17, ఫిబ్రవరి 2016, బుధవారం

తెలిసిన కేసీఆర్ లో తెలియని కేసీఆర్


(ఫిబ్రవరి పదిహేడు - తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం)
కేసీఆర్ ని దగ్గరగా చూసి పదేళ్లు పైనేనేమో!
2004 లో దూరదర్శన్ లో పనిచేసేటప్పుడు,  కాంగ్రెస్ తో ఎన్నికల పొత్తు గురించి చెప్పడానికి అనుకుంటా,  బంజారా హిల్స్ లో వున్న ఆయన ఇంట్లో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కలిసిన గుర్తు.  మధ్యలో కొంత ఎడం వచ్చింది కాని నేను మాస్కో వెళ్లక మునుపు కేసీఆర్,  ఎన్టీయార్ క్యాబినెట్ లో రవాణా శాఖ  మంత్రిగా వున్నప్పుడు, రేడియో విలేకరిగా  తరచుగా కలుస్తూ వుండే మంత్రులలో ఆయన ఒకరు. సచివాలయంలో ముఖ్యమంత్రి  పేషీ వుండే ‘సమత’ బ్లాక్ పక్కనే మసీదుకు దగ్గరలో  మరో పాత భవనం వుండేది. అందులో వుండేది కేసీఆర్  కార్యాలయం. అదిప్పుడు లేదు. కూల్చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసివచ్చిన రాజకీయ ప్రముఖులు విలేకరులతో  మాట్లాడే 'మీడియా పాయింటు' ప్రస్తుతం ప్రదేశంలో వున్నట్టుంది.


అదలా వుంచితే, మళ్ళీ కేసీఆర్ ని దగ్గరగా గమనించే అవకాశం నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు వచ్చింది. తెలంగాణా జర్నలిష్టుల ఫోరం కేసీఆర్ తో  ముఖాముఖి సమావేశం (మీట్ ది ప్రెస్) ఏర్పాటు చేసింది.
రావాల్సిందని నిర్వాహకుల నుంచి ఆహ్వానం.
'ప్రెస్ మీట్ అవగానే కేసీఆర్, కొందరితో పిచ్చాపాటీగా మాట్లాడతారు. తప్పకుండా రండి’ అని ఆహ్వానానికి కొసరు.
జర్నలిష్టుగా  రిటైర్ అయిన తరువాత ఇలా ఎవరి ప్రెస్ కాన్ఫరెన్స్ లకు వెళ్ళలేదు. ప్రత్యేక సందర్భాలలో ప్రత్యేకించి పిలిస్తే తప్ప. ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు. 'మీట్ ది ప్రెస్' కాబట్టి బయలుదేరి వెళ్లాను.

