక్టరు ఉండడు. ఎప్పుడు వచ్చేది, ఎప్పుడు పోయేది ఆయనకే తెలియదు.  రోగం రొష్టూ వస్తే మళ్ళీ నాటు వైద్యమే గతి.
సోమయ్య ఊళ్ళో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వుంది. డాక్టరు కూడా మంచివాడు. ఊళ్లోనే ఉంటాడు. అయితే  రక్త పరీక్షకు అయినా, ఎక్స్ రే తీయించుకోవాలన్నా బస్సెక్కి పక్కన వున్న బస్తీకి వెళ్ళాలి. తీరా వెడితే కరెంటు వుండదు. అది వున్నా ఎక్స్ రే తీసేవాడు వుండడు. ఆరోగ్యం ఎటూ చెడింది. పూట తిండి పెట్టే పని కూడా చెడింది. ఏం చెయ్యాలి?
అన్నీ చిన్న సమస్యలే. వెంటనే పరిష్కరించకపోతే పెద్దవి అయ్యే సమస్యలు. ఆరోగ్య సమస్యల్లో అనేక రకాలు. వైద్యుడికి చూపించేవి. వైద్యుడి దగ్గరకు వెళ్ళే లోగా అనారోగ్యంలోని తీవ్రతను వైద్యుడి సలహాతో తగ్గించుకోగలిగేవి.
ఇవన్నీ సమస్యలే. కాని పరిష్కారం లేని సమస్య అంటూ వుండదు. ఇది అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి నమ్మకం. స్వయానా డాక్టరు కావడం మూలాన పరిష్కారం దిశగా ఆలోచన చేశారు. ప్రజారోగ్యం విషయంలో ఆదర్శాలు కలిగిన మరికొంతమంది వైద్యులు జత కలిశారు. అనుకున్నది అనుకున్నట్టు చేసే అధికారులు తోడయ్యారు.
ఆ విధంగా అప్పటికే జనాదరణ పొందిన 108 తోడుగా  104 రూపుదిద్దుకుంది.
అయితే వై ఎస్ ఆర్ కల అంతటితో ఆగలేదు. దానికి సంపూర్ణత్వం కలిగించాలనుకున్నారు.
గుండెజబ్బుల వంటి పెద్ద సమస్యలు ఎదురయితే చిన్నవాళ్ళు ఏమైపోవాలి? వాటికి వైద్యం చేయిన్చుకోగల వెసులుబాటు వారికి ఎలా కలిగించాలి. అంతే! మరో అపురూప వ్యవస్థ ‘ఆరోగ్య శ్రీ’ కి అంకురార్పణ జరిగింది. 



