19, డిసెంబర్ 2015, శనివారం

‘నిర్భయ’ కు మూడేళ్ళు

సూటిగా.........సుతిమెత్తగా......
(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 20-12-2015, SUNDAY)

మనుషులు నరరూప రాక్షసులుగా ఎలా మారతారో, ఆ మారిన స్ధితిలో వాళ్ళు ఎంతటి ఘోరాలకు పాల్పడుతారో సకల దేశవాసులకు తెలిసివచ్చి కూడా మూడేళ్ళు గడిచాయి.  2012 డిసెంబరు 16 తేదీ రాత్రి భారత  రాజధాని ఢిల్లీ లో జరిగిన పాశవిక కాండ మానవత్వానికే మాయని మచ్చగా మిగిలింది సంఘటనలో మానాన్నీ, ప్రాణాన్నీ పోగొట్టుకున్న యువతికి ఏమి న్యాయం జరిగిందో తెలియదు కానీ దేశంలోని ఆడపడుచులందరికీ ఊరట కలిగించే ఒక శాసనం  ఊపిరి పోసుకుందినాకు తెలిసి స్వతంత్ర భారతంలో ప్రజల ఒత్తిడి ఫలితంగా ఒక చట్టం రూపొందిన సందర్భం కూడా అదే. చట్టమే నిర్భయ.


