8, ఫిబ్రవరి 2016, సోమవారం

బాబుగారి అసలు ఆస్తి


పాతికేళ్ళ క్రితం ఉద్యోగ రీత్యా ఓ అయిదేళ్ళ పాటు మాస్కోలో వున్న నాలుగు కుటుంబాల వాళ్ళం నిన్న ఆదివారం కలుసుకున్నాం. మేము మాస్కో వెళ్ళే నాటికి తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని పాలిస్తోంది. తిరిగొచ్చేనాటికి కాంగ్రెస్ పాలన. నేను మాస్కో రేడియోలో పనిచేస్తే మిగిలిన ముగ్గురు ఇండియన్ ఎంబసీలో ఉన్నతోద్యోగులు. వారికీ, వారి కుటుంబాలకి తెలుగుదేశం అన్నా, చంద్రబాబునాయుడు అన్నా విపరీతమైన అభిమానం. ఆ అయిదేళ్ళ కాలంలో ఎప్పుడు కలుసుకున్నా వాళ్ళ నోటి నుంచి బాబుగారి గురించిన ప్రశంసావాక్యాలే. 1989 లో ఆ పార్టీ ఓడిపోయినప్పుడు, రేడియో వాడిని కనుక, ఆ రోజుల్లో ఇంత సమాచార విస్పోటనం లేదు కనుక, ఆ వార్తను వారికి ముందుగా చెబితే,   ఇంటిల్లిపాదీ బాధపడడం నాకు తెలుసు.  వాళ్ళ అభిమానం చూసి, ‘ఎన్నారైలకి ఓటు హక్కు ఇస్తే బాబు గారే రాష్ట్రానికి శాశ్విత ముఖ్యమంత్రి’ అని నేను సరదాగా జోక్ చేసేవాడిని.   మధ్యలో ఒకసారి మాస్కో నుంచి వచ్చినప్పుడు నేనే స్వయంగా ఈ మాట ఆయన చెవినవేసాను. నవ్వి ఊరుకున్నారు.
గత ఇరవై ఐదేళ్ళలో బాబు గారి వెంట ఆనాడు వున్న అనేకులు, పార్టీ  ప్రముఖులు, ముఖ్యంగా ఆయన నుంచి ఏదో ఒక ప్రయోజనం పొందినవాళ్ళు  మొహం చాటేశారు. వాళ్ళెవళ్ళు అన్నది అందరికీ  తెలిసిందే.
కానీ మాస్కో బ్యాచ్ లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. బాబు గారంటే అదే ఆప్యాయత, అదే ఆదరణ.

ఆయన గుర్తింపుతో నిమిత్తం లేని అభిమానం వారిది. ఇది నాకెలా తెలుసంటే, హైదరాబాదు వచ్చిన  తరువాత  ఇన్నేళ్ళలో ఆయన్ని కలిపించమని ఎన్నడూ అడగలేదు.


  

మాస్కో బ్యాచ్


రేడియో మాస్కోలో పనిచేయడానికి  1987 లో  మాస్కో వెళ్లిన వాళ్ళమై,  అప్పటి సోవియట్ యూనియన్ అంగవంగ కళింగ దేశాలుగా విచ్చిన్నం అయిన చారిత్రిక సందర్భాన్ని కళ్ళారా చూసిన వాళ్ళమై, 1991 లో సకుటుంబ  సమేతంగా స్వదేశం చేరుకొని తిరిగి హైదరాబాదు ఆకాశవాణిలో ఉద్యోగ ప్రస్తానం కొనసాగిస్తున్న వేళ....
.......తాజాగా తెలియవచ్చిన విషయం ఏమిటంటే, మాస్కోలో వున్న కాలంలో  నాతొ పాటే అక్కడ ఉద్యోగరీత్యా వున్న ఐదారు  తెనుగు కుటుంబాలు కూడా హైదరాబాదులోనే స్థిర నివాసం ఏర్పాటుచేసుకున్నాయని.
మాస్కోలోని  ఇండియన్ ఎంబసీలో పనిచేసే నేవల్ కమాండర్లు సుధీర్ పరకాల, రమా పరకాల, దాసరి రాము, అమ్మాజీ రాము,  స్టీల్  అధారిటీ  తరపున పనిచేసే  ఇంజినీర్  కే.వీ. రమణ, త్రిలోచన రమణ,  హిందూస్తాన్ ఏరో నాటిక్స్  తరపున పనిచేసే శ్రీధర్ కుమార్, విశాల శ్రీధర్ కుమార్, రాదుగ  ప్రచురణాలయంలో పనిచేసే రాళ్ళభండి వెంకటేశ్వరరావు (ఆర్వీయార్), సుందరమ్మ గారు, (ఆర్వీయార్ దంపతులు కాలం చేశారు) ప్రగతి ప్రచురణాలయంలో పనిచేసే నిడమర్తి ఉమారాజేశ్వరరావు (ప్రస్తుతం బెంగళూరులో సెటిల్ అయ్యారు)  ఇత్యాది తెలుగు సంసారులం  అందరం మాస్కోలో వున్న అయిదేళ్ళు వారంవారం భార్యా పిల్లలతో కలిసి ఒకరింట్లో కలుసుకుని,  సాయం కాలక్షేపాలతో  మగవాళ్ళు, మాటలు, ముచ్చట్లతో ఆడంగులు  పొద్దుపుచ్చడం అనేది  ఒక ఆనవాయితీగా  మారింది.







మళ్ళీ ఇన్నేళ్ళకు నిన్న ఆదివారం మధ్యాన్నం లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డులో వున్న జల వాయు విహార్ లోని పరకాల సుధీర్ గారి నివాసంలో అందరం కలుసుకున్నాము. రెండున్నర దశాబ్దాలు వెనక్కి మళ్ళి,  కలబోసుకున్న కబుర్లతో, రమా పరకాల గారు స్వహస్తాలతో వండి వడ్డించిన విందు  భోజనాలతో కడుపులు, మనస్సులు నింపుకుని ’దస్విదానియా’ (రష్యన్ పదం- మళ్ళీ కలుద్దాం అని అర్ధం) అనుకుంటూ  ఎవరిళ్లకు వాళ్ళం మళ్ళాము.  