హాలు నిండి కిటకిటలాడుతోంది. అందరూ తెలియకపోయినా మా తరం జర్నలిస్టులు కొందరు కలిశారు. ఇంతలో ఇతర టీ.ఆర్.ఎస్. నాయకులను వెంటబెట్టుకుని కేసీఆర్ వచ్చారు. ముందు వరసలో వున్న జర్నలిస్టులను పలకరిస్తూ నాతో  కూడా కరచాలనం చేసారు. క్షణం తేరిపార చూసినట్టు అనిపించింది కాని గుర్తు పట్టినట్టులేదు అనుకున్నాను.
సరే! ఆయన వేదిక మీదకు వెళ్ళి  తన అలవాటు ప్రకారం  సుదీర్ఘంగా ప్రసంగించారు. రాజకీయ నాయకులు అంతసేపు మాట్లాడితే కాస్త భరించడం కష్టం. కాని ఆయన చెప్పిన విషయాలువాటిల్లో తొంగి చూసిన విషయ పరిజ్ఞానం, తొట్రు పడకుండాతడుముకోకుండాఅసహనానికి గురికాకుండా విలేకరుల ప్రశ్నలకు జవాబులు ఇచ్చిన తీరు సభికులను కట్టి పడేశాయి. 'సభికులు' అని ఎందుకు అంటున్నానంటే అది విలేకరుల సమావేశంలా లేదు. మోస్తరు బహిరంగ సభలా వుంది. గిట్టని వాళ్ళు ఆయన్ని ‘మాటల మాంత్రికుడు’ అంటుంటారు కాని నిజంగా ఆయన మాటల్ని మంత్రించి వొదలడంలో దిట్ట. ఆయన చెప్పిందంతా తిరిగి రాయాలంటే గ్రంధం అవుతుంది. 'తెలంగాణా కల నెరవేరిననాడు కొత్త రాష్ట్రాన్ని ఎలా తీర్చి దిద్దబోతున్న'దీ ఆయన సవివరంగా చెప్పారు. వినడానికి అంతా కల మాదిరిగానే వుంది. నూతన తెలంగాణా ఆవిష్కృతం అయ్యే క్రమంలో ఆయన చెప్పిన విషయాలు – ఒక రకంగా -  ఏదో ఒక సందర్భంలో ఆయన చెప్పినవే అయినా – వాటన్నిటిని ఆయన గుది  గుచ్చి చెప్పిన తీరు, అదంతా టీవీల్లో  ‘ప్రత్యక్షప్రసారంలో చూస్తున్న బెజవాడ  మిత్రుడు ఒకరు  ఎస్.ఎం.ఎస్. పంపారు. 'కేసీఆర్   అయిదేళ్ళు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిఇప్పుడు చెబుతున్నట్టుగా  యావత్ ఆంద్రప్రదేశ్ ని అభివృద్ధి చేసివుంటే ఇప్పుడీ (విభజన) గొడవలే ఉండేవి కావ'న్నది దాని సారాంశం.  కానీ, అప్పటికే రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిపోయింది. ఎన్నికలే తరువాయి.
నాటి సభలో కేసీఆర్ అనేక విషయాలను స్పృశించారు. అవన్నీ ఇక్కడ అప్రస్తుతం.  కాని 'విడిపోతే భద్రాచలం సంగతేమిటి?' అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు జవాబుగా చరిత్రలోని ఒక వృత్తాంతాన్ని ఆయన ఆసక్తికరంగా వివరించారు.
"వెనుక  అది (భద్రాచలం) తెలంగాణాలోనే వుండేది. భక్త రామదాసును బందిఖానాలో వేసింది అప్పటి గోలకొండ కోటలోనే. పొతేభద్రాచలానికి పొరుగున బ్రిటిష్ ఇండియాలోని వైజాగ్ ప్రాంతంలో ఒక ముష్కరుడు గ్రామాలమీద పడి దోపిడీలు చేస్తుంటే బ్రిటన్ సాయుధ సాయాన్ని కోరడంవాళ్ళు   దోపిడీదారుడి నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించడంచేసిన సాయానికి కృతజ్ఞతగా నవాబు గారు  గోదావరి ఆవల వైపువున్న ప్రాంతాన్ని వారికి దఖలు పరచడం –  అంతా కధ మాదిరిగా చెప్పుకుంటూ వచ్చారు. ఇదంతా వినడానికి చాలా ఆసక్తిగా అనిపించింది. అదే కేసీఆర్ ప్రత్యేకత.
సమావేశం ముగిసే సరికి చాలా పొద్దు పోయింది. ఆయన ఆప్యాయంగా భోజనానికి వెంటబెట్టుకుని పోయారు. పక్కపక్కనే కూర్చుని భోజనం. అది హోటల్ అయినా అందర్నీ చక్కగా కనుక్కున్నారు. ఆయనకు రాజకీయ గురువు అయిన  యన్టీయార్ గారిదీ ఇదే మనస్తత్వం. అతిధులను  స్వయంగా కనుక్కుంటూ, కొసరి కొసరి వడ్డించి  మరీ తినిపించేవారు.
హోటల్లో ఏవేవో పదార్ధాలు కేసీఆర్ కి వడ్డించబోతే, 'వద్దు ఇంత అన్నంపప్పూ పట్టుకు రమ్మ'న్నారు. సింపుల్ భోజనం. భోజనం చేస్తుండగా  ఆయనకు నేనెవరో క్రమంగా గుర్తుకువచ్చినట్టు వుంది. పక్కనే కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా మాట్లాడారు. అనేక ముచ్చట్లు చెప్పారు. ఇదంతా ఆయన ముఖ్యమంత్రి కాకపూర్వం. అయిన తరువాత ఎన్నడూ కలిసింది లేదు. అవసరమూ రాలేదు. అయితే, టీవీల్లో ఆయన ప్రసంగాలు వింటున్నప్పుడు, పత్రికల్లో ఆయన గురించిన కధనాలు చదువుతున్నప్పుడు కేసీఆర్ మారిన దాఖలాలు ఏమీ కనబడడం లేదు.
అయినా ఆయన మునుపటి మనిషి కాదనే వాళ్లు వున్నారు. ఒకప్పుడు కాదని తోసిరాజన్నవాళ్ళను దగ్గరకి తీసిన సందర్భాలు, స్వవచన ఘాతుకంగా అనిపించే ప్రకటనలను వారు ఉదహరిస్తుంటారు. ఉదాహరణకు ఒకప్పుడు మోడీ గారి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మొదట్లో ఆయన పట్టించుకున్న దాఖలా లేదు. ఇప్పుడు అదే అంశాన్ని తన ప్రాధాన్యతల జాబితాలో చేర్చారు. భద్రాచలం ముంపు మండలాలు, రామోజీ స్టూడియో సందర్శన, కేంద్రంతో ఇటీవలి కాలంలో మెరుగు పరచుకుంటున్న సంబంధాలు ఇలా అనేకం. 