ఆరుగురు కామాంధుల చేతికి చిక్కిన ఒక యువతి ఎటువంటి దుర్భర, దుస్సహ, శారీరక, మానసిక వేదనలకు గురైందన్న విషయం లోకానికి తెలిసివచ్చిన పదమూడు రోజుల తరువాత ఆ అనామిక (మూడు నాలుగు రోజుల క్రితమే ఆ యువతి తల్లి ఆశాదేవి, చనిపోయిన తన కుమార్తె పేరు ‘జ్యోతి సింగ్’ అని మొదటిసారి బహిర్గత పరిచారు) సింగపూరులో చికిత్స పొందుతూ మరణించింది. ఈ సంఘటన  పట్ల సభ్య సమాజం స్పందించిన తీరు జాతీయ, అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఐక్యరాజ్యసమితిని సైతం కదిలించింది. ఫలితంగా నాటి కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జే. ఎస్. వర్మ నేత్ర్యత్వంలో త్రిసభ్య విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. తన పరిశీలనకు వచ్చిన ఎనభయ్ వేలకు పైగా సలహాలు, సూచనలను పరిశీలించి నెల రోజుల లోపునే సంఘం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.   మహిళల పట్ల లైంగిక పరమైన నేరాలు పెరిగిపోవడానికి మూల కారణం ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు వ్యవస్థల వైఫల్యంగా వారు అభిప్రాయపడ్డారుకమిటీ నివేదికలో సుమారు తొంభయ్  శాతం సిఫారసులను గుదిగుచ్చి రూపొందించిన ఆర్దినెన్సుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం, తదుపరి అది శాసనంగా చట్టసభల ఆమోదం పొందడం చకచకా జరిగిపోయాయి. అయితే ఆర్డినెన్స్ బిల్లు రూపం ధరించి, 2013 మార్చి 19 తేదీన   లోకసభ ఆమోదం పొందేనాటికే అందులో పొందుపరచిన అనేక అంశాలు పలు మార్పులకు గురయ్యాయి. నిర్భయ చట్టంతో ఇటువంటి హేయమైన సంఘటనలు పునరావృతం కావని ఆశించడం  వృధా అని ఈ మూడేళ్ళ కాలంలో చోటుచేసుకుంటున్న అదే విధమైన పలు సంఘటనలు నిరూపించాయి. ఒక్క ఢిల్లీ కేసులో మినహా మరే సందర్భంలో కూడా కఠిన శిక్షలు పడిన  దాఖలా లేదు. అలా అని ఈ శాసనం వల్ల ఎలాటి ఉపయోగం లేదని కాదు. లైంగిక అత్యాచారాలకు పాల్పడే దుర్మార్గులు చట్టాలను లెక్కపెట్టే స్థితిలో వుండకపోవచ్చు కానీ, అత్యాచార బాధితులకు మాత్రం ఈ చట్టం కొంత ఊరట కలిగిస్తోంది. తమ మీద లైంగిక దాడులకు పాల్పడిన వారికి శిక్ష పడుతుందన్న ఒకింత ఉపశమనాన్ని ఇస్తోంది. అన్నింటికీ మించి ప్రజల ఆకాంక్షల మేరకు ఒక శాసనం రూపొందడం అనేది ప్రజాస్వామ్యం సాధించిన  ఒక విజయం. అంతే కాకుండా, లైంగిక అత్యాచార బాధితులు సమాజం  దృష్టిలో మరిన్ని అవహేళనలకు గురికాకుండా అటువంటి వారిని అసలు పేర్లతో కాకుండా ‘నిర్భయ’ గా పిలవాలనే ఒక సంప్రదాయం అమల్లోకి వచ్చింది.
మూడేళ్ళ క్రితం జరిగిన ఈ కేసును ఈనాడు మరోమారు గుర్తు చేసుకోవడానికి ఒక సందర్భం వచ్చింది. ఢిల్లీ ‘నిర్భయ’ కేసులో ఆరుగురు ముద్దాయిల్లో నలుగురికి (ఒక ముద్దాయి విచారణ జరుగుతూ వున్న  సమయంలోనే  జైల్లో  ఉరివేసుకుని చనిపోయాడు) ప్రత్యేక  న్యాయస్థానం మరణశిక్ష  విధించింది. చివరకు సుప్రీం కోర్టు దాన్ని  యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది.  ఆరో  ముద్దాయి ‘మైనర్’ (అల్ప వయస్కుడు) అన్న కారణంతో అతడ్ని మూడేళ్ళు జువనైల్ హోం లో ఉంచారు. ఈ శిక్షాకాలం పూర్తయి అతడు ఈరోజో రేపో విడుదల విడుదల కాబోతున్నాడు. నేరం జరిగిన సమయంలో మైనర్ అనే ఒకే ఒక కారణంతో నేరశిక్షాస్మృతి ప్రకారం అతడికి మిగిలిన నేరస్తులతో పాటు శిక్ష వేయకుండా మూడేళ్ళ శిక్షతో సరిపుచ్చాల్సి వచ్చింది. అయితే ఇటువంటి నేర మనస్త్వత్వం కలిగిన వారిని చట్టంలో వున్న లొసుగులను అడ్డం పెట్టుకుని విడుదల చేస్తే మరింత ప్రమాదకర పరిణామాలు అన్నీ సంభవించే అవకాశం వుందని కొందరు సందేహాలు  వ్యక్తం చేస్తున్నారు. విచారణా కాలంలో జైల్లో ఒక విదేశీ వార్తా సంస్థకు ముద్దాయిల్లో ఒకరు ఇచ్చిన ఇంటర్వ్యూ  ని బట్టి ఆ సందేహాలు నిజమయ్యే ప్రమాదం ఉందనిపిస్తోంది. ‘ఆ యువతి బలాత్కారానికి సహకరించి వుంటే ఇంతటి విషమ పరిస్తితి ఆమెకు ఎదురయ్యేది కాదని’ అతడు చెప్పిన తీరు కరడు గట్టిన నేర ప్రవృత్తికి నిలువెత్తు సాక్ష్యం.