7, ఫిబ్రవరి 2016, ఆదివారం

పెద్దల దర్శనం – అతులిత ఆనందం


అనేక ‘పత్రికల’ ఆరితేరిన అక్షర యోధుడు పొత్తూరి వెంకటేశ్వరరావు గారితో చాలాసేపు ముచ్చటించే అపూర్వ అవకాశాన్ని మాకు వారే కల్పించారు. నిన్న సాయంత్రం జ్వాలాతో కలిసివెళ్ళి వారింట్లో, నిజంగానే  ఇల్లు, నగరంలో అలాటివి అరుదు కనుక ‘ఇల్లు’ అంటున్నాను. ఇంటి ముందు అరుగు, చక్కటి పూలమొక్కలు, లోపల కూడా వెనుకటి వాతావరణం ఉట్టిపడే విధంగా అన్నీ అమర్చిన తీరు, పొత్తూరి వారు తమ జీవిత పర్యంతం ఇష్టపడి కూడబెట్టిన ఐశ్వర్యం , పుస్తకాల రూపంలో దర్శనం ఇచ్చింది. పొత్తూరి వారింటికి నేను అనేక సార్లు వెళ్లాను. అయినా అన్నీ పాతవి, ఎప్పుడూ కొత్తగా కానవస్తుంటాయి. వారి అబ్బాయి ప్రేమ్ గోపాల్, నిజంగా ప్రేమ మూర్తి. ఈ రోజుల్లో అలా ఆప్యాయతలు చూపడం చాలా అబ్బురం అనిపించింది. ఈ విషయంలో కూడా పొత్తూరి వారు ధన్యులు.
రేపు సోమవారం ఎనభయ్ మూడో పడిలో అడుగుపెడుతున్న ఆ యువ,వృద్ధ మూర్తి నోటి వెంట అనేక పాత ముచ్చట్లు వినడం చాలా సంతోషం అనిపించింది. మధ్య మధ్యలో కీర్తిశేషులు అయిన మా పెద్దన్నయ్య భండారు పర్వతాల రావు గారి ప్రసక్తి. మా అన్నయ్యతో పొత్తూరి వారి అనుబంధం అంతా ఇంతా కాదు.
నాకూ పొత్తూరివారికి  వయస్సులో పదమూడేళ్ళు తేడా. కానీ ఫోటోలో చూస్తే అసలు తేడా తెలుస్తుంది, నా పొట్ట పెరిగిన తీరు గమనించిన వారికి.
పొత్తూరి వారి మనుమరాలు సంతోషి మనీష వివాహం  ఈ నెల రెండో వారంలో. ఆయన ఇలాగే నిండు ఆరోగ్యంతో మనుమలు, మునిమనుమలతో హాయిగా ఆనందంగా గడుపుతూ,  భవిష్యత్ పాత్రికేయ  తరాలకు మంచి మార్గ దర్శనం చేయాలని భవదీయుడి కోరిక.



ఫోటో కర్టెసీ : ప్రేమ్ గోపాల్ పొత్తూరి. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ వాసుదేవ దీక్షితుల వారు కూడా అక్కడే వుండడం మరింత సంతోషం అనిపించింది.       

6, ఫిబ్రవరి 2016, శనివారం

బాధ్యత పెంచిన ఘన విజయం

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY on 07-02-2016, SUNDAY)

సూటిగా...సుతిమెత్తగా......

