16, జూన్ 2016, గురువారం

ఏమని అడగను దేవుడిని ?



ఆర్థర్ రాబర్ట్ యాషె మునుపటితరం టెన్నిస్ క్రీడాకారుల్లో మేటి. ప్రపంచంలో అగ్రగణ్య టెన్నిస్ ఆటగాడు. అనూహ్యంగా సంక్రమించిన ఎయిడ్స్ వ్యాధి బారిన పడి ఆ అమెరికన్ క్రీడాకారుడు అకాల మరణం చెందాడు. అతగాడి  గుండెకు  శస్త్ర చికిత్స చేసే సమయంలో పొరబాటున ఎయిడ్స్ రోగి రక్తం ఎక్కించిన ఫలితంగా అతడికి ఈ భయంకరమయిన రోగం సోకింది. ఈ విషయం తెలుసుకుని విశ్వవ్యాప్తంగా వున్న అతడి అభిమానులు ఎంతో బాధ పడ్డారు. వారిలో ఒక కుర్రవాడు అతడికి ఉత్తరం రాస్తూ ‘లోకంలో ఇంతమంది జనం వుంటే ఆ పాడు దేవుడు మీ ఒక్కరికే ఈ వ్యాధి యెందుకు కలిగించాడు’ అంటూ ఆవేదన వెలిబుచ్చాడు. ఆర్ధర్ అతడికి రాసిన జవాబులో మొత్తం మానవ జీవిత పరమార్ధాన్ని కాచివొడబోశాడు.
ఆ సమాధానం ఇలావుంది.
“దేశదేశాల్లో లక్షలాదిమంది పిల్లలు. చాలామందికి  టెన్నిస్ ఆడాలనే కోరిక వుంటుంది.  వారిలో కొన్ని వేలమంది మాత్రమే టెన్నిస్ అంటే ఏమిటో ఎంతో కొంత తెలుసుకోగలుగుతారు. మళ్ళీ  వారిలో కొందరు మాత్రమే  టెన్నిస్ బ్యాట్ పట్టుకోగలుగుతారు.  
"వింబుల్డన్ స్తాయికి చేరేవాళ్ళు చివరకు ఓ యాభయ్ మంది వుంటారేమో. వారిలో ఓ నలుగురు  సెమీ ఫైనల్ చేరతారు. వాళ్ళలో ఇద్దరు ఫైనల్స్ ఆడితే మళ్ళీ వారిలో ఒక్కడే చాంపియన్ అవుతాడు. ఆ ఒక్కడిని నేనే. అనేకసార్లు ఈ అదృష్టం నన్ను వరించింది. వింబుల్డన్ కప్పును ఘనంగా  చేతిలో పట్టుకుని గర్వంగా అందరికీ చూపెడుతున్నప్పుడు ఎప్పుడూ  నాకు దేవుడు గుర్తు రాలేదు. వచ్చినా ఆయన్ని నేను అడిగిన గుర్తు లేదు, ఇంతమంది జనాలు వుంటే,  నన్నొక్కడినే టెన్నిస్ చాంపియన్ ని యెందుకు చేశావని? ఇప్పుడు ఈ స్తితిలో ఆ దేవుడ్ని ఏ మొహం పెట్టుకుని అడగను ఇంతమంది జనాల్లో  నన్నొక్కడినే ఈ వ్యాధి బారిన  యెందుకు పడేశావని?

“అందుకే దేవుడు ఇచ్చిన దానితో తృప్తి పడాలి. ఆనందం నిన్ను ఎప్పుడూ హాయిగా వుంచుతుంది. నువ్వు చేసే ప్రయత్నాలే  నిన్ను అత్యంత శక్తివంతుడ్ని చేస్తాయి. బాధలు వేదనలు నీలో మానవత్వాన్ని పెంచుతాయి.  ఓటమి అనేది  నిన్ను ఉదాత్తుడిగా  చేస్తుంది. గెలుపు నిన్ను మెరిపిస్తుంది. కాకపోతే, మన నమ్మకం, మన నడత ఈ రెండే  మనల్ని మరింత ముందుకు నడిపిస్తాయి”