మూడేళ్ళ అనంతరం ‘అల్పవయస్కుడి’   విడుదలను అడ్డుకుంటూ సుబ్రమణ్య స్వామి కోర్టుకు ఎక్కారు, కానీ న్యాయస్థానం ఆ అభ్యర్ధనను తిరస్కరించింది.
పిన్న వయస్కుడు అనే కారణంతో శిక్ష తప్పించుకుని దర్జాగా సమాజంలోకి తిరిగి అడుగుపెట్టబోతున్న అతగాడు చేసిన నేరం చిన్నదేమీ కాదు. ఆనాటి   సామూహిక మానభంగ పర్వంలో అతడూ ఒక భాగస్వామి. పైపెచ్చు,  నిస్సహాయ స్తితిలో వున్న ఆ  అభాగ్యురాలిని ఒక ఇనుప రాడ్  తో అతి క్రూరంగా, అత్యంత రాక్షసంగా హింసించిన పాపం అతడి ఖాతాలో వుంది. అయినా,  ‘అల్పవయస్కుడు’ అనే కారణంతో చేసిన నేరానికి శిక్ష పడకుండా బయటపడగలుగుతున్నాడు.
కోర్టు నిర్ణయం జ్యోతి సింగ్ తలితండ్రులను నిరాశ పరచింది. ‘నేరం జయించిందని, తామే పరాజితులమని’ ఆమె తల్లి ఆశాదేవి ఆవేదన వెలిబుచ్చారు. ఆమె బాధ సమంజసం  అనిపిస్తోంది. రేపో మాపో విడుదలయ్యే ఆ బాల హంతకుడికి  జువనైల్ హోం నుంచి బయటపడగానే కొత్త జీవితం ప్రసాదించే పేరుతొ,  టైలరింగ్ షాపు పెట్టుకోవడానికి ఆర్ధిక సాయం చేస్తారు. ఆ షాపుకు  అవసరం అయ్యే  స్థలాన్ని కూడా అధికారులే సమకూరుస్తారు. అతడి పాత పేరును మార్చి కొత్త పేరు తగిలిస్తారు. అప్పటినుంచి అతడు సమాజంలో నూతన నామధేయంతో చెలామణీ అవుతాడు. ఇదంతా వినడానికి బాగానే వుంది. పేర్లు మార్చినట్టు నేరస్తులను పూర్తిగా సంస్కరించగలిగితే అంతకంటే కోరుకునేది ఏమీ వుండదు. మనిషి వేష భాషలను మార్చినంత సులభంగా అతడి మనస్త్వత్వాన్ని మార్చడం అంత తేలికా అన్నదే ప్రశ్న. జైలు  ఇంటర్వ్యూలో ఒక ముద్దాయి చెప్పిన అభిప్రాయమే దీనికి సరయిన సమాధానం. ధర్మం ప్రకారం ఆ ‘అల్ప వయస్కుడు’ కూడా మిగిలిన వారితో పాటు శిక్షార్హుడే. కానీ చట్టం చెప్పే న్యాయం వేరుగా వుంటుంది.    
కోర్టుల్లో న్యాయం  చట్టాన్ని బట్టి వుంటుంది. చట్టం మారితే దానికి తగ్గట్టుగా న్యాయం, దానికి తగ్గట్టుగా శిక్షలు  మారిపోతూ వుంటాయి. ధర్మం అనేది మారుతున్న కాలంతో ప్రమేయం లేకుండా స్థిరంగా మార్పు లేకుండా వుంటుంది.
అల్ప వయస్కులు నేర పూరిత మనస్త్వత్వం కలిగివుండరన్న అభిప్రాయం ఒకప్పుడు సరికావచ్చు. కానీ వారి మనస్సులను కలుషితం చేసే అనేక అవకాశాలు  చిన్న వయస్సునుంచే ప్రస్తుతం  అందుబాటులో ఉంటున్నాయి. గుప్పెట మూసివుంచాల్సిన అనేక సెక్స్ పరమైన సంగతులు, వారి గుప్పెట్లో ఉంటున్న సెల్ ఫోన్ల పుణ్యమా అని చిన్నతనం నుంచే వారికి కరతలామలకం. ఈ వెసులుబాట్లతో వారు పెడమార్గం పడుతున్నారన్న వాస్తవాలను మరిచిపోరాదు. అల్పవయస్కులు అయినంత మాత్రాన వారు ఇటువంటి హీనమైన లైంగిక కార్యకలాపాలకు పనికిరారు అని నిర్ధారణకు రావడానికి వీల్లేదు  అనడానికి  ఈ కేసులో శిక్ష తప్పించుకుంటున్న ఈ బాల నేరస్తుడే సాక్షి. 
తక్కువ వయస్సు కారణంగా శిక్షలు తప్పించుకునే పరిస్తితి ముందు ముందు కూడా కొనసాగితే అందువల్ల మరికొన్ని విషమ పరిణామాలు కూడా చోటుచేసుకునే ప్రమాదం పొంచి వుంటుంది. పిల్లల్ని చేరదీసి,  చిన్నతనం నుంచే ఉగ్రవాద శిక్షణ ఇచ్చే విదేశీ  సంస్థలు,  తప్పుడు సర్టిఫికేట్లతో వయస్సు తక్కువగా చూపించి, వారిచేత ఉగ్రవాద చర్యలు జరిపించే అవకాశాన్ని కూడా కొట్టివేయలేము. అటువంటి వారు ఒకవేళ పట్టు పడినా, ఈ చట్టాన్ని ఆసరాగా తీసుకుని, అనతి కాలంలోనే బయటపడి తమ కార్యకలాపాలను తిరిగి కొనసాగించే వీలుంటుంది.
వీటన్నిటినీ  దృష్టిలో  ఉంచుకుని ఆలోచిస్తే,   ప్రస్తుతం వున్న చట్టాలను తగువిధంగా సవరించుకోవాల్సిన అవసరాన్ని ‘ఈ అల్పవయస్కుడి’ విడుదల వ్యవహారం  గుర్తు చేస్తోంది. (19-12-2015)
రచయిత ఈ మెయిల్:  bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595                         
 



