13, డిసెంబర్ 2015, ఆదివారం

హైదరాబాదు ప్రెస్ క్లబ్, కొన్ని జ్ఞాపకాలు

  
ఎంతటి పెద్ద సంస్థ అయినా చిన్నగానే మొదలవుతుంది. ఈనాడింత గొప్పగా హైదరాబాదులో ఒక లాండ్ మార్క్ మాదిరిగా  పేరు తెచ్చుకున్న ప్రెస్ క్లబ్  పుట్టుక కూడా అంతే. బషీర్ బాగ్ చౌరాస్తాకు దగ్గరలో ఫతే మైదాన్ వద్ద, నరసంచారం అంతగా కనబడని ప్రాంతంలో, యాభయ్ ఏళ్ళ క్రితం ఒక చిన్న రేకుల షెడ్డులో పురుడు పోసుకుంది. ప్రెస్ క్లబ్ ఏర్పడిన పదేళ్లకు కాబోలు నేను రేడియో విలేకరిగా 1975 లో హైదరాబాదులో పాదం మోపాను.  ప్రెస్ క్లబ్ లో అడుగుపెట్టిన ఆ వేళావిశేషం ఎట్టిదో కానీ, దానితో నా అనుబంధం నేటికీ కొనసాగుతూనే వస్తోంది.

హైదరాబాదు ప్రెస్ క్లబ్ స్థాపించి యాభయ్ ఏళ్ళు గడిచాయి. ఇందులో నలభయ్ ఏళ్ళకు పైగా ఆ క్లబ్ సభ్యుడిగా వుంటూ వచ్చాను. క్లబ్ కార్యవర్గ సభ్యుడిగా, క్లబ్ ఉపాధ్యక్షుడిగా, క్లబ్ కార్యదర్శిగా, వివిధ హోదాల్లో అనేక దశాబ్దాలపాటు ప్రెస్ క్లబ్ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పాలుపంచుకునే అవకాశం లభించడం నా అదృష్టం.
వార్తా పత్రికల్లో పనిచేసే సిబ్బందిలో ప్రత్యేకించి విలేకరులకు ప్రెస్  క్లబ్ తో సాన్నిహిత్యం ఎక్కువ, ఎందుకంటె  ఓ మోస్తరు విలేకరుల సమావేశాలకు అదే నెలవు. పగలు విధి  నిర్వహణ కారణంగా ప్రెస్  క్లబ్ కి వెళ్ళే విలేకరులకు సాయంత్రం కాలక్షేపాలకు కూడా అదే విడిది.
ప్రెస్ క్లబ్   బషీర్ బాగ్ ప్రాంతంలో వున్నప్పుడు నేను పనిచేసే ఆకాశవాణి కేంద్రం దానికి కూతవేటు దూరంలో లేదా నడిచి వెళ్ళగలిగేంత దాపులో  వుండడం కూడా అ క్లబ్ తో నా అనుబంధం బలపడడానికి దోహదం చేసి వుంటుంది. చిన్నపాటి విలేకరుల సమావేశాలే కాకుండా ముఖ్యమంత్రులు, విదేశీ అతిధులు, ప్రముఖ క్రీడాకారులు, ఉన్నతాధికారులతో ‘మీట్  ది ప్రెస్’ పేరిట జరిగే సమావేశాలు కూడా ప్రెస్ క్లబ్ లోనే జరిగే సాంప్రదాయం కారణంగా బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ అనతి కాలంలోనే నగరంలో ఒక ముఖ్యమైన లాండ్ మార్క్ హోదాను సముపార్జించుకుంది.
అనేక మంది ముఖ్యమంత్రులు పదవీ ప్రమాణ స్వీకారం చేయగానే తొట్టతొలి ‘మీట్ ది ప్రెస్’ అక్కడే జరిగేది. నాకు తెలిసి దాదాపు ప్రతి ముఖ్యమంత్రి కూడా ఏదో ఒక సందర్భంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ ని సందర్శించి విలేకరులతో మాటామంతీ సాగించిన వాళ్ళే.