15, జూన్ 2016, బుధవారం

అమెరికన్ కాకమ్మ కధ


కాకమ్మ కధలు చెప్పేవాళ్ళు అమెరికాలో కూడా వుంటారు. అలాటి ఒక కధే ఇది.
కధ కాబట్టి, అందులోను అమెరికా కధ కాబట్టి  వూరికూరికే డౌట్లు అడక్కూడదు.
అనగనగా ఓ చదువుకోని నిరుద్యోగి మైక్రోసాఫ్టు ఆఫీసులో బంట్రోతు పనికోసం వెళ్ళి అక్కడి హెచ్ ఆర్ మేనేజర్ని కలిసాడు. (మైక్రోసాఫ్టు లాంటి సంస్థలో  బంట్రోతు ఉద్యోగం ఏమిటి అనే చొప్పదంటు ప్రశ్నలు మధ్యలో అడగరాదన్నది ఈ కాకమ్మ కధ చెప్పే పెద్దమనిషి కండిషన్.)
హెచ్ ఆర్ మేనేజర్ మనవాడి ఈ మెయిల్ అడిగాడు. 'పూటకు ఠికానా లేదు నాకో  కంప్యూటర్ పైగా ఓ ఈ మెయిల్ ఐడీ కూడానా' అని మనవాడు జవాబు చెప్పాడు. మేనేజర్ ఆశ్చర్యపోయాడు. 'నీకు  ఈమెయిల్ ఐడీ  కూడా లేదా. అదికూడా లేకుండా అమెరికాలో యెలా బతుకుతున్నావు?' అని ప్రశ్న మీద ప్రశ్న వేస్తుంటే మనవాడు మొహం తిప్పుకుని బయట పడ్డాడు.
బయట పడ్డాడే కాని జీవితం పెట్టిన పరీక్ష నుంచి యెలా బయటపడాలో తెలియలేదు. అల్లా నడుచుకుంటూ వెడుతుంటే ఆదివారం సంత (?) కనబడింది. జేబులో పది డాలర్లు వున్నాయి. అవ్వే ఈనెలకు, కాదు  కాదు మొత్తం ఈ ఏడాదికీ మిగిలిన ఆఖరు మొత్తం. వెళ్ళి ధైర్యం చేసి పది డాలర్లు పెట్టి పది కిలోల టమాటాలు కొన్నాడు. ఓ సంచీలో వేసుకుని ఇల్లిల్లు తిరిగి అమ్మాడు. సాయంత్రం చూసుకుంటే ఇరవై డాలర్లు లాభం. ఓహో డబ్బు సంపాదించడం అంటే ఇదా అనుకున్నాడు. మళ్ళీ ఆ డబ్బులన్నీ పెట్టి టమాటాలు కొని మళ్ళీ వాటిని ఇంటింటికీ తిరిగి అమ్మాడు. పొద్దున  జేబులో వున్న పది డాలర్లు రాత్రికి ఇంటికి చేరేసరికి పిల్లలు పెట్టి  అరవై అయ్యాయి. తిరుగుడు, శారీరక శ్రమ తప్ప వేరే పెట్టుబడి లేదు. అతడికి తత్వం బోధపడింది. ఇక వెనుతిరిగి చూడలేదు.
నెల తిరిగేసరికల్లా బండి కొన్నాడు. మరోనెలకల్లా ట్రక్కు కొన్నాడు. మూడు నెలల్లో టోకు దుకాణం తెరిచాడు. ఐదేళ్ళల్లో ఏకంగా దేశంలో ఒక పెద్ద చైన్ సంస్థగా ఎదిగాడు. లక్షలకొద్దీ ఆదాయం, వేలకొద్దీ సిబ్బంది.
కుటుంబం కోసం ఏదయినా చేయాలనిపించి  ఒక ఇన్స్యూరెన్స్ సంస్థని సంప్రదించాడు. అతడు అడిగిందే భాగ్యం అనుకుని ఆ కంపెనీ తమ  మార్కెటింగ్ చీఫ్ నే అతడి ఇంటికి పంపింది.  అతగాడు వివరాలు తీసుకుంటూ యధాలాపంగా మనవాడి  ఈ మెయిల్ అడిగాడు. అలాటిదేదీ లేదన్నాడు. ఇన్స్యూరెన్స్ వాడు బిత్తరపోయాడు. ఇన్ని బిలియన్ల టర్నోవర్ వున్న ఇంత భారీ సంస్థకు అధిపతి అయివుండి ఈ మెయిల్ కూడా లేకుండా ఇన్నిన్ని  వ్యాపారాలు యెలా చేయగలుగుతున్నారని అడుగుతూ అది కూడా వుంటే మీరు మరిన్ని కోట్లకు పడగలేట్టేత్తేవాళ్ళేమో! అని నసిగాడు.
మనవాడు నవ్వాడు, ఎదురుగా కూర్చున్న మార్కెటింగు చీఫ్ గుండెలవిసేలా బిగ్గరగా నవ్వాడు.
నవ్వి అన్నాడు.
'అవును! ఈ మెయిల్ అవీ వుండి వుంటే నేను ఈ పాటికి మైక్రోసాఫ్టు సంస్థలో ఆఫీసు బాయ్ గా వుండి  వుండేవాడిని'         
ఇలాటి కాకమ్మ కధలు బొచ్చెడు తెలుసంటారా? నాకు ఈ కధ చెప్పిన పెద్దమనిషితో నేనూ అదే అన్నాను. ఆయన నవ్వుకుని వుంటారు. ఆయన వుండేది అమెరికాలో కాబట్టి.

