8, జూన్ 2016, బుధవారం
7, జూన్ 2016, మంగళవారం
ప్రాణం విలువ పెరుగుతోందా!
ఎన్నికలకు ముందు ప్రచార పర్వంలో ప్రజల మధ్యనే తిరుగుతూ ‘ఆఖరి నెత్తురు బొట్టు వరకు
ప్రజలకొరకు పోరాడతాం’ అనే రాజకీయ నాయకులు అధికారంలోకి రాగానే అంగరక్షకుల వలయాల
నడుమ జీవిస్తూ తమను గద్దె నెక్కించిన ప్రజలకు దూరం అవుతూ వుండడం మనం చూస్తూ
వున్నాం.
ఇందుకు మినహాయింపులు కూడా లేకపోలేదు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పీవీ
హయాములో మొదటి సారి కేంద్ర ఆర్ధిక మంత్రి అయ్యారు. ముంబైలో స్టేట్ బ్యాంక్ ఏర్పాటు
చేసిన ఒక సమావేశానికి ఠంచనుగా వచ్చారు. బ్యాంకు చైర్మన్ తో సహా సీనియర్
అధికారులందరూ ఎదురు చూస్తుండగా ఒక అంబాసిడర్ కారు వచ్చింది. అందులో నుంచి మన్మోహన్
సింగ్ కారు తలుపు తీసుకుని కిందికి దిగారు. వెంట ఒక పియ్యే, డ్రైవర్ ఇంతే
సిబ్బంది. వెనుక ఒక పోలీసు జీపులో ఒక ఇనస్పెక్టర్, ఒక కనిస్టీబు, ఇంతే సెక్యూరిటీ.
అది చూసి బ్యాంకు అధికారులు నివ్వెర
పోయారు. అంతకు ముందు వారు అనేకమంది ఆర్ధిక మంత్రుల హంగూ, ఆర్భాటం ఎరిగిన వారు
కనుకనే వారిలో ఈ నివ్వెరపాటు.
మరపుల మడతల్లో ....
ఖమ్మం జిల్లాలో మొట్టమొదటి కాలేజీని ప్రారంభించడానికి అప్పటి
హైదరాబాద్ స్టేట్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఖమ్మం
వచ్చారు. ఖమ్మం గుట్టల బజారులో వున్న గోడౌన్లలో కాలేజీ పెట్టారు. ముఖ్యమంత్రి
వచ్చిన నాన్ ఏసీ అంబాసిడర్ కారులో ఆయనతో పాటు మాకు బాబాయి వరుస అయ్యే బొమ్మకంటి
సత్యనారాయణ రావు గారు కూడా వచ్చారు. ఎలాటి హడావిడీ లేదు.
బూర్గుల గారు తమ ఉపన్యాసంలో చెప్పారు.
‘తెలంగాణా మొత్తంలో అటు హైదరాబాదు,
వరంగల్ మినహాయిస్తే ఎక్కడా కాలేజీలు లేవు. అందుకే జిల్లాకు ఒక కాలేజీ పెట్టుకుంటూ
వస్తున్నాము. ఇప్పుడు ఖమ్మం వంతు. పెద్దలు బొమ్మకంటి గారు ఖమ్మం వచ్చి తీరాలని
ఆజ్ఞాపించారు. ఆ ఆజ్ఞాబద్ధుడనై వచ్చాను’.
శ్రీరామభక్త గెంటేల నారాయణరావు గారు
ఇచ్చిన విరాళంతో ఖమ్మంలో మొదటి కాలేజీ వచ్చింది. SR & BGNR Government Arts College అని దీని పేరు. ఇప్పుడా కాలేజీని కలెక్టర్ ఆఫీసు సమీపంలో విశాలమైన ప్రాంగణానికి
మార్చారు.
లేబుళ్లు:
ఖమ్మం కాలేజీ,
బూర్గుల రామకృష్ణారావు
సమయ పాలన
ఇది నాణేనికి ఒక వైపు.
సమయాన్ని ఎవరు పాటించినా పాటించక
పోయినా పరవాలేదు కానీ, రాజకీయ నాయకులు పాటించి తీరాలి. ఎందుకంటే, వారికోసం వేచి
చూస్తూ అనేకమంది తమ విలువైన సమయం పాడు చేసుకోవాల్సి వస్తుంది.
జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా
వున్నప్పుడు బ్యాంకర్ల మీటింగు పెట్టారు. ఇప్పట్లోలా అప్పుడిన్ని ప్రభుత్వ బ్యాంకులు ఉండేవి కావు. ఓ పది మంది బ్యాంకు ఉన్నతాధికారులు
హాజరయ్యేవారు.
ముఖ్యమంత్రి ఛాంబర్ లో మీటింగు. అధికారులు ఎందుకయినా మంచిదని ఓ పది
నిమిషాలు ముందే వెళ్ళారు. ఇప్పట్లోలా సెక్యూరిటీ బాదరబందీలు లేవు కాబట్టి వెళ్లి సీఎం
కార్యాలయంలో అధికారి సీతాపతిని కలిసారు. రండి రండి మీ కోసమే సి ఎం ఎదురు
చూస్తున్నారు అంటూ లోపలకు తీసుకువెళ్ళి కూర్చోపెట్టారు. సరిగ్గా చెప్పిన టైముకు
నిమిషం తేడా లేకుండా వెంగళరావు గారు గదిలోకి వచ్చారు. ఎజెండా ప్రకారం
మాట్లాడాల్సినవి మాట్లాడి, వినాల్సినవి విని ఇచ్చిన సమయం అరగంట కాగానే మంచిది
వెళ్ళిరండి అని వీడ్కోలు పలికారు. గంటలు గంటలు పడిగాపులు పడకుండా వచ్చిన పని
పూర్తయినందుకు అధికారులు కూడా సంతోషపడుతూ వెళ్ళిపోయారు.
ఇక నాణేనికి మరోవైపు.
అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్
చెన్నారెడ్డి గారు విజయనగరం జిల్లాలో రెండు రోజుల పర్యటన పెట్టుకున్నారు. మొదటి
రోజల్లా ఊపిరి తిరగని కార్యక్రమాలు. రెండో
రోజు ఉదయం పది గంటలకు పార్వతీపురంలో విశాఖ గ్రామీణ బ్యాంకు శాఖకు ప్రారంభోత్సవం
చేయాలి. అప్పటి కలెక్టర్ భిడే, ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారిని వెంటబెట్టుకుని పది గంటలకల్లా అక్కడికి చేరుకున్నారు. అప్పటికి
నిర్వాహకులు ఎదురు చూస్తూనూ, ఆహూతులందరూ నిద్రమత్తులోనూ జోగుతున్నారు. ఎందుకంటె చెప్పిన ప్రకారం పది
గంటలకే వచ్చారు కానీ కాకపొతే, రాత్రి పది గంటలకు.
(పార్వతీపురంలో విశాఖ గ్రామీణ బ్యాంక్ బ్రాంచిని ప్రారంభించిన అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి)
లేబుళ్లు:
జలగం వెంగళరావు,
మర్రి చెన్నారెడ్డి
6, జూన్ 2016, సోమవారం
పెనం పైనుంచి ....
అయిదేళ్లుగా నానా రాతలూ రాస్తున్నావు. అదేదో సినిమాలకి రాస్తే కాస్త ఉభయతారకంగా వుండేది కదా! అని ఉచిత సలహా ఇచ్చాడు ఓ మిత్రుడు. పెనం మీద నుంచి పొయ్యిలో పడతావేమో చూసుకో అన్నాడు ఆ మాట విన్న మరో మిత్రుడు
సలహా
నలభయ్ ఏళ్ళుగా నా విలేకరత్వం రాజకీయాలచుట్టూ భ్రమించింది. నేటి రాజకీయాల కారణంగా చిత్తభ్రమణం సంభవించకముందే జాగ్రత్త పడమని హితైషుల సలహా!
అప్పుడూ ఇప్పుడూ పులే!
డాక్టర్ చెన్నారెడ్డి.
ఉమ్మడి రాష్ట్రానికి రెండు పర్యాయాలు తిరుగులేని ముఖ్యమంత్రిగా
పనిచేసిన వ్యక్తీ. ‘నా మాటే జీవో’ అని
బాహాటంగా ప్రకటించిన ఉద్దండ రాజకీయ
వేత్త. తరువాత కొన్నాళ్ళు గవర్నర్ గిరీ
చేసి ఆ కొలువులు తన తత్వానికి
సరిపడకపోవడంతో రాజీనామాచేసి హైదరాబాదు వచ్చి తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి
వచ్చే ప్రయత్నం చేస్తున్న రోజులవి.