చిన్నా చితకా రోగాలకు వైద్య సలహా చాలు. అందుకోసం ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో వుండే  104 ఉచిత కాల్ సెంటరు. వ్యాధి నివారణ కంటే నివారణ మేలు. అందుకోసం  నిర్దేశిత దిన వైద్య పరీక్షలు నిర్వహించే 104 సంచార వాహనం.  అత్యవసర వైద్య సాయం కోసం 108 అంబులెన్సు . ఇక విధి వికటించి పెద్ద రోగాల పాలుపడి ఎవరు కాపాడుతారా అని ఎదురు చూపులు చూసేవారి కోసం ఆరోగ్యశ్రీ.
పైగా,  ఇవన్నీ పూర్తిగా ఉచితం. అన్నీ ఒక్క గొడుగులో.
నిజానికి వై ఎస్ ఆర్ కల అంతటితో ఆగలేదు.
ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలు వైద్య ఆరోగ్య రంగంపై ఖర్చు చేస్తోంది.ఇందులో సింహ భాగం నిర్వహణ వ్యయం కిందికే పోతోంది. గ్రామీణ ప్రాంతాలలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు కొంత మేరకు ప్రజల ఆరోగ్య సేవల అవసరాలను తీరుస్తున్నప్పటికీ- డాక్టర్ల కొరత అన్నది ఎప్పటికీ తీరని సమస్యగానే మిగిలిపోతున్నది. మన రాష్ట్రంలో ఎనభయి వేల గ్రామాలుంటేకేవలం పదిహేను వందల చోట్ల మాత్రమే వైద్యులు అందుబాటులో ఉన్నారు. వైద్య కళాశాలలో పట్టా పుచ్చుకున్న ఏ ఒక్కరు కూడా పల్లెలకు వెళ్లి వైద్యం చేయడానికి సిద్దంగా లేరంటే అతిశయోక్తి కాదు. ఇక మందుల విషయం చెప్పనక్కరలేదు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు దూరంగా వున్న పల్లెల్లో నివసించే వారికి ఈ అరకొర సదుపాయం కూడా అందుబాటులో లేదు. నాటు వైద్యుల దయా దాక్షిణ్యాల పైనా, వారిచ్చే నాటు మందుల పైనా  ఆధారపడాల్సిన దీన స్తితి వారిది. బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా అరణ్య ప్రాంతాలలో - అంత సులువుగా చేరుకోలేని కోయ గూడాలులంబాడి తండాల్లో వుండే పేద వారికి రోగం రొస్టూ వస్తే ఇక ఇంతే సంగతులు. అలాటివారు సాధారణంగా షుగరురక్త పోటుఉబ్బసంకీళ్ళ వ్యాధులతో బాధపడుతుంటారు. అసలు ఇలాటి జబ్బులు తమకు వున్నట్టు కూడా వీరికి తెలియదు. ఎందుకంటె ఎలాటి వైద్య పరీక్షలు ఎప్పుడూ చేయించుకుని ఎరుగరు కనుక. రోగం ముదిరి  ఏపక్షవాతానికో దారి తీసేదాకా 'బీపీవున్నట్టు కూడా తెలియదు.

వైద్య ఆరోగ్య శాఖ ఎన్ని నిధులు ఖర్చుచేస్తున్నా ఫలితాలు ఆశాజనకంగా వుండడం లేదు. ఈ శాఖ పేరులో వైద్యం ముందు ఆరోగ్యం తరువాత వున్నాయి. వైద్యం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడడం అనే అర్ధం వుంది. అసలు ప్రజలు ఆరోగ్యంగా వుంటే వైద్యంతో నిమిత్తం ఏముంటుంది. ఇదిగో ఈ ఆలోచనలోనుంచి పురుడు పోసుకున్నదే 104 పధకం.

108 అంబులెన్సు ప్రమాదం అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించినదయితే ఈ 104 సంచార వైద్య వాహనం - పేద పల్లె ప్రజల ప్రాణాలు ప్రమాదం అంచుకు చేరకుండా చూస్తుంది. ఇంతా చేసి ఈ పధకం కింద లబ్ది పొందేవారి సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే- ఒక్కొక్కరిపై పెట్టె ఖర్చు ఏడాదికి కేవలం ఎనభయి రూపాయలు మాత్రమే. అంటే - వైద్య ఆరోగ్య రంగం బడ్జెట్ లో పది శాతం కన్నా తక్కువన్నమాట.

బయో మెట్రిక్ పద్దతి ద్వారా రోగుల వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తారు. గర్భిణీ స్త్రీలనుబాలింతలను పరీక్షించి మందులు ఇస్తారు. గర్భిణి కడుపులో పిండం పెరుగుదలను నెలనెలా గమనిస్తూ తగిన జాగ్రత్తలు సూచిస్తారు. తగు మందులు, పోషకాలు ఇస్తారు. నెలనెలా పరీక్షలు చేసి పురుడు వచ్చే సమయాన్ని నిర్ధారిస్తారు. పురిటి ఘడియలు దగ్గర పడ్డప్పుడు 108 కి తెలియచేసి వారిని దగ్గరలోని ప్రభుత్వ వైద్య శాలకు చేరుస్తారు. సుఖ ప్రసవం తరువాత తగిన జాగ్రత్తలు చెప్పి, తిరిగి అంబులెన్సులో ఇంటికి చేరుస్తారు.
ఆ రోజుల్లో జరిగిన సమావేశాల్లో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అనేవారు. “కడుపుతో వున్న ఆడపిల్లలను పుట్టింటికి తీసుకువచ్చి, పురుడు పోయించి  తిరిగి తల్లీ బిడ్డను క్షేమంగా అత్తారింటికి పంపడం తలితండ్రుల బాధ్యత. ఇక నుంచీ ప్రతి పేదింటి ఆడపిల్లకూ ప్రభుత్వమే పుట్టిల్లు. వాళ్ళ బాధ్యత ప్రభుత్వానిదే”