16, డిసెంబర్ 2015, బుధవారం

డబ్బు కావాలా ? దరిద్రం పోవాలా ?

సూటిగా .....సుతిమెత్తగా ........ 
(TO BE PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 17-12-2015, THURSDAY)

పాత కాలపు తెలుగు నాటకాల్లో కాబూలీవాలా పాత్ర గుర్తుండే వుండాలి.  ఆ నాటకాల ప్రభావం కావచ్చు, కాబూలీవాలా అనే పేరు వినగానే  వడ్డీకి డబ్బులు అప్పులిచ్చి అసలు ఫాయిదాలను ముక్కుపిండి మరీ వసూలు చేసే ‘రౌడీ’రూపం కళ్ళల్లో మెదిలేది. అయితే ఒక్క వడ్డీ వసూళ్ళ విషయంలో తప్ప కాబూలీవాలాలు చాలా మంచివాళ్ళన్న మంచి పేరు వారికి వుండేది. కాలక్రమంలో కాబూలీవాలాల శకం అంతరించి అప్పులిచ్చే మహారాజులు ఒకళ్ళయితే  వాటిని గోళ్ళూడగొట్టి వసూలుచేసే వసూలురాజాల పాత్ర స్థానిక గూండాలు  పోషించడం మొదలు పెట్టారు. ఇక కార్పోరేట్ సంస్కృతి వూడలు దిగిన తరువాత ప్రైవేట్  బ్యాంకుల వాళ్ళు ఈ వసూలు రాజాలను మంచి ఆకర్షణీయమైన వేతనాలు, అలవెన్సులు ఇచ్చి పెంచి పోషిస్తూ రావడం ఇటీవలి కాలంలో ఆనవాయితీగా మారిపోయింది.
అసలు అప్పులు ఇవ్వడం వాటిని వసూలు చేసే క్రమంలో అనేక అవస్థలు పెట్టడం అనేది పురాణ కాలం నుంచి వింటున్న కధే. ఈ విషయంలో సత్య హరిశ్చంద్రుడు పడ్డ బాధలు అన్నీఇన్నీ కావు. ఎన్ని కష్టాలు పడ్డా చివరికి కధ సుఖాంతం అయ్యింది కాబట్టి పరవాలేదు.
యుగాలు మారినా మారని ఈ విషసంస్కృతి,  కాలక్రమంలో  బాగా ముదిరిపోయి, వూడలుదించు కుంటూ  రూపాలు మార్చుకుంటూ,  పేర్లు మార్చుకుంటూ  చివరకు తాజాగా  ‘కాల్ మనీ’ రాకెట్  అనే నూతన నామం సంతరించుకుని   పేద, మధ్య తరగతి  ప్రజల ధన,మాన, ప్రాణాలతో ఆటాడుకునే అత్యంత హైన్య స్థితికి దిగజారి పోయింది.
మంచి విలువలతో కూడిన సమాజాలు విలసిల్లిన కాలంలో కూడా విలువలకు విలువ ఇవ్వని మనుషులు వుండేవాళ్ళు. మానవ సమూహాలు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ కూడా మంచి చెడుల సమ్మిశ్రితాలే. మంచి చెడుల నిష్పత్తి మాత్రమే  ఆ సమాజపు గుణగణాలను  అంతిమంగా నిర్ణయిస్తుంది.
అప్పు ఇవ్వడం, ఇచ్చిన అప్పుకు వడ్డీ వసూలు చేయడం అనేది అనాదిగా సమాజం అంగీకరించిన వ్యవహారమే. మా చిన్నతనంలో కూడా ఊళ్ళల్లో అప్పులు ఇచ్చే ఆసాములు వుండేవాళ్ళు. నగలు, వస్తువులు తాకట్టు పెట్టుకుని అవసరంలో వున్న  బీదాబిక్కీకి అప్పులిచ్చేవాళ్ళు. కొందరు ధర్మ ప్రభువులు  ధర్మ వడ్డీ  వసూలు చేస్తే మరికొందరు అధిక వడ్డీలతో బాకీదారుల్ని పీల్చి పిప్పి చేసేవాళ్ళు.
ముందే చెప్పుకున్నట్టు అప్పులు, వడ్డీలు అనేవి చట్ట వ్యతిరేకం కావు. దేశాలు సయితం ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తీసుకుంటాయి, వడ్డీ చెల్లిస్తాయి. బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు నుంచి రుణాలు  తీసుకుంటాయి. ఐతే ఇవన్నీ చట్టం లేదా నిబంధనల పరిధిలో జరుగుతాయి. గ్రామీణ బ్యాంకుల ఆవిర్భావానికి పూర్వం, ఊళ్ళల్లో జనం తమ  రుణ అవసరాలకోసం స్థానిక వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడేవాళ్ళు. క్రమేణా, నోటి మాట మీద అప్పులిచ్చే రోజులుపోయి ప్రామిసరీ నోటు మీద సంతకం చేయించుకునో, వేలిముద్ర వేయించుకునో అప్పులిచ్చే కాలం  వచ్చింది. గతంలో కోర్టుల్లో చాలా కేసులు వీటికి సంబంధించినవే ఉండేవి. గ్రామీణ బ్యాంకులు రంగప్రవేశం చేసిన తరువాత చాలా చోట్ల వడ్డీ వ్యాపారుల ఆగడాలకు కళ్ళెం పడింది. అలాఅని వారి పీడ పూర్తిగా విరగడ అయిపోయిందని చెప్పడానికి వీలులేదు. ఎందుకంటె మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల అవసరాలు పెరిగిపోతున్నాయి, మారిపోతున్నాయి. లోగడ ప్రాణం మీదకు వచ్చిన సందర్భాల్లో అప్పులు చేస్తే ఇప్పుడు ఆడంబరాలకోసం అప్పులు చేస్తూ వుండడం రివాజుగా మారిపోయింది. మొన్నీ మధ్య గవర్నర్ నరసింహన్ కూడా ఇదేవిధమైన అభిప్రాయం వ్యక్తం చేసి, అనవసరమైన అప్పులు చేసి కోరి కష్టాలు కొని తెచ్చు కోవద్దని సామాన్య ప్రజలకు హితవు పలికారు.
