24, నవంబర్ 2015, మంగళవారం

ఏకపక్ష విజయంలో బహుముఖ కోణాలు



(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 26-11-2015, THURSDAY)
ఎన్టీఆర్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలకు చెందిన  అతిరధ మహారధులెందరో పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు  దొరక్క, ఇండిపెండెంటుగా పోటీ చేసి కనుమూరి బాపిరాజు, ఆ పెను ప్రభంజనంలో చావుతప్పి కన్ను లొట్టబోయిన చందంగా గెలిచి బయటపడి, మొదటి సారి శాసన సభలో అడుగు పెట్టారు. సహజంగా హాస్య ప్రియుడయిన బాపిరాజు ఆనాటి హైదరాబాదు విలేకరులతో ముచ్చటిస్తూ ఇలా అన్నారు. ‘ఎన్టీఆర్ సినిమాల్లో విసిరే ముష్టిఘాతాలకు విలన్లు కుదేలవడం తెలుసు. కానీ రాజకీయ రంగంలోకి అడుగు పెడుతూనే ఆయన కొట్టిన దెబ్బకు  మా అందరికీ కాళ్లూ చేతులూ విరిగిపోయాయి. నడుములు కుంగిపోయాయి. ఒకడికి కాలు పొతే, మరొకడికి కన్ను పోయినట్టయింది   మా పరిస్థితి. (ఇండిపెండెంటుగా గెలిచినా ఆయన కాంగ్రెసు మనిషే). ఎన్నికల్లో చావుదెబ్బ తినడం అంటే ఏమిటో చెప్పడానికి  బాపిరాజుగారు ఆ రోజుల్లో చెప్పిన భాష్యం అది. మళ్ళీ ఇన్నాల్టికి వరంగల్ ఉప ఎన్నిక ఫలితం రూపంలో అలాంటి రాజకీయ అద్భుతం చోటుచేసుకుంది. సుమారు ఏడాదిన్నర క్రితం కొంచెం అటూ ఇటూగా నాలుగు లక్షల మెజారిటీతో గెలుచుకున్న వరంగల్ లోక సభ స్థానాన్ని టీ.ఆర్.ఎస్. తిరిగి అంతకు మించిన మెజారిటీతో నిలబెట్టుకుని కొత్త రాష్ట్రంలో ఒక సరికొత్త రికార్డుని నెలకొల్పింది.


