5, నవంబర్ 2015, గురువారం

సహనావతు

  (PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 05-11-2015, THURSDAY)
వేదకాలం నుంచి వినవస్తున్న హితోక్తి ఇది. ఎల్లకాలం మననం చేసుకుంటూ ఆచరించాల్సిన మహా సూక్తి. దీన్ని గుర్తు చేయాల్సిన పరిస్తితి దాపురించడమే ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం.
ఇప్పుడు దేశ వ్యాప్తంగా మీడియాలో సహనం, అసహనం అనే రెండు పదాల చుట్టూ చర్చోపచర్చలు సాగిపోతున్నాయి. ‘సహనం పాటించండి’ అని నోటితో ఓపక్క చెబుతూనే, నొసటితో అసహనం ప్రదర్శించడం ఇందులోని విషాదం.
సహనం గురించి సాధారణ జనాలు అసహనానికి గురయ్యే విధంగా చర్చలు, వాదోపవాదాలు సాగిపోతున్న నేపధ్యంలో తొమ్మిది మాసాలక్రితం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు వేర్వేరు సందర్భాలలో విడివిడిగా చేసిన ఉద్బోధలు గుర్తు చేసుకోవడం అవసరమనిపిస్తోంది.
ప్రధాని ప్రసంగం సాగిన తీరు పత్రికల్లో ఇలా వచ్చింది.
'మతపరమైన హింసపై కఠినంగా వ్యవహరిస్తాము. మత విద్వేషం ప్రేరేపించేవారు ఎవరయినా సరే సహించేది లేదు. ఈ దేశంలో ఎవరయినా తమకు నచ్చిన మత విశ్వాసాలను పాటించేందుకు పూర్తి స్వేచ్చ వుంది. ఈ విషయంలో ఎలాటి వొత్తిళ్లు పనిచేయవు. మెజారిటీ వర్గం అయినా, మైనారిటీ వర్గం అయినా బాహాటంగా కాని, చాటుమాటుగా కాని అన్య మతానికి వ్యతిరేకంగా విద్వేషానికి పాల్పడినా, కుట్రలు చేసినా సహించేది లేదు. అలాటి చర్యలను ఉక్కు పాదంతో అణచి వేస్తాము'
ప్రధాని ప్రసంగ సందర్భం ఢిల్లీలో క్రైస్తవ మతాధికారుల సమావేశం. ప్రధాని హోదాలో వున్న వ్యక్తి అలాటి సదస్సుల్లో  ఏవిధంగా మాట్లాడుతారో మోడీ గారి ప్రసంగం అదే విధంగా సాగిపోయింది.
మన దేశానికి చెందిన కురియా కోస్  అలియాస్ చవర, మదర్ యాప్రేసియాలకు సెయింట్ హుడ్ ప్రకటించిన సందర్భంలో ఏర్పాటుచేసిన కార్యక్రమం కాబట్టి దానికి అనుగుణంగానే ప్రధాని ప్రసంగించారు. అంతకుముందు  ఢిల్లీలో క్రైస్తవులకు చెందిన చర్చీల మీద జరిగిన దాడుల నేపధ్యాన్ని దృష్టిలో వుంచుకున్నవాళ్లకు,  ప్రధాని వ్యక్తపరచిన ఈ అభిప్రాయాల ప్రాముఖ్యం అర్ధం అవుతుంది. ఈ విషయంలో ఆయన మొదటిసారి పెదవి విప్పారని అనుకోవాలి. మోడీ భారతీయ జనతా పార్టీకి నాయకుడు అయినప్పటికీ, మొత్తం దేశానికీ ఆయన ప్రధాన మంత్రి. అంచేత అటువంటి సమావేశాల్లో వేరే విధంగా మాట్లాడే అవకాశం లేదు.
మత ఘర్షణలు జరక్కుండా చూడడానికి, మతం పేరుతొ ఉగ్రవాదులు చేస్తున్న ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో వుందనీ, అటువంటి అనాగరిక చర్యలను ఉక్కుపాదంతో అణచివేస్తామనీ ప్రతి ప్రధానమంత్రి నొక్కివక్కాణించడం  ఒకరకంగా పరిపాటిగా మారిపోయింది. సరే. అదలా వుంచితే, లౌకిక రాజ్యంగ  వ్యవస్థను ఎంచుకున్న భారత దేశాన్ని పాలించేవారికి దేశంలోని మైనారిటీ ప్రజల్లో అభద్రతా భావాన్ని దూరం చేయడం కూడా ఒక కర్తవ్యమే. ఆవిధంగా ప్రధాన మంత్రి మోడీ మాటలవల్ల అలాటి ఫలితాలు వస్తే అంతకంటే కావాల్సింది లేదు. అయితే ప్రస్తుత పరిణామాలను గమనిస్తుంటే అడుగులు ఆ విధంగా పడుతున్న లక్షణాలు కానరావడం లేదు.
ఇక రెండో సందర్భం కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో చదువుకుంటున్న విద్యార్ధులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జరిపిన  మాటా మంతీ.
దేశ ప్రధమ పౌరుడు భావి పౌరులతో ముచ్చటిస్తూ తన మనసులోని మాట విప్పి చెప్పారు. దశాబ్దాల రాజకీయ అనుభవసారాన్ని మొత్తం రంగరించి మరీ చెప్పారు. పాలకపక్షం వారికీ, ప్రతిపక్షం వారికీ అందరికీ పనికొచ్చే పసిడి ముక్కలు చెప్పారు. ప్రస్తుత పరిస్తితులను అవగాహన చేసుకుని ఆవేదనతో కూడిన హితబోధ చేశారు.
చురుక్కుమనిపించేలా  మాత్రమే కాదు,  ఆలోచింపచేసేలా కూడా  వున్నాయి ఆయన మాటలు. ఆ హితవచనాలు విని ఆచరించగలిగితే అది జాతి హితానికి ఎంతో  మంచిదనిపించేలా కూడా వున్నాయి.
ప్రస్తుతం దేశాన్ని పాలిస్తోంది భారతీయ జనతాపార్టీ. పేరుకు సంకీర్ణ ప్రభుత్వం. కానీ , ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో, ఆయన పేరుతొ ఎదురులేకుండా సాగిపోతున్న  ప్రభుత్వం అది.  శ్రీ ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నికయింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో. ప్రస్తుతం ఆ పార్టీలోకసభలో ప్రతిపక్ష హోదా కూడా దక్కని దుస్తితిలో వుంది. ప్రధాని మోడీకి, ఆయన పార్టీ అయిన బీజేపీకి కాంగ్రెస్ అంటేనే చుక్కెదురు. ఇలాటి నేపధ్యంలో రాష్ట్రపతి తనకున్న పరిమితుల్లోనే హితబోధ చేశారు. జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ, జరగాల్సిన విధి విధానాలను విశ్లేషించారు.  అలాగని ఆయన ఈ కార్యక్రమంలో ఎక్కడా కూడా ఎవ్వరు నొచ్చుకునే విధంగా మాట్లాడలేదు. ఒక కుటుంబ పెద్ద తన కుటుంబ విషయాలను తనవారితో యెలా మాట్లాడతాడో ఆవిధంగానే సాగింది రాష్ట్రపతి ప్రసంగం.
ప్రతిపక్షం యెలా వ్యవహరించాలో, పాలక పక్షం యెలా నడుచుకోకూడదో శ్రీ ప్రణబ్ ముఖర్జీ అన్యాపదేశంగా ప్రస్తావించారు. ప్రజల ద్వారా ఎన్నికయిన ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన చట్టసభల్లో కనబరుస్తున్న ప్రవర్తనను  ఆయన ప్రశ్నించారు. ఒకరకంగా చెప్పాలంటే యావద్దేశ పౌరుల మనస్సుల్లో కదలాడుతున్న అంశాలనే రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు.
రాష్ట్రపతి, ప్రధానమంత్రి తమ ప్రసంగాలలో చెప్పిన మాటల్ని తొమ్మిది నెలల తరువాత గుర్తు చేయాల్సిన అవసరం, గుర్తుంచుకోమని చెప్పాల్సి రావడం బాధాకరం. 
ముందు చెప్పుకున్నట్టుగా ప్రస్తుతం దేశంలో సహనం, అసహనాలు గురించిన చర్చ సాధారణ జనం  సహనం కోల్పోయే స్థాయిలో అనంతంగా సాగిపోతోంది. తమ మాట వినమని చెప్పే వాళ్ళే కాని ఎదుటివారు చెప్పేది వినిపించుకునే ఓపిక ఎవ్వరికీ  లేకుండా పోతోంది.
పార్టీలకు అతీతంగా సమాజ హితాన్ని కోరుకునే వారి మనసులను కలవర పరుస్తున్న అంశం ఇదే.
(04-11-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595
  