ఆకాశ రహదారులు, వంద అంతస్తుల భవనాలు, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, సచివాలయం తరలింపు ఒకటా రెండా, రోజుకొక ఆలోచన, పూటకొక పధకం. 'ఇవన్నీ సాధ్యమా?' అనే వారికి  ఆయన సమాధానం ఒక్కటే. 'చూస్తుండండి చేసి చూపిస్తాను' అని.   
ఎవరెన్ని విమర్శలు చేసినా, వ్యాఖ్యానాలు చేసినా ఆయన లెక్క చేసే రకం కాదు. 'బంగారు తెలంగాణా కల సాకారం చేయడానికి ఏమైనా చేస్తా, ఏమైనా చెబుతా' అనే ఒకే ఒక్క మాటతో ప్రత్యర్ధుల వాదనలను పూర్వపక్షం చేయడానికి ఆయన ఎప్పుడూ సంసిద్ధంగానే వుంటారు. ఒకరకంగా ఇది కేసీఆర్ బలమూ, బలహీనత రెండూ.
ముఖ్యమంత్రిగా అయన వ్యవహార శైలి విభిన్నంగా వుంటుందని ఆయనతో పనిచేసే అధికారులు చెబుతుంటారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో ఏదైనా రాష్ట్ర వ్యవహారం చర్చించాలని అనిపిస్తే చాలు, అధికారులతో ప్రమేయం లేకుండా ఆయనే స్వయంగా ఫోనులో మాట్లాడేస్తుంటారు.
అందుకే కేసీఆర్ మాకు బాగా తెలుసు అనేవారికి కూడా వారికి తెలియని అనేక కోణాలు ఆయనలో వున్నాయి.
అదే కేసీఆర్ ప్రత్యేకత.
ఫిబ్రవరి పదిహేడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టిన రోజు. వారికి శుభాకాంక్షలు. (17-02-2016)         

   

12, ఫిబ్రవరి 2016, శుక్రవారం

ఎర్ర సముద్రం ఎండిపోయింది.- అరుణ్ సాగర్ ఇక లేరు


(మిత్రులు శ్రీ అరుణ్ సాగర్ అకాల మృతిపై ఈ ఉదయం టీవీ – 5 తో,  ఫోన్ ఇన్ లో పంచుకున్న భావవీచిక)
“అరుణ్ సాగర్ ఇక లేరు అనే దుర్వార్తతో ఈ రోజు తెల్లవారింది.
“మనిషి అనేవాడు ఒక లోకంలో జీవిస్తాడు. అదేమిటో అరుణ్ చిన్న వయస్సులోనే అనేక లోకాల్లో సంచరించి అంతలోనే హడావిడిగా కనుమరుగై పోయాడు. అతడిది ఒక లోకం కాదు, పత్రికాలోకం, కవితాలోకం, రచయితల లోకం  ఇలా అన్నిట్లో తన ముద్ర స్పష్టంగా పడేసుకుని తన దోవన తాను నిశ్శబ్దంగా నిష్క్రమించాడు.
“నిన్న కనిపించిన మనిషి ఈరోజు కనిపించకపోవడం సహజం. కానీ ఇక ఎప్పుడూ కనిపించడు అనే భావనే అతి  దుర్భరం.
“ఈ మధ్యనే టీవీ -  5  నిర్వహించిన ఒక పెద్ద చర్చాకార్యక్రమంలో ఆయన్ని కలిసాను. కొద్ది రోజుల్లో జరగబోయేది తెలిసినా ఏమీ తెలియనట్టు హాయిగా నవ్వుతూ మాట్లాడాడు. ఆయన రాసిన ‘మ్యూజిక్ డైస్’ పుస్తకాన్ని సంతకం చేసి మరీ కానుకగా ఇచ్చాడు. ఇచ్చిన పుస్తకం ఎదురుగా వుంది. ఇచ్చిన  అరుణ్ సాగర్ లేడు. మరణం ఇంత దుస్తరంగా మనుషుల్ని విడదీస్తుంది కాబోలు.
“బాగా మాట్లాడగలం అనే పేరున్నవాళ్ళు  కూడా నోరు తెరిచి నాలుగు మాటలు చెప్పలేని సందర్భం ఇది.
“మనుషుల్ని తప్ప  ఆత్మల్ని నమ్మని అరుణ్  సాగర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకోవడం విడ్డూరంగానే వుంటుంది. అయినా తప్పని సందర్భం.’ 