అర్ధం చేసుకోవాల్సిన  విషయం ఏమిటంటే, ఏడాదిన్నర కాలంలోనే మెజారిటీ పడిపోయి ఓటమిని మూటగట్టుకునేంతగా కేసీఆర్ నేతృత్వంలోని టీ.ఆర్.ఎస్.  సర్కారు, తన  కొంగున కట్టుకున్న ప్రభుత్వ వ్యతిరేకత ఏమీ లేదు. అలాగని, ఇంత గొప్ప మెజారిటీ తెచ్చుకుని, ఎన్నికల బరిలో వున్నమొత్తం ఇరవైరెండు మంది ప్రత్యర్ధులకు  డిపాజిట్లు సయితం దక్కనంతగా ఘన విజయం సాధించే  అద్భుతమైన ఘన కార్యాలు ఈ ఏన్నర్ధం కాలంలో చేసిన దాఖలా కూడా ఏమీ లేదు. మరి ఎందుకిలా జరిగింది? ఎందుకిలా వచ్చిందీ ఫలితం?
ఎందుకంటే, ఘోరంగా ఓడిపోయిన వారిది ఎక్కువగా  స్వయంకృతాపరాధమే.      
‘తెలంగాణా ఇచ్చింది మేమే’ అని చెప్పుకోవడంలో వైఫల్యం చెందడం వల్లనే నిరుటి ఎన్నికల్లో గెలవలేకపోయామని బలంగా నమ్ముతున్న కాంగ్రెస్ పార్టీ,  ఆ విషయాన్ని మరోమారు తెలంగాణా ప్రజల ముందుకు తెచ్చి ఈ ఉపఎన్నికలో అయినా పోయిన పరువు నిలబెట్టుకోవాలని  ఢిల్లీ నాయకుల్ని సయితం వరంగల్ ప్రచారంలోకి దింపింది. తెలంగాణా బిల్లు లోకసభ ఆమోదం పొందే సమయంలో స్పీకర్ గా వున్న మీరా కుమార్ మొదలయిన వారితో అలనాటి అంశాలను మళ్ళీ చెప్పించి, ప్రజల మనసులు గెలవాలని ప్రయత్నం చేసింది. మరో వైపు ప్రజల్లో ప్రభుత్వం పట్ల సహజంగా తలెత్తగల వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం కూడా ఆ పార్టీ నాయకులు చేసారు. నామినేషన్ సమయంలో అభ్యర్ధిని మార్చాల్సిన విషమ పరిస్తితి నుంచి కొంత బయట పడ్డట్టు మొదట్లో అనిపించినా చివరకు ఫలితం మాత్రం ప్రతికూలంగానే వచ్చింది.
మరోవైపు కేంద్రంలో అధికారంలోవున్న  బీజేపీ, పొరుగు రాష్ట్రాన్ని పాలిస్తున్న టీడీపీ, గత ఎన్నికలల్లో కుదుర్చుకున్న పొత్తుకు కొనసాగింపుగా ఈ ఉపఎన్నికలో మరోమారు జతకట్టి పోటీ చేసాయి. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటులో తమకూ కొంత వాటా వుందని నమ్ముతున్న బీజేపీ సహజంగానే ఆ అంశాన్ని ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది. కేంద్ర సాయం లేకుండా కొత్త తెలంగాణా రాష్ట్రం మనుగడ కష్టం కాబట్టి కేంద్రంలో అధికారంలో వున్న తమ పార్టీ అభ్యర్ధిని గెలిపించడం వరంగల్ ఓటర్ల విధాయకం అని నమ్మచూపే పద్దతిలో ఆ పార్టీ ప్రచారం సాగింది. ఇక ఆ పార్టీకి మిత్రపక్షమైన తెలుగు దేశం పార్టీ నాయకత్వం, బీజేపీ అభ్యర్ధి విజయానికి కృషి చేసింది కాని, సైకిల్ గుర్తుకు ఓటువేయడానికి అలవాటుపడిన టీడీపీ కార్యకర్తల ఓట్లు ఏమాత్రం కమలం గుర్తుకు బదిలీ అవుతాయన్న  విషయంలో ఎవరి అనుమానాలు వారికి పోలింగుకి ముందర నుంచీ వున్నాయి. చివరాఖరుకు అవే నిజమయ్యాయా అన్నట్టు ఫలితం వెలువడింది. ఓటమిలో పాలుపంచుకున్న టీడీపీ నాయకత్వానికి మిగిలిన ఒకే ఒక ఉపశమనం ఏమిటంటే,  ఈ ఎన్నికల్లో సొంతంగా  అభ్యర్ధిని  నిలబెట్టకుండా, ఆ స్థానాన్ని మిత్ర పక్షం అయిన బీజేపీకి ఒదిలివేయడమే.  
ఇక వామపక్షాలు ఏకంగా ఒక ఉమ్మడి అభ్యర్ధిని పోటీకి నిలిపాయి. వై.ఎస్.ఆర్. పార్టీకి తెలంగాణాలో బలం లేకపోయినా అభ్యర్ధిని నిలబెట్టింది. జగన్ మోహన్ రెడ్డి సభలకు భారీగా తరలివచ్చిన జనాలను అయినా ఓట్లుగా మలచుకోవడంలో ఆ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది.
ఇన్ని పార్టీలు రంగంలో వున్నప్పుడు సహజంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి పాలక పక్షానికే ఉపకరిస్తుంది. అయితే ఇన్ని పార్టీలు ప్రచార పర్వంలో విసిరే ఆరోపణలకు, విమర్సలకు ఒంటరిగా జవాబు చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా పాలక పక్షం నాయకులపై పడుతుంది. అందుకే ప్రచార సమయంలో ప్రతి అంశం వివాదాంశంగా మారి, మీడియాలో పలు రూపాల్లో రూపాంతరం చెంది, నిజంగానే ప్రభుత్వ వ్యతిరేకత బాగా పేరుకుపోయి ఉన్నదేమో అని ప్రతిపక్షాలే నమ్మే స్థితి ఏర్పడింది. చివరికి ఈ నమ్మకమే వాస్తవ స్థితిని  సయితం  గుర్తించలేని పరిస్థితిలోకి వాటిని నెట్టి వేసింది. నిజానికి అధికారంలోకి  వచ్చిన రెండేళ్లలోపు వచ్చిపడే ఉపఎన్నికలు ఏ పాలకపక్షానికయినా తలనొప్పే. యెంత గొప్ప నాయకుడయినా అంత కొద్ది వ్యవధానంలో ప్రజలను మెప్పించడం కష్టం. అధికార పక్షంపట్ల ఎంతో కొంత అసంతృప్తి సహజం. కొండొకచో అది వ్యతిరేకతగా కానవస్తుంది. అయితే అది అసహనంగా మారి, అసంతృప్తిగా పరిణమించి,  కసిగా మారనంత కాలం పాలక పక్షాలకు  కలిగే ప్రమాదం ఏమీ వుండదు.