(ప్రముఖ క్రికెట్ కీడాకారుడు కపిల్ దేవ్ తో) 
అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారులు కూడా ప్రెస్ క్లబ్ కు వచ్చి కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళే. కపిల్ దేవ్, క్లైవ్ లాయడ్, అజహరుద్దీన్,  ఎం.ఎల్. జయసింహ, ఎంపైర్ రామస్వామి వంటి అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాలు హైదరాబాదు ప్రెస్ క్లబ్ ని సందర్శించడం నాకెరుక. క్లబ్ తరపున నిర్వహించిన సార్క్ మీడియా టోర్నమెంటు క్లబ్ చరిత్రలో ఒక ముఖ్యమైన పుట. చెన్నైలోని అమెరికన్  ఎంబసీ సహకారంతో హైదరాబాదులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనే అంశంపై  ఒక సదస్సు నిర్వహించడం జరిగింది.
సదస్సు అనగానే తటాలున ఒక విషయం గుర్తుకు వస్తుంది.
క్లబ్ స్థాపించి పాతికేళ్ళు పూర్తయిన సందర్భం పురస్కరించుకుని రజతోత్సవాలు జరపాలని కార్యవర్గం నిర్ణయించింది. అప్పుడు కార్యదర్శి ఎం.ఎస్. శంకర్. నేను వైస్ ప్రెసిడెంటుని. ఇటువంటి కార్యక్రమాలు అంటే ముందుకు వచ్చి సహాయ హస్తం అందించే వ్యక్తి జ్వాలా నరసింహా రావు. మా ముగ్గురికీ ఒక ఆలోచన వచ్చింది. ఎన్నికల సంస్కరణలపై ఒక సదస్సు నిర్వహించి, ఆనాడు భారత ఎన్నికల సంఘం ప్రధాన కమీషనరుగా వున్న శేషన్ తో కీలక ప్రసంగం ఇప్పిస్తే యెట్లా ఉంటుందని. అనుకున్నదే తడవు, తన ఆఫీసు పని మీద ఢిల్లీ వెళ్ళిన జ్వాలా పనిగట్టుకుని వెళ్లి శేషన్ ని కలిసి విషయం ఆయన చెవిన వేసాడు. తరువాత కొద్ది రోజులకే శేషన్ హైదరాబాదు వచ్చి రాజభవన్  గెస్ట్  హౌస్ లో  విలేకరుల సమావేశం పెట్టారు. అది కాగానే వెళ్లి ఆయన్ని కలవాలని మా ప్లాను. అయితే ఆరోజు విలేకరుల మీద ప్రత్యేకించి ఫొటోగ్రాఫర్ల మీద ఆయన  విశ్వరూపం ప్రదర్శించడం చూసి మేమే సంకోచించి ఆయన్ని కలవాలనే ఉద్దేశ్యం  విరమించుకోవాలనుకున్నాం. ఇంతలో ఒక అధికారి వచ్చి
‘శంకర్ ఎవరు, శేషన్ గారు రమ్మంటున్నారు’ అని పిలిచాడు. ముగ్గురం తటపటాయిస్తూనే లోపలకు వెళ్లాం. బయట చూసిన మనిషికీ, లోపల మమ్మల్ని ఆయన పలకరించిన తీరుకూ హస్తిమ శకాంతరం తేడా కనిపించింది. ఆప్యాయంగా కరచాలనం చేస్తూ, కూర్చోబెట్టి  వివరాలు అడిగి తెలుసు కున్నారు. అప్పటికే  ఆ గదిలో వున్న ఒక వ్యక్తిని చూపెడుతూ, ‘నాకు ఇంగ్లీష్  నేర్పిన గురువుగారు’ అంటూ మాకు పరిచయం చేసారు. పేరు వినగానే మాకు అర్ధం అయింది, హిందూ ఆంగ్ల దినపత్రికలో వారం వారం ‘నో యువర్ ఇంగ్లీష్’ శీర్షిక రాసేది ఆయనే అని.
మా సదస్సుకు రావడానికి దాదాపు అంగీకరించినట్టే మాట్లాడారు.
ఈలోగా అనుకోని పరిణామం సంభవించింది. శేషన్  బహిరంగ సమావేశాల్లో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని సుప్రీం కోర్టు ఆంక్షలు విధించింది. పత్రికలు ఆ విషయం పేర్కొంటూ , ‘న్యాయస్థానం శేషన్ ని నోరు మూసుకోమంద’ని అభివర్ణించాయి. దాంతో  శేషన్ ప్రసంగం లేకుండానే ప్రెస్ క్లబ్ కార్యక్రమం నిర్వహించాల్సి వచ్చింది.
రవీంద్రభారతిలో కవి సమ్మేళనం బాధ్యత సీనియర్ సభ్యుడు డి. వెంకట్రామయ్య భుజాన వేసుకుంటే, ఉర్దూ ముషాయిరా నిర్వహణను మరో సీనియర్  మోహన్ దివాకర్ తన భుజస్కంధాలకు ఎత్తుకున్నాడని నాటి విషయాలను  సోమశేఖర్ గుర్తు చేసుకున్నాడు.  అప్పట్లో జనం  ఘనంగా చెప్పుకునే కలర్ టీవీని ఈసీఐఎల్ వాళ్ళు క్లబ్ కి కానుకగా ఇవ్వడం, ఓసారి క్లబ్  కు వచ్చిన స్టేట్ బాంక్ సీజీఎం శ్రీ పురోహిత్ అక్కడికక్కడే క్లబ్ కి  కావాల్సిన ఫర్నిచర్ ని విరాళంగా ప్రకటించడం మరి కొన్ని జ్ఞాపకాలు. అలాగే క్లబ్ సోమాజీ గూడాకు మారినప్పుడు, ఓసారి కార్యవర్గ సమావేశం జరుగుతున్నప్పుడు  టేబుల్ టెన్నిస్ పరికరాల విషయం ప్రస్తావనకు వచ్చింది. నేను వెంటనే ఆ రోజుల్లో స్పోర్ట్స్ అధారిటీ మేనేజింగ్ డైరెక్టర్ గా వున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం గారికి ఫోను చేసి టెన్నిస్ టేబుల్ విరాళంగా ఇవ్వడానికి వీలు పడుతుందా అని అడిగాను. దానికి ఆయన జవాబుగా, ‘అక్కడ (క్లబ్ లో ) ఎంతసేపు వుంటార’ని అడిగారు. బహుశా తనిఖీ చేయడానికి వస్తున్నారేమో అనుకున్నాము. కానీ ఆయనఉద్దేశ్యం వేరు.  మేము అడిగినవన్నీ అదే రోజు క్లబ్ కి చేర్పించేసారు.
ఎంపీ రవీంద్రనాథ్, ములుగు సోమశేఖర్, ఎమ్మెస్ శంకర్, దేవులపల్లి అమర్, వల్లీశ్వర్, నగేష్ కుమార్ మొదలయిన వారితో కలిసి అనేక కార్యవర్గాల్లో పనిచేసే అవకాశం నాకు లబించింది. ఒక ఏడాది క్లబ్ కార్యదర్శిగా ఎన్నికయ్యాను. ఆ ఏడాది కార్యవర్గ సభ్యుల సహకారంతో, ‘క్లబ్ లో సభ్యుడే ప్రధానం’ (Member is supreme) అనే నినాదంతో  చేయగలిగిన కొన్ని మంచి పనులు చేసి చూపించడం జరిగింది. వాటిని పేర్కొంటే స్వోత్కర్ష అవుతుంది. అభివృద్ధి అనేది నిరంతర ప్రవాహం వంటిది. దానిమీద ఎవరిదో ఒకరి ముద్ర వేయాలని ప్రయత్నించడం వృధా. ఒక వేళ వేయాలని అనుకున్నా సాగే ప్రవాహంపై అది నిలవదు, నిలబడదు.
అందుకే ఒక మాట. ప్రెస్ క్లబ్ ఈనాడు ఇంతటి ఉచ్ఛస్థితిలో వుందంటే దానికి కారణం సభ్యులుగా, హితైషులుగా ఉంటూ వస్తున్న ‘ఎందరో మహానుభావులు’.
వారందరికీ వందనాలు.  
ఈ ఏడాది డిసెంబరు మొదట్లో హైదరాబాదు ప్రెస్ క్లబ్ స్వర్ణోత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఉత్సవానికి ముందు రోజు క్లబ్ ఆవరణలో జరిగిన కార్యక్రమానికి తెలంగాణా ఉప ముఖ్యమంత్రి  మహమూద్ ఆలీ,  హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి హాజరై నా వంటి అనేకమంది  సీనియర్ సభ్యులను సత్కరించారు. మరుసటి రోజు రవీంద్రభారతిలో నిర్వహించిన  స్వర్ణోత్సవంలో గవర్నర్ శ్రీ నరసింహన్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణా ఐ.టీ. మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతులమీదుగా మరోమారు ఈ సత్కారం స్వీకరించే అవకాశం మా బోంట్లకు కలిగించిన క్లబ్ కార్యవర్గానికి కృతజ్ఞతలు.
నవతరం నాయకత్వంలో ప్రెస్ క్లబ్ మరింత పురోగతి సాధించాలని మనసారా కోరుకుంటున్నాను.