(ఇంగ్లీష్ లో ఈ కధను పీవీవీజీ స్వామి గారు  నాకు మెయిల్ చేశారు. నేను దాన్ని ఇష్టం వచ్చినట్టు తెలుగులో చెక్కేసాను. షరా మామూలుగా స్వామిగారికి కృతజ్ఞతలు)

విసుగుకు విరామం!


శంకరపాదానికి జీవితం మీద విసుగు పుట్టింది. ఏవిటీ జీవితం? తినడం తొంగోడం ఇంతేనా జీవిత పరమార్ధం ?
సర్వస్వం త్యజించి అడవుల్లోకి వెళ్లాడు. కింద పచ్చిక పచ్చగా పట్టు తివాచీ పరచినట్టు వుంది. పక్కన ఆకాశం అంతు చూడాలన్నట్టు పొడవుగా పెరిగిన వెదురు చెట్లు. దూరంగా ఎవరో కనిపించారు. దగ్గరగా వెళ్ళి అడిగాడు ఎవరు నువ్వని.
'నేనా! ఈ సృష్టి కర్తను. ఆ చెట్టూ ఈ పుట్టా అన్నీ నేనే సృష్టించాను. ఇంతెందుకు నువ్వు నీ జాతి మనుషులు అంతా మయా సృష్టం!'
'అలానా! సంతోషం. వెదకపోయిన తీగె కాలికి తగిలింది. ఇప్పుడు చెప్పు. ఇంత విసుగు కలిగించే జీవితాన్ని నాకు యెందుకు ప్రసాదించావు?'
'పట్టుమని పాతికేళ్ళు కూడా లేవు. నిండు నూరేళ్ళ జీవితం ముందే  వుంది. అప్పుడే నీకు బతుకు మీద రోత పుట్టిందా! దాన్ని  వొదిలిపెట్టి పోవాలన్న కోరిక కలిగిందా!'
'.....................'
'అటు చూడు. ఆ పచ్చిక యెంత బాగుందో. ఇటు చూడు ఈ వెదురు వృక్షాలు యెలా యెంత ఎత్తు పెరిగాయో! నీకొక విషయం చెబుతా శ్రద్ధగా విను.
'కొన్ని సంవత్సరాల కిందట నేనే స్వయంగా ఈ గరిక విత్తనాల్ని, ఈ వెదురు విత్తనాల్ని ఒకే రోజు నాటాను. నారుపోసిన వాడిని కదా!  నీరు కూడా పోశాను. చిత్రం మరునాడే గరిక మొక్క నేల తల్లిని చీల్చుకుంటూ బయటకు వచ్చింది. వెదురు విత్తనం ఏమైందో తెలియదు. గరిక మాత్రం ఏపుగా పాకి పచ్చగా అడవి నేలనంతా మనోహరంగా పరచుకుంది. ఏడాది గడిచింది. రెండేళ్లు గడిచాయి. మూడో ఏడు దాటినా వెదురు విత్తనం మొలకెత్తే సూచన  కానరాలేదు. అయినా నేను నిరాశ  పడలేదు. నాపని వొదిలిపెట్టలేదు. మొలవకపోయినా వెదురు విత్తనం నాటిన చోట నీళ్ళు పోస్తూనే  పోయాను. నాలుగో ఏడు కూడా గడిచింది. ఐదో ఏట బహు చిత్రంగా అక్కడ ఓ చిన్న ఆకు అపచ్చని మొలక  బయటకు వచ్చింది. ఆరునెలలు గడిచాయో లేదో బారెడు పెరిగింది. ఏడాది తిరిగేసరికల్లా అడవిలో చెట్లకు రాజల్లే ఎంతో ఎత్తుకు ఎదిగిపోయింది. ఇంత ఎత్తు పెరగాలి కాబట్టే అంత లోతుకు వేళ్ళూనుకోవాలి. కాబట్టే,  అంతవరకూ వెదురు మొక్క వెలుగు చూడలేదు.
'ఈ నా సృష్టిలో వృధా అంటూ ఏమీ లేదు. ప్రతి దానికీ ఒక పరమార్ధం వుంది. విసుగుపుట్టి వొదిలేస్తే వొరిగేది ఏమీ వుండదు. నీకంటూ ఓ కర్తవ్యం నిర్దేశించి వుంది. అది పూర్తిచేసేవరకు విసుగును దూరంగా వుంచు'
శంకరపాదానికి జ్ఞానోదయం కాగానే సృష్టికర్త అదృశ్యం అయిపోయాడు.
కధ కంచికి. మనం మన బ్లాగులోకం లోకి.
(శ్రీ వాసిరెడ్డి అమరనాథ్ పోస్ట్ చేసిన ఇంగ్లీష్ గల్పికకు స్వేచ్చానువాదం)