గవర్నర్ హిత వాక్యానికి నేపధ్యం వుంది. నవజాత ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం ఆవిష్కృతం కాబోతున్న ప్రాంతంలో అప్పుల వసూళ్ళ ఆధునిక రూపం, ‘కాల్ మనీ’ పేరుతొ పురుడు పోసుకుంది. మామూలుగా అయితే ఇది ఎన్నో ఏళ్ళుగా పెరిగి  ఎరిగిన దందాకిందనే కొట్టిపారేయాల్సిన విషయం. కానీ, ఇది మరో వికృత రూపం సంతరించుకుని ఎవ్వరూ సమర్ధించడానికి అవకాశం లేని అంశంగా తయారయింది. వసూళ్ళ పేరుతొ ఆడవారి శీలాన్ని దోచుకునే ఒక కొత్త కోణం ఈ దందాలో వెలుగు చూసింది. విలువల పతనం యెంత వేగం పుంజుకుందో చెప్పడానికి ఇదొక తాజా ఉదాహరణ. ఈ కాల్ మనీ వ్యవహారంలో పాల్గొంటున్న వారికి  మీడియా,  ‘కాల్ నాగులు’ అని నామకరణం చేసింది. అయితే పత్రికల్లో వస్తున్న దీన గాధలు చదువుతుంటే వీరికి ‘కాల నాగులు’ అనే పేరు కంటే ‘ఆనకొండలు’ అనే పేరే సబబుగా ఉంటుందనిపిస్తోంది. ఎందుకంటె పాము ఒక్కరినే కాటేస్తుంది. ఈ ‘కాల్ నాగులు’ మొత్తం కుటుంబాలు,కుటుంబాలను ‘ఆనకొండ’ మాదిరిగా పొట్టనపెట్టుకుంటున్నారు.
ఒక పత్రికలో వచ్చిన కధనం ఇలా వుంది.
“కుమార్తెను బాగా చదివించి ఉన్నత స్థానంలో చూడాలని ఆ తల్లి ఎన్నో కలలు కన్నది.  మంచి చదువులకు ఆర్ధిక స్థోమత సహకరించక ఋణం కోసం ‘కాల్ మనీ’ వ్యాపారులను ఆశ్రయించింది. దీన్ని ఆసరాగా తీసుకుని ఆమెను వశపరచుకున్నారు. ఆ దృశ్యాలను కెమెరాల్లో బంధించి బెదరగొట్టారు. కుమార్తె ఫీజు కట్టాల్సిన సమయంలో డబ్బులు ఇవ్వకుండా, కుమార్తెను కూడా తమ వద్దకు పంపిస్తే కానీ, సొమ్ము ఇచ్చేదిలేదని  షరతులు పెట్టారు. ఆవిధంగా తల్లినీ,పిల్లనూ కూడా లైంగికంగా లోబరుచుకోవడమే కాకుండా చివరి తమ దగ్గర పనిచేసే బౌన్సర్ల దగ్గరికి కూడా పంపారు. ఫలితం. చదువుల తల్లిగా వెలగాల్సిన ఆ యువతి ప్రస్తుతం తన తప్పు ఏమీ లేకుండానే, పెళ్లి కాకుండానే ఒక పిల్లకు తల్లి కావాల్సిన దుస్తితిలో చిక్కుకుంది’ 
అన్నం ఉడికిందో  లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకు పట్టి చూస్తే  చాలంటారు. బెజవాడ కాల్ మనీ వ్యాపారుల నీచ నికృష్ట చర్యలు యెంత అధోగతిలోకి దిగజారిపోయాయో తెలియడానికి ఇలాటి దృష్ట్యాంతం ఒక్కటి చాలేమో!
కాల్ మనీ రాకెట్ బయట పడిన తరువాత  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాల్ మనీ బాధితులు ఎవ్వరూ ఒక్క పైసా అప్పు చెల్లించవద్దనీ, వేధించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇస్తూ ఒక ప్రకటన చేసారు. ప్రజలకు ఇలాటి సమయాల్లోనే ప్రభుత్వాలు బాసటగా నిలబడాలి. ముఖ్యమంత్రి చేసిన ఈ ఒకే ఒక్క ప్రకటన వడ్డీ వ్యాపారులను యెంత బెదరగొట్టిందో తెలవదు కానీ ఆప్రకటన బాధితులకు మాత్రం మంచి మేలే చేసిందనే చెప్పాలి. ప్రభుత్వం అండగా ఉంటుందని తెలవగానే బాధితులందరూ తమ బాధలు, దీన గాధలు చెప్పుకోవడానికి క్యూ కట్టారు. అప్పటివరకు వడ్డీ వ్యాపారుల వేధింపులను మౌనంగా భరిస్తూ వస్తున్న ఆడవాళ్ళందరూ బయటకు వచ్చి, మౌనం వీడి వున్నసంగతులన్నీ చెప్పడం మొదలుపెట్టారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఇదే. ప్రభుత్వం తమకు బాసటగా వుందని తెలిసిన మరుక్షణం ప్రజలకు ఇక పరవాలేదనే ధైర్యం కలిగింది. ప్రజారంజక  పాలన చేయాలనుకునే పాలకులు తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఇదే. 