ముందుగా ఊహించిన గెలుపు ఆనందాన్ని కలిగిస్తుంది. ఊహించని విజయం అమితానందాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం టీఆర్ఎస్ అధినాయకత్వం, నాయకగణం, పార్టీ శ్రేణులు ఈ  రెండురకాల ఆనందాలను మనసారా  అనుభవిస్తున్నాయి. ఆ తమకంలో మునిగితేలుతున్నాయి.
ఎందుకంటే ఇంతటి స్థాయిలో మహత్తర విజయం తమని వరిస్తుందని వారూ ఊహించలేదు. ‘గెలుస్తాం, జీహెచ్ ఎం సీ పీఠంపై, ఎవరి సాయం లేకుండా  సొంత బలంతో  గులాబీ జెండా ఎగురవేస్తామ’ని అనుకున్నారే కాని, ప్రత్యర్ధి పార్టీల గుండెల్లో గుబులు పుట్టేలా  విజయం సాధించగలమని అనుకుని వుండకపోవచ్చు. ‘వంద స్థానాలకు తక్కువయితే రాజీనామాల’ వంటి సవాళ్లు, పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడానికే అని అనుకున్న వాళ్ళూ వున్నారు. టీఆర్ఎస్ విజయాన్ని ముందస్తుగా బయటపెట్టిన వివిధ చానళ్ళ సర్వేలు కూడా ఈ స్థాయిలో  అపూర్వ విజయాన్ని పసికట్టలేకపోయాయి. ప్రధాన పక్షాలు గెలిచిన స్థానాలన్నీ కూడినా, అది సింగిల్ డిజిట్ కి పరిమితం అవుతుందని  ఊహించని చారిత్రాత్మక విజయం టీఆర్ఎస్ ఖాతాలో చేరింది. ఒక రాజకీయ పార్టీకి ఇంతకంటే  కావాల్సింది ఏముంటుంది? ఇంతకంటే సంబురపడగల సందర్భం వేరే ఏముంటుంది? 
‘ఈ విజయం తమపై బాధ్యతను మరింత పెంచింద’ని టీఆర్ఎస్  అధినేత కే. చంద్రశేఖరరావు ఫలితాల అనంతరం విలేకరుల సమావేశంలో చెప్పారు. అంతే కాదు, ప్రజలు తమపై పెట్టుకున్న ఆశలను, ఎన్నికల సందర్భంగా వారిలో కల్పించిన ఆశలను సంపూర్ణంగా నెరవేర్చే వరకు  తమ బాధ్యత పూర్తయినట్టు కాదనీ,  గెలిచివచ్చిన తమ  పార్టీ  కార్పొరేటర్లు అనుక్షణం దీన్ని గమనంలో ఉంచుకోవాలని ఉద్బోధించారు.  చక్కటి మాట చెప్పారు. దాన్ని నిజం చేయాల్సిన బాధ్యత కూడా  వారి భుజస్కంధాలపైనే వుంది. ఈ విషయంలో ఏమాత్రం ఏమరుపాటు తగదు.
మొత్తం నూటయాభయ్ సీట్లలో శతకానికి ఒక్కటి తక్కువగా అక్షరాలా  తొంభయ్ తొమ్మిది  టీఆర్ ఎస్  కైవసం చేసుకుంది. కార్పోరేషన్ మేయర్ పదవిని సొంతంగా చేజిక్కించుకోవడానికి అవసరమైన సీట్లకంటే మించి అదనంగా 23  స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. ఫలితాలు వెలువడుతున్న సమయంలో ఆ పార్టీ ఆధిక్యత ప్రదర్శించిన సీట్లు,  ఒక సందర్భంలో నూరు దాటిపోయినప్పుడు ప్రతిపక్షాలన్నీ చేష్టలు ఉడిగిపోయాయి. ‘ఓటింగు శాతం 45 దగ్గరే ఆగింది, లేకుంటేనా.....’ అంటూ ఒక టీఆర్ఎస్  అభిమాని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు కూడా.
ఉపఎన్నిక జరిగిన పురానా పూల్ స్థానం ఫలితం వచ్చిన తరువాత ప్రకటించిన తుది ఫలితాల్లో టీఆర్ఎస్ కు 99, ఎంఐఎం కు 44,  బీజేపీకి నాలుగు, కాంగ్రెస్ కు రెండు, టీడీపీకి ఒక్కటి దక్కాయి. ముందస్తు సర్వే ఫలితాలు వాస్తవ ఫలితాలకు ఏమైనా దగ్గరగా ఉన్నయా అంటే అది ఒక్క ఎంఐఎం విషయంలోనే కాస్త అటూఇటుగా నిజమయ్యాయని  చెప్పొచ్చు. సర్వేలే కాదు, పోటీ పడ్డ ఇతర రాజకీయ పార్టీలు కూడా తమ  అంచనాల్లో ఈ పాత బస్తీ పార్టీకి నలభయ్ సీట్లు ఒదిలేసే తమ లెక్కలు వేసుకున్నాయి.
ఇక ఓటమి విషయానికి వస్తే,  క్రితం సారి 2009 లో  ఎన్నికలతో పోల్చి చూస్తె, కాంగ్రెస్ పార్టీది  దారుణ పరాజయం, టీడీపీది అతిదారుణం. కిందటి సారి బల్దియా ఎన్నికల్లో 52 స్థానాలు దక్కించుకున్న  కాంగ్రెస్ ఈసారి  రెండు సీట్లకే పరిమితం అయింది.  అలాగే, గతంలో 45 స్థానాలు గెలుపొందిన టీడీపీ ఈ తడవ ఒక్కటంటే ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బీజేపీ బలం  అయిదు నుంచి నాలుగుకు  పడిపోయింది. ఎంఐఎం ఒక సీటు అదనంగా సంపాదించుకుని ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది.  
పరాజితులు గురించి మాట్లాడుకోవడం సబబు కాదు. వారి పరాజయానికి కారణాలు విశ్లేషించడం కూడా ఫలితాలు వచ్చిన వెంటనే ప్రస్తావించడం విజ్ఞత అనిపించుకోదు. ఇప్పుడు ఏమి మాట్లాడినా వారికి రుచించే పరిస్తితులు ఎట్లాగు వుండవు. అంచేత,  పరాజయ కారణాల అన్వేషణ వారికి వొదలడమే బాగుంటుంది. పైకి బింకంగా ఏం చెప్పినా, ప్రతి రాజకీయ పార్టీ అంతర్గతంగా  మంచి చెడుల విశ్లేషణ తనకుతానుగా  చేసుకుంటూనే వుంటుంది. కాకపొతే వారికొక హిత వాక్యం. ‘ఓటమి అనేది చెరుపుకోలేని పుట్టుమచ్చ కాదు,  వంటికి తగిలిన దెబ్బ తాలూకు మచ్చ వంటిది. ప్రయత్నం ద్వారా దాన్ని తొలగించుకోవచ్చు. పారేసుకున్న చోటునే వెతుక్కుంటే వస్తువు దొరికే అవకాశం ఎక్కువ. ఒకచోట పారేసుకుని మరోచోట దేవులాడితే ప్రయోజనం వుండదు. గెలిచిన  పార్టీ గెలుపుకోసం ఏం చేసింది, ఎన్ని అడ్డదార్లు తొక్కింది అనే చర్చలు ఆత్మసంతృప్తికి మాత్రమె పనికివస్తాయి. అయితే యెంత కాదనుకున్నా ఈనాటి ప్రచార యుగంలో రాజకీయ పార్టీలు ఇలాటి సుద్దులు వింటూ మడి కట్టుకుని కూర్చోవడం కూడా సాధ్యం కాదు.