14, జూన్ 2016, మంగళవారం

నరేంద్ర మోడీ సప్త సూత్ర పధకం



సూటిగా.....సుతిమెత్తగా.......
 “చెత్తను ఊడ్చేస్తున్నా అంటూ  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారతీయ జనతాపార్టీ శ్రేణులకు సప్తసూత్ర సహిత దిశానిర్దేశం చేశారు.
అలహాబాదులో రెండు రోజులపాటు జరిగిన ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చేసిన ప్రసంగంలో మోడీ కొన్ని నిజాలు వెల్లడించారు. కొన్ని ప్రకటనలు చేసారు. కొన్ని హెచ్చరికలు ఒదిలారు. కొన్ని సూక్తులు నుడివారు.. పనిలో పనిగా కొన్ని గొప్పలు కూడా చెప్పారు.
ఏతావాతా ఆయన ప్రసంగ  సారాంశం ఏమిటంటే వచ్చే ఏడాది  జరిగే ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా పార్టీని సంసిద్ధం చేయడం,  ఆ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ ప్రత్యర్దులయిన ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలపై అవినీతి ముద్ర వేయడం.
జరిగింది పార్టీ కార్యవర్గ సమావేశం కనుక అందులో తప్పు ఎంచాల్సింది ఏమీ లేదు.
ఇక తన ప్రసంగంలో, (ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తల మేరకు) మోడీ చెప్పిన నిజం ఏమిటంటే-
“పార్టీ నిర్మాణంలో దశాబ్దాలుగా కోట్లాదిమంది కార్యకర్తలు చేసిన కఠోర శ్రమ ఫలితాలను నేడు మనం అనుభవిస్తున్నాం”.
భేష్! నిఖార్సయిన నిజం.
ఇక ప్రకటన విషయానికి వస్తే,
“ఒక చిన్న ఇంటిని శుభ్రం చేయాలంటేనే వారం పడుతుంది. యూపీఏ హయాములో జరిగిన అవినీతితో దేశ వ్యాప్తంగా చెత్త పేరుకు పోయింది.  నేను యావత్ దేశాన్ని శుభ్రం చేస్తున్నా”.
ప్రకటన ఆకర్షణీయంగానే వుంది. అయితే, చెత్తను ఊడ్చే పనితోనే సరిపుచ్చుకోకూడదు. దానితో పాటు చేయాల్సినవి ఇంకా  చాలా వున్నాయి.
“..మనం కేంద్రంలో, అనేక రాష్ట్రాల్లో అధికారంలో వున్నాం. ఈ అధికార ప్రభావం మన మీద వుండకూడదు’ అంటూ సూటిగానే పార్టీ నాయకులకు, శ్రేణులకు హెచ్చరికతో కూడిన సూచన చేసారు.
“సేవాభావం, సమతౌల్యం, నిగ్రహం, సమన్వయం, సానుకూలత, సంవేదన, సంవాదం అనే సప్త సూత్రాలను పార్టీ నేతలు, కార్యకర్తలు పాటించాలి”
వీటిల్లో కొన్ని  హిందీ పదాలకు  తెలుగు సమానార్ధకాలు వేరు. అర్ధాలు కొంత వరకు మారిపోతాయి. ఐతే, ఈ నీతులు ఇప్పుడు చెబుతున్నారు  అంటే  ఏమర్ధం? పార్టీలో ఎంతో కొంత వీటికి కొరత వున్నట్టే కదా! పిల్లవాడ్ని పొద్దున్నే నిద్ర లేచి చదువుకోమని తండ్రి చెబుతున్నాడు అంటే, పిల్లాడు ఆ పని చేయడంలేదనే కదా!
“రెండేళ్ళ మా పాలనపై అనేక మీడియా సంస్థలు సర్వేలు చేసాయి. ప్రజల అండతో నేను ప్రధమ శ్రేణిలో పాసయ్యాను”