(13-12-2015)

12, డిసెంబర్ 2015, శనివారం

నమ్మకంపై సడలుతున్న నమ్మకం - భండారు శ్రీనివాసరావు

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 13-12-2015, SUNDAY)
సూటిగా ......సుతిమెత్తగా......
ఆ మెయిన్ రోడ్డు తిన్నగా పొతే సియాటిల్ నగరంలో  మా మనుమరాళ్ళు చదువుకునే బెల్ వ్యూ స్కూలు వస్తుంది. కానీ అది ఒక మలుపు తిరిగే చోట మరో రోడ్డు పక్కనుంచి వచ్చి దానిలో కలుస్తుంది. ఆ దోవన వచ్చే వాహనదారులు ఆ రెండు రోడ్లు కలిసే చోట కాసేపు ఆగి, మెయిన్ రోడ్డులో వేరే వాహనాలు ఏవీ రావడం లేదన్న సంగతి ధ్రువ పరచుకుని కానీ ఆ రోడ్డులోకి ప్రవేశించేవారు కారు. అయితే, హైదరాబాద్ ట్రాఫిక్కు అలవాటు పడివున్న నాకు మాత్రం ఆ వాహనాలు అదే వేగంతో మెయిన్ రోడ్డులోకి దూసుకు వస్తాయేమో అన్న భీతి పీడిస్తూ వుండేది. “ఎందుకంత స్పీడు. కాస్త పక్కగా వచ్చే కార్లను చూసుకుని నడపకూడదా!” అనేవాడిని మా అబ్బాయితో.
నమ్మకం” అనేవాడు మావాడు స్థిరంగా.
అలా దూసుకు రావని ఇక్కడ మా నమ్మకం. వచ్చి తీరుతాయని హైదరాబాదులో మీ నమ్మకం. మా నమ్మకంతో ఇక్కడ మేమిలా స్పీడుగా పోగలుగుతున్నాం. మీ నమ్మకంతో అక్కడ మీరలా ఆచి తూచి నడుపుతున్నారు. ఏదయినా అక్కడ మిమ్మల్నీ, ఇక్కడ మమ్మల్నీ నడుపుతోంది నమ్మకమే!” అన్నాడు అమెరికాలో పదేళ్ళకు పైగా వుంటున్న మా వాడు మరింత నమ్మకంగా.