(ఒక కార్యక్రమంలో అరుణ్ సాగర్, నేనూ)


(మ్యూజిక్ డైస్ పుస్తకంపై అరుణ్  సాగర్  ఆటోగ్రాఫ్)




11, ఫిబ్రవరి 2016, గురువారం

ఆయారాం గయారాం


‘జనత పార్టీ’  ప్రయోగం విఫలం అయిన తర్వాత, 1980 లో ఇందిరాగాంధీ తిరిగి కేంద్రంలో  అధికారంలోకి రాగానే, ఆనాటి హర్యానా ముఖ్యమంత్రి భజన్ లాల్  రాత్రికి  రాత్రే పార్టీ మార్చి, ‘సహేంద్ర తక్షకాయస్వాహా’ మాదిరిగా తన కేబినేట్ మంత్రులు, తన  పార్టీ  ఎమ్మెల్యేలతో సహా కాంగ్రెస్ (ఐ) లో చేరిపోయిన సందర్భంలో, నాటి మరాఠా రాజకీయ నాయకుడు ఎస్.బీ. చవాన్ ‘రాజకీయ కప్పదాట్లకు కొత్తగా చేసిన నామకరణమే ఈ  ‘ఆయారాం గయారాం’. అప్పటినుంచి ఈ రాజకీయ విష సంస్కృతి మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొత్త రెమ్మలు తొడుగుతూనే వస్తోంది. 
ఈ అభివృద్ధి రేటు పెరుగుదల చూసి దేశంలో రాజకీయ పార్టీలు అదిరిపోతున్నాయి. కోడి మనదే, కోడిని ఉంచిన గంప మనదే అనే ధైర్యం పోతోంది. గంప గంప లాగానే వుంది. కోళ్ళు మాత్రం మాయం అవుతున్నాయి. అందుకే కాబోలు పార్టీ టిక్కెట్టు మీద గెలిచిన వాళ్ళు తమ కట్టు దాటిపోకుండా అనేక ఎత్తులు వేస్తున్నాయి. ‘ఆయారాం గయారాం’ బెడద తప్పించుకోవడానికి మేఘాలయ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం, ‘యునైటెడ్ డెమోక్రాటిక్ పార్టీ’   ఒక కొత్త ఐడియాతో ముందుకు వచ్చింది. అదే ‘నయా రాం’.