సరే! ‘ఇందుగలడందులేడను సందేహము వలదు, చక్రి సర్వోపగంతుండు ......’ అని  పోతన పద్యంలో చెప్పినట్టు ‘రాజకీయాలు దూరని ప్రదేశం కానీ, వాటి ప్రభావం సోకని అంశం కానీ ఈ సృష్టిలో వున్నట్టు లేవు.
కాల్ మనీ  కుంభకోణం ఇలా వెలుగు చూసిందో లేదో, దానితో పాటే రాజకీయాలు కూడా  రంగ ప్రవేశం చేసాయి. దాంతో మొత్తం వ్యవహారం రాజకీయ రంగు పులుముకుని అసలు విషయం మరుగున పడిపోయే పరిస్తితి ఏర్పడింది.
ఈ గందరగోళంలో తమ పార్టీకి చెందిన ఇద్దరు ప్రముఖుల పేర్లు బయటపడడంతో పాలక పక్షం తెలుగు దేశం పార్టీ కొంత ఇరుకున పడింది. వెంటనే తేరుకుని ఇందులో కీలక  పాత్రధారులందరూ ఒకప్పుడు వైరి పక్షం వారే అని ఎదురుదాడికి దిగింది. వైఎస్సార్ పార్టీ నాయకుడు ఏకంగా తన బాణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీదికే ఎక్కుబెట్టారు.ఈ కాల్ మనీ లావాదేవీల్లో ముఖ్యమంత్రి, పాలకపక్షం నాయకుల అక్రమ సంపాదన వుందని తీవ్రమైన ఆరోపణ చేసారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఢిల్లీలో మానవహక్కుల కమీషన్ కు పిర్యాదు చేసారు.   
చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి ఎడాపెడా దాడులు జరిపి అనేకమంది ఇళ్ళ నుంచి ఈ వ్యవహారానికి సంబంధించిన పత్రాలను పెద్ద సంఖ్యలో స్వాధీనం చేసుకున్నారు. దీని గురించి ఒక పత్రికలో వచ్చిన కధనం ఇలా వుంది.
“తెలతెలవారుతుండగా దాడి. తేరుకునే సరికే ఇంటి చుట్టూ వాహనాలతో చక్రబంధం. చుట్టుపక్కల వారికి  తెలిసేలోగానే పోలీసు  బృందాలు ఇంట్లోకి  చొచ్చుకు వెళ్లి , బంధించి బండిలో వేసుకుని మెరుపు వేగంతో మాయం’
పోలీసుల పనితీరుకు ఇది అద్దం పడుతోంది. అంటే ఏమిటి. ఈ దందాలో ఎవరున్నారన్నది వారికి తెలియని విషయం ఏమీ కాదన్నమాట. కాకపొతే ఇన్నాళ్ళు చూసీ చూడనట్టు, అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారనుకోవాలి. సీఎమ్ గారు సీరియస్ అయ్యారు అని తెలియగానే వాళ్ళూ సీరియస్ గా తీసుకున్నారు. మొగ్గలోనే తుంచివేసి, ఇటువంటి నేరాలను అదుపు చేయగలిగితే ఈ స్థాయిలో టి ఘోరాలు జరిగిఉండేవి కావనే వాదన వుంది. ఆ రకంగా ఆలోచిస్తే ఇది ఖచ్చితంగా పోలీసు వైఫల్యం.
నిజానికి ఇలాంటి దందాలతో పెద్ద పెద్ద వారికి ప్రత్యక్ష ప్రమేయం ఉంటుందని అనుకోలేము. ఐతే వారి అండాదండా  తమకున్నదని చెప్పుకుంటూ ఛోటామోటా’ వ్యాపారులు , అలా నమ్మించే ఏర్పాట్లు చేసుకుంటూ ఇలాటి అక్రమ వ్యవహారాలకు తెర తీస్తూ తమ పబ్బం గడుపుకుంటూ వుండడం రివాజు. అయితే, ఈ స్థాయిలో ‘నేర ప్రవృత్తి’ రెక్కలు విప్పుకున్నదంటే పెద్ద తలకాయలకు కూడా అంతో ఇంతో ప్రమేయం లేకుండా, పోలీసుల దన్ను లేకుండా ఈవిధమైన తంతు సాగించడం అసాధ్యం అని నమ్మేవాళ్ళూ వున్నారు. అందుకనే పాలకపక్షానికి ఇది కొంత ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పడం.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక పేరు వుంది. సమస్య ఎదురయినప్పుడు దాన్ని ఒక అవకాశంగా మలచుకుని తనకు అనుకూలంగా  మార్చుకుంటారని. ఇప్పుడు ఈ కాల్ మనీ రూపంలో ఆయనకు ఒక అవకాశం వచ్చింది. తను ఇచ్చిన ఒక్క భరోసాతో బాధితుల్లో కలిగిన చైతన్యాన్ని, తద్వారా వారిలో తాను నింపిన  ధైర్యాన్ని ఆయన  కళ్ళారా చూడగలిగారు. నేరాలను, రాజకీయాలనుంచి విడదీసి చూడగల విజ్ఞతను ఆయన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడే ప్రదర్శించి చూపారు. అలనాడు గుంటూరు మేయరుగా వున్న తన సొంత పార్టీ మనిషికి  కూడా నిబంధనల విషయంలో మినహాయింపు ఇవ్వని సంగతి చాలామందికి గుర్తుంది. ఇది గుర్తున్నవారికి చంద్రబాబు తిరిగి ఈ కేసులో కూడా అదేవిధమైన ధీరోదాత్తత చూపుతారనే ఆశ వుంది.