అమెరికన్లు ఒక పట్టాన ఎవరినీ నమ్మరంటారు. కానీ వారి జీవితాలన్నీ కేవలం ‘నమ్మకం’ ప్రాతిపదికపై నిశ్చింతగా నడిచిపోతున్నాయి.
చెక్కు ఇస్తే చెల్లుతుంది అన్న నమ్మకం.
వస్తువు కొంటే నాణ్యత వుంటుందన్న నమ్మకం, నచ్చని వస్తువును తిరిగి వాపసు చేయగలమన్న నమ్మకం.
కారు నడిపేటప్పుడు వెనుకనుంచో, పక్కనుంచో అడ్డదిడ్డంగా వేరే వాహనాలు దూసుకు రావన్న నమ్మకం.
ఫ్రీ వేస్ మినహాయిస్తే మిగిలిన రోడ్లను జీబ్రా క్రాసింగ్ ల వద్ద దాటేటప్పుడు ఎంతటి వేగంతో వచ్చే వాహనమయినా స్పీడు తగ్గించి కాలినడకనపోయేవారికి దోవ ఇస్తుందన్న నమ్మకం.
బహిరంగ ప్రదేశాలలలో పొరబాటున యెంత ఖరీదయిన వస్తువును మరచిపోయినా దాన్ని పరాయివారు పొరబాటున కూడా వేలేసి తాకరన్న నమ్మకం.
పలానా టైం కు వస్తామని చెబితే ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటారన్న నమ్మకం.
అవతల వ్యక్తి ఏమిచెప్పినా అది మనల్ని మోసం చేయడానికే అన్న భావం ఏకోశానా వుండకూడదనే నమ్మకం.
ఇలా నమ్మకాలమీద ఆధారపడి వారి జీవితాలు నమ్మకంగా గడిచిపోతున్నాయి.
ఇలాటి నమ్మకం ఏదయినా, ఒక్కటంటే ఒక్కటయినా మనకూ వుందని నమ్మకంగా చెప్పగలమా? లేదని మాత్రం ఘంటాపధంగా చెప్పగలం.
ఎందుకంటే, ఈ అరవై ఏళ్ళ పైచిలుకు స్వతంత్ర ప్రజాస్వామ్యం మనకిచ్చిందీ, మిగిల్చిందీ ఏమోకానీ ‘నమ్మకం’ అన్న పదాన్ని జీవితాల్లో కనబడకుండా మాత్రం చేసింది.
నాయకులు తమ అనుచరులనే నమ్మరు. నీడలా వెన్నంటే వుంటూ, తందానా అనకముందే తాన అని అంటూ, ప్రతి చిన్న విషయంలో ఆహా ఓహో అని భజన చేసే కార్యకర్తలు, కడకంతా తమ వెంట వుండరన్న అపనమ్మకం నాయకులది.
అనుచరులు నాయకులని నమ్మరు. ఎందుకంటె, తమ నాయకుడు ‘తన నాయకుడికి’ ఎలా పంగనామాలు పెట్టాడో అన్న వాస్తవానికి వాళ్ళే ప్రత్యక్షసాక్షులు కాబట్టి. అవసరమయితే నిచ్చెన మెట్లెక్కినట్టు నాయకుడి తలపైనే కాలుమోపి ఆపైమెట్టుకి ఎగబాకాలనే తాపత్రయం వారిది.
జనం ఈ కార్యకర్తలని నమ్మరు, ఎందుకంటె తమపేరు చెప్పి వసూలు చేసే మొత్తంలో తమకు ముట్టినదెంతో అణాపైసలతో సహా వారికి లెక్కలు తెలుసు కాబట్టి.
జనాన్ని రాజకీయులు నమ్మరు, ఎన్నికల క్రతువు ముగియగానే  మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా వారితో పనేమిటన్నది వారి నమ్మకం.
ఇలా లెక్కేసుకుంటూ వెడితే ఈ జాబితా కొండవీటి చాంతాడే.
ఏటీఎం లనుంచి డ్రా చేసే కరెన్సీ నోట్లలో ఎన్ని అసలువో, ఎన్ని నకిలీవో తెలియదు. మెరిసిపోతున్నాయని ముచ్చటపడి కొనే నగలలో అసలు బంగారం ఎంతో, కాకి బంగారం ఎంతో అన్నది అనుమానమే.
నిగనిగ లాడుతోందని తినే మామిడి పండ్లకు, అరటి పండ్లకు ఆ మెరుపు సహజంగా వచ్చిందా కార్బైడ్ వంటి కృత్రిమ లేపనాలతో వచ్చిందా అంటే చప్పున చెప్పడం కష్టమే.
నకిలీ ఔషధాలు గురించిన వార్తలు మరింత ఘోరం. శారీరక రుగ్మతలనుంచి బయటపడడానికి డాక్టర్లు రాసిన మందులు రోగులు నమ్మకంతో కొనుక్కుంటారు. కానీ మార్కెట్లో విచ్చలవిడిగా పంపిణీలో వున్న నకిలీ మందులు రోగాల సంగతి అటుంచి రోగుల  ప్రాణాలనే బలిగొంటున్నాయి.
తాగే నీళ్ళు అంతే. ప్లాస్టిక్ సీసాల్లో దొరికే మంచి నీళ్ళు తాగడానికి యెంత శ్రేయస్కరమో చెప్పలేము కాని, వాటిని తయారు చేసేవాళ్ళకు కాసులు కురిపిస్తున్నాయి.
మొన్నీ మధ్య కల్తీ నెయ్యి వ్యవహారం బయట పడింది. ఏకంగా ఏడుకొండల వాడి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యే కల్తీ అని చెప్పుకున్నారు. దర్యాప్తు జరుగుతోంది. లెక్క ప్రకారం దర్యాప్తులు అయితే జరుగుతాయి కానీ నిజాలు వెలుగు చూస్తాయా అన్న విషయంలో ఎవరి అనుమానాలు వారికి వున్నాయి. వెంకన్న లడ్డును మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. అందులో ఏ నెయ్యి వాడారు అన్న దానితో భక్తులకు నిమిత్తం వుండదు. కల్తీ నెయ్యి వల్ల ప్రాణాలు పోకపోవచ్చు. కానీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం వుంటుంది. పైగా ఈ ప్రసాదం దేశంలోని అన్ని ప్రాంతాలకు వెడుతుంది. పర్యవసానాల గురించి తెలియరావడానికి చాలా వ్యవధానం పట్టొచ్చు కూడా. నెయ్యి కల్తీ చేసినవారు మాత్రం హాయిగా కోట్లకు పడగలు ఎత్తుతుంటారు. విజయవాడ పొలిమేరల్లో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ఒక ఫాక్టరీ పై పోలీసులు దాడి చేసి ఇద్దర్ని అరెస్టు చేసారు. అసలు యజమానులు పరారీలో వున్నారన్నారు. అలవాటుగానే వాళ్ళు పోలీసులకు పట్టుబడరు. కొంతకాలం తరువాత అంతా సర్దుకుంటుంది. ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్. ఇదంతా  షరామామూలే. ఉత్తర ప్రదేశ్ లో ఇంతకంటే పెద్ద ఘోరమే వెలుగు చూసింది. నెయ్యి సహజరూపంలో పొలుసులు పొలుసులుగా కానరావడానికి ఎముకల పొడిని జంతువుల కొవ్వుతో  కలిపి తయారు చేస్తున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలకి ఈనెయ్యి సరఫరా అవుతోంది. మంచి ఆకర్షణీయమైన ప్యాకింగుల్లో లభించే ఈ నెయ్యిని జనం అమాయకంగా కొని మోసపోతున్నారు. ఇటువంటి నెయ్యి వాడిన వాళ్ళు కాలక్రమంలో కేన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడే ప్రమాదం వుందని అధికారులే చెబుతున్నారు. 
కల్తీ వ్యవహారాలకి క్లైమాక్స్ రూపంలో మొన్నీ మధ్య విజయవాడలో కల్తీ మద్యం దుర్ఘటన చోటుచేసుకుంది.
కల్తీకల్లు తాగి జనాల ప్రాణాలు హరీ అనడం గురించి లోగడ విన్నాం. బారులో మద్యం సేవించి అయిదుగురు చనిపోయిన  వార్త విన్నప్పుడు ఇక ప్రజల ప్రాణాలకు పూచీ ఎక్కడ అనిపించక తప్పదు.
ఇది జరిగింది ఉదయం పది గంటలకు అని పత్రికల్లో వచ్చింది. అంత పెందలాడే బార్లు తెరవడం నిబంధనల ప్రకారం కుదిరే పనా! కూలీ నాలీకి వెళ్ళేవాళ్ళు ఆ బారులో మద్యం సేవించి వెడుతుండడం రివాజే అని ఆ పత్రికలే రాశాయి. అంటే ఏమిటన్న మాట. యధేచ్చగా  మద్యం అమ్మకాలు, బహిరంగంగా  తాగడాలు ఇవేవో  అధాటుగా జరిగినవి కావు, అలవాటుగా రోజూ జరిగే వ్యవహారమే అనుకోవాలి. దుర్ఘటన జరిగింది కనుక విషయాలు వెలుగులోకి వచ్చాయి.లేకుంటే, మద్యం కల్తీ అనేది చాపకింది నీరులా సాగిపోతుండేది.
చౌకరకం కల్లు, సారా వంటి నాసిరకం  కాకుండా బార్లలో దొరికే  మరికాస్త ఖరీదయిన మద్యం శ్రేయస్కరమనే పేద  వినియోగ దారుల నమ్మకం ఆ విధంగా వమ్మయింది.            
ఇప్పుడు చెప్పండి!
నమ్మకం గురించి ఎవరయినా మాట్లాడినా, నమ్మకస్తుల  గురించి ప్రస్తావించినా
నమ్మకంగా నమ్మొచ్చునంటారా?