దీనికింద పార్టీ టిక్కెట్టు ఇచ్చేముందే అభ్యర్ధులతో, ఇండియన్ కాంట్రాక్ట్ ఆక్ట్ కింద  బాండు మీద సంతకం చేయించుకుంటారు, అయిదేళ్ళ వరకు పార్టీ ఒదిలి వెళ్ళమని. కానీ రాజకీయాల్లో స్కాచి వడబొసిన ధిగ్గనాధీరులు, యేరు దాటగానే బోడి మల్లయ్య’ అనడం నేర్చిన వాళ్ళు ఈ  బండ్లు, సంతకాలు లెక్కపెడతారనుకోవడం అమాయకం. 1972 లో అస్సాం నుంచి విడిపడి ఏర్పడ్డ మేఘాలయ రాష్ట్రంలో గత నలభయ్ ఏళ్ళ కాలంలో అక్షరాలా ఇరవై నాలుగు ప్రభుత్వాలు ‘ఆయారాం గయారాం’ సంస్కృతి కారణంగా మారాయి. రెండు సార్లు రాష్ట్రపతి పాలన అదనం.
ఇలా చెప్పుకుంటూ పొతే చాలా వున్నాయి ఈ కబుర్లు.   
ఈ రాజకీయ కప్పదాట్లు అనేవి మన దేశానికీ, మన ప్రాంతాలకు  మాత్రమే పరిమితం కాదు. అనేక దేశాల్లో ఈ సంస్కృతి రెక్కలు విప్పుకుని విస్తరిస్తోంది. ఉదాహరణకు  నైజీరియా. వచ్చే ఏడాది అక్కడ జరిగే ఎన్నికల మాటేమో కానీ రాజకీయ నాయకుల  పార్టీ మార్పిళ్లు మాత్రం చాలా వేగంగా పెద్దఎత్తున సాగుతున్నాయి. లేబర్ పార్టీ అభ్యర్ధిగా గెలిచి గవర్నర్ అయిన ఒలుసేగం మిమికో  గాలివాటం చూసుకుని ఆ పార్టీకి  రాం  రాం చెప్పేసారు. 2009 ఫిబ్రవరిలో ఆయన ఆండో స్టేట్  గవర్నర్ అయి,  తిరిగి  2012 అక్టోబర్ లో సయితం అయన అదే లేబర్ పార్టీ టిక్కెట్టు పై మళ్ళీ గెలిచి మళ్ళీ  గవర్నర్ కాగలిగారు. ఆ రాష్ట్రానికి  ఇలా రెండోసారి వరుసగా గవర్నర్ అయిన వారు ఎవ్వరూ లేరు. లేబర్ పార్టీ పుణ్యమా అని అలాటి రికార్డు అయన సొంతం అయింది.  కానీ మిమికో ఈసారి, రెండేళ్ళు తిరక్కముందే  రూటు మార్చి పాలకపక్షం పీపుల్స్  డెమోక్రటిక్ పార్టీలో  దూరిపోయి తన అదృష్టాన్ని మరో రకంగా పరీక్షించుకునే పనిలోపడ్డారు. ఇలా పార్టీ మార్చిన మిమికో మహాశయులను పీ.డీ.పీ. కూడా సగౌరవంగా పార్టీలోకి స్వీకరించి ఇటువంటి విషయాల్లో తనకెలాంటి భేషజాలు లేవని రుజువు చేసుకుంది.
'పిల్లి  తను  చనిపోయేలోగా ఏడు (గండాలు) చావులు తప్పించుకుంటుంది' అని ఓ  ఆంగ్లసూక్తి.  అనంబ్రా రాష్ట్ర మాజీ గవర్నర్  డాక్టర్ పీటర్ ఓబీ ఈ సామెతకు సరిగ్గా అతికినట్టు  సరిపోతారు. ఈయన గారు అధికారంలో వున్న రోజుల్లో ఆ అధికారాన్ని దుర్వినియోగం  చేయడం ఎల్లా అనే ఒక్క దానిమీదనే దృష్టి పెడతారని, వేరే ధ్యాసలు ఏవీ  పెట్టుకోరని ఆయనకో పేరుందని అంటారు. అనడం ఏమిటి ఆయనపై ఇలాటివి చాలా కేసులు వున్నాయి. ఆరోపణలు వచ్చినప్పుడల్లా పదవి పోగొట్టుకోవడం,  మళ్ళీ  కోర్టు నుంచి ఉపశమన ఉత్తర్వులు తెచ్చుకుని తిరిగి పదవి పొందడం ఆయనకు అలవాటుగా మారింది. అదేమి  చిత్రమో తెలియదు కానీ ప్రతిసారీ కోర్టు రూలింగులు ఆయనగారికి అనుకూలంగానే వచ్చేవి. అందుకే పిల్లి ఏడు  గండాలు తప్పించుకున్నట్టు ఆయనకూడా ప్రతిసారీ వొడ్డున పడగలుతున్నారు. అన్ని తెలివితేటలు ఉండబట్టే ఈ సారి ఎన్నికలకు ఏడాది ముందే ఆయన ముందు చూపుతో పాలకపక్షం పీడీపీలో చేరిపోయారు. అంతా ఇలా అధికారపక్షం  వైపు దూకుతుంటే పాలక పక్షానికి  చెందిన  నాయకుడు, ప్రస్తుత  పార్లమెంటు స్పీకర్ అయిన అమిను తంబువాల్, ఈ మధ్యనే తన సొంత పార్టీ పీడీపీ ని వొదిలి పెట్టి ప్రతిపక్షం ఏపీసీ లో చేరి  నిరుడు జరిగిన ఎన్నికల్లో గెలిచి  సోకోటో రాష్ట్ర  గవర్నర్ కాగలిగారు. 
అంటే గోడలు దూకడం వల్ల కూడా ప్రయోజనం లేకపోలేదన్న మాట. అయితే ఈ సూత్రం అన్ని సందర్భాల్లో పనిచేయకపోవచ్చు. గోడ దూకి మోకాళ్ళు విరగగొట్టుకున్న వాళ్ళు కూడా రాజకీయాల్లో కనిపిస్తారు. వారి విషయం మరోసారి. NOTE
ఉపశృతి:
పార్టీ వాళ్ళు సొంత పార్టీ ఒదిలి బయటకు పరిగెడుతున్నా పార్టీ అధినాయకులు మాత్రం మొక్కుబడిగా చేసే వ్యాఖ్య ఒకటుంది.’ ఇలా ఎందరు పోయినా  మా పార్టీకి వచ్చే నష్టం ఏమీలేదు’
నిజమే వారికోసమే  సినారె పాట రాసివుంటారు.   
“ఎవ్వడికోసం ఎవడున్నాడు పొండిరా పొండి నా కాలం ఖర్మం కలిసొస్తేనే రండిరా రండి”