పైన చెప్పిన అయిదింటిలో ఇది దేనికిందికి వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఆయన ఈ ప్రసంగం చేసిన సందర్భాన్ని దృష్టిలో వుంచుకుని చూస్తే అందులో ఎలాంటి అనౌచిత్యం కనబడని మాట  వాస్తవమే. బీజేపీ అధ్యక్షుడు  కాకపోయినా  ప్రధాని మోడీనే ఆ పార్టీకి అధినాయకుడు. కాబట్టి, రానున్న అసెంబ్లీ ఎన్నికలకు కార్యకర్తలను సంసిద్ధం చేయాలంటే ఉపన్యాసాలలో ఆ మాత్రం ఘాటు తప్పని సరి.
నిజానికి ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు బీజేపీకి చాలా కీలకం. నాలుగేళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో విజయ భేరీ మోగించిన మూలాయం సింగ్ ఎస్పీ పార్టీ, అతడి కుమారుడు అఖిలేష్  యాదవ్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టింది. అధికారం చేపట్టిన రెండేళ్ళలోనే వచ్చిపడ్డ సార్వత్రిక ఎన్నికల్లో మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సాధించిన ఘన విజయం భారతీయ జనతా పార్టీలో కొత్త ఆశలు రేకెత్తించింది. ఆ రాష్ట్రంలోని మొత్తం ఎనభయ్ లోక సభ సీట్లలో  ఏకంగా డెబ్బయి ఒకటి గెలుచుకుని విజయ బావుటా ఎగురవేసింది.  ఆ స్థాయి విజయాన్ని వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో నమోదు  చేయాలని ఆ పార్టీ పావులు కదుపుతోంది. ఏ రాజకీయ పార్టీ అయినా సాధించిన విజయాలను పటిష్టం చేసుకోవాలనే చూస్తుంది. అందులో 404 సీట్లున్న ఉతరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో పాటు  సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం బీజేపీకి చాలా చాలా అవసరం. ఎందుకంటే, తద్వారా రాజ్యసభలో బలాన్ని ఇతోధికంగా పెంచుకోవడానికి వీలుపడుతుంది. లోక్ సభలో నెగ్గించుకున్న జీ ఎస్ టీ వంటి అతి ముఖ్యమైన బిల్లులను చట్టరూపంలోకి తీసుకురావాలంటే రాజ్యసభలో బలం అతి కీలకం. యూపీ ఎన్నికల్లో గెలుపు ఇందుకు మార్గాన్ని సుగమం  చేస్తుందన్న నమ్మకంతోనే ఆ రాష్ట్రంలో పాగా వేయడానికి మోడీ, అమిత్ షా ద్వయం ఆత్రుత పడుతోందని భావించవచ్చు.  
అసోంలో సాధించిన విజయం, యూపీని కైవసం చేసుకునే దిశగా బీజేపీచేత  అడుగులు వేయిస్తోంది.  ఇందులో బహుముఖ ప్రయోజనాలు వున్నాయి. దేశానికీ ప్రధాన మంత్రులను అందించిన ఉత్తర ప్రదేశ్ నుంచే కాంగ్రెస్ అధినాయకులు సోనియా, రాహుల్ లోక్ సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అంత బలమయిన స్తితిలో లేకపోయినా, ఆ పార్టీకి ఆయువు పట్టు వంటి నేతలు ఇద్దరు ఆ రాష్ట్రం నుంచే ఎన్నికయ్యారు. అంచేత దానిపై పట్టు చిక్కించుకోవడం అంటే ప్రత్యర్ధిపై పై చేయి సాధించినట్టే కాగలదని బీజేపీ వ్యూహకర్తల ఆలోచన కావచ్చు. అందుకే పార్టీ జాతీయ కార్వర్గ సమావేశంలో సాధించిన విజయాలను ఏకరవు పెట్టడంతో పాటు, ఈ దేశం అనుభవిస్తున్న అన్ని కష్టాలకీ, నష్టాలకి  కారణం కాంగ్రెస్ పాలనే అంటూ మరోమారు బహిరంగ నిందారోపణలు చేయడం.   