ఇంతే కాదు.

104 కాల్ సెంటర్ కు ఇంకా విస్తృతమైన లక్ష్యాలు నిర్దేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య శాలలు, నర్సింగు హోములు, ప్రైవేటు క్లినిక్కులు, ఔషధ దుకాణాలు, బ్లడ్  బ్యాంకులు ఇలా వైద్య రంగానికి సంబంధించిన సమస్త సమాచారం సేకరించి ఒక్కచోటే నిక్షిప్తం చేసారు. అర్ధరాత్రి, అపరాత్రి అనకుండా రాష్ట్రంలో ఏమూల నుంచి ఫోను చేసినా వారు వుండే ప్రదేశానికి ఇవన్నీ యెంత దూరంలో వున్నాయి, ఏ సమయాల్లో పనిచేస్తాయి అనే వివరాలు తెలియచేయడానికి వీలుగా ఈ ఏర్పాటు. ఇక  వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో ఏ  ప్రాధమిక వైద్య కేంద్రంలో వైద్యుడు అందుబాటులో ఉన్నదీ, సెలవు మీద వెళ్లిందీ ఆన్ లైన్లో తెలుసుకుని ఆ సమాచారాన్ని అటు అవసరమైన రోగులకూ, ఇటు పర్యవేక్షణ జరిపే అధికారులకూ ఎప్పటికప్పుడు ఈ కేంద్రం తెలియచేస్తూ వుంటుంది. అలాగే విద్యుత్ అధికారులతో సంప్రదించి ఈ వూర్లో ఏ సమయంలో కరెంటు వుంటుందీ, ఏ వూరి ఆసుపత్రిలో ఎక్స్ రే మిషన్లు పనిచేయడం లేదు మొదలయిన వివరాలను సంసిద్ధంగా వుంచుకుని అడిగిన వారికి అడిగినట్టుగా  సమాచారం అందించే వ్యవస్థకు రూపకల్పన చేసారు.
ఒక్క ముక్కలో చెప్పాలంటే  నాణ్యత కలిగిన వైద్య చికిత్సలను కేవలం కలిగిన వారికే కాదు, పేదసాదలకు కూడా  అందుబాటులోకి తేవాలనేది మొత్తం ఆరోగ్య శ్రీ లక్ష్యం.
ఆ దార్శనికుడు కన్న కల సాకారం అయ్యే కృషి మొదలయింది. ప్రజలకు అందులోని  వైశిష్ట్యం ఎలాటిదో ప్రజలకు క్రమంగా అవగతమవుతోంది.
దురదృష్టం.  అప్పుడే విధి వక్రించింది. దొంగచాటుగా  మృత్యుపాశం విసిరింది.
కల కన్న మనిషి అర్ధంతరంగా అంతర్ధానమయ్యాడు. కంటున్న కల ఆయన కనురెప్పల్లోనే కరిగిపోయింది. ఒక గొప్ప స్వప్నం  ఆవిష్కారానికి ముందే ఆవిరి అయిపోయింది. అంత చక్కటి పధకం అరకొరగా మిగిలి పోయింది. రాజకీయ విషక్రీడకు బలయిపోయింది.  కార్పొరేట్ ఆసుపత్రులకు దోచి పెట్టే పధకంగా ముద్రవేసి,  అసంపూర్తిగా దాన్ని  అటక ఎక్కించారు.