3, నవంబర్ 2015, మంగళవారం

ఆధునిక సీతాపహరణం (పేరా నాటిక, రెండే పాత్రలు)


డోర్ బెల్  మోగుతుంది. ఇంట్లో ఒంటరిగా వున్న ఆడమనిషి  వెళ్లి తలుపు తీస్తుంది.
‘అమ్మా! ఆకలి. ఏదైనా వుంటే పెట్టండి, మీ పేరు చెప్పుకుని తింటాను’
‘అయితే లోపలకు రా అన్నం పెడతాను’
‘లేదు, మీరే బయటకు రండి’
‘అయితే ఓకే!’
‘హ!హ! నా చేతికి చిక్కావ్. నేనెవర్నో తెలుసా? లంకాధిపతి రావణుడిని’
‘హ!హ! నేను సీతని కాను, వాళ్ళింట్లో పనిమనిషిని’
‘హ!హ! పనిమనిషివా? మరీ మంచిది. సీతను పట్టుకెడితే మందోదరికి కోపం వస్తుంది. పనిమనిషిని తెచ్చానని చెబితే ఎంతో సంతోషిస్తుంది. పాత పనిమనిషి మానేసినప్పటి నుంచి బాగా ఇబ్బందిగా వుంది’
‘హ!హ! నేను సీతను అయితే నా కోసం రాముడు ఒక్కడే వెతుక్కుంటూ నీ వెంట పడతాడు. నన్ను ఎత్తుకెళ్ళావని తెలిసిందంటే హోల్ మొత్తం అపార్ట్ మెంటులోని జనాలందరు వెతకడానికి బయలుదేరతారు, జాగ్రత్త!’
‘అలానా! అయితే వస్తా!’
(నువ్వు హ! హ!! అంటే నేనూ హ! హ!! అంటా)
నెట్లో చక్కర్లు కొడుతున్న ఇంగ్లీష్ గల్పికకు స్వేచ్చానువాదం – భండారు శ్రీనివాసరావు


NOTE: Courtesy Image Owner
   
Top of Form


2, నవంబర్ 2015, సోమవారం

ఇంగిలీషు ఆడ జోకులు


ఇంగిలీషు పురుషులు రాసిన ఆడ జోకులు ఇలాగే వుంటాయి. వ్యంగం పాలు కూసింత ఎక్కువయిందని అనిపించినా అనిపించవచ్చు. మనది కేవలం అనువాదం మాత్రమే కనుక,  అసలు ఓనరు ఎవరో తెలియదు కనుక, కోపం వస్తే ఝాడించడానికి కానీ,  నవ్వొచ్చి నవ్వుకున్నా కానీ,  రోషం వచ్చి విసుక్కున్నా కానీ మన పూచీ ఎంతమాత్రమూ లేదనన్నీ మనవి చేసుకోవడం అయింది. కావున గమనించగలరు.
ఇందులో కొన్ని ఇప్పటికే   ఇంగ్లీష్ భాషలో  సాంఘిక  మాధ్యమాల్లో షికారు చేస్తున్నాయి. కాబట్టి ఎక్కడో, ఎప్పుడో చదివామని అనిపిస్తే నవ్వుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే నేనూ అదే చేశాను.
ఇప్పుడు మీరు ట్రై చేయండి.
“వివాహం అనేది బాలుర వసతి గృహంలో బాతు రూము లాంటిది. బయట వున్నవారు లోపల దూరాలని ఆత్రపడుతుంటే, లోపల వున్నవాళ్ళు బయట పడాలని అంతే లెవల్లో ఆదుర్దా పడుతుంటారు”