సాధారణంగా ఉపఎన్నిక, అందులోను పార్లమెంటు స్థానానికి జరిగే ఎన్నిక అంటే జనంలో ఆసక్తి తగ్గిపోతుంది. ఆ ఒక్క స్థానంలో  గెలుపోటముల వల్ల అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ప్రభుత్వాలకు ఏర్పడే ముప్పు ఏమీ వుండదు. ఈ కారణాల వల్ల వరంగల్ ఉపఎన్నికను జనం ఆషామాషీగా తీసుకుంటారనే అభిప్రాయం కలిగిన మాట వాస్తవం. అయితే జనంలోని ఈ  నిర్లిప్తత తమ కొంప ముంచుతుందన్న ఎరుక కలిగిన రాజకీయ పార్టీలు తమ ప్రచార సరళిని ఉధృతం చేసే క్రమంలో, ఒకింత చెలియలి కట్ట దాటి వ్యవహరించాయి. మాటలు హద్దులు మించాయి. వ్యక్తిగత ఆరోపణలు మనస్సు చివుక్కుమనే రీతిలో సాగాయి.  రైతుల ఆత్మహత్యలు, పత్తి రైతుల సమస్యలు వీటన్నిటినీ ప్రతిపక్ష పార్టీలు ప్రచారాస్త్రాలుగా మార్చుకుని టీఆర్ ఎస్ పై మూకుమ్మడి దాడికి దిగాయి. ప్రజల సమస్యలను ప్రచారంలో ఎత్తి చూపాయే కానీ, అంతకుమందు ప్రజల పక్షాన నిలిచి వారికోసం ఉమ్మడి పోరాటం చేయకపోవడం వల్ల, వారి ఆత్రుత అంతా అధికారంకోసమే అన్న అనుమానం కలగడం సహజం.   
వాస్తవంగా ప్రతిపక్షాలు ప్రచార పర్వంలో లేవనెత్తిన సమస్యలన్నీ పాలక పక్షం టీ.ఆర్.ఎస్. పార్టీకి మింగుడు పడని విషయాలే. ఇలాటి  ఏ అంశం అయినా సమాధానం చెప్పుకోవాల్సిందే. సంజాయిషీ  ఇచ్చుకోవాల్సిందే. అంచేతే  ప్రభుత్వానికి గుణపాఠం చెప్పితీరాలనే కసి కలగకపోయినా,  ఈ మాత్రం వ్యతిరేకత చాలు, నిరుడు టీ.ఆర్.ఎస్. పార్టీకి వచ్చిన భారీ మెజారిటీని గణనీయంగా తగ్గించడానికి అనే నమ్మకం కలిగింది ప్రతిపక్షాలకు. విజయం మీద నమ్మకం లేకపోయినా, ప్రభుత్వ వ్యతిరేకత పట్ల నమ్మకం పెంచుకున్న ప్రత్యర్ధులు మెజారిటీ తగ్గించగలిగితే, అదే ఓ మోస్తరు గెలుపు అనే అభిప్రాయానికి వచ్చారు. చివరికి గెలుద్దామని రంగంలో దిగిన పార్టీలు, మెజారిటీ తగ్గించడం, రెండో, మూడో స్థానం దక్కించుకోవడం ఎల్లా అనే మీమాంసలో పడిపోయినట్టయింది.
టీ.ఆర్.ఎస్. కి ఇంతటి అపూర్వ ఘన విజయం లభించడానికి ఆ పార్టీ అధినేత కేసీఆర్ అనుసరించిన వ్యూహాలు కొంతవరకు కారణం అయివుండవచ్చు కానీ, అసలయిన కారణం తెలంగాణా ప్రజల్లో ఇంకా అడుగంటని  భావోద్వేగం. కొడిగట్టని తెలంగాణా వాదం.
తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కావడంతోనే, ఒకరకంగా  టీ.ఆర్.ఎస్. పాత్ర రాజకీయంగా పరిమితమయిపోయింది. మిగిలిన రాజకీయ పార్టీల్లో అదీ ఒకటయిపోయినట్టే లెక్క. ఈ లెక్క తెలిసిన మనిషి కాబట్టే, కేసీఆర్ ‘బంగారు తెలంగాణా’ నినాదం ఎంచుకున్నట్టు అనిపిస్తోంది. కొత్త రాష్ట్రం ఏర్పడగానే టీ.ఆర్.ఎస్. పని ముగిసిపోయినట్టు కాదనీ, కష్టపడి ఎన్నో త్యాగాలతో  సంపాదించుకున్న తెచ్చుకున్న తెలంగాణాను ‘బంగారు తెలంగాణా’గా మలచుకోవాలంటే టీ.ఆర్.ఎస్. ఆవశ్యకత ఇంకా ఉందన్న అభిప్రాయం జనాల్లోకి చేరేలా ఆయన చేసిన ప్రయత్నం ఈ ఉపఎన్నికలో బాగా పనిచేసింది. అదే జనాలను ఇంత  పెద్ద ఎత్తున పోలింగు కేంద్రాలకు రప్పించి వుంటుందని నమ్మే వాళ్ళు వున్నారు.   
అధికార దుర్వినియోగం, ప్రలోభాలు, ఓట్ల కొనుగోళ్ళు  ఇవన్నీ షరా మామూలు ఆరోపణలుగా భావించే రోజులు వచ్చాయి. అధికారంలో వున్నపార్టీ అధికారాన్ని వాడుకోవడం తనకున్న సహజ హక్కుగా భావించే రోజులివి. అధికారంలో వున్నప్పుడు తాము చేసిన నిర్వాకం అదే కనుక ఏ పార్టీ అయినా  మాటవరసకు మాత్రమే  ఇలాటి ఆరోపణలు చేస్తుందే తప్ప అందులో ఎంతమాత్రం నిజాయితీ లేదని వాటికీ తెలుసు. అధికార వినియోగం తప్ప దుర్వినియోగం అనే మాటే రాజకీయ పార్టీలు ఒప్పుకోని కాలంలో మనం జీవిస్తున్నాం. అధికారంతోటి, డబ్బుతోటి, ప్రలోభాల తోటి గెలుపు సాధ్యం అయ్యేటట్టయితే, వరంగల్ తో పాటే  ఫలితం వెలువడిన  మధ్య ప్రదేశ్ ఉపఎన్నికలో అధికార బీజేపీ  పార్టీ ఎందుకు ఓడిపోతుందన్న  ఎదురు ప్రశ్న సిద్ధంగానే వుంది.
అయితే ఒకటి మాత్రం నిజం.
ప్రజలు కచ్చపట్టి పాలకపక్షాలను ఓడించిన సందర్భాలు ఎరుగుదుం. కానీ కసిబూని ప్రభుత్వాన్ని గెలిపించిన ఏకైక సందర్భం మాత్రం ఒక్క వరంగల్ ఉపఎన్నికేనేమో! 
పాలక పక్షాన్ని ఓడించాలని ప్రతిపక్షాలు అనుకుంటాయి. అలా అని ప్రజలు కూడా అనుకోవాలి. లేకపోతే ఇదిగో ఇలాగే వుంటుంది.
టీ.ఆర్.ఎస్. పార్టీకి  ప్రజలిచ్చిన వ్యవధానంలో ఇంకా మూడున్నర ఏళ్ళ సమయం మిగిలే వుంది. నిరుడు ప్రజలు తెలంగాణా రాష్ట్రాన్ని పాలించమని ఇచ్చిన తీర్పు కంటే , తెలంగాణా కల సాకారం అయిన తరువాత కట్టబెట్టిన ఈ ఘన  విజయం టీ.ఆర్.ఎస్.కూ, ఆ పార్టీ అధినేతకూ మరింత ప్రియమైనదీ, అత్యంత విలువయినదీ. ప్రజలపట్ల, వారి ఆకాంక్షల పట్ల ప్రభుత్వానికి వున్న బాధ్యతను మరింత పెంచే విజయం కూడా ఇది.
విజయం వినయం పెంచాలి. అపజయం అనేది విజయం కోసం చేసే మరో ప్రయత్నానికి నాంది కావాలి. రాజకీయ పార్టీలు నేర్చుకోవాల్సిన గుణపాఠం ఇదే.
(25-11-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్:  98491 30595