NOTE: Cartoon Courtesy "TIMES OF INDIA"




10, ఫిబ్రవరి 2016, బుధవారం

“కంట నిదుర రాకపోతే....... పడ్డావనుకొ ప్రేమలో.....”


..అని ఒక పాత సినిమా పాట వుంది.
ఎవరయినా ఒక పార్టీ నాయకుడు టీవీ చర్చల్లో పాల్గొంటూ, తనలో కొన ఊపిరి మిగిలి వున్నంతవరకు తనకు రాజకీయ జీవితం ఇచ్చిన సొంత పార్టీలోనే కొనసాగుతానంటూనో,
లేదా
ఎదుటి పక్షం గురించి హీనాతిహీనంగా మాట్లాడుతూ గొంతు చించుకుంటున్నాడంటే  దానికి ఒక్కటే అర్ధం.
ఊపిరి ఉండగానే యెదుటి పార్టీలోకి యెగిరి దూకడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడని.
కత్తులు దూసిన పార్టీలోకే  చల్లగా జారుకుంటున్నాడని.

ఇది అది అని కాకుండా అందరికీ, అన్ని పార్టీలకీ  వర్తించే సార్వజనిక రాజకీయ సూత్రం ఇది.

   

మరణశిక్షలకు క్షమాభిక్ష

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 11-02-2016, THURSDAY)

సూటిగా....సుతిమెత్తగా.....