డాక్టరు : “ ఏమయ్యా ఎలా వుంది నీ తల నొప్పి. నిన్నటి లాగే ఉందా, ఏమన్నా తగ్గిందా?"
రోగి: "ఇప్పుడు లేదండీ, మా ఆవిడ నిన్ననే పుట్టింటికి వెళ్ళింది”

“ఆడది తాదాత్మ్యం గా కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నదీ అంటే, ఆమె మనోఫలకంపై ఆమె మనోహరుడు ఒక్కడే కానవస్తున్నాడని అనుకోవాలి. మగవారి విషయంలో ఇది మరో రకంగా ఉండొచ్చు. వాళ్ళ మనస్సులో స్లైడ్ షో మొదలయ్యే అవకాశం హెచ్చు”

“మహిళలు ఒక విషయంలో నిష్ణాతులు. తిమ్మిని బొమ్మ చేసి నమ్మించగలరు. అంతటి మెజీషియన్లు వాళ్ళు. ఇది తేల్చుకోవాలంటే  వాళ్ళతో మాట్లాడి చూడండి. మీకు తెలియకుండానే సంభాషణను వాదులాట లోకి మార్చేస్తారు”

“ఈ లోకంలో మగవాళ్ళు మూడు రకాలు. మొదటి రకం ఆడతోడు లేకుండా ఒంటరిగా జీవిస్తూ ఎన్నెన్నో అద్భుతాలు సృష్టిస్తుంటారు. రెండోరకం మగ రాజులు స్నేహితురాలితో  కాలక్షేపం చేస్తూ, ఏదైనా అద్భుతం జరక్కపోతుందా అని ఎదురు చూస్తుంటారు. మూడో రకం మగపురుషులు  పెద్దలు కుదిర్చిన సంబంధం ఒప్పుకుని, వాళ్ళు నిర్ణయించిన  అమ్మాయినే పెళ్ళాడి, ఆ మరునాటి నుంచి ఏం జరిగిందన్న విషయాన్ని ఆలోచిస్తూ రోజులు దొర్లిస్తుంటారు’

యావత్ మగజాతిలో ఈ మూడో బాపతు వాళ్ళే ఎక్కువని గణాంక పురుషుల ఉవాచ.
ఇతి వార్తాః 
NOTE: Courtesy Image Owner


31, అక్టోబర్ 2015, శనివారం

అన్నీ చెప్పేస్తున్నా.....

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 01-11-2015, SUNDAY)