NOTE : Courtesy Image Owner  

21, నవంబర్ 2015, శనివారం

సమాజంపై టీవీ ప్రభావం

(నవంబర్, 21, ప్రపంచ టెలివిజన్ దినోత్సవం)

సూటిగా.........సుతిమెత్తగా.......

ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం కాదు హింసాయుగం.
'ఎందెందు వెదికిచూసిన అందందే శ్రీహరి కనిపిస్తాడని' ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపుడితో అంటాడు. కానీ హింస కోసం అలా వెతకాల్సిన పని కూడా లేదు.
హింస ఎక్కడ లేదు? నగరాల్లో, గ్రామాల్లో, ఇళ్ళల్లో, వీధుల్లో, మాటల్లో, చర్చల్లో ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా  హింస విలయతాండవం చేస్తోంది. అంతెందుకు, సినిమాల్లో చూపిస్తున్న హింస నేరుగా టీవీల ద్వారా  డ్రాయింగ్ రూముల్లోకి, అక్కడినుంచి ఎకాయెకిన ఇంటిల్లిపాదీ మెదళ్ళలోకీ  జొరబడుతోంది. విశ్వవ్యాప్తంగా అల్లుకుపోయిన టెలివిజన్ చానళ్ళ వల్ల మంచి ఏమీ జరగడం లేదా అంటే పూర్తిగా అవునని కానీ కాదని కానీ చెప్పలేని పరిస్తితి. 
పదేళ్ళక్రితం  అమెరికా వెళ్లాను. మన దగ్గరినుంచి వెళ్లి అక్కడ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్న అనేకమంది తెలుగు పిల్లలు కనిపించారు. మీ ఈఅభివృద్దికి కారణం  ఏవిట’న్న నా ప్రశ్నకు వాళ్ళు చెప్పిన సమాధానాలలో ఒకటి ఈనాటి అంశానికి సంబంధించినది  వుంది. స్కూల్లో చదువుకుంటున్నప్పుడు క్రమం తప్పకుండా (అలనాటి) దూరదర్శన్ లో  క్విజ్ ప్రోగ్రాములు చూసే వాళ్ళమనీ,  తద్వారా పొందిన మానసిక వికాసం  తరువాత జీవితంలో తమకు అక్కరకు వచ్చిందనీ  వాళ్ళు చెప్పారు. 
టీవీల వల్ల పాజిటివ్  ఎఫెక్ట్  ఉంటుందనడానికి దీన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. 
లాహోర్ లో  ఇన్ష్టిట్యూట్ ఆఫ్ బిజినెస్  ఎడ్మినిస్ట్రేషన్  లో చదువుకునే విద్యార్ధులు  ఒక పరిశోధనా పత్రం ఒకటి రూపొందించారు. పిల్లల మీద  ఎలక్ట్రానిక్ మీడియా ప్రభావం అన్న అంశంపై  వారు పరిశీలన  జరిపారు. వాళ్ళ లెక్క ప్రకారం-
అక్కడి పిల్లల్లో,
పన్నెండు సంవత్సరాల లోపు వాళ్ళు రోజుకి రెండుగంటలు టీవీ చూస్తారట.  అరగంటపాటు హోం వర్క్ చేసుకుని, ఓ గంట టీవీ గేమ్స్  చూస్తారట. 
ఓ యిరవయి నిమిషాలు  రేడియో వింటారు. మరో యిరవయి నిమిషాలు పుస్తకాలు చదవడానికీఓ గంట ఆటలకీరెండున్నర గంటలు స్నేహితులతో ముచ్చట్లకీ  ఖర్చు చేస్తారని తేలింది. 
మరో ఆసక్తి కరమయిన విషయం ఏమిటంటే, చాలామంది పిల్లలు టీవీ తమకు సెకండ్ పేరెంట్ లాంటిదని చెప్పారు. టీవీ వల్ల  ఇమాజినేటివ్ పవర్ (ఆలోచించే సామర్ధ్యం)  పెరుగుతుందన్నారు. సృజనాత్మకత మెరుగుపడుతుందన్నారు.  కొత్త భాషలు, సరికొత్త  పదాలు నేర్చుకోవచ్చన్నారు. అదేసమయంలో వాళ్ళు మరో మాట కూడా చెప్పారు. పేద పిల్లలు టీవీల  వల్ల నష్టపోతున్నారన్నారు. అలాగే పెద్దల నుంచి వేధింపులకు గురయ్యే పిల్లలు, టీవీలు చూసి హింసా మార్గం పడుతున్నారనిదౌర్జన్యకారులుగా తయారవుతున్నారనిచదువులో వెనకబడుతున్నారని వెల్లడించారు.
ఈ పరిశోధన చేసిన విద్యార్ధులు కొన్ని విలువయిన సూచనలు కూడా చేశారు. బెడ్ రూముల్లో టీవీలు ఉండకూడదన్నారు. వాణిజ్యపరంగా నిర్వహించే టీవీ చానళ్ళను అదుపుచేసే విధానం వుండాలన్నారు. పిల్లలు చూసే టీవీ  కార్యక్రమాలపై  పెద్దలు ఓ కన్నేసి వుంచాలన్నారు. 
భారత రాజ్యాంగంలోని  యిరవై ఒకటవ అధికరణం ప్రజలందరికీ  జీవించే హక్కు ఇచ్చింది. రైట్  టు లివ్ విత్ డిగ్నిటి అంటే హుందాగాగౌరవంగా జీవించే హక్కు కూడా ఈ అధికరణం పౌరులకు కల్పిస్తోందని , గతంలో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.  టీవీల్లో మహిళలని అసభ్యంగా చూపించడం  రాజ్యాంగంలోని   ఆర్టికిల్ కి విరుద్ధం. కానీ అనేక టీవీ ఛానళ్ళు  దీన్ని పట్టించుకున్న దాఖలా  లేదు.
వంటలు, ఆరోగ్యం, విద్య – ఈ అంశాలమీద  చాలా ఛానళ్ళు అనేక చక్కటి ప్రోగ్రాములు అందిస్తున్నాయి. వీక్షకుల స్పందన కూడా వీటికి బాగా వుంది. మంచి సంగతులు సరే. చెడు ప్రభావం తలచుకుంటేనే భయపడాల్సి వస్తోంది. ఆడవాళ్ళల్లో, ముఖ్యంగా గృహిణుల్లో చాలామందికి టీవీ చూడడంతోనే సమయం సరిపోతోంది. సరయిన వ్యాయామం లేక ఊబకాయం సమస్యలు తలెత్తుతున్నాయి.  ఆకర్షణీయమయిన టీవీ ప్రకటనలు చూసే పిల్లలు జంక్ ఫుడ్స్ కి అలవాటుపడుతున్నారు. పత్రికల్లో ఇలాంటి ప్రకటనలు మామూలే కదా అనవచ్చు. కానీ నిరక్ష్యరాస్యులపై వాటి ప్రభావం అంతగా వుండదు. టీవీల యుగం వచ్చాక చదువుతో నిమిత్తం లేదు. వాటిని చూసి  కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నారు. కన్స్యూమరిజం బాగా ప్రబలడానికి  ఈ డ్రాయింగ్ రూం  టీవీలే  కారణం. ఇన్ని రకాల టీవీలు లేని రోజుల్లో పల్లెటూళ్ల లోని  ఆడవాళ్ళకు అనేక రకాల కాలక్షేపాలు ఉండేవి. కుట్లు. అల్లికలుసంగీతం  అలా ఏదో ఒక   ప్రయోజనకరమయిన వాటితో పొద్దు పుచ్చుకునేవాళ్ళు. ఇప్పుడో,  సీరియళ్లు చూస్తూ  వాటిపై   చర్చోపచర్చలు చేసుకోవడంతోనే  సరిపోతోంది. పిల్లలని  చూడడానికి అమెరికా వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడి సీరియల్ ఏమయిపోతోందో అని బెంగ పడుతున్నారని వింటుంటే  వాటికి ఎంతగా అలవాటు పడిపోయారో సులభంగా  అర్ధం చేసుకోవచ్చు. 
ఒక సూర్యుండు సమస్త జీవులకు  తానొక్కొక్కడయి తోచు  చందాన,  ఈ నాడు  ప్రయివేటు టీవీ   ఛానళ్ళు కుటుంబంలో ప్రతిఒక్కరికీ  కావాల్సిన కార్యక్రమాలను నేత్రానందంగా  తయారుచేసి అందిస్తున్నాయి. కొన్నిసందర్భాలలో ఇవి కుటుంబ సభ్యుల నడుమ పొరపొచ్చాలకు  కూడా కారణమవుతున్నాయి. దానితో ఎవరికి వాళ్ళు తమ విభవం కొద్దీ ఎవరి గదుల్లో వాళ్ళు విడిగా టీవీ సెట్లు ఏర్పాటుచేసుకుంటున్నారు. కుటుంబ సభ్యుల మధ్య అసలే అంతంత మాత్రంగా వున్న 'మాటా మంతీదీనితో నామమాత్రంగా మారిపోయింది. ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే  'గెస్టులు' గా తయారవుతున్నారు. ఇరుగు పొరుగు, చుట్టపక్కాలతో సంబంధబాంధవ్యాలు  కనుమరుగవుతున్నాయి. టీవీ చూస్తున్న సమయంలో ఫోన్ వస్తే సమాధానం  చెప్పేవారే కరువవుతున్నారు. 
ఇక అశ్లీల కార్యక్రమాలను గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 
అశ్లీలాన్ని అరికట్టే  సదాశయంతో  రూపొందించే  ప్రోగ్రాములే అశ్లీల దృశ్యాలతో నిండిపోతున్నాయి. 
ఒక్క మాటలో చెప్పాలంటే, తీరిక పుష్కలంగా ఉన్నవాళ్ళకోసం ఛానళ్ళు  తీరిక లేకుండా  పనిచేస్తున్నాయి. 
అలా అని టీవీ చానళ్ళ వల్ల ఎలాటి ప్రయోజనాలు లేవనే నిర్ధారణకు రావడం కూడా సబబు కాదు. సమకాలీన రాజకీయాలపట్ల సాధారణ ప్రజల్లో అవగాహన పెరగడానికి టీవీలు దోహదం చేస్తున్నాయనడంలో సందేహం లేదు. పాతిక ముప్పయ్యేళ్ళ క్రితం అక్కడక్కడా అరుదుగా కానవచ్చిన టీవీలు ఈనాడు తామరతంపరగా దేశం నలుదిక్కులా అల్లుకుపోయాయి. ఇంతటి విస్తృతి కలిగిన ప్రసార మాధ్యమం కాబట్టే టీవీల ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీలులేకుండా పోతోంది.
ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోను కలిపి వేల సంఖ్యలో టీవీ నెట్ వర్కులు పనిచేస్తున్నాయి. పలు దేశాల్లో టీవీ చానళ్ళ సంఖ్య వేళ్ళమీద లెక్కపెట్టే దశను దాటిపోయింది. బహామాస్, అంటార్కిటికా, ఆండోరాలలో మాత్రమే ఒకే ఒక టీవీ ఛానల్ చొప్పున వుంది. మనదేశం సంగతి, అందులో రెండు తెలుగు రాష్ట్రాల సంగతి చెప్పనక్కర లేదు. దేశంలో రెండేళ్ళ నాటి గణాంకాల ప్రకారం 1148 టీవీ ఛానళ్ళు పనిచేస్తున్నాయి. వీటిల్లో వందకు పైగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. అమెరికాలో సగటున రోజుకు సుమారు నాలుగు గంటలు టీవీ చూస్తుంటే మన దగ్గర రోజుకు టీవీ చూసే సమయం సగటున దానికి రెట్టింపు ఉంటోంది. జనాభా ఎక్కువ కావడం, వారిలో సరయిన పని లేని వాళ్ళ సంఖ్య  కూడా ఎక్కువగా వుండడం అందుకు కారణంగా చెబుతున్నారు. మనకంటే జనాభా ఎక్కువ వున్న చైనాలో సగటున టీవీ చూసే సమయం కొంచెం అటూ ఇటూగా రెండున్నర గంటలేనట. ఇదో వైచిత్రి. (21-11-2015)


రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595         

18, నవంబర్ 2015, బుధవారం

పేదవాడి గృహ ప్రవేశం

సూటిగా ......సుతిమెత్తగా ....... 
(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 19-11-2015, THURSDAY) 
సొంత గూడు ఏర్పాటు చేసుకోవాలనే కోరికే ఆదిమ మానవుడిని జనవాసాల నాగరిక జీవనం వైపుగా మళ్ళించింది. లేనిపక్షంలో పొదలు, గుహలకే మనిషి జీవితం పరిమితమై వుండేది.
సొంతిల్లు అనే కల కనని మనుషులు వుండరు. ఇల్లు అనేది నివసించడానికే కాదు మరణించడానికి కూడా అవసరం అని నమ్మే వాళ్ళు వున్నారు. ఒక ఇంటివాళ్ళు కావాలనే కోరిక పెంచుకునే విషయంలో  వున్నవాళ్ళు లేనివాళ్ళు అనే తేడా లేదు. కలిగిన వాళ్ళు తమ విభవం కొద్దీ ఒకటికి మించిన ‘ఇళ్ళు’ కట్టుకుంటే, లేనివాళ్ళు కనీసం ఒక్క ‘ఇల్లు’ అన్నా సొంతం అవుతే బాగుండని కోరుకుంటారు. ఇదేమీ తీరని కోరిక  కాకపోయినా అంత తేలిగ్గా సాధ్యం అయ్యే విషయం కూడా కాదు. అందుకే ఇల్లంటే అందరికీ అంతటి మక్కువ.
అత్యధిక జనాభా కలిగిన మన దేశంలో అత్యధికులు ఇళ్లు లేనివాళ్ళే. తల దాచుకోవడానికి కొందరు అద్దె కొంపల్ని నమ్ముకుంటే అసలా మాత్రం గూడు లేనివాళ్ళు కూడా పుష్కలంగానే వున్నారు. బహుళ అంతస్తుల సుందర హర్మ్యాల దాపునే చివికి జీరాడుతున్న గుడిసెలు కూడా కానవచ్చే దృశ్యం బహుశా మన దేశానికే పరిమితం కావచ్చు. ఏదో ఒక పాత సినిమాలో జమీందారు రైలెక్కడానికి మందీ మార్బలంతో స్టేషనుకు వస్తాడు. తాను ఎక్కాల్సిన మొదటి తరగతి బోగీకి ఆనుకుని సామాన్యులు ప్రయాణించే సాధారణ బోగీలు వుండడం చూసి ఆ ఖామందుల వారికి ఒళ్ళు మండుతుంది. వెంటనే సెక్రెటరీని పిలిచి  ‘ఈ రైలుకు రెండో తరగతి బోగీలు తగిలించింది ఎవర’ని హుంకరిస్తాడు. ‘అయ్యా! రెండో తరగతి ఉంటేనే మొదటి తరగతికి గుర్తింపు, అందుకే ఆ ఏర్పాటు’ అని తెలివిగా జవాబిచ్చి అప్పటికి తప్పుకుని ఊపిరి పీల్చుకుంటాడు.
ఎంతో బాగా అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాల్లో కూడా ఇళ్ళు లేని నిర్భాగ్య దామోదరులు వున్నారు. ఆ దేశంలోని ప్రధాన నగరాల్లో రోడ్డు పక్కన ‘హోమ్ లెస్’ అని చిన్న బోర్డు పెట్టుకుని ఇలాటి వాళ్ళు అక్కడక్కడా కానవస్తుంటారు. మూడేళ్ళ క్రితం తీసిన అధికారిక గణాంకాల ప్రకారం అమెరికా వంటి సంపన్న దేశంలో ఇల్లు లేనివాళ్ళ సంఖ్య సుమారు కాస్త అటూ ఇటూగా ఆరున్నర లక్షలు. అయితే అసలు సంఖ్య ఇంకా ఎక్కువే అన్నది కొందరి వాదన. మన దేశంలో పేదలకోసం ఏటా లక్షల సంఖ్యలో ఇళ్ళు నిర్మిస్తున్నామని మన రాజకీయ నాయకులు ప్రకటనలు చేస్తుంటే విని ఆ దేశాల వాళ్ళు  నోళ్ళు వెళ్ళబెట్టడానికి కారణం వుంది. మన దగ్గర పేదవాడి ఇల్లు అంటే నాలుగు మట్టి గోడలు, పైన తాటాకు కప్పిన పూరి పాక అని.  కానీ  అభివృద్ధి చెందిన దేశాల్లో ‘ఇల్లు’ అంటే ఆ  లెక్క వేరు.
బ్రిటన్ మాజీ ప్రధాని జేమ్స్ కేలహన్ ఒకసారి భారత దేశాన్ని సందర్శిస్తూ అందులో భాగంగా హైదరాబాదు వచ్చారు. ఆయన గౌరవార్ధం రాష్ట్ర ప్రభుత్వం జూబిలీ హాలులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నది కీర్తిశేషులు  టి. అంజయ్య.