పొతే, అఖండ విజయం సాధించిన టీఆర్ఎస్ పట్ల ప్రజలు చూపించిన నమ్మకానికి కొంత పునాది వుంది. ఆ పునాది వేసింది ఆ పార్టీ అధినేత చంద్రశేఖరరావు. ఆ పునాదిని గట్టిపరిచి ఫలితాలు వచ్చేలా చేసింది ఆయన ప్రదర్శించిన వ్యూహ చతురత. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార బాధ్యతను,  విద్యాధిక ఓటర్లు వున్న నేపధ్యంలో విద్యాధికుడు అయిన కేటీఆర్ కు ఒప్పగించడంతో కేసీఆర్ ఎన్నికల వ్యూహానికి తెర తీసారు. ఏ భాషలో అయినా అనర్ఘలంగా ప్రసంగించే నేర్పు కలిగిన  కేటీఆర్  కి, అది  ప్రచారపర్వంలో బాగా ఉపయోగపడింది.   
టీఆర్ఎస్ విజయానికి బంగారు బాట వేసింది తెలంగాణా వాదం.  రాష్ట్ర విభజన జరిగి దాదాపు రెండేళ్ళు దగ్గరపడుతున్నాయి. అయినా ఇక్కడి ప్రజల్లో ఆ వాదం ఇంకా పచ్చిగానే కాదు,  బలంగా కూడా వుంది. దీనికి కారణం కూడా  వుంది.
1956 లో ఆంద్ర ప్రదేశ్ అవతరణ నాటి నుండి వేళ్ళూనుకున్న ప్రత్యెక తెలంగాణా ఉద్యమం  1969 నాటికి మరింత బలపడింది. తెలంగాణా ప్రజాసమితిని విశ్వసించిన ఈ ప్రాంతపు ప్రజలు దరిమిలా 1971 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో, దేశ వ్యాప్తంగా నాడు వెల్లువలా ఉబికిన ఇందిరా కాంగ్రెస్ హవాను కూడా కాదని ఆ ప్రాంతీయ పార్టీకి అఖండ విజయం కట్టబెట్టారు. తెలంగాణా  ప్రాంతంలోని మొత్తం 14  లోకసభ స్థానాల్లో ఆ పార్టీ పదింటిని గెలుచుకుంది.  అయితే అప్పటి నాయకుల్లో కొందరు అధికారం కోసం పాకులాడిన ఫలితంగా, తాము దారుణంగా మోసపోయామన్న భావన  నాటి ఉద్యమకారుల్లో ఉండిపోయింది. తదనంతర కాలంలో కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడ్డ టీఆర్ఎస్, ప్రజల్లో వున్న ఈ అభిప్రాయాన్ని చెరిపివేయడానికి, తన విశ్వసనీయతను నిరూపించుకోవడానికి విశ్వప్రయత్నం చేయాల్సి వచ్చింది. ఏళ్ళ పాటు సాగిన ఉద్యమం కట్టు తప్పకుండా,  ధ్యేయానికి దూరం జరగకుండా పార్టీ నాయకత్వం పడ్డ శ్రమదమాదులను తెలంగాణా ప్రజానీకం గుర్తించింది.  అందుకే  తెలంగాణా వాదాన్ని గెలిపించి, చిరకాల కోరికను నిజం చేసిన టీఆర్ఎస్ ను ఇప్పుడు ఎన్నికల్లో  అదే వాదం ఘనంగా గెలిపించింది.  
విజయానికి అనేక కారణాలు వుంటాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ ఘన విజయానికి దారి వేసిన అంశాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కేసీఆర్ ప్రదర్శించిన రాజకీయ  చాణక్యం. అసలు ఎన్నికల ప్రక్రియ మొదలు కాకముందు నుంచే ఆయన ఒక పక్కా ప్రణాళికతో సిద్ధం అయినట్టు కానవస్తోంది. ప్రతి విషయంలో అయన అత్యంత శ్రద్ధ తీసుకోవడం వల్లనే ఈ ఫలితం సాధ్యం అయింది. ఒక ముఖ్యమంత్రి స్థాయి  వ్యక్తి, మునిసిపల్ ఎన్నికల్లో ఇంతటి శ్రద్ధ చూపించడం అంటే ఆయనకు విజయం పట్ల సందేహాలు వున్నాయని అనుమానించిన వాళ్ళు కూడా వున్నారు. ఎవరేమనుకున్నా ఆయన పట్టించుకోకుండా ఫలితం పట్లనే ఆసక్తి కనబరచినట్టు తోస్తోంది. అదే విజయానికి మెట్లు వేసింది.
ఆయన ముందు చూపుకు ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు.  2009 లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయన తన పార్టీని ఎన్నికల ముగ్గులోకి దింపలేదు. ఆ తరువాత జరిగే అసెంబ్లీ ఎన్నికలపైనే దృష్టి కేంద్రీకరించారు. మునిసిపల్ ఫలితాల్లో తభావతు వస్తే దాని ప్రభావం అసెంబ్లీ, లోకసభ ఎన్నికలపై పడే అవకాశం  వుంటుంది. రాష్ట్ర సాధనకు ఆ ఎన్నికల్లో గెలుపు ముఖ్యం. అందుకే ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన పట్టించుకోలేదు. తెలంగాణా ఏర్పడడానికి పూర్వం హైదరాబాదు ఓటర్ల విషయంలో ఆయనకు ఖచ్చితమైన అవగాహన ఉండడం కూడా కారణం కావచ్చు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ కొత్తల్లో కూడా ఒక వర్గం ఓటర్లలో కొన్ని సందేహాలు గూడుకట్టుకునే వున్నాయి. గత ఇరవై నెలల్లో వాటిని తొలగించడానికి కేసీఆర్ అనేక ప్రయత్నాలు చేసారు. ఇవి కూడా పలు విమర్శలకు, ఆరోపణలకు దారితీసాయి. అయితే ఎప్పట్లానే, ఆయన వాటిని పట్టించుకోకుండా తన మార్గంలోనే ముందుకు పోయారు. ఆయన నమ్మకమే చివరికి నిజం అయింది.
రాష్ట్ర విభజన అనంతరం ప్రజల మనస్సుల్లో ఎలాంటి మార్పు వస్తుందన్నది బీజేపీ నగర నాయకుడు సుధేష్ రాంభొట్ల ఒక చక్కని ఉదాహరణ ఇచ్చారు. మద్రాసు (చెన్నై) రాష్ట్రం నుంచి వేరుపడి ఆంధ్ర రాష్ట్రం  ఏర్పాటు అయినప్పుడు నాటి చెన్నపట్నంలో స్థిరపడ్డ అనేకమంది తెలుగువాళ్ళు మద్రాసులోనే వుండిపోయారు. కాలక్రమంలో తమిళ జీవన స్రవంతిలో కలిసిపోయారు. అలాగే, హైదరాబాదులో ఉండిపోయిన బయటి ప్రాంతాలవాళ్ళు కూడా హైదరాబాదునే తమ మాతృభూమిగా భావించాల్సి వస్తుంది. ఉమ్మడి రాష్ట్రంగా వున్నప్పుడు వారిలో వుండే భావనలే ఎల్లకాలం ఉంటాయని అనుకోకూడదు. స్థానికులు, స్థానికేతరులు ఒకే  నగరవాసులుగా ఉంటూ ఆచారవ్యవహారాల్లో ఒకటిగా  కలగలిసి పోయినప్పుడు,  స్థానికత అన్నది సమస్యగా మారదు. ఒక వివాదంగా తయారవదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటర్లు ఆ పరిణతి ప్రదర్శించారని తృప్తి పడాలి.
ఈసారి హైదరాబాదు ఎన్నికల్లో కొట్టవచ్చినట్టు కానవచ్చిన  అంశం ఒకటుంది. సాధారణంగా ఇటువంటి ఎన్నికల్లో స్థానిక సమస్యలు,  స్థానిక నాయకులు కీలకం అనే భావన వుంది. అయితే చిత్రంగా ఈ ఎన్నికల్లో పార్టీలు, పార్టీల అధినాయకులు, పార్టీల గుర్తులు, వీటి  ప్రాతిపదికగానే ఓట్లు పడ్డట్టు అనిపిస్తోంది.
ఉపశృతి: ఎన్నికల్లో గెలుపు సూత్రాలలో ‘పోల్ మేనేజ్ మెంట్’ కూడా ప్రధానమైనది. పోలింగు రోజు మధ్యాన్నం రెండు గంటల  ప్రాంతంలో  నా ఫోను మోగింది. ‘శ్రీనివాసరావు గారు, నేను టీఆర్ఎస్  ఎమ్మెల్సీ సుధాకరరెడ్డిని  మాట్లాడుతున్నాను. మీరు, మీ కుటుంబ సభ్యులు ఇంతవరకు వచ్చి ఓటు చేయలేదు’ అంటూ గుర్తు చేశారు. క్లబ్బులకు జరిగే  ఎన్నికల్లో ఇలాటివి సాధారణం. ‘ఇంకా ఎవ్వరు ఓటు చేయలేదు’ అని కనుక్కుని ఫోన్లు చేస్తుంటారు.   ఎన్నికల్ని ఎన్నికలుగా తీసుకుని సీరియస్ గా పనిచేయడం, విజయం  దిశగా కృషి చేయడం కూడా అవసరం అని దీన్నిబట్టి బోధపడుతోంది.  (06-02-2016)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595        
                                         