సూటిగా......సుతిమెత్తగా ......
ఒక సీనియర్ ఐ.పీ.ఎస్. అధికారి, పదవీవిరమణ అనంతరం ఒక రాజకీయ పార్టీలో చేరిన వ్యక్తి, ‘అన్నీ చెప్పేస్తున్నా...’ అంటూ ఓ పుస్తకం రాస్తే అందులో ఏముందో, ఏమేమి చెప్పారో అనే ఆసక్తి కలగడం సహజం. ఈ పుస్తక రచయిత శ్రీ రావులపాటి సీతారామారావు కేవలం, పోలీసు అధికారి, ఓ రాజకీయ పార్టీ నాయకుడు మాత్రమే కాదు. చదువుకునే రోజులనుంచీ చేయి తిరిగిన రచయిత అనే పేరు సంపాదించుకున్నారు. కలం పట్టిన చేత్తో లాఠీ పట్టుకున్నా కలాన్ని మాత్రం ఒదిలిపెట్టలేదు. ఈ పుస్తకం చివర్లో ఒక చమత్కార పూరితమైన ఒక వాక్యం వుంది. ఉద్యోగ పర్వంలో తన పేరును అంటిపెట్టుకుని వున్న ఐ.పీ.ఎస్. (ఇండియన్ పోలీసు సర్వీసు) అనే మూడు ఇంగ్లీష్ పొడి అక్షరాలు, రాజకీయ రంగ ప్రవేశం దరిమిలా ‘ఇండియన్ పొలిటికల్ సర్వీసు’గా  తనతోనే సహచర్యం చేస్తున్నాయని ఒక చమత్కార బాణం సంధించారు. అంతేకాదు ఈ రెండో ఉద్యోగానికి రిటైర్ మెంటు లేదని కూడా అంటూ, తన రాజకీయ ప్రయాణం సుదీర్ఘమైనదన్న సంకేతాన్ని కూడా ఇచ్చారు. ప్రభుత్వ సర్వీసులో ఉన్నత పదవులను నిర్వహించి తదనంతరం రాజకీయాల్లో చేరి రాణించిన వాళ్ళు ఎంతో మందివున్నారు. కాకపోతే అటు ఉద్యోగపర్వంలోను, అటు పిదప రాజకీయ రంగంలోనూ తమ ప్రస్థానం కొనసాగే రోజుల్లో వృత్తి ధర్మంగా పలువురు రాజకీయ ప్రముఖులతో అత్యంత సన్నిహితంగా మెలిగే సావకాశం బాగా వున్న రావులపాటి వంటివారు, ఏదైనా పుస్తకం రాస్తే, అందులోనూ, ‘అన్నీ చెప్పేస్తున్నా’ అనే పేరు పెట్టి పుస్తకం రాస్తే ఇక అందులో ఏం రాశారో, ఏం చెప్పారో అన్న ఆసక్తి సర్వత్రా కలగడంలో విడ్డూరం ఏమీ లేదు. పోలీసు ఇంటలిజెన్స్ విభాగంలో అనేక సంవత్సరాలు పనిచేసిన కాలంలో శ్రీ రావులపాటి సీతారామారావుకు తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కీర్తి శేషులు ఎన్టీ రామారావు తోనూ, అలాగే తరువాత ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన శ్రీ చంద్రబాబునాయుడుతోనూ ఆయనకు అతి సన్నిహితంగా మెలగగలిగే వీలూసాలూ  వృత్తిరీత్యా లభించింది. ఎన్నెన్నో ఆంతరంగిక విషయాలకు, బయటకు పొక్కని సందర్భాలకు, సన్నివేశాలకు ప్రత్యక్ష సాక్షిగా వుండే వెసులుబాటు శ్రీ రావులపాటికి కలిగింది. అంచేత వారిరువురికీ సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు ఈ పుస్తకంలో చోటుచేసుకోవడంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. అయితే ఆ విషయాల్లో రచయిత పాటించిన సంయమనం ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ. సంచలనం కోసం కూడా తనకు తెలిసిన నిజాలను, తనకు మాత్రమే తెలియగల వాస్తవాలను, ప్రత్యేకించి  కించపరిచే సంచలన అంశాలను ఒదిలిపెట్టి పుస్తకం రాసిన తీరు మెచ్చతగింది. ఈ పుస్తకంపైన తన అభిప్రాయం రాస్తూ ప్రసిద్ధ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ అదే అన్నారు.
“గతంలో ఆత్మకధలు అనేకం వచ్చాయి. అయితే ఈ పుస్తకంలో కనబడే విశిష్టత రచయిత నిజాయితీ. పుస్తకం కమ్మర్షియల్ గా సక్సెస్ అవడం కోసం పేరున్నవారిని తిట్టడం, వారి బలహీనతల్ని భూతద్దంలో చూపడం మొదలైనవి ఇందులో కనబడవు’ అంటూ, రావులపాటి వారు  ఎన్నో చెబుతారని కొందరు పెట్టుకునే ఆశలపై ముందస్తుగానే ఇన్ని నీళ్ళు చల్లేశారు.