రాష్ట్రం వివిధ రంగాల్లో సాధించిన విజయాలను గురించి ముందుగా అధికారులు తయారు చేసి ఇచ్చిన  ప్రసంగ పాఠం ద్వారా ముఖ్యమంత్రి అంజయ్య విదేశీ అతిధికి వివరించడం ప్రారంభించారు. పేద, బలహీన వర్గాలకు ప్రభుత్వం ఏడాది కాలంలో కొన్ని వేల పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చిందని చెబుతున్నప్పుడు బ్రిటిష్ లేబర్ పార్టీ నాయకుడయిన జేమ్స్ కేలహన్ ఒకింత విస్మయంగా విన్నారు. పక్కా ఇల్లు అంటే శాశ్విత గృహం (పర్మనెంట్ హౌస్) అనే అర్ధంలో అధికారులు అనువదించి చెప్పిన వివరణ ఆయన్ను మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. అంత తక్కువ వ్యవధిలో అన్ని వేల ఇళ్లు నిర్మించడం సాధ్యమా అన్న సందేహం ఆయన ప్రశ్నల్లో వ్యక్తం అయింది. బ్రిటన్ దేశపు ప్రమాణాల ప్రకారం శాశ్విత గృహానికి ఎన్నో హంగులు, సదుపాయాలూ అవసరం అవుతాయి. ఆ దృష్టితో ఆలోచించే విదేశీ అతిధులకు మన పక్కా ఇళ్ళ ప్రణాళికలు అచ్చెరువు గొలపడంలో ఆశ్చర్య పడాల్సింది ఏమీ లేదు.

పేదల ఓట్లను ఆకర్షించడానికి మన రాజకీయ పార్టీలు అనుసరించే విధానాలలో నివేశనస్థలాల పంపిణీ ప్రధానమయినది. భూములకు, ఇళ్ళ స్థలాలకు   ఈనాడు వున్న ధరలు లేని ఆ పాత  రోజుల్లో కూడా పేదలకు  నివేశన స్థలాలు  అనేవి గగన కుసుమంగానే వుండేవి. అందుకని, గ్రామాల్లో ఖాళీగా వున్న పోరంబోకు  స్థలాలను  పేదవారికి ఇళ్ళ స్థలాలుగా ప్రభుత్వాలు ఇస్తూ రావడం అన్నది ఆనవాయితీగా మారింది. వూళ్ళల్లో వుండే రాజకీయ పెద్దలకు ఈ ఇళ్ళ  స్థలాల కేటాయింపు అనేది అదనపు పెద్దరికాన్ని కట్టబెట్టింది. కేటాయించిన స్థలాల్లో లబ్దిదారులు పక్కా ఇళ్లు కట్టుకునేందుకు ఎంతో కొంత డబ్బును సబ్సిడీ రూపంలో ఇవ్వడం కూడా మొదలయింది. తదనంతర కాలంలో ఎన్టీ రామారావు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరవాత ఈ పక్కా ఇళ్ళ నిర్మాణాన్ని మరింత పక్కాగా అమలు చేసే పధకాలను ప్రారంభించారు. కాల క్రమంలో, కాంగ్రెస్ - తెలుగు దేశం పార్టీల నడుమ సాగుతూ వచ్చిన ఎన్నికల సంగ్రామాల్లో పక్కా ఇళ్ళ పధకం అనేక రంగులూ, రూపులూ, పేర్లూ మార్చుకుని అధికార పీఠం ఎక్కేందుకు అవసరమయిన సోపానాల్లో ప్రధానమయినదిగా మారింది. ఒకనాడు పేదలకు అవసరమయినది ఈనాడు పార్టీలకు అత్యవసరమయినదిగా తయారయింది. యధా రాజా తధా ప్రజా అన్నట్టు, లబ్దిదార్లు కూడా బినామీ పేర్లతో ఇళ్లు సంపాదించుకునే క్రమంలో, అవినీతి భాగోతంలో ఓ భాగంగా మారి విలక్షణమయిన ఈ పధకానికి తూట్లు పొడుస్తూ దాన్ని ఒక ప్రహసనంగా మార్చివేసే దుష్ట సంస్కృతి ఓ పధకం ప్రకారం రూపుదిద్దుకుంది. దానికితోడు, గత కొన్నేళ్లుగా సాదా సీదా భూముల ధరలకు కూడా రెక్కలు విచ్చుకోవడంతో ఈ సంస్కృతి మరింతగా పడగలు విప్పుకుని పేదరికాన్నే అపహాస్యం చేసే స్తితికి చేరుకుంది. దీనికి కారణం పాలకులా! పాలితులా! అన్న మీమాంసను పక్కన బెట్టి తిలాపాపం తలా పిడికెడు చందంగా, ఇందులో అందరికీ అంతో ఇంతో భాగం వుందనుకోవడమే సబబు. ఏతావాతా జరిగిందేమిటి? అర్హులను పక్కనబెట్టి అనర్హులకు తాయిలాలు పంచిపెట్టారనే అపవాదును పాలక పక్షాలు మూటగట్టుకుంటే, పేదసాదలకోసం తలపెట్టే సంక్షేమ పధకాల స్పూర్తినే సమూలంగా శంకించే అవకాశాన్ని విమర్శకుల చేతికి అందించినట్టయింది. పేదల పేరుపెట్టి గ్రామాల్లో వుండే సంపన్నులే ఈ అవకాశాలను దండుకుంటున్నారని, అధికారంలో వున్న ఆయా పార్టీల కార్యకర్తలకు వారి ఆర్ధిక పరిస్తితులతో సంబంధం లేకుండా పక్కా ఇళ్లను పంచిపెడుతున్నారనీ ఆరోపణలు వెల్లువెత్తడానికి ఆస్కారం ఇచ్చినట్టయింది.
దుర్వినియోగాన్ని సమర్ధించడం కాదు కానీ, సంపన్న  పారిశ్రామిక వేత్తలకు  'సెజ్' ల పేరుతో ధారాదత్తం చేస్తున్న భూములతో పోలిస్తే, బడుగులకో గూడు కల్పించే ఈలాటి పధకాలపై పెడుతున్న ఖర్చు ఏపాటి? అని ప్రశ్నించుకోవడం కూడా సబబే అవుతుంది. బడాబాబులకో రూలు, బడుగులకో రూలు అన్నప్పుడే కడుపు నిండినవాడు, కడుపు మండినవాడు అనే రెండు వర్గాలు సమాజంలో రూపుదిద్దుకుంటాయి. దీన్ని అడ్డుకోవడమే సిసలయిన  పాలకుల అసలయిన కర్తవ్యం.