చరిత్రలో రాజ్యాలను జయించుకుంటూ జైత్ర యాత్రలు చేసే చక్రవర్తులు,  స్థానిక పరిస్తితులకు తగ్గట్టుగా యుద్ధ వ్యూహాలను మార్చుకోవడం ఆనవాయితీ. అలాగే గతంలో అసోం లో విజయానికి అనుసరించిన పద్దతికి భిన్నంగా బీజేపీ అధినాయకత్వం, యూపీ విషయంలో యుద్ధ తంత్రం మార్చుకోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. అసోంలో ముఖ్యమంత్రి అభ్యర్దిని ఎన్నికలకు ముందే ప్రకటించడం ఆ పార్టీకి  బాగా కలిసి వచ్చింది. యూపీ వంటి సువిశాల రాష్ట్రంలో ఆ తంత్రం పనిచేయకపోవచ్చు.  అందుకే మోడీ, అమిత్ షా ద్వయం వ్యూహాన్ని కొంత మార్చుకుంటున్నట్టు అనిపిస్తోంది. ప్రధాన ప్రత్యర్దులయిన ఎస్పీ కి అఖిలేష్ యాదవ్, బహుజన సమాజ్ పార్టీకి మాయావతి ముఖ్యమంత్రి  అభ్యర్ధులని స్పష్టంగా తెలుస్తున్న పరిస్తితుల్లో, బీజేపీ ఈ విషయంలో స్పష్టత ఇవ్వకుండా రంగం లోకి దిగడం వల్ల కలిగే లాభ నష్టాలను గురించి పార్టీలో చర్చ జరుగుతోంది. యెంత కాదనుకున్నా ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో కులం కీలక భూమిక పోషిస్తున్న మాట నిజం. ఆ రాష్ట్రంలో ఠాకూర్లు, యాదవులు, షెడ్యూల్డ్ కులాలు, ఒబీసీలు, బ్రాహ్మణులు ఇలా అందరికీ ఎంతో కొంత ఓటు బ్యాంకు వుంది. ఇలా కులాల వారీగా ఓటర్లను ఆకట్టుకోవడానికి ఒక్కో కులానికి చెందిన వారిని అప్రకటిత ముఖ్యమంత్రి అభ్యర్ధులుగా ప్రచారంలో పెట్టడం ద్వారా అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకోవచ్చనే ఆలోచన కూడా వుంది. అయితే, ఇంతమంది సీఎం అభ్యర్ధులు రంగంలో వుంటే వచ్చే కుమ్ములాటలను  కూడా గమనంలో వుంచుకోవాల్సిన అవసరం వుంటుంది. ఒక రకంగా స్థానిక నాయకులను ఇలా ఒకరి మీద ఒకరిని ఎగదోసి పబ్బం గడుపుకునే సంస్కృతి కాంగ్రెస్  లో వుందని చెప్పుకుంటారు. మరి, నిబద్దత కలిగిన పార్టీ అని ఓ పక్క చెప్పుకుంటూ ఇలాటి రాజకీయాలు చేస్తే పార్టీ ప్రతిష్ట పలచపడుతుందేమో కొందరి సందేహం. విజయాన్నే తుది లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న బీజేపీ  అధిష్టానం, బహుశా ఇటువంటి సందేహాత్మకుల అభిప్రాయాలను పట్టించుకోక పోవచ్చు.             
వచ్చే సంవత్సరం యూపీలో  గెలుపు భారతీయ జనతా పార్టీకి  ఆవశ్యకమే. కానీ అప్పటిలోగా యావత్ ప్రజలు మోడీపై పెట్టుకున్న ఆశల మాటేమిటి? ఇలా చరిత్రలోని చక్రవర్తుల మాదిరిగా రాష్ట్రం వెంట రాష్ట్రం తమ ఖాతాలో వేసుకుంటూ పోవడమేనా! ఇది ధ్యేయంగా పెట్టుకుంటే తప్పేమీ లేదు. కానీ ఇదొక్కటే ధ్యేయం కాదని చెప్పేవాళ్ళు ఆయన అభిమానుల్లోనే పెక్కుమంది వున్నారు.
నరేంద్ర మోడీ ఈ విషయం గమనంలో వుంచుకోవాలి.
చెత్తను ఊడ్చేస్తా! అనే మోడీ ప్రకటనను  అందరూ హర్షిస్తారు, స్వాగతిస్తారు.
అయితే ఒక సలహా. 
చెత్తను మోసుకెళ్ళే లారీ కూడా కొంత చెత్తను రోడ్లమీద పడేస్తుంటుంది. దాన్ని శుభ్రం చేస్తామని బయలుదేరే వాళ్ళు రాజకీయాల్లో ఎలాగూ సిద్ధంగా  వుంటారు. ఇది గుర్తు పెట్టుకోవడం కూడా అవసరం.
(14-06-2016)    