మరి ఇంత నిజాయితీతో, నిబద్ధతతో రాసే పుస్తకంలో చదివించే అంశాలు ఏమీ లేవా అంటే వున్నాయి. అందులో ముందుగా చెప్పాల్సింది రాసిన తీరు.  ఎంతో సరళంగా, గందరగోళాలు లేకుండా హాయిగా ఏకబిగువున చదువుకునే విధంగా వుంది  రచయిత శైలి. ఆయన స్వయానా రచయిత కావడం వల్ల, ఆత్మకధ అనండి, లేదా ఆయనే చెప్పుకున్నట్టు పోలీసు పొలిటీషియన్ స్వ’గతం’ అనండి – చదివించే గుణం ఈ పుస్తకంలో పుష్కలంగా వుంది. అనేక దశాబ్దాలపాటు ప్రభుత్వ సర్వీసులో వుండి తాను గమనించిన విషయాలను సమగ్రంగా, సందేహాలకు తావులేకుండా, రాజకీయ దురుద్దేశాలు ఆపాదించకుండా, ముందు వెనుకల సన్నివేశాలను ఒక క్రమపద్ధతిలో ఏర్చి కూర్చి, ఒక పుస్తకంగా రాయడం అనేది అంత సులభమైన విషయం కాదు. పైగా జీవించి వున్న వ్యక్తులను, వారి వ్యక్తిత్వాలను అంచనా వేస్తూ రచన చేయడం అనేది నిజంగా కత్తి మీద సామే. ఈ విషయంలో రావులపాటి పూర్తిగా కృతకృత్యులయ్యారు అనడానికి యండమూరివారి కితాబే సాక్షి.
వారం వారం సమకాలీన రాజకీయ అంశాలపై రాసే శీర్షికలో ఈ పుస్తక సమీక్ష ఏమిటన్న అనుమానం చదువరులకు కలగొచ్చు. నిజానికి ఈ పుస్తకం మొదటి నుంచి చివరి వరకు ఒక రాజకీయ గ్రంధమే. రాజకీయాల్లో చేరాలనే ఆసక్తి ఉన్నవారికి ఒక పాఠ్యాంశంగా ఈ పుస్తకం నిలిచిపోతుందని యండమూరి వీరేంద్రనాథ్ అన్న మాట ఏదో మెచ్చుకోలు కోసం చెప్పింది కాదని పుస్తకం చదివిన వారికి ఇట్టే తెలిసిపోతుంది.
సుదీర్ఘకాలం పోలీసు శాఖలో పనిచేసి అటు సమర్దుడయిన అధికారిగా, ఇటు ఆహ్లాద రచయితగా మంచి పేరు తెచ్చుకున్న రావులపాటి సీతారామారావు అనే వ్యక్తి, ఉద్యోగ విరమణ అనంతరం, అంత మంచి పేరు లేని  రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని ప్రకటించడం ఇంటా బయటా ఎంతో ఉద్వేగాన్ని కలిగించింది. సరే! రాజకీయాల్లో చేరాలంటే ఏదో ఒక పార్టీలో చేరక తప్పదు. మరి ఆ పార్టీ ఏమిటి ? ఈ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన్ని బాగా తెలిసిన వారందరికీ మరింత ఆశ్చర్యం కలిగించింది. తెలుగు దేశంలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారు. అదేమీ అంటరాని పార్టీ కాదుకదా! పైగా ఆ రోజుల్లో ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలో వుంది. పైపెచ్చు టీడీపీ అధినేత కేంద్రంలో కూడా చక్రం తిప్పుతున్న రోజులాయే! మరి ఆశ్చర్యాలు, అభ్యంతరాలు ఎందుకోసం?
ఎందుకంటే, రావుల పాటి వారి ఇలాకా అంతా కాంగ్రెస్ మయం. వాళ్ళ స్వగ్రామాలు ఒకనాటి కమ్యూనిష్టుల కంచుకోట ఖమ్మం  జిల్లాలో వున్నప్పటికీ, వారి నరనరాన కాంగ్రెస్ సంస్కృతి జీర్ణించుకుని వుంది. సీతారామారావు గారి నాన్నగారు రావులపాటి సత్యనారాయణ రావుగారు ప్రముఖ కాంగ్రెస్ వాది. పాలేరు సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక బంధుగణం అంతా కాంగ్రెస్ పార్టీ మనుషులే. రక్తపరీక్ష చేస్తే కాంగ్రెస్ రక్తం కనబడుతుందని హాస్యోక్తిగా చెప్పుకునే వారు. అలాంటిది ఒక పోలీసు ఆఫీసరుగా పనిచేసి రాజకీయాల్లో చేరాలని అనుకోవడమే ఒక సంచలనం అయితే, చేరేది తెలుగుదేశం పార్టీ కావడం చుట్టపక్కాల్లో  పెనుసంచలనం అయింది. అయినా టీడీపీ పడవ ఎక్కాలనే నిర్ణయానికి రావులపాటి వారిని ప్రొద్బల పరచిన అంశం ఒక్కటే. చంద్రబాబునాయుడు అనే ఒకే ఒక వ్యక్తికి మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే సమర్ధత వుందని ఆయన మనసా వాచా నమ్మడమే. అందుకే ఆ పార్టీ అధికారంలో వున్నప్పుడు అందులో చేరి, దరిమిలా ఒక దశాబ్దంపాటు ఆ పార్టీ అధికారానికి దూరంగా జరిగినా ఆయన మాత్రం తెలుగుదేశం పార్టీని ఒదిలిపెట్టలేదు. ఆ పార్టీని, దాని నాయకుడిని నమ్ముకునే తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. నడుమలో తమ వైపు రమ్మని వై.