(ఐ.డీ.హెచ్.కాలనీ)

ఈ నేపధ్యం ఎందుకంటె గత వారం తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన ఎన్నికల వాగ్దానాల అంబుల పొదిలోని ఒక ప్రధాన అస్త్రానికి పదునుపెట్టి ప్రదర్శించారు. బడుగులకో గూడు ఏర్పాటు చేయాలనే సదుద్దేశ్యంతో కేసీఆర్ రెండు పడకల ఇంటి పధకానికి తొలి రూపం ఇచ్చారు. హైదరాబాదులోని ఐ.డీ.హెచ్. కాలనీలో ఏడాది క్రితం తానే శంకుస్థాపన చేసిన 396 రెండు పడక గదుల  ఇళ్ళ కాలనీ నిర్మాణాన్ని పూర్తి చేసి తిరిగి తన చేతుల మీదుగానే ప్రారంభించి, బలహీన వర్గాల గృహ నిర్మాణ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి తెర తీసారు. అంతకుముందే  నిర్మాణదశలో కాలనీని  సందర్శించిన గవర్నర్ నరసింహన్, ఆ ఇళ్ళను చూసి ముచ్చట పడ్డ విషయం గమనార్హం. బడుగులకు నాలుగు గోడలు కలిగిన ఓ పూరి పాక అప్పగించి చేతులు దులుపుకునే పాత పద్దతికి మంగళం పాడుతూ కేసీఆర్ చేపట్టిన ఈ పధకం దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ కాలనీని ఒక పర్యాయం పైనుంచి పరికిస్తే ఒక సంపన్న కాలనీని చిన్నదిగా చేసి చూసినట్టుగా అనిపిస్తుంది. అలాటి సౌకర్యాలను ఈ కొత్త కాలనీలో కల్పించారు. గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరయిన వారు ఆ ఇళ్ళను చూసి ఇటువంటి ఇల్లు తమకూ వుంటే యెంత బాగుంటుందని అనుకునే వుంటారు. అంత చూడముచ్చటగా ఉందా కాలనీ. ఆ విధంగా తన ఎన్నికల వాగ్దానంలో ఒక దాన్ని పాక్షికంగా అయినా అమలు చేసి చూపించిన ఘనత కేసీఆర్ కి దక్కింది.
అయితే ఇంతటితో ప్రభుత్వం బాధ్యత తీరిపోలేదు, సరికదా మరింత పెరిగింది. అధికారిక గణాంకాల ప్రకారం చూసినా తెలంగాణా కొత్త రాష్ట్రంలో ఇంటి వసతి లేని పేదల సంఖ్య లక్షల్లో వుంది. రెండు పడక గదుల ఇళ్ళు ఏటా అరవై వేలు కట్టాలన్నది ప్రభుత్వ యోచన. మూడువందల ఇళ్ళు కట్టి చూపడానికి, నిర్మాణ వ్యవధి ఏడాదే అయినా మొత్తం మీద వాగ్దానం కొంతమేరకయినా నెరవేర్చడానికి   ఏడాదిన్నర పట్టింది.  ఈలెక్కన లక్షల ఇళ్ళ నిర్మాణం ఎప్పుడు పూర్తికావాలి? దానికి తగ్గట్టు, ఈ కొత్త కాలనీ నిర్మాణంతో పేదల కళ్ళల్లో కొత్త ఆశలు చిగుళ్ళు వేస్తున్నాయి. తమకూ సర్కారు అటువంటి ఇల్లు ఎప్పుడు కట్టించి ఇస్తుందా అనే ఎదురు చూపులు పెరుగుతున్నాయి.
అలాగే,  ఇల్లు కట్టించి, ఇంటి తాళాలు అప్పగించగానే పని పూర్తి అయినట్టు కాదు. కాలనీల నిర్వహణ సంపన్నులకే పెనుభారంగా మారిపోతున్న ఈ రోజుల్లో రెక్కాడితే కాని డొక్కాడని ఆ బడుగుల కాలనీలను కనిపెట్టి చూసేదెవరు? కొందరికి వచ్చి అందరికీ రాకపోతే, రానివారిలో కలిగే అసహనాన్ని తీర్చేదెవరు?
సరే! ఈ అనుమానాలని కాలమే తీర్చాలి. మొత్తం మీద మొదటి అడుగు పడింది. కేసీఆర్ తన సొంత ఇంటి పండుగలా ఈ పేదల గృహ ప్రవేశ కార్యక్రమాన్ని జయప్రదంగా పూర్తిచేసారు. ఇల్లు అలుకగానే పండుగ కానట్టు ఈ పేదల గృహ ప్రవేశ పధకం ఎలాటి అడ్డంకులు లేకుండా ముందుకు తీసుకు వెళ్ళగలిగితే, రెండు రూపాయల బియ్యం అనగానే జనాలకు ఎన్టీఆర్ గుర్తుకు వచ్చినట్టు, రెండు పడక గదుల ఇల్లు అనగానే తటాలున గుర్తు వచ్చేది కేసీఆర్ పేరే అవుతుంది.     (18-11-2015)            
రచయిత ఈ మెయిల్:bhandarusr@gmail.com మొబైల్: 98491 30595  


16, నవంబర్ 2015, సోమవారం

కడుపు చించుకుంటే.....