అసలు ఇలాటి నేరాలు జరిగినప్పుడు నేరస్తుడు, నేరము తప్ప మిగిలిన విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం మానేయాలి. పలానా నేరం చేసిన వాడు పలానా పార్టీ మనిషి అని చెప్పడం మీడియా సంచలనానికి ఉపయోగపడవచ్చు. పోలీసులే ఈ మధ్య ఈ రకమైన వింత ప్రకటనలు చేస్తున్నారు. నిజానికి వారిపని నిజమైన నేరస్తుడు ఎవరో కనిపెట్టి చెప్పడం వరకే. నేరస్తుల రాజకీయ నేపధ్యాలు బయట పడగానే  కేసు నీరుగార్చే ప్రయత్నాలు కూడా అప్పుడే మొదలవుతాయి. రాజకీయాలతో నిమిత్తం లేకుండా నేరస్తులను శిక్షించగలిగే పరిస్తితులు లేనంతకాలం రాజకీయ పార్టీలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం మినహా జరిగేదేమీ వుండదు. నేరాల విషయంలో కూడా పోలీసుల దర్యాప్తులు ఈ కోణం నుంచే జరుగుతూ వుండడం మరో విషాదం. నేరస్తులు ఎంతటివారయినా ఉక్కుపాదంతో అణచి వేస్తాం అనే గంభీర వాక్కులు ప్రకటనల వరకే పరిమితమవుతున్నాయి. అమాయక ప్రజలను శలభాలుగా మార్చి సులభంగా డబ్బు   సంపాదించాలని అనుకున్న వాళ్లకు రాజకీయనాయకులు, పోలీసులు ఒక రక్షరేఖ మాదిరిగా ఉపయోగపడుతున్నారు.
అయితే అప్పటికీ ఇప్పటికీ రాజకీయాల తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి. ‘అదే విధంగా ఇప్పుడూ  ఎందుకు వ్యవహరించడం లేదు అని అడగడం తేలికే. కానీ, ప్రస్తుత రాజకీయాలను నిశితంగా పరిశీలించేవారికి అందులోని సంక్లిష్టత అర్ధం అవుతుంది.
కానీ, ఈ తర్క వితర్కాలన్నీ న్యాయం కోరేవారికి అర్ధం కావు.  రాజకీయాలతో నిమిత్తం లేకుండా వారికి న్యాయం చేయగలిగితే పాలకుల పాత్రకు సార్ధకత చేకూరుతుంది.
అది జరిగే పనా అంటే ‘ఆశ’ పడడం అన్నది  సగటు మనిషికి మిగిలిన ఏకైక ఉపశమనం.
ఉపశ్రుతి: మా పెద్దన్నయ్య, కీర్తిశేషులు  భండారు పర్వతాలరావు చాలా సంవత్సరాలక్రితం ఒక వ్యాసం రాసారు. “డబ్బు కావాలా? దరిద్రం పోవాలా” అనేది దాని శీర్షిక.
ఒకానొక గర్భ దరిద్రుడు దేవునిగూర్చి గొప్ప తపస్సు చేస్తాడు.
ఆయనప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. భక్తుడు తన పరిస్తితి చెబుతాడు.
దేవుడప్పుడు చిరునవ్వు నవ్వి, ‘’డబ్బు కావాలా ? దరిద్రం పోవాలా ?’ అని అడుగుతాడు.
దాంతో భక్తుడికి కళ్ళు తెరిపిళ్ళు  పడతాయి.
దరిద్రం అంటే డబ్బు లేకపోవడం కాదు, డబ్బున్న దరిద్రులు కూడా లోకంలో చాలామంది వున్నారు. వాళ్ళకంటే తానే మిన్న అని తెలుసుకుంటాడు. (16-12-2015)
రచయిత ఈమెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595  
  