ఎస్.ఆర్. వైపు  నుంచి పరోక్ష సంకేతాలు వచ్చినప్పటికీ ఆయన మాత్రం టీడీపీ ని వదలలేదు. రాజకీయాల్లో విలువలు వుండి తీరాలని, లేకపోతే వాటికి ఏమాత్రం విలువ వుండదన్నది  తన నమ్మకం అని ఆయన రాసుకున్నారు. “పార్టీ మారాలనే ఆలోచన చేయకపోవడానికి కారణం బహుశా నేను ఏ అధికార పదవిని అంతవరకూ చవిచూడకపోవడం కూడా ఒక బలమైన కారణం కావచ్చు. ఆ రుచి నాకు తెలియకపోవడం వల్లనే నేను ఈ నడవడికకు కట్టుబడి వుండొచ్చు” అని రాసుకోవడంలో వున్న నిజాయితీయే యండమూరిని ఆకర్షించిందేమో! 
1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ  పరాజయం తరువాత,  కాంగ్రెస్ విజయ యాత్రలో పాల్గొన్న వారిలో కొందరు అతి ఉత్సాహానికి పోయి ఆబిడ్స్ లోని రామారావు నివాసం వెలుపల ‘ముఖ్యమంత్రి’ అని రాసి వున్న నేమ్ ప్లేటును తీసి కింద పారేశారు. అప్పుడు ఆ  ఏరియా పోలీసు అధికారి సీతారామారావు. ఒక జూనియర్ అధికారి  నేమ్ ప్లేట్ విషయాన్ని  ఎన్టీఆర్ కి నొచ్చుకుంటూ చెప్పబోతే,  ‘నేమ్ ప్లేట్ దేముంది బ్రదర్, పదవే పోయిన తరువాత’ అని ఆయనే సర్దిచెప్పిన తీరు తనని కదిలించి వేసిందని రాసుకున్నారు.
పోలీసు అధికారిగా రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించారని మంచి పేరు తెచ్చుకున్న సీతారామారావు, చంద్రబాబు విషయంలో భావోద్వేగాన్ని దాచుకోలేకపోయారు. అది ఆయన మాటల్లోనే: 
మే, 2014.
“పోటాపోటీగా ఆంద్ర ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం అంతా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఆ క్రితం రాత్రి సరిగా నిద్రపట్టలేదు. ఫోన్లలో వచ్చే రకరకాల మెసేజ్ లు చాలా చీకాకు పెట్టాయి. కొందరు ఫారిన్ నుంచి కూడా ఫోను చేసారు. ‘ఏమవుతుంది? జగన్ గెలుస్తాడా? ఏదో సర్వే చెప్పిందట కదా!’ మరికొందరు భయం భయంగా చంద్రబాబు రావాలి సార్, రాకపోతే యెట్లా?’ ఇలాటి పలకరింపులు ఆందోళనను మరింత పెంచాయి. అర్ధరాత్రి దాటిన  తరువాత మరో ఫోను. ఇంటలిజెన్స్ లో పనిచేసిన ఓ అధికారి. ‘ఇంత రాత్రివేళా’ అన్నాను. ‘ఇప్పుడే చాలా నమ్మకంగా తెలిసింది. తెలంగాణాలో భారీ మెజారిటీతో టీఆర్ ఎస్, ఆంధ్రాలో కొద్ది తేడాతో జగన్ గెలుస్తారని”
“అయినా మనసు మూలల్లో ఏదో నమ్మకం, అలా జరగదనీ, చంద్రబాబు గెలుస్తారనీ.
“ఉదయం పదకొండు గంటలకు చంద్రబాబు ఇంట్లో వున్నాం. ఫలితాలు వస్తున్నాయి. ఒక్కో సీటు గెలుస్తుంటే ఉత్సాహం, కేకలు. తొంభయ్ సీట్లు రాగానే చంద్రబాబునాయుడు దగ్గరకు వెళ్లి అభినందనలు చెప్పబోయాం. ‘వంద రానివ్వండి అప్పుడు చెబుదురు కాని’ అన్నారు ఆయన నిబ్బరంగా. రాత్రంతా పడ్డ ఆందోళన దూదిపింజలా యెగిరి పోయింది.”
తెలంగాణ ప్రాంతానికి చెందిన శ్రీ రావులపాటి సీతారామరావు, ఈ పుస్తకంలో రాసిన ఓ ఆసక్తికర విషయంతో దీన్ని ముగిస్తాను.
“ మా నాన్న తొంభయ్ సంవత్సరాల వృద్ధుడు. తెలంగాణా రాష్ట్రాన్ని డిక్లేర్ చేసిన సందర్భంగా హైదరాబాదు అంతా పండుగ వాతావరణంలో మునిగి తేలుతోంది. మా తమ్ముడి కూతురు ‘జై తెలంగాణా’ అంటూ ఆయన మంచం దగ్గరికి వెళ్లి, ‘తాతయ్యా! తెలంగాణా వచ్చింది. జై తెలంగాణా అను’ అని ఆయన చేయి అతికష్టం మీద పైకెత్తింది. అప్పటికే ఆయన చాలా అస్వతతతో వున్నారు. అయినా అయన తన చేతిని బలవంతంగా ఎత్తి పెట్టుకుని ‘జై విశాలాంధ్ర’ అని కళ్ళు మూసుకున్నారు. ఈ చిన్న పిల్లకు అర్ధం కాలేదు. ఆ మాట కొత్తగా విన్నది. విశాలాంధ్ర కోసం శ్రమించిన వ్యక్తి ఆయన. విలువలను మార్చుకోలేని ఆశక్తుడు’.


రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com,  మొబైల్: 98491 30595                                          


29, అక్టోబర్ 2015, గురువారం

పిన్ డ్రాప్ సైలెన్స్


సూది పడ్డా వినబడేంత నిశ్శబ్దం అంటుంటారు. దానికి ఓ చిన్న ఉదాహరణ.
జరిగి చాలా దశాబ్దాలు గడిచాయి.  బాగా వయస్సు మళ్ళిన రాబర్ట్ వైటింగ్ అనే  అమెరికన్ పారిస్ వెళ్ళాడు. అక్కడ విమానాశ్రయంలో దిగగానే ఓ ఫ్రెంచ్ కస్టమ్స్ అధికారి నమ్రతగా పలకరించి పాస్ పోర్ట్ చూపించమని అడిగాడు. ఆయన పాస్ పోర్ట్ కోసం చేతిసంచీ తీసి వెతుకుతుంటే ఆ అధికారి చీకాకు పడ్డాడు.
‘ఫ్రాన్స్ రావడం ఇది మొదటిసారా?’ అని అడిగాడు. కాదన్నాడు వైటింగ్.
‘విమానం దిగగానే పాస్ పోర్ట్ తీసి సిద్ధంగా వుంచుకోవాలి. ఆ మాత్రం తెలియదా?’ అని వ్యంగ్యంగా అన్నాడు.
అమెరికన్ తొణకకుండా జవాబు చెప్పాడు.
‘గతంలో ఒక సారి నేను ఫ్రాన్స్ వచ్చాను, కానీ అపుడెక్కవ్వరూ నన్నిలా అడగలేదు’
‘నేను నమ్మను’ గట్టిగా స్వరం పెంచి చెప్పాడు, ఫ్రెంచ్ కష్టమ్స్ అధికారి.
‘ఎవ్వరయినా సరే, ఆఖరికి అమెరికన్లు అయినా మా దేశం రాగానే పాస్ పోర్ట్ చూపించి తీరాలి. అదిక్కడ రూలు’
‘అలాగా, 1944లో ఓ తెల్లవారుఝామున   4:40 గంటలకు నేను మీ దేశంలోని ఒమాహా బీచికి చేరుకున్నాను. అప్పుడెవ్వరూ పాస్ పోర్ట్ చూపించమని నన్నిలా నిలదీయలేదు. అయితే అప్పుడు నేను వచ్చిన పని వేరు, మీ దేశాన్ని శత్రు సైన్యాల నుంచి విడిపించడానికి అమెరికన్ సైన్యం తరపున వచ్చాను. బహుశా అప్పటికి నువ్వు పుట్టావో లేదో!’ అన్నాడా అమెరికన్. 

అంతే! అక్కడ కొన్ని క్షణాల పాటు ‘పిన్ డ్రాప్ సైలెన్స్!’     


“కారే రాజులు? రాజ్యముల్‌ కలుగవే?.........”

  
“............... గర్వోన్నతిన్‌ బొందరే? వా
రేరీ? సిరి మూటన్ కట్టుకొని పోవంజాలిరే?...........................”
ఇది పోతన గారి పద్యం. వామనావతార ఘట్టంలోది. వామనుడు నిజానికి విష్ణువని, బలిని నాశనం చెయ్యటానికే వచ్చాడని గ్రహించిన శుక్రుడు వామనుడికి దానం ఇవ్వొద్దని బలిని హెచ్చరించినప్పుడు ఈ  లోకంలో ఏదీ శాశ్వితం కాదన్న భావాన్ని బలి వ్యక్తం చేసే సందర్భం.
పోతనగారి కవితా భావావేశాన్ని ఇక్కడికి వొదిలి చికాగో లోని ఎడ్జ్ వాటర్ బీచ్ హోటల్లో జరిగిన ఒక సమావేశం గురించి చెప్పుకుందాం. ఆ రోజు  ఆ హోటల్లో ఏడుగురు అతిరధ మహారధులు సమావేశం అయ్యారు. వారిలో ఎవ్వరూ ఇప్పుడు జీవించి లేరు. ఎందుకంటే ఇదంతా  తొంభయ్ ఏళ్ళ కిందటి ముచ్చట. 1923లో జరిగిన ఈ సమావేశానికి హాజరయిన గొప్పగొప్ప వాళ్ళందరూ కేవలం పాతికేళ్ళ కాలం గడిచేసరికి  ఏమయ్యారో చెప్పడానికే పోతనగారి పద్యం జ్ఞాపకం చేసుకోవాల్సివచ్చింది.
వారిలో ఒకరు  అతిపెద్ద ఉక్కు కర్మాగారం – బెత్లేహం స్టీల్ కార్పోరేషన్ అధిపతి చార్లెస్ ఎం. స్కెవాబ్. కంపెనీ అప్పుల్లో కూరుకుపోయి   దివాళా తీసి దీన స్తితిలో  చనిపోయాడు.
అప్పట్లో అతిపెద్ద పెట్రోలు కంపెనీ అధినేత హోవార్డ్ హబ్ సన్. పాపం మతిచెడిన స్తితిలో ఈ అపర కుబేరుడు కన్ను మూసాడు.
గోధుమ వ్యాపారంలో కోట్లు గడించిన సంపన్నుడు ఆర్ధర్ క్యుతెన్ సర్వస్వం కోల్పోయి అతి పేదరికంలో అంతిమ శ్వాస విడిచాడు.
ఆరోజుల్లో న్యూ యార్క్ స్టాక్ ఎక్చేంజ్ చైర్మన్ రిచర్డ్ విట్నీ జైలు పాలయ్యాడు.
ప్రెసిడెంట్ హార్డింగ్ మంత్రివర్గంలో పనిచేసిన మంత్రి ఆల్బర్ట్ ఫాల్  కొంతకాలం జైలు వూచలు లెక్కబెట్టాడు. క్షమాబిక్ష పొంది ఇంటికి వెళ్ళిన కొద్దికాలానికే మరణించాడు.
వాల్ స్ట్రీట్  షేర్ల వ్యాపారంలో చేయితిరిగిన జెస్సీ లివర్ మోర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
అలనాడు వ్యాపార సామ్రాజ్యాన్ని కంటి చూపుతో శాసించిన ఇవార్ క్రుగర్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇంటర్ నేషనల్ సెటిల్ మెంట్ బ్యాంక్  ప్రెసిడెంట్ లియోన్ ఫ్రేజర్ సైతం ఆత్మహత్య చేసుకుని మరణించాడు.
అతి పెద్ద యుటిలిటీ కంపెనీ అధినేత అయిన సామ్యూల్ ఇన్సల్ చేతిలో చిల్లి గవ్వ లేకుండా అసువులుబాసాడు.
వీరంతా డబ్బు యెలా సంపాదించాలి అన్న యావలోనే జీవితాల్ని గడిపారు కానీ యెలా జీవించాలి అన్న విషయాన్ని ఏనాడు పట్టించుకోలేదు.
డబ్బు చెడ్డది కాదు. మనిషికి అత్యవసరమైన  కూడూ గుడ్డా ఏర్పాటు చేసుకోవడానికి ధనం అవసరమే. కానీ అదే సర్వస్వం కాదు. అది శాశ్వితం కూడా కాదు. అలనాడు బలి చక్రవర్తి చెప్పింది అదే.