(నవంబర్ పదహారు జాతీయ పత్రికా దినోత్సవం)
పత్రికలు, మీడియాకు సంబంధించి ఎవరైనా వ్యాఖ్యానాలు చేసినప్పుడు ఇష్టం లేకపోయినా,  ఆ రంగానికి చెందిన ఒకప్పటి  మనిషిగా ఒక్కోసారి  కల్పించుకోవాల్సి వస్తోంది.
చాలామంది 'పలానా పత్రిక చదవం, పలానా మీడియా చూడం' అంటుంటారు. ఎందుకంటే అవి పాక్షికంగా ఏదో ఒక పార్టీకి వెన్ను కాస్తున్నాయి అనేది ప్రధాన ఆరోపణ. ‘చదవం, చూడం’ అని అంటూనే వాటిల్లో వచ్చిన వార్తలని గురించి ప్రస్తావిస్తుంటారు. అదో వైచిత్రి.
నా వరకు నేను నలభై ఏళ్లనుంచి రోజూ మూడు నాలుగు పత్రికలు చందా కట్టి ఇంటికి తెప్పించుకుని చదువుతుంటాను. ‘అవి ఏం రాస్తున్నాయి’ అనే దానికంటే, అవి  వార్త ఇచ్చే విధానంలోని వైవిధ్యాన్ని గమనిస్తుంటాను. పత్రికల  నడుమ వృత్తి పరమైన పోటీ వుండడం తప్పేమీ కాదు. పై చేయి అనిపించుకోవడానికి ప్రయత్నించడం తప్పుపట్టేదేమీ కాదు. కానీ క్రమంగా ఈ పోటీ పాత్రికేయుల చేతుల్లోనుంచి ఆ పత్రికల యజమానుల చేతుల్లోకి పోతోంది. దానితో ఏ పత్రికకు ఆ పత్రికకు ఓ రంగూ రుచీ వాసనా ఏర్పడుతున్నాయి. కొంచెం అటూ ఇటూగా ఈ దోషం అంటుకోని  పత్రికంటూ కలికానికి కూడా కనిపించడం లేదు.
నిజమే! మునుపటి రోజుల్లో మాదిరిగా మడి కట్టుకుని పత్రిక నడపడం సులభం కాని పరిస్తితి వున్న మాట వాస్తవమే. అయితే, మనుగడకోసం  ఎంతో కొంత రాజీ పడే ధోరణి కాస్తా అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోయి ఇతరేతర రంగాల్లో వుండే అవలక్షణాలన్నీ  కట్ట గట్టుకుని  ఈ రంగంలో ప్రవేశించాయి. ఈ రంగానికి వున్న అపరిమితమైన 'రీచింగ్' వల్ల, యేది చెప్పాలన్నా, ప్రజలకు క్షణాల మీద  యేది చేరాలన్నా మీడియాను మించిన మార్గం లేకపోవడంతో రాజకీయుల కళ్ళు ఈ రంగం మీద పడ్డాయి. ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా కొందరు తమ పెట్టుబళ్లను  ఈ రంగంలోకి మళ్ళిస్తున్నారు. నేరుగా 'రిటర్న్స్' వెంటనే రాకపోయినా మరో మార్గంలో అందుతున్న ప్రయోజనాలు వారిని ఇందుకు ఆకర్షిస్తున్నాయి. డబ్బు పోయినా అంతకు మించిన గౌరవం, తద్వారా సామాజికంగా, రాజకీయంగా వొనగూడుతున్న లాభాలు వారిని ఇందుకు పురిగొల్పుతున్నాయి. అందుకే దేశంలో ఎక్కడా లేనన్ని టీవీ ఛానళ్ళు తెలుగునాట పురుడు పోసుకుంటున్నాయి.  పెట్టుబళ్ల వరకు అయితే పరవాలేదు. రాజకీయాల్లో వుండే కల్మషం, కుళ్ళూ, ఒకళ్ళను మరొకళ్ళు కత్తులతో నరుక్కునే సంస్కృతి - కాఫీ డికాషన్ మాదిరిగా ఇందులోకి దిగుమతి అవుతున్నాయి. ఆ పత్రిక ఏం చెప్పింది అని గతంలో మరో పత్రిక గమనించేది. దాన్ని గురించి ప్రస్తావించాల్సివస్తే పాత్రికేయ మర్యాదలు పాటించేవారు. పేరు పెట్టకుండా ‘ఒక పత్రిక’ అనేవారు. లేదా ‘మా పత్రిక కాదు’ అని రాసుకునే వారు.
కానీ ఇప్పుడో. ఒక పత్రిక ఏదైనా రాస్తే దాన్ని తమ పత్రికలో ఖండఖండాలుగా ఖండించడం ఎల్లా అన్నదొక్కటే యావ.    
ఫలితం. 'ఈ పత్రిక అలాగే రాస్తుంది, ఈ టీవీ  అలాగే చూపిస్తుంది' అని జనం తేలిగ్గా మాట్లాడుకునే పరిస్తితి. ఇది జర్నలిజానికి మంచిదా అంటే అంత ఆలోచించే తీరిక ఎవ్వరికీ లేకుండా పోతోంది.
ఇందులో ఒకర్ని నిందించే పరిస్తితి ఎప్పుడో దాటిపోయింది. అందరూ అందరే. ఎవరికీ మినహాయింపు ఇవ్వలేని స్తితి.
పత్రికలు, టీవీల్లో పనిచేసే సిబ్బంది, వాటి యజమానులు, వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా తోడ్పడే పార్టీలు సొంత ఎజెండాలతో ముందుకు పోవడాన్ని కొంత అర్ధం చేసుకోవచ్చు. అసలు విషాదం ఏమిటంటే ఆయా పార్టీల అభిమానులైన పాఠకులు సైతం వేర్వేరు పారావారాలుగా విడిపోయి తగువులు పడడం. సోషల్ మీడియాలో కూడా ఆ రంగుల్ని చల్లడం.
ఎవరు ఏమైనా అనుకోండి కానీ, ఈ రంగంలో దశాబ్దాల తరబడి పనిచేసిన వాడిగా ఇది నా నిశ్చితాభిప్రాయం.
ఇష్టం వున్న వాటిని చదవండి. ఇష్టం వున్నవాటిని చూడండి. 'అలా యెందుకు రాశారు, ఇలా యెందుకు చూపారు' అని ప్రశ్నిస్తే అవే ప్రశ్నలు మీకూ ఎదురవుతాయి.

ఎందుకంటే  అన్నం తింటున్నది గొంగట్లో కనుక. (16-11-2015)

(NOTE: COURTESY IMAGE OWNER)