నేరస్తులకు న్యాయస్థానాలు విధించే శిక్షల్లో ఒకటయిన  మరణశిక్షకు చెల్లుచీటీ రాయాలనే అంశం మరోమారు తెర మీదకు వచ్చింది. శిక్షగా అయినా సరే ఒక మనిషి ఉసురు తీసే హక్కు చట్టానికి కూడా వుండకూడదని వాదించే వాళ్ళు దేశదేశాల్లో వున్నారు. వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. పంటికి పన్ను, కంటికి కన్ను అనే వాదన కూడా  అనాదిగా వినబడుతోంది. దారుణమైన నేరాలు చేసేవాళ్ళకు మానవత్వం పేరుతొ మరణశిక్ష నుంచి మినహాయింపు ఇవ్వడం మానవత్వానికే మాయని మచ్చ అని నమ్మే వాళ్లకు కూడా కొదవలేదు. అందుకే ఈ ఉభయ వర్గాలు తమ వాదనే సరియినదన్న నమ్మకంతో ఎదుటి పక్షం వాదనను పూర్వ పక్షం చేసే ప్రయత్నాలు కూడా కొత్తకాదు.
జాతీయ న్యాయకమిషన్  కొన్ని కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి చేసిన సిఫారసుల్లో ఉరి శిక్షలను రద్దు చేయాలనేది కూడా వుంది. ఈ విధానానికి స్వస్తి చెప్పాలని కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఉగ్రవాద సంబంధమైన కేసులు మినహా మిగిలిన సందర్భాల్లో మరణ శిక్షను వెంటనే రద్దు చేయాలని కమిషన్ కోరింది. అత్యంత అరుదయిన కేసుల్లోను ఉరిశిక్ష రద్దు చేయాలన్నది కమిషన్ అభిప్రాయం. ఉరిశిక్ష అనేది రాజ్యాంగపరంగా చూసినప్పుడు నిలబడదని స్పష్టం చేసింది.  ఉరిశిక్ష రద్దు విషయంలో ప్రస్తుతం వున్న  విచక్షణాధికారాలు వినియోగిస్తున్న తీరు సరిగా లేదన్నది కమిషన్ అభిప్రాయంగా వుంది. మరణ దండన విధించిన కేసుల్లో ఏదైనా న్యాయ పరమైన తప్పిదాలు జరిగితే వాటిని సరిదిద్దే రక్షణ కవచంగా పొందుపరచిన రాజ్యాంగ అధికరణాలు సరిగా అమలు కావడం లేదని కూడా పేర్కొన్నది.
ఈ సిఫారసుపై మోడీ సర్కారు సానుకూలంగా వున్నట్టు సమాచారం. ఈ అంశంపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కోరుతూ కేంద్రం లేఖలు రాసింది. మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాలు మరణశిక్షల రద్దుకు అంగీకారం తెలిపితే ఇక దేశంలో మరణ శిక్ష విధించడం, దాన్ని అమలు పరచడం అనే ప్రక్రియ  గత కాలపు ముచ్చటగా మారిపోతుంది.
ఇప్పటికే నూట నలభయ్ దేశాల్లో మరణ శిక్షను రద్దు చేసారు. మన దేశంతో సహా యాభయ్ అయిదు దేశాల్లో మాత్రమే ప్రస్తుతం ఈ శిక్ష  అమల్లో వుంది.
న్యాయ కమిషన్ నివేదిక ప్రకారం చైనాలో మరణశిక్షల సంఖ్య హెచ్చు. అయితే, క్రూరాతి క్రూరంగా ఈ శిక్షలను అమలుచేసే విషయం తీసుకుంటే సౌదీఅరేబియా అగ్రస్థానంలో వుంది. నిరుడు ఒక్క ఏడాది కాలంలోనే అ దేశంలో వందకు పైగా నేరస్తులు  శిరచ్చేదానికి గురయ్యారు. ఈ  విషయంలో పాకీస్తాన్ కూడా తక్కువ తిన్నది లేదు.
చందమామ కధల్లో రాజుకి  ఆగ్రహం వస్తే చాలు, ఎవడి తలనైనా సరే ఖండించి దాన్ని కోటగుమ్మానికి వేలాడదీయమని భటులకు ఆజ్ఞలు జారీచేయడం అన్నది అందరికీ ఎరుకే.  మనదేశంలో రికార్డుల కెక్కిన  ఉరిశిక్ష మొట్టమొదటగా  వందేళ్ళ క్రితం అమలు జరిగింది. దేశం బ్రిటిష్ వలస పాలనలో వున్నప్పుడు 1898 లో తొలిసారి ఈ శిక్షను అమలుచేసారు. ఎవరు ఏమిటి అన్న వివరాలు లభ్యం కావడం లేదు.  దరిమిలా, భారత  స్వాతంత్రోద్యమ కాలంలో విప్లవ బావుటా ఎగురవేసిన  స్వతంత్రసమర యోధులు సుఖ్ దేవ్ , రాజ్ గురులను  ఆనాటి బ్రిటిష్ సర్కారు ఉరితీసింది. దీనితో దేశ వ్యాప్త నిరసనలతోపాటు ఉరిశిక్షను రద్దు చేయాలనే ఉద్యమాలు కూడా ఊపిరి పోసుకున్నాయి. అనేక భాషల్లో ఈ ప్రచారానికి దన్నుగా సినిమాలు కూడా తీసారు. నవలల విషయం చెప్పక్కర లేదు. యండమూరి వీరేంద్ర నాథ్ ఈ ఇతివృత్తంతో రాసిన ‘అభిలాష’ నవల, దాని ఆధారంగా నిర్మించిన చలనచిత్రం పొందిన జనాదరణ తెలుగునాట సర్వజన విదితమే.         