(నెట్లో సంచారం చేస్తున్న ఒక ఆంగ్ల వ్యాసానికి సంక్షిప్తంగా స్వేచ్చగా చేసిన అనువాదం) 

NOTE: Courtesy Image Owner


28, అక్టోబర్ 2015, బుధవారం

రాజకీయం ఒక రక్షరేఖ

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 29-10-2015, THURSDAY)

సూటిగా .....సుతిమెత్తగా .....

దుష్ట శక్తుల పీడలు సోకకుండా వుండడానికి కొందరు  తావీదులు, రక్షరేఖలు ధరిస్తుంటారు.
ఇప్పుడు రాజకీయం అలాటి రక్షరేఖగా మారిపోయింది. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టు మామూలు ప్రజలకు వర్తించే చట్టాలు, నియమ నిబంధనలు, రాజకీయ నాయకులకి వర్తించవు. ఇక్కడ మామూలు ప్రజలంటే షరా మామూలు, సాధారణ  ప్రజలనే కాదు, ఇంట్లో, వొంట్లో పుష్కలంగా వున్న ఖామందులు, శ్రీమంతులు, నటులు, కళాకారులు, చివరాఖరుకు జర్నలిస్టులు అందరూ వున్నారు. వీరిలో కొందరికి వారి వారి తాహతునుబట్టి కొన్ని కొన్ని ప్రత్యేక  సదుపాయాలూ, సామాజిక గౌరవాలూ లభిస్తూ వున్నప్పటికీ,  రాజకీయ నాయకులతో పోలిస్తే తక్కువే.
లక్షల్లో అభిమానులూ, కోట్లల్లో డబ్బులూ వున్న సినీ నటులు కూడా రాజకీయ రంగు పూసుకోవడం  కోసం  వెంపర్లాడేది అందుకే. కోట్లకు పడగెత్తిన శ్రీమంతులు, వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్న బడాబాబులూ తాము సంపాదించుకున్నదాన్ని కాపాడుకోవాలంటే రాజకీయం అనే రక్షరేకు తమకు  వుండి తీరాలి అనే నిర్ధారణకు వస్తున్నారు.  రాజకీయం, ప్రజాసేవ అనేవి అసలు పొసగని వాళ్లు కూడా డబ్బు వెదజల్లయినా  ఏదో ఒక నామినేటేడ్ పదవిలోకి  దూరిపోవాలని దూరాలోచనలు చేసేది అందుకే.
ఒక సినీ నటుడు వుంటాడు. ఏవిధంగా చూసినా కొదవలేని జీవితం. సంఘంలో గౌరవం, ఎక్కడకు వెళ్ళినా పరపతి, ఒక్కసారి పలకరించినా చాలు పులకరించిపోయే జనాలు. కానీ ఏం లాభం ? ఆదాయపుపన్ను శాఖకు చెందిన చిరుద్యోగి ఇంటికి వచ్చాడంటే చాలు, ఎన్ని ఎయిర్ కండిషన్లు  వున్నా కూడా చిరుచెమటలు పట్టాల్సిందే.
ఒక వ్యాపారవేత్త వుంటాడు. నేల నాలుగు చెరగులా విస్తరించిన వ్యాపారాలు. ఎక్జిక్యూటివ్ తరగతిలో విమాన ప్రయాణాలు, స్టార్ హోటళ్ళలో బసలు, నెలకు లక్షల్లో జీతాలు తీసుకునే సిబ్బంది. ఏం సుఖం?  పనిమీద సచివాలయానికో, ప్రభుత్వ కార్యాలయానికో వెడితే పదివేల ఉద్యోగికి కూడా తీసికట్టే.
ఒక స్మగ్లర్ వుంటాడు. ప్రాణానికి వెరవని వందల గూండాలు వెంట వుంటారు. కుక్కని కొట్ట కుండానే  డబ్బు రాశులు రాసులుగా  రాలిపడుతుంది. ప్రపంచంలోని సుఖాలన్నీ కాళ్ల చెంత వుంటాయి. ఏం ప్రయోజనం? రోడ్డు మీద పోలీసు కనబడితే భయపడే పరిస్తితి.
మరొకడు వుంటాడు. అతడు కళాకారుడు కాదు. విద్యావంతుడు కాదు. డబ్బున్నవాడు కాదు. పేరున్నవాడు కాదు. కానీ, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకే కాదు ముఖ్యమంత్రి ఆఫీసుకే కాదు ఆఖరుకు సాధారణ జనాలు గడప తొక్కడానికి సందేహించే పోలీసు ఠాణాలకు సైతం వేళాపాళా లేకుండా వెళ్ళగలడు. కింది స్తాయి  నుంచి పై స్తాయి అధికారివరకు తలుపులు తోసుకుని వెళ్ళగలడు. పనిచేసి తీరాలని పట్టుపట్టగలడు. ఒక్క మనిషికి  కూడా అధికారిక ప్రవేశం లేని చోట్లకు పదిమందిని వెంటేసుకు వెళ్ళగలడు. అతడే రాజకీయ నాయకుడు.
చట్టం తనపని తాను చేసుకుపోతుందనేది పడికట్టుమాట. చట్టం ఎవరిపట్ల యెలా తన పని చేయాలో నిర్దేశించే మీట మాత్రం  రాజకీయనాయకుల చేతిలో వుంటుంది. అతడు బిగువు  వొదిలితే చట్టం పనిచేసే వేగం కుందేలు పరుగులా పెరుగుతుంది. పగ్గం బిగిస్తే చట్టం వడి తాబేలు నడకలా మందగిస్తుంది. అదీ రాజకీయానికి వున్న పవర్. ఎందుకని అడిగేవాడు లేడు.
చట్టం చేతులు చాలా పొడుగు అనే పొడుగాటి డైలాగులు రాజకీయ నాయకులకు వర్తించవు. వారి జోలికి వెళ్ళడానికి పోలీసులు జంకుతారు. మామూలుమనిషిని అరెస్టు చేయడానికి, పోలీసు స్టేషనుకు రప్పించడానికి వుండే నియమాలు, నిబంధనలు, ఖాకీ దర్పం  రాజకీయ నాయకుల విషయంలో హాం ఫట్, హుష్ కాకీ. అధవా గత్యంతరం లేక అరెస్టు చేయాల్సిన పరిస్తితే  వస్తే వారికి ఆకస్మిక అనారోగ్యం ఎక్కడినుంచో వూడిపడుతుంది. మామూలు మనిషయితే ‘బాగు చేయిస్తాం రా’ అని స్టేషనుకు లాక్కెళ్లి మక్కెలు విరగబొడుస్తారు. నాయకుల విషయం వచ్చేసరికి  నిబంధనలన్నీ కట్టగట్టుకుని  గాలికి ఎగిరిపోతాయి.
రాజకీయం అనే రక్షరేకు వల్ల ఇన్ని లాభాలు వుండడం వల్లనే సమాజంలోని అన్ని వర్గాల వాళ్లు పొలోమని ఆ దారులవెంట పరుగులు తీస్తున్నారు. ఏదో ఒక పార్టీ గొడుగు కింద  వుంటే చాలు ఏవీ లేకపోయినా అన్నీ వున్నట్టే లెక్క. అలా అని హోల్ మొత్తంగా రాజకీయ నాయకులందరూ ఇలాగే ఉంటారా, వాళ్ళల్లో మంచివాళ్ళు లేరా అంటే ఎందుకు లేరు? గతంలో వున్నారు. ఇప్పుడూ వున్నారు. ఇకముందూ  వుంటారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అలాటి వారి సంఖ్య క్రమంగా పలచపడిపోతోంది.
అన్ని రంగాల్లో మాదిరిగానే, ఇప్పుడు రాజకీయాల్లోకి యువరక్తం చేరుతోంది. రిజర్వేషన్ల పుణ్యమా అని శాసన సభల్లో బడుగు బలహీన వర్గాల ప్రాతినిధ్యం పెరుగుతోంది. చదువుకున్న వారు, మంచి విద్యార్హతలు వుండి కూడా వేరే ఉద్యోగ వ్యాపకాల్లో చేరకుండా రాజకీయ రంగం పట్ల ఆసక్తి పెంచుకునే విద్యాధికుల సంఖ్య గణనీయంగానే ఉంటోంది. నిజానికివన్నీ ఆహ్వానించ తగ్గ పరిణామాలు. అసలు ఈనేపధ్యంలోనే ముందు పేర్కొన్న రాజకీయ అవలక్షణాలను అంతగా ఉదహరించింది. ఎందుకంటే ఈ విపరీత ధోరణులను కొత్తగా రాజకీయ రంగప్రవేశం చేస్తున్న యువకులు, విద్యాధికులు, మహిళలు గుర్తించి వాటికి దూరంగా మసలుకోవడం అలవరచుకోవాలి. లేని పక్షంలో ఇటువంటి నిందలను వాళ్ళు కూడా మోయాల్సివస్తుంది.
దేశంలో  స్వార్ధ రాజకీయ శక్తులకు కొదవలేదు. అయినా కానీ, మన  ప్రజాస్వామ్య వ్యవస్థ చెక్కుచెదరకుండా వుంది. పడ్డ పునాదులు అంత బలిష్టంగా, పటిష్టంగా ఉన్నాయనుకోవాలి. అది ప్రజలు చేసుకున్న అదృష్టం.
రాజకీయ వ్యవస్థకు చెదలు పట్టనంత కాలం ప్రజల భద్రతకు ధోకా వుండదు. ఆ వ్యవస్థను కాపాడుకోవడం అందరి బాధ్యత. అయితే ఇందులో సింహ భాగం రాజకీయులదే అనడంలో సందేహం లేదు.
రాజకీయం అనేది దేశానికి రక్షరేఖగా వుండాలి కాని, ఎవ్వరో కొందరు రాజకీయ నాయకులకి కాదు.  (28-10-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595