నమ్మకం అనేది రాతి మీది గీతగా వుండాలి, నీటి మీది రాత కాకూడదు.

(12-12-2015)

NOTE: Courtesy Images Owner

గాలి బుడగ ఈ జీవితం


జాతస్య మరణం ధృవం అని తెలిసిన వాళ్ళు కూడా మరణం పలానా ఘడియలో  అని ముందుగా తెలిస్తే కుదేలయిపోవడం ఖాయం.


మార్గశిర మాసం మొదటి రోజున పొద్దున్నే ఒక టీవీ ఛానల్ కు వెళ్లి ఇంటికి తిరిగివచ్చేసరికి బయట గేటుకి కట్టేసివున్న రెండు మేకలు ‘మేమే’ అంటూ ఆప్యాయంగా పలకరించాయి. వాటి నుదుటిని ముట్టుకుని దువ్వుతుంటే మా వాచ్ మన్ కొండలరావు వచ్చాడు. ‘జత పన్నెండు వేలు’ అన్నాడు. అతడికిది అలవాటే. గతంలో ఎంతో డబ్బు పోసి పందెం కోళ్ళు కొనుక్కొచ్చి పెంచడం, సీజను కాగానే అవి మాయం కావడం  నేను చూస్తూనే వున్నాను. అల్లాగే మళ్ళీ పందెం మేక పోతులు కొనుక్కొచ్చాడని అనుకున్నాను.
‘మా చుట్టాలు వస్తారు, రేపు పెద్దమ్మ అమ్మవారికి నైవేద్యం పెడతాము’ చెప్పాడు కొండల రావు. అది వింటూనే,  మేక నుదుటిపై వున్న చేయి ఒణికింది. ‘మే మే’ అని పలకరించిన వీటి జీవితానికి రేపే ఆఖరి రోజు’ అని తెలియగానే ఎలాగో అనిపించింది.

‘మీ  జీవితం ఈ క్షణంతో సరి’ అని తెలిస్తే మనుషులు ఏమైపోతారో’     

11, డిసెంబర్ 2015, శుక్రవారం

నరసారావుపేట శతాబ్ది ఉత్సవాలు



నరసారావుపేట శతాబ్ది ఉత్సవాలు  వైభవంగా జరుగుతున్నాయి అంటే అది స్పీకర్ కోడెల శివప్రసాదరావు గారి పుణ్యమే అనుకోవాలి. ఇప్పుడే కాదు, గతంలో కోటప్ప కొండకు గత వైభవం తెచ్చే కృషిలో కూడా డాక్టరు గారి పాత్ర వుంది. నరసారావుపేట వాస్తవ్యులలో చాలామంది తమ వూరి ఘనత గురించి చెప్పుకుంటూ వుంటారు. ప్రత్యేకంగా ఒక బ్లాగు కూడా నడుస్తోంది. (http://www.narasaraopet-bloggers.blogspot.com/)  



సుజాతగారి ఆ బ్లాగులో నరసారావుపేటలో అంతరించిపోతున్న గూడు రిక్షాల గురించి చదివాను. చదివిన తరువాత గూడు రిక్షాలతో నాకున్న అనుభవాలు మదిలో మెదిలాయి.
ఒకానొక రోజుల్లో గూడు రిక్షాలు జన జీవనంలో భాగంగావుండేవి. ఆ రోజుల్లో రోడ్డుమీదకు రాగానే కనబడే మొట్ట మొదటి రవాణా వాహనం గూడు రిక్షా. ఇంటి గేటు వేస్తున్న చప్పుడు కాగానే నెమ్మదిగా రిక్షా లాక్కుంటూ వచ్చి ‘రిక్షా కావాలా బాబూ, ఎక్కడికి వెళ్లాలంటూ’ చనువుగా చేతిసంచీ తీసుకువెళ్ళే రిక్షా తాతలు, అందరి జ్ఞాపకాల్లో పదిలంగావున్నారన్న విషయం ఆ బ్లాగు పై వచ్చిన ‘పలకరింపులు’ తెలియచేస్తున్నాయి. రిక్షాలు లాగేవాళ్ళు కధానాయకులుగా పెద్ద పెద్ద హీరోలతో సినిమాలే వచ్చాయంటే గతంలో ‘రిక్షాలు’ ఎలాటి సోషల్ స్టేటస్ అనుభవించాయో అర్ధంచేసుకోవచ్చు.