ఆ క్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను
కలిసి చర్చించే పనిలో తలమునకలుగా వుంటున్న కాలంలో ఒక సీనియర్ జర్నలిష్టు ఆయన్ని తార్నాకాలోని నివాసంలో కలిసారు. కాఫీలు
గట్రా అయిన తరువాత ఆ జర్నలిష్టుని మర్యాదపూర్వకంగా అడిగారు
రెడ్డిగారు, “What
brought you here?”( ‘ఏం పని మీద వచ్చావు ‘ అని అర్ధం
వచ్చేలా!)
దాన్ని మరోలా అర్ధం చేసుకున్న ఆ జర్నలిష్టు
చెలరేగిపోయాడు. బల్ల మీద చేతితో గట్టిగా చరుస్తూ, ఆవేశంతో ఊగిపోతూ అన్నాడు.
‘నేను మీదగ్గరకు పని మీద రాలేదు. మీరు
పిలిపిస్తే వచ్చాను. నాతొ మీకేమైనా పని వుంటే చెప్పండి.’
దాంతో చెన్నారెడ్డి గారు కాస్త తగ్గి
వాతావరణాన్ని చల్లబరిచే ప్రయత్నం చేసారు. ఎంతయినా రాజకీయవేత్త కదా!
ఆ చెన్నారెడ్డి గారు ఇప్పుడు లేరు.
ఆ జర్నలిష్టు పేరు ఆదిరాజు వెంకటేశ్వర
రావు.
హైదరాబాదు దత్తాత్రేయ నగర్ లో వుంటున్న డెబ్బయ్ అయిదేళ్ళు పైబడ్డ ఆ వృద్ధ సింహాన్ని, నిన్న (05-06-20116) కలిసాము. ఢిల్లీ
నుంచి వచ్చిన దక్షిణాసియా విదేశీ
జర్నలిష్టుల క్లబ్ అధ్యక్షుడు ఎస్.వెంకటనారాయణకు ఆదిరాజుతో ఢిల్లీలో పరిచయం. కరీంనగర్ జిల్లాలోని ఆయన స్వగామం వెళ్లి వచ్చిన
వెంకటనారాయణ ఆదిరాజును కలవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేయడంతో, జ్వాలా నరసింహారావు
పూనికతో ఆదిరాజును కలవడం జరిగింది. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కే. రామచంద్ర మూర్తి, 108, 104 పధకాల రూపశిల్పి డాక్టర్ అయితరాజు పాండు రంగారావు, తెలంగాణా టుడే ఇంగ్లీష్
దినపత్రిక ఎడిటర్ కే. శ్రీనివాసరెడ్డి (పూర్వాశ్రమంలో హిందూ రెసిడెంట్ ఎడిటర్),
తెలంగాణా ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ సోదరుడు డాక్టర్ సమ్మన్న మా బృందంలో
వున్నారు.
వార్ధక్య ఛాయలు మినహాయిస్తే ఆదిరాజు
మాకు డెబ్బయిల్లో తెలిసిన ఆదిరాజు లాగానే వున్నారు. భార్య సీతాదేవి పేరుకు తగ్గ
ఇల్లాలు. తలితండ్రులను పిల్లలు కంటికి
రెప్పలా చూసుకుంటున్నారు. ఇలాంటి పిల్లలు
వుండడం అనేది జర్నలిష్టులకు వరం. జీవితమంతా ఎవరికీ తలవంచకుండా బతికిన ఆదిరాజు
ఇప్పటికీ అలాగే వుండగలుగుతున్నారంటే ఇది ఆ వరం పుణ్యమే.
చరిత్రలో మరుగున పడిపోయిన ఇలాంటి కొన్ని సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి, అంతే కాకుండా
ఆదిరాజుతో కలయికకు ప్రోద్బలం చేసిన
జ్వాలాకు ధన్యవాదాలు.
లేబుళ్లు:
ఆదిరాజు,
ఎస్..వెంకట నారాయణ,
చెన్నారెడ్డి,
సాక్షి రామచంద్ర మూర్తి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