3, ఫిబ్రవరి 2016, బుధవారం

కాపులు, కరివేపాకులా?

సూటిగా.........సుతిమెత్తగా.....

సమస్యల అమావాస్యల నడుమ కొట్టుమిట్టాడుతున్న ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇప్పుడు మరో కొత్త సమస్య కాపుల రిజర్వేషన్ల రూపంలో వెంటాడుతోంది.
గతంలో ఒకసారి చెప్పుకున్నట్టు, పదేళ్ళ అధికార వియోగం తరువాత ముఖ్యమంత్రి అయ్యారు అన్న ఒక్క విషయాన్ని మినహాయిస్తే ఈసారి చంద్రబాబు నాయుడు ఆ  పదవిలో పట్టుమని పది రోజులుకూడా కంటినిండా నిద్రపోయిన దాఖలా లేదు. లోగడ రెండు దఫాలు ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కేంద్రంలో అనుకూల ప్రభుత్వాలు ఉండేవి. అనుకూలమే కాదు దాదాపు ఆయన చెప్పుచేతల్లో వుండేవవి జనం చెప్పుకునేలా ఆయన హస్తినలో చక్రం తిప్పేవారు. ఇక సొంత రాష్ట్రంలో ఆయన మాటలకు, చేతలకు ఎదురులేని పరిస్తితి. విదేశాల్లో వుండే ఆంధ్రులకు ఆయన ఆరాధ్య దేవత. ఈ ఒక్క విషయంలో మాత్రం ఆయన ప్రభ ఇంకా అలాగే వుంది. మొదటి రెండు అంశాలే కొంత తలనొప్పి కలిగిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో వున్నది సాక్షాత్తు మిత్ర పక్షమే అయినా మునుపటి హవా సాగడం లేదనే చెప్పాలి. పొతే రాష్ట్రంలో పొద్దున్న లేస్తే చీకాకు పెట్టే ప్రతిపక్షం. చెప్పుకోవడానికి, సర్దిచెప్పడానికి ప్రత్యమ్నాయ రాజకీయ పక్షాలు లేకపోవడం. వెరసి ఇవన్నీ చంద్రబాబుకు గత కాలపు భోగాలను కేవలం జ్ఞాపకాలుగా మిగిలిస్తున్నాయి.
చంద్రబాబును చుట్టుముట్టి వేధిస్తున్న సమస్యల్లో కొన్ని ఎన్నికల హామీల రూపంలో స్వయం కృతాలు అయితే,  మరికొన్ని ఆయన ప్రమేయం లేకుండా వచ్చిపడ్డవి. తాజాగా మీదపడ్డది కాపుల రిజర్వేషన్ సమస్య.
ఇది చాలా సున్నితమైన సమస్య అని ఆయనకూ తెలుసు. ‘కరవమంటే కప్పకు కోపం, వద్దంటే పాముకు కోపం’  మాదిరి.
తమని  బీసీల్లో కలపాలన్నది కాపు కులస్తుల  డిమాండు. అందులో కూడా ఔచిత్యం లేకపోలేదు. నిజానికి కొన్ని దశాబ్దాల క్రితం వరకు కాపులు ఈ రిజర్వేషన్ల సదుపాయం అనుభవిస్తూ వచ్చారు. గతంలో ఒక ముఖ్యమంత్రి ఒక్క కలం పోటుతో దీన్ని తొలగించారు. అప్పటి  నుంచి లోలోపల రగులుతూ వచ్చిన కాపుల ఆందోళన, విజయ భాస్కర రెడ్డి హయాములో ఇచ్చిన ఒక జీవోతో కొంతవరకు సమసిపోయింది. అయితే, రిజర్వేషన్లు యాభయ్ శాతం మించకూడదన్న నిబంధన కారణంగా   ఆ జీవో చెల్లుబాటు కాదని న్యాయస్థానాలు తేల్చడంతో  కధ మళ్ళీ  మొదటికి వచ్చింది. సాధికారిక కమీషన్ సర్వే చేసి ఇచ్చే నివేదిక ఆధారంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు  అలాటి వారిని  బీసీ రిజర్వేషన్ జాబితాలో చేర్చవచ్చని కోర్టు ఒక వెసులుబాటు కల్పించడంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఈ అంశాన్ని తన ఎన్నికల ప్రణాళికలో చేర్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ హామీ చక్కని సానుకూల ఫలితాలను ఇచ్చిన విషయాన్ని  చంద్రబాబు  పలుసందర్భాల్లో చెప్పుకున్నారు కూడా.  అధికారానికి రాగానే కమిషన్ వేసి దాని నివేదిక ప్రాతిపదికగా  రిజర్వేషన్లు కల్పిస్తే న్యాయపరమయిన చిక్కులు ఎదురుకావని ఆలోచన చేసిన టీడీపీ అధినేత   చంద్రబాబు,  కొంత కాలయాపన జరిగినప్పటికీ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒక కమీషన్ ఏర్పాటు చేసి, ఆరు మాసాల్లో నివేదిక ఇమ్మని కోరారు.   కాపుల అభివృద్ధి సంస్థను కూడా ఏర్పాటు చేసి కొన్ని నిధులు కేటాయించారు. పదవిలోకి వచ్చి ఇరవై మాసాలు గడిచిపోతుంటే ఇంకా అరకొర నిధులతోటే సంస్థను ఏర్పాటుచేసి కాలక్షేపం చేస్తున్నారని, తమ రిజర్వేషన్ల డిమాండు నెరవేర్చే విషయంలో ప్రభుత్వం తాత్సార వైఖరి అనుసరిస్తోందని కాపుల్లోని  ఒక వర్గంలో అసహనం మొదలయింది. కొందరయితే ఏకంగా కరివేపాకు సామ్యం తెచ్చారు. ఈ రకమైన ఆలోచనలు చేసేవారికి, కాపుల్లో బలమయిన పట్టున్న వ్యక్తి,  నిష్కళంక రాజకీయ నాయకుడు అని జనంలో ముద్ర వున్న మాజీ మంత్రి, ఒకప్పటి టీడీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం నాయకుడిగా లభించారు.