         

మనసులోని రసం



ఈ పండు ఏమిటి?” అడిగాడు గురువు గారు
“నారింజ పండు” చెప్పాడు  శిష్యుడు
“ఈ పండును గట్టిగా పిండితే ఏం వస్తుంది?”
“నారింజ రసం”
“యాపిల్ రసం ఎందుకు రాదు?”
“వీల్లేదు”
“మరి ద్రాక్షరసం”
“అయ్యే పనికాదు”
“ఈ పండుని గట్టిగా పిండితే ఏ రసం వస్తుందంటావు?”
శిష్యుడికి సహనం తగ్గిపోతోంది. కానీ అడుగుతున్నది గురువుగారాయె. విసుగును అణచి పెట్టుకుంటూ జవాబు చెప్పాడు.
“నారింజ పండును పిసికితే నారింజ రసమే వస్తుంది”
“అంటే ఏమిటి. నారింజ పండు కాబట్టి లోపల వుండేది నారింజ రసమే, కదా!”
శిష్యుడు ఔనన్నట్టు తలూపాడు.
“ఉదాహరణకు ఈ పండే నువ్వు అనుకుందాం. ఎవరో కావాలని నీ మీద ఒత్తిడి పెంచాడనుకుందాం. నీకు ఇష్టం లేని మాటలు చెబుతున్నాడని అనుకుందాం. నిష్కారణంగా నిన్ను వేధిస్తున్నాడని అనుకుందాం. అప్పుడేమి జరుగుతుంది. నీకు లోపలనుంచి కోపం తన్నుకు వస్తుంది. అంటే నీ లోపల ఉన్నది కోపం అన్నమాట. ఇలా నీ మనసు బాధ పెట్టేవాడు నీ శత్రువు కావచ్చు, నీ మిత్రుడు కావచ్చు, నీ దగ్గరి చుట్టం కావచ్చు. నీ భార్యాపిల్లలు కావచ్చు, అధికారులు కావచ్చు. ప్రభుత్వాలు కావచ్చు. కానీ వాళ్ళు చేసేది ఈ పండును పిండినట్టు నిన్ను పిండడమే. కానీ నీలోనుంచి బయటకు వచ్చేది మాత్రం కోపం,   చీకాకు, ఆందోళనఒక్కోసారి భయం. దీనర్ధం ఏమిటంటే నీ మనసులో పేరుకుపోయి వున్నవి ఇవే. వీటి స్థానంలో ప్రేమ, ఆప్యాయతలు వుంటే అవే బయటకు వస్తాయి. జీవితంలో సాటివాడిని ప్రేమించడం నేర్చుకుంటే మనసులో కూడా ప్రేమే నిండి వుంటుంది. ఒత్తిళ్లకు గురయినప్పుడు అదే బయటకు వస్తుంది”

శిష్యుడికి గురువుగారి మాటల్లో పరమార్ధం బోధపడింది.

13, జూన్ 2016, సోమవారం

ముసలి మొగుడు – పడుచు పెళ్ళాం


ఓ ముసలాయన చేపలు పట్టడానికి వెళ్ళాడు.  గాలం వేసి ఎదురుచూస్తుంటే ఒక కమ్మని స్వరం నీళ్ళల్లో నుంచి వినిపించింది. ‘ ఓ మానవా నన్ను బయటకు లాగు ఒడ్డున పడెయ్యి’
ఆతగాడు గాలం  లాగి చూస్తే దాని కొక్కేనికి ఒక కప్ప చిక్కుకుని కనిపించింది. 

ఆ కప్ప ఇంకా  ఇలా అంది. ‘నన్ను కాపాడు. నేను భూమి మీదకు రాగానే నన్ను గట్టిగా ముద్దుపెట్టుకో. ఒక అందమయిన అమ్మాయిగా మారిపోయి నీ ఇల్లాలుగా నీతోనే  జీవితాంతం వుండి పోతాను’
ముసలాడు జాలిపడి కప్పను ఒడ్డుకు చేర్చాడు. దాన్ని మెల్లగా నిమిరి తన జేబులో వేసుకోబోయాడు. కప్ప కంగారుగా అంది.’ ఓ మానవా! నేను చెప్పింది సరిగా వినలేదా. నన్ను ముద్దు పెట్టుకో. ఓ అందమయిన అమ్మాయిగా మారి నీ ఇల్లాలుగా వుండి పోతాను. సౌందర్యవతి అయిన భార్య తోడుగా వుంటే నీకూ సంఘంలో గొప్పగా వుంటుంది’
ముసలాడు బోసినవ్వు నవ్వి ఇలా అన్నాడు.