కారణం ఎవరయినా జరగరానిది జరిగిపోయింది. మొత్తం ప్రపంచానికే ఆదర్శంగా నిలవాల్సిన ఓ అద్భుత పధకం కొందరి నిర్వాకాలకు నీరుకారిపోయింది. మరి కొందరి స్వార్ధాలకు బలయిపోయింది. ఇంకొందరి ఆహాలను చల్లార్చడానికి మాడి మసయిపోయింది. రాజకీయ చదరంగంలో చిక్కుకుపోయి  ఎత్తులు పైఎత్తులకు  చిత్తయిపోయింది.

ఇప్పుడీ పధకం ఉందా అంటే వున్నట్టు, లేదా అంటే లేనట్టుగా వుంది.
ఆయన అదృష్టవంతుడు, దాటిపోయాడు. ఊళ్లకు దూరంగా, వైద్య సౌకర్యాలకు నోచుకోకుండా కొండలు, కోనల్లో నివసించే వారు దురదృష్టవంతులు. వారి బతుకుల్ని మార్చే గొప్ప పధకానికి వారు దూరం అయ్యారు.   (06-07-2016)      


7, జులై 2016, గురువారం

సీఎం అప్పాయింటుమెంటు అంటే అంత చులకనా! – వై ఎస్ తో ఓ జ్ఞాపకం




“ఏవిటండీ మీరు మరీను. సీఎం గారి అప్పాయింటుకోసం అందరూ క్యూలో వుంటారు. మీరేమో ఇచ్చింది క్యాన్సిల్ చేయమంటారు. ఇదేమీ బాగా లేదండీ శ్రీనివాసరావు గారూ” 
భాస్కర శర్మ గారికి కోపం వచ్చిన సందర్భాలు బహు తక్కువ. వాటిల్లో ఎక్కువ భాగం నావల్లనే తటస్థపడ్డాయి. (ఈ మధ్యనే శర్మ కైలాసమానస సరోవర యాత్ర చేసి వచ్చారు)
భాస్కర శర్మ ఉద్యోగమే బిజీ బిజీ ఉద్యోగం. ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి అప్పాయింటుమెంట్లు ఖరారు చేసే బాధ్యత ఆయనది. మామూలుగా అయితే ఫోను రిసీవ్ చేసుకునే వ్యవధానం కూడా  వుండదు.   మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐ.ఏ.ఎస్.లు, ఐ.పీ.ఎస్. లు ఇలా ఎంతో మంది నుంచి ఒత్తిళ్ళు వుండే ఉద్యోగమాయే. అలాంటి ఉద్యోగం అయినా అది చేస్తున్నది భాస్కర శర్మ కాబట్టి ఆయన తీరే వేరు. ఎవరు ఫోను చేసినా మర్యాద, నమ్రత. సీఎం పేషీలో పనిచేసేవాళ్ళు యెంత మర్యాదస్తులయితే అంత మంచి పేరు నేరుగా సీఎం ఖాతాలో పడిపోతుంది.
నేను అనేకసార్లు శర్మ గారిని ఇబ్బంది పెట్టి ఎవరెవరికోసమో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి అప్పాయింటు ఫోనులోనే అడగడం, తీసుకోవడం, మళ్ళీ ఫోనులోనే  క్యాన్సిల్ చేయడం ఇలా అనేక సార్లు జరిగింది. యెంత సహన శీలుడికయినా కోపం రాకుండా ఉంటుందా. వచ్చింది. అప్పుడాయన అన్న మాట అదన్నమాట.
గతంలో రేడియో ఉద్యోగంలో వున్నప్పుడు ఈ అప్పాయింటుమెంట్ల గొడవే వుండేది కాదు. నేరుగా వెళ్లి కలవడమే.  అంచేత వాటి విలువ ఏమిటో శర్మ చెప్పిన దాకా నాకూ తెలవదు.
రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇలాగే అప్పాయింటుమెంటు లేకుండానే ఆయన్ని అయన  కారులోనే సరాసరి  రేడియో రికార్ధింగుకు తీసుకువెళ్ళాను. ( ఇందుకు సంబంధించిన ఫోటో మిత్రుడు నందిరాజు రాధాకృష్ణ వద్ద వుంది) ఎందుకంటే ఎవరు ముఖ్యమంత్రి అయినా ముందుగా అయన  సందేశం రికార్డు చేయాల్సింది రేడియో వాళ్ళే అనేది నా వాదన. 


వై ఎస్ కూడా అంతే. అప్పాయింటుమెంటు తీసుకున్న సంగతీ, క్యాన్సిల్ చేసిన సంగతీ తెలిసి కూడా తరువాత కలిసి నప్పుడు ఏమీ తెలియనట్టే పలకరించేవారు. నోరారా నవ్వుతూ, ఒక చేతిని తెరిచి వుంచి మరో చేతి వేళ్ళను ముడిచి పెట్టి  తెరిచిన అరచేతిపై  కొట్టుకుంటూ ‘ఏవిటి విశేషాలు’ అంటూ పలకరించేవారు.
ఆయన హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించడానికి ముందు అసెంబ్లీలో కలిశాను. మరుసటి రోజు ఆయన లేరు. లేరన్న సంగతి కూడా ఆ మరునాటికి కానీ తెలియని పరిస్తితి. మనిషిని ఆనవాలు పట్టలేని విధంగా మృత్యువు ఆయన్ని వెంటబెట్టుకు వెళ్ళింది. అంచేతే, అంతకు ముందు రోజు చూసిన ఆయన నగుమోమే మనస్సులో ముద్రపడిపోయింది.

రేపు వైఎస్ జయంతి. ఆయన్ని స్మరించుకుంటూ ఈ నాలుగు ముక్కలు.               

మా ఊళ్ళో మా బడి


మేము అరవై ఏళ్ళకు పూర్వం చదువుకున్నప్పుడు అది మట్టి గోడలతో నిర్మించిన ఒక పూరిల్లు. ఇప్పుడది ఇదిగో ఇలా ఈ ఫోటోలోలా వుంది. ఒకప్పుడు ఐదో తరగతి వరకు వుండేది. ఇప్పుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల.





హైదరాబాదులో మా పిల్లలు చిన్నప్పుడు చదువుకున్న ప్రైవేటు  స్కూళ్ళకు కూడా మా వూరి స్కూలు వైభోగం లేదు. మా పిల్లలు కోళ్ళ ఫారాల వంటి స్కూళ్ళలో చదువుకుంటే మా వూరి పిల్లలు ఎంచక్కా ఆట మైదానం వున్న పాఠశాలలో చదువుకుంటున్నారు.




సర్కారు బడి అని చిన్న చూపు పనికి రాదు. వాళ్ళు వేయించిన కరపత్రం చూడండి. ఫలితాల్లో వరసగా మూడేళ్ళ నుంచి మండల స్థాయిలో దీనిదే ప్రధమ స్థానం. ఒకటి రెండు మూడు అంటూ కాకిగోల చేసే ప్రకటనలు టీవీల్లో వింటుంటాం. అంతటి డబ్బున్న వ్యవహారం కాదు కాబట్టి, ఒక కరపత్రం వేసి  సరిపుచ్చుకున్నారు.
గ్రంధాలయం, కంప్యూటర్ ల్యాబ్, ఉచిత యూనిఫాం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, మధ్యాన్న భోజనం.
పదిహేడు మంది స్కూలు టీచర్లు. అందరూ ఎమ్మే బీయీడీలు, బీఎస్సీ బీఈ డీలు.  
నేనూ ఒకప్పుడు  లాగూ పైకి లాక్కుంటూ వెళ్లి  ఈ స్కూలుకే వెళ్లి చదూకున్నానని కాలర్ ఎగరేసి చెప్పుకోవచ్చన్న మాట.

మా వూరు జిందాబాద్!   మా వూరి మా బడి జిందాబాద్!!