ఆయన ఇచ్చిన పిలుపు మేరకు తునిలో జరిగిన కాపు గర్జన సభకు భారీ సంఖ్యలో కాపు మహా జనం తరలివచ్చారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఉద్దేశించిన  ఈ గర్జన సభ, అవాంచిత పరిణామాలకు తెర తీసింది. తుని సమీపంలో సభ జరుగుతున్న ప్రదేశానికి దగ్గరలో రైలు మార్గంపై వెడుతున్న రత్నాచల్ ఎక్స్ ప్రెస్ బండిని నిలిపివేసి  దానికి నిప్పు పెట్టారు. అ రైలు బోగీలన్నీ పరశురామప్రీతి అయ్యాయి. ఆ తరువాత రెచ్చిపోయిన అల్లరి మూకలు తుని పోలీసు స్టేషన్లపై దాడికి దిగి తగులపెట్టాయి. ఈ దృశ్యాలను  టీవీల్లో  చూసిన వారికి  అక్కడి పరిస్తితుల తీవ్రత కళ్ళకు కట్టినట్టు కనిపించింది. ఈ హఠాత్పరిణామాలతో ఇటు  ప్రజానీకం,  అటు ప్రభుత్వం దిమ్మరపోయాయి. ఒకే ఒక అదృష్టం ఏమిటంటే, ఇంతటి భయానక సంఘటనలు జరిగినా కూడా ఎలాటి ప్రాణనష్టం లేకపోవడం. ఉద్యమం హింసారూపం ధరించడంతో ముద్రగడ పద్మనాభం, రైలు రోఖో, రాస్తా రోఖో కార్యక్రమాలను విరమించారు. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.
ఆ తరువాత పరిణామాలు కూడా రాజకీయ రంగు పులుముకుని చకచకా జరిగిపోయాయి. అన్ని పార్టీలు రంగప్రవేశం చేసాయి. వారి వారి  ప్రయోజనాలకు అనుగుణంగా ప్రకటనలు చేసారు, భాష్యాలు చెప్పారు. ఆరోపణలు,  ప్రత్యారోపణలతో మీడియా మార్మోగింది.  పాలక, ప్రతిపక్షాలు అన్నీ ఈ విషయంలో ఒక అడుగు మాదే ముందు అనే రీతిలో వ్యవహరించాయి. తమదే పైచేయి అనిపించుకోవాలనే చూశాయి. సొంత ప్రయోజనాలకోసం దీర్ఘకాలిక సమాజ ప్రయోజనాలను పక్కనపెట్టాయి. ఆరోపణలు, నిందారోపణలు పరిస్తితులను మరింత జటిలం చేస్తాయి తప్ప పరిష్కారానికి పనికిరావన్న వాస్తవాన్ని  ఉభయులు పరిగణనలోకి తీసుకుంటున్నట్టు లేదు.
ముందే చెప్పినట్టు ఇది చాలా సున్నితమైన సమస్య. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు న్యాయం చేయాలని రాజకీయ పార్టీలు చెబుతుంటాయి. అదెలా సాధ్యమో మాత్రం చెప్పవు.  పై పంచ గాలికి ఎగిరి దారి పక్కన ముళ్ళకంచెపై పడినప్పుడు, పంచె చిరగకుండా ఎలా జాగ్రత్తగా బయటకి తీయాలో అంతటి చాకచక్యాన్ని ప్రదర్శించాల్సిన సందర్భం ఇది. 
కాపుల ఆందోళన ఇంకా ఒక కొలిక్కి రానేలేదు. వారింకా ఆందోళన పధం వీడి వచ్చేట్టు లేరు. ఇంత జరిగాక కూడా వారు ముందు ముందు  చేయాల్సిన కార్యాచరణ గురించే ఆలోచిస్తున్నట్టు కానవస్తోంది.  కాపు గర్జన పిలుపు  ఇచ్చిన  ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్షకు పూనుకుంటామని అంటున్నారు. దీనికి తోడు, అటు బీసీలు కూడా భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. తమ రిజర్వేషన్లలో కాపులను చేర్చే ఏ ప్రతిపాదన కూడా తమకు సమ్మతం కాదని విజయవాడలో సమావేశమైన ఇరవై అయిదు బీసీ సంఘాలు తేల్చిచేప్పినట్టు భోగట్టా. ప్రభుత్వం ‘కిం కర్తవ్యమ్?’ దశలో వుంది. కాపుల డిమాండు ఒప్పుకుంటే బీసీలతో పోరు తప్పని స్తితి. అందుకే, బీసీలు అభ్యంతరం చెప్పని విధంగా, కోర్టులు  తప్పుపట్టని తీరులో  పరిష్కార మార్గం కోసం  చంద్రబాబు సర్కారు కసరత్తు చేస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గం కూడా విజయవాడలో సమావేశమై ఈ అంశాన్ని చర్చించింది. ఈ వ్యాసం రాసే సమయానికి అదింకా కొనసాగుతోంది.
తుని దుర్ఘటన జరిగిన రోజునే బెజవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.    