ఈ మరణ శిక్షలకు కూడా చాలా చరిత్ర వుంది.
క్రీస్తుకు పూర్వం పద్దెనిమిదో శతాబ్దం నాటికే బాబిలోన్ లో మరణ శిక్షలు నేర శిక్షాస్మృతిలో భాగంగా వున్నాయి.   ఇరవై అయిదు నేరాలకు సంబంధించి మరణ శిక్ష విధించేందుకు నాటి  పాలకులు శాసనాలు చేసారు. అంతకు ముందు ఏడో శతాబ్దంలో  ఏ నేరం చేసినా ముద్దాయికి మరణ దండన విధించే ఆచారం వుండేది. ఈ శిక్షలను అమలు చేసే తీరు కూడా విభిన్నంగా వుండేది. శిక్షపడిన పడిన వారిని నీళ్ళల్లో ముంచి ఊపిరి ఆడకుండా చేసి చంపేవాళ్ళు. సిలువవేసే వాళ్ళు. చనిపోయేంతవరకు కొరడా దెబ్బలు కొట్టేవాళ్ళు. నిలువునా కాల్చి చంపేవారు. శిరచ్చేదం చేసేవాళ్ళు.
పన్నెండో శతాబ్దం నాటికి బ్రిటన్ దేశంలో  నేరస్తులను ఉరికంబం ఎక్కించే పద్దతి అమల్లోకి వచ్చింది. పదమూడో శతాబ్దం కల్లా పరిస్తితి పూర్తిగా మారిపోయింది. బ్రిటిష్ సింహాసనం ఎక్కిన ‘విలియం ది కాంక్వరర్’ యుద్ధ సమయాల్లో తప్ప ఏ నేరానికీ మరణ శిక్ష విధించరాదని ఆదేశించారు. మూడు శతాబ్దాల తరువాత బ్రిటిష్ సింహాసనం అధిరోహించిన ఎనిమిదో హెన్రీ ఈ సాంప్రదాయానికి స్వస్తి పలికాడు. ఆయన హయాములో డెబ్బయి రెండు వేలమంది ఉరికంబం ఎక్కారు.   
మరణ శిక్షల పరంపర తరువాత కూడా బ్రిటన్ లో కొనసాగింది. పెద్ద నేరాలు చేసిన వాళ్ళకే కాకుండా దొంగతనం చేసినందుకు, అనుమతి లేకుండా చెట్లు నరికినందుకు కూడా ఉరిశిక్షలు వేయడం మొదలయింది. తదనంతర కాలంలో బ్రిటన్ లో న్యాయ సంస్కరణలు చోటుచేసుకున్నాయి  ఉరిశిక్ష విధించే నేరాల సంఖ్యను పరిమితం చేసారు.
మరణ శిక్షల విషయంలో అమెరికాకి కూడా బ్రిటన్ ఆదర్శం అయింది. ఆ దేశానికి వలస వెళ్ళిన బ్రిటిష్ వాళ్ళు ‘మరణ దండన’ ప్రక్రియని తమతో పాటు అక్కడికి తీసుకు వెళ్ళారు. అమెరికాలో మొట్టమొదటి ఉరిశిక్ష 1608 లో అమలయింది. స్పెయిన్ కు గూఢచారిగా పనిచేస్తున్నాడు అనే  నేరం మీద కెప్టెన్ జార్జ్ కెండాల్ ని విచారించి ఉరితీసారు. 1612 లో వర్జీనియా గవర్నర్ సర్ థామస్ డెల్, ఒక అడుగు ముందుకు వేసి,  ద్రాక్షపళ్ళు, కోళ్ళు దొంగిలించడం అనే చిన్న చిన్న నేరాలకు కూడా మరణ దండన విధించిన సందర్భాలు వున్నాయి.
ఇక మన దేశం విషయానికి వస్తే,   
ఏదైనా నేరంలో ఉరిశిక్ష పడ్డప్పుడు రాష్ట్రపతి నుంచి క్షమాభిక్ష పొందడం ద్వారా దాన్ని రద్దు చేసుకోవడానికి కూడా వెసులుబాటు వుంది. అయితే ఇటువంటి  విచక్షణాధికారాలు కేవలం బాగా కలిగిన వారికే తప్ప బడుగుబలహీన వర్గాలకు ఒరిగేది ఏమీ వుండదన్న వాదన కూడా వుంది. ఉరిశిక్ష నుంచి క్షమాభిక్ష పొందిన వారిలో అత్యధికులు రాజకీయ పలుకుబళ్ళతో ప్రాణాలు దక్కించుకోగలిగారని, ఉరికంబం ఎక్కుతున్న వారిలో ఎక్కువమంది దళిత, మైనారిటీ, బలహీన వర్గాలకు చెందినవారేనని వారు గణాంకాలు ఉదహరిస్తున్నారు. ప్రభుత్వాలను ప్రభావితం చేయగలిగిన వారికే ‘క్షమాభిక్ష’ వెసులుబాటు లభిస్తోందని వారి ఆరోపణ.
చట్టం ముందు అందరు సమానులే అని అంటుంటారు. ఒకరు ఎక్కువా కాదు, ఒకరు తక్కువా కాదు అనే సమసమాజ  సిద్ధాంతం  ప్రవచించిన పూర్వపు సోవియట్ యూనియన్ లో వాస్తవ పరిస్తితిని గమనించిన జార్జి ఆర్వెల్, ‘అక్కడ అందరు సమానులే, కాకపొతే కొందరు ఎక్కువ సమానులు’ అని ఎద్దేవా చేసాడు. కాబట్టి, చట్టమే కాదు, న్యాయం అమలు జరిగే తీరు కూడా అందరి విషయంలో కూడా ఒకే విధంగా వుండాలి. అప్పుడే అది న్యాయం అనిపించుకుంటుంది.  (10-02-2016)

రచయిత ఈ  మెయిల్: bhandarusr@gmail.com మొబైల్:  98491 30595