ఇప్పుడీ రిక్షాల కాలం చెల్లిపోయి వాటితో పొట్టపోసుకునేవారి జీవితాలు రోడ్డున పడుతున్నాయి. అభివృద్ధి వల్ల కలిగే అనర్ధాల్లో ఈ పరిణామం ఒక భాగం. కొత్తనీరు వచ్చి పాతనీటిని నెట్టివేయడం కొత్తేమీకాదు. కాకపొతే, అలా మరుగునపడిపోతున్న విషయాలను ఇలా నెమరు వేసుకోవడం వల్ల కలిగే ఆనందమే వేరు. చిన్ననాటి ఫోటోలను చూసుకున్నప్పుడు కలిగే సంతోషానికి వెల, విలువ కట్టగలమా?

9, డిసెంబర్ 2015, బుధవారం

సూటిగా.....సుతిమెత్తగా...... కర్నాటక సంగీత శిఖిరం నేదునూరి

(TO BE PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 10-12-2015, THURSDAY)

(డిసెంబరు ఎనిమిది నేదునూరి వారి ప్రధమ వర్ధంతి)

1968  జనవరి నెల.  నలభై ఏడేళ్ళనాటి మాట.  హైదరాబాదు రవీంద్ర భారతిలో ప్రభుత్వ సంగీత కళాశాల ఆధ్వర్యంలో త్యాగరాజ సంగీత ఉత్సవాలు జరుగుతున్నాయి. సాయంత్రం నాలుగు గంటల సమయంలో వేదికమీద  నలభయ్ ఏళ్ళ వయసున్న విద్వాంసులు ఒకరు త్యాగరాజ విరచిత 'మోక్షము కలదా!' అనే కీర్తనను సారమతి రాగంలో పాడడం ప్రారంభించారు. ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసులు   ఎం చంద్రశేఖరన్ , మృదంగ విద్వాంసులు  దండమూడి రామ్మోహనరావులు సహకరిస్తుండగా,   నేదునూరి కృష్ణమూర్తి అనే ఆ విద్వాంసుడు ఆలపించిన ఆ కీర్తనతో కిక్కిరిసిన సభామందిరం యావత్తు అదోరకమైన  తన్మయస్తితిలో  తేలిపోయింది.  త్యాగరాజస్వామి  వారు ఎంతటి  ఆర్తితో ఆ కీర్తన రాసారో అదే ఆర్తి,  కృష్ణమూర్తి గారి స్వరంలో తొణికిసలాడింది. అద్భుతమైన ఆలాపన, స్వరకల్పన సంగీత ప్రియులను సమ్మోహితులను చేసాయి. సుమారు నలభయ్  అయిదు నిమిషాలపాటు రవీంద్రభారతి ఆడిటోరియం,  నేదునూరివారి సంగీత లహరిలో మునకలు వేసింది. వయోలిన్ తో ఆయనకు సహకరించిన చంద్రశేఖరన్   తమిళుడు. అయినా నేదునూరివారి సంగీతామృతం సేవించిన పరవశత్వం ఆయనలో గోచరించింది. ఆ మాధుర్యపు మత్తులోనుంచి బయటపడి, ఆడిటోరియం బయటకు వచ్చిన తరువాత చంద్రశేఖరన్  తమిళంలో వెలిబుచ్చిన అభిప్రాయాన్ని దండమూడివారు తెలుగులో చెప్పారు. 'నా జీవితం ధన్యమయింది. ఇంత  గొప్ప సంగీతాన్ని పక్కనే  కూర్చుని వినే భాగ్యం కలిగింది. నేదునూరివంటి సంగీతకళానిధి జీవించిన కాలంలో సమకాలీనులుగా  మనగలిగిన అదృష్టం నన్ను వరించింది. ఈ భాగ్యానికి నన్ను నేనే అభినందించుకుంటున్నాను' 

(సంగీత కళానిధి కీర్తిశేషులు నేదునూరి)