ఈ సమస్యపై తమ ప్రభుత్వం ఆలోచనా సరళిని ఆయన సుదీర్ఘంగా వివరించారు. కోర్టు తీర్పులను ఉదహరించారు. తమ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని ప్రస్తావించారు. జీవో ఇవ్వడం వల్ల ఎదురయ్యే కోర్టు సమస్యలను విశదం చేసారు. కొన్ని రాజకీయ ఆరోపణలు చేసినప్పటికీ, తుని సంఘటన ఆయన్ని కలవరపరచినట్టు ఆయన ముఖకవళికలే తెలియచేస్తున్నాయి. తాను చేయాల్సింది అంతా చేస్తున్నా కొందరు  తనని సరిగా అర్ధం చేసుకోవడం లేదన్న ఆవేదన కూడా చంద్రబాబునాయుడు మాటల్లో ధ్వనించింది. ‘ఏం చెయ్యమంటారో మీరే చెప్పండి’ అని విలేకరులను ప్రశ్నించిన తీరు ఇందుకు అద్దం పడుతోంది.
ఒక్కటి మాత్రం సుష్పష్టం. ఈ విషయంలో రాజకీయం ఎవరు చేసినా, ఒకరినొకరు ఆరోపించుకుంటున్నట్టు, అది ప్రతిపక్షం కావచ్చు, లేదా పాలక పక్షమేకావచ్చు, అది అమానుషమే. ఎందుకంటే అన్యోన్యంగా జీవిస్తున్న వివిధ కులాల మధ్య ఆర్పలేని చిచ్చును ఇటువంటి చర్యలు ప్రేరేపించే  ప్రమాదం హెచ్చుగా  వుంది.  కొత్తగా ఊపిరిపోసుకున్న నవజాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతమాత్రం మంచిది కాదు. సమస్యతో సంబంధం వున్న వారందరూ మనసులో పెట్టుకుని వ్యవహరించాల్సిన ‘హెచ్చరిక’ ఇది.     
ప్రభుత్వం ముందు రెండు ప్రత్యామ్నాయాలు.  నివేదికను త్వరగా ఇమ్మని కమిషన్ ను వేగిరపరచడం. కాపు కార్పోరేషన్ కు ఇతోధికంగా నిధులను మంజూరు చేసి వారిని సంతృప్తి పరచడం. లేదా కాపుల్లో ఒక వర్గం కోరుతున్న విధంగా, తదుపరి న్యాయపరమైన  పర్యవసానాలు ఎలావున్నప్పటికీ, ప్రస్తుతానికి ఒక జీవో ఇచ్చి చేతులు దులుపుకోవడం. అన్నింటికీ  మించి ఈ సమస్యను రాజకీయ కోణం నుంచి కాకుండా ఆలోచించి సమస్యతో సంబంధం వున్న నలుగురినీ కలుపుకుని రాజకీయాలకు అతీతంగా ఒక పరిష్కార మార్గాన్ని అన్వేషించడం. చర్చల ద్వారా సమస్యల పరిష్కారమే ప్రజాస్వామ్య వ్యవస్థలో చక్కని రాజమార్గం.
సమాజంలో రిజర్వేషన్ల అవసరం దేశానికి స్వతంత్రం వచ్చిన ఇన్ని దశాబ్దాల తరువాత కూడా వుందంటే ఎక్కడో లోపం వుందనుకోవాలి. అణగారిన, వర్గాలను సమాజంలో మిగిలిన వారి సరసకు చేర్చడం కోసం  ఉద్దేశించిన ఈ రిజర్వేషన్లు ఇప్పటికి కూడా  ఆశించిన లక్ష్యాలను, కోరుకున్న స్థాయిలో  సాధించలేదు అంటే, ఆ తప్పు ఎవ్వరిదనుకోవాలి? నిస్సంశయంగా అది పాలకులదే!. ఇది నిర్వివాదాంశం.
ఉపశృతి: రిజర్వేషన్లు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోయినా, వాటివల్ల ఇన్నేళ్ళ కాలంలో అణగారిన వర్గాల్లోని  చాలామంది,  జీవితంలో ఒక స్థాయికి చేరుకున్న మాట కూడా కాదనలేని వాస్తవం. అటువంటి వారు తమ సాటి బడుగులపట్ల కొంత ఔదార్యం ప్రదర్శించడం వల్ల రిజర్వేషన్ ఫలాలను  మరి కొందరు అర్హులయిన వాళ్ళు అనుభవించడానికి అవకాశం  లభిస్తుంది. ప్రస్తుతం వంట గ్యాస్ సిలిండర్ల విషయంలో ఇదే మాదిరి ‘గివ్ అప్’ ప్రచారం సాగుతోంది. రిజర్వేషన్ల వల్ల సమాజంలో పెద్ద స్థాయికి చేరుకున్న వారు, ఇందుకు పెద్దమనసుతో సహకరిస్తే, ప్రస్తుతం అందుబాటులో వున్న టెక్నాలజీని అందుకోసం ఉపయోగించుకోవచ్చు. రైళ్లల్లో  బెర్తులను కేటాయించడానికి ‘ఆటోమేటిక్  అప్  గ్రెడేషన్’  విధానాన్ని వినియోగిస్తున్నారు. రిజర్వేషన్ల వల్ల ప్రయోజనం పొందిన వారి నుంచి , అర్హత కలిగిన ఇతరులకి దాన్ని బదిలీ చేయడానికి ఈ విధానం ఉపయోగపడుతుందేమో పరిశీలించాలి. తద్వారా  ‘కొందరికే అన్నీ  కాదు, అందరికీ అన్నీ’ సగర్వంగా చెప్పుకోవచ్చు.   ఆలోచిస్తే పోయేదేమీ లేదు, కాసింత సమయం తప్ప.
ఏలికలు ఆలోచించాలి. (03-02-2016)