             

                              
        



14, డిసెంబర్ 2015, సోమవారం

ఒక విషాద ఘడియకు అరవై ఏళ్ళు


నాన్న చనిపోయి అరవై ఏళ్ళు. మనిషి చనిపోవడం అంటే ఏమిటో తెలియని చిన్న వయస్సులోనే కన్ను మూసాడు.  కంభంపాడులో చనిపోతే యాభయ్ మైళ్ళ దూరంలో వున్న బెజవాడకు ఆ కబురు అందడానికి రెండు రోజులు పట్టింది. మా వూళ్ళో సరయిన బడి లేదని నన్ను బెజవాడ స్కూల్లో చేర్పించారు. కబురు మోసుకొచ్చిన బ్రాహ్మడు ఏదో చెప్పడం, మా అక్కయ్య గుండెలు బాదుకుంటూ ఏడవడం లీలగా గుర్తు. బస్సు పట్టుకుని పెనుగంచి ప్రోలు వెళ్లి, బండి కట్టుకుని కంభంపాడు చేరే సరికి కర్మ తంతు మొదలయింది. కర్తగా మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారు గుండుతో కనబడ్డారు. వచ్చిన చుట్టపక్కాలు నన్ను పొదివి పట్టుకుని ఏడుస్తుంటే ఏమీ అర్ధం చేసుకోలేని వయస్సు. అప్పటినుంచి ఇప్పటి దాకా మా నాన్నగారి ఆబ్దీకాలు ఏటా పెడుతూనే వస్తున్నాము. కంభంపాడులో ఈ తద్దినాలకు ఒక ఉత్సవ రూపం కలిగించినఘనత మా మూడో అన్నయ్య వెంకటేశ్వర రావుది. డిసెంబరులో వచ్చే ఈ తద్దినానికి చుట్టపక్కాలందరికీ నవంబరు నుంచే పిలుపులు వెళ్ళేవి. ఏడుగురు అక్కయ్యలూ, బావలూ, వారి పిల్లలూ, నలుగురం అన్నదమ్ములం అందరం ఏటా ఒకచోట కలిసే సందర్భంగా మారిపోయింది. దశాబ్దాలపాటు ఈ బరువును మా మూడో అన్నయ్య, బాధ్యతను మా పెద్దన్నయ్య మోశారు.  వారు కన్ను మూసిన తరువాత కొన్నేళ్లుగా కర్తృత్వం నేను నిర్వహిస్తూ వస్తున్నాను.
రేపు డిసెంబరు పదిహేను మంగళవారం మా నాన్నగారి పుణ్యతిధి. ఆయన  రూపం కూడా లీలామాత్రంగా కూడా నాకు గుర్తు లేదు. ఒక్క ఫోటో కూడా లేదు.  నాన్న మంచాన పడి వున్నప్పుడు, చనిపోవడానికి  కొద్ది రోజుల ముందు మా బావగారు తుర్లపాటి హనుమంతరావు గారు ఒక ఫోటో తీసారుట. రూపం అస్పష్టంగా వున్న ఆ ఫోటో ఇప్పటికీ  కంభంపాడులోని మా ఇంటి వరండా గోడ గూటిలో వుంది.


రెండో అన్నయ్య రామచంద్ర రావు గారు, హైదరాబాదులో  ఒక ఆర్టిస్టుకి ఆయన రూపు రేఖలు వర్ణించి చెప్పి ఒక ఊహా చిత్రం గీయించారు.

నాకీ జన్మ ఇచ్చిన మా నాన్నగారికి ఇదే నా  స్మృత్యంజలి.
(14-12-2015)