చంద్రశేఖరన్ గారి నోటి నుంచి ‘సంగీత కళానిధి’ అనే పదం రావడం యాదృచ్చికమైనా,  తరువాతి రోజుల్లో అది నిజమై కూర్చుంది. సంగీతంలో విశిష్ట సేవ చేసేవారికి చెన్నై  సంగీత అకాడమివారు  ఏటా ఇచ్చే అత్యున్నత పురస్కారం ‘సంగీతకళానిధి’ బిరుదు. ప్రతి సంగీత  విద్వాంసుడు దాన్ని 'పద్మ' పురస్కారం కన్నా మిన్నగా  భావిస్తారు. అలాటి సంగీత పురస్కారం నేదునూరివారిని వరించింది. తమిళ సంగీత విద్వాంసులు సయితం నేదునూరివారికి  ఈ పురస్కారం లభించడంపట్ల హర్షామోదాలు వ్యక్తం చేసారు. మరో విశేషం ఏమిటంటే ఆయనకు  ‘సంగీత కళానిధి’ పురస్కారం ప్రకటించినప్పుడు నాటి ఉమ్మడి రాష్ట్రం ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్నది డాక్టర్ మర్రి  చెన్నారెడ్డి. ఆయనకు ఆ రోజుల్లో పీ.ఆర్.ఓ గా   వున్న వనం జ్వాల నరసింహారావు (ప్రస్తుతం ఆయన తెలంగాణా ముఖ్యమంత్రి కే,చంద్ర శేఖర రావు కార్యాలయంలో ముఖ్య పౌరసంబంధ అధికారిగా పనిచేస్తున్నారు)కు నాడు ఆకాశవాణి న్యూస్ ఎడిటర్ గా పనిచేస్తున్న ఆర్వీవీ కృష్ణారావు ద్వారా ఈ విషయం తెలిసింది. నేదునూరి వారికి పురస్కార ప్రకటన సంగతి తెలుసుకున్న చెన్నారెడ్డి గారు  నేదునూరి వారిని అభినందిస్తూ   చక్కని సందేశం కూడా పంపారు.
ఆ పురస్కారం అందుకున్న తరువాత ప్రసంగించాల్సివచ్చినప్పుడు నేదునూరివారికి ఒక చిన్న ఇబ్బంది ఎదురయింది. స్టేజీ మీద ఆంగ్లంలో ప్రసంగించగల ప్రావీణ్యం ఆయనకు లేదు. ఇంగ్లీష్ ప్రసంగాన్ని బెజవాడలోని అండవిల్లి మాస్టారు తయారుచేసి ఇచ్చారు.
చెన్నై మ్యూజిక్  అకాడమీలో అనేకమంది సంగీత ఘనాపాటీల సమక్షంలో నేదునూరివారికి సంగీత కళానిధి పురస్కారం జరిగింది. ఆ అకాడమీలో కృష్ణమూర్తిగారికి ఒక రికార్డు వుంది. ఏటా డిసెంబరు నెలలో జరిగే  సంగీత ఉత్సవాల్లో  1951  నుంచి క్రమం  తప్పకుండా సుమారు అరవై ఏళ్ళపాటు  కచ్చేరీ చేస్తూ వస్తున్న  ఘనత నేదునూరి వారిది. అప్పటి వరకు కళానిధి  పురస్కారం పొందిన వారు మొదటి వరసలో ఆసీనులయివుంటారు. వారి సమక్షంలో, ప్రముఖ సంగీత కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ కచ్చేరీలు ఇస్తారు. దేశం నలుమూలలనుంచి వచ్చే వేలాదిమంది సంగీత ప్రియులు వరసగా కొన్ని రోజులపాటు ఆ సంగీతాంబుధిలో వోలలడుతారు. చెన్నై  నగరంలోని హోటళ్ళన్నీ సంగీత అభిమానులతో నిండిపోతాయి. దీన్ని చెన్నై మ్యూజిక్ సీజను అంటారు.  తమిళనాటకూడా కృష్ణమూర్తిగారికి పెద్ద సంఖ్యలో అభిమానులు వున్నారు.    చెన్నైకి మకాం  మార్చాల్సిందని ఆయనపై చాలా వొత్తిడి వచ్చింది. కానీ ఆయన మాత్రం తాను  సంగీత పాఠాలు నేర్చుకున్న ఉత్తరాంధ్రనే తన శేష జీవితం గడపడానికి ఎంచుకున్నారు. విశాఖ మువ్వలవాని పాలెంలో ఆయన నిర్మించుకున్న గృహం నిజానికి ఒక సంగీత నిలయం. ప్రతి రోజూ పొద్దున్నే నిత్య విద్యార్ధి మాదిరిగా తంబురా పట్టుకుని సంగీత సాధన చేస్తూరావడం ఆయనకే చెల్లింది.

నేదునూరి వారు కన్నుమూయడానికి కొద్దిరోజులముందరే   ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సమాచార సలహాదారు   పరకాల ప్రభాకర్ విశాఖలోని ఆయన ఇంటికివెళ్ళి పరామర్శించి వచ్చారు. ఉత్తరాంద్రను నిరుడు అతలాకుతలం చేసిన హుద్ హుద్ తుపాను సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సకాలంలో తీసుకున్న చర్యలు గురించి  నేదునూరివారు ప్రశంసించినట్టు  వార్తలు కూడా  వచ్చాయి.
నేదునూరి కృష్ణమూర్తి గారు తన గురువయిన పినాకపాణి మాదిరిగా శత వర్షాలు జీవిస్తారని అనుకున్నారు కానీ అశేష యశస్సును తన వెనుకే  వొదిలి,  తాను యెంతగానో అభిమానిస్తూ వచ్చిన విశాఖ పట్నంలోనే కన్ను మూశారు. కర్ణాటక సంగీతంలో హిమాలయాల ఎత్తుకు ఎదిగిన ఇద్దరు సంగీత చక్రవర్తులు శ్రీ  మాండలిన్ శ్రీనివాస్, శ్రీ  నేదునూరి కృష్ణ మూర్తిని  గత ఏడాదిలోనే  పోగొట్టుకోవడం కర్ణాటక సంగీత అభిమానులకు తీవ్ర నిరాశను కలిగించింది.
నేదునూరి వారి శిష్యులకు సయితం కేంద్ర ప్రభుత్వం  ఇచ్చే 'పద్మ' అవార్డులు  లభించాయి కానీ వారి గురువుకు  రాకపోవడం శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం మొదలయిన వారి  అభిమానులందరికీ మనస్తాపం కలిగిస్తున్న విషయం.
కర్ణాటక సంగీతంలో గురువుకు సాటిగా పేరు తెచ్చుకుంటున్న మల్లాది సోదరులు జనరంజకమైన  నేదునూరి బాణీని  అజరామరం చేసే దిశగా అడుగులు వేస్తారని ఆశిద్దాం.
చెన్నైలో  ఈ నెల ఇరవైనుంచి సంగీత ఋతువు మొదలు కావాల్సి వుంది. అయితే భారీ వర్షాలు, వరదలతో బాగా దెబ్బతిని నెమ్మదిగా కోలుకుంటున్న చెన్నై నగరంలో ఈ ఏడాది సంగీత ఉత్సవాలు గతంలో మాదిరిగా జరగడం అనుమానమే.  చెన్నై మ్యూజిక్ అకాడమి ఆధ్వర్యంలో,   టీ.టీ.కే. ఆడిటోరియంలో ఒకవేళ జరిగినా, ఎప్పటిమాదిరిగా ఈసారి నేదునూరి వారి కచ్చేరీ  లేకపోవడం ఖచ్చితంగా ఒక లోటు.


రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595

8, డిసెంబర్ 2015, మంగళవారం

ఫిలియాస్ ఫాగ్ గుర్తున్నాడా?


జూల్స్ వెర్న్  రాసిన ‘ఎనభై రోజుల్లో భూప్రదక్షిణం’ (Around the World in Eighty days) నవల్లో కధానాయకుడు.
అలాటివాడు ఒకాయన  మా బంధువర్గంలోనే  వున్న సంగతి ఈరోజు తెలిసింది. ఆయన పేరు కూరపాటి సీతారామారావు. వయస్సు ఏడు పదులపైనే. దేవాదాయ శాఖలో అనేక ఉన్నత పదవులు నిర్వహించి ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్నారు. ఆయన స్వయంగా చెప్పిన ఆయన సొంత అనుభవం.
తెల్లవారితే హైదరాబాదులో అల్లుడి ఇంట్లో శుభకార్యం. జరూరుగా ఒక స్నేహితుడితో కలిసి శృంగేరి వెళ్ళాల్సిన సందర్భం. ముందు జాగ్రత్తగా మెంగుళూరునుంచి హైదరాబాదుకు విమానం టిక్కెట్టు కొనుక్కున్నారు. తీరా వెళ్ళిన సమయానికి విమానం చక్కా యెగిరి పోయింది. బస్  స్టాండుకు వెళ్లి కనుక్కుంటే హైదరాబాదు వెళ్ళే ఆఖరి  బస్సు అప్పుడే బయలు దేరి వెళ్లిపోయింది. ఆ స్థితిలో మామూలుగా ఉసూరుమంటూ నిట్టూర్చి ఏమి దారి అని వాపోయే పరిస్తితి. కానీ మన సీతారామారావు గారు ఫిలియాస్ ఫాగ్ వ్యవహారం కదా! వెళ్లి వాకబు చేసారు, వెళ్ళిపోయిన బస్సులో టిక్కెట్లు ఏమైనా మిగిలాయా, ఫుల్లుగా వెళ్ళిందా అని. పోయిన బస్సులో టిక్కెట్లు గురించి అడుగుతాడేమిటి ఈ పెద్దమనిషి అని కన్నడంలో ఆశ్చర్యపోతూ, ‘రెండు  సీట్లు ఖాళీ’ అని ఇంగ్లీష్ లో చెప్పాడు కౌంటర్ మనిషి.  ఈయన వెంటనే డబ్బు తీసి ఇచ్చి ‘నాకో టిక్కెట్టు ఇవ్వండి’ అన్నాడుట. ఈయనగారి వరుస చూసి అప్పటికే తల తిరిగి పోయి వున్నాడేమో కౌంటరు ఉద్యోగి మారుమాట్లాడకుండా  టిక్కెట్టు తీసి ఇచ్చాడు. ఈయన అంతకంటే మర్యాదగా అడిగారు. “ఒక్క సాయం చేయండి, నేను వచ్చిన టాక్సీలో వెళ్లి ఆ బస్సు పట్టుకుంటాను, కాస్త ఆ బస్సు డ్రైవర్ కు సెల్ ఫోనులో చెప్పండి కాస్త నెమ్మదిగా పోతుండమని”. అలా చెప్పడమేమిటి, టాక్సీ ఎక్కి రయ్యి రయ్యిమని వెళ్లి,  వెళ్లి పోతున్న ఆ బస్సును పట్టుకోవడం ఏమిటి, తెల్లారేసరికల్లా హైదరాబాదులో దిగి ఎంచక్కా  అల్లుడు గారి  ఇంట్లో వ్రతానికి హాజరు కావడం ఏమిటి అంతా జూల్స్ వెర్న్ నవల్లో మాదిరిగా చకచకా జరిగిపోయాయి (ట)   

5, డిసెంబర్ 2015, శనివారం

“కంట నిదుర రాకపోతే...... .....పడ్డావనుకొ ప్రేమలో ......”


అని ఓ తెలుగు సినిమా పాట వుంది.
అది ఇప్పుడు గుర్తుకు రావడానికి కారణం వుంది. రాజకీయ నాయకులు పార్టీలు ఎప్పుడు మారుతున్నారు అనేది తెలుసుకోవడానికి ఓ జర్నలిష్టు మిత్రుడు ఏకంగా ఓ ధర్మా మీటరు కనిపెట్టాడు. ఎవరయినా ఒక లీడరు తన సొంత పార్టీ అధినాయకుడ్ని మీడియాలో పనికట్టుకుని అదేపనిగా పొగుడుతున్నాడు అంటే అతగాడు అతిత్వరలోనే ఆ పార్టీని ఒదిలి వెడుతున్నాడని అర్ధం. అల్లాగే, ప్రతిపక్షాన్ని అదేపనిగా చీల్చి చెండాడుతున్నాడు అంటే రేపోమాపో ఆ పార్టీలోకే గోడ దూకుతున్నాడు అని అర్ధంట.
అంటే ఏమిటన్న మాట. రాజకీయ నాయకులు సొంత  పార్టీకి ఎప్పుడు గుడ్ బై  చెబుతున్నారు, ఇంకో పార్టీలోకి ఎప్పుడు దూకుతున్నారు  తెలుసుకోవాలంటే టీవీల్లో  చర్చలు చూస్తే సరిపోతుందని ఆ మితృడి కవి హృదయం.


NOTE: Courtesy Cartoonist