This article in SURYA today:'



రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595 


1, ఫిబ్రవరి 2016, సోమవారం

దెబ్బమీద దెబ్బ


పెళ్ళయిన ఏకాంబరానికి ప్రేమికుల దినోత్సవం రోజున తెలియని నెంబరు నుంచి ఫోను వచ్చింది. ఆడపిల్ల గొంతు వినబడగానే అతగాడికి తెలియని ఉత్సాహం పొంగి పొరలింది. అవతల అమ్మాయి అడిగింది ‘ పెళ్లయిందా ఇంకా బ్రహ్మచారి బతుకేనా’ అని. ఏకాంబరం చెప్పాడు రెట్టించిన ఉత్సాహంతో ‘ లేదు లేదు పెళ్లి కాలేదు, ఇంతకీ మీరెవ్వరు’ అని. అవతల స్వరం మారిపోయింది ‘ అల్లాగా! నేనెవర్నా! నీ పెళ్ళాన్ని. ఇంటికి రా! నీ పెళ్లి చేస్తాను’ అన్నది ఏకాంబరం భార్య.
జారిపోయిన  గుండెను వెతుక్కుంటూ వుండగానే ఫోను మరోసారి మోగింది. మళ్ళీ తెలియని నెంబరు నుంచే. సందేహిస్తూనే ‘హలో’ అన్నాడు. మళ్ళీ ఆడగొంతే. మళ్ళీ అదే ప్రశ్న ‘పెళ్లయిందా? ఒంటరివారా’ అని. గుండె నిమురుకుంటూ చెప్పాడు’’పెళ్లయింది. అవును. కానీ  మీరెవ్వరు’
‘ఎవర్నా! నీ గర్ల్  ఫ్రెండుని. పెళ్ళయి కూడా కాలేదని చెప్పి మోసం చేయడానికి సిగ్గువేయడం లేదా! వుండు. నీ పని చెబుతాను’
ఏకాంబరానికి గుండె మరింత కిందికి జారిపోతుంటే, నోరు  పెగుల్చుకుని చెప్పాడు.
‘సారీ బేబీ!  ఫోను చేసింది నా భార్య అనుకున్నాను, నన్ను మన్నించు ప్లీజ్’

‘ఏమిటీ! నిన్ను మన్నించాలా! నేనెవర్ని అనుకున్నావు, నీ మొహానికి ఓ గర్ల్ ఫ్రెండ్ కూడానా! నేనే!  నీ భార్యనే మాట్లాడుతున్నాను.  నీ సంగతి కనిపెట్టాలని మళ్ళీ ఫోను చేసాను. ఇంటికి రా! ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తేలుస్తాను’ (ఒక ఇంగ్లీష్ గల్పిక ఆధారంగా)



(NOTE: COURTESY CARTOONIST)















విరక్తి


అయిదుగురు ముఖ్యమంత్రులకు పీఆర్వో గా పనిచేసి చనిపోయిన మాపెద్దన్నయ్య భండారు పర్వతాలరావు గారు, 'చెన్నా టు అన్నా' ( చెన్నారెడ్డి, అంజయ్య, భవనంవెంకట్రాం, విజయభాస్కరరెడ్డి, ఎన్టీఆర్) అనేపేరుతొ వారితో తన అనుభవాలను గ్రంధస్తం చేయాలని అనుకోవడం నాకుతెలుసు. కానీ రాజకీయాలను చాలా దగ్గరగా చూసిన కారణంగా ఏమో తెలియదుకాని, ఆయన ఆ ఆలోచనకు స్వస్తి చెప్పి, ఆధ్యాత్మిక అంశాలతో రచనలు సాగించారు. ఈనాటి రాజకీయ సంస్కృతి చూసిన తరువాత నాలోనూ ఆ నిర్వేదం మొదలయింది.


(కీర్తిశేషులు భండారు పర్వతాలరావు)