‘ఈ వయస్సులో ఓ పడుచుపిల్లను  భార్యగా భరించడం కంటే, ఇలా మాట్లాడే కప్పను  దగ్గర వుంచుకుంటే  ఇంకా గొప్పగా వుంటుంది’   

NOTE: COURTESY IMAGE OWNER

వావిలేని వరుసలు



ఏకాంబరం పెళ్లి చేసుకున్నాడు. కాకపోతే అప్పటికే పెళ్ళయి విడాకులు  తీసుకున్న అమ్మాయిని ఎవరికీ చెప్పకుండా గుళ్ళో పెళ్లి చేసుకుని వేరు కాపురం పెట్టాడు. ఆ కొత్త పెళ్లి కూతురు  అమ్మాయి కాదు, అప్పటికే  అమ్మ. ఆ అమ్మడికి ఈడొచ్చిన ఒక అమ్మాయి వుంది. పెళ్లి అయిన రోజే ఒకమ్మాయికి తండ్రి అయ్యే అదృష్టం పట్టిన  ఏకాంబరానికి అతడి తండ్రి రూపంలో దురదృష్టం ఎదురయ్యింది. ఒకరోజు కొడుకును చూడ్డానికి ఏకాంబరం ఇంటికి వచ్చిన తండ్రి, సొంత కొడుక్కి సవతి కూతురు అయిన అమ్మాయిపై మనసు పారేసుకుని ఏకంగా పెళ్ళాడేసి కొత్త కాపురం పెట్టాడు.  ఆ విధంగా  కూతురు వరసయిన అమ్మాయి ఇప్పుడు సవతి తల్లి అవతారం ఎత్తింది.  కన్న తండ్రికే  పిల్లనిచ్చిన మామ అయ్యాడు. అలా ఏకాంబరం కట్టుకున్న పాత పెళ్ళాం తోనూ, అతడి తండ్రి కొత్త పెళ్ళాం తోనూ హాయిగా కాపురాలు  చేసుకుంటున్న రోజుల్లో  కధ మరో మలుపు తిరిగింది.   
ఏకాంబరానికి  సవతి కూతురు లేదా సవతి తల్లి వరుస అయిన  అయిన పాత తండ్రి కొత్త భార్య  నెల తప్పింది. చూస్తుండగానే నెలలు నిండడం, పండంటి పిల్లాడిని కనడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడా పిల్లవాడు మన ఏకంబారానికి ఒక రకంగా మనుమడు. ఎంచేతంటే సవతి కూతురు కన్న తల్లికి తాను మొగుడు కాబట్టి.  మరో రకంగా ఆ పిల్లవాడు ఏకాంబరానికి తమ్ముడు వరస, ఎందుకంటె అతగాడు  తండ్రికి పుట్టిన కొడుకు కాబట్టి.
దాంతో  ఏకాంబరం భార్య  పాత్ర  అమ్ముమ్మకు  మారింది. దీనికి కారణం ఆవిడ కూతురే  ఏకాంబరం నాన్నగారి భార్య కాబట్టి. ఈ వరస ప్రకారం  ఏకాంబరం తన భార్యకు మనుమడు అవుతాడు. ఈ తికమకల నడుమ ఏకాంబరం భార్య ఓ మంచి రోజు చూసుకుని ఒక పిల్లాడ్ని కని కూర్చుంది. అతడి కన్న కొడుకే అతడి  నాన్నకు బావమరిది అయ్యాడు. అంతేకాదు  ఏకాంబరానికి సవతి తల్లి వైపు వరస తీసుకుంటే అతడు అతడికే  తాత అయ్యాడు.
ఇలా వుండగా  ఏకాంబరం ఇంటికి జనాభా లెక్కల వాళ్ళు వచ్చారు. ఆ సమయంలో మొత్తం కుటుంబం ఇంట్లోనే వున్నారు.
లెక్కల వాడు అందర్నీ లెక్కపెట్టి చూసుకున్నాడు. తరువాత ఏకాంబరాన్ని అడిగాడు. ఆ కుర్చీలో కూర్చున్న పెద్దాయన ఎవరని.
‘ఆయనా ! ఆయన  మా నాన్న. కాదు కాదు మా అల్లుడు’
‘ఈ పెద్దావిడ?’
‘నా భార్య’
‘ఆ చిన్నావిడ?’
‘మా అమ్మాయి, కాదు కాదు మా అమ్మ’
‘ఈ పిల్లవాడు?’
‘నా మనుమడు కాదు కాదు కొడుకు’
‘యితడు అతడికేమవుతాడు?’
‘మనుమడు, కాదు కాదు బామ్మర్ది’
‘ఈవిడ?’
‘మా సవతి తల్లి కాదు కాదు కూతురు’
జనాభా లెక్కల వాడు, నీళ్ళు కూడా అడక్కుండా మూర్చపోయాడు.
(ఇంగ్లీష్ కధనానికి తెలుగు స్వేఛ